నా చుట్టూ తన ఆశీస్సుల శ్రీకరములు
పరచి మూలాల్ని కౌగలించిన చెట్టు
కొమ్మలలో పసి నిసుగుల అమ్మల్ని దాచిన చెట్టు
రెమ్మలతో మలయ సుగంధాలు వీచిన చెట్టు
వసంతోదయవేళ నిండార పూచి
నన్నాహ్లాద పరచిన చెట్టు
బ్రతుకు సేదతీరుస్తూ చల్లని చిరుగాలుల
నా చెంపల్ని నిమిరిన చెట్టు
మండుటెండలో తానెండినా చలువ పందిరి
నా కోసం తానైన చెట్టు
ఏ పురుగు తొలిచిందో
ఏ మనసు కినిసిందో
అసహనం ఆకృతిదాల్చింది
కర్కశత్వం రూపం దాల్చింది
పిదప కాలపు బుద్ధి పెడదారి పట్టెనో
పచ్చ చెట్టును గూల్చ మనసెట్టులొప్పెనో
కరకు గుండెల కర్కశ మూకలు
దుడుకు గుండెల ముష్కర మూకలు
చెలగి చెండాడి తునిమి ముక్కలు చేసి
పదును రంపాల పరపరా కోసి
కూల్చినారే నిన్ను కర్తవ్యమూఢులై
ఎన్ని దెబ్బలు వేసినా ఎదురాడదు చెట్టు
ఎన్ని కోతలు కోసినా మాటాడదు చెట్టు
గుండె కోతలెన్నైనా మండి పడదు చెట్టు
అలసి అవనతయై పతనమైంది
మమతల జాబిల్లి మూగ తల్లి చెట్టు
పెంచిన ప్రేమపాశం గంటువడి
పుడమి బిడ్డ నేలకొరిగింది
ఉరుక వచ్చీ ఉడుత ‘ఉస్సు ‘ రని మళ్ళింది
వాల కొమ్మా లేక వలస బోయెను పిచుక
గూడు కూనా లేక గోడుమనె గోరింక
పిట్టల కలరవం దూరమైంది
చెట్టు లేక ప్రాంగణం చిన్నబోయింది
ప్రకృతి పరితపించింది
కలవర పడి ఓ క్షణం చిత్తరువులా నిలిచి
మౌనమూర్తియై కాలం కదలసాగింది
తన పట్టులన్నీ సడలి చెట్టు కూలిన వేళ
మనిషిలో ప్రేమ సూత్రపు పట్టు జారిన వేళ