నేపథ్యం

1944 లో నేను కమ్యూనిస్టు పార్టీలో చేరాను. దీనికి కారణం నా లోపలా బయటా అశాంతి.అప్పటికింకా స్వాతంత్ర్యం రాలేదు.దేశ పరిస్థితులు అస్థిమితంగా ఉన్నాయి.అప్పుడే వికసిస్తున్న మా మనసులలో అసంతృప్తి మేల్కొంది. ఏదో తెలుసుకోవాలనే ఆరాటం, దేన్నో సాధించాలనే తపన, సాంఘికమైనవీ, మానసికమైనవీ సంకెళ్ళని తెంచుకోవాలనే ఆవేశం.లోనా పైనా చెలరేగిన ఈ అశాంతికి మార్కిసిజం ఒక కాయకల్ప చికిత్సగా మా ఎదగని మనస్సుకు తోచింది.

కానీ కమ్యూనిస్ట్ పార్టీలో అడుగు పెట్టిన క్షణాన్నే అడుగు వెనక్కి తీసుకునే ప్రయత్నం మొదలైంది. ఈ అశాంతికి కారణం బాహిరమైన పరిస్థితులొకటే కాదు. మన మనస్సు లోతుల్లో కూడా దీని వేళ్ళూనాయి అని క్రమంగా తెలుసుకున్నాను. నేనెవరిని? నా అస్తిత్వం ఏమిటి? నాకు ప్రపంచానికీ సంబంధం ఏమిటి? నేను వేరు ప్రపంచం వేరూనా? నేను లేకుండా అసలు ప్రపంచం ఉందా? నేను తెలుసుకునే ప్రపంచం అసలు ప్రపంచం కాదా? ఇటువంటి ప్రశ్నలు తలెత్తాయి. వీటికి మార్క్సిజంలో సమాధానాలు దొరకలేదు. ” అసలు సమస్య ప్రపంచాన్ని అర్ధం చేస్కోవడం కాదు. మార్చడం” అని మార్క్స్ అన్నాడు కానీ అర్ధం చేసుకోకుండా ఎలా మారుస్తావు. అసలు నువ్వు మారకుండా ప్రపంచాన్ని ఎలా మారుస్తావు? ఇది నాకు కీలకమైన సమస్యగా తోచింది. నా చుట్టూ ఉన్న కమ్యూనిస్టులు ప్రపంచాన్ని మార్చగలిగే వాళ్ళలా నాకు అనిపించలేదు.

ఈరోజుల్లోనే కృష్ణ శాస్త్రి గారితోనూ ఆయన కవిత్వం తోనూ గాఢమైన పరిచయం. నాలో పెరుగుతున్న అశాంతికి కృష్ణ శాస్త్రి కవిత్వం ఆలంబన ప్రాయమైంది. నాలో గుబుల్కొన్న అలజడికి కృష్ణ శాస్త్రి రెక్కలు తొడిగాడు. కానీ ఇక్కడా అసంతృప్తే. కవిత్వ పక్షాలతో గానీ అందుకోలేని ఊహాలోకం అది. నా స్నేహాలతో భయాలతో కోపాలతో సిగ్గుతో ఆశతో నిరాశతో నా చిన్న అనుభవాలతో కిక్కిరిసిన నా వాస్తవ ప్రపంచమేది? క్షణ క్షణం నా పంచేంద్రియాలతో ఆడుకుంటున్న నా ప్రత్యక్ష లోకమెక్కడ? నా అస్తిత్వం నిజానికి మార్క్సిస్ట్లు ప్రతిపాదిస్తున్న అమూర్త ప్రత్యయాల్లోనూ (Abstract concepts) లేదు. ఇటు కృష్ణ శాస్త్రి గారి ఊహాలోకాల్లోనూ లేదు. రెంటికీ మధ్యగా బహిః ప్రపంచమూ, అంతశ్చేతనా కలుసుకునే చోట ఎక్కడో ఉందనిపించింది. మనం ప్రపంచాన్ని అనుభవించి తెలిసికొనేది పంచేంద్రియాల ద్వారా కనక, దీని కిటుకు ఇంద్రియానుభవంలోనే ఉండి తీరుతుందనుకున్నాను. వెంటనే మార్క్సిజం నించి , భావ కవిత్వం నించి తిరోగమించి , నాలో సగమైన ప్రపంచమూ, ప్రపంచంలో సగమైన నేనూ కలుసుకుని పరిపూర్ణత్వాన్ని సాధించే చోటికి ప్రస్థానం ప్రారంభించాను. ఇది 1945 లో. ఆ ఏడాదే నా ఆఖరి భావ కవిత రాసాను. 15 సన్వత్సరాల అన్వేషణ తర్వాత 1960 లో తిరిగి కొత్త కవిత్వం రాసాను. ఈ కొత్త పద్యాలు చదివిన వాళ్ళు దీనికి అనుభూతి కవిత అని పేరు పెట్టారు.

ఏమో నాకు తెలీదు. నాకు పెట్టుడు పేర్లు , లేబిల్సూ అంటే చిరాకు. కవులెవరూ కూడబలుక్కుని రాయరు, రాజకీయ కవులు తప్పించి.

సరే. పదిహేనేళ్ళ తపస్సు తర్వాత నేను గ్రహించిందేమిటంటే కవిత్వం అనుభవంలోంచి పుడుతుందనీ , కవి ప్రత్యక్షానుభవంలోంచి ఉద్భవించే కవిత్వమే నిజమైన కవిత్వమని , అభిప్రాయాలు, సిద్ధాంతాల వంటి మేధా వ్యాపారపు సరుకులతో కవిత్వం తయారు కాదనినూ , కవి అంతశ్చేతనా, భౌతిక ప్రపంచమూ కలిసేది అనుభవ రంగంలోనే. ఈ రెంటి స్పర్శ వల్లా రగుల్కున్న మంట వెలుగులోనే కవి బహిః ప్రపంచం, మనః ప్రపంచాల అద్భుతాల్ని తిలకించగలడు. జీవిత మహోత్సవంలోని అద్భుతాన్ని ఆవిష్కరించడమే కవిత్వం పని.ఈ విధంగా మన చేతనని సుసంపన్నం చేస్తుంది కవిత్వం.

మనం చాలా వరకూ పంచేంద్రియాలతో జీవిస్తున్నామనే సత్యాన్ని పెద్దలు చాలామంది ఒప్పుకోక పోవచ్చు. కానీ తరచి చూస్తే మన జీవిత ప్రకార్యంలో బుద్ధి పాత్ర బహుతక్కువ. అందువల్లనేనేమో కవిత్వం మీటేది పంచేంద్రియాలని. బుద్ధిని కాదు. ఇంద్రియాలని ప్రత్యక్షంగా స్పర్శించే పదచిత్రాల (images) ద్వారా కవిత్వం పాఠకుడిలో కవిత్వానుభవం కలిగిస్తుంది. దీన్నే అనుభూతి అంటాం.

జటిలమైన మానవ అనుభవాలని చిత్రించడానికి సరైన సాధనాలు పద చిత్రాలు. పూర్వ కవులు రొమాంటిసిస్టులతో సహా ఉపమ రూపకాది అలంకారాలు వాడారు. కానీ ఇవి అలంకారాలు మాత్రమే. మహా ఐతే కావ్య విషయాన్ని మరింత ఉజ్వలంగా ప్రదర్శించడానికి ఉపయోగపడ్డాయంతే. అనుభూతి కవుల పదచిత్రాలటువంటివి కావు. నిజానికి పదచిత్రాలకీ , కవిత్వానుభవానికీ తేడా లేదు.రెండూ ఒకటే. కావ్యమనేది ప్రతి సృష్టి. అరిస్టాటిల్ తో సహా పూర్వీకులంతా అన్నట్టు సృష్టికి కవి పట్టే దర్పణం కాదు. భగవంతుడెంత స్రష్టో , కవి కూడా తన ఫాం లో అంతే. దేవుడి సృజన శక్తితో సమంగా కవికి భావనా శక్తి ఉంది. కవిత్వానుభవాన్ని ప్రత్యక్షంగా చదువరి అనుభుతికి తేవడమే పదచిత్రాల పని. మామూలు మాటలకందని అనుభూతిని పదచిత్రాల ద్వారా కవి పట్టగలడు.

అమూర్తమైన (Abstract) భావాలూ, అభిప్రాయాలూ పదచిత్రాలు కాలేవు. మూర్త (concrete) మైన వస్తువులూ, గుణాలూ, క్రియలూ మాత్రమే పదచిత్రాలు కాగలవు. ఇవి మన ఇంద్రియాల్ని తాకి, ఐంద్రిక అనుభూతుల్ని మేల్కొలుపుతాయి. మాటలకందని సంక్లిష్టమైన అనుభవాలతో జటిలమైన ఆ అనుభవిక ప్రపంచం ఈ పదచిత్రాల ద్వారా మన అనుభూతి ఆవరణలో ప్రవేశించగలుగుతోంది.

ఇటువంటి చారిత్రక పరిణామం ఇంగ్లీషు సాహిత్యంలో కూడా జరిగినట్టు కనిపిస్తుంది. 19వ శతాబ్దంలో రొమాంటిక్ కవులు సంప్రదాయ వాదాన్ని నిరాకరించి , ఆత్మాశ్రయ పద్ధతిని అవలంబించారు. సంప్రదాయవాదం వ్యక్తికన్నా సంఘం గొప్పదంటుంది. రొమాంటిసిస్టులు సంఘంకన్నా వ్యక్తి ముఖ్యమంటారు. వ్యక్తి స్వేచ్ఛ వీళ్ళకి ప్రాణం. వీళ్ళు పూర్తిగా అంతర్ముఖులై , భావనా లోకంలో విహరించారు. వాస్తవిక లోకంతో వీళ్ళకి సంబంధం తెగిపోయింది. వీరి తర్వాత వచ్చిన సింబలిస్టులు ఆదర్శ లోకాల అన్వేషణలో ఇంకా ఎత్తుగా ఎగిరారు. సామాన్య దృష్టికి అందని ఆతీతక యధార్థాల్ని శబ్ద శక్తితో అందుకోవచ్చని వీరి నమ్మకం.

ఆత్మాశ్రయ వైఖరికి ప్రతి చర్యగా రియలిజం, నేచురాలిజం ఉద్యమాలుద్భవించాయి. ఇవి పూర్తిగా వస్త్వాశ్రయాలు. (objective). వాస్తవాన్ని ఉన్నదున్నట్టుగా చిత్రించాలంటారు.

ఐతే వాస్తవాన్ని పట్టుకునేదేమిటి? కవి మనస్సు కదా! మనస్సుతో సంబంధంలేని వాస్తవమంటూ ఉంటుందా? విషయీ (subject) , విషయం (object) రెండూ అనుసంధిస్తేనే గానీ అనుభవం ఉత్పన్నం కాదు. భావన ఎంత ముఖ్యమో, వాస్తవిక ప్రపంచం కూడా కవిత్వానికి అంత ముఖ్యం.

1912 లో అమెరికాలో ఎజ్రా పౌండ్ “ఇమేజిజం” అనే ఉద్యమం లేవదీసాడు. కవిత్వానికి అమూర్త భావాలు పనికిరావన్నాడు. కవిత్వం అనుభవాన్ని అనుభూతిని ఇమేజ్ (పదచిత్రం) ద్వారానే మనకు అందజేయగలదు మరొక మార్గం లేదన్నాడు. ” An image is that which presents an intellectual and emotional complex in an instant of time” అని నిర్వచించాడు.పదచిత్రమంటే సంక్లిష్టమైన అనుభూతిని తృటిలో అందించగలిగింది అని — ప్రాకృతిక వస్తువ్లే కవితా ప్రతీకలుగాఉపయోగిస్తాయి. అమూర్త భావాలని కవిత్వం లోకి రానివ్వొద్దన్నాడు. అనుభూతి ముఖ్యమన్నాడు. “Only emotion endures”

భావ కవ్తివానికీ అనుభూతి కవిత్వానికీ తేడా లేదని ఈ మధ్య కొందరు అపోహ పడటం గమనించాను. భావ కవిత్వం పూర్తిగా ఆత్మాశ్రయం. అతీతక లోకాల్లో దాని అన్వేషణ. అనుభూతి కవిత్వానికి మానవ అనుభవంతో సంబంధం. అనుభవమంటే బహిర్లోక అంతర్లోకాల అనుసంధానం. వాస్తవిక ప్రపంచమూ, కవి మనస్సు కలిసినప్పుడు కలిగేది. అనుభూతి కవిత్వంలో విషయీ కి ఎంత ప్రాధాన్యముందో , విషయానికీ అంతే. కనక అనుభూతి కవిత్వం భావ కవిత్వంతో మౌలికంగా భేదిస్తుంది. బహిశ్చేతన అంతశ్చేతనల అనుసంధానంలోనే జీవిత సత్యం నిక్షిప్తమై ఉందని , ఈ సమన్వయం ద్వారానే బహిరంగాన్ని అంతరంగాన్ని ఏకకాలమందు అర్ధం చేసుకోగలమని అనుభూతి కవిత్వం ఋజువు చేస్తుంది.

1988.