చెట్టు నా ఆదర్శం

5. తాటితోపు

నల్లటి యీ తాటివనం
అల్లిన నీడ వారిపై
ఎర్రటి సాయింత్రాన్ని
ఎక్కుపెట్టింది.

గాలి శవాన్నెత్తుకుని
కదల్లేదు తోట.
గుచ్చుకుని సంధ్యాంగుళి
గుడ్డిదయ్యె పాట.

గాలిముల్లు గుచ్చుకొని
గాయపడెను సాయింత్రం.
కాలిమసై పాట, నిలిచె
తాళవనపు అస్థికలు.

తాటితెడ్లు వేసుకుంటు
తరలిపోయె సంజ.
పాటనురగ మదినితేల
మరలివస్తి ఒక్కణ్ణీ.

(నవంబర్‌ 22, 1960.)

6. సూర్యుని చేప

నల్లని తీపీ
నిండిన వాపీ
ఫలాన్ని దొలచును
మెలికలు తిరుగు
చంద్రుని పురుగు;
మనాన్ని కలచును.
కత్తుల కళ్ళు
మూయుచు చాళ్ళు
మయాన్ని ఈదును.
అంచుల వాలు
నీడల స్క్రూలు
భయాన్ని చేదును.
చుక్కల వలను
తెంచుకు కొలను
జలాన్ని డాయునొ
సూర్యుని చేప,
ఛురిలా పాప
ఖిలాన్ని కోయునొ.

7. ఇసకలో వేళ్ళు

అలలు రాల్చింది మా
కాలవ సుమము
నిలువెల్ల పాకగా
వేసవి క్రిమము.

నేటితో సంధ్య నీ
గుండెపై తేలదు.
నీడ లోతుగ గుచ్చి
నావ ఇక వాలదు.

జలశృంఖల తెగినా
వదలదు గట్టు
తలనిండ పిట్టలతో
ఊగే చెట్టు.

పాట లెండిన
రేవుపియానో మెట్లు
పలకరించే వేళ్ళు
పడతుల జట్లు.

ఎడబాటు తెరచీల్చి
తరుణుల వేళ్ళు
ఇసకకడుపున పోల్చు
తరువుల వేళ్ళు.

(ఏప్రిల్‌ 66, 67.)

8. ఎందుకయ్యా వుంచినావూ బందిఖానాలో

చిటపట…..
చీకటిపుటలో చినుకుబంతులు
బంతులన్నీ అదేమాట
అంతుమరచి అంటాయి.
ఎందుకయ్యా ఈ పునరుక్తి
ఎవరిదీ కుయుక్తి?

అకటకట
అర్ధరాత్రి సొరంగంలో
ఆగబోని అడుగులసడి.
దేనినించీ పలాయనం
దొరకదా ఇక విమోచనం?

చిటపట……
ఎడతెగక మోగు విధిఢక్క
కడుపులో శూన్యపుప్రేవుని
ఏలమోగు నగార
ఎచటదీనికి మేర?

అకటకట
వికట ప్రతిబింబాల
అద్దాల చెరసాల
బందీని నేనె
బందిఖానాని నేనె.

(కాకినాడ, 8-3-60.)