తోలుబొమ్మలాట – 05వ భాగం

గ్రామంలోని ఆడవాళ్ళకు సులభంగానే పరిచయమయ్యింది కమలాబాయి. ఆమె తల్లి లక్ష్మీబాయితో ముసలాళ్ళందరికీ సన్నిహిత సంబంధాలుండేవి కాబట్టి ఆమె పని సులువైంది. తత్ఫలితంగా అంబలి పొద్దు మీరక ముందే మనిషికో ముద్ద సంకటి దొరికింది. ఉడుకుడుకు సంకటి, వేరు సెనగల పచ్చడి, మటిక్కాయల తాలింపు జిహ్వకు రుచిగా అన్పించింది.

కూతుర్ని వెంటేసుకని బంకు దాకా వెళ్ళింది.

అక్కడ టీకొట్టు ఉంది. వడలు బజ్జీలున్నాయి. దోసెలు కూడా దొరుకుతున్నాయి. పక్కనే మిద్దె పంచలో బ్రాందీసీసాల దుకాణం ఉంది. దానిముందే కూల్‌డ్రింక్‌ షాపు.

ఆ ఉదయం పూట కూడా జనాలు ఒకరిద్దరు తాగుతూ కన్పించారు.

అడ్డపంచెలు పైకెత్తి మందు సీసాల్ని డ్రాయరు జేబుల్లోకి నెట్టుకొని వెళ్ళిపోతున్నారు.

అక్కడ ఎక్కువ సేపు నిలబడకుండా తూర్పు వీధికేసి సాగింది.

ఆడోళ్ళతో మాటలు కలుపుతూ చాలాసేపు వీధుల్లో తిరిగింది.

విసర్రాయి ముందు కూచుని విసరుతూనో, రోటిముందు నిల్చుని దంచుతూనో కన్పిస్తారనుకొంది ఆడవాళ్ళు. పల్లె పదాలు పాడుకంటూ విసరుతూ ఉంటే తనూ వాళ్ళ పక్కగా కూచుని చేయి కలుపుదామనుకొంది. శ్రమను పంచుకొంటే మనస్సులు కలుస్తాయి గదా! అరమరికలు లేకుండా మాట్లాడుకోవచ్చు. కష్టసుఖాలు చెప్పుకోవచ్చు.

సంకటి పెట్టించుకనేందుకు తన తల్లి పరిచయం ఉపయోగ పడింది. ఆటాడించే సహకారం వాళ్ళనించి పొందాలంటే తాను సన్నిహితత్వాన్ని పెంపొందించుకోక తప్పదు.

చాలామంది ఆడవాళ్ళు సంగటి చేసికొని పొలాల మీదకు వెళ్ళారు.

మిగిలిన వాళ్ళు టీవీలు చూస్తూనో, మిక్సీలు గ్రైండర్లతో విసరు పని దంచుడు పని చేస్తూనో కన్పించారు.

దేవాలయం వద్ద కల్రోళ్ళు ఇంకా ఉన్నాయి గాని అవి పాడుబడ్డట్టున్నాయి. వాటిలో రోకటిపోటు వేయక ఏళ్ళు గడిచినట్టుంది.

ఊర్లో ఎద్దుల కాండ్లు కూడా నామమాత్రంగానే కన్పించాయి. వీధికొక ట్రాక్టరు మాత్రం ఉన్నట్టుంది.

పూర్వంలాగా ఇళ్ళ ముందు ఇప్పుడు ఎద్దుల గాళ్ళు కన్పించటం లేదు. పేడరొచ్చు వాసన ముక్కులకు సోకటం లేదు – అక్కడక్కడా డీజిల్‌ కంపు దప్ప.

తండ్రి భర్తలిద్దరూ ఆట ఒప్పందం కోసం పెద్దమనుషుల చుట్టూ తిరగుతున్నారు.

వెంకట్రావు బావా, రామారావు చిన్నాయనా ఒకరు పొట్ట రుద్దుకంటూ, మరొకరు తేపుకొంటూ జనాలతో కలిసిపోయి బీడీలు కాల్చుతూ ఏవేవో మాట్లాడుతున్నారు.

కల్రోలు మీద కూచున్న యువకులతో తెగముచ్చట్లాడుతున్నాడు తిక్కల కొండి.

వనజను గుడివద్ద వదలి ఎదురుగా ఉన్న అంగట్లోకి నడిచింది కమలాబాయి. వక్క, పొగాకు కొంటూ అంగడి సుబ్బమ్మతో చాలాసేపు మాటలు కలిపింది.

బుగ్గనిండా వక్కాకుతో బైటకొచ్చి దేవాలయం కేసి చూసేసరికి – వనజతో మాట్లాడుతూ ఎవరో యువకుడు.

అతను హుషారుగా ఏదో అడుగుతున్నాడు.

దగ్గర్లోనే తిక్కలకొండి – అక్కడున్న యువకులకు ఏమిటో వివరిస్తూ. తన్ను చూసి కూడా వాళ్ళు మాటలు ఆపలేదు.

తను దేవాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆ కుర్రాడు వెనుదిరిగి తన మందలో కలిశాడు.

‘‘ఏందో పిల్లోడు మాట్లాడేది?’’ అడిగింది.

‘‘నేను బొమ్మల్ను ఆడిస్తానో లేదో కనుక్కోడానికచ్చిండు’’

‘‘అంత అవసరమేమంట?’’

‘‘ఏమో?’’

‘‘ఏం జెప్పినావూ?’’

‘‘ఆడిస్తానని చెప్పినా …. అయినా ఈ తిక్కలోనికి ఎందుకుమా ఊరోల్లతో మన సంగతులన్నీ చెప్పడం?’’

కూతురికేసి ప్రశ్నార్థకంగా చూసింది ఆమె.

‘‘ఏదేదో చెబుతున్నాడు. ఎవరెవరం బొమ్మల్ను ఎత్తుకొనేది …. ఎట్లా పాడేది …. అన్నీ …. నేనస్సలు బొమ్మనే ఎత్తుకోనంట …. పాటేరాదంట …. నాక్కోపమొచ్చి బొమ్మను ఆడిస్తానని చెప్పినా….’’

ఆమె మాట పూర్తి చేయక ముందే యువకుల వద్ద నుంచి విసురుగా వచ్చాడు కొండల్రావు. వనజకేసి చిరుకోపంగా చూస్తూ ‘‘నువ్వెప్పుడన్నా తోలుబొమ్మల మొగమన్నా సూసినవామ్మే?’’ ప్రశ్నించాడు.

ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు వనజకు.

‘‘బొమ్మలాడిస్చా నన్నెవంట …. పాడ్తా నన్నెవంట …. నియక్క! అపద్ధాలెందుకమ్మే సెప్పేది?’’ నిలదీసినట్లుగా అన్నాడు. ‘‘నీకేమీ రాదని నేన్జెప్పినా …. పాటలుగాని .. ఆడించేది గాని ….’’

అతనికేసి అసహనంగా చూసింది కమలాబాయి.

‘‘నీకెందుకబ్బీ ఆయమ్మి సంగతులు?’’ అంది.

‘‘అదిగాదత్తా! నేన్నిజమే సెప్పినా గదా!’’

‘‘ఈ పిల్ల సంగతి నీకెందుకని అంటున్నా….’’ రెట్టించింది గొంతు పెద్దదిగా చేసి.

‘‘నియ్యక్క .. అదో ఆ పిల్లోడడుగుతే ….’’ నెత్తిగీరుకొంటూ రోటికేసి చూశాడు.

‘‘అందుకేరా నిన్ను తిక్కనాబట్ట అనేది ….’’ వత్తి పలికింది.

వెంటనే కొండల్రావు మొహంలో రంగులు మారాయి.

బుడ్డమూతి పెట్టి ఆమెకేసి అదోలా చూశాడు.

మంచి మాట్లాడినా తిక్కనాకొడుకే …. పెద్ద మాట్లాడినా తిక్కనాకొడుకే …. నేనేం మాట్లాడినా తిక్కనాకొడుకునే …. తిక్కంట తిక్క …. ఈ తిక్కనాకొడుకును తోడెందుకు తెచ్చుకోవాల్నో ….’’ అంటూ అక్కణ్ణించి వెనుదిరిగాడు. ఏదేదో గొణుక్కొంటూ దక్షిణపు వీధినబడి విసవిస వెళ్ళిపోయాడు.

తను చేసిన పొరపాటేమిటో అర్థమైంది కమలాబాయికి.

తిక్కలోన్ని ‘తిక్కనాబట్టా!’ అనటం తప్పే.

అలిగినట్టున్నాడు.

‘‘అమ్మీ! వాడేడికి పోతాండో సూడు….’’ కూతురికి చెప్పింది.

వనజ కిందకు దిగింది.

వీధిలోకెళ్ళి దక్షిణం దిశగా తలెత్తింది.

కొంతసేపు తదేకంగా అటే చూసి తల్లివద్ద కొచ్చింది.

‘‘బంకుకాడ కూడా నిలబళ్ళేదు …. పోతానే ఉండాడు ….’’ చెప్పింది.

నొసలు ముడేసింది కమలాబాయి.

ఆమె మనస్సులో సన్నని ఆదుర్దా. ‘‘మెంటల్నాబట్ట …. దారిబట్టుకొని ఊరికైనా పోతాడు. వీడు పోతే బండి తోసేది ఎవరు …. మనిసికి మనిసితోడు….’’

‘‘బంకుకాడ మనోల్లెవురూ లేరా?’’ అడిగింది కూతుర్ని

‘‘కనబళ్ళే….’’

‘‘ఈన్నే ఉండు….’’ కూతురికి చెబుతూ దేవాలయం దిగింది.

కప్పు ముడి వేసికొంటూ వీధిలోకి నడిచింది.

దక్షిణపు వీధిగుండా ముందుకు కదిలింది.

బంకువద్దా, కూల్‌డ్రింక్‌ షాపు ముందూ ఉన్న జనాల్లో వెదకింది. అక్కడ తూర్పు పడమరలుగా సాగిన వీధిని చూడగానే అయోమయంలో పడింది ‘ఎటు వెళ్ళాలా?’ అని.

పడమటి వైపు కోటవీధి నుంచి ఏదో రాగం విన్పించినట్టయి, అది తనవాళ్ళ గొంతుగా పోల్చుకొని అటుకేసి నడిచింది.

ఏవో పద్యాల్ని గొంతెత్తి పాడుతున్నారు. వాటి అర్థాన్ని కూడా విడమరచి చెబుతోన్నట్టుంది.

దగ్గరకు చేరగానే ఆ గొంతు తన మగనిదిగా అర్థమైంది.

గొంతు వినసొంపుగానే ఉంది.

ద్విపదల్ని రాగయుక్తంగా పాడుతున్నాడు. అలవాటు తప్పిందేమో అనుకొంది. వంశపారంపర్యంగా వచ్చిన విద్య .. అవసరమైతే నాభినుంచి తన్నుకు రాదూ!

‘‘ధనములార్జించిన ధర్మ కామాదు

లనుపమ స్థితితోడ నధిప సిద్దించు.

ఎసగంగ నర్థంబు లెవ్వాని కొదవు

వసుధ వానికి నెల్లవారు చుట్టములు.’’

పద్య భావాన్ని విడమరచి చెబుతున్నాడు తన తండ్రి.

ఇంద్రజిత్తు మాయాసీతను తెచ్చి యుద్దభూమిలో ఆమె తలనరికి చంపినప్పుడు, ఎవరికోసమైతే ఇంతటి యుద్ధాన్ని చేస్తున్నామో ఆ సీతే లేదని తెలియగానే రాముడు మూర్చిల్లి నేలకరుగుతాడు. ఆయన అవస్థ చూసి లక్ష్మణునికి మహాశోకం కలుగుతుంది. దీనికంతటికీ కారణం తాము రాజ్యాన్ని కోల్పోయి అరణ్యవాసం రావటమే గదా! ధనం లేకపోవటం వల్లా, రాజ్యం లేకపోవటం వల్లా తాము బికారులుగా మారి కదా ఇన్ని అగచాట్లు.. లోకంలో ధనానికి తప్ప మరో దానికి విలువ లేదనే విషయాన్ని లక్ష్మణుడు ఎలుగెత్తి చాటుతున్నాడు.

‘‘లేమియే నరకంబు లేమియే రుద్ర

భూమియు లేమియే భూరి శోకంబు.

లేమియే రోగంబు లేమియే కరువు

లేమియే దైన్యంబు లేమియే వగపు

లేమియే సకల మాలిన్యంబు దలప

లేమియే సర్వంబు లేమి గావునను.

అచ్చెరువుగ రాజ్యమంతయు విడిచి

వచ్చినప్పుడగాదె వచ్చెనాపదలు’’

రాజ్యాన్ని పోగొట్టుకొన్నపుడే, ధనాన్ని కోల్పోయి దరిద్రాన్ని వెంట తెచ్చుకొన్నప్పుడే ఆపదలు వచ్చాయని లక్ష్మణుడు వాపోతున్నాడు.

మంచి ఐశ్వర్యంతో వెలిగిన వ్యక్తి ఒక్కసారిగా ఏమీ లేనితనంలోకి వెళ్ళటంతో ధనం ఉండటానికి లేకపోవటానికీ మధ్య తేడా అనుభూతిస్తూ చెబుతున్నాడు.

లేమిని గురించి సుబ్బారావు పాడటం, దానికి గోవిందరావు అర్థం చెప్పటం, వింటూ ఉన్న కమలాబాయికి అదంతా తమను గురించే చెప్పినట్టుగా అన్పించింది. వాళ్ళ గొంతులో అనుభూతికి సంబంధించిన తడిజీర స్పష్టంగా కదలాడినట్టుగా తోచింది.

మిద్దె పంచలో ఓ మంచమ్మీద పాత బొంత పరచివుంది. ఊతకర్రను మంచం కోడుకు ఆన్చి, కాళ్ళు చేతులు వేలాడేసుక్కూచుని ఉన్న ముసలాయన రామాయణ పారాయణాన్ని తన్మయంగా వింటున్నాడు.

పక్కన మంచాల మీద కూచున్న వాళ్ళలో మాత్రం అంతటి ఉత్సాహం కనిపించటం లేదు. ముసలాయన తృప్తికోసం మంచాలకు అంటి పెట్టుకొని ఉన్నారేమో అన్పించింది.

ఓ స్థంభాన్ని ఆనుకొని నిల్చునివున్న తిక్కలకొండిని చూసి గట్టిగా ఊపిరి పీల్చుకొంది కమలాబాయి.

‘‘కలిమినీ లేమినీ రెంటినీ సమానంగా అనుభవించిన మహానుభావులు కాబట్టి అంతగొప్పగా చెప్పగలిగినారు రామిరెడ్డీ! తమరికి తెలియందేముంది – ధర్మ ప్రభువులు. మొన్నమొన్నటి దాకా తమరు రామాయణం సదూతాంటే లక్ష్మిరెడ్డి అర్థం చెబుతోంటే – ఎంత మధురంగా ఉండేది! సగం పొద్దయినా, తెల్లబారేదాకయినా జనాలు కన్ను కూరుకుతావున్నెరా! గుడి పంచ దిగి ఇంటికి పోతావున్నెరా! ఆ కాలాలే వేరులే స్వామీ!’’ గోవిందరావు చెబుతున్నాడు.

‘‘నాయనా గోవిందరావూ! కాసేపు అతికాయుని చరిత్ర సదవండి నాయినా!’’ రామిరెడ్డి అడిగాడు.

గోవిందరావు మెల్లిగా అందివ్వగానే సుబ్బారావు గొంతెత్తాడు.

తను వచ్చిన పని పూర్తవటంతో గుడికేసి వెనుదిరగబోయి ఎందుకో పడమటి వీధికే ఎగమల్లింది కమలాబాయి.

పదడుగులు నడచిన తర్వాత ఆమెకే సందేహం కలిగింది – తనెందుకు కోట వీధి చివరిదాకా వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నానోనని, ఆలోచిస్తోంటే కూతురు గుర్తొచ్చింది.

ఆమెతో హుషారుగా మాట్లాడే యువకుని రూపం కళ్ళముందు మెదిలింది.

కొంత దూరంనించి బడిపిల్లల శ్రావ్యమైన కంఠస్వరాలు …

బహుశా తనకు తెలీకుండానే తనలోని అంతశ్చేతన ఒకటి తన్ను బడికేసి లాక్కుపోతూ వుంది.

కోటవీధి చివర బడి కొట్టం ఉండేది గతంలో.

ఇప్పుడు కూడా బడి అక్కడే ఉన్నట్టుంది.

చేదుడు బావి వుందో? లేదో!

నిర్విరామంగా మోగే గిలక శబ్దంతో ఆ పరిసరాలన్నీ జలకళ లాడుతూ వుండేవి.

తన స్మృతులింకా ఆ బావి చుట్టూ మూగివున్నాయి. బావివద్ద కెళ్ళి వాటిని లేపుకు రావాలి. …. అందుకేనేమో తన మనస్సు తన్ను అటుగా నడిపిస్తోంది.

మెల్లిగా అడుగులేస్తూ ఉంది.

బడి కొట్టం లేదుగాని పక్కా భవనం ఉంది. చుట్టూ ప్రహరీ గోడతో, ఏపుగా పెరిగిన చెట్లతో … గోడల లోపల్నించి ప్రణవనాదాల్లా ఎగిసి వచ్చే పిల్లల గొంతుకలతో …

గేటు దాటి లోపలకి అడుగేసింది.

పాఠం చెబుతూ ఉన్న అయ్యవారు కాస్తా ఆమెకేసి తిరిగాడు.

అతన్ని పట్టించుకోకుండా కాంపౌండ్‌ లోపట చుట్టూ చూసింది.

ఆమె కళ్ళు అక్కడి తావునంతా అడుగడుగునా పరిశీలిస్తున్నాయి.

బడి వెనగ్గా వెళ్ళి వెదకింది.

వేపచెట్ల మధ్యన నడిచింది.

బడికి పడమటి వైపు పాత చింత చెట్టును ఆధారంగా చూపులతోనే దూరాన్ని కొలుస్తూ ఓ చోట ఆగింది.

అవును … బావి ఇక్కడే ఉండాలి.

ఎండిన బావిని పూడ్చినట్టున్నారు. ఆ తావులో ఓ వేపచెట్టు బతికి ఉంది.

దాని వేళ్ళనిండా తనకు సంబంధించిన స్మృతులే ఉంటాయి.

మంచి నీళ్ళకోసం ఊరంతా ఈ బావికి రావాల్సిందే.

శరీరాన్ని విల్లులా వంచి, బావి గిలక శబ్దానికి అనుగుణంగా చేతుల్ని బారలు బారలుగా చాచి తాడు లాగుతూ నీళ్ళ కడవను పైకి చేదే ఆ యవ్వనం …

ఏదో పరధ్యానంలో గుంపించి గుంపించి తాడులాగి, ఆ ఊగిసలాటలో కడవ దరులకు తగిలి భళ్ళున పగలటంతో, పూనివున్న మనిషి కాస్తా వెల్లకిలా పడి … అందరి నవ్వుల మధ్య కడవ పగిలిన బాధను బలవంతంగా కడుపులో దాచుకుంటూ …

తమకు ఇత్తడి బిందె ఉండేది.

రెండు బిందెలయితే గాని అతని కడవ నిండేది గాదు.

అంత పెద్ద కడవనూ సునాయాసంగా లాగేవాడు.

వ్యవసాయ పనులు కూడా అలాగే చేసేవాడుట. పార చేతికి తీసికొంటే పనయిపోయే దాకా గట్టెక్కేవాడు కాదుట. ఆ రోజుల్లో ఊరంతటికీ ఇంటర్మీడియట్‌ చదివే యువకుడు అతనొక్కడే. చదువుకొనే కుర్రవాడయివుండీ అంత మొరటుగా శ్రమించటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించేది.

అన్నిటి కంటే పెద్ద వింత … అది తనకిప్పటికీ అర్థంగాని ఆశ్చర్యం కలిగించే వింత … బావిలోంచి నీళ్ళ కడవను లాగినంత సునాయాసంగానే రెండవ రోజే తన చూపుల్ని అతను లాగేసుకున్నాడు. నీళ్ళ అవసరం లేకున్నా ఏదో ఒక సాకుతో బిందె పట్టుకొని బావివద్దకు తను వచ్చేలా చేయగలిగాడు.

‘‘ఏ ఊరండీ మీది?’’

టీచర్‌ ప్రశ్నతో ఉలికిపాటుగా అటుకేసి చూసింది కమలాబాయి. తన్ను తాను సవరించుకని చెప్పింది ‘‘మేం బొమ్మలాటగాల్లంలే సారూ!’’ అని.

మెల్లిగా బడి ఆవరణలోంచి బైటకు నడిచింది.

చేదుడు బావి స్మృతులు ఆమెనింకా వదల్లేదు.

అతని రూపాన్ని కళ్ళ మీదకు తెచ్చుకందామంటే ఒక పట్టాన సాధ్యం కావటం లేదు.

గజిబిజిగా అల్లుకుపోయిన ఓ రూపం … పరిపూర్ణమైన యవ్వనానికి ప్రతీక … అంతే …

నాలుగిళ్ళ అవతల వీధిలోకి తెరచుకొన్న సందుకేసి చూసింది.

అక్కణ్నించే … కడవ చేతబట్టుకొని ఒక యవ్వన రaరి తనను ముంచెత్తుతూ ముందుకు దూసుకెళ్ళి కడవ వరసల్లో తనకంటే ముందుంచి, నీళ్ళు చేదే సమయానికి తనకే ముందస్తు అవకాశమిస్తూ …

రెండవ రోజుకే … ఎన్నో యుగాల పరిచయం అనుభవాని కొచ్చిన తను …. సందులోంచి వచ్చే ప్రవాహం కంటే ముందుగా వెళ్ళాలని పరుగులు పెట్టటంతో ప్రవాహవేగం తనను వొరుసుకొని ఒక తన్మయా భావన మనస్సును ముంచెత్తి, అతనికి అవకాశం ఇచ్చేందుకు బిందె నేలమీద పెట్టకుండా తనూ – తనకు అవకాశమివ్వటానికి కడవను వెనక్కి తీసికొనే అతనూ … సందు వద్దకు వెళ్ళేసరికి ఏ వైపునించో నీటి తుంపర్లు తనమీద చిలకటం … ప్రతిగా బావివద్ద నీళ్ళు అతని మీద చిందేలా విసురుగా నీళ్ళ బిందెను రొండికి ఎత్తుకొనే తనూ ….

సందులో ఆ చివర ఇంకా మార్పులు చోటుచేసికోని ఆనాటి పాత మిద్దె … చెక్క కూసాలు, దూలాల పంచతో కళావిహీనంగా కన్పిస్తోన్న పాతమిద్దె … పక్కనే బోదకొట్టానికి బదులు వసారా …

ఆ కాలంలోనే ఇంటర్‌ చదువుతున్నాడంటే … అతను బాగా చదివే ఉంటాడు. ఏదొక ప్రభుత్వ ఉద్యోగిగా ఎక్కడో టౌనులో స్థిరపడే ఉంటాడు.

అందుకే పాతమిద్దె ఇంకా అలాగే ఉంది.

ఆ భావన రాగానే ఒక్కసారిగా ఆమెకు నిస్పృహ కమ్మింది.

తలొంచుకోని దేవాలయం కేసి సాగింది.

బలిజవీధి మొగదలకొచ్చేసరికి – తమ వాళ్ళ గొంతులే.

వీధి కూడలిలో జనాల ముందు తన పాతకాలపు చాటు పద్యాల నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు రామారావు చిన్నాయన.

‘‘ఆయన పండితుడు. కొత్తగా పెండ్లయింది. అత్త గారింటికాడ అల్లెం తింటుండాడు. ఆ రోజు మద్దేన్నం పంచభక్ష పరమాన్నాలతో కడుపునిండా తిని కూచున్నేంక తాంబూలం పల్లెం ఆయప్ప ముందుంచింది మరదలు పిల్ల. ఆకు వక్క కుంకం పువ్వు … అన్ని సంబారాలుండాయి గాని సున్నం లేదు … ఆ పక్కా ఈ పక్కా చూసిండు. వాకిలి సాటున మరదలు కనబడేతలికి తన పాండిత్యాన్ని ప్రదర్శించాలనుకున్నేడు …

‘‘పర్వత శ్రేష్ట పుత్రికా పతివిరోధి

యన్న పెండ్లాము యత్తను గన్న తండ్రి

పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ

సున్నమిప్పుడు తేగదే సన్నుతాంగి’’

అని నవ్వుతూ అడిగిండు.

అంటే అర్థమేంది? ఎవురికెన్నా తెలుసునా? … పదం పదం ఇడదీసుకుంటా పోతే ‘‘ఓ పెద్దమ్మా! ఓ దరిద్ర దేవతా! సున్నం తీసకరా!’’ అని.

ఆమెకు అర్థమైంది. చిన్నప్పట్నించి తండ్రికాడ పురాణాలు సదూకున్నె పిల్లగాబట్టి పద్యాన్ని అర్థం జేసుకున్నది. తండ్రి నుంచి నేర్చుకొన్నె పాండిత్యాన్ని ఆమె వృధాగా పోనీదల్చుకోలే … దొడ్లోకి పోయి సున్నం తీసుకొని పచ్చి బావకు అందించబోయే లోపల ఆయప్పకు సమాధానంగా ఇంకో పద్యం అల్లుకొన్నెది.

బావకు సున్నం అందిస్తా …

శతపత్రంబుల మిత్రుని

సుతు జంపినవాని బావ సూనుని మామన్‌

సతతము తలదొల్చిన సును

సుతవాహన వైరివైరి సున్నంబిదిగో …

అంటూ పద్యం చెప్పింది.

దాని అర్థం ‘‘ఓ కుక్కా! ఇదుగో సున్నం …’’ అని.

అతను తేటగీతలో అడిగితే –

ఆమె కందంలో అందంగా చెప్పింది.

కందం చెప్పిన వాడే కవి అంట.

పద్యం అల్లటంలో కూడా తన ఆధిపత్యాన్ని చాటుకున్నది.

లోగడ చమత్కారాలు, చెతుర్లూ కూడా అట్లా ఉండేవన్నా! ఇట్లాంటివి బొమ్మలాటలో ఎన్నో ఉంటాయి.’’

రెండు పద్యాలకు పదం పదం విడదీసి భావం చెబుతున్నాడు రామారావు.

అక్కణ్నించి దాటుకెళ్ళింది కమలాబాయి.

బొమ్మలాట ఆడేందుకు జనాలను పప్పించాలని ఎన్నెన్నో తంటాలు పడుతున్నారు తమ వాళ్ళు.

మరెన్ని అవస్థలు పడేందుకయినా సిద్ధంగా ఉన్నారు.

వినే వాళ్ళుంటే ఇంకెన్నో పద్యాలు గొంతెత్తి పాడగలరు. పదం పదం విడదీసి భావం అందించగలరు. రసవత్తరమైన కథలు చెప్పగలరు. చాటుపద్యాలు, సామెతలు, పిట్టకథలు … ఎన్నో … ఎన్నెన్నో … ఇంకెన్నో చెప్పి అలరించగలరు….

దేవాలయం వద్ద కెళ్ళేసరికి మళ్ళీ అదే దృశ్యం – తన కూతురు యువకునితో ముచ్చట్లాడుతూ …

నొసలు ముడేసింది ఆమె.

వాళ్ళకేసి తదేకంగా చూసింది.

ఆ దృశ్యం ఆమెక్కొంత అసహజంగా తోచింది.

వాళ్ళిద్దరూ అదే పనిగా మాట్లాడుకోవటమూ కాదు, వాళ్ళ మొహాల్లో ఆనందం కదలాడుతోన్నందుకూ కాదు ఆ అసహజం. అతని తోటి యువకులంతా కొంత దూరంలోనే ఉండి వాళ్ళకేసి చూస్తూండటం. … చూపుల్లో ఏదో పరిహాస ధోరణి కనిపించటం …

తన్ను చూసి ఆ యువకుడు తన మందలో కలిశాడు.

కూతురికేసి నొసలు ముడేసింది ఆమె.

‘‘ఏమంట ఆ పిల్లోనికి?’’ అడిగింది.

‘‘బొమ్మలాట ఎట్లాడేది చెప్పాలంట … బొమ్మలు చూపించాలంట …’’

‘‘ఏం జెప్పినావు?’’

‘‘మా పెద్దోల్లను అడగమన్నే …’’

బండలమీద కూచుని బొడ్లోంచి అడపం బైటకు తీసింది కమలాబాయి.

చూపులు అడపంలోని వక్కాకును కెలికే మునివేళ్ళ మీదున్నా, మనస్సు మాత్రం కూతురి చుట్టూ మూగే యువకుల చూపుల మీదుంది.

తనకూ వేడిరక్తపు అనుభవాలున్నాయి. యవ్వన స్పర్శలున్నాయి. తలపుకు వచ్చిన మాత్రాన పులకరింతలతో గుబాళించే అపురూప సన్నివేశాల నిధులున్నాయి. ఇట్లాంటి వెకిలి దృశ్యాలు కాదుగదా మధురోహల్ని మూటగట్టేది.

ఎంత మార్మికంగా ఉండాలనీ – చూపుల సంభాషణలు!

ఎంత గమ్మత్తుగా ఉండాలనీ – సాన్నిహిత్యపు దృశ్యాలు!

ఆ యువకుని చూపుల్లో, కదలికల్లో, మాటల్లో – అనుమానపు దొంగతనపు కాంక్ష తప్ప మరో భావన కన్పించటం లేదు.

ఆ ఊహ మెదిలింది మొదలు కమలాబాయి గుండెల్లో సన్నని అదిరిపాటు ప్రారంభమైంది.