తెలుగు సినిమాకి అద్భుతమైన చరిత్ర వుంది. అందులో అపూర్వఘట్టాలు ఎన్నెన్నో ఉన్నాయి.
తెలుగు సినిమాలో ఎన్నో శాఖలు ఉన్నప్పటికీ, సంగీతం అనేది తెలుగు సినిమాకి ఆరో ప్రాణం. ఒక్క తెలుగనే కాదు, భారతీయ చలనచిత్రానికి ఆత్మ- సినిమాలో ఉన్న సంగీతం.
సినిమా సంగీతం అంటే రకరకాల పాటలు- నేపథ్య సంగీతం, వాద్య సంగీత విన్యాసాలు, తాళాలు, రాగాలు, స్వరాలు, గళాలు- ఎన్నో పక్షుల కువకువలు, కోకిల గానాలు, సెలయేటి గలగలలు- ఓహ్! అవన్నీ కలిస్తేనే సినిమా సంగీతం. ఊహా పథాలలో విహరింపజేసి, వెన్నెల మేడల్లో నివసింపజేసి, మేఘాల రథాల్లో ఊరేగింపజేసి, అతి సామాన్యుడి హృదయాన్ని సహితం పరవశింప చేసే అత్యంత మహిమాన్వితమైన సినిమా సంగీతం పండిత పామరులకు, జానపదులకు, నగరవాసులకు వారివారి హృదయాల్లో సుస్థిరస్థానాన్ని ఏర్పరచుకుని ఆనందం పంచుతుంటుంది. సినిమా అనేది అందరిదీను.
1931లో తెలుగువారి మొట్టమొదటి టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’. అప్పట్లో సినిమా అంటే నాటకమే. నాటకమంటే పౌరాణికమే. సినిమా అనే ప్రక్రియ జనాకర్షణమైనదని తెలుసుకున్న వెంటనే సినిమా నిర్మాణం మొదలుపెట్టారు. నిజానికి తొలి భారతీయ చిత్రం ‘ఆలం ఆరా’ విడుదలైన ఏడాదే తెలుగు చిత్రం ‘భక్త ప్రహ్లాద’ వచ్చింది. నాటకాన్ని, అదీ రంగస్థలం మీద ఆడగా, ప్రేక్షకులకు పరిచయమై, వారి మెప్పు పొందిన నాటకాన్ని ఫిల్మ్ మీదకెక్కించి, సినిమా హాళ్ళలో ప్రదర్శించడమే ఆనాటి సినిమా. ఈ ‘భక్త ప్రహ్లాద’ చిత్రం సురభి నాట్యమండలివారు ప్రదర్శించే నాటకం. ఇందులో లీలావతిగా నటించిన సురభి కమలాబాయి ‘పరితాప భారంబు భరియింప తరమా…’ అనే పాటను మొదటి సినిమా పాటగా చెప్తారు. కానీ అది సినిమా కోసం రూపొందించబడిన పాట కాదు. నాటకంతోబాటు సినిమాలోకి ప్రవేశించిన పాట.
క్రమంగా 38, 39 ప్రాంతాలలో సాంఘిక చిత్రాల వైపు దర్శక, నిర్మాతల దృష్టి మళ్ళింది. కుటుంబ కథాచిత్రాలు, సంఘ సంస్కరణకు సంబంధించిన కథల చిత్రాలు తీస్తే ప్రభుత్వంనుండి ఇబ్బందులు ఉండవని భావించి ‘గృహలక్ష్మి’, ‘మాలపిల్ల’, ‘వరవిక్రయం’లాంటి చిత్రాలు నిర్మించారు. కానీ అందులో పాత కాలపు నాటకాల పాటల నకళ్ళుగా, శాస్త్రీయ సంగీతంలోని గమకాలతో పాటలు వచ్చాయి కానీ ప్రత్యేకతను పొందలేదనే చెప్పాలి. ‘మళ్ళీ పెళ్ళి’, ‘రైతుబిడ్డ’, ‘వందేమాతరం’, ‘వరవిక్రయం’లాంటి సినిమాల్లో కూడా సంగీతం సామాన్యంగా నడిచిపోయిందిగానీ కొట్టొచ్చిన మార్పు కనిపించదు. నాటకాలనే సినిమాలుగా రూపొందిస్తూ, అప్పుడప్పుడే కొత్త తరహా సినిమా తీయడం మొదలుపెట్టారు. ప్రేక్షకులు కూడా తమకు తెలిసి ఉన్న కథ-నటులు-విని వున్న పాటలు, పద్యాలు ఎక్కువగా ఆదరించటంవల్ల, కొత్త తరహా ప్రయోగాలు చేయడానికి వందసార్లు ఆలోచించవలసిన పరిస్థితి. 1941 నుండి 49 వరకు ‘దేవత’, ‘భాగ్యలక్ష్మి’, ‘తహశీల్దార్’, ‘స్వర్గసీమ’లాంటి సినిమాల్లో కొన్ని పాటలు ప్రజల నోటబట్టి, వాటిని పదేపదే విని ఆనందించటం మొదలుపెట్టారు.
‘గృహలక్ష్మి’లో ‘లెండు భారతీయులారా! నిదుర లేవండోయ్ మీరు నిదుర!’ అంటూ చిత్తూరు వి. నాగయ్య పాడిన పాట పాప్యులరైంది. ఆర్. బాలసరస్వతీదేవి ‘భాగ్యలక్ష్మి’ చిత్రం కోసం పాడిన పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా, ‘తిన్నెమీద చిన్నోడా! వన్నెకాడా!’, ‘చేస్తాను పెళ్ళి చేస్తాను…’ అనే పాటలు అంతా మెచ్చుకున్నారు. ఈ పాటలు రచించినవారు సముద్రాల (సీనియర్), సంగీతం కూర్చినవారు బి.ఎన్.ఆర్. (భీమవరపు నరసింహారావు). ఈ పాటతో రావు బాలసరస్వతీదేవి మన తెలుగు సినిమా నేపథ్య గాయకుల్లో మొదటివారిగా నిలిచారు. నలభైల పూర్వార్థంలో తెలుగు సినిమా పాటకి ఒక కొత్త మెరుపు, సొగసు వచ్చి చేరాయి. 1948లో విడుదలైన ‘బాలరాజు’ సినిమాలో పాటలన్నీ తెలుగుదేశమంతా మారుమోగాయి. అత్యంత ప్రతిభ వుండి, విలక్షణమైన గొంతు గల ఎస్. వరలక్ష్మి ఈ ‘బాలరాజు’ సినిమా పాటలతో తారాపథానికి చేశారు. ఇందులో ఎస్. వరలక్ష్మి కాకుండా మరొకరు పాడిన పాట వుంది. అదేమంటే-
‘ఈ తీయని వెన్నెలరేయి
ఎడబాయని చిన్నెల హాయి
ఓ… రసపాయీ-
నటనమే బ్రతుకోయీ-‘
ఈ పాటను వక్కలంక సరళ పాడారు. ఆమెకెంతో పేరొచ్చింది. బాలరాజు సినిమాకి గాలిపెంచల నరసింహారావు, ఘంటసాల వెంకటేశ్వరరావు కలిసి సంగీతం సమకూర్చారు. వరలక్ష్మి అద్భుతంగా పాడేసిన ‘పతి రూపము నీయదయా…’ అనే రాగమాలిక మరెవ్వరూ పాడలేనంత బాగుంటుంది. అలాగే ‘ఎవరినే- నేనెవరినే’: ‘ఓ బాలరాజు జాలి లేదా బాలరాజా!…’ ఘంటసాలతో కలిసి పాడిన ‘చెలియా కనరావా…’ ఎంతో ప్రజాదరణ పొందాయి.
ఈ పాటకొక చరిత్ర వుంది. మొదట్లో అక్కినేని నాగేశ్వరరావు తన పాట తనే పాడుకునేవారు. అలాగే ‘చెలియా కనరావా!’ ఎస్. వరలక్ష్మితో కలిసి పాడి రికార్డు చేశారు. తీరా రికార్డయిపోయాక ఆయన మనసులో అనుమానం పీకడం మొదలైంది. ఆమె గొంతు గంభీరంగాను, తనది పీలగానూ ఉందని భావించారాయన. ఆ సంగతి ధైర్యంగా వెళ్ళి చెప్పడానికి భయం, బెరుకు. చివరకు ధైర్యం చేసి నిర్మాతైన ఘంటసాల బలరామయ్యగారితో చెప్పారు. ఆయన కూడా నిజమేనని భావించి మళ్ళీ అక్కినేనికి ఘంటసాల ప్లేబ్యాక్గా ఆ పాట పాడించారు. అయితే సినిమాలో ఘంటసాల-ఎస్. వరలక్ష్మీ పాడింది వుంటుంది. డిస్క్ లో నాగేశ్వరరావు, ఎస్. వరలక్ష్మీ పాడిందీ వుంది.
1949లో ఏడు సినిమాలు వచ్చాయి. ఇందులో నాలుగు సినిమాలు చక్కని సంగీతభరితమైనవి.
గతంలో గాలిపెంచలవారితో కలిసి సంగీతం చేసిన ఘంటసాల వెంకటేశ్వరరావు సొంతంగా సంగీతం నిర్వహించిన సినిమా ‘కీలుగుర్రం’. ఇది ఎంతో పేరు తెచ్చిన చిత్రం. జనరంజకమైన పాటలు కూర్చే సంగీత దర్శకునిగా ఆయన్ని అందరూ అభినందించారు. పాట, స్వరరచన కలిసి పయనించాయి.
ఈ సినిమాలో ‘కాదు సుమా! కల కాదు సుమా!’ అంటూ వక్కలంక సరళ, ఘంటసాల పాడిన యుగళగీతం తెలుగువారిని ఉర్రూతలూగించిందంటే అతిశయోక్తి కాదు. అక్కినేని నాగేశ్వరరావు, సూర్యశ్రీ (హీరోయిన్) కీలుగుర్రమెక్కి ఆకాశవీధిలో ఝామ్మని ఎగిరిపోతూ, ఈ యుగళగీతం పాడుతుంటే సినిమా హాల్లో ప్రేక్షకులు కూడా పరవశంతో గగన విహారం చేశారు.
అంతకుపూర్వం ఘంటసాల వారే పరిచయం చేసిన పి. లీల ఇందులో మహారాణికి ప్లేబ్యాక్ పాడారు. ‘దిక్కు తెలియదేమి సేతు- దేవదేవా కానరావా…’ అంటూ ఆమె విషాదంగా గంభీరంగా పాడిన విధానం అందరికీ నచ్చింది. అంజలీదేవి, నాగేశ్వరరావు ప్రధాన పాత్రలుగా ‘కీలుగుర్రం’ బాగా ఆడింది.
తెలుగు సినిమాపాట పరిణామక్రమంగా ఘంటసాల వెంకటేశ్వరరావును, రావు బాలసరస్వతీదేవినీ మొదటగా చెప్పుకోవాలి. అసలు పాటెలా పాడాలి? సాహిత్యానికున్న విలువేమిటి? పాటలోని భావాన్ని సున్నితంగా స్పష్టంగా ఎలా పలికించాలీ అనే వాటిని మొట్టమొదట పాడి చూపించినవారు ఘంటసాల. ఆయన సినిమా పాట పాడినా, భావగీతం పాడినా, భక్తిగీతం పాడినా, జానపదం పాడినా దానికదే సాటిగా నిలిచేది. ఆయన పాడిన విధానమే అందరికీ మార్గదర్శకమయ్యేది.
అదే సంవత్సరం (1949)లో విడుదలైన గుణసుందరి కథ కూడా మంచి సంగీతంతో అలరారింది. ఈ సినిమా దర్శకులు కె.వి. రెడ్డి. ఇందులో పాటలు వ్రాసినవారు పింగళి నాగేంద్రరావు-గుణసుందరి కథ షేక్సియర్ నాటకం ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాకి సంగీతం కూర్చినవారు ఓగిరాల రామచంద్రరావు. ఇందులో పాటలన్నీ అనునిత్యం ప్రజల పెదవుల మీద తారట్లాడాయంటే అబద్ధం కాదు.
‘కలకల ఆ కోకిలేమో… పలకరించే వింటివా…’ అనే పాటను శాంతకుమారి, మాలతి కలిసి పాడారు. వారిద్దరూ రాజుగారి పెద్ద కుమార్తె, రెండవ కుమార్తె- ఇంక మూడవ కూతురు గుణసుందరి శ్రీరంజని. నిజానికి మాలతి గాయని కాదు. ఏదో ఓ మోస్తరుగా పాడగలిగిన ప్రతిభ. కానీ శాంతకుమారి చాలా చక్కని గాయని. ఆమె కంఠం బంగారుతీగె మెరిసినట్లుంటుంది. సంగీతంలో మంచి శిక్షణ పొంది, శ్రుతి, తాళ, రాగాలయందు మంచి అవగాహన గల మృదుమధురమైన గాయని. వారిద్దరినీ (శాంతకుమారి-మాలతి) పెట్టి ఈ పాట చక్కగా రికార్డు చేసి శ్రోతల్ని మెప్పించటం సంగీత దర్శకుల ప్రతిభ. ఇందులో పి. లీల చేత చాలా గంభీరమైన, అందమైన పాటలు పాడించారు ఓగిరాల రామచంద్రరావు.
‘శ్రీ తులసి… ప్రియ తులసి…
జయము నీయవే… జయము నీయవే…
ఉపకార గుణాలయలై వున్నావు కదే మాతా!
అపరాధములన్నీ మరచి ఆదరించవే…
ఓ మాతా…’
అప్పట్లో స్త్రీలందరూ రోజూ తులసి కోట దగ్గర ‘శ్రీ తులసి ప్రియతులసి జయము నీయవే…’ అని పాడుకుని పూజ చేసుకునే వారంటే అతిశయోక్తి కాదు.
1949లోనే విడుదలైన లైలామజ్నూలోని సంగీతం చాలా విభిన్నంగా, విలక్షణంగా వినిపించింది. అందరి దృష్టినీ ఒక్కసారి అటు తిప్పుకుంది. అప్పటికే ప్రేక్షకుల అభిమానం, ఆదరణ పొందిన, అక్కినేని నాగేశ్వరరావు- భానుమతి ఇందులో హీరో హీరోయిన్లు. అందులో భానుమతి పాటకి అప్పటికే అభిమానులేర్పడిన సందర్భం- లైలామజ్ను సినిమాకి సంగీతం కూర్చినవారు. సి.ఆర్. సుబ్బరామన్- తమిళ తెలుగుభేదం ఆ రోజుల్లో అస్సలు లేదు. మద్రాసు-ఆంధ్రా కలిసి వున్న సమయం. వారికీ భాష, వీరికా భాష బాగా తెలుసు. సి.ఆర్. సుబ్బరామన్ గొప్ప జీనియస్. ఆయనకి రకరకాల సంగీతాలతో పరిచయం వుంది. కర్ణాటక సంగీతం, హిందూస్తానీ బాగా అధ్యయనం చేసిన దర్శకులు. అదీకాక పాటను కంపోజ్ చేయడంలో కొత్తదనం, మెలొడీ, ఆయన తన బాణీలో కూర్చున్నారు. లైలామజ్ను సినిమాకి రచన చేసినవారు సముద్రాల రాఘవాచార్య, దర్శకత్వం పి. రామకృష్ణ.
లైలామజ్ను సంగీతం- అందులోని వాద్యాలు- వాతావరణానికి సరిపడేలా నేపథ్య సంగీతం అందర్నీ ఎంతో ఆకట్టుకుంది. పైగా తిరుగులేని బాణీల ముందు సాహిత్యమే ఒక మెట్టు తక్కువ స్థాయిలో వుందేమోననిపిస్తుంది.
1950లోకి వచ్చామంటే నిజమైన సంగీత స్వర్ణయుగంలోకి అడుగు పెట్టినట్టే. కొత్తదనంతో తళతళ మెరిసిపోతూ కొత్త రచయితలు- కొత్త కొత్త ఊహలతో బాణీలతో సంగీత దర్శకులు వచ్చిన సంవత్సరమది. సుమారు ఇరవై సినిమాల వరకు విడుదలైన ఈ ఏడాది అయిదారు చిత్రాలు అద్భుతమైన పాటలతో ప్రజల ముందు కొచ్చాయని చెప్పచ్చు.
ఏ.వి.ఎం. వారి జీవితం చమత్కారమైన పాటలతో శ్రోతల్ని అలరించింది. ‘డడడాం… డడడాం…’ అంటూ ప్రతీవారూ పాడారు. ‘చక్కనైన కోయరాజుని ఎక్కడైన చూశారా…’, ‘నీ కన్నే నిన్నే భ్రమించినా నాపై కోపం నీకెందుకు…’ ‘డడడాం…’ అంటూ భలే ఉత్సాహపడ్డారు. ఈ సినిమాకి సంగీతం కూర్చినవారు ఆర్. సుదర్శనం, రచయిత తోలేటి.
విజయావారి మొదటి సినిమా షావుకారు విజయఢంకా మోగించింది. ఇది ఘంటసాల సంగీతం కూర్చిన అత్యంత మెలోడియస్ పాటలున్న చిత్రం. ఈ చిత్ర హీరో ఎన్టీ రామారావు. హీరోయిన్ షావుకారు జానకి ఈ సినిమాతోనే పరిచయమయ్యారు. ఇందులో ‘పలుకరాదటే చిలుకా… సముఖములో రాయబార మెందులకే…. దీపావళి… దీపావళి…’ అనే పాట సంతోషం, విషాదం కూడా ఎంతో బాగుంటాయి. ఘంటసాల పాడిన ‘పలుకరాదటే చిలుకా…’ మెలోడీకి పెట్టింది పేరుగా నిలిచింది.
సంసారం సినిమాలో రెండు పాటలు శంకర్ జైకిషన్ పాటలకి కాపీలయినప్పటికీ, అవి కూడా బాగుంటాయి. ‘కల నిజమాయెగా… కోరిక తీరెగా… (జియా బేకరార్ హై)’, ‘ఇటు పై నా గతేమీ… (అబ్ మేరా కౌన్ సహారా)’. డబ్బింగైనా సదాశివబ్రహ్మం రచన బాగుంటుంది. అసలుగా చెప్పుకోవాల్సిన పాట ‘సంసారం సంసారం… ప్రేమసుధాపూరం నవజీవన సారం… సంసారం…’ ఈ ‘సంసారం’ చిత్రానికి సుసర్ల దక్షిణామూర్తి సంగీతం కూర్చారు.
‘స్వప్నసుందరి’ సినిమా ఒక జానపద కథ. అంజలీదేవి, అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ చిత్రం సంగీతపరంగా గొప్ప విజయాన్ని సాధించింది. సంగీతం సి.ఆర్. సుబ్బురామన్. ఆర్. బాలసరస్వతీదేవి పాడిన ‘నటనలు తెలుసునులే ఓ సొగసరి, గడసరివాడా…’ అనే పాట ఎంతో ఆధునికంగా వుంటుంది. ఇందులో వాడిన ఆర్కెస్ట్రా, పాట ట్యూన్ చాలా కొత్తగా వుంటాయి. సి.ఆర్. సుబ్బరామన్ పాట కట్టే విధానం, ఆర్కెస్ట్రాను ఉపయోగించే పద్దతి మిగిలినవారినుండి వేరుగా వుంటాయి. మన సంగీతంలో పాశ్చాత్య సంగీత పద్ధతిని కలపడంలో ఆయనకాయనే సాటి. కౌంటర్ మెలోడీని అవలీలగా ప్రయోగించిన సంగీత దర్శకులు సి.ఆర్. సుబ్బరామన్.
1951లో రెండు మహత్తరమైన సినిమాలు సంగీతంతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించాయన్న మాట నిజం. ఒకటి వాహినీవారి ‘మల్లీశ్వరి’, రెండు విజయావారి ‘పాతాళభైరవి’. ‘మల్లీశ్వరి’ సినిమాకి సంగీతం సాలూరి రాజేశ్వరరావు. ‘పాతాళభైరవి’ సినిమాకి ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించారు. ‘మల్లీశ్వరి’కి రచన, పాటలు దేవులపల్లి కృష్ణశాస్త్రి, ‘పాతాళభైరవి’కి పింగళి నాగేంద్రరావు.
ఈ రెండు సినిమాలు కథాపరంగా, నటనాపరంగా, సాహిత్యపరంగా, సంగీతపరంగా చాలా విభిన్నమైన చిత్రాలు. రెండింటిలోనూ ప్రేమే. అయితే ఎంతో తేడా. వాటిననుసరించి సంగీత, సాహిత్యాలు అల్లుకున్న తీరు మహాద్భుతం.
‘ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు..’, ‘పిలిచిన బిగువటరా…’, ‘ఎందుకే నీకింత తొందర…’, ‘ఊరు చేరాలి…’, ‘కోతిబావకు పెళ్ళంటా…’, ‘అవునా- నిజమేనా…’, ‘మనసున మల్లెల మాల లూగెనే…’, ‘జుమ్ జుమ్ జుమ్ తుమ్మెదా తుమ్మెదా…’ (ఇది టి.జి. కమలాదేవి పాడిన పాట.) మిగిలిన పాటలన్నీ భానుమతితో కలిసి ఘంటసాల పాడినవి.
‘మల్లీశ్వరి’ సంగీతం గురించి మాటలతో చెప్పడం కష్టం. విని ఆ గొప్పతనాన్ని అనుభవించాలి. అది మాటలకందని గొప్ప అనుభూతి. అందులో రాగాల గురించి, పద విన్యాసాల గురించి, గాయనీ గాయకుల గళ సౌందర్యం గురించి చెప్పడం అర్థంలేని విషయం. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలం. అదేమంటే ఈనాటికీ అంటే అరవై ఏళ్ళు గడిచినా ఆ పాటలు నిత్యనూతనంగా, శ్రోతకి ఆహ్లాదం కలిగిస్తున్నాయన్న నిజం.
ఇక ‘పాతాళభైరవి’. ఒక అపురూప కళాసృష్టి. మనకి కనిపించనివి, ఊహకి అందనివీ అందులో కనిపిస్తాయి. ఇందులో హీరో ప్రేమ కోసం పిచ్చివాడయ్యాడు. ఎంతటి సాహసమైనా చేసి ప్రేమని దక్కించుకోవాలని ధైర్యంగా ఒక మాయావిని నమ్మి ముందుకు నడుస్తాడు. ఇందులో- ‘తీయని ఊహలు హాయిని గొలిపే…’ రాజకుమారి వనవిహారగానం, ‘ఎంత ఘాటు ప్రేమయో… ఎంత తీవ్ర వీక్షణమో…’ పింగళి మాటల తీరేవేరు. ప్రేమకి ఘాటూ, చూపుకి తీవ్రత పూసి గమ్మత్తైన ప్రేమగీతం వ్రాశారు.
‘కలవరమాయే మదిలో… నా మదిలో…’, ‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు…’, ‘వినవే బాలా! నా ప్రేమగోల…’, ‘హాయిగా మనకింక స్వేచ్చగా…’ ఇలా ‘పాతాళభైరవి’ సినిమా నిండా మధురాతి మధురమైన పాటలే.
‘మల్లీశ్వరి’ పాటలూ మధురమే. కానీ రెండింటికీ ఎంతో తేడా. ఈ రెండు సినిమాల్లోనూ హీరో ఎన్టీ రామారావే. పాడింది ఘంటసాల- ‘మల్లీశ్వరి’లో పి. భానుమతి జత, ‘పాతాళభైరవి’లో పి. లీల. అంతేమరి. 1952 నుండి సుమారు ఒక పుష్కరకాలం గుత్తులు గుత్తులుగా పాటలు తెలుగు సినిమాలలో విరగబూసి పరిమళాలు వెదజల్లాయి.
1953లో వచ్చిన ‘దేవదాను’ సినిమా గొప్ప విజయం సాధించిన విషాదాంత చిత్రం. ఈ సినిమా విజయంలో సగభాగం సి.ఆర్. సుబ్బరామన్ ఇచ్చిన సంగీతానికే దక్కుతుంది. ఈ సినిమా పాటలు రికార్డవుతూండగానే సుబ్బరామన్ మరణించారు. ఈ చిత్రాన్ని ఆయనకే అంకితమిచ్చారు. ఆ తరువాత ఈ చిత్రానికి నేపధ్య సంగీతం విశ్వనాధన్ సమకూర్చారు.
‘నా యిల్లు’ సినిమాలో నాగయ్య, జిక్కి, బాలసరస్వతీదేవి పాడిన ‘అదిగదిగో గగనసీమా… అందమైన చందమామా…’ అనేది కృష్ణశాస్త్రి రచన. అప్పట్లో అన్ని తెలుగిళ్ళల్లోనూ మారుమోగింది. ఈ పాట శాస్త్రీయమైన సారంగరాగంలో సున్నితంగా, అందంగా వుంటుంది.
‘బ్రతుకుతెరువు’ సినిమాలో సి. ఆర్. సుబ్బరామన్ సంగీతంలో ఘంటసాల పాడిన ‘అందమె ఆనందం… ఆనందమె జీవిత మకరందం…’ అనే పాట ఆంధ్రుల హృదయాల్ని ఎంతగానో అలరించింది. దీని రచన సముద్రాల జూనియర్. ఈ పాట పి. లీల కూడా పాడారు.
‘పందిట్లో పెళ్ళవుతున్నది…’ అన్న పాటవినని వారుండరు. రాజ్‌కపూర్ సినిమా ‘ఆహ్’ను ‘ప్రేమలేఖలు’ పేరుతో తెలుగులో కూడా రూపొందించారు. దీనికి సంగీతం శంకర్ జైకిషన్. పాటలన్నీ ఆరుద్ర రాశారు. ఇందులో లత స్థానంలో జిక్కి, ముఖేష్ స్థానంలో ఎ.ఎం. రాజా పాడారు. బొంబాయి వారికేమాత్రం తీసిపోకుండా ఓ మెట్టు పైన ఉండేలా పాడారు జిక్కీ, రాజా.
‘అనార్కలి’, ‘అర్ధాంగి’, ‘దొంగరాముడు’ చిత్రాలలో తన మధురమైన కంఠంతో అపారంగా వున్న ప్రతిభతో జిక్కి చక్కని పాటలు పాడారు. ‘జీవితమే సఫలము…’, ‘వద్దురా కన్నయ్యా…’, ‘రారోయి మా ఇంటికీ…’ అంటూ అందరి పెదవులపైనా ఆడాయి ఆ పాటలు.
‘జయసింహ’లో ‘ఈనాటి ఈ హాయి కలకాదోయి నిజమోయి…’ అనే ఘంటసాల, లీల పాడిన పాట సంగీత దర్శకులు టి.వి. రాజును ఉన్నతస్థానంలో నిలిపింది.
వేణు సంగీతంలో వచ్చిన ‘రోజులు మారాయి’ చిత్రంలో ‘ఏరువాకా సాగరో అన్నో చిన్నన్న…’ అనే పాట అందరి చేతా నాట్యాలే చేయించింది. అందులో వహీదా రెహమాన్ డ్యాన్సు ఆంధ్రులకు ఒక అపురూప ఘట్టం.
‘మిస్సమ్మ’ (1955) చిత్రం గురించి, అందులోని పాటల గురించి తెలుగువారికి చెప్పడం హాస్యాస్పదం. ఎందుకంటే ఆ సినిమా పాటలు తెలియనివారు ఈ తరంలోనూ ఎవ్వరూ వుండరు. ‘రావోయి చందమామా… మా వింత గాథ వినుమా…’, ‘బృందావనమది అందరిది, గోవిందుడు అందరివాడేలే…’, ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే…’, ‘ఏమిటో ఈ మాయా…’ ఈ ‘మిస్సమ్మ’ సినిమా కోసం సాలూరి రాజేశ్వర్‌రావు అపురూపమైన, శాశ్వతమైన ట్యూన్స్ చేశారు. ఇందులో ఎ. ఎం. రాజాకి గాయకునిగా ప్రథమస్థానం ఏర్పడింది. ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో ఈ సినిమా ఒక మాణిక్యంలా మిగిలిపోయింది. సంగీతపరంగా ఇంత విజయం సాధించటం మామూలుగానైతే అరుదు.
ఈ సంవత్సరమే ‘సంతానం’ సినిమాలో లతా మంగేష్కర్ చేత సుసర్ణ దక్షిణామూర్తి ‘నిదురపోరా తమ్ముడా…’ అనే పినిసెట్టి సాహిత్యం అత్యంత విలక్షణంగా ట్యూన్ చేసి పాడించారు.
మల్లాది రామకృష్ణశాస్త్రి రచనలో ఘంటసాల సంగీతంతో-ఘంటసాల, పి.లీల గళాల మాధుర్యంతో శ్రోతల్ని అలరించిన సినిమా ‘చిరంజీవులు’. (‘తెల్లవారవచ్చె…’, ‘కనుపాప కరవైన…’, ‘చికిలింత చిగురు…’, ‘ఎందాకా ఎందాకా…’)
‘తెనాలి రామకృష్ణ’లో ‘చందనచర్చిత’ (అష్టపది), ‘చేసేది ఏమిటో చేసేయి సూటిగా…’, తెనాలి రామకృష్ణుడి పద్యాలు ఎంతో ఆహ్లాదపరిచాయి. ‘భలే రాముడు’లో ఎస్. రాజేశ్వరరావు సంగీత సారధ్యంలో ‘ఓహో మేఘమాలా…’ అంటూ పి. లీల, ఘంటసాల విడివిడిగా పాడారు. ఇది సదాశివబ్రహ్మం రచన.
‘పెంకి పెళ్ళాం’లో ఆరుద్ర తమాషా పాట- ‘పడుచుతనం రైలుబండి పోతున్నది…’, అలాగే ‘ముద్దుబిడ్డ’లో ‘చూడాలని వుంది…’ అనే పెండ్యాల బాణీ బాగా వినిపించాయి.
‘ఎం.ఎల్.ఎ’లో ‘నీ యాశా అడియాశ… చేజారే మణి పూసా…’ (ఈ పాటతో ఎస్. జానకి నేపథ్యగాయనిగా పరిచయమయ్యారు). ‘తోడికోడళ్ళు’ చిత్రంలో ‘ఆడుతు పాడుతు పని చేస్తుంటే…’, ‘కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిదానా…’ (ఆత్రేయ రచన) వేణు సంగీతంలో ఎంతో పాప్యులరయ్యాయి.
‘హే! కృష్ణా! ముకుందా మురారీ…’ అంటూ ఘంటసాల గళం ఖంగున మోగింది టి.వి. రాజు సంగీతంలో ‘పాండురంగ మహాత్మ్యం’ సినిమాలో. పాటలు బాగా రాణించాయి. ‘వన్నెల చిన్నెల దొరా…’, ‘నీవని నేనని తలచితిరా…’ ఇలా ఎన్నో.
లేత కంఠంతో పి. సుశీల పెండ్యాల సంగీతంలో ‘భాగ్యరేఖ’ చిత్రం కోసం ‘నీ వుండేదా కొండపై నా సామి నేనుండే దీ నేలపై…’ అంటూ పలికి ముగ్ధుల్ని చేశారందర్నీ. ఇది దేవులపల్లి వారి రచన.
ఇక ‘మాయాబజార్’ సినిమాలోని పాటల గురించి వివరణ అనవసరం. సినిమాలో పాటలన్నీ పింగళి నాగేంద్రరావు వ్రాయగా, ఘంటసాల సంగీతం కూర్చారు. అయితే ముందుగా సాలూరి రాజేశ్వర్‌రావు కొన్ని పాటలు చేసి, కారణాంతరాల వల్ల విడిచిపెట్టేశారనీ అంటారు.
‘సువర్ణసుందరి’ పాటలు ఆదినారాయణరావు సంగీతంలో ఎంతో గొప్పగా తయారయ్యాయి. ‘పిలువకురా… అలుగకురా…’, ‘హాయిహాయిగా ఆమని సాగే…’ అంటూ సాగిన ఈ సంగీతం హిందీ శ్రోతల్ని కూడా ఎంతో అలరించింది. ‘చెంచులక్ష్మి’ సినిమాలో సుశీల పాడిన ‘పాలకడలిపై…’, లక్ష్మీనారాయణుల డ్యూయెట్ మహా పాప్యులర్. ‘భూకైలాస్’ గొప్ప నాటకీయతతో కూడిన భక్తి సినిమా. ‘సుందరాంగ అందుకోరా’, ‘దేవమహదేవ…’, ‘రాముని అవతారం…’ ఇలా అన్నీ మంచి పాటలే.
‘అప్పు చేసి పప్పుకూడు’లో పాటలన్నీ హిట్సే. ముఖ్యంగా ‘కాశీకి పోయాను రామా హరీ…’ అనేది ఎన్నటికీ మరువలేని పాట. సంగీతం రాజేశ్వర్‌రావు. ఇల్లరికంకి టి.వి. చలపతిరావు సంగీతం కూర్చారు. ఇందులో ‘నిలువవే వాలుకనులదానా…’ మహా పాప్యులరైన పాట. పెండ్యాల సంగీతంతో మల్లాది రామకృష్ణశాస్త్రి పాటల రచనతో ‘జయభేరి’ నిజంగా సంగీత జయభేరి మోగించింది.
‘మహాకవి కాళిదాసు’ మంచి పద్యాలతో, శ్లోకాలతో, పాటలతో వచ్చింది. బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘రాజమకుటం’ సినిమాకి మాస్టర్ వేణు సంగీతం చేశారు. ‘ఊరేది పేరేది ఓ చందమామా…’, ‘సడిసేయకో గాలి…’ వంటి గొప్ప పాటలు దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్రాశారు. ‘శాంతినివాసం’లోని పాటలు బాగా జనాదరణ పొందాయి. అందులో ఒకటి రెండు హిందీ సినిమా పాటల నకళ్ళుగా వున్నా ఘంటసాల కట్టిన అందమైన బాణీలు అందర్నీ ఆకట్టుకొన్నాయి. ‘రాగాలా సరాగాలా…’, ‘కలనైనా నీ వలపే…’, ‘శ్రీ రఘురాం జయ రఘురాం…’ లాంటివి కొన్ని.
‘వేంకటేశ్వర మహాత్మ్యం’లో పెండ్యాల పాటలు చక్కగా వున్నాయి. ‘ఎవరో అతడెవరో…’, ‘శేషశైలా వాసా శ్రీ వేంకటేశా…’, ‘ఎన్నాళ్ళని నే కన్నులు కాయగ…’ లాంటి చక్కటి పాటలున్నాయి.
‘ఇద్దరు మిత్రులు’ చిత్రానికి ఎస్. రాజేశ్వర్‌రావు సంగీతం కూర్చారు. దాశరధి కొత్త పలుకుబడి పాటల్లో రాణించింది. (‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ…’, శ్రీశ్రీ వ్రాసిన ‘పాడవేల రాధికా…’, ‘కుహు అనే కోయిలా…’)
పెండ్యాల సంగీత సారధ్యంలో విజయావారి మరో జానపద చిత్రం ‘జగదేకవీరుని కథ’. ‘శివశంకరీ… శివానంద లహరి…’, ‘జలకాలాటలలో…’, ‘రారా కనరారా… కరుణ మానినారా…’, ‘వరించి వచ్చిన మానవ వీరుడు…’ లాంటి సంగీతభరితమైన పాటలు ఆంధ్రులనెంతో అలరించాయి.
భరణీవారి ‘బాటసారి’ మంచి పాటలతో విజయం సాధించింది. బెంగాలీ పాటల ట్యూన్సే ఎక్కువ వున్నా, వేణు చక్కని తెలుగుదనం తీసుకొచ్చారు.
‘భార్యాభర్తలు’ చిత్రం అప్పట్లో కొత్త రకం కథాంశంతో వచ్చింది. ఇది ఎస్. రాజేశ్వర్‌రావు చాలా గొప్పగా సంగీతం కూర్చిన చిత్రం. ‘ఏమని పాడెదనో ఈవేళ…’ అనే శ్రీశ్రీ రచన, దానికి సమకూర్చిన బాణీ, పాడిన విధానం అద్భుతమనే చెప్పాలి.
‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రంలో ‘మనసున మనసై…’ ఒక గొప్ప పాట. ఆ సినిమాలోని పాటలన్నీ గొప్ప పాటలే. ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘ఆరాధన’, ‘కులగోత్రాలు’, ‘భీష్మ’ సినిమాలు సాలూరి సంగీతంలో మధురమైన పాటలు సంగీతాభిమానులకు అందాయి.
‘సీతారామ కల్యాణం’ సినిమాలో గాలిపెంచెల నరసింహారావు బాణీ కట్టిన ‘సీతారాముల కల్యాణం చూతము రారండి…’ పాట ఈనాటికీ, ఏనాటికీ ప్రతి పెళ్ళిపందిరిలోనూ వినిపిస్తుంది.
‘వెలుగునీడలు’ సినిమాలో ‘కలకానిది… విలువైనది’, ‘పాడవోయి భారతీయుడా…’ (శ్రీశ్రీ రచన, పెండ్యాల సంగీతం) తాత్విక భావాల్ని, దేశకాల పరిస్థితుల్ని అక్షరబద్ధం చేసిన అపురూప రచనలు.
1965 వరకు వచ్చిన గొప్ప పాటలతో పోలిస్తే ఆ తర్వాత సినిమాల నిర్మాణం పెరిగినా పాటలకి నాణ్యత తగ్గిందని చెప్పు కోవాలి.
‘నర్తనశాల’, ‘అమరశిల్పి జక్కన’, ‘దేశద్రోహులు’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘మూగమనసులు’, ‘అంతస్తులు’, ‘ఇల్లాలు’, ‘తేనెమనసులు’, ‘తోడూ-నీడా’, ‘నాదీ ఆడజన్మే’, ‘పాండవ వనవాసం’, ‘ప్రేమించి చూడు’, ‘సుమంగళి’, ‘లేత మనసులు’, ‘పూలరంగడు’, ‘భక్తప్రహ్లాద’, ‘రంగులరాట్నం’, ‘సాక్షి’, ‘అదృష్టవంతులు’, ‘రాము’, ‘బుద్ధిమంతుడు’, ‘మూగనోము’, ‘ఏకవీర’, ‘సంపూర్ణ రామాయణం’, ‘అందాలరాముడు’, ‘ముత్యాలముగ్గు’, ‘అడవిరాముడు’, ‘సీతామాలక్ష్మి’- ఇలా ఎన్నో సినిమాలు మంచి పాటలతో మనల్ని అలరించాయని చెప్పాలి.
1980ల తర్వాత ‘శంకరాభరణం’, ‘శుభలేఖ’, ‘సాగరసంగమం’ – ఇలా కె. విశ్వనాథ్ సినిమాల్లో మాత్రమే మంచి సాహిత్యం, సంగీతం వుంటుందనే అభిప్రాయానికి ప్రేక్షకులొచ్చేశారు. అలాగే ‘స్వాతిముత్యం’, ‘సిరిసిరిమువ్వ’, ‘సప్తపది’ సంగీత ప్రధానంగా నడిచాయి.
ఇళయరాజా సంగీతం మనకి దిగుమతయ్యాక, మళ్ళీ బాణీల్లో కొత్తదనం వచ్చింది. 1986లో 116 చిత్రాలు విడుదలైనప్పటికీ నోట పట్టి హాయిగా పాడుకునేది ఒక్క పాట కూడా లేదంటే బాధాకరమే. వేరే భాష మీదకి మన తెలుగు అద్దినట్లుగా పాటలు వినిపించేవి. సాహిత్యంలో, సంగీతంలో తెలుగుదనం కోల్పోయిందప్పుడే.
ఘంటసాల ఫిబ్రవరి 11, 1973న మరణించాక, తెలుగు వారి ఏకైక గాయకునిగా ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం స్థిరపడ్డారు. ప్రతిభావంతులైన సంగీత దర్శకులు క్రమంగా కనుమరుగవడం వల్ల ఎస్.పి.బి. పాడగలిగినన్ని మంచి పాటలు, గొప్ప పాటలు పాడలేదేమోననిపిస్తుంది. మొదట్నించీ ఎం.ఎస్. రామారావు, పిఠాపురం నాగేశ్వర్రావు, మాధవపెద్ది సత్యం, ఘంటసాల వెంకటేశ్వర్రావు, పి.బి. శ్రీనివాస్, ఎ.ఎం. రాజా తెలుగు పాటని ఎంతో సుసంపన్నం చేశారు. అంత క్రితం తెలుగు సినిమా పాటకి నాగయ్య చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఆయన పాటలకి అప్పట్లో జనాలు బ్రహ్మరథం పట్టారన్నది నిజం.
1970ల తర్వాత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో పి. రామకృష్ణ, మనో, అప్పుడప్పుడు జేసుదాసు తెలుగు పాటలు పాడారు.
ఇక గాయనీమణుల గురించి చెప్పాలంటే నటిస్తూ, తనకు తామే పాడుకున్నవారిలో ప్రముఖులు పి. భానుమతి, ఎస్. వరలక్ష్మి, శాంతకుమారి మొదటితరంలో పేరు సంపాదించుకున్నారు. రావు బాలసరస్వతీదేవి, కె. రాణి, రాజేశ్వరి, టి.ఎస్. భగవతి, వైదేహి, ఎం. ఎల్. వసంతకుమారి- తర్వాత పి. లీల, పి. సుశీల, ఎస్. జానకి, జమునారాణి, ఎల్.ఆర్. ఈశ్వరి, వాణీ జయరాం, బి. వసంత, ఎస్.పి. శైలజ, ఆ తర్వాత చిత్ర ఎక్కువ కాలం తెలుగు సినిమా పాటలు పాడారు. పోనుపోను 90ల తర్వాత పాటలో చమత్కారం, వేళాకోళం, సంభాషణ పద్ధతి ఎక్కువగా చోటు చేసుకున్నాయి.
అదే విధంగా సంగీత దర్శకులుగా చిరకాలం తెలుగు సినిమా పాటకి ఎంతో సేవ చేసి తమ ముద్ర వేసుకున్నవారు వున్నారు.
గాలిపెంచల నరసింహారావు, వి. నాగయ్య, అద్దేపల్లి రామారావు, ఓగిరాల రామచంద్రరావు, భీమవరపు నరసింహారావు (బిఎన్ఆర్), సాలూరి రాజేశ్వరరావు, సి.ఆర్. సుబ్బరామన్, ఆర్. సుదర్శనం & గోవర్ధనం, పెండ్యాల నాగేశ్వర్రావు, విశ్వనాథన్ (కొన్నాళ్ళు రామ్మూర్తితో కలిసి), కె.వి. మహదేవన్, రమేష్‌నాయుడు, ఘంటసాల వెంకటేశ్వర్రావు, టి.వి. రాజు, టి. చలపతిరావు, చక్రవర్తి, జె.వి. రాఘవులు, జి.కె. వెంకటేష్, ఇళయరాజా- ఇలా ఎందరో సంగీతం కూర్చారు. 1990ల తర్వాత కీరవాణి ఇళయరాజా పద్ధతిలోనే ఎక్కువ సంగీతం సమకూరుస్తున్నారు.
తెలుగు సినిమా పాట, వేరే భాషలోని పాటలా వినిస్తోందని చాలామంది వాపోతుంటారు. విజ్ఞులైనవారు మన భాషా స్వభావాన్ని కోల్పోకుండా చూసుకొనే బాధ్యత తీసుకోవాలి.
సాహిత్యపరంగా, సంగీతపరంగా (ట్యూన్ చేసే విధానం), పాడే పద్ధతిపరంగా, ఆర్కెస్ట్రా వుపయోగించటంలో తెలుగు సినిమా పాట మళ్ళీ పూర్వవైభవాన్ని పొందుతుందని ఆశిద్దాం. నాగరికత నాణ్యత పెంచేదిగా వుండాలిగానీ నాసిరకంగా, సంస్కృతిని కోల్పోయేదిగా వుండకూడదని ఆశిద్దాం.
మళ్ళీ మనకి చక్కని, అందమైన తెలుగు సినిమా పాటలు వస్తాయని మనసారా కోరుకుందాం.
*
