ముందు మాట
సరస్వతీదేవికి భాసుడు నవ్వులాంటివాడైతే, కాళిదాసుడు విలాసంలాంటివాడని పేరు (భాసో హాసః కాళిదాసో విలాసః).
ఈనాటకం దాదాపు 2500 ఏళ్ళక్రితం భాస మహాకవి రాసాడని నమ్మకం. ఈనాటకాన్ని చదివేటప్పుడు చదువరులందరూ ఈవిషయాన్ని గుర్తుంచుకుని చదివితే, భాసుడి గొప్పతనం బాగా తెలుస్తుంది. ఈనాటకం చదువుతూంటే ఎన్నో ప్రయోగాలు మనకు ఎప్పట్నుంచో తెలిసినవి, అందరినోళ్ళలో నలిగి నానినవి అనిపిస్తాయి. ఇందుకు అసలు కారణం, భాసుడి తర్వాత వచ్చిన కవులు చాలామంది భాసుణ్ణి అనుసరించి రాయటమే నని మనం గుర్తుంచుకోవాలి. మనల్ని అపరాధపరిశోధనల్లో ముంచెత్తిన షెర్లాక్ హోమ్స్ వంటి వారి deductive reasoning వంటి ప్రయోగాలుకూడా ఆనాడే భాసుడు చెయ్యడం ఈనాటకంలో గమనిస్తాం.
ఈనాటకం “ప్రతిజ్ఞా యౌగంధరాయణం” అనే మరో భాస నాటకానికి తరవాతి భాగం లాటిది. అందువల్ల, కొద్దిగా దాని గురించి తెలుసుకుంటే ఈ నాటక కథ సులువుగా అర్థం ఔతుంది.
వత్సదేశపురాజు ఉదయనుడు. అతను అవంతీదేశపురాజు మహాసేనుడి (లేదా ప్రద్యోతనుడు) చేతిలో ఓడిపోతాడు. అయినా మహాసేనుడు ప్రేమతో ఉదయనుణ్ణి ఉజ్జయనికి తీసుకువచ్చి, తన పిల్లల్తో సమానంగా చూస్తాడు. ఉదయనుడు మహాసేనుడి కూతురు వాసవదత్తకి వీణ నేర్పుతానని చెప్పి ఆ అమ్మాయిని వల్లోవేసుకుని తీసుకుని పారిపోయి పెళ్ళిచేసుకుంటాడు.
ఇది జరిగిన కొన్నాళ్ళ తర్వాత మొదలైతుంది “స్వప్న వాసవదత్తం”. ఆ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మెల్ల మెల్లగా బయటికొస్తాయి కనక పాఠకులు కొంచెం శ్రద్ధగా చదివితే ఏఏ పాత్రలు ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నాయో తెలుస్తుంది.
ఇంక భాస మహాకవి నాటకీకరణ కౌశలాన్ని గ్రహించి ఆనందించండి.