స్వప్నవాసవదత్తం -3

రెండవ అంకం

(చేటి ప్రవేశిస్తుంది)
చేటి   కుంజరికా! ఎక్కడ? పద్మావతీదేవి ఎక్కడ? ఏమంటున్నావు? మాధవీలతా మండపం ప్రక్కన బంతాట ఆడుతున్నారా? అక్కడికే వెళతాను. అమ్మో! పద్మావతీ దేవి బంతి ఆడుతూ యిటే వస్తున్నారే! బాగా ఆడి అలసిపోయి చెదిరిపోయిన ఆభరణాలూ, ముఖం మీద చెమటతో అందంగా, ఆనందంగా ఉంది. నేనే ఆమెని కలుసుకుంటా (వెళ్ళిపోతుంది).

(బంతి ఆడుతూ సేవకురాళ్ళతో, అవంతికతో(వాసవదత్తతో) పద్మావతి ప్రవేశిస్తుంది.)

వాసవదత్త   ఇదిగో నీబంతి.

పద్మావతి   ఇలా యియ్యి.

వాసవదత్త   ఈబంతితో ఆడి ఆడి నీచేతులు ఎర్రగా అయిపోయాయి. అవి నీచేతుల్లా లేవు. పరాయివాళ్ళవిలా ఉన్నాయి.

చేటి   ఆడండాడండి, రాజకుమారీ! కన్నెవయసులోనే ఇలాంటివి చెయ్యడానికి వీలుంటుంది.

పద్మావతి   (వాసవదత్తతో) నన్ను వేళాకోళం  చెయ్యడానికా ఈవర్ణనంతా?

వాసవదత్త   లేదు, లేదు. ఈరోజు నువ్వు వెలిగిపోతున్నావు. నీక్కాబోయేవాడి ముఖం నీచుట్టూ కనిపిస్తోంది.

పద్మావతి   ఇంకచాలు ఇప్పుడీ వేళాకోళాలు.

వాసవదత్త   మహాసేనుడికి కాబోయే కోడలా! ఇంక నేను నోరుమూసుకుంటున్నాను.

పద్మావతి   ఎవరీ మహాసేనుడు?

వాసవదత్త   ఉజ్జయినిలో ప్రద్యోతనుడనే రాజున్నాడు. అతనికి గొప్పసైన్యముంది. అందువల్ల అతనికాపేరు వచ్చింది.

చేటి   రాజకుమారి అతనితోసంబంధం ఇష్టపడటల్లేదు.

వాసవదత్త   మరిప్పుడెవర్ని కావాలనుకుంటోందిట?

చేటి   వత్సరాజు ఉదయనుడున్నాడుగదా! ఆయన గుణాలుచూసి అతణ్ణి కావాలనుకుంటోంది.

వాసవదత్త   (తనలో) ఆర్యపుత్రుణ్ణి కావాలనుకుంటోందా! (పైకి) ఎందుకుట?

చేటి   దయగలవాడని.

వాసవదత్త (మనసులో) నాకు తెలుసు. దానికే వీళ్ళందరూ కూడా వివశులవుతున్నారు.

చేటి   రాజకుమారీ! ఒకవేళ ఆ రాజు కురూపయితే?

వాసవదత్త   కాదు.. కాదు.. అందగాడే!

పద్మావతి   అది నీకెలా తెలుసు?

వాసవదత్త   (తనలో) రాజుపై గల ప్రేమానురాగాల్తో పెళ్ళైన వాళ్ళ మర్యాద మరచినట్లు ప్రవర్తించా. ఇప్పుడేం చెయ్యాలి?(పైకి) ఇది ఉజ్జయినిలో జనమంతా అనుకునేదే.

పద్మావతి   అవును..ఉజ్జయినిలో అతన్ని చూడనివారు లేరు గదా! అందమంటే ప్రజలందరికీ ఇష్టమే కదా?

(అంతఃపురపు దాది వస్తుంది)

దాది   జయము! పద్మావతీదేవీ! నిన్ను ఇచ్చేసారు.

వాసవదత్త   ఎవరికి?

దాది   ఉజ్జయనీరాజు ఉదయనుడికి.

వాసవదత్త   ఆయన క్షేమమేనా?

దాది   క్షేమంగా ఉన్నాడు, ఇక్కడకు వచ్చాడు. అతనికి మన రాజకుమార్తె నిచ్చి పెళ్ళి చెయ్యబోతున్నారు.

వాసవదత్త   తొందరపాటు.

దాది   ఏది తొందరపాటు?

వాసవదత్త   ఏం లేదు. ఆ బ్రహ్మచారి చెప్పినట్లు, బాధపడి, మామూలుస్థితికి వచ్చి ఉండవచ్చు.

దాది   మహాపురుషుల హృదయాలు శాస్త్రం ప్రకారం నడుచుకుంటాయి. అతి సులభంగా సహజస్థితికి వచ్చేస్తాయి.

వాసవదత్త   అతనే స్వయంగా వరించాడా?

దాది   కాదు కాదు. వేరే ఏదో పనిమీద వచ్చిన అతన్ని చూసి, అతని రూపం, గుణం, తెలివీ చూసి మహారాజు దర్శకుడే స్వయంగా పిల్లనిస్తామన్నారు.

వాసవదత్త   (తనలో) అయితే స్వామి తప్పేమీ లేదన్నమాట.

చేటి   త్వరపడండి రాజకుమారీ! ఈరోజే మంచినక్షత్రమట. రాణీగారు ఈరోజే ఆ శుభకార్యం జరపాలంటున్నారు.

వాసవదత్త   (మనసులో) ఆవిడ ఎంత తొందరపడుతోందో నామనసులో అంత గబగబా చీకట్లు కమ్ముకుంటున్నాయి.

దాది   రండి.

(అందరూ వెళ్ళిపోతారు).


రచయిత భాస్కర్ కొంపెల్ల గురించి: భాస్కర్‌ కొంపెల్ల జననం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో. నివాసంన్యూజెర్సీలో. ఈమాట సంస్థాపక సంపాదకులలో ఒకరు. యూరప్‌, మెక్సికోలలో కొంతకాలం ఉన్నారు. సంస్కృత, ఆంగ్ల సాహిత్యాల్లో అభిరుచి. కవితలు, కథలు , వ్యాసాలు రాసారు. ...