e-కధ

eశ పొద్దున్నే లేచి eమెయిలు చూసుకోవడం మొదలుపెట్టాడు. అష్టకష్టాలూపడి eమధ్యనే eమెయిలు చూడ్డం ఒక అలవాటుగా చేసుకున్నాడు.

కూతురు eళ దగ్గర్నుంచి eమెయిలు.

eమ్మాన్యుయేల్ని పెళ్ళిచేసుకుంటోందిట. వెధవ కల్చర్‌. అన్నిటినీ eమయంచేయ్యాలా? “e రోజుల్లో అందరికీ eదే బుద్ధి” తిట్టుకున్నాడు eశ.

“Look eశా! eళకి పెళ్ళిట. eమెయిల్‌చూశావుగా! e-marriageట” ప్రింటౌట్‌ పట్టుకొస్తూ eశ గదిలోకి వచ్చింది eప్సిత.

“అయితే నీకు ఎక్స్ర్టా eన్ఫర్మేషన్‌ వచ్చిందన్నమాట” కోపంగా, వ్యంగ్యంగా, eసడింపుగా అన్నాడు eశ.

“ఎంతైనా తల్లినిగా.”

“ఆఁ! eతల్లివి” గొణుక్కున్నాడు వినిపించకుండా.

“ఒరేయ్‌ e! eళకి పెళ్ళిట, eపూజార్ని పిలవరా?” కంప్యూటర్‌లోంచి eశావాళ్ళమ్మ voice-chat మొదలెట్టింది.

“eపూజారేమిటి?” తెల్లమొహం వేశాడు eశ.

“ఓరి వెర్రి నాగన్నా. రోజులు మారాయి. ఇప్పుడన్నీ eపెళ్ళిళ్ళే. www.teluguEpelli.comకి వెళ్ళి మన అడ్రస్‌కొట్టు. మనకి దగ్గర్లో ఉన్న eపూజారి web-site వస్తుంది. నీ క్రెడిట్‌కార్డ్‌నంబరియ్యి. ఏం చెయ్యాలో చెపుతూ ఆయనే eమెయిల్‌ పంపుతాడు” eసడింపుగా అన్నది eశ వాళ్ళమ్మ.

“అదికాదమ్మా. అది eపెళ్ళి చేసుకుంటూంటే అన్నీ అదే చూసుకుంటుందేమో! ముందు నన్ను eళతో మాట్లాడనీ”.

voice-chat సడన్‌గా కోప్పడి ఆగిపోయింది.

“ఆవిడ చాదస్తంగాని, eళ ఇవన్నీ ఒప్పుకోదు. e-marriage అంటే వాళ్ళద్దరూ కలుసుకోరు కూడా. ఇద్దరూ ఎక్కడివాళ్ళు అక్కడే ఉంటారు. ఇద్దరి web-sitesకి e-priest పెళ్ళి చేస్తాడు. They kiss the pictures. ఏకంగా హనీమూన్లో కలుసుకోవడమే.” వివరించింది eప్సిత.

“ఓ! పూర్వం రాజకుమార్తెలకి కత్తుల్తో పెళ్ళి చేసినట్టుగా అన్నమాట”

“హుఁ! పాత చింతకాయ పచ్చడి. నా eడుకు తగ్గ జోడు కాదు మీరు. ఏదో eంటిపేరు e-money వారు, పైగా అమెరికా సంబంధం కదా అని ఒప్పుకున్నాను అప్పట్లో”

“మరి అమ్మ eపూజారీ గట్రా అంటోందే”

“ఆఁ! అది ABCD గాళ్ళ invention” తీసిపారేసింది. “ఫిలాసఫీ ప్రొఫెసర్ని పెళ్ళిచేసుకున్న నాకు eకష్టాలు తప్పవు” బుడి బుడి దీర్ఘాలు మొదలయ్యాయి.

eశ ఆలోచనల్లో పడ్డాడు. eశకి eళ పుట్టినప్పటి సంగతులు గుర్తుకొస్తున్నాయి. తన తండ్రి eళని చేతుల్లోకి తీసుకుంటూ అన్నమాటలుకూడా గుర్తుకొచ్చాయి.

“నాన్నా eశూ! ఇది మనింటి మహాలక్ష్మిరా. మీరందరూ ఎంత మోడర్న్‌ వాళ్ళయిపోయినా ఫర్వాలేదు, ఇది ఎవర్ని పెళ్ళిచేసుకున్నా ఫర్వాలేదు. కాని, దీని పెళ్ళికి ముందు గౌరీపూజ చేయించడం మాత్రం మర్చిపోకు.”

వెంటనే, వేరే ఆలోచనలు మాని, eపూజారితో రిజిష్టర్‌చేసాడు eశ. 24 గంటల్లో eమెయిల్‌వచ్చింది ఒక executableని మీ web-siteలోకి పంపాము; అది అక్కడ ఒక రెండు రోజులు మాత్రమే ఉంటుంది; దాని మీద క్లిక్‌ చేసి పూజ చేసుకోండంటూ. ఈ వ్యవహారమేమిటో అర్ధంకాక ఫోన్‌చేసాడు eశ.

“hello! e-morning. I am e-Pujari. What can I do for you?” అవతల eపూజారి కంఠం వికవికా నవ్వుతూంది.

వెధవ eజోకులూ వీడూనూ.. కసితీరా తిట్టుకున్నాడు eశ. విషయం చెప్పి ఈ executable గొడవేమిటని అడిగాడు.

“ఇది eపూజ సార్‌! ఆ పూజ కాదు” మళ్ళీ నవ్వాడు.

“నాకు తెలిసి పూజ అనేది ఒకటే. మా అమ్మాయి చేత గౌరీపూజ చేయించాలి”

“అయ్యా! Click on the executable. Everything is self-explanatory”
పచ్చి గోదావరి ఇంగ్లీషు. పైగా, “వ్రత కధలు చదివారా ఎప్పుడైనా? ప్రతి వ్రతమహిమా వివరించిన తర్వాత శివుడు పార్వతితో ఏమంటాడు?
“eప్రకారంగా ప్రసాదాన్ని వండి, eవ్రతాన్ని, eవిధంగా చేసినవారూ, చూసినవారూ ధన్యులవుతారూ, eహలోకంలో సుఖములు బడసి పరలోకంలో తరిస్తారూ”..అని. ఆ “ఈ” అనేది ఈ “e” అని గుర్తించవలసి ఉంది, ముఖ్యంగా మీలాంటి ఛాందసులు eనాడు eలోకంలో” అంటూ ఉపన్యాసంకూడా ఇచ్చి టక్కున ఫోన్‌పెట్టేసాడు eపూజారి వేయిమాటలేల అనుకుంటూ.

eక చేసేదిలేక, వాళ్ళమ్మాయికి ఫోన్‌చేసాడు eశ. అంతా నాన్‌సెన్స్‌వద్దంది eళ. eప్సిత వంతపాడింది. వాళ్ళనాన్న ఆత్మశాంతికోసం తనైనా చేద్దామనుకున్నాడు eశ. బ్రతిమాలి, బామాలి, ఎలాగో eళ web-siteలోకి login అవడానికి పర్మిషన్‌తీసుకుని, అక్కడ eగౌరీపూజ eళ బదులు తను చేసి పితృవాక్యపరిపాలన చేసి తరించాడు eశ.

eలా eవలయంలోంచి బయటపడి, మనశ్శాంతికోసం ఏదైన ఘంటసాల పాట విందామనుకున్నాడు eశ. వెతికితే అన్ని క్యాసెట్లూ కలగాపులగంగా ఉన్నాయి.

చేతికి దొరికిన క్యాసెట్‌ ప్లే చేసాడు.

“eమౌనం, eబిడియం
eదేనా, eదేనా మగువ కానుకా…”

ఫాస్ట్‌ ఫార్వర్డ్‌ చేసి, మళ్ళీ ప్లే నొక్కాడు.

“eనాటి eహాయీ
కల కాదోe నిజమోe…”

అప్పటికీ వదలకుండా విక్రమార్కుడిలా తరవాత పాట పెట్టాడు

“ఏమిటో eమాయా … కలలోని వలెనాయే ..”

ఛీ! దీనిక్కూడా eపిచ్చే… తీసి మరో క్యాసెట్‌ పెట్టాడు.

“eడేరే! eడేరె eకోర్కె eనాటికే! దేవి! శ్రీదేవీ!..”

వైరాగ్యంతో ప్లేయర్‌కట్టేసి, కోపంగా తలుపు దభాల్న వేసి, eలోకమ్మీద కసితో విజృంభించే ప్రయత్నంగా తన research topic నే మార్చేసాడు eశ. ఇప్పుడతను “eశోపనిషత్తులోని eతత్వ్తం” మీద పుంఖానుపుంఖాలుగా పేపర్లు రాస్తున్నాడు.

రచయిత భాస్కర్ కొంపెల్ల గురించి: భాస్కర్‌ కొంపెల్ల జననం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో. నివాసంన్యూజెర్సీలో. ఈమాట సంస్థాపక సంపాదకులలో ఒకరు. యూరప్‌, మెక్సికోలలో కొంతకాలం ఉన్నారు. సంస్కృత, ఆంగ్ల సాహిత్యాల్లో అభిరుచి. కవితలు, కథలు , వ్యాసాలు రాసారు. ...