(నాటిక)
(తెర తెరవగానే బాక్ గ్రౌన్డ్‌లో మాటలు మొదలవుతాయి రాజా కూర్చుని ఉంటాడు.)
ఈ కుర్చీలో కూర్చున్న వ్యక్తి రాజా. 4 నెలలక్రితం పింక్ స్లిప్ వచ్చింది. ముతకభాషలో చెప్పాలంటే ఉద్యోగం ఊడింది. సందులో ఓరకిల్ అవడంతో మరో ఉద్యోగం దొరక్క దిక్కుతోచటల్లేదు. ఈ రాజాని 20 లక్షలు పెట్టి కొనుక్కుంది రాధ. అమెరికా సంబంధమన్న ముచ్చట తీరకుండానే రాధ వచ్చిన రెండు నెల్లకే రాజా ఉద్యోగం పోయింది. ఇలా రెెండు నెల్లకే వైభోిగం అయిపోవడం తట్టుకోలేక “నా 20 లక్షలూనాకిచ్చెయ్. నా మ ానాన నేను పోతా” అంటోంది. మనవాడు ఆ డబ్బుతో ఇండియా స్టాకులూ, ఇక్కడ మిగుల్చుకున్న డబ్బుల్తో ఇక్కడి స్టాకులూ కొని అన్నీ పోగొట్టుకుని డీలాపడిపోయున్నాడు. ఉద్యోగం లేక, పెళ్ళాం పోరు పడలేకశ్రీకాకుళంలో ఉన్న తండ్రికి ఫోన్ చేసి ఇండియా తిరిగొచ్చేస్తానన్నాడు రాజా. వాళ్ళ నాన్న రంగనాధం తిట్టిన తిట్టు తిట్టకుండా ఒక గంట తిట్టి ‘నీకు చేతకాకపోతే అమెరికాలో నీ కష్టాలు తీరే మార్గం ఒకటే బిగ్ బక్ స్వామి. ఇప్పుడమెరికాలోఉన్నాడు, మన కుటుంబానికి కావలసినవాడు. నేను సెల్ ఫోన్‌లొ చెబుతా. వచ్చి సహాయం చేస్తాడు. నాసలహా పాటించక పోయావో, నీకు ఇక్కడికొచ్చినా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను’ అని హెచ్చరించాడు.ఆ బిగ్ బక్ స్వామి రావడంతోరాజా తిప్పలు మరింత పెరిగి రాజాకి పిచ్చెక్కినట్టుంది.
(బిగ్ బక్ స్వామి ప్రవేశిస్తాడు. )
రాజా
ఎక్కణ్ణుంచి వస్తున్నారు స్వామీ!
బిగ్ బక్ స్వామి
నీకు చెప్పితీరాలా డాలరూ!
రాజా
అవును స్వామీ! ఇది ఇండియా కాదు. ఇది నా ఇల్లు. ఈ ఇంట్లో ఏమి జరిగినా నాదే responsibility.
బిగ్ బక్ స్వామి
ముందు ఇంటికి లీజ్ అయిపోయిందిట. పోయి రెన్యూ చేసుకో డాలరూ!
(రాధ వస్తుంది. రాజా భయంగా చూస్తాడు.)
రాధ
విషయమేమైనా తేలిందా? నా సంగతేమిటి?
(బిగ్ బక్ స్వామి మాట్లాడడు)
రాజా
(గొణుగుతాడు .. ) ఇదో తద్దినం..
రాధ
నీకిచ్చిన గడువు రెణ్ణేల్లే ఉంది.. తెలుస్తోందా ?
(రాజా బిగ్ బక్ స్వామి అన్నట్టు పెదాలు కదుపుతూ బిగ్ బక్ స్వామిని చూపిస్తాడు.
బిగ్ బక్ స్వామి లేచి వెళ్ళిపోతాడు)
రాధ
ఏమిటీ? మీ బిగ్ బక్ స్వామంటే నాకేమైనా భయమా? లక్షలు గుమ్మరించి కొన్నా నిన్ను.
అసలీ ఆరకిల్గాళ్ళనీ, వెన్ట్రికిల్గాళ్ళనీ నమ్మద్దు నాన్నా అంటే విన్నాడు కాదు మా నాన్న.
ఛ..ఛ.. ఆ గంగాధరం గాడు ప్రేమంటూ నా వెనకపడి ఏడిచేవాడు. వాణ్ణే ఒప్పీసుకోవలిసింది. రాలీలో బయోటెక్ కంపినీలో పనిచేస్తున్నాడట. ఓ పదేళ్ళు గారన్టీ ఉద్యోగం…
రాజా
(కోపంగా) ఇప్పుడైనా నష్టమేమిట్టా.. పోయి వాణ్ణే కట్టేసుకో..
రాధ
ముందు నా 20 లక్షలూ కక్కీ.. నేనే పోతా.. ఉండమన్నా ఉండను..
రాజా
ఛీ.. వెధవ బతుకైపోయింది.. అనకాపల్లిలో బెల్లంకొట్లో పనిచేసినా ఇంతకన్నా గౌరవం..
(రాధ సెల్‌ఫోన్ మోగుతుంది. హనీ అంటూ వెళ్ళిపోతుంది. బిగ్ బక్ స్వామి
ఫోన్‌లో మాట్టాడుతూ మళ్ళీ వస్తాడు.)
రాజా
ఈయనొకడు. ఆ సెల్‌ఫోన్ ఒదలడు. పొద్దున్న లేవగానే ఎక్కడికో పోతాడు. వస్తాడు, సెల్‌ఫోన్ ..మళ్ళీ పోవడం.. ఏం చేస్తాడో చెప్పడు. ఏం మాట్టాడ్డు.. ఆ సెల్లో ఏం వింటాడో చెప్పడు.. అంతా ఖర్మ.. (బిగ్ బక్ స్వామి సెల్‌కట్టేస్తాడు) బిగ్ బక్ స్వామి! ఏదో నా సంసారం చక్కబెట్టేస్తానని విమానం కట్టుకు వాలావు. ఏదీ? నువ్వేంచేస్తున్నావో చెప్పవు .. ఏం కొంపలుముంచుతున్నావో తెలియదు.. ఇది ఇండియా కాదు.. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యడానికి.. ఎంతసేపూ.. ఆ సెల్‌ఫోనేనా? ..
బిగ్ బక్ స్వామి
ఎపాయింట్మెంట్స్‌తో బిజీగా ఉన్నాను. అలా డీవాల్యూడ్ కరెన్సీలా ముఖం వేలాడేసుకుని ప్రశ్నలతో డిస్టర్బ్ చెయ్యకు రుపయ్యా!.
(రాజా మాట్లాడుతూండగానే సెల్‌మళ్ళీ మోగుతుంది. హలో అంటూ వెళ్ళిపోతాడు.)
రాజా
ఖర్మ… (తలమొత్తుకుంటాడు. ప్రభు వస్తాడు.)
ప్రభు
ఏరా రాజూ! మీ ఆవిడ లంచ్ తినిపించలేదేమిట్రా? అలా బాటరీ డౌన్ అయిపోయిన సెల్‌ఫోన్లా కూర్చున్నావ్?
రాజా
హ్మ్.. షటప్
ప్రభు
వావ్! మా కొలీగ్ సెల్‌ఫోన్ ఇలాగే రింగవుతుంది.. కొట్టినట్టు..
రాజా
ఆపరా నీ సెల్‌ఫోన్ గొడవ. అటు మా బిగ్ బక్ స్వామి, ఇటు నా పెళ్ళాం. ఇప్పుడు నువ్వు..ఈ
సెల్‌ఫోన్ తో పిచ్చెక్కించేస్తున్నారు. నా ఖర్మ కాలి నేనిప్పుడు వరల్డ్ కాంలో కూడా టెలిఫోన్ ఆపరేటరే!
ప్రభు
ఏంటి గురూ! మీ డాలర్ల స్వామీజీకికూడా సెల్‌ఫోన్ నచ్చిందా .. కన్నె మేను, సెల్లు
ఫోను నచ్చని స్వామీజీ ఉన్నాడా లోకంలో?
రాజా
నచ్చడమా! అస్తమానూ అదే పని. అలా అని మాట్టాడ్డు.. వింటాడు.
ప్రభు
తెలివైన వాడు.
రాజా
ఫోన్ మొదలవగానే ఏదో అంటాడు గొణుగుతూ..అదైనా తన గదిలోకి పోయి. ఆ తర్వాతతన్మయత్వంతో వింటూంటాడు. నవ్వుతాడు.. ప్రేమగా కళ్ళు పెడతాడు. ఫోన్ వంకచూసి చిన్నగా నవ్వుతాడు మళ్ళీ మళ్ళీ.. ఆ తర్వాత ఫోనుకి కన్నుగీటి నేనున్నాగా అంటాడు ..
ఏదో సెల్తో ప్రేమలో పడ్డట్టు.
ప్రభు
ఓకే … ఓకే … (ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టి) అన్నట్టు.. మీ బిగ్ బక్ స్వామి పెళ్ళాం పోయి
ఎన్నాళ్ళయింది?
రాజా
5 నెలలు..
ప్రభు
(చిటిక వేస్తూ) అదీ.. తెలిసింది..మీ బిగ్ బక్ స్వామి పెళ్ళాం తో మాట్ట్టాడుతున్నాడు.
నా కర్ధమైపోయింది. సెల్‌ఫోన్ సైకయాట్రిక్ సిన్డ్రోమ్ పట్టుకుంది. ఇది కొత్తగా తాజాగా
ప్రారంభమైన జబ్బు. ఒక మానసిక రుగ్మత.. మదపిచ్చి ..వెంఠనే ఒక సైకయాట్రిస్ట్‌ని సంప్రదించాలి. లేకపోతే .. ఛ ఛ.. ఇక్కడ ఏమనాలి? (గబగబా నంబర్స్ నొక్కుతాడు ఫోన్లో. ‘ఏమనాలి? ఓకె ఓకె..’.. అంటూ ఫోన్ కట్‌చేసి) లేకపోతే చెయ్యిజారిపోయే ప్రమాదముంది.
రాజా
మధ్యలో ఆ ఫోనెవరికి?
ప్రభు
“జీవుని అడగండి” అని హిందుస్తాన్ బైబిలు ఇన్‌స్టిటూట్ వా ళ్ళకొత్త వాయిస్
ఎనేబుల్డ్ వెబ్ సైటు. పదాలు మర్చిపోతే అందిస్తారు.
రాజా
ఆస్క్ జీవ్స్ లాగా
ప్రభు
దానిమాట అటుంచు..మీ బిగ్ బక్ స్వామి కి మెడికల్ హెల్ప్ కావాలి.
రాజా
అక్ఖర్లేదు.. ఆయన పిడ్రాయిలా ఉన్నాడు.
ప్రభు
నీకు అమెరికన్ లా తెలియదు బ్రదర్! నేను ఈ సెల్ ఒక నొక్కు నొక్కి “ఇక్కడ
ఒకళ్ళకి సైకయాట్రిక్ హెల్ప్ కావాలి. వాళ్ళబ్బాయి డబ్బుకి కక్కూర్తిపడి డాక్టర్ని కన్సల్ట్ చెయ్యటల్లేదు” అని చెప్పానో .. వాళ్ళు ఆమ్బ్యులెన్స్ కట్టుకుని మీ బిగ్ బక్ స్వామిని,
పోలీసాళ్ళు కారేసుకుని నిన్నూ పట్టుకుపోతారు.. తెలుసా… (సెల్‌ఫోన్ నొక్కబోతాడు.)
రాజా
వెయిట్… వెయిట్… ఇది నిజంగా అంత సీరియస్ కేసంటావా?
(బిగ్ బక్ స్వామి ఫోన్తో హాల్లోకి వస్తాడు. మెలికలు తిరుగుతూ వింటాడు.
తన్మయత్వంతో కళ్ళుమూస్తాడు. ఫ్లయింగ్ కిస్సిస్తాడు.బై అంటాడు. వెళ్ళిపోతాడు.)
ప్రభు
(అటు వైపు చెయ్యి చూపిస్తూ) కాదంటావా?
రాజా
సరే .. మన పినాకపాణి సైకయాట్రిస్టేగా.. వాడిదగ్గరికి తీసుకెడితే సరి.
ప్రభు
ఇప్పుడే అపాయింట్‌మెంట్ కట్ చేస్తా.. (ఫోన్ నొక్కుతాడు )
( నీలు వస్తాడు.)
నీలు
ఏమిటి పినాకపాణి అంటున్నారు? ఎవరికైనా పిచ్చెక్కిందా?
రాజా
స్స్ .. గట్టిగా మాట్టాడకు..
నీలు
పినాకపాణి అంకుల్‌కి వళ్ళీ ఆంటీ విడాకులిస్తోంది..
రాజా
హతవిధీ! ఈ భారతీయుల్ని విడాకుల జాడ్యం ఇలా పీడిస్తోందేమిటి? ఎందుకిస్తోంది?
నీలు
పేషంట్స్ తో వేగి వేగి రాత్రి కల్లో పిచ్చికేకలట .నిన్న భూతవైద్యుణ్ణి కూడా పిలిపించారు
రాజా
అమెరికాలో భూతవైద్యుడేమిటి?
నీలు
ఇలా కేవలం ప్రోబ్లమ్స్ బయటపెట్టడమేగాని, సొల్యూషన్ తెలియకపోవడం
వల్లేనీకు పింకు స్లిప్పొచ్చింది బాబూ! వెబ్‌లో వర్చువల్‌భూతవైద్యుడు నాయనా!
అయినా ఊర్నించి వచ్చిన ప్రతీవాడూ కంప్యూటర్ సైన్స్ అంటే ఇలాగే ఉంటుంది.
రాజా
ఏంట్రా కూశావ్?
నీలు
కూసింది నేనుకాదు బాబూ.. నీ పెళ్ళాం..పక్కింటివాడితో అంటూంటే..
రాజా
ఉండు దాని పని చెబుతా!! (కోపంగా వెళ్ళిపోతాడు.)
(బిగ్ బక్ స్వామివస్తాడు.. నీలు ఆయన చెవిలో ఏదో చెపుతాడు.అందరూ
వెళ్ళిపోతారు).
(డాక్టర్ ఆఫీస్. బిగ్ బక్ స్వామి కూర్చుని ఉంటాడు.)
పాణి
హాయ్.. ఏమ్‌ఫనీ! .. తడబడి.. ఓ..ఓ..ఓకే… నమస్తే స్వామీ!
బిగ్ బక్ స్వామి
(లేవకుండా) ఊ.. రోజుకెంత సంపాదిస్తావు డాలరా?
పాణి
డాలరేమిటి? చాలానే సంపాదిస్తా.. ఓకే .. విషయానికొద్దాం.. మీ ప్రోబ్లమేమిటన్నారూ?
బిగ్ బక్ స్వామి
అది నేచెప్తే నువ్వెందుకు… సంపాదన తగ్గిందా? చెప్పడానికి
సిగ్గుపడుతున్నావా డాలరా? డిప్రషన్ గదా!
పాణి
మీకు…
బిగ్ బక్ స్వామి
మరొకళ్ళకి డిప్రషన్ వస్తేనే గదా, మనకి డాలర్లు రాలేది..
పాణి
మీకు సెల్‌ఫోన్స్ ఇష్టమా?
బిగ్ బక్ స్వామి
ఎవరికిష్టం లేదు? నీకిష్టం లేదా? నువ్వు అర్ధరాత్రీ అపర్రాత్రీ వైద్యమంటూ తిరుగుతూంటే
నువ్వుతిన్నావో లేదో..ఉన్నావో లేదో అని గుబులుపడుతూ మీ ఆవిడ నీ సెల్‌కి
కాల్‌చెయ్యదా? సెల్‌పుణ్యమా అని నిన్ను ఎక్కడున్నా కాన్టాక్ట్‌చేస్తుందిగదా.
ఎంతైనా తెల్ల దొర పనితనం వేరు.. నిన్న కనుక్కున్నాడు..ఈ వాళ వేల ఫోన్లు అమ్మే స్తున్నాడు..డాలర్లు గుంజుకుంటున్నాడు.ఏమిటీ మొహం అలా పెట్టావ్ ఏమిటి మీ ఆవిడ ఫోన్ చెయ్యదా డాలరా?
పాణి
స్వామీ! మీ భార్య …
బిగ్ బక్ స్వామి
ఆవిడ పరలోక స్వర్గం నుంచి చెయ్యదు రుపయ్యా! మీ ఆవిడ ఈ అమెరికా
స్వర్గం నుంచి చెయ్యదా? కుశలం కనుక్కోదూ? “ఇంకా ఎంతసేపూ? రండి. కూరలు చల్లారిపోతున్నయ్” అంటూ చెవిలో ఊసులు చెప్పదూ?
పాణి
స్వామీ! (ఏడుపు ముఖం పెడతాడు)
బిగ్ బక్ స్వామి
సర్వం డాలరుమయం.. మాకు తెలియనిలేదు రుపయ్యా. మీ ఆవిడ నీ సంపాదన చాలదని చంపుతోంది. ఇంట్లో కూడా మూడీగా ఉన్నావని తిడుతోంది. విడాకులిస్తానంటోంది.. అవునా రుపయ్యా
పాణి
స్వామీ! (కాళ్ళ మీద పడి భోరుమంటాడు.అటూ ఇటూ చూసి బిగ్ బక్ స్వామి చెవిలో ఏదో చెపుతాడు)
బిగ్ బక్ స్వామి
ఛ ఛ.. వల్లి అలాంటిది కాదు రుపయ్యా..
మంచి పిల్ల.. ఊరికే అంటోందేమో విసుగొచ్చి.
పాణి
ఆనాటి వల్లి గురించి వల్లె వెయ్యకండి..
ఆ రోజుల్లో ఉల్లి కూడా తినని తల్లి
ఈనాటి వల్లి..మనల్ని గట్టిగా రక్తం తాగే నల్లి..
మనల్ని ఘోరంగా కొరిలే పిల్లి
(పిచ్చిపిచ్చిగా అరుస్తాడు.)
బిగ్ బక్ స్వామి
ఇంతకుముందు పేషెంట్ ప్రాసకవి అనుకుంటా రుపయ్యా.. ఆవేశపడకు..నే వల్లితో
మాట్టాడతా అన్ని విషయాలూ.. జాగ్రత్తగా ఉండు. ఎమోషనల్ కాకు.. జాబ్‌లో స్ట్రెస్ ఇంటికి
తీసుకెళ్ళకు… కాస్త వ్యాయామం, ప్రాణాయామం చేస్తే మనసు కుదుటబడుతుంది. కాస్త
ధ్యానం .. గీనం.. ఉంటే పిచ్చి ఆలోచనలూ కలలూ రావు. .. నీకు నన్ను కన్సల్ట్ చెయ్యాలని
ఉంటే, ఇక్కడికి కాల్ చెయ్యి ..ఇదిగో కార్డు.
(రాజా ఇల్లు.. రాధ, పద్మ కూర్చుని ఉంటారు)
పద్మ
ఏమే రాధా .. ఎంతవరకూ వచ్చాయే నీ విడాకులు?
రాధ
విడాకులా ..విస్త్రాకులా..ఒక సారి పెళ్ళైతే బుక్కై పోయినట్టే..
పద్మ
సంధి చేసుకున్నావా?
రాధ
సంధా చట్టుబండలా.. మాట్టాడితే ఇండియా పోదామంటాడు.. అందువల్ల..
అలా విడాకుల ట్రీట్మెంట్ ఇస్తూంటే దిగి వస్తాడని.
పద్మ
మరీ ఎక్కువై బెడిసిగొడితే..
రాధ
గాల్వాష్టన్‌లో గడ్డాలు పెంచుకుని పోస్ట్‌డాక్‌లు తిరుగుతూనే ఉంటారు పెళ్ళీగిళ్ళీ
కాక. వాళ్ళల్లో బయోటెక్ లో ఉద్యోగం రావడానికి పాజిబిలిటీ ఉన్నవాణ్ణి
పట్టుకుంటే సరి..
పద్మ
నువ్వు మరీ ఇదిగా మాట్టాడతావే…
రాధ
మనం బెటర్ ..జస్ట్ ఇలా మాట్లాడు కుంటాం.. నీకు తెలుసా.. మంచి
అందమైన అమ్మాయిని చూసిన ప్రతి పెళ్ళయిన మగాడూ కనే కలేమిటో..
(పద్మ తెలియదన్నట్టు తలాడిస్తుంది)
తన పెళ్ళాం ఒక్కత్తీ ఇండియా వెడుతుంటే ప్లేన్ క్రాష్ అయినట్టూ.. తనా
పిల్లని పెళ్ళి చేసుకున్నట్టూ..
పద్మ
ఛ ఛ.. మరీ అన్యాయంగా ఆలోచిస్తున్నావే..
రాధ
కొద్దిగా విశాల హృదయం ఉన్నవాడైతే, పెళ్ళాం విడాకులిస్తుందనుకుంటాడు.
పెళ్ళాలు పోయినవాళ్ళ జోరు చెప్పనే అక్కర్లేదు.
పద్మ
అన్నట్టు..మీ బిగ్ బక్ స్వామి మీద ఓ కన్నేసి ఉంచవేవ్. ముసలాయిన
జోరుమీదున్నట్టున్నాడు.మొన్న మార్గరెట్ కార్లో వాళ్ళింటికి వెడుతూంటే చూశా…
ప్యాంటూ షర్టూ.. కూడా వేశాడు.
రాధ
వ్వాట్..శ్రీకాకుళంలో చింతపండు అమ్ముకోకుండా.. మా సంసారం
ఉద్ధరిస్తానంటూ ఇక్కడికొచ్చి.. ఏం చేస్తున్నాడో..తెలియదు..
ఏదో కొంపమీదకి తెచ్చేలా ఉన్నాడు.. ఎలా ట్రాక్ చెయ్యడం?
(నీలు వస్తాడు)
నీలు
డిటెక్టివ్ నీలూకీ.. అన్నీ తెలుసు. మీరెందుకిలా ఉన్నారో కూడా తెలుసు.
రాధ
అయితే బిగ్ బక్ స్వామి రోజూ ఎక్కడికెడతారో చెప్పు.
నీలు
ఓ.. హ్హహ్హహ్హ..సింపుల్.. మొన్న మార్గరెట్ మనసు పూజ,
నిన్న నాన్సీ నలుగు పూజ, అటుమొన్న అమేల్యా పాద పూజ..
(సెల్‌మోగుతుంది.) అది డాలరంకుల్‌సెల్. పట్టుకెళ్ళడం
మర్చిపోయినట్టున్నారు..
రాధ
(ఫోన్ టర్న్ ఆన్ చేసి) హలో!..
అవతల ఆడకంఠం
హయ్ ఈజ్ దిస్ బక్
రాధ
యస్ ఇటీజ్ రాంగ్ నంబర్ (పెట్టేస్తుంది.. వెంటనే గ్రహిస్తుంది) ఓ! బక్
అంది అనుకుంట.. ఒరేయ్ నీలూ! ఈ మాటు
నువ్వు తీసుకుని.. హాయ్ చెప్పి నాకివ్వరా!
(మళ్ళీ ఫోన్ మోగుతుంది. నీలు తీస్తాడు)
నీలు
హాయ్…
ఆవతల ఆడకంఠం
Hi Buck!How are you?
నీలు
గూడ్ ..
(రాధ ఫోన్ లాక్కుంటుంది)
ఆవతల ఆడకంఠం
What a sweet and soft touch you have man! Your fingers did wonders on
my body. You are really great.. I too.. I can give fabulous massages.. You want to try? I want an appointment with you, Buck! When can I meet you?
రాధ
(బిత్తరపోయి తనలో తను) ఛ ..
ఆవతల ఆడకంఠం
Hi Honey ! Are you OK? Are you on the line?
(రాధ ఫోన్ కట్ చేస్తుంది)
రాధ
ఇదన్నమాట ఈ బకాసురిడి నిర్వాకం.. ముప్పొద్దులా మెక్కి,. మేమొక మూల బాధల్తో ఛస్తూంటే
He is flirting around..(ఆలోచించి చిటిక వేస్తూ )
నీలూ .. నువ్వు చిన్న సహాయం చెయ్యాలి. (వాడి చెవిలో ఏదో చెబుతుంది)
నీలు
డిటెక్టివ్ వర్క్ అన్నమాట. నేను రెడీ (నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు).
నీలు
అక్కా! అక్కా!
Detective Nilu reporting!
(రాధ వస్తుంది) నిన్న సాయంత్రం డిటెక్టివ్ నీలు మార్గరెట్ వాళ్ళబ్బాయితో హోం వర్కు చేసుకుందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. దాదాపు 4 అవుతోంది. వీధి తలుపులో తాళం క్లిక్ మంది.
మెల్లగా మాటలు వినిపిస్తున్నాయి కింద. ఒక ఆడ కంఠం ఒక మగ కంఠం… కిల కిలలు.. “You please wait in the room. I will change and meet you there” అంటోంది ఆడ కంఠం. “ఓకే ఓకే” అంటోందా ముతక మగ కంఠం. పది నిముషాల్లో వాళ్ళిద్దరూ గదిలో…
రాధ
తర్వాత?
నీలు
నేను మంచినీళ్ళు తాగుతానని చెప్పి కింద కిచన్లోకి వచ్చా. గదిలోంచి మగాడి మాటలు వినిపించటల్లేదు. ఆడకంఠం “ఊ.. ఆ..” అంటూ చిన్నగా మాటలు. అంతే నాకింకేమీ తెలియదు.. నాకిస్తానన్న 20 డాలర్లూ ఇచ్చెయ్.
రాధ
ఓకే ..ఇంద..ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు.. (రాజా వస్తాడు.) నీకేమైనా బుద్ధుందా? మీ బిగ్‌బకాసురుడు ఇలాంటివాడని తెలిసే ఇక్కడికి రప్పించావా? లేకపోతే నువ్వూ మీనాన్నా ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారా? ఇన్నాళ్ళుగా నిన్ను ఏడిపిద్దామనే విడాకులన్నాను. ఇప్పుడు నిజంగానే కావాలి.. అర్ధమయిందా?
రాజా
అయితే ఇన్నాళ్ళూ విడాకులన్నది సరదాకేనా?.. (నవ్వుతూ దగ్గరికి రాబోతాడు).
రాధ
షటప్ .. నన్ను టచ్ చేసావో చచ్చావన్నమాటే.
రాజా
ఏ మైందిరాధా!
రాధ
ఛీ! ఇండియాలో రోడ్డుమీద పైసలేరుకోక.. ఈ వయసులో ఇక్కడికొచ్చి ఇదేం
పొయ్యేకాలం మీ బకాసురిడికి.
రాజా
ఏమిట్రాధా! ఎందుకింత ఆవేశపడుతున్నావ్. మా నాన్న ఏం చేసారు? బిగ్ బక్ స్వామి ఏం చేసారు? ఇదిగో పాణి కూడా వచ్చాడు బిగ్ బక్ స్వామికి థాంక్స్ చెప్పాలంటూ ..
రాధ
ఇద్దరూ కట్టకట్టుకుని ఆ మార్గరెట్‌ఇంటికి వెళ్ళండి.
రాజా
రాధా! నువ్వు మాట్టాడేదేమిటో నాకు అర్ధం కావటల్లేదు. (దగ్గరకి
రాబోతాడు).
రాధ
ఛస్ … నా దగ్గరకి రాకు.. (వెనక్కి దూరంగా వెళ్ళబోతూ సోఫా
తగిలి సోఫా వెనకన పడిపోతుంది. ప్రేక్షకులకి కనబడదు.) అమ్మో! (అరుస్తుంది బాధగా)
(
బిగ్ బక్ స్వామి ప్రవేశిస్తాడు పాట పాడుతూ, వెనక్కాలే పద్మ పాడుతూ తలూపుతూ )
రూపాయ్‌కట్టలు ఛోడో ఛోడో …
డాలరు బిల్లుకు నమో నమో…
ఏమైంది నయాపైసలారా!
రాజా
మీ సంగతే ఫైసలా చెయ్యబోయి సోఫా తన్ని.. కాలు మెలిక తిరిగినట్టుంది..
విలవిల్లాడిపోతోంది. ఎందుకో ఏమిటో అర్ధం కావటల్లేదు
బిగ్ బక్ స్వామి
నా గదిలో ఎర్ర లెదర్ బ్యాగ్ పట్రా పైసా.. (రాధకి దగ్గరగా రాబోతాడు)
రాధ
నా దగ్గరకి రాకండి..మిమ్మల్ని చూస్తేనే కంపరమెత్తుతోంది. మొన్న ఫోన్లో
ఒక్కళ్ళూ, నిన్న పక్కింట్లో ఒక్కళ్ళూ.. అమ్మో నొప్పి..
బిగ్ బక్ స్వామి
(నవ్వుతూ) నువ్వూ వాళ్ళూ ఒకటేనా తల్లీ! అమ్మా 100 డాలర్ బిల్ మంత్రం వెయ్యమ్మా.
(పద్మ మంత్రం వేస్తున్నానంటూ మసాజ్ చేస్తుంది)
రాధ
నో..నో.. ఊ..ఆ…
(నీలూ వస్తాడు)
నీలు
అదే అరుపులు.. అవే కేకలు.. యురేకా!.. మసాజ్, తెరపీ… యురేకా!
బిగ్ బక్ స్వామి
(రాజాతో)
ఒరేయ్ పైసా! ఇక్కడ బిజినెస్ ప్రాపొజిషన్ ఏమైనా కనిపిస్తోందా?
రాజా రాధ
…
నీలు
మసాజ్, తెరపీ… యురేకా!
బిగ్ బక్ స్వామి
అవున్డాలరూ! నాకా.. చదువులేదు. నీ సంసారం చక్కబెట్టాలని తాపత్రయం.
చిన్నప్పుడు 3 ఏళ్ళు ఒక మళయాళం గురువు దగ్గర నేర్చిన విద్య.. మసాజు.
మంత్రాలూ .. తంత్రాలూ ఏమీ లేవిక్కడ.
పాణి
అయితే మీరు కైరోప్రాక్టర్ అన్నమాట.
బిగ్ బక్ స్వామి
అదేదో నాకు తెలియదు.. నాకు తెలిసిందల్లా.. డిమాండ్ సప్లై సూత్రం ఒక్కటే.
సాంబారు చేసుకునే వాళ్ళున్న చోట చింతపండు అమ్మాలి; చపాతీలు చేసుకునే వాళ్ళున్న చోట గోధుమలు అమ్మాలి.. అంతే. ఇక్కడా ప్రజల జీవనంలో ఆటా, పాటా, ఎడ్వంచరూ.. అందువల్ల దైహికమైన బాధలు వస్తాయి..దానికి నివారణ కావాలి. పైగా ఇప్పుడు ఉద్యోగాలు పోయి,
ఎకానమీ బాగా లేక స్ట్రెస్సు.. దానికి విరుగుడు..యోగా, ప్రాణాయామం, మసాజు.. అన్నిటికీ డబ్బు ఖర్చుకు వెనకాడరు.అందువల్ల ఈ సర్వీసెస్ మొదలుపెడితే లాభం అనుకున్నా.. ఓ కంపనీ అమ్మాయి పేర రిజిష్టర్ చేద్దామనుకుంటున్నా. నలుగురు మనుషులకి ట్రైనింగ్ కూడా ఇచ్చా. అందరూ కలిసి పనిచెయ్యచ్చు. మొన్న ఫోన్ చేసిన ట్రేసీ నాలుగో ట్రైనీ. ఇది క్లిక్ అయితే కంటిన్యూ చెయ్యి.. లేకపోతే పిచ్చి కుదర్లేదని మళ్ళీ ఆరకల్లో..ఏదో.. ఆరోకలే నెత్తికి చుట్టుకో డాలరూ!
రాజా
నాకన్నా నువ్వేనయం స్వామి.. మొన్న మొన్నే వచ్చినా మార్కెట్ పల్స్ తెలిసేసుకున్నావ్!
బిగ్ బక్ స్వామి
ఇదంతా ఈ దేశం ఇచ్చే ఆపర్చూనిటీ.. నిన్న వచ్చామా, మొన్న వచ్చామా అన్నదాన్ని బట్టి కాదు డాలరూ..
నీలు
(ప్రేక్షకుల వైపుకి తిరిగి)
ఇంకా కంపనీ కూడా పెట్టలేదు..అప్పుడే ఎక్స్పీరియెన్స్డ్ వాళ్ళా పోజు కొట్టేస్తూ
ఉపన్యాసాలు.
రాజా
హమ్మయ్యా! నాల్రోజులుగా రుపయా, పైసా అంటూ నన్ను డిగ్రేడ్ చేస్తూ
హింసించారు.. మళ్ళీ డాలరూ అన్న ఆశీర్వచనం హాయిగా ఉంది.. ఈ బిజినెస్ కంటిన్యూ చేసి మీ మెప్పుపొందుతా.. నా పాలిటదైవంలా వచ్చి కాపాడారు. మీరంటే కోపం వల్ల ఇంతకాలం అడగలేదు. మీరు మానాన్నకెలా ఫ్రెండ్ అయారు స్వామీ!
(మీసం, గడ్డం తీసేస్తాడు.. )
ఎవరో వచ్చి ఏదో చేస్తారని కూర్చుంటామా.. నేనేరా! ఈ మధ్య కాయకల్ప
చికిత్స చేయించుకుని గుర్తుపట్టలేనంత సన్నబడ్డా
రాజా
నాన్నా!
రాధ
మామ గారూ!
బిగ్ బక్ స్వామి
శ్రీ డాలరుభ్యోన్నమః
(అందరూ నవ్వుతారు)