ఎవడు మనిషీ?

మంచుకప్పిన కొండశిఖరం

ఎక్కలేనిక ఎదురుగాడ్పులు

చెప్పిరాదుగ చేటుకాలం

లోయదాగిన ఎముకలెన్నో!

ఒక్క కిరణం నక్కి చూడదు

ఉడుకు నెత్తురు పారుటెప్పుడు?

కునుకు పట్టదు నడుమ కలలో

వెంబడించే ఆవలాంచీ

ఉన్ని దుస్తుల కెన్నికంతలు

చేయి చాచిన అందు చుక్కలు

ఊపిరేమో ఎగసి తన్నును

ఉన్నచోటే నిలవ గలమా?

గడ్డి మొలవని పాడు ఎత్తులు

హిమము తుడవని గడ్డువాలులు

మేను వాల్చిన నీటి కొలనులు

తమ్ము తామే చూసుకొనవా?

మానుపట్టని మొండి గాయం

ఆనుపానులు ఎరుగలేమే

ఏది గెలుపూ?ఏది ఓటమి?

ఎవడు మనిషీ?ఎవడు షెర్పా?


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...