అమర కోశం

వేయాల్సిన వెర్రి వేషాలన్నీ అయిపోయాయి
ఇక మరణించాలనుకుంటా
ఎవడు మరణిస్తాడు పోదూ
నక్షత్రము మరణిస్తుందా
భూగోళం మరణిస్తుందా
అవి సరేనన్నా సూక్ష్మాణువు మరణిస్తుందా
చెప్పు నువ్వు నాకు
ఇన్ని కబుర్లు చెప్పే మరణం మరణిస్తుందా
మరణించాలంట మరణించాలి, డామిట్
నాకు మరణం లేదు నేను అమరణుడన్
భౌతికంగా భావనగా
మా సన్ కొన్యూర్ పిట్ట వాలి రెట్టలేసే భుజంగా
దేని గానూ మరణించాలని లేదు
వియద్గంగ ప్రవహించడం మానేయడమెందుకూ? నదులన్నీ సముద్రమైనప్పుడు
మరణపు కరణపు లెక్కలు చాల చూశాన్నేను
భూమ్మీద ఇంత హక్కు వచ్చేదాక నన్నుండనీయాల్సింది కాదు
నేనేమయినా అక్కడే గలగల వాగు ఒడ్డున గడ్డి మేస్తూ బర్రెలు ఆగిన చోటే వుండిపోయానా
వేన వేల మైళ్ళు విస్తరించాను ఇప్పుడు లెక్కల నదిని నేను, రెక్కల సముద్రం నేను
నిశ్చితమయిన ఆకాశం నేను, ఇక నాకు చావు లేదు చావు యొక్క బతుకు నేను.