ఈ కష్టాల్ని భరిస్తూ
ఈ కాంప్లెక్సిటీని ఓర్చుకొంటూ
ఎన్నాళ్ళిలా సాగిపోదాం ?
సముద్రం నుంచి విడిపోవాలనే పడుచు కెరటాలు
ఉవ్వెత్తున లేచి
మళ్ళీ ఒక్కసారికి రాజీపడేలాగ,
భూమ్మీద దూకాలనుకొనే మేఘాలు కూడా
చినుకులు చేతులుపట్టి లాగేకొద్దీ
వెనకెనక్కీ పోయేలాగ,
మన మనసుల్ని మనమే
మరోదారి పట్టించేస్తూ
మళ్ళీ మొదటికే చేరుకొంటున్నాం.
చిగిర్చడం కోసం
చివరి ఆకునీ రాల్చేసే
చెట్టుకున్న మనోధైర్యం
మనకు లేదు.
నిరాహార దీక్షతోనైనా
పాతకోటు వదిలి
పచ్చరెక్కలు తొడుక్కునే
గొంగళీపురుగుపాటి చైతన్యమైనా లేదు.
మనం ఈ వ్యవస్థని కాడిలా
మన బుజాన్నే మోస్తూ,
మరో విముక్తి కోసం తపిస్తున్నాం.
గడ్డి బండిలాగే ఎడ్లలాగ
గుడ్డిగా నడుస్తున్నాం.