రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

స్త్రీ పర్వంలో గాంధారి

రచన: వేలూరి వేంకటేశ్వర రావు
మార్చి 2006

మహాభారతంలో లేనిదేదీ లేదని అంటారు.

“ధర్మేచా ర్ధేచ కామేచ మోక్షేచ భరతర్షభ
యదితిహాస్తి తదన్యత్ర యాన్నేహాస్తి నతత్క్వచిత్.”

తిక్కన గారు, ఈ శ్లోకాన్న్ని తెలుగులో చక్కని తేటగీతంగా చెప్పారు.

“అమల ధర్మార్థ కామ మోక్షముల గురిచి,
యొలయు తెరువెద్దియును నిందు గలుగునదియు,
యొండెడల గల్గు దీనలేకుండ చొప్పు,
దక్కొకంటను లేదు వేదజ్ఞులార,”

అని.

That which occurs here
occurs elsewhere, —
That which does not occur here
occurs nowhere else.

అయితే, మహాభారతంలో కుంతికి, ద్రౌపదికి, ఉన్న ప్రాముఖ్యం గాంధారికి వ్యాఖ్యాతలు ఎవ్వరూ ఇవ్వలేదనే చెప్పాలి. అంతకన్నా ముందుగా చెప్పవలసిన విషయం – తెలుగు మహాభారతం నుంచి, కొన్ని కొన్ని భాగాలు తీసి, హైస్కూలు, కాలేజీ విద్యార్థుల పాఠ్యగ్రంథాలలో వేసినప్పుడు, మొదటి ఐదు పర్వాలకీ(ఆది, సభా, అరణ్య, విరాట, ఉద్యోగ)అందులోనూ ముఖ్యంగా విరాట ఉద్యోగ పర్వాలలో కొన్ని ఆశ్వాసాలకి ఇచ్చిన ప్రాముఖ్యత మిగిలిన పర్వాలకి ఇవ్వరు. బహుశా, అందుమూలాన కావచ్చు, గాంధారి గురించి మనకి తెలిసినది చాలా తక్కువ. ప్రత్యేకించి తెలుసుకుందామనే కోరిక ఉంటే తప్ప.

గాంధారి ధృతరాష్త్రుని భార్య అని, భర్త పుట్టంధుడు కాబట్టి, తాను కూడా, కళ్ళకి గంతలు కట్టుకొని కాలక్షేపం చేసిన “పతివ్రత” అని, దుర్యోధనుడితో పాటు నూరుగురి కొడుకులకి, ఒక కూతురికి తల్లి అని మాత్రం కాస్తో కూస్తో కాలేజీ వరకూ తెలుగు చదువుకున్న వాళ్ళకి తెలుసుననే ఊహించవచ్చు. యుద్ధ షట్కం (భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు) తరువాత భారతంలోని మిగిలిన ఏడు పర్వాలూ, (శాంతి సప్తకం – శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ) క్లిష్టమైన వేదాంతం. వేదాంత పరిశోధకులు ఈ ఏడు పర్వాలూ చదువుకుంటారేమో తెలియదు. యుద్ధ షట్కంలో ఆఖరి పర్వం స్త్రీ పర్వం. దానిలోని, రెండవ ఆశ్వాసం చదివితేగాని గాంధారి గురించి పూర్తిగా తెలియదు.

గాంధారి ప్రసక్తి మొట్టమొదటిసారిగా, ఆదిపర్వంలో, పంచమాశ్వాసంలో వస్తుంది. గాంధారి సుబలుడనే రాజు గారి పెద్ద కుమార్తె. ఈమె, “అతిశయ రూప లావణ్య శీలాభిజాత్య సమన్వితగా” విని, భీష్ముడు ధృతరాష్త్రునకు గాంధారికీ వివాహము చేస్తే బాగుంటుందని విదురునితో అంటాడు. అంతే కాదు, గాంధారికి నూరుగురు పుత్రులు పుడతారని శివుని వరం కూడా వుంది. కురువంశాన్ని నిలపడం భీష్ముడి కనీస కర్తవ్యం. సుబలుడికి కబురు పంపుతాడు. గాంధారి తలిదండ్రులు ఈ వివాహానికి సమ్మతిస్తారు. గాంధారి తండ్రిమాట జవ దాటని కన్య. అయితే, గాంధారి బంధుజనులకి ఇది నచ్చదు. కారణం, ధృతరాష్త్రుడు పుట్టు గుడ్డి. నన్నయ గారు చెపుతున్నారు:

“అంగములలోన మేలుత్తమాంగ మందు
ఉత్తమంబులు కన్నుల యుర్వి జనుల
కట్టి కన్నులు లేవనుటంతె కాక,
ఉత్తముడుకాడె సద్గుణయుక్తి నతడు,”

అని గాంధారికి వినపడేటట్లు, బంధువులు అంటారు. గాంధారి తండ్రిమాట జవదాటనిదని చెప్పాముగా. ఆమె అప్పటినుండి, జీవితాంతమూ కంటికి గంతలు కట్టుకుంటుంది. ఈ పద్యాన్ని, విశ్వనాథ సత్యనారాయణ గారు, నన్నయ గారి “ప్రసన్న కథాకలితార్థయుక్తి” కి ఉదాహరణముగా చెప్పి, సుబలుడి సుముఖతనీ, గాంధారి ఒప్పుదలనీ పెనవేసి ఒక వ్యాఖ్యానం చేశారు. సత్యనారాయణ గారు చెప్పారనే గౌరవం తప్ప, ఈ వ్యాఖ్యానం ఏమంత సరసం గా నాకు కనిపించలేదు. అది ప్రస్తుతం అప్రస్తుతమే ననుకోండి.ఆ తరువాత, గాంధారి, కుంతికి ధర్మరాజు పుట్టిన వార్తవింటుంది. తనూ గర్భవతియే అయినా, తనకి ప్రసూతి కాలేదని పొట్టపై కొట్టుకుంటుంది. గర్భపాతమవడం, పరాశరుడి ధర్మమా అని ఆ పిండం నూరుభాగాలుగా నేతికుండలలో పెట్టడం, దుర్యోధనాదులు పుట్టడం జరుగుతుంది. ఇక్కడ కూడా గాంధారి పాత్ర ఏమంత మెచ్చుకోదగ్గదిగా కనిపించదు. మరొకసారి, ఉద్యోగపర్వంలో, కృష్ణ రాయబార సందర్భంలో గాంధారి cameo లా కనుపిస్తుంది కానీ, ఏ విధమైన ప్రత్యేకతా ఆమె పాత్రకి ఉండదు.

గాంధారి పాత్రలో గొప్పదనం,గణనీయత, గాంధారిలో స్త్రీసహజత్వం, స్త్రీ పర్వం, రెండవ ఆశ్వాసంలో కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ఆమె దురదృష్టమో ఏమో కాని, స్త్రీ పర్వం సాధారణంగా ఎవరూ చదవరు. చదివించరు. వ్యాసభారతంలో ఒకే ఒక్క శ్లోకం మినహా ఇంకేవీ ఎక్కడా ఉదహరించరు. ఆ శ్లోకం గురించి తరువాత చెప్పుకుందాం.

భారత యుద్ధం ఆఖరిదశ. కౌరవ సైన్యంలో అతిరథ మహారథులందరూ మరణించారు. “ఉత్తమ జనాలు డెబ్బది ఆరు కోట్ల ఇరువదివేలును, మ్రుక్కడి మూక ఇరువదినాలుగువేల మున్నూట ఇరివండ్రు,” చనిపోయినారు. దుర్యోధనుడు కూడా మరణించాడు. యుద్ధానంతరం, యుద్ధభూమి వర్ణనలతోను, పుత్ర పౌత్ర, బంధుజన పరివార మారణానంతరం శోకాలతోనిండిన పర్వం స్త్రీ పర్వం. ఆడవారి ఏడుపులు, పెడబొబ్బల వర్ణనలు ఎవరికి కావాలి? పాఠ్య భాగాలుగా పెట్టకపోవడానికి అదొక ముఖ్య కారణం కావచ్చు. మరొక విశేషం. ఈ పర్వంలో వర్ణనలకి వాడిన ఛందస్సులు, సాధారణంగా మనబోంట్లకి కొరుకుడు పడేవి కావు. ఉదాహరణకి తిక్కన గారు ఇక్కడ కొంచెం ప్రబలంగా వాడిన ఛందస్సులు చూడండి. మణికరనికరం, లయగ్రాహి, మంగళమహాశ్రీ, మానిని, భుజంగప్రయాతం, మంజుభాషిణి, దోదకం, నర్కుటం, బంధురం, లయవిభాతి, ఉపేంద్ర, ప్రణవ, స్రగ్ధర, ప్రహరణకలితం, అంబురుహం, మొదలైనవి. అందులోను, లయగ్రాహి వంటి వృత్తాలు వరుసగా ఒకదానితరువాత ఒకటి వస్తే, స్కూల్లో చదువుకునే రోజుల్లో ఈ పద్యాలు choiceలో వదిలేసే పద్యాలుగా ఉంటాయి.

ఈ ఛందస్సులు, అమ్ములు, విండ్లు, కళేబరాలు, తెగిన బాహువులు, కుత్తుకలు, నెత్తురులూ, ప్రేవులు, వగైరా వర్ణనలకు వాడడం అవసరమేమో నాకు తెలియదు. కాగా, ఇక్కడ తిక్కన గారి వచనం కూడా కొంచెం క్లిష్టంగానే కనిపిస్తుంది. అయితే, తేలికగా కళ్ళకు కట్టే వర్ణనలు లేకపోలేదు.

గాంధారి, కళ్ళకు కట్టిన గుడ్డ విప్పకుండా, అంటే తనవ్రతభంగము కాకుండా, సంగరస్థలిని వ్యాసుడిచ్చిన దివ్య దృష్టితో చూసి, తన దుఖాన్ని కృష్ణుడితో చెప్పుకుని విలపించే ఘట్టాలు తప్పకుండా అందరూ చదవ వలసిన ఘట్టాలు.

మచ్చుకి కొన్ని చక్కని “సులువైన” పద్యాలు చూద్దాం.

“ప్రాణంబులు విడిచియును కృ
పాణాదులు విడువకున్న భటులారయ స
ప్రాణులపోలెం బ్రథన
క్షోణికి దొడవగుచు నుంకి చూడుము కృష్ణా.”

ఇదంతా నువ్వు దగ్గిర వుండి చేయించావని దెప్పుతూ,

“అవయవములు రూపరగ గ్రవ్యాదభక్షి
తంబులై యుంకి కొన్ని శవంబు లువిద
లెంత సూచియు నవి కొందరెరుగజాల
రయ్యెదరు సూడు తమ బంధులగుట కృష్ణ,”

అని చెపుతుంది. ఆ తరువాత దుర్యోధనుని కళేబరము చూసి, మూర్ఛిల్లుతుంది, గాంధారి.

సేద తేరుకొని, దుర్యోధనుడు, యుద్ధానికి పోబోయే ముందు తనదగ్గరికి వచ్చి జయసిద్ధికి దీవించమని అడిగితే, “…. ధర్మంబేతల ననూనమగు నిద్ధ మాతలకు నెట్లయిన సిద్ధమగు,” అన్నది గాంధారి. అంటే, ధర్మము ఎటు వుంటే అటే జయం అని చెప్పింది. గాంధారి మాటకు తిరుగు లేదు. నీకే జయమగు గాక అని వుంటే ఏమయ్యేదో తెలియదు. విపరీతమైన శోక బాధతో, ఆనాడు తను దుర్యోధనునితో చెప్పిన మాటలు తిరిగి కృష్ణుడికి చెప్పింది. కొడుకు చావుకన్న కోడలు పడే శోకబాధ ఎంత తీవ్రమైనదో చెప్పుతున్నది, ఈ క్రింది పద్యంలో.

“కొడుకు చావు కంటె కోడలి యడలున
పెరిగి శోకవహ్ని దరికొనంగ
అంతరంగ మిప్పుడగ్గల మెరియంగ
దొడగె దీనికేది తుది యుపేంద్ర.”

అట్లాగే దుశ్శాసనుడి శవం, అభిమన్యుడి శవం, కర్ణుడి కళేబరం చూసి విలపిస్తుంది.

” కాకులును గ్రద్దలును తిన్న గడుసు ద్రెస్సి
అపరపక్ష చతుర్దశి అమృతకరుని
కరణి నొప్పెడు కర్ణుని మొగంబుమీద
వనిత యందంద మోపెడు తన మొగంబు,”

అని కర్ణుని భార్య విలాపం కృష్ణుడికి చెపుతున్నది.ప్రారంభంలో అన్నాను, స్త్రీపర్వంలో ఒకే శ్లోకాన్ని ఉదహరిస్తారని. ఇప్పుడు ఆ శ్లోకం, అదే భావం తిక్కన గారి తెలుగులోనూ చూద్దాం.

భూరిశ్రవుడనే రాజు చెయ్యి అర్జునుడు నరికివేశాడు. చెయ్యి తెగిపడివున్న వాడి తల విరుగగొట్టాడు సాత్యకి. ఆ భూరిశ్రవుడి భార్య యుద్ధానంతరం శ్మశానంలో, భూరిశ్రవుడి శవందగ్గిర విలపిస్తూ అన్న మాటలు గాంధారి చెపుతున్నది.

ఈ శ్లోకాన్ని, ముమ్మటుడు తన కావ్య ప్రకాశ లోను, ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకంలోను, ఒక రసం మరొక రసానికి అంగంగా ఎట్లా ఉపకరిస్తుందో చూపించడానికి ఉదాహరణగా చెప్తారు. ఇది చాలా ప్రసిద్ధికెక్కిన శ్లోకం.

“అయం స రశనోత్కర్షీ పీనస్తన విమర్దనః
నాభ్యూరుజఘనస్పర్శీ నీవీవిస్రంసనః కరః.”

భూరిశ్రవుడి భార్య అతని తెగిన చేతిని పట్టుకొని విలపిస్తూ అన్న మాటలు ఇవి.ఈ చెయ్యి నా వడ్డాణము లాగినది, ఈ చెయ్యి నా చనుగవ, బొడ్డు, మొల, తొడలు మొదలైన దేహభాగాలని ముట్టుకున్నది, అని భావం. స్త్రీ తన భర్తని గుర్తుకుతెచ్చుకొని విలపిస్తున్న సమయం.దీనిలో శృంగార రసం కరుణ రసం ఉన్నాయి.

ఈ శ్లోకాన్ని తిక్కన గారు చాలా వివరంగా అనువదించారు, చూడండి.

“మెలుపారగా బట్టి మొలనూలి మణులు గదల్చుచు దిగుచుచు దగులొనర్చు
చనుగవమీది కల్లన వచ్చి లలిత విమర్దనంబున లజ్జ మరల ద్రోచు
నాభి యూరులు జఘనము మెత్త మెత్తన యొత్తి ముదంబున నుల్ల మూంచు
ననయంబు తిన్నని యనువున గనయంబు ప్రిదులంగ మెలగి చొక్కదవ చేయునిక్కరంబు నెయ్యమెక్కింనేరంగ
దగిలి సంతతంబు తలచునట్టి
భంగిమెరయ కీడువరుపంగ గొనియాడ
వలతి నీరు సేయవలసె దీని.”

ఇటువంటి చరిత్రగల గొప్ప చేతిని బూడిదపాలు చెయ్యవలసివచ్చిందే అని శోకం, విషాదం వెలిబుచ్చుతున్నది.ఈ విషాదం గాంధారికి దుర్భరమయ్యింది. ఆఖరుగా కృష్ణుడితో అంటున్న మాటలు చూడండి.

“ధృతరాష్ట్ర పాండు భూపతుల కుమారులు తమలోన నీసున సమరమునకు
దొడగిన నీ వడ్డపడవైతి తగు చాలు మానుషుల్ కలిగియు మాననీయ
వాక్యుండవయ్యును శక్య సమస్త కార్యుండన పేర్కొనియును ఉపేక్ష
చేసితి కురు రాజు చెరుపన తిరిగితి నిఖిల రాజుల తదనీకములనునామ మడచి తెల్ల భూములు పాడయ్యె
నంతవట్టు ఫలము ననుభవింపు
మే పడంగ నిన్ను శాపానలజ్వాల
దగ్ధమూర్తి చేయుదాన వినుము.”

నువ్వు ఈ యుద్ధాన్ని ఆపగల సమర్థుడివి. అయినా నీవు ఆ పని చెయ్యలేదు. అందుగ్గాను నేను నిన్ను శపిస్తున్నాను. కృష్ణుడిని, అతని యాదవ కులాన్నీ, దిక్కులేని చావు చస్తారని శపిస్తుంది, గాంధారి.యుద్ధభూమి, యుద్ధానంతరం ఎలా ఉన్నదో, వివరంగా చేసిన వర్ణనలు, అటు వ్యాసుడు, ఇటు తిక్కన గారు, స్త్రీ నోటినుండి చెప్పించడం గుర్తించాలి. యుద్ధం తెచ్చే భీభత్సం, తదుపరి వచ్చే శోకం, బాధ, స్త్రీ హృదయానికి పట్టినట్లు, పురుషులకు పట్టదు. అంటే పురుషులకు ఆ బాధ తెలియదని కాదు. ఆ భావాలు స్త్రీ వ్యక్త పరిచినట్లుగా పురుషుడు చెప్పలేడు. అర్థమయ్యే కొద్ది భాగాలూ, ఆ భీభత్స వర్ణనలూ, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. అచ్చంగా టీ.వీ చూసినట్టే నన్న మాట.

ఈనాడు ప్రతిఒక్కరూ స్త్రీపర్వం క్షుణ్ణంగా చదవడం అవసరమనిపిస్తోంది.

పోతే, నేను ఏరుకున్న ఉదాహరణలు తేలికగా అర్థమయ్యే “తెలుగు” పద్యాలు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అందరి సంగతీ అనవసరం. నా బోటి వాళ్ళకి, సంస్కృతం రానే రాదు. పోనీ నష్టం లేదులే అని అనుకుంటే, చక్కని తేట తెలుగు అర్థం కాదు. చిన్న చిన్న తెలుగు పద్యాలు, తిక్కన గారి తెలుగు పద్యాలు, నిఘంటువు లేకుండా బోధ పడటల్లేదని బాధ. పదమూడవ శతాబ్దపు తెలుగు మాటలు ఇప్పుడు వాడుకలో లేవు. మాటలలో మార్పు, మనం ప్రస్తుతం వాడే భాషలో వచ్చిన మార్పులు, భారతం లాంటి ఇతిహాసాలు చదవడానికి ఇబ్బంది కలిగిస్తున్నాయి.

ప్రాచీన సాహిత్యం అంతటికీ, ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు, వ్యాఖ్యానాలు రాసుకోవలసిన అవసరం ఉన్నదని వేరే చెప్పక్కరలేదు. అది ఒక ఎత్తు. నా ఉద్దేశంలో, భారతం వంటి గ్రంధాన్ని, తిరిగి ఈ నాడు వాడుకలో ఉన్న భాషలోకి అనువదించుకోవడం అవసరం. అప్పుడే ఇతిహాసాలకి కావలసిన ప్రజాదరణ వస్తుంది. లేక పోతే, అవి ప్రత్యేకంగా పండితుల పరిశోధనలకే పనికి వస్తాయి. బహుశా, అదికూడా మరుగున పడిపోతున్నదేమో, తెలియదు.

పాశ్చాత్య దేశాలలో, వారి వారి ఇతిహాసాలు, మత గ్రంధాలూ కొత్తగా పలుమారులు, పలు తరాలలో అనువాదాలు చేసుకున్నారు. ఇంకా ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. ఆ గ్రంధాలు అన్ని తరాలలోనూ, సజీవంగా ఉంచాలన్న కోరికే ఈ నూతన అనువాదాలకి ముఖ్య కారణం. ఇది మనకి సరికొత్త విషయంగా కనిపించవచ్చు. ఎవరో ఎప్పుడో అన్నారుట, ” Classics are to be retold from time to time, అని. తథాస్తు.

    
   

12అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    కొడవళ్ళ హనుమంతరావు June 2, 2009 10:35 pm

    మూడేళ్ళ క్రితం ఈ వ్యాసం చదివినప్పుడు స్త్రీ పర్వం చదవాలి అనుకున్నాను గాని, మిగతా పర్వాలలాగే దానినీ చదవడానికి ఇంకా కుదరలేదు. ఇవాళ సాయంత్రం మా అమ్మాయిని పార్కుకి తీసుకెళ్తూ ఏ పుస్తకం తోడు తీసుకెళదామా అనుకొని, నా కంప్యూటర్ వ్యాసానికి గడువు దగ్గర కొచ్చింది, కాస్త మంచి తెలుగు మాటలున్న దేదైనా చదివితే ఉపయోగపడుతుందని, ఓ తెలుగు పుస్తకాన్ని తీసుకుకెళ్ళాను. అది వడలి మందేశ్వరరావు గారి “శోకం నుంచి స్వర్గానికి: (ఆంధ్ర మహాభారతంలోని స్త్రీ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాల కథాకథనం).”

    నిఘంటువు అవసరం లేకుండానే, దీంట్లో గాంధారి గుండె మంట మనల్ని కాల్చేస్తుంది. గాంధారి శాపమున్న పద్యాన్ని విశ్లేషిస్తూ, వడలి మరో పద్యాన్ని గుర్తు చేశారు. దీనిని భారతంలో కెల్లా చెప్పుకోదగ్గ పద్యమంటారు. నాకు చాలా ఇష్టైమైన పద్యం కూడా. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు సభలో దక్షులైన సభాసదులు ఉపేక్షిస్తే సర్వనాశనం తప్పదని హెచ్చరించే పద్యం:

    “సారపు ధర్మమున్ విమల సత్యమున్‌ పాపముచేతన్‌ బొంకుచేన్‌
    పారమున్‌ పొందలేక చెడఁబాఱినదైన యవస్థ దక్షు లె
    వ్వార లుపేక్ష సేసిరది వారలచే టగుఁగాని ధర్మని
    స్తారక మయ్యు సత్యశుభదాయక మయ్యును దైవముండెడున్.

    సమాజంలో సత్యం, ధర్మం దారుణంగా పతనమౌతూ ఉంటే, దానిని నిరోధించే
    శక్తి కలిగి ఉండీ, ఉపేక్షచేస్తే, ఆ ఉపేక్ష ఫలితం తమ పతనానికీ, సర్వ
    అనర్థాలకూ కారణమవుతుంది.”

    గాంధారి కృష్ణుణ్ణి, కురుపాండవుల మధ్య యుద్ధాన్ని ఆపగలిగే సామర్ధ్యం ఉండీ ఉపేక్ష చేశాడనీ, దానికి ఫలితం అనుభవించాలనీ శపిస్తుంది.

    “దక్షులెవ్వారు లుపేక్ష సేసిరది వారల చేటగు” – అది అనేక సందర్భాలలో గుర్తుంచుకోవాల్సిన మాట.

    కొడవళ్ళ హనుమంతరావు

  2. 2
    Srinivas Nagulapalli June 3, 2009 7:06 am

    మంచి వ్యాసం. చక్కని పద్యాలను ఎన్నో విషయాలను గుర్తుండేలా చెప్పారు.
    ఇది ఇటీవల మృణాళిని గారి “గాంధారి” వ్యాసాన్ని (“అంధ్రజ్యోతి”లో)గుర్తుకుతెచ్చింది. ఆ వ్యాసం కూడా గాంధారి గురించి ఆలోచనాత్మకంగా, మంచి పరిశీలనతో వ్రాయడం ఆకట్టుకుంది. మా అమ్మకు ఫోనులో పూర్తి వ్యాసం చదివి వినిపించాను, కాని కాపీ చేద్దామనుకొని చేయాలేకపోయాను.

    గాంధారి కృష్ణుని శపించడం అమెరికాలో tongue_in_cheek అనడానికి నిలువెత్తు దర్పణంలాకా తోస్తుంది. వేలూరి గారు వివరించినట్లు “ధర్మంబేతల ననూనమగు నిద్ధ మాతలకు నెట్లయిన సిద్ధమగు” _”ధర్మం ఎటు వుంటే అటే జయం” అన్న గాంధారి, ధర్మము యొక్క అవగాహన, స్పృహ స్పష్టంగా తెలిసికూడా, దాని పర్యవసానంగా వచ్చే పరిణామాలు అంతకంటే బాగా “చూడగలిగి” కూడా, బిడ్డలను కట్టడి చేయలేకపోవడం, చూసే కళ్ళున్నా గంతలు కట్టుకొన్న చందాన సాక్షాత్కరింపచేసిన వ్యాసుని brilliance ఊహించినప్పుడెల్లా అద్భుతమనిపిస్తుంది! యుద్ధాన్ని కృష్ణుడు ఆపగలిగి కూడా ఆపలేదని రగిలిన గాంధారికి, తను ఇవ్వబోయే, లేదా ఇచ్చిన శాపాన్ని సైతం కృష్ణుడు ఆపగలగికూడా, ఆపలేదనే స్పృహ తట్టకపోవడం, కాదుఆమెకు
    తట్టకుండా ఉండేటట్లు చెప్పడం, ఆ పాత్రకు ఎంతో సహజత్వాన్ని ఆపాదిస్తూ
    వ్యాసుడు చేసిన అమేయ రూపకల్పన అనికూడా అనిపిస్తుంది!
    _____
    విధేయుడు
    _Srinivas

  3. 3
    rama bharadwaj June 3, 2009 10:17 am

    హనుమంతరావు గారూ!!
    తప్పకుండా ఆంధ్ర మ హాభారతం కాస్త తీరుబాటు దొరికినప్పుడల్లా కొంచెమ్ కొంచెం గానైనా చదవ్వల్సిన ఇతిహాసం. ఉత్తమ తెనుగు[బహుమంచి తెనుగు]మీకు ఎదురుపడుతుంది. చదువుతూ ఉంటే అప్పుడు తెలుస్తుంది, తిక్కన గారు తెలుగు వాడకంలో ఎంతటి నేర్పరులో! మీకు మంచి పుస్తకాల్ని సేకరించుకుని చదివే అలవాటు ఉన్న ట్టుగా అర్ధమౌతోంది. భారతం చదవటం మంచి సాహిత్యానుభవం సుమండీ!!

    వెంకటేశ్వర్రావు గారు అన్న ట్టు …ముఖ్యమైన తెలుగు పుస్తకాలకి ఇవాళ్టి వాడకంలో వ్యాఖ్యానాలు రావటం కూడా ముఖ్యమే! ఆంధ్ర మ హాభారతాన్నించి..అన్నమయ్య పద సాహిత్యం దాకా!! తెనుగుని నిలబెట్టుకోవటం కోసం ఇది అత్యవసరం. చదువరులంతా దీని గురించి గాడంగా యోచన చేయవలసిన ఆవశ్యకత ఉన్న ది.

    రమ.

  4. 4
    lyla yerneni June 3, 2009 4:47 pm

    నువ్వు ఈ యుద్ధాన్ని ఆపగల సమర్థుడివి. అయినా నీవు ఆ పని చెయ్యలేదు. అందుగ్గాను నేను నిన్ను శపిస్తున్నాను. కృష్ణుడిని, అతని యాదవ కులాన్నీ, దిక్కులేని చావు చస్తారని శపిస్తుంది, గాంధారి. – వ్యాసకర్త.

    అంతే. అంతే.
    అవును. కొందరు స్త్రీలు అలానే ఉంటారు. గాంధారిలా. వాళ్ళకే శక్తి ఉంటుంది. వాళ్ళే చెయ్యొచ్చు ఆ పని. ఐనా ఇంకెవరో మగవాడు ఆ పని చెయ్యలేదని సాధిస్తూ ఉంటారు. మగవాళ్ళు మనమే కదా శౌర్యవంతులం అని -స్త్రీ ఏడ్చిందనో, నవ్విందనో, దెప్పిందనో, మెచ్చుకుంది అనో -ఎలాటి యుద్ధాలైనా
    చేసేస్తూ ఉంటారు.

    మొత్తం యాదవ వంశాన్నే నాశనం చెయ్యగల, కృష్ణ నిర్యాణాన్నే ఘటించగల శాపం ఇవ్వగల శక్తిఉన్న గాంధారికి, భారత యుద్ధం ఆపే శక్తి లేదూ? ఉన్న ఆస్థి పంచుకు తినలేక, పోట్లాటలు సృష్టించుకునేవాళ్ళు ఆమె ఇంట్లో వాళ్ళూ, యుద్ధం ఆపాల్సింది కృష్ణుడూనా?

    మరి భారతకథ రాసిన పురుషులు సరే, పై వ్యాసం రాసిన, చదివిన, ఈనాటి పురుషులూ, ఆ కథలో గాంధారీ నారికి ఆ శక్తి ఉన్నదనీ గ్రహించరు. ఎందుకనో?

    దక్షులెవ్వారు? స్త్రీలా? పురుషులా? అని ఆలోచిస్తున్నాను. 🙂

    లైలా
    PS: I liked this essay three years back and I still like it today.

  5. 5
    M.S.Prasad June 4, 2009 2:43 am

    మహా భారతం 18 పర్వాల్లో ఒకే ఒక్క సారి చదివింది చాలా చోట్ల విసుగుగా వదిలేసింది శాంతి పర్వమైతే అనేక సార్లు చదివినవి యుద్ధ పంచకం (భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తికాలు) + స్త్రీ పర్వం. (సాహిత్య అకాడమీ వారు శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు కలిపి ప్రచురించారు) . యుద్ధ పంచకం ఉత్సాహంతో అమూలాగ్రం చదివింప జేస్తుంది. (ఒక్క మినహాయింపు – సౌప్తిక పర్వంలోనె భీభత్త్సం అశ్వత్థామ పై అసహ్య భావాన్ని కలిగిస్తుంది) స్త్రీ పర్వమంతా కరుణా – శోక రసం. ఏకో రసః కరుణ ఏవ అన్న భవభూతి కావ్యం చదవలేదు కానీ, ఈ స్త్రీ పర్వం లోని కరుణా రస భరితమైన వర్ణనలు, శోక భరిత భావాలు కంట తడి పెట్టీంచక మానవు. వ్యాస కర్త గారు దిఙ్మాత్రంగా చూపిన కొన్ని పద్యాలు తిరిగి ఆ పర్వాన్నంతా స్మృతిలోకి తెచ్చి స్పందింపజేశాయి. భారతంలో నా అభిమాన పర్వాల్లో స్త్రీ పర్వం ఒకటి. ఈ పర్వానికి నాయకురాలు గాంధారి, ఈ పాత్ర ద్వారా ఆవిష్కరించిన కరుణా శోక రసాలు, క్రోధావేశాలు మనస్సులను కదిలించివేస్తాయి. రచయిత గారికి కృతజ్ఞతలు.

  6. 6
    కొడవళ్ళ హనుమంతరావు June 6, 2009 10:11 pm

    “తిక్కన పదసంపద”

    “ఈ వెండ్రుకలు పట్టి యీడ్చిన యాచేయి దొలుతగాఁ బోరిలో దుస్ససేను
    తనువింత లింతలు దునియలై చెదరి రూపఱియున్నఁ గని యుడుకాఱుఁగాక!
    యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చే యిది;”

    అని చదివితే, అబ్బ! ద్రౌపది కసి ఏం కసి, అనిపించింది. చిన్న చిన్న తెలుగు మాటలతో తిక్కన లెక్కలేనన్ని కొత్త కొత్త సమాసాలూ నుడికారాలూ మన భాషకి చేర్చాడట . ‘నెత్తురు మడువు’, ”కయ్యపునేల’, ‘మెత్తనిపులి’, ‘పెట్టనికోట’, ‘గుండెకాయ’, ‘చెలియలికట్ట’, ‘చిందరవందర’, ‘తేనె పూసిన కత్తి”, ఇలా అనంతం – అని భద్రిరాజు గారి వ్యాసంలో [1] చదివాను. తిక్కన కవితా శిల్పంలో సొగసులు చూడాలంటే, దగ్గరికిపోయి నిలకడతో చూడాలన్నారు. దానికి నాకింకాస్త తీరిక దొరకాలి.

    ముఖ్యమైన తెలుగు పుస్తకాలకి వ్యాఖ్యానాల అవసరం ఉంది కాని దాని గురించి కేవలం చదువుకున్న వాళ్ళు ఆలోచించి చేసేదేముంది? వాటిమీద పండితులు పని చెయ్యాలి. అందుకు తెలుగు విశ్వవిద్యాలయం లాంటి సంస్థలు సాయం చెయ్యాలి. “దక్షులెవ్వారు లుపేక్ష సేసిరది వారల చేటగు…”

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] భద్రిరాజు కృష్ణమూర్తి “భాష, సమాజం, సంస్కృతి”, పుస్తకంలో “తిక్కన పదసంపద” అన్న వ్యాసం.

  7. 7
    Srinivas Nagulapalli June 8, 2009 9:32 pm

    ఎప్పటిలాగానే, మంచి పుస్తకాన్ని భద్రిరాజుగారి వ్యాసవిశేషాలగురించి తెలిపినందుకు హనుమగారికి కృతజ్ఞతలు.

    పండితులుచేసే వ్యాఖ్యానాలగురించి ఒక్క మాట. భాషలో నుడికారాలు, సమాసాల సొగసులు, ఉక్తివైచిత్రి వగైరాల గురించి ఎంత చెప్పినా, అసలు చెప్పాల్సినదేదో ఎందుకో వదిలేసిన భావం, కొరత. అంటే వాటి ప్రాముఖ్యతను కాదనడం కాదు. కానీ అవన్నీ వాటికవే సొంతంగా ఎంతవరకు సాధారణ పాఠకులను పుస్తకానికి దగ్గరచేస్తాయి అని, అసలు అవేనా తిక్కన కవిత్వం అంత సొగసుగా అందిస్తున్నది అని కూడా అనిపిస్తుంది.

    నెత్తిమీదున్న బతుకు బరువుకు, ప్రస్తుత పరిస్థితులకు తిక్కన రచన ద్వారా ఏమైనా లబ్ధిపడే అవగాహన, నిశితమయ్యే దృక్కు, స్పష్టతనిచ్చే అభివ్యక్తి లాంటివి కొంతైనా, ఎంతైనా, వడలి మందేశ్వరరావు, జీ.వి.సుబ్రహ్మణ్యం గార్ల వలె అందించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఆ demand ఎప్పుడూ ఉంటుందని కూడా అనిపిస్తుంది. అట్లా కాకుండా వొట్టి పాండిత్య ప్రకర్షగా, భాషాశాస్త్రం, పద సంపద వివరించడం, వ్యాకరణ అంశాలతో
    వూదరగొట్టడం- రుచికర ఆహారపదార్థాలను scientists వాటి పుట్టుపూర్వోత్తరాలు, చెట్ల పేర్లు, వాటి రసాయనాలు, అవి జీర్ణించబడడానికయ్యే reactions- మొత్తం వాళ్ళకు తెలిసిన శాస్త్రమంతా పేజీలలో గుమ్మరించినట్లుంటుందేమో అని అనుమానం. తీరా ఇదంతా మనకు రుచి, బలం ఇచ్చే ఆహారం గురించే(నా) అన్నది కూడా మరిచిపోయేటట్లు చెప్తారేమోనని కూడా భయం! కుయ్యోమంటున్న పాఠకులను చూసి అయ్యో ఇంత పాండిత్యంతో రాసిన వ్యాఖ్యానాలు చదువుకొ(న)డం లేదని వాపోవడం కూడా అతిశయోక్తి కాదేమో అని కూడా అనిపిస్తుంది.
    ———-
    విధేయుడు
    _Srinivas

  8. 8
    Madhav June 24, 2009 5:10 am

    ఈ వ్యాసంపై అభిప్రాయాలలో కొన్నిటిని చర్చావేదికలో సాంప్రదాయ సాహిత్యం విభాగంలోకి మార్చాము. వ్యాసానికి ప్రత్యక్ష సంబంధం లేని అభిప్రాయాలను అక్కడ పోస్ట్ చేయగలరని మా విజ్ఞప్తి.

    – సంపాదకులు.

  9. 9
    gannavarapu narasimha murty October 6, 2015 1:53 pm

    వెంకటేశ్వర రావు గారికి వందనములు. పాత వ్యాసమును మిత్రులు నాచే చదివించారు. అద్భుతమైన వ్యాసము. సారపు ధర్మమున్ పద్యము నాకు కూడా బాగా నచ్చిన పద్యము. ఈ పద్యము ప్రతిలో దోషాలుండుటచే గణములు సరిపోవు. పద్యమిలా ఉండాలి.

    సారపు ధర్మమున్ విమల సత్యముఁ బాపముచేత బొంకుచేఁ
    బారముఁ బొంద లేక చెడఁ బాఱినదైన యవస్థ దక్షు లె
    వ్వార లుపేక్షసేసి రది వారల చేటగుఁ గాని ధర్మ ని
    స్తారక మయ్యు సత్య శుభదాయక మయ్యును దైవముండెడున్ !

    పారము = ఒడ్డు

  10. 10
    Pavan Santhosh.S October 22, 2015 2:15 pm

    కొడవళ్ళ హనుమంతరావు గారూ,
    “సారపు ధర్మమున్” పద్యం ఉద్యోగ పర్వంలో రాయబారానికి వెళ్ళిన కృష్ణుడు జరుగుతున్న బొంకునూ, పాపాన్ని అరికట్టి సత్యాన్ని, ధర్మాన్నీ కాపాడగల దక్షుడైవుండీ ఉపేక్షిస్తున్న భీష్ముడిని ఉద్దేశించి చెప్పిన పద్యంగానే నాకు తెలుసు. నేను మొమ్మొదట విశ్వనాథ సత్యనారాయణ రాసిన “సాహిత్య సురభి”లో వ్యాఖ్యాన సహితంగా అలానే చదువుకున్నాను. ఆపైన భారతం సెలెక్టివ్ గా చదువుకున్నప్పుడు, కొన్ని వ్యాఖ్యానాలు అవసరార్థం పరిశీలించినప్పుడూ కూడా అలానే ఉన్నాయి. ఐతే గాంధారి చెప్పడం నేనెక్కడా చూళ్ళేదు. అంతగా ధర్మాన్నీ, సత్యాన్నీ కాపాడలేదని నిందించి శపించాల్సివస్తే ఆవిడ ఎక్కడో ద్వారకలో కూర్చొని ద్రౌపది మానాన్ని సంరక్షించిన కృష్ణుణ్ణి కాక కురుసభాసదులనే శపించాలి. అదంతా అటుంచినా పద్యం మాత్రం మీరు చెప్పిన సందర్భంలోనిది కాదనే నా ఎరుక.
    ధన్యవాదాలతో,
    పవన్ సంతోష్

  11. 11
    SRK December 7, 2020 10:26 am

    Dear Veluri garu

    “ఈ వ్యాసం నేను ఒక వారం క్రితం చదివి ఉండవలసింది, నా అవీ యివీ ముచ్చట్లు: భారతంలో పురుషార్థాలు (మొదటి భాగం ఈమాట డిసెంబరు 2020లో వేశారు, రెండవది జనవరిలో వస్తుంది) ప్రచురించేముందు.

    మీ వ్యాసం మౌలికము, అరుదైనది, అవసరమైనది. చాలా ముఖ్య విషయాలు మీ వ్యాసంలో స్పృశించారు.

    గాంథారి విషయంలో విశ్వనాథ వ్యాఖ్య ఏమిటి? నేను విన్నట్టు లేదు.

    సాదరంగా, మూర్తి.

  12. 12
    Dinitha Rani July 13, 2024 8:53 am

    పైన చాలా మంది ఉత్తమ పురుషులు మాత గాంధారిపై అనవసరంగా ఏడుస్తున్నారు ఎందుకో?? ఇక్కడ కూడా బాధ చూడకుండా ఆడ, మగ భేదం చూస్తున్న మహాపురుషులకి వందనం. అసలు ఆవిడ చేసిన నేరం ఏముంది? బిడ్డని మోసి కంటే ఆ నరకం, బాధా తెలుస్తాయి, పుత్ర శోకం ఎంతటి నరకమో తెలుసు కనుకే శ్రీ కృష్ణ పరమాత్మ ఆవిడ శాపాన్ని స్వీకరించాడు, ఇక పైన ఎవరో మహితాత్ముడు ముందే దుర్యోధనుడిని అదుపులో పెట్టవచ్చు కదా అని సెలవిస్తున్నారు. 🤣

    విషయం ఏంటంటే తప్పులు అందరూ చేస్తారు, కృష్ణుడే కానీ తలుచుకుంటే యుద్ధం జరగకుండా ఆపి ఉండేవాడు, ఆయన భగవానుడు కనుక, కానీ ఆయన యుద్ధమే చేయించాడు అని ఆవిడ ఒక స్త్రీ మూర్తిగా సెలవిచ్చింది, ఒక కుటుంబానికి యజమాని లేకుంటే ఆ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒంటరి వాళ్ళే కదా? వృద్దాప్యంలో పిల్లలు మరణించారు అన్న వార్త ఏ తల్లితండ్రులకి మాత్రం గొప్ప వార్త అవుతుంది? అదే స్త్రీ పర్వం, భర్తా పిల్లలు అండ లేని స్త్రీ పడే రోదన అది, గాంధారి మాత జరిగిన నష్టానికి ప్రతీక. తెలుసుకోండి.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • ఎమితిని సెపితివె?
  • ఒక కవిత ఏమి చేయలేదు
  • పడమట సంధ్యారాగం
  • పడవ ప్రయాణం: కథ నచ్చిన కారణం
  • స్మరణ: కథ నచ్చిన కారణం

ఇటువంటివే…

  1. తెలుగు సినిమాలు స్త్రీ
  2. ఆధునిక చిత్రకళలో స్త్రీ మూర్తి
  3. స్త్రీ
  4. స్త్రీ పాత్ర
  5. సమాజంలో స్త్రీ స్థానం

మార్చి 2006 సంచికలో ...

  • “తండ్రి” తనం
  • అలసిపోయిన అస్థికలు – ఒక కవిత్వ సమీక్షా పరిచయం
  • ఆ సాయంత్రం – గరికపాటి పవన్
  • ఇది జీవశాస్త్రపు శతాబ్దం!
  • ఎవరిలో ఎవరో
  • కథాశిల్పం
  • కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా?
  • ఘోష
  • తెలుగు కైత
  • నామాట
  • పాదూఖండం
  • ఫిష్‌ దట్‌ గాట్‌ అవే
  • మంచి కవిత్వం – రిల్కే ఉత్తరాలు
  • మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి
  • మార్చి 2006
  • ముట్టు
  • మృతజీవులు – 2
  • వార ఫలం
  • సాహిత్యానువాదం – ఒక వివేచన
  • సివిలైజ్డ్ ఇన్ అమెరికా
  • స్త్రీ పర్వంలో గాంధారి
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

సాహిత్యానువాదం – ఒక వివేచన
పాదూఖండం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.