(సుమనశ్రీ ‘మహాస్వప్నం’ కు పరిచయ వాక్యాలు)
పని మీద బయటికి వెడతూ ఇంటికి తాళం వేసి, కుటుంబసభ్యులకోసం తాళం చెవి ఏ గూట్లోనో, కుండీ కిందో పెడుతుంటాం. అలాగే, కొంతమంది కవులు తమ కవిత్వపు తాళం చెవిని ఏ పద్యంలోనో దాస్తారు. సుమనశ్రీ కవిత్వ హర్మ్యానికి తాళంచెవి ‘విహ్వల నేత్రం’ అనే కవితలో నాకు దొరికింది.
‘నా కవితా సామాగ్రి అంతా
ఒక మేఘశకలంలో నిక్షిప్తమై ఉంది.
శస్త్ర తుల్యమైన సామాన్య మానవుడి వాక్యం
నా నోట్లో పడి ఒక మాహాకావ్యమై పెల్లుబుకుతోంది
ఒక చెట్టు కింద కూర్చుని మూట విప్పుకుని
దృశ్య చిత్రాల స్వప్నఫలాలను ఆరగిస్తున్నాను.’
ఇందులో ఇతని తత్త్వమూ, పద్ధతీ నిక్షిప్తమై ఉన్నాయి. సామాన్యమానవుడి సామాన్య అనుభవాల్నించే ఇతని కవిత్వం అద్భుతమౌతుంది. ఇంతలో దానికి రెక్కలు పుట్టుకొచ్చి స్వప్నలోకాల్లో విహరించబోతోంది. ఇక ఎన్ని దృశ్య చిత్రాలు! ఎన్ని స్వప్న ఫలాలను మనచేత ఆరగింపచేస్తాడో!
ఐతే, ఈ స్వప్నలోకమెక్కడిది? తనలోదే. తన ఉపచేతనే, కవిత్వానుభవాన్ని అభివ్యక్తీకరించటానికి ఉపచేతనలో మునిగివున్న చిత్రాల్ని సాధనాలుగా ఉపయోగించుకోవటం ఫ్రెంచి సర్రియలిస్టుల కాలం నించి చూస్తున్నాం. ఈ కవి అంటాడు –
రెండు స్వప్నాక్షరాలు చాలు
ఈ కవిత మొత్తం శ్వాసించడానికి. (రెండు స్వప్నాక్షరాలు)
మరో చోట అంటాడు :
‘జీవిత రహస్యాల్ని ఛేధించడం నా హాబీ
మృత్యు రహస్యాల్ని ఆవిష్కరించడమన్నా
స్వర్గాంతర ద్వారాల్ని తెరుస్తూ
స్వప్నలోకాల్ని ఆవిష్కరించడమన్నా నా కత్యంత సరదా’ (రహస్యాక్షరం)
‘స్వప్నసముద్రం లోంచీ అనే కవితలో అంటాడు : ‘స్వప్నాన్ని ఆరాధిస్తూ స్వప్నాన్ని అధిరోహిస్తూ నన్ను నేనే ఒక స్వప్నంగా ఈ స్వాప్నిక ప్రపంచంలో రూపు దిద్దుకుంటూ’.
ఐతే, సుమనశ్రీ గుండెకాయ ఉండవలసిన చోట ఉంది. కనక మంచి కవిత్వం రాయగలిగాడు. ‘విహ్వలనేత్రం’లో అంటాడు :
‘నా ఒంటరితనం నా చుట్టూ నేనల్లుకున్న వలా
‘ఒకే ఒక్క స్నేహితుని జాబు కోసం
యుగయుగాలుగా నిరీక్షిస్తున్నవాణ్ణి
‘అడక్కుండా మీ ఇంట్లో కొస్తున్న అతిథినీ.
ఉల్లిపాయకు లాగే కవికి కూడా ఒంటరితనం లేదా శూన్యం, కేంద్రస్థానం అనుకుంటాను. దాన్ని నింపటం కోసమే రకరకాల అనుభవాల్నీ, రంగురంగుల మాటల్నీ ఏరుకోవటమూ, తనకీ లోకానికీ మధ్య సమన్వయం కోసం నిరీక్షణానూ. మనం సామాన్య మానవులం, మనం కూడా కవిలాగే అభిశప్తులం కనక, అడక్కుండా మన ఇంట్లోకి రాగలిగినవాడు కవొక్కడే.
‘తీరని కోరికే కవిత్వం’ అనే పద్యంలో అంటాడు :
పసిపిల్ల స్వచ్ఛమైన మనసు నా గీతమైతే బాగుండును
పసిపిల్ల ఒళ్ళో పడుకుని అమ్మని గురించి కలలు కంటానూ
‘పసితనం నాటి అమాయకత్వాన్ని తిరిగి గెలుచుకోవటమే కవిత్వామని మెక్సికన్ కవి ఒక్తావియో పాస్ అంటాడు.
ఈ కవికి జీవితం మీద అమితమైన ప్రేమ. నిత్యం జీవితోత్సవం జరుపుకుంటున్నట్లు కనిపిస్తాడు.
‘కలల్ని కౌగలించుకోలేని నువ్వు జీవితంలో
ఏ సుఖాన్నీ అందుకోలేవు;. (కొవ్వొత్తి సుందరి)
‘మబ్బులతో ఆకాశంలో ఎలా యుద్ధం చేస్తున్నాడో చంద్రుడు
జీవితం మీద వాడికెంత ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే
నీ కోసమే ఎదురుచూస్తున్న నన్ను చూడు
నా చూపులో మెరుస్తూ కదుల్తున్న ఆశల పల్లకీని చూడూ
(రా ఇలా వచ్చి కూచో)
‘ఉదయం కిటికీ ముందూ అనే కవితలో తెల్లారకట్ట వెలుతురు రేకులు విప్పుకుంటుంటే కిటికీ ముందు కూచుని గమనిస్తే కలిగే ఆనందాన్ని ఆహ్లాదకరంగా ఆవిష్కరించాడు. అలాగని జీవితంలో కష్టాలకు కళ్ళు మూసుకుంటాడని కాదు. ‘కొవ్వొత్తి సుందరీలో అంటాడు –
‘దుఃఖాభిషేకాన్ని కానుకగా అనుభవించడమే జీవితమని
అనుభవంలోనే అర్థమవుతుందీ
‘చీకటీ వెలుగూ మనకీ బంధువులే –
ఎంత అందంగా ఉంటాయి అవి రెండూ !’
‘ఆకాశంలోంచి క్రిందికి చూడ్డం నేర్చుకో
నీకు పగలూ రాత్రీ అందంగానే కనిపిస్తాయి.’
సుమనశ్రీ విషయంలో నాకు ముఖ్యంగా నచ్చిందేమంటే, ప్రణయకావ్యాలు రాయటానికి జంకడు. ఇది ఫ్యాషన్ కాదని దూరంగా పోడు. ఐతే, తను అధ్యాత్మిక కవినంటాడు సుమనశ్రీ :
‘బింబ ప్రతిబింబాల్లా నీలోకి నేనూ నాలోకి నువ్వూ
అంతర్ధానమవుతున్న ఒక అధ్యాత్మిక సందర్భం !” (‘దగ్ధ క్రీడా)
నిజమే నేమో, స్త్రీ పురుషుల అద్వైతం అధ్యాత్మికం కాకపోతే, మరేది అధ్యాత్మికమో నాకర్థం కాదు. ఈ పుస్తకంలోని మొదటి కవిత ‘స్నేక్ వాకింగ్’ చిత్రమైంది. ఇది పురుషాహంకారంతో తాసింది కాదు. ఇందులో పురుష దైన్యం తప్ప మరేమీ లేదు. ఒక్కొక్కప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళకు అర్థం కారు. వీళ్ళని ఏడిపించటానికే అలా ప్రవర్తిస్తున్నారా? అనిపిస్తుంది.
‘ఆడవాళ్ళకంతా తెలుసు, అందుకే నిమ్మళంగా కూర్చుంటారూ
‘మగవాళ్ళం మనమే తొందర పడిపోతుంటాం’
‘చెదిరిపోతున్న మనసులతో కరిగిపోతున్న మనుషుల్ని చూస్తూ
లోలోపలే పకపకా నవ్వుకుంటూ ఉంటారూ
ఇది నాకు అనుభవ విదితమే. ఎందుకంటే, నన్ను లాలించి పెంచిన వాళ్ళూ స్త్రీలే, నన్నేడిపించిన వాళ్ళూ స్త్రీలే !
సుమనశ్రీలో నాకు నచ్చిన విషయం మరొకటుంది. ఇంతవరకు తను రచించిన కావ్యాలన్నీ (ఇదిగాక నాలుగనుకుంటాను) తన అర్ధాంగికే అంకితమిచ్చాడు. ఇటువంటి కవి నాకిష్టుడు కాక మరేమౌతాడు.
24-11-93