నూతిలో తాబేలు
నూతిలో తాబేలుందంటే
కోతిమూకలా పరిగెత్తాం పిల్లలమంతా.
తొంగి చూస్తే మా తలకాయలూ
నింగి నీలిచట్రమూ కనిపించాయి.
రాళ్ళూ గెడలూ ఏరుకొచ్చి
నీళ్ళన్నీ కలిచేశాం కాని
తాబేలు పైకి తేలలేదు, సరికదా మా
తలకాయలు కూడా అదృశ్యమయాయి.
ఆకాశపు నీలిమంట బావి
ఆవలి కొసని వెలిగించి,
నూతిలోకి తిరిగి
మా తలకాయలు ప్రవేశించాక
కలక దేరిన బావి నీటిని
నిలకడగా తేరి చూశాను;
అదిగో! నా కళ్ళ వెనక పుర్రె లోపల్నే
కదలకుండా కూచుంది తాబేలు.
వాన్‌గో చెవి
ప్రియురాలి మీది ప్రేమ కొద్దీ
లోకం మీది జాలి కొద్దీ
వాన్‌గో తన చెవి కోసేసుకుని
ఆకాశానికతికించాడు.
అప్పట్నించీ అది
కాస్త రక్తాన్నీ
కాస్త కన్నీళ్ళనీ
కాస్త ఎండనీ
కాస్త నీడనీ
కాస్తోనే ఉంది.
గుండె బాటలు తెరుచుకున్న
వాసనార్ వనంలో
గుర్రపు బగ్గీల పగ్గాలు
వాన్‌గో చెవి నించే
వెలువడతాయి ప్రతి మధ్యాహ్నం
వెలుగు నీడల స్వరాల్ని
పీలికలుగా చింపి,
అతికించి మళ్ళీ చింపి
శ్రుతి శుద్ధంగా పారే
అమ్‌స్టర్‌డమ్ కాలవల
వలయాల సొరంగాలు
వాన్‌గో చెవిలోవేనని
ఎంతమందికి తెలుసు?
చీకటి గదిలో కూచుని
కూకటి వేర్లని తవ్వుతున్నాడీ కుర్రాడు.
ఎప్పుడూ గోడకి ఒకవేపే
ఎండ కాస్తుందేం?
రెండు వేపులా కాయించాలనుకున్నాడు.
వాన్‌గో రెండో చెవి కత్తిరించి
నింగి కీ వేపు వేలాడతీయాలి.
చెంగున లేచి
వాన్‌గో మ్యూజియానికి పరిగెత్తాడు.
చాకు విప్పి
చెవి కత్తిరించే లోగా
మ్యూజియం కీపర్లు
ముసిరిపట్టేసుకున్నారతణ్ణి.
అందుకని, గోడకో వేపే
ఎండ కాస్తుంది.
కీర్తిశేషుడైన కవి
కీర్తిశేషుడైన కవి
కాలసాగర తీరాన
కాస్సేపు పచార్లు చేసి
గులకరాయొకటి
గిరవాటేసి
తిరిగి వెళ్ళిపోయాడు.
లోకమనే కుక్కపిల్ల
తోకూపుకుంటూ వచ్చి
గులకరాయిని చూసి
కొరికేందుకు ప్రయత్నించింది.
ఇటువంటి రాయి అది
ఇదివరకు చూళ్ళేదు.
కవి వదిలిపోయిన రాయి
కుక్కపిల్లని బాధిస్తోంది.
ఊడపెరికిన కన్నుగుడ్డులా
అన్ని దిక్కులూ పరికిస్తోంది.
తను లేకపోయినా
తనకేసే చూస్తోంది రాయి.
ఆకాశానికీ అరచేతికీ మధ్య
ఆకారం తాల్చిన రాయి
గుండ్రంగా దొర్లుతూ సముద్రపు
గోళ్ళనించి తప్పించుకుంటుంది.
గుండ్రంగా విత్తనంలా పాతుకుని
మృత్యువుపై పచ్చటి బాకు దూస్తుంది.
మా ఆవిడ
ఒక చేత్తో ఆకాశాన్ని ఎత్తి పట్టుకుంటుంది.
ఒక చేత్తో భూమిని బుజ్జగిస్తుంది.
ఒక పిట్ట చేత్తో కన్నీటి బీజాల్ని ఏరుకుంటుంది.
ఒక సెలయేటి చేత్తో బండల్ని నిమిరి ఓదారుస్తుంది.
ఒక చేత్తో అన్నం వడ్డిస్తుంది.
ఒక చేత్తో పిల్లల్ని లాలిస్తుంది.
ఒక జ్వాలాహస్తంతో చీకట్లని సాగనంపుతుంది.
ఒక నక్షత్రహస్తంతో సూర్యుణ్ణి ఆహ్వానిస్తుంది.
ఒక చేత్తో విధిని నిలేస్తుంది.
ఒక చేత్తో చిరునవ్వులకి సిగ్నలిస్తుంది.
అన్ని దిక్కులా చేతుల్తో
ఆకులతో చక్రమై
జీవితబ్బండిని
ఠీవిగా నడిపిస్తుంది.
కృష్ణ ఝరి
పదాల గులక రాళ్ళని
పదిలంగా అరగదీసి
పక్కపక్కన పొదిగి
బతుకుంతా కరిగి
కలస్వనంతో పాడే
సెలయేరు కృష్ణశాస్త్రి.
పురాతన కావ్యాల
శిలాతల గర్భాల్లో
శీతలగళంతో రవళించిన పాటే,
వెచ్చటి కోరికలతో
పచ్చిక బయళ్ళెమ్మట
గంతులేస్తోంది నేడు.
విరహి బాష్ప నక్షత్రాల్ని
ఒరసి పారి మెరుగుదిద్దే
చీకటి సెలయేటి లోని
చిక్కటి విషాదపు జీర
కృష్ణశాస్త్రి! నీ గళంలో
కలవరపడుతోంది.
నడిరేయి ఏకాంతంలో
కడుపు చించుకుని
వెల్లువలై పారే
పిల్లంగోవి గుండె అగాధాలు
కృష్ణశాస్త్రి! నీ గొంతులో
క్రీనీడలో పరుస్తాయి.
ఇరుచెంపల్ని తాకి
ఒరుసుకుంటూ పారే
ప్రియురాలి కురుల సెలయేరులా
కృష్ణశాస్త్రి! నీ పాట
ప్రపంచపు అందాల్ని
పొదివి పడుతుంది.
నా సైకిలు
దీన్నేను తీసుకెడుతున్నానో
నన్నిది తీసుకెడుతుందో
నాకు తెలీదు.
నా కవిత్వం లాగే.
ఆకాశానికీ రోడ్డుకీ మధ్య
చక్రాలు తిరుగుతాయి.
అధికభాగం ఆకాశంలోనే.
అంగుళం మేర మాత్రం
అంటిపెట్టుకునుంటుంది నేలని.
నా కవిత్వం లాగే.
వీధుల్లో తేలే సాయంత్రపు మొహాల
రంగుల గాలిపడగలు దిగిపోయి
మేం గూడు చేరుకున్నాక,
ఒక చక్రం భూమ్మీద ఆన్చి
ఒక చక్రం కలల్లోకి తేల్చి
నిద్దరోతుంది.
నా కవిత్వం లాగే.
‘ స్మైల్‌కి ‘
పాటకత్తెకి
హాయిగా గొంతుముడి విప్పి పాడు!
రయిక ముడి విప్పి
చంటి బిడ్డకు
చన్నిచ్చే తల్లిలా.
నీ అంతరాళాల్లో
నీ రక్తసంధ్యలో లేచిన
తెల్లటి పాట పావురాన్ని
నా రక్త సంధ్యలో
వాలనీ.
వెలిగే పగళ్ళతో
ఉభయ సంధ్యల్నీ
కలపనీ.
ఎగిరి ఎగిరి అలిసిపోయి
దినాలు రెక్కలు ముడిచేవేళ,
పాట నావలో కూచుని
నీ కనురెప్పల తెరచాప నెత్తి,
నీ కళ్ళల్లో
అస్తమానం అస్తమించే
నల్లటి సూర్యబింబంకేసి
సాగిపోనీ.
బెల్లంకాయ
ఏకాంతపు మేకులు దిగేసిన
ఎండాకాలపు మధ్యాహ్న వేళ
ఇంటరుగుపై
ఒంటరిగా నిల్చుని
బెల్లంకాయతో ఆడుకుంటున్న
పిల్లాణ్ణి గమనించావా?
కనురెప్పలు కప్పుకుని అమ్మ
కునుకు నిద్దట్లో దాక్కుంది.
తనతో ఆడుకునేవారు లేరు.
ఏకాంతపు బోనులో చిక్కుకున్న
లోక తిరస్కృతుడైన మహాకవి
నింగిలో దృష్టుల్ని ఎగరేసి తన
రంగుల పదాలతో ఆడుకుంటున్నట్లు
ఈ ఒంటరి మధ్యాహ్నవేళ
ఎంత తాదాత్మ్యంతో ఆడుకుంటున్నాడో
వింత బెల్లంకాయతో ఈ పిల్లాడు.
ఔనా, మీరాఖాన్ గారూ!
అమ్‌స్టర్‌డామ్ కాలవల
వలయాల్లో చిక్కుకుని
సూర్యుని బోటు
దారి తప్పిపోయినట్లుంది.
గట్లపై
జిరేనియమ్ పూల
రంగురంగుల దొంగ సిగ్నల్స్
కంగారు పెట్టినట్లున్నాయి.
నీడల తాళ్ళని
కాలవ వేళ్ళు
చిక్కగా
పేనుతున్నాయి.
సూర్యుని బోటు కదల్దు
ఎంతకీ సంధ్య వాలదు
ఇస్మాయిల్‌కి సంధ్యార్చనవేళ
మించిపోతుంది.
ఏం చేయాలో తోచదు.
అప్పుడు
ప్రభావంతుడైన మీరాఖాన్
తపశ్శక్తినంతా ధారపోసి
తన అద్దాల గోడకి
వేలాడదీసిన పరదాని
విశాలంగా విస్తరింపచేసి
సూర్యనౌకకి
తెరచాపగా
తగిలించాడు.
తస్మాత్ సూర్యాస్తమయ మవగా
ఇస్మాయిల్ సంధ్య వార్చాడు.
సాయంత్రపు సువాసనలు
ప్రతి సాయంకాలం నా కోసం
సాయంత్రపు సువాసనలు
పులుముకుంటుందీమె.
చుబుకం కిందా, చెవుల కిందా
సాగుతున్న పల్చటి నీడల వాసన.
సముద్రపొడ్డున సరుగుడు తోటలో
కురిసే సన్నటి
నిడుపాటి వాన వాసన
ఈమె జుత్తులో.
సూర్య సింహం రాత్రులు పడుకునే
గుహల సువాసన
ఈమె దేహం నిండా.
ఒకటొకటిగా చుక్కలు పొడిచే
ఆకాశపు నీలివాసన
ఈమె కళ్ళల్లో.
ఎక్కడెక్కణ్ణించో
ఎగిరి వచ్చిన కాకులు
చింత చెట్టులో
నల్లగా అస్తమిస్తాయి.
అప్పుడు
ఆ చింతచెట్టులోంచే
చంద్రుడు
తెల్లటిరెక్క చాపుతాడు.
వాన వచ్చిన రాత్రి
నిద్దట్లో పాతిన
నేత్ర బీజం
రేతిరంతా
మెత్తటి వాన చప్పుళ్ళ
తలగడ పై
ఆదమరిచి నిదరోతుంది.
వికసించిన నీళ్ళపడెల్తో
గెంతే పిట్టలతో
వింతైన రంగులతో,
చిటారు కొమ్మని
చివురించిన మబ్బుగుబుర్లతో
మహావృక్షమై
ఉదయాన
ఒక్కుమ్మడిగా
ఈ నేత్రబీజం
విప్పారుతుంది.
తుఫాను
ఈమె ప్రేమ తుఫానుకి
గింగిర్లు తిరిగి
ఎగిరి పోయే
ఎండుటాకుని.
ఐతే,
ఈ తుఫాను వేరు :
ఎగిరివెళ్ళి ఎండుటాకు
తిరిగి కొమ్మ నతుక్కుంటుంది.
గోళీకాయలు
బల్ల మీద
పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిన
గోళిక్కాయలు
పొద్దుటి ఏటవాలు వెలుతురులో
ప్రశాంతంగా మెరుస్తున్నాయి.
దేని కది తన రంగులతో
తన విచిత్ర వాతావరణంతో
స్వయం సమృద్ధమైన గోళాకారంతో
సొంత అస్తిత్వంతో
విహాయసంలో
గ్రహగోళం లాగుంది.
ఈ గ్రహాలకి శాంతిపర్వం
ఎంతసేపో తెలీదు.
పిల్లలు భోజనాలై
మళ్ళీ రాగానే
యుగాలుగా శాంతిలో తేలిన
ఖగోళాలు గందరగోళాలై
విశ్వం నలుమూలలకీ
విసరివేయబడతాయి.
ప్రైవేటు వాన
కాలేజికి వెడుతుంటే
రోడ్డుమీద
హఠాత్తుగా ఒక మేఘం
యుద్ధం ప్రకటించింది.
నెత్తిమీద రుమాళ్ళు వేసుకుని
పక్క షాపుల్లోకి, అరుగుల మీదికి
పరిగెత్తి
తలదాచుకున్నాం.
వాన తగ్గాక
పరవాలేదనుకుని బయల్దేరితే
కాలేజి గేటు వద్ద
గన్నేరు చెట్టు
దగ్గిరికి రానిచ్చి
తన ప్రైవేటు వానలో
తడిపేసింది మమ్మల్ని.
ఎండ పొడ
సరిగా ఒంటిగంటకి గదిగోడ మీద
సూర్యుని గాయం తెరుచుకుంటుంది.
వెలుగుకీ, జీవాలకీ
వ్యతిరేకి ఇతను.
వెలుతురు లాంటి నవ్వో
నవ్వులాంటి వెలుతురో
ఎన్నడో గాయపరిచిందితన్ని.
నవ్వునీ వెలుతురునీ
నెట్టేసి బైటకు
చీకట్లను సాకుతూ
దాగున్నాడు గదిలో.
ఐనా, ఒంటిగంటకి గదిగోడ మీద
సూర్యుని గాయం తెరుచుకుంటుంది.
మూలమూలలు కెలికి
దూలాల్నీ, జ్ఞాపకాల
సాలెగూళ్ళన్నీ
బైలు చేస్తుంది.
తేలే మబ్బుల నీడలతో
జారే పిట్టల చారలతో
ప్రియురాలి నేత్రంలా
బాధిస్తుందీ గాయం.
కాస్సేపటికి
గాయం మూసుకుని
తీయటి చీకటి విస్తరిస్తుంది.
చీకటి మృగాన్ని బలంగా
మేపుతున్నాడితను.
తలుపు తెరిచి ఒక రోజు
సూర్యుని పింగాణీ పాత్రల మీదికి
తోలుతాడు దీన్ని.
వడ్రంగి పిట్ట
సీతాకోక చిలకలం
స్వేచ్ఛా జీవులం.
మా కోసమే ఈ తోట
మఘవ ధనుస్సులా విరిసింది.
రంగురంగుల విషయాలపై
రవంతసేపు వాలతాం,
సారగ్రహణం చేసి
సాగిపోతాం ముందుకి.
వీడు వడ్రంగి పిట్ట.
వీడి ముక్కు సూది.
గతి తార్కిక భౌతికవాదం కన్నా
గతి వేరు లేదని అంటాడు.
ఆ మార్క్సిస్టు వృక్షమెక్కి
అహర్నిశలనకండా
టక్కుటక్కుమని
ముక్కుతో దొలవటం మొదలెట్టాడు.
ఆ చప్పుడుకి తలలు పట్టుకుని
ఆస్ప్రోకై పరిగెత్తారు జనం……
కొన్నాళ్ళకు చప్పుడాగి
కనిపించటం మానేశాడేమని
చూట్టానికి వెడితే,
చెట్టు బెరడులో ముక్కు ఇరుక్కుని
గాలాడక తన్నుకు చచ్చి
వేలాడుతున్నాడు వీడు.
మా మనవడు
గుర్రప్పిల్ల కాళ్ళతో
పరిగెత్తుకుంటూ వచ్చాడు.
బడి వదిలినట్టున్నారు.
బుర్రనీ కాళ్ళనీ
బంధించిన సంకెళ్ళు విప్పెయ్యగనే
మధ్యాహ్నపుయెండ బయళ్ళు
మహోత్సాహంతో ఆహ్వానించాయి.
ఎంత స్వేచ్ఛ! ఎంత హాయి!
ఎన్ని పనులు చెయ్యొచ్చునో!
పుస్తకాల సంచి గోడకి తగిలించాలి,
బట్టలు విప్పుకోవాలి,
బామ్మకి బళ్ళో వింతలు చెప్పాలి,
బొమ్మలతో ఆడుకోవాలి,
ఉన్నపళంగా మంచి నీళ్ళు తాగాలి,
ఒంటేలుకి పోసుకోవాలి.
అన్నీ ఒక్క మారే చెయ్యబోయి,
అన్ని వేపులా పరిగెత్తబోయి,
తన కాళ్ళకి తనే అడ్డపడి
దభీమని పడ్డాడు.
తెగిపడిన బడి సంకెళ్ళూ
మిగిలిన సవాలక్ష పనులూ
అన్నీ మరిచిపోయి
ఏడుస్తూ
అమ్మ ఒడిలో చేరాడు.
ఓదార్చే అమ్మ ఒడిలో
ఏడుస్తూ ముడుచుకు పడుకుని
నిద్దట్లోకి జారటం కన్నా
పెద్ద హాయి ఏముంది?
ఆట
ఆరు బైట బయల్లో
ఆ రాత్రులు గుర్తున్నాయా నీకు?
ఆకాశపు బల్లమీద
నక్షత్రాల పావుల్ని
నడిపించింది మనమే కదా.
ప్రణయ క్రీడలో
మన అంగాల పాచికల్ని
మహోద్రేకంతో విసిరి
నక్షత్రాల పావుల్ని
రాత్రల్లా నడిపించాం, గుర్తుందా?
ఆ రాత్రులేమయాయి?
నీ కోసం వీచే గాలి
నాకై వీచదివాళ
అంగాల పాచికల్ని మనం విసరకున్నా
ఆట సాగిపోతోనే ఉంది.
కవిత్వ భిక్షాందేహి
ఆవిడది జాలి గుండె.
అడుక్కునే వాడొస్తే
సోలెడు బియ్యం
జోలెలో పడేస్తుంది.
బిచ్చగాడు ఆసక్తిగా
బియ్యాన్ని తాకుతాడు.
ఒకటి రెండు గింజలు
పంటికింద రుచి చూస్తాడు.
అప్పుడతని మొహం
అకస్మాత్తుగా మారుతుంది.
కొత్త పదచిత్రం దొరికిన
కవిలా మొహం పెడతాడు.
బాగుందీ పలుకు.
వేగిరం ఇంటికెళ్ళి
కొత్త కవిత్వం వండాలనే
ఆతృత కనపరుస్తాడు.
ఉదయించబోయే రుచులు
అతని కళ్ళ దిగంతాల్లో
అప్పుడే మేల్కొంటున్నాయి.
నీతికథ
‘ పెందలకడ లేచిన పిట్టకే
పురుగు ఫలహార ‘ మని విని
అలారం పెట్టుకుని లేచి
పొలాలెమ్మట పడింది మన పిట్ట.
వెదకి వెదకి వేసారినా
తుదకింత పురుగైన దొరకలేదు;
పిట్ట సామెత లెరిగిన పురుగు
పట్టె మంచం పై ముసుగుతన్ని
పొద్దెక్కే వరకు నిద్దరోయింది.
బుద్ధిలేని పిట్టనించి తప్పించుకుంది.
నీతి 1) పెందలకడ నిద్రలేవకుము.
2) నీ నీతులు పరులకు తెలియనీకుము.
Left Bank, Paris
ఒకడు సైన్ నదిలోకి గేలం విసిరి
ఒడ్డున కూచున్నాడు.
అతని కళ్ళ లోతుల్లో ఈదే
అద్భుతమైన చేపల్ని పట్టే ప్రయత్నం.
అవతలి ఒడ్డున
ఆకాశం లోతుల్లోకి
ఎ్తౖతెన స్టీపిల్ని గేలం విసిరి
ఏదో పట్టటానికి ప్రయత్నిస్తున్న
నోత్ర్‌డాం కెతడ్రల్
ఇవతలి ఒడ్డున
రోడ్డుపక్క ఆర్టిస్టు
కాగితం లోతుల్లోకి
కుంచెను గేలంగా విసిరి
పొంచి ఉన్నాడు.
ఏ అద్భుతమైన ప్రాణుల్ని
పట్టే ప్రయత్నమో?
నువు
నా కోసం పూర్తిగా
నగ్నవైనపుడు మాత్రమే
నా దానివి.
బట్టలు కట్టుకున్నాక
ప్రపంచపు దానివి.
ఎప్పుడో ఒక నాడు
ప్రపంచాన్ని చింపి
పోగులు పెడతాను.
దృశ్యం
ధ్యాని నేత్రంలా
నిశ్చలంగా చూస్తోంది
నీరు.
లోకపు బింబాల్ని
ఇంకనీదు తనలోకి,
వెనక్కి విసిరేస్తుంది.
పరమయోగి మనస్సులా
ప్రవహించటం మానేసింది
యేరు.
ఒడ్డున కూచున్న
ఒంటరి మనిషి
చేతిలో గేలం
నీట్లో వృత్తం చుట్టి
వెనక్కి మరలి
గేలం విసిరిన వాణ్ణే
గిచ్చి పట్టుకుంది.
కాలయాపన సహించక
కాలవ గెంతిన వంతెన
నీట్లో వృత్తం చుట్టి
మొదటి చోటికే
మరలి వచ్చింది.
బులుసు తిప్ప
(ముమ్మిడివరం తాలూకా)
అంతులేని నది,
అంతులేని ఆకాశం.
ఏది నది, ఏది ఆకాశం?
ఏకాకి బెస్తవాని గెడ
ఆకాశాన్ని నది పెట్టి భాగించి,
విశ్వమంత సున్నాని
శేషంగా మిగిల్చింది.
స్వారీ
కళ్ళెం లేని గుర్రమెక్కి
పళ్ళు గిట్ట కరచి
ఏ శత్రు సంహారం కోసమో
వైచిత్ర సమరంలోకి
స్వారి చేసే యోధురాలామె.
మళ్ళీ, యుద్ధాంతాన
కళ్ళు తేలేసి
నిర్వికల్ప సమాధిలో
సర్వాంగాలూ స్తంభించే
యోగిని కూడాను.
..పార్టీ(గా) మహాసభ
గుమిగూడి మైదానంలో
గాడిదలు సభ చేశాయి.
నోళ్ళకన్నా ఎక్కువగా
కాళ్ళనే ప్రయోగించాయి.
ఓండ్రపెట్టే మాటటుంచి
ఒకదాన్నొకటి
ఓం అనైనా అననీలేదు.
కిట్టని వాళ్ళని రివిజనిస్టులని
గిట్టల్తో మట్టేశాయి.
అణుమాత్రం తెలివి చూపించిన వాళ్ళని
అణగతొక్కేశాయి అడుసులోకి.
చివరికి జరిగిందేమిటంటే
ఎవర్నీ నోరెత్తనీలేదు.
సభ దేని గురించి అంటారా?
సరి, వాక్ స్వాతంత్య్రం గురించి.
వెతుకులాట
నింగి దేనికోసం
వంగి వెతుక్కుంటుంది?
నేల దేనికోసం
నీలంగా సాగుతుంది?
కాసార మెవరికోసం
కన్నార్పక చూస్తుంది?
ఆకలి దప్పులు లేని గాలి
వాకిళ్ళనెందుకు తెరుస్తుంది?
బొడ్డులో కన్ను తాపుకుని
బావి ఏమి గాలిస్తుంది?
ఒక్క చోటనే చెట్టు నిత్య
మెక్కడికి ప్రయాణిస్తుంది?
పద్య సమాధి
పద్యాన్ని లోతుగా తవ్వుతున్నాడు కవి.
టన్నుల కొద్దీ మన్ను కింద
టన్నుల కొద్దీ మనస్సు కింద
కప్పబడి ఉంది పద్యం.
ఇంతలోతుగా దీన్ని
ఎవరు పాతేశారో తెలీదు.
దివారాత్రాలు తవ్వి
శవపేటికను వెలికితీయాలి.
ప్రాణవాయువు తగిల్తే
పరవాలేదు బతకొచ్చు.
పద్యాన్ని లోతుగా తవ్వి
ప్రేతపేటికని తెరిచాక
ప్రతిసారీ అందులోంచి
బ్రతికొచ్చే శవం తనే.
ధనియాల తిప్ప
(ముమ్మిడివరం తాలూకా)
అంతా ఒక తెల్ల కాగితం.
అందులో ఒక మూలగా
ఒక అడ్డు గీతా
ఒక నిలువు గీతా తత
తెరచాప ఎత్తిన పడవ
కిందిది నదీ
పైది ఆకాశమూ
కావొచ్చు.
వన మహోత్సవం
మర్రిగింజల్ని పాతు
నీడల కనురెప్పలు విప్పుకుని.
నేత్ర విస్తీర్ణాలై మొలుస్తాయి.
కొబ్బరిబొండాల్ని పాతు.
రహస్య తటాకాల పై
సహస్ర నౌకలు తేలతాయి.
పూల విత్తనాల్ని పాతు
అస్తమించిన సూర్యుల అవశేషాల్ని
అవనీ గర్భాన్నించి ఆవిష్కరిస్తాయి.
అస్తమించిన ప్రేమల్ని పాతు.
ప్రియురాలి చిరునవ్వుల్ని పాతు.
చిరునవ్వే పెదిమల్ని పాతు.
పెదిమలు మొలుస్తాయి.
చిరునవ్వు నవ్వుతాయి.
వాటి వెనకాతలే
వాడైన పళ్ళు మొలుచుకొస్తాయి.
నిన్ను చూసి ఇకిలించి
నీ పీక పట్టుకుంటాయి.
పాములవాడు
ఇంట్లో కూచుని ట్వింకిల్ నేనూ
జంటగా ఆడుకుంటున్నాం.
ఇంతలో నాగస్వరం విని
ఇద్దరం బైటికొచ్చాం.
పిల్లలు చుట్టూ గుడికట్టగా
జాబిల్లిలా వచ్చాడు పాములవాడు.
అద్భుతమైన ప్రపంచాన్ని
అతన్తో ప్రవేశపెట్టాడు.
అద్భుతమైన సంగీతపు దారాల్తో
ఆడిస్తున్నాడు పాముల్ని.
ఊగే సంగీతం,
ఊగే పాముపడగలూ,
ఊగిపోయే పసిమనసులూ __
మన లోకం కాదది;
దాగుడు మూతలాటల్లో పిల్లలు
దాక్కునే రహస్యలోకం.
చూస్తుండగా ట్వింకిల్ కళ్ళు
చక్రాల్లా విప్పారాయి.
ఊగే సంగీతంతో
ఊగే పాములవాడూ,
ఊగిపోయే పాములూ, పిల్లలూ
అంతా కలిసి
చక్రాల్లా తెరుచుకున్న
ట్వింకిల్ కళ్ళల్లోంచి
ఆటల్లో పిల్లలు దాక్కునే
ఇంద్రజాల ప్రపంచాలకి,
స్వప్నాల రహస్యదేశాలకి
తరలిపోయారు.
అరుగుమీద నేనొక్కణ్ణే
మిగిలిపోయాను.
వాన గుర్రం
అర్ధరాత్రి కిటికీలోంచి
వానగుర్రం తోక విసురు
మొహానికి తగిలి
నిద్రలేచి కూచున్నాను.
ఇంటికప్పు మీద
వానగుర్రం రాత్రంతా
దౌడుతీస్తుంది.
దూరాన చీకట్లో
రైలుబండి
గిట్టల చప్పుడు.
కిటికీలోంచి చూస్తే
వెలుతురు నిండిన బెజ్జాలతో
పిల్లంగోవిలా ఊళవేసుకుంటూ
దూసుకుపోతుంది రైలు.
అర్ధరాత్రి వేళ
వానా,
రైలూ,
పిల్లంగోవీ తత
గిట్టల చప్పుడు చేసుకుంటూనో
ఊళ వేసుకుంటూనో
ఒంటరిగా మనల్ని దిగబెట్టి
ఎక్కడికో వెళ్ళిపోతాయి.
అవి వదిలేసిన
శూన్యంలో
ఏకాకులుగా మనం
మిగిలిపోతాం.
పికాసో
పికాసో చిత్రమైన
అచిత్రకారుడు.
అతడు గీసింది కన్నా
చెరిపింది ఎక్కువ :
మన కళ్ళమీది కటకటాల్ని
కుంచెతో చెరిపేశాడు.
అప్పట్నించీ మన కళ్ళు
ఎగరటం నేర్చుకుంటున్నాయి.
రెంబ్రాంట్
బుగ్గల మీదా, బుజాల మీదా
మెళ్ళో ఆభరణాల మీదా
వస్త్రాల జరీ అంచుల మీదా
గెంతే బంగారు కాంతిని
కాన్వాసుపై పట్టటం ఎలా?
ముందు చీకటిని ఆహ్వానించు.
బాగా బలిసిన చీకటి.
దాని చర్మం మీద
కత్తితో గాట్లు పెట్టు.
కనికరించక.
ఆ గాయాల్లోంచి
బంగారు రంగు రక్తం ఉబికి
బుగ్గల కిందా, బుజాల కిందా
మెళ్ళో ఆభరణాల కిందా
వస్త్రాల జరీ అంచుల కిందా
ఘనీభవిస్తుంది.
డబ్బు మీద రెండు పద్యాలు
I
వేయి సువర్ణ ప్రభాతాల మేరకు
ధనవంతుణ్ణి.
నేను డబ్బు సంపాదించలేదని
మా ఆవిడ సణుగుతుంది.
II
డబ్బు లేదంటావా?
డబ్బెందుకు?
ఈ కిటికీలోంచి వాలి
టేబిల్ మీది పుస్తకాన్ని, పెన్నునీ,
ఇంకుస్టాండునీ మంత్రించే
సూర్యకిరణం ఖరీదెంత?
ఎంత డబ్బు పెడితే దొరుకుతుంది?
boulevards of Paris
ఇటిక మీద ఇటిక పేర్చి
ఆ మహానగరాన్ని నిర్మించారు.
ఐతే, అది బతకలేదు.
అప్పుడు
చెస్ట్‌నట్ చెట్ల వరసల
పచ్చటి బాకుల్ని
ఆ శవం గుండెల్లోకి
కస్సుమని దింపారు.
అప్పుడది లేచి
అద్భుతంగా పాడింది.
సూచన
ఈ నాటకాలింక ఆడలేం
వేషాలు విప్పేద్దాం
నేను భర్త వేషమూ
నువు భార్య వేషమూ.
స్వేచ్ఛగా పత్తి గింజల్లా
కాంతి వలయాలతో ఎగిరిపోదాం.
టేబిల్ క్లాత్
మధ్యగా టేబిలు.
టేబిల్ కవతల
మాటల జలపాతాల్ని పాత్తూ
వరసగా వక్తలు.
టేబిల్ కివతల
మాటల జలపాతం కింద
మొద్దుబారిన మనస్సులతో
శ్రోతల శిలలు.
ఈ బండరాళ్ళలోకి
ఓ చుక్క నీరింకకుండా
మరుపుల మరుభూముల్లోకి
ప్రవహించి పోతోంది.
మాటల తాకిడికి
బండబారిన దృష్టి
వక్తల గుహాముఖాల్నించి
జారి
టేబిల్ క్లాత్‌పై
నిలిచింది.
బల్లమీది నించి
నలువైపులా దుమికే
మెత్తటి జలపాతం
అందమైన టేబిల్ క్లాత్
నా కళ్ళ పడవల్ని
ఆకర్షించి లాక్కుంది.
పదాల జలపాతంలా
వృథాగా జారిపోదు.
దిగకండా నేలపైన
సగంలో వెనక్కి తిరిగి
బల్లమీదికి మళ్ళీ
ప్రవహించి పోయే
టేబిల్ క్లాత్ జలపాతం.
మాటల జలపాతం కింద
బండబారిన మనస్సు
తేరుకుని చేపపిల్లై
టేబిల్ క్లాత్ ప్రవాహంలో
గబగబ ఈతలాడింది.
హనీ
యక్షుడెవడేనా వచ్చి
లక్షల సంచి చూపించి
మనీ కావాలా నీకు
హనీ కావాలా? అనడిగితే
వాడైన రాయి పెట్టి
వాడి నెత్తి పగల కొట్టి
మనీ తీసికెళ్ళి
హనీకిస్తాను.
(హనీ మా మూడేళ్ళ మనమరాలు )
గాడిద స్వామ్యం
అనగా అనగా ఓ గాడిద
దానికున్న ఆస్తల్లా కాస్త బూడిద
ఐతేనేం, పట్టింది దాని కదృష్టం
ఎన్ని దేవుళ్ళని మోసిందో దాని పృష్టం!
ఉత్సవాల్లో దేవతా విగ్రహాలని మోసింది
ఊరిజనం కైమోడ్పులు తనకేనని భ్రమసింది.
ఇంతమంది భక్తులు తనకుండగా
ఎన్నికలకి నిలబడకపోవటం దండగ
అని తలపోసి నామినేషన్ పడేసింది;
ఐతే, ఇక్కడ ఈసప్ కథ అడ్డంగా తిరిగేసింది.
గార్దభాన్ని మక్కలిరగ తన్నక పోగా
జనమంతా గాడిదలయారు చిత్రంగా.
గాడిదకి ఓటు వేసి గెలిపించుకున్నారు.
గాడిదస్వామ్యం తమదని నిరూపించుకున్నారు.
రైలుగేటు
హఠాత్తుగా బస్సాగింది.
పిఠాపురం రైలుగేటు మూసినట్టున్నారు.
కిటికీలో తలపెట్టి చూశాను.
అటు అనంతంలో బయల్దేరి
ఇటు అనంతం దాకా
సాగిన రైలు పట్టాలు.
ఈ దృశ్యాన్ని మొదటిసారిగా చూస్తున్న
ఆదిమ మానవుడిగా మారాను.
అటు అనంతంలోంచి
అదేదో చప్పుడు చేసుకుంటూ వచ్చి
ఇటు అనంతంలోకి
తృటిలో అదృశ్యమైంది.
ఎక్కణ్ణించి వచ్చింది?
ఎక్కడికి వెళ్ళింది?
మనిషి జీవితం లాగే.
గేటు తెరిచి
అటికేసి వెడితే
చిక్కు విడుతుందేమో!
గేటు తెరిచి, అటువేపుకి
దాటింది బస్సు.
మళ్ళీ తత
ఇటు అనంతంలో బయల్దేరి
అటు అనంతం దాకా
సాగిన రైలు పట్టాలు.
ఎన్ని గేట్లు తెరుచుకున్నా
ప్రశ్నలకి సమాధానం దొరకదని
మొదటిసారిగా తెలుసుకుంటాడు.
ఆదిమ మానవుడు.
ఆట ముఖ్యం
గదిలో వాలిన ఎండ పొడతో
పాప ఆడుకుంటోంది.
భౌతికశాస్త్ర సూత్రాల్ని తెంచి
పాపని కన్నుగీటి పిలుస్తోంది ఎండపొడ.
తర్కశాస్త్ర సూత్రాల్ని మంచంకిందికి తన్నేసి
ఎండపొడని పట్టుకోబోతుంది పాప.
ఎందుకంటే, ఆట ముఖ్యం.
ఆటలతో అలిసిపోయి
కాస్సేపట్లో ఎండపొడకీ పాపకీ
కళ్ళు మగత కమ్ముతాయి.
చార్లీ చాప్లిన్
నా చిన్నప్పుడు కడుపుబ్బించే
నవ్వుమాత్రలిచ్చి
జీవిత జ్వరాన్ని మాన్చేవాడు.
ఇప్పుడు విషాద
కషాయమిచ్చి
నయం చేస్తున్నాడు.
ఏ వయస్సుకి ఏ మందివ్వాలో
ఈ విదూషకుడికి తెలుసు.
హృదయభక్షి
నేత్రారణ్యాల చీకట్లలో పొంచి
యాత్రికుడి కోసం కాచివుంటుంది ఆడది.
పుట్టక పూర్వమే
పోగొట్టుకున్న దేదో
వెతుక్కుంటూ వెడతావు నువ్వు.
ఆమె శరీరపు
స్వర్ణ సైకతాలూ,
గలగల పారే
నవ్వుల సెలయేళ్ళూ,
నేత్రారణ్యాల పైన
ఆకాశపు నీలిమలూ
ఆకర్షిస్తాయి నిన్నూ.
‘ నిన్ను ప్రేమిస్తున్నా ‘ నంటావు.
నోరు తెరిచింది.
ఆ అదను కోసమే
ఎదురు చూస్తున్న ఆడది
గబుక్కున చేయి చాపి
గొంతుకలోకి పోనిచ్చి
గుండెకాయను తెంపి
సర్రున బైటికి లాగి
కరకరా నమిలేస్తుంది.
ఆమె సమాధానం కోసం
ఆతృతగా చూస్తుంటావు.
నీకు గుండె లేదనీ,
నీవు శవానివనీ
ఇంకా నీకు తెలీదు.
తలుపు
నా మీద అలిగి
భళ్ళున తలుపు తెరచుకుని
వెళ్ళిపోయావు నీవు.
నీకై ఎన్నడో మూసుకున్న తలుపును
బార్లా తెరిచి,
గాలీ వెలుతురూ రానిచ్చినందుకు
బోలెడు థాంక్సు.
ట్రాఫిక్ ఏక్సిడెంట్
సూదిలా దూసుకుపోయే సైకిల్ తో
సాయంత్రపు ట్రాఫిక్ లో లేసులల్లేసి,
రోడ్డుపై చివరికి భయంకరమైన
రక్తపుష్పాన్ని రచించాడీ కుర్రాడు.
కాబోయే పెళ్ళికూతురు
రాబోయే అనామక భర్త కోసం
ఎంతో కష్టపడి
ఇంటి పనులు నేర్చుకుంటోందీ పిల్ల.
ఎవడో డిప్పకాయ కోసం
ఎందుకీ అవస్థని
నా కనిపించింది కాని,
ఫర్నీచరూ గిన్నెలూ తోమి
వాటికన్న ఉజ్వ్జలంగా మెరిసిపోయే
నా భార్య గుర్తుకొచ్చింది.
మార్క్సిస్టు మిత్రునికి
తడారిపోయిన
ఎడారి ఇసకలో
ఒత్తిగిలి పడుకున్న
నత్తగుల్లవి.
నీ మార్క్సిజం మహా సముద్రం
నిన్ను విడిచి ఎన్నడో ఇంకిపోయింది.
నీ చెవిలో హోరు
ఇంకా అదే ననుకుంటున్నావు.
గేదె
చీకటి మల్లే రాత్రల్లా
చంద్రుణ్ణి నెమరేసిన గేదె
తెల్లార కట్ట వస్తుంది మా వీధికి
తెల్లటి పాలివ్వటానికి.
కలలు కనే కళ్ళు
గాలి బెలూన్లు పట్టుకుని
మెత్తటి బురదలోకంలో
మింటికి తేలిపోయే గేదె
బరువైన ఉదయాన్ని
బండలా ఈడ్చుకొచ్చి
మన మధ్యన పడేస్తుంది,
మన బాధ్యతలు గుర్తు చేస్తుంది.
ఇక మనమంతా మేల్కొని
ఈ రాయి ఎత్తక తప్పదు.
కాంతిని పీల్చేసే దీపం
చీకటి పడుతుంటే
చూస్తో కూచున్నాను.
వెలుగులు ఇంకుతుంటే
వెలిగే తారలు తేలుతున్నాయి.
ఇరులకీ వెలుతుర్లకీ
సరిహద్దు గీతెక్కడ?
జీవితమెక్కడ ముగుస్తుంది?
చావెక్కడ మొదలౌతుంది?
ప్రవహించే యేటిలోకి
పడవ ప్రవేశించినపుడు
తేలే పడవకి మొదలెక్కడ?
తేల్చే నీటికి తుదయెక్కడ?
ఇంతట్లో ఎవరో వచ్చి
చీకట్లో కూచున్నావేమని
దీపం వెలిగించారు.
ఆప్యాయంగా పలకరించిన
మృత్యువూ, చీకటీ
శత్రువులై వెనుతిరిగాయి.
చీకటి చీకటిగా మారింది,
చావు చావుగా మారింది.
ఏటి నీరింకిపోగా
బోటు చతికిలపడింది.