(శ్రీ ఆకెళ్ళ రవిప్రకాష్ చేసిన ఇంటర్వ్యూ. “ఆంధ్రభూమి” దినపత్రికలో 9-9-1989న ప్రచురితం)
(ఇస్మాయిల్ గారిల్లు మా ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌కు ఒక మైలు దూరంలో ఉంటుంది. ఆయనింటికి చేరాలంటే ఓవర్ బ్రిడ్జి దిగీ దిగంగానే ఎడంచేతివైపు తిరిగిపోవాలి. “రయ్య్” మని దూసుకుపోతున్న నా సైకిల్‌కి “సడన్‌బ్రేక్” కొట్టంగానే, ఎమోషన్స్‌కీ, కన్‌ఫ్యూజన్స్‌కి బ్రేకులు కొట్టి నింపాదిగా కనిపించే “ఇస్మాయిల్” గారు కనిపిస్తారు.
అప్పుడనుకుంటాను….. ఆయన్ని కలవడంలో కూడా కవిత్వముందని! ఆయన దీర్ఘంగా నవ్వుతారు. ఆ నవ్వు వేదనని భరిస్తున్నట్టు వుండదు. ఏ కోశానా సంక్లిష్టతల్ని విప్పి చెప్పదు. ఆశ్చర్యాన్ని ఏమాత్రం కనపర్చదు. ఆ నవ్వు స్తబ్ధంగా వుంటుంది. Like a tree we each must find a place to grow and branch out…. అని రాసున్న సీనరీ గోడకి వేలాడుతుంది హాల్లో, సరిగ్గా దానికింద వేసున్న కుర్చీలో చేతుల్ని వూడల్లా వేళ్ళాడదీసి “ఆ! ఇక చెప్పండి” అన్నట్టు చూశారాయన. “ఇంకో వారం రోజుల్లో నేను కాకినాడలో చదువు పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నాను” అన్నాను. ఈ నాలుగేళ్ళలో మొదటిసారిగా “చలనం” చూశాను. “నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుంది”. మళ్ళీ దీర్ఘంగా నవ్వారు. అది ఎందుకో స్తబ్దంగా అనిపించలేదు. అందులో సమ్మతించిన ధ్వని వినిపించింది.)
ప్ర: “నిరాశా నిస్పృహల్ని ప్రధానంగా చిత్రించటం ఫ్యాషనైంది ఈ మధ్య” అని ఒకచోట మీరన్నారు. అన్ని సంక్లిష్టతలకీ మూలమైన ఒక point of depression గురించి ఎక్కువగా రాస్తే తప్పేముంది?
జ: జీవితంలో వివిధ అంశాల్లో ఏ ఒక్క అంశానికి దాని పరిమాణానికి మించిన విలువనిస్తే రబ్బరు బుడగలా చిన్న పిన్ను పోటుకు కూడా పగిలే అవకాశముంది. దేన్లోనూ అతివాదం పనికి రాదు. అరిస్టాటిల్ గారి “స్వర్ణ మాధ్యమం” అనగా “మధ్యేమార్గం” మంచిది.
ప్ర:కవిత్వం అనేది సరిహద్దులు లేని ఓ పెద్ద మైదానం కదా. “మా మనవడు” “వడ్రంగి పిట్ట” “చార్లీ చాప్లిన్” లాంటి కవితల్లో చిన్న ఫ్రేముల్లోంచి చూస్తారెందుకు?
జ: కొండ అద్దమందు కొంచెమై ఉండదా? అన్నాడు వేమన. కొండని చిత్రించడానికి చిత్రకారుడు కొండంత కాన్వాస్‌ని ఉపయోగిస్తాడా?
ప్ర: మీకు “మొపాసా” అంటే చాలా ఇష్టమని చెప్పారు కదా. ఎపుడూ ఆ స్ఫూర్తితో కథలు రాయటానికి ప్రయత్నించలేదా? కవిత్వమొక్కటే ఎందుకు రాస్తారు?
జ: సంకు పాపారావు గారన్నట్లు “క్రికెట్ ఆటగాడిని హాకీ టీంలో లేవేమని అడగ తగునా?”
ప్ర: త్రిపుర కథలంటే మీకు ఇష్టమేనా?
జ: చాలా యిష్టం.
ప్ర: ఎందుకని?
జ: మనిషి ఏకాకిగా పుడతాడు, ఏకాకిగా చనిపోతాడు. ఈ రెండు బిందువుల మధ్య పరుచుకున్న భయానకమైన ఒంటరితనాన్ని త్రిపుర గారు అద్భుతంగా చిత్రించారు.
ప్ర: అల్బర్ట్ కామూ సెంటిమెంటాలిటీకి వ్యతిరేకమైన జీవన చిత్రీకరణ మీకు ఎలా అనిపిస్తుంది?
జ: నచ్చదు. ఎక్సిస్టెన్షియల్ అతివాదం నాకు పడదు.
ప్ర: the only governing factors of human nature are pain and pleasure అని చెబుతాడు కదా జెరేమీ బెంధం. అంటే ఇంద్రియానుభూతులకతీతమైనదేమీ లేదని చెప్పటమే కదా?
జ: అవును.
ప్ర: మీరూ నిజమైన ఆనందం ఇంద్రియానుభూతుల్లోనే వుంది అంటారు కదా. అదీ బెంధం చెప్పిన utilitarian school of thought లో భాగమేననిపిస్తుంది?
జ: మానవజాతి ఒక్కటే కాదు. సకల ప్రాణులు సుఖదుఃఖాలనే కారక సూత్రాలపై నడుస్తున్నాయి. ఇది నమ్మటానికి యుటిలిటేరియన్మతం పుచ్చుకోనక్ఖర్లేదు.
ప్ర: “టాల్‌స్టాయ్” జీవితంలో ఇంద్రియ సుఖాల్ని వెదికినా చివరికి తన జీవిత చరమాంకంలో ఇంద్రియాతీతమైన అధ్యాత్మికానందం కోసం ప్రాకులాడాడు. మన “చలం” విషయంలో కూడా ఇదే జరిగింది. మీరేమంటారు?
జ: ఇంద్రియ సుఖాలు, అధ్యాత్మికానందాలు అనేవి విడదీయటానికి వీల్లేని సంక్లిష్ట అనుభవాలు (complex experiences) అని నేను అనుకుంటాను. ఒక వయస్సులో ఒక అంశం ఎక్కువగా క్రియాత్మకంగా వుండొచ్చు. కానీ రెండూ ఎల్లప్పుడూ కలిసే ఉంటాయి. యవ్వనంలో చలంగారు అన్వేషించిన ఆనందానికి, వృద్ధాప్యంలో ఆరాటపడిన దానికీ నాకు అట్టే భేదం కనిపించదు. “తెలుసుకున్న జ్ఞానికి గంగంతా సారాయే” అన్నాడు బైరాగి.
ప్ర: మార్క్సిజాన్ని “తడారిపోయిన ఎడారి ఇసుక” గా వర్ణించారు కదా! ఫ్యూడల్ వ్యవస్థ వుండేంత వరకు మార్క్స్ చెప్పింది వర్తిస్తుంది కదా?
జ: మార్క్స్ చెప్పింది మార్క్స్ జీవిత కాలం వరకు మాత్రమే వర్తిస్తుంది. భవిష్యత్తు గురించి మార్క్స్ చెప్పిన జోస్యం పూర్తిగా తప్పింది. భవిష్యత్తులో మానవజాతి ఎలా పరివర్తిస్తుందో ఎవడూ జోస్యం చెప్పలేడు. జోస్యాలెప్పుడూ తప్పుతాయి.
ప్ర: మీకు కార్ల్ మార్క్స్ నచ్చడా, లేక మార్క్సిస్టులు నచ్చరా? లేక ఇద్దరూ నచ్చరా?
జ: “బెర్నార్డ్ షా” గామోసు అన్నాడు “క్రీస్తు మంచివాడే కానీ క్రిస్టియన్లతో నాకు తగాదా” అని. మార్క్స్ విషయంలో నాకూ అంతే!
ప్ర: మీకు ఖలీల్ జిబ్రాన్, టాగోర్ అంటే బాగా ఇష్టం కదా? వాళ్ళిద్దరి కవితా సంవిధానం “మిస్టిసిజం” కూడా నచ్చుతుందా?
జ: కవికి ఎంత సంకుచిత తాత్విక రాజకీయ దృక్పథమున్నా, నిజమైన కవిత్వం రాసినప్పుడు వీటన్నిటిని పరిధినీ అధిగమిస్తాడు. అతని దర్శనానికి సార్వజనీనత సిద్ధింపచేసుకుంటాడు. “టాగోర్” ని జీబ్రాన్ ని వారి గొప్ప కవిత్వం ద్వారా దగ్గరగా భావిస్తాను. మిస్టిసిజం నాకు నచ్చదు.
ప్ర: “దిగంబర వాదం” ఒక తుఫానులానో సుడిగాలిలానో వచ్చి పలచబడిపోయింది కదా. ఇటువంటి సుడిగాలుల వల్ల సాహిత్యానికి ఏమైనా ప్రయోజనం చేకూరుతుందంటారా?
జ: తుఫానుల వల్ల కూడా కొంత ప్రయోజనం వుంటుంది. తుక్కూ, చెత్తా కొట్టుకుపోతాయి. పైగా “దిగంబర వాదం” మనకి నగ్నముని వంటి ఒకరిద్దరు మంచి కవుల్ని మిగిల్చిపోయింది.
ప్ర: ప్రస్తుతం తెలుగులో వస్తున్న కవిత్వ విమర్శపై మీ అభిప్రాయం?
జ: యూనివర్శిటీల్లో తెలుగు డిపార్ట్మెంట్ ఎత్తి వేస్తేనే కాని తెలుగు విమర్శ బాగుపడదు.
ప్ర: ఎత్తివేసి ఏం చెయ్యమంటారు?
జ: తెలుగు అధ్యాపకులకి, విద్యార్థులకీ ఇంగ్లీషు నేర్పాలి. ప్రపంచంలోని వివిధ సాహిత్యాల్లో వస్తున్న విమర్శల గురించి తెలుసుకుంటేనే కాని మన విమర్శనా స్థాయి పెరగదు. మన తెలుగు విమర్శకులు వఠ్ఠి కూపస్థ మండూకాలు. మనకున్న ఒకరిద్దరు మంచి విమర్శకుల్లో ఒకరైన సుదర్శనంగారు ఇంగ్లీషు పండితులన్న విషయం గమనించతగ్గది.
ప్ర: ప్రస్తుతం మన సమాజం కుళ్ళి పోయింది కదా! ఇదెలా బాగుపడుతుందంటారు?
జ: ఫ్రెంచి కవి రేఁబో(rimbauD) “ప్రేమని పునఃసృష్టించుకోవాలి” (love must be re-invented) అన్నాడు. లోకంలో ప్రేమ హరించుకుపోయింది. దాన్ని తిరిగి సృష్టించుకోవాలి. ప్రతివ్యక్తి తన ప్రేమ పరిధిని విస్తరించుకుంటూ పోతే చివరికి అన్ని పరిధులు కలిసిపోయి ఒక మహా వలయం ఏర్పడుతుంది. ఇది వ్యక్తులతో ప్రారంభం కావాలి. మూకలతో కాదు. అంతవరకు ప్రపంచానికి మోక్షం లేదు.
ప్ర: కొత్త తరం కవులు, రచయితలకి మీరు చెప్పేదేమిటి?
జ: నా సలహా కోసం కొత్తవాళ్ళెవరొచ్చినా రాయొద్దని చెబుతాను. అంటే రాయకుండా ఉండలేకపోతే కానీ రాయొద్దు. కవిత్వం రాయటంలో సరదా ఏమి లేదు. కవిత్వం రాయటం చాలా బాధాకరమైన విషయం. నా సలహాని ధిక్కరించిన వాడు తప్పక కవి అవుతాడు.