సాహస యాత్ర

( శ్రీ ఉయ్యపు హనుమంత రావు “గీతాలహరి – కవితాఝరి” కి ముందుమాట)

తనకీ కొంపెల్ల జనార్ధన రావుకీ సామాన్య ధర్మాలు పేర్కొంటూ శ్రీ శ్రీ తమిద్దరికీ విశ్వనాథ సత్యనారాయణ కవిత్వమంటే ఎడతెగని మోజన్నాడు. జనార్ధన రావు సంగతి అట్టేపెట్టి, నిజానికి శ్రీ శ్రీని ప్రభావించింది మాత్రం ముఖ్యంగా కృష్ణ శాస్త్రి కవిత్వమని “ప్రభవ” చదివిన వారికెవరికైనా తెలుస్తుంది. ఐతే శ్రీ శ్రీ ఈ మాటెందుకన్నాడు? తన మనస్సు తానే తెలుసుకోలేకపోవడం మనిషిని అనాది నుంచీ పీడిస్తున్న పెద్ద జాడ్యమని అనిపిస్తుంది నాకు. కాకపోతే , ఒక వేపు కవిత్వాన్ని ఆస్వాదిస్తునే , కావ్యాత్మ గురించి కానీ కనీసం కవిత్వ స్వభావం గురించి కానీ ప్రాచీన అలంకారికుల నుంచి, ఆధునిక విమర్శకులవరకూ ఎవరూ నిశ్చితాభిప్రాయానికి రాలేకపోవటమేమిటి?

అందుకే కవిత్వం కొలవటానికి తన దగ్గర కొలబద్దలు లేవన్నాడు చలం.ఎవరిదగ్గరా లేవు. ఉన్నాయని నమ్మిస్తారు కొందరు. ప్లాటో (Plato) అందుకనే కవిత్వం ఒక పూనకమన్నాడు. కావ్యదేవత (Muse) కవిని పూనుతుంది. కవి పాఠకుణ్ణి పూనుతాడు. దాంతో సరిపోతుంది. కనక కవుల్ని దేశ బహిష్కారం చేస్తే అందరికీ క్షేమం అన్నాడు ప్లేటో. నాకూ అలాగే అనిపిస్తుంది. కానీ పైకి అనను.

అంచాతనే ప్రతీదీ ముక్కలు ముక్కలుగా తరిగి విశ్లేషించే వారూ, లోలోనికి తొంగి చూసుకుని నూతిలో కప్పలు లెక్కపెట్టే వారూ అంటే నాకు అయిష్టం. ప్రపంచపు భిన్నత్వాన్ని కలిపి చూసేవారూ, ఉన్నచోట మరు నిముషం ఉండనివారూ , ఉత్సాహులూ, కార్య శూరులూ , ప్రతి క్షణాన్నుంచీ శక్తిని పిండేవారూ జీవిత భాండపు బహు ముఖాల్నుంచీ ఏకకాలంలో ఆనందం జుర్రేవారూ అంటే నాకిష్టం. అందుకే హనుమంత రావు గారు, తన కావ్య సంకలనానికి ముందుమాట రాయమంటే తప్పకుండా రాస్తానన్నాను. నిజానికి హనుమంత రావు గారు అనేక రంగాల్లో స్థితప్రజ్ఞుడు. కవిత్వం రాయకపోతే ఆయనకేమీ లోటు లేదు. కానీ కవిత్వం కూడా రాయాలి. అప్పటికి గానీ జీవితోత్సవం ఉజ్వలవంతం కాదు.

ఐతే సమగ్రమైన కవిత్వ సామగ్రీ పరికరాలూ సమకూర్చుకోకుండా హనుమంత రావు గారు సాహితీ యాత్రకు సాహసించారేమని కొందరు సందేహం వెలిబుచ్చవచ్చు. సదుపాయలన్నీ సమకూర్చుకుంటే అది సాహస యాత్ర ఎలా అవుతుంది? పదేళ్ళ క్రితం బెంగాలీ యువకులు కొంతమంది దోనెపై కలకత్తా నుంచి మద్రాసుకు సముద్రయానానికి సాహసించారు. వీళ్ళ సాహసానికి నేనెంతో పులకరించిపోయి వీళ్ళ యాత్రా వివరాలు, కష్టాలు, విజయాలు రోజూ హిందూ పేపర్ లో అనుసరించేవాణ్ణి. బయలుదేరిన వారం పది రోజులకు గోదావరి ముఖద్వారం చేరేటప్పటికి ఋతుపవనాలు తిరుగు ముఖం పట్టడం వల్ల వీళ్ళ యాత్ర ఆగిపోయింది.(కవిత్వానికి మల్లే సాయస యాత్రలకి ఋతుపవనాలు తోడుండాలి కావోసు) కందికుప్ప గ్రామ ప్రజలు ఎక్కడకి వెడుతున్నారని వీళ్ళని అడిగారు. మద్రాసు వెడుతున్నామని వీళ్ళన్నారు. జనం నవ్వి ఐతే మెయిలెక్కి వెళ్ళండి. ఇదేం పిచ్చి పని అన్నారు.

మెయిలెక్కి మద్రాసు వెళితే ఇక సాహస యాత్ర ఎక్కడిది? హనుమంత రావు గారు మెయిలెక్కలేదు. అందుకని ఆయణ్ణి అభినందిస్తున్నాను.

1991.