అరణ్యాన్ని సృష్టించుకో

(శ్రీ శిఖామణి “మువ్వల చేతికర్ర”కి పరిచయం)

కవిత్వం రాయటానికి చిట్కా చెప్పాడు టొనీకోనర్ అనే కవి. ఒక అరణ్యాన్ని సృష్టించుకో. దాన్లో అన్వేషించుకుంటూ పో. అంటే అరణ్యానికి అరణ్యాన్నే సృష్టించుకునేటంత గందరగోళం, సంక్లిష్టతా, గూఢతా, స్వయం వైరుధ్యం నీలో వుంటేనే కాని నువు కవిత్వం రాయలేవన్నమాట. ఆ అరణ్యంలో విచ్చలవిడిగా తిరగగలిగే స్వేచ్ఛని కూడా నీకు నువ్వు ప్రసాదించుకోవాలి.

కవిత్వం రాయటమంటే మాటలేం కాదు. నిన్ను నువు ఎదుర్కొనే ధైర్యం, నీ మనస్సు లోతుల్లోకి తొంగి చూడగలిగే సాహసం కావాలి. ఒంటిగా తమ్ము తాము ఎదుర్కోలేరు చాలామంది. ఆత్మసాక్షాత్కారమంత భయంకరమైన అనుభవం మరోటి లేదు. ఇది తప్పించుకోటానికి వ్యాపారాల్లోకో, రాజకీయాల్లోకో, ఉద్యోగాల రొటీన్‌లోకో, తాగుడు-పేకాటల్లోకో పారిపోతారు. వీళ్ళని పలాయనవాదులంటాన్నేను. ఒక్క కవీ, తాత్వికుడూ మాత్రమే వాస్తవాన్నెదురుకోగలరు.

“కవులొచ్చారు, కర్ర పట్రా” అంటాడు పానుగంటాయన పాత్ర ఒకడు. పాపం కవుల్ని తన్నఖ్ఖర్లేదు. కవిత్వం రాయటమే అన్నిటికన్నా పెద్ద శిక్ష. కవికి జీవితమే ముడిసరుకు. అంతరాంతరాళాల్లోకి తవ్వుకు వెళ్ళి భయంకరమైన సత్యాలను కనుక్కోవటం, నువు నువ్వు కానంతగా నీ తాదాత్మ్యాన్ని (identity) కోల్పోవటం, నీ పునాదుల్ని వెలికి తీయడానికి నువు పడే బాధా, వేదనా- నీ సర్వస్వమూ అంటే నీ పంచేంద్రియాల్నీ, నీ మనస్సునీ ఎరువుగా వేస్తేనే కాని కవిత్వవృక్షం మొలవదు. శిఖామణి అంటాడు “కొయ్యకాలు” అనే పద్యంలో

నేను చచ్చేలోగా
నా కొయ్యకాలు చిగురిస్తే
నన్ను నేను
తలకిందులుగా పాతుకుంటాను

కవిత్వం కవికి కొయ్యకాలు లాంటిది. తను కోల్పోయిన దేనికో substitute. తన్ను తలకిందులుగా పాతుకుంటేనే కాని అది చిగుర్చదు.

ఇక్కడో గమ్మత్తు చెబుతాను. నేను నిత్యమూ పుస్తకాల్లో పాతుకుపోయి వుండటం వల్ల బహిః ప్రపంచం నన్ను సమగ్రంగా తాకదు. లౌకికవిషయాల్లో మొద్దుని. అందుకని మా ఆవిణ్ణి ఏంటినాగా ఉపయోగించుకుంటాను. ప్రాపంచిక సంఘటనలకు ఆమె సున్నితంగా స్పందిస్తుంది. ఆమెకు ఉర్దూ వచ్చినంతగా తెలుగు రాదు. ఐనా నా బల్ల మీద కొన్ని వారాల పాటుగా పడివున్న ఈ పుస్తకాన్ని తిరగేసి, “ఈ అబ్బాయి ఎంతో బాధ పడుతున్నట్టున్నాడు. పాపం” అని సానుభూతి వెళ్ళబుచ్చింది. కవిత్వం రాయటమనేది బాధతో కూడిన విషయమని ఆవిడ ఇట్టే గ్రహించింది. ఎంత ఉత్సాహవంతమైన కవిత్వంలోనూ బాధ అంతర్వాహినిగా వుంటుంది. ఐతే, “బాధ కవిత్వానికి పర్యాయపదం”అంటే నేనొప్పుకోను. కవిత్వం బాధలోంచీ పుడుతుంది. ఆనందంలోంచీ పుడుతుంది. రెండిట్నీ జంటగానే కాని, విడివిడిగా నేనెప్పుడూ చూడలేదు. ఎన్ని బాధలెదురౌతున్నా జీవించటంలో ఆనందముంది కనక బతుకుతున్నాం. సైగల్ విషాద కంఠస్వరంలో ఆనందపు జీర దాగుంది. ఐతే, జీవితాన్ని గుండీలు విప్పి, తిరగేసి తొడుక్కున్న చార్లీ చాప్లిన్ మాత్రం హాస్యం అడుగడుగున వున్న దుఃఖపు జీరని హృదయవిదారకంగా ప్రదర్శించాడు.

ఒక పద్యంలో “బాధల చెట్టు” గురించి చెబుతాడీ కవి. ఇది బాధల చెట్టైనా దీనికి కాసేవి అమృతఫలాలే. వాటినందుకుంటే,

అప్పుడు ఆ చెట్టు
మాటగా పాటగా కథగా కవిత్వంగా
కలగా కన్నీరుగా రూపాంతరం చెంది
గొంగళిపురుగు
సీతాకోక చిలుకైనట్టు
ఎగిరి
బతుకు పుష్పం మీద వాలుతుంది.

కనక బాధ కోసం బాధపడే రకం కవి కాడు మన శిఖామణి. చీకటీ, నిరాశా, నిస్పృహా తప్ప జీవితంలో కాంతిరేఖ లేనే లేదని చిత్రించటం ఈ మధ్య ఫ్యాషనైంది. ఇది యూరోపియన్ అస్తిత్వ వాదులనించి మనకు సంక్రమించిన జాడ్యం. దీనికి జర్మన్ తాత్త్వికుడు నీషే కొంతవరకు బాధ్యుడు. “దేవుడు చచ్చిపోయాడు” అని అతడు ప్రకటించాక, మనిషి తన జీవితానికి తనే బాధ్యుడనీ, మరో ఆధారం లేదనీ, ఇంత బాధ్యత మోయటం వేదనా కరమనీ క్రమంగా చీకట్లలోకి జారిపోయారు రచయితలూ, మేధావులూ, ఇది తర్వాత ఫేషన్‌గా మారిపోయింది. ఇప్పుడిప్పుడు ఈ గుబులునించి వాళ్ళు తేరుకుంటున్నట్టున్నారు.

కవికీ, తాత్త్వికుడికీ ఉండవలసిన ముఖ్య లక్షణం జిజ్ఞాస. అడుగడుక్కీ సందేహాలూ, ప్రశ్నలూ. శిఖామణి అడుగుతున్నాడు.

ఎక్కడినించి వచ్చాన్నేను?
ఎక్కడికి వెళ్తున్నాన్నేను?
ఎంత గుర్తిద్దామన్నా
జీవితం గ్రాపులో
జనన మరణ రేఖలు
స్పర్శించిన బిందువు కనిపించడం లేదు,
శూన్యంగా వున్నప్పుడు
వెలుతురూ చీకటీ
ఒక్కలాగే తోస్తాయి.
సంతోషానికీ దుఖఃఆనికీ మధ్య
సరిహద్దు రేఖలు చెరిగిపోతాయి
దిగంతరేఖలా
నాకు నేను కనిపిస్తున్నట్టే కనిపించి
నాకునేనే
అదృశ్యమైపోతుంటాను.
నన్నునేను
తెలుసుకున్నట్టే భ్రమించి
నన్ను నేను కోల్పోతుంటాను.

దీనికి కారణమేమై వుంటుంది? “ఒక్కోసారి నేను మహారణ్యాన్ని అయి పోతాను” అంటాడు శిఖామణి. ఔను, తనలో మహారణ్యం లేకపోతే కవెలా ఔతాడు? మరో ముఖ్య విషయం చేతనా సౌకుమార్యం (fine sensibility). ఇది లోపించిన వాడు కవి కాదు.

రెండు కళ్ళలోను
రెండు సముద్రాలు గిర్రున తిరుగుతాయి.
రెప్ప వాల్చానా
కన్నీరు బొట్టు బొట్లుగా రాలి
లోకాన్ని ముంచెత్తుతాయి.
అందుకే
నా నేత్రానికి
రెప్పవేయడం కాని
మూతపడడం కాని లేనేలేదు.

ఈ కవి ఉత్సాహానికీ, ఉద్యమానికీ అంతులేదు. “ఇంకిన సరస్సు”లో అంటాడు:

నా సరస్సు
తను మాత్రం యింకి పోయింది.
ఇప్పుడు
రెండు కళ్ళను ఒకటి చేసుకుని
నేనే ఒక కొత్త సరస్సును
నిర్మించుకుంతున్నాను.

మానవజాతి తరపున క్రీస్తును కోరుకుంటున్నాడు :

దివ్య తేజస్సునై
యజ్ఞ హవిస్సునై
మళ్ళీ
అంతటా నీవే అయి రా,
ఈ సారైనా
మా కళ్ళకు కరుణను జాలినీ నేర్పు.
మా హృదయాల్లో
ప్రేమను, దయనీ నింపు.

నా దానికి మల్లేనే శిఖామణి కవిత్వంలో కూడా అడుగడుక్కీ చెట్లు నీడలు పరుస్తుంటాయి. “అసలైన చెట్టు”లో అంటాడు.

నువ్వు చూసే చెట్టు
అసలు చెట్టు కానేకాదు –
చీకటి గని లోని కార్మికునిలా
అంతరంగపు లోతుల్లో
అజ్ఞాతంగా అన్వేషిస్తున్నదేదైతే వుందో
అదే నిన్నూ నన్నూ బ్రతిస్తున్న జీవరహస్యం
ఆకుకు పచ్చరంగూ
రక్తానికి ఎరుపురంగూ
అక్కడి నుండి వచ్చిందే

చివరికి పురుగు కూడా తన్ను ఆడించటానికీ, సంతోషపెట్టటానికీ పుట్టిందే!

నన్ను భయపెడుతున్న ఆ పురుగే
రేపు సీతాకోకచిలుకై
నన్ను
తూనీగలు పట్టుకునే
చిన్న కుర్రాడిని చేసి
చెట్టు చెట్టుకూ
తోటతోటకూ
తన వెంట తిప్పుతుంది.

“హృదయ దానం”లో అంటాడు కదా:

ఈ రోజు కబోది బొచ్చెలో
నువ్వు వెయ్యవలసింది
చిల్లర నాణెం కాదు.
వాడు నాణెపు అంచులు తడిమి
దాని విలువను
తెలుసుకొనేటప్పుడు
నాణెపు అంచుకు బదులు
అక్కడ
నీ హృదయపు అంచులు దొరకాలి.

“ఎంతో బాధపడుతున్నట్టున్నాడు పాపం” అని మా ఆవిడ జాలిపడ్డ ఈ అబ్బాయికి ఏం కావాలిట?

నా నేత్రవృక్షం మీద వాలిన
నా కలల నెమిలిని మీ కలకలంతో
బెదర గొట్టకండి, చెదర గొట్టకండి.
నేను జీవితం నుండి
పెద్ద ఎక్కువేం ఆశించలేదు.
ఒక స్ఫటికంలాంటి నవ్వూ
ఒక రంగుల కలా –

మరి, మనమంతా “తథాస్తు” అని అందాం.

1987