ఈ పాపం ఎవరిది?

‘‘ఒసేప్‌ యెంకట్లచ్చీ, ఏనోకానున్నావేటే? ఆ సరస్పతికీ కట్టిమ్మని అరుత్తుంటే ఇల్లిక్కడే ఉండి మాట్లాడ్డం నేదు. పంజేత్తన్నావా తొంగున్నావా?’’ అని అరిచింది పక్కకొచ్చి రాములమ్మ. తుళ్ళిపడి ఈ లోకంలోకి వచ్చింది వెంకటలక్ష్మి. ‘‘తొంగోటవాఁ యేఁవున్నానా, మనసంతా ఇంటికాడే ఉందే సంటోడెలా ఉన్నాడోని. ఆడి గురించే ఆలోసిత్తాన్నావే.’’ అంది. ‘‘పిల్ల కాయలన్నాక రోగాలూ, జొరాలూ తప్పవు. ఆళ్ళ గురించి ఆలోసిత్తా కూకుంటే ఇక్కడ పనెవడు సేత్తాడు? అసలే ఆ ముషాణం గాడు సిందులేత్తన్నాడు. ఇయ్యాల పని పూర్తయ్యేట్టు లేదని. పని పూర్తయితే గాని కూల్డబ్బులివ్వనంటన్నాడు. ఇదిగో, ఈ నారు కట్ట తీసికెళ్ళి అల్లక్కడ సరస్పతీ ఆళ్ళకీ ఇచ్చేయ్యి. ఆళ్ళక్కూడా సెప్పొలే, పని తొందరగా పూర్తి సెయ్యమనీ, ఇయ్యేళ కూలొచ్చేట్టులేదనీ.’’ చెప్పి వెళ్ళిపోయింది జట్టుకి నాయకురాలు రాములమ్మ.

గుండెజారి పోయినట్టయ్యింది వెంకటలక్ష్మికి ఆ మాట వినేసరికి. చంటోడికి వారం రోజులుగా ఒళ్ళు పెనంలా కాలిపోతోంది. గవర్నమెంటు ఆసుపత్రిలో డాక్టరు చూసి ఏవో మందులిచ్చాడు కానీ జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగిపోతూ ఉంది. మళ్ళీ తీసుకెళితే వేరే మందులేవో రాసిచ్చాడు. డిస్పెన్సరీలో అడిగితే, అవి ఖరీదైన మందులనీ, స్టాకులో లేవు, రెండు రోజులు పోయాక వస్తాయనీ చెప్పారు. కానీ అక్కడ తెలిసిన విషయమేమిటంటే, స్టాకులో కొంత మందు ఉందనీ, నాలుగు డబ్బులు చేతిలో పెడితే కానీ ఆ మందును ఇవ్వరనీను. వెంకటలక్ష్మి వాలకం డబ్బులిచ్చేలా లేకపోవడంతో, డబ్బులివ్వగలిగే పేషెంట్ల కోసం మిగిలిన కొద్ది స్టాకునూ అట్టేపెట్టి వీళ్ళని మళ్ళీ రమ్మన్నారు. డబ్బుల్లేవనీ, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాననీ చెప్పి బ్రతిమాలడం తప్ప వేరే యేమీ చెయ్యలేక పోయింది వెంకటలక్ష్మి. కన్నీళ్ళకు కరగడానికి అవి బండలు కావు, అవినీతికీ, లంచగొండితనానికీ అలవాటుపడ్డ మనుషుల గుండెలు. మందుల్లేకుండానే పిల్లాడితో ఇంటికి తిరిగి వచ్చింది వెంకటలక్ష్మి.

పేరుకి మొగుడైనా నూకరాజు వెంకటలక్ష్మినీ, కొడుకునీ పెద్దగా పట్టించుకోడు. కానీ సంపాదనలేదు కానీ, భార్య సంపాదించే డబ్బులు వాడి తాగుడికీ, తిరుగుడికీ ఖర్చుపెడుతూ ఉంటాడు. అప్పుడప్పుడూ మాత్రమే ఇంటి ముఖం చూసే నూకరాజు ఎక్కువగా డబ్బుకోసమూ, ఎప్పుడైనా భార్య కోసమూ వస్తూ ఉంటాడు. వెంకటలక్ష్మి దగ్గర డబ్బులు లేకపోతే, నాలుగు తన్ని ఎక్కడో ఒకచోట అప్పు తెమ్మంటాడు. తెలిసిన ప్రతివారి దగ్గరా అప్పులు చేసింది వెంకటలక్ష్మి భర్తకోసం. రెక్కలు విరుచుకుని పనిచేసి తెచ్చే తన సంపాదన ఇంటి ఖర్చులకే చాలదు. కొడుకు వైద్యానికి ఎక్కడా సొమ్ము పుట్టించలేక పోయింది. పాత బాకీ తీర్చకుండా నయాపైస కూడా ఇవ్వనన్నారు ఎవర్నడిగినా. యజమానికి డబ్బు సర్దుబాటు కాలేదని నాలుగు రోజులుగా కూలి డబ్బులు కూడా ఇవ్వలేదు. కనీసం ఈ రోజైనా కూలి చేతికందితే కొడుక్కి మందులు తీసుకు వద్దామనుకుంటే ఈ పూట కూడా కూలీ రాదంటున్నారు. నీరుకారి పోయింది వెంకటలక్ష్మి.

మధ్యాహ్నం భోజనాలు చేసేప్పుడు రాములమ్మని మళ్ళీ అడిగింది వెంకటలక్ష్మి కూలి నిజంగానే ఈరోజివ్వరా అంటూ. ‘‘నీకు తెల్దేటే, పనవ్వనేదని కూలివ్వనంటాన్నాడనుకున్నావేటీ? పొలం పనులకని ఆళ్ళ నాన్న గోరిచ్చిన డబ్బుని మొన్న రేత్రి తాగుడికీ, పేకాటకీ తగలేసాడంట ముషాణం గాడు. ఆళ్ళ నాన్న గోరికి తెలీకుండా డబ్బు సద్దుబాటు సేసి ఇద్దావంటే ఈలవ్వక, పనైతేగానీ కూలివ్వనంటన్నాడు. ఏం సేత్తాం మనం, ఆడి సేతికి తొరగా డబ్బొచ్చి మన కూలి మనకి రావాలని పార్దించటం తప్ప. సూద్దాం, సాయింత్రం అయ్యేతలికి డబ్బులు ముడతాయేమో’’ అన్నది రాములమ్మ.

ముషాణం అన్నది పాషాణం లాంటి హృదయం ఉన్న ముని స్వామికి పనివాళ్ళు పెట్టుకున్న ముద్దుపేరు. డబ్బుని వెధవ పనులకు ఖర్చుపెట్టేసి కూలి డబ్బులివ్వడానికి ఆలశ్యం చెసే మునిస్వామి వ్యవహారం పని వాళ్ళకు కొత్తేమీ కాదు. ఏమీ చేయ్యలేని పరిస్థితి కాబట్టి భరిస్తూ దానికి వాళ్ళు అలవాటు పడ్డారు.

పని చేస్తోందే కానీ వెంకటలక్ష్మి మనసంతా జ్వరానపడ్డ రెండేళ్ళ కొడుకు రాంబాబు మీదా, అతడిని చూసుకుంటూ ఇంట్లో ఉన్న ఏడేళ్ళ కూతురు తాయారు మీదా ఉంది. వళ్ళు వేడిగా ఉంటే తడిగుడ్డేసి తుడవమని చెప్పింది తాయారుకి. తెలివిలో లేకపోయినా లేపి రాంబాబుకి నాలుగు గంజి చుక్కలు పట్టమంది. ఎలా చూసుకుంటోందో. అదీ చిన్నపిల్లే. ఇలా ఆలోచనలతో యాంత్రికంగా పని చేస్తూండగానే సాయంత్రం అయ్యింది. వెంకటలక్ష్మి భయపడ్డట్టే కూలి రేపిస్తానని చెప్పి మునిస్వామి వెళ్ళిపోయాడు. అతన్ని కసితీరా తిట్టుకుంటూ పనివాళ్ళు కూడా ఇళ్ళకు బయలుదేరారు.

ఏం చెయ్యాలో వెంకటలక్ష్మికి తోచలేదు. రేపు డబ్బొచ్చే దాకా ఆగితే రోగం ఇంకా ముదురుతుందేమో. ఎలాగైనా ఈ రోజు ఆసుపత్రిలో డబ్బిచ్చి మందు తెచ్చుకోవాలి అనుకుంది. మిగిలిన వాళ్ళను ఇళ్ళకు పొమ్మని చెప్పి తాను దగ్గరలోని తుప్పల్లోకి వెళ్ళి ఎండిన పొదల, చెట్ల కమ్మలూ అవీ నరికి మోపు కట్టింది. కనీసం ఈ వంట చెఱుకుని వాళ్ళ పేటలోని బజారులో అమ్మగలిగితే నాలుగు డబ్బులొస్తాయనుకుంది. వడివడిగా అడుగులేసుకుంటూ వీలైనంత తొందరలో బజారుకి చేరుకుంది. ప్రొద్దుటి నుంచీ పని చేయ్యడమే కాక, ఆశకొద్దీ మోయగలిగిన దానికన్నా పెద్దదిగా మోపుని కట్టిందేమో, బజారుకచ్చేసరికి బాగా అలిసిపోయింది వెంకటలక్ష్మి. అప్పటికే అక్కడ నలుగురైదురుగురు ఉన్నారు వంటచెఱుకు నమ్ముతూ. మోపుని దింపి బేరంకోసం ఎదురు చూడసాగింది.

ఇంతలోనే రిక్షా బండిలాగే వీర్రాజు వచ్చాడు వెంకటలక్ష్మి దగ్గరకు, బాగా ఎండిన పుల్లలతో పెద్దదిగా ఉంది మోపు. ఎంతకమ్ముతుందో అడిగి ఎక్కువ పేచీ పెట్టకుండనే బేరం చేశాడు పుల్లలు బాగుండడంతో. ‘‘బజార్లో కొద్దిగా సరుకులు కొనాలి. ‘‘అదెలా కుదురుద్దీ, డబ్బిచ్చి ఇప్పుడే అట్టికెళ్ళు. బేరపత్తే యెవరికైనా అమ్మేత్తాను’’ అంది వెంకటలక్ష్మి. ‘‘ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలాగా? ఇప్పుడే వచ్చేత్తానన్నానుగా. ఈ బరువేసుకుని ఎనక్కీ ముందుకీ తొక్క మంటావేటీ? నమ్మకం లేకపోతే ఇదుంచు’’ అని అడ్వాన్సు అన్నట్టుగా వెంటకలక్ష్మి చేతిలో రెండు రూపాయల కాసుపెట్టాడు. ఇంకా ఆలస్యమవుతోందని అనుకున్న మంచి బేరం కుదిరిందన్న తృప్తితో ‘‘తొందరగా వచ్చి తీసుకెళ్ళయ్యా. సంటోడికి వంట్లో బాగోనేదు. ఆసుపత్రి కాడికి తీసుకెళ్ళాలి, మందుకొనాలి’’ అంది వెంకటలక్ష్మి. ‘‘ఇప్పుడే వచ్చేత్తాను, కావాలంటే మిమ్మల్ని ఆసుపత్రి కాడికి నేందీసుకెల్తాలే’’ అంటూ వెళ్ళిపోయాడు వీర్రాజు.

సమయం గడుస్తోంది కానీ వీర్రాజు మళ్ళీ కనబడలేదు. ఇప్పుడే వచ్చేస్తానన్నవాడు ఎంతసేపైనా రాలేదు. ఏదైనా బేరం తగిలి వాళ్ళను తీసుకుని వెళ్ళాడేమో. ఎంతసేపని ఉండడం? పైగా రెండు రూపాయలు కూడా ఇచ్చి వెళ్ళాడు. ఇంక రాడనుకుని మోపు ఎవరికైనా అమ్మేశాక, వీర్రాజు వచ్చి అడిగితే ఏమి సమాధానం చెప్పాలి అన్నది వెంకటలక్ష్మి ఆలోచన. వీర్రాజు వెళ్ళాక నలుగురైదుగురు వచ్చి అడిగారు పుల్లల మోపు బాగుండడంతో. కానీ బేరమై పోయిందని చెప్పి పంపేసింది వాళ్ళను. నెమ్మదిగా వెంకటలక్ష్మికి దిగులు పట్టుకుంది. ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు అని వీర్రాజు కోసం ఎదురు చూస్తుండగానే చీకటి కూడ పడిపోయింది. ప్రక్కనున్న వాళ్ళు కూడా వాళ్ళ మోపులమ్మేసుకుని ఒక్కక్కరే వెళ్ళిపోసాగారు. వీర్రాజు అడిగితే ఏదోకటి చెప్పొచ్చు, పుల్లలు వేరెవరికైనా అమ్మేద్దామని నిర్ణయించుకుంది. కానీ అప్పటికే ఆలశ్యమవడంతో మరెవరూ రాలేదు కొనడానికి. మరి కొంతసేపటిలో వెంకటలక్ష్మక్కతే మిగిలింది ఆ చీకటిలో. ఆపై కంతసేపటికి వచ్చాడు వీర్రాజు. ‘‘యేువీు అనుకోకు యంకట లచ్చీ, బాగా దూరానికి బేరం దొరికింది. మంచి డబ్బిచ్చే బేరం ఒదులుకోటానికి మనసొప్పలేదు. ఎళ్ళచ్చేసరికి ఆలీసం అయ్యింది. నీకో రూపాయి యెక్కువిత్తాలే. రా, మోపు బండిలో ఎక్కించి నువ్వూ ఎక్కు మీ ఇంటికాడ దింపేత్తాను. కావాలంటే అక్కడ్నించక్కడ్నించే ఆసుపత్రి కాడికెల్దాం’’ అన్నాడు వీర్రాజు. ‘‘ఇప్పుడే వత్తానని ఇంత ఆలీసం సేత్తావా? రెండు రూపాయల కాసు నా సేతిలో ఎట్టేసి, మోపింకెవళ్ళకీ అమ్ముకోకుండా సేసేప్‌. సంటోడికి వంట్లో బానేదని నేనేడుత్తూ ఉంటే’’ అని వీర్రాజుని తిడుతూ రిక్షా ఎక్కింది వెంకటలక్ష్మి.

గబగబా వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. రిక్షా ఆగడంతోనే లోపలికి పరుగెత్తింది వెంకటలక్ష్మి. లోపల రాంబాబు వళ్ళు తెలియకుండా పడున్నాడు. తాయారు పక్కనే కూర్చుని తడిగుడ్డతో వళ్ళత్తుతోంది. తల్లిని చూడగానే ‘‘ఇంతసేపెక్కడున్నావే? కుంచేపటి ముందే రాంబాబు ఇపరీతంగా మూలుగుతూ, వూగిపోయేడు. వళ్ళు బాగా కాలిపోతా ఉంటే తడిగుడ్డెట్టి తుడుత్తున్నాను. ఇప్పుడు సల్లబడ్డట్టుందిలే’’ అంది తాయారు. ‘‘అయ్యో నా బిడ్డా’’ అనుకుంటూ రాంబాబు నుదిటి మీద చెయ్యివేసింది వెంకటలక్ష్మి. చల్లగా, చాలా చల్లగా తగిలింది కద్ది క్షణాల క్రితమే ప్రాణం పోయిన ఆ పసి శరీరం. *