అమ్మ చెప్పిన కతలు

అదృష్టవశాత్తు చిన్నప్పుడు నేను ఎన్నో కథలు, పాటలు విన్నాను. ఐనా, ఈ పుస్తకంలో “కొత్త కథలు” (అంటే నేను ఎప్పుడూ విననివి) చాలానే వున్నాయి. నిజానికి దీన్లోని అన్ని కథలూ విన్నవాళ్ళు చాలా కొద్దిమంది వుంటారు బహుశా. ఒక్కసారిగా పెద్దవాళ్ళను వాళ్ళ చిన్నతనాలకు లాక్కువెళ్తాయి ఈ కథలు. చిన్నవాళ్ళ ఏడుపుల్ని మరిపించటానికి, ఊహల్ని వికసింపచెయ్యటానికి ఉపయోగిస్తాయి.

ఇది చాలా మంచి ప్రయత్నం. ఈ పుస్తకంలోకి రానివి ఇంకా ఎన్నో కథలున్నా యన్నారు. అవి కూడ త్వరలో బయటకు వస్తాయని ఆశిద్దాం.

ముద్రణ ఎంతో చక్కగా వుంది. ఇతర తెలుగు పుస్తకాలతో పోలిస్తే ఉన్నతమైన సాంకేతిక ప్రమాణాలున్నాయిందులో. ఇందుక్కూడ ఈ ప్రచురణకర్తల కృషిని అభినందించాలి.

ఇంకొన్ని ఇలాటి పుస్తకాలు ముందుముందు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక కొన్ని సూచనలు చేయటం కూడ అవసరం. ముఖ్యంగా నాకు నచ్చని విషయం ఇందులో వాడిన మాండలీకం. అలవాటు లేని వాళ్ళకి అంత తేలిగ్గా కొరుకుడు పడదు. పెద్దలకు చదవటం కష్టమైతే ఇక పిల్లలకు అర్థం కావటం ఇంకా కష్టం కావొచ్చు. అలాగే, దాదాపు ప్రతివాక్యము “అన్నాదట”, “అన్నాడట” లతో అంతం కావటం విసుగుపుట్టిస్తుంది. మౌఖికంగా కథలు చెప్పేటప్పుడు అలా వినటానికి పెద్దగా అభ్యంతరం ఉండదేమో గాని వినటమూ, చదవటమూ వేరు వేరని గ్రహించాలి. చదవటం కోసం ప్రచురించిన పుస్తకాలు చదవటానికి అనుకూలంగా ఉండటం అవసరం.

వీరి ప్రయత్నాన్ని అందరూ హర్షించాలి. పెద్దలు ఈ పుస్తకాన్ని కొని చదువుకుని, ఇందులోని కథలకి చిలవలు పలవలు చేర్చి వాళ్ళ సొంతకథలుగా కూర్చి పిల్లలకు చెప్పాలి.

పుస్తకం వివరాలు. “అమ్మ చెప్పిన కతలు”, తథాగత ప్రచురణలు, మే 2002, వెల 95 రూపాయలు. దిశ పుస్తకకేంద్రం, నవోదయ బుక్‌హౌస్‌, సహచర, మైత్రి, విశాలాంధ్ర బుక్‌హౌస్‌ లలో దొరుకుతుందట. తథాగత ప్రచురణల అడ్రస్‌ తథాగత ప్రచురణలు, కేరాఫ్‌ 354, ఎల్‌ఐజిఎచ్‌, ఎపిఎచ్‌బి కాలనీ, మౌలాలీ, హైదరాబాద్‌ 500 040