శరీరాన్ని ముల్లె గట్టుకొని
నిట్టనిలువునా మోస్తూ నడుస్తున్నానా
నా ముందరి దారి ఒక మహావాక్యమై…
సుదీర్ఘ చరణ ప్రవాహ చేతనోహల
సమ్మేళనోత్సవ సంరంభం-
ఈ మహావాక్యంలో జ్వాలాద్వీప రహస్యాలెన్నో
తలకట్టు తళత్తళల పదును విన్యాసాలు
గుడిదీర్ఘాలతో జట్టుకట్టి, చెట్టపట్టాలేసుకుంటూ
పులకరించే పలకరింపుల హోరు
సవాలక్ష కాంక్షాంకురాలు,
అరువదియారు కళల చలువ కాంతులు నింపుకున్న
నిండుసున్నాల చంద్రబింబాల
ముఖారవింద విప్పారిత భావనా వీరంగాలు
ఏకలవ్యుని దీక్షాసమరంలోంచి
దూసుకొచ్చిన అమ్ముల అక్షర వరుస
చిదుగులను పోగేసి
అలజడుల మంటగా రాజేసే
పదాల పదఘట్టనల ఊరేగింపు
(నేలమీద నేమో దారాయె
కాగితం మీద నేమో వాక్యమాయె
ఏకంగా అల్లిక పోలిక విచిత్రం
ఊహాజనిత మాయా సందర్భం మహిమే!)
బరువైన ఓడిన నైరాశ్యపు మనోవేదనల
మబ్బుపెళ్ళలు కూలిన
లోయలను అలుముకొని బావురుమనీ
గుట్టల మొలచుట్టూ పెనవేసుకున్న
పొటమరించే వీరగాధల కచ్చెరువొందీ
నదుల పారకపు ఆరాటపు గీతల నుదురుపై
పచ్చల వరిగింజ పొదిగీ
అల్లకల్లోలపు పిలుపుతో కూడుకున్న
మేఘగర్జనలో సంలీనమయ్యీ
మహావాక్య మహత్తర మహత్తుల
గమన రీతుల ఆస్వాదిస్తూనే
అబ్బురపడుతూనే
ఒక్కొక్క శబ్దాక్షరాన్ని
పాళీ మునివేళ్ళతో తడుముతూ
నాలుక చివర గూడు కట్టుకున్న
తటపటాల పెదిమలు దాటని
పొగడ్తలతో ముచ్చటిస్తూ
అరలను దాటుకుంటూ
ఉప్పొంగిన లబ్ డబ్ ఆత్రపు స్పందనల గుండెకి
ప్రపుల్లంగా హత్తుకుంటూ,
తోడిపోస్తున్న పరిపక్వపు అనుభవరాశిని స్వీకరిస్తూ,
సారాంశ స్పర్శ కోసం
ఒడలు విరుచుకున్న కఠిన జీవన దేహంతో
బుడుంగున మునుగుతూ
నడక ఆగాక చూస్తే
మహావాక్యం చిట్టచివర తేలిన
ఆనందపు క్షణాల బరువుకు
రెప్పలు తెరువలేని పికాసో చిత్తరువునయిన
మహావాక్యానికి
మహా నమస్కారం చేద్దామని వెనక్కి తిరిగితే
శూన్యపు వేదికపై
కుక్కపిల్లలు కువకువలాడుతూ
గంతులేస్తున్నాయక్కడ
అడుగుల తడిగాని, పొడిగాని,
ఒత్తులే పడని
యోజనాల తొవ్వల నడుస్తున్న
నేనే మహావాక్యాన్నయి….!