ఘటన

గేట్లు మూస్తున్నకొద్దీ
చీకటి చిక్కబడుతూ
రసప్లావితానికి తెర లేస్తుంటది
ఆశాజీవులు మచ్చిక చేసుకోవడానికి
తిష్ట వేసిన నిషాప్రపంచం
ఖరీద్దారి ఫ్లోర్‌లో –
రంగుల కాంతులేవో కురుస్తున్నా
ముఖాలు తెలియని
అపరిచిత షేక్ హ్యాండ్‌లే
పాట కొదగని మ్యూజిక్ బీట్స్
శరీరాల మీద దరువులేస్తుంటది
మనసు గడ్డకట్టుకుపోయి,
దేహాన్ని, ఆకాశానికి భూమికి కాకుండా చేసి
ఊయల లూపుతుంటది
భుజాలు భుజాలు కలుపుతున్నా
స్నేహం చిగిర్చదు
సుతారంగా కాక్టెయిల్ గొంతులో దిగుతున్నకొలదీ
మచ్చల్లేని ఆకాశంలో సుందర స్వప్నాలేవో విచ్చుకుంటయి
తడబడే అడుగులకి
జీవితం చాలదన్నట్లు
అడుగు ముందుండి, అందక ఊరిస్తుంటది

తలా యింత పంచుకున్నాక
మిగిలిన రాత్రి తునక
పరుగు పెడుతుంటది సొంత గూటికి


విసిరేసిన పేపర్, భళ్ళున బద్దలై
దృశ్యాలన్నీ ముక్కలైన చప్పుడు…

నిన్న రాత్రి
కారద్దాలు తుడిచిన ఆ పిల్లోడికి చిల్లరలేదని తోసిన శబ్దం…
చక్రాలకింద రక్తసిక్త పసిమొగ్గ
అరుపు…

“గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి”

ఎదురుగ కాలెండర్‌లో
నిన్నటి తేదీ కొక్కేనికి
తలకిందులుగా వేలాడుతూ
నా రూపం…