చినుకొకపరి…

జలతారు అంచు కల
దిగొస్తున్నట్టు,
నిశ్చలన ఛాయా చిత్రంలా
ప్రవహిస్తున్నట్టు-
ఎత్తుపల్లాల చరిత్ర జాడ్యాన్నంతా
ముంచేసి,
ఏక కావ్య గాన ధారగా-
రాజుగారి వేషం తడిపి
బికారిగాడి దేహం తడిపి
ఒక ముద్దగా
ఒక్క తీరైన పులకరింతగా-
చిందిన చెమట చుక్క
భూమ్మీది పసరిక
కలెగల్పిన కొత్త ఆకృతి ఇంద్రధనుసు-
తడిసిన గూడైనా
పొదివి తెచ్చుకున్న వెచ్చదనపు
గువ్వల ప్రేమైక కౌగిలి-
ముఖాల రంగులు కరిగి
సుస్పష్టమైన ఆకుపచ్చని ఆకైన
మనః దర్శనం-
ఆకాశం, నేలా, జీవజాలం
వాన మోహం లోనే-

కాగితప్పడవల బాల్యం

బతుకుల్లోన
…వాన!

ఏం వాన!!!