మృత్యు వృక్షం

26. గోదావరి దాటాం

ఆకాశప్పాఠాలని
ఆగి ఆగి
వప్పగించే
వరిమళ్ళని దాటి,
ఎక్కాల పట్టీల్లా
ఎడతెగని
బాతుల
బారుల్ని దాటి,
కొమ్ముల
కుండలీకరణాలతో
లెక్కచెయ్యకండా నిలబడ్డ
లెక్కల్లాంటి గేదెల్ని దాటి
ఊళ్ళమ్మట వేదుతో
ఇళ్ళరుగుల పెదిమలపై
పలకరించే చిరునవ్వుల్లా
కలకలలాడే జనాన్ని దాటి,
చరిత్ర గమనంలా
విచిత్ర దృశ్యాల్ని మార్చి చూపించే
కలైడస్కోపు మలుపుల్లాంటి
ములుపుల్ని దాటి,
గొణుక్కుంటో గలగలమని
వణుక్కుంటో ముసలినౌకరులా
వెంటవచ్చే
పంట కాలవల్ని దాటి,
కెరటాలుగా తాకే
తరుచ్ఛాయల వాత్సల్యాన్ని దాటి,
చెయివేసి మెడచుట్టూ
చెవిలో గుసగుసలాడే
చిరుగాలుల నేస్తాన్ని దాటి,
చివరికి
చేరుకొన్నాం కోటిపల్లి.
రంగురంగుల చిట్టి బాల్యదృశ్యాలపై
చెంగుచెంగున గెంతే మా పిచికిమనసు
ఆచ్ఛాదన లేని
ఆకాశాన్నీ
సీమలూడ్చిన
భూమినీ చూసి
రెక్కలు చాచలేక
బిక్కు బిక్కుమంది.

ఇసకతిన్నెల
పసిడికండువా
పల్లెవాటు వేసుకొని మేనువాల్చి
పెళ్ళికొడుకులా నిరీక్షిస్తున్న నదిని చూసి
విస్తుపోయి, శోభనం గదిముందు
పెళ్ళికూతురులా
బిడియంగా భయంగా
అడుగువేసి ఆగాము.
అరచెయ్యిలాంటి దోనెని చాపి
ఆప్యాయంగా చేరదీసి
పగిలిన గాజుపెంకుల్లా
పదునుగా మెరుస్తున్న గుండెల్లో
పడవంత చోటివ్వగా,
ఉడువీధిలో విహరించిన
మా మనోవిహంగం
పక్షాల్నిడుల్చేసి
నగ్నంగా చేపై
నదీప్రవేశం చేసింది.

(14-3-1973)


ఇస్మాయిల్

రచయిత ఇస్మాయిల్ గురించి:

కాకినాడ, వాల్తేరు లలో విద్యాభ్యాసం. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. (ఆనర్స్) పట్టా. కాకినాడ పి.ఆర్. కళాశాలలో ఫిలాసఫీ లెక్చరర్‌గా పనిచేసి ఆ తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. కాలేజీలో ప్రిన్సిపాల్‌గా 1988లో ఉద్యోగ విరమణ చేశారు. అధికార భాషాసంఘంలో సభ్యునిగా కొంతకాలం పనిచేశారు. లండన్‌లోని ఆంధ్ర కల్చరల్ సొసైటీ ఆహ్వానం మేరకు 1978లో ఇంగ్లాండు తదితర ఐరోపా దేశాలలో పర్యటించి సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నారు.1976 సంవత్సరానికి మృత్యువృక్షం కవితా సంపుటానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాన్ని, 1990లో తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య విమర్శ విభాగంలో పురస్కారాన్ని అందుకున్నారు.

 ...