అకస్మాత్తుగా
ఒక రోజు
మృత్యు వృక్షం
వ్యత్యస్తంగా
తలకిందుగా
మొలిచింది.
మూగిన బంధుమిత్రులు
మోసుకుపోయి అతణ్ణి
విత్తనంలా
పాతారు.
జనాల
మనో గగనంలో
చాపుకున్న
జ్ఞాపకాల కొమ్మల్నీ
గాఢానురాగాల
ఊడల్నీ
వెనక్కి పీల్చేసి
ఈ మృత్యుబీజం
ఏమీ తిరిగివ్వదు.
1697321121973
రెప్పల్లా ఆకాశాన్ని
రెప్పల్లా ఆకాశాన్ని
కప్పుతాయి చెట్లు,
రెప్పవేయని ఆకాశాన్ని
ఎప్పుడేనా చూశారా?
గుండ్రంగా విప్పారి
గుండ్రాతి చక్రంలా
గిరగిరా తిరుగుతో
అరగతీస్తుంది జగాన్ని.
చెట్ల సాయం లేకుండా
చేరువకెలా వస్తాయి.
నింగీ నేలా? ఏ
అంగాలతో కావలించుకుంటాయి?
పులకరింపుల పిట్టలు
కిలకిల మంటో గెంతగా
తరుహస్తాలతో
పలకరించుకుంటాయి.
భూమ్యాకాశాల
రమ్యప్రణయమంటే
కాపవ్యసనపు
కారుమెయిళ్ళు కమ్మిన
వానాకాలపు
కోనసీమ కొబ్బరితోటల
పురుష సౌందర్యం
గురుతుకొస్తుంది నాకు.
జడివానల వేళ్ళకొనల
పడెల గుండెలపై మీటి
మొలక చనుమొనల్ని
పొటమరింప చెయ్యగా,
జూలెగరేస్తో
నేలని కుమ్ముతాయి
మైథున సంరంభంలో
మైమరచిన కొబ్బరితరులు.
మాన్సూను కోరికలు
మాటు మణిగాక
సన్నటి పంటకాలవల
నున్నటి నడుములు
ఉబ్బుకు లేచే
మబ్బు నీడల్తో పిటపిటలాడతాయి :
ఈనటానికి సిద్ధపడుతుంది
కోనసీమ.
10472
సృష్టి
ఆడదీ, మగాడు
ఏమి సృష్టి !
ఒకళ్ళ ఆనందాన్ని కొకళ్ళు
పత్తీ, మంటలా.
ఆడదీ, మగాడు
ఒకళ్ళ నాశనానికొకళ్ళు
పత్తీ, మంటలా.
30175
ఫ్యాను కింద లోకం
ఎరుపెక్కిన కన్నులతో
ఎండ పొంచుంది బైట,
నా గదిలో మంచంపై
ఈగలా అంటుకుని
కప్పుకేసి చూస్తో
కదల్లేని నేను.
కదల్లేని నాపైన
కదలాడే సాలీడు
పలుకాళ్ళు ఆడిస్తో
తలకిందులు ఫ్యాను,
తన మాయాజాలంలో
తగుల్కున్న బందీని.
తగుల్కున్న బందీని
ఎగతాళిగ పిలుస్తో
కటి ఊపే గోడమీది
క్యాలెండరు తార
కృత్రిమావేశం తప్ప
కదలికలేని గది.
కదలిక లేని గది బైట
అదయార్కుని వాడికి
తెగిపడిన పగటి బంటి
ఎగరలేని డిప్పల్లా
భూవియత్తులు రెండూ
జీవముడిగి పడుతున్నాయి.
జీవముడిగి పడుంటే
చేతనా ప్రపంచం,
విపరీత చేష్టలతో
వెక్కిరిస్తున్నాయి జడాలు :
తలకిందులు ఫ్యాను కింద
తలకిందులు లోకం.
24472
వర్షాల్లో కాలేజి
కలత నిద్దరోయే చెరువుల
కళ్ళు తెరిపించి,
చేతులెత్తేసిన చెట్లకు
కర్తవ్యం బోధించే వాన
మా కాలేజికి రాత్రంతా
మహోపన్యాసం దంచినట్టుంది.
పొద్దున వెళ్ళి
చూద్దును కదా
కాలేజి పునాదుల్నించి
వేలాడుతున్నాయి నీడలు
మెరిసే నీళ్ళలో
మెల్లిగా కదుల్తో.
కాలేజి నిజస్వరూపం
కళ్ళెదుట నిలిచినట్టుంది :
పంచరంగుల దారాలు వేలాడుతో
మగ్గంపై సగం నేసిన తివాచీలా ఉంది.
నాయుడుగా రే కాంతులతో
నేయాలనుకున్నారో కాలేజిని
ఇప్పుడు బోధపడింది నాకు.
బిగుసుకున్న మన హృదయాల్లోకి
గగనపు లోతులు దింపాలనీ,
తెరిచికొన్న పసికళ్ళల్లో
తెలిమబ్బులు నడిపించాలనీ.
కుంటినీడ వంటి కుర్రతనానికి
నీటిరెక్కల్ని అతికించాలనీ,
నాయుడుగారనుకునుంటారు.
నాయుడు గారి రంగుల తివాచీ
నేత సగంలోనే ఆగింది.
ఇవాళ కాలేజికి నిండా
ఎగజిమ్మిన కాంతులు
ఇంకిపోయి, చివరికి
ఏ మూల గుంటలోనో
తారకం గారి కళ్ళల్లో
నాయుడు గారి జ్ఞాపకంలా
తళుక్కుమంటాయి కావును.
5101975
దాహం
వేసవి గాడ్పులకి
దాహపు ఖర్జూరచెట్టు
యెడారి గొంతులో
అమ్ములపొదిలా
విచ్చుకుని
గరగరలాడుతోంది.
చల్లటి నీళ్ళు
గొంతు దిగుతోంటే
ఎంత హాయి.
ఇంకా తాగాలనుంటుంది కాని
కడుప్పట్టదు.
ఇప్పుడు __
నీకు వచ్చిన స్వర్గం
కోరుకొమ్మంటే,
అంతులేని మంచినీళ్ళూ
అంచుల్లేని దాహమూ
పుష్పకములాంటి పొట్టా
కోరుకొంటాను.
ఆ యెడారిలో
బారలేసుకొంటో
ఒంటెనై
సూర్యుడిబంతిని
సూటిగా ఎగరేసి,
దాహపు నావలు
వికసించే
మంచినీళ్ళ సముద్రంగా,
పొడుగాటి కాళ్ళని
తెడ్లు వేసుకుంటో
యెడారి ఓడగా,
అ ల ల ల ల ల లు గా,
ఊగుతో
ప్రయాణిస్తాను.
14774
బోటులో టాగోర్
పద్మానదిపై
పడవలో కూచుని
ఒకటి రెండు మబ్బు బెలూన్ల కింద
ఒంటరిగా టాగోర్
బిగిసిన జలచర్మంతో
నిగనిగలాడే నదిబాజా.
కడచిపోయిన
పడవల్నీ
తేలిపోయిన
తెలిమబ్బుల్నీ
నెమరేసే పద్మకు
కడుపు నిండా
సుడిగుండాల్లా
కోట్లకొద్దీ
కథలు.
నదిబాజాని మోగించే
సదా బాలకుడు టాగోర్
ఏకాంత నౌకాయానంలో
ఏమేం కథలు విన్నావు, టాగోర్
మూగపిల్ల ‘సుభా’ గుండెల్లో
ముసురుకున్న కేకలు విన్నావా?
బాల్యయౌవనాల మధ్య గతుకులో
‘ఫటిక్ ‘ మనస్సు పుటుక్కుమనటం విన్నావా?
ప్రళయంలోంచి తప్పించుకు ప్రేమ
వలయంలో పడ్డ ‘నీలకాంత్ ‘ వ్యథ విన్నావా?
పదిలంగా దాచుకున్న
యెదలోబొమ్మ బద్దలవగా
గాయపడి ‘కాబూలీ’ పెట్టిన
గావుకేక విన్నావా?
ఇంకేమేం విన్నావు, టాగోర్ !
మా చిన్నప్పుడు
మమ్మల్నీ మబ్బుల
దరువులు వాయించే
డొరువుల మృదంగాలు
వింత ఊసులతో
చెంతకు పిలిచేవి.
చడ్డీల్ని ఊడ్చేసి
ఒడ్డున పడేసి
మాతృగర్భంలోకి
మరలిపోచూసే
పిల్లల్లాగో,
ప్రియురాలి అంతరంగాల్లోకి
లయమవాలనుకునే
ప్రేమికుల్లాగో
చిరంతనపు లోతుల్లోకి
చివాల్న దూకేవాళ్ళం.
ఆకాశమంత లోతైన
ఆ కాసారలెండిపోయి
బీటలుపడిన గుండెల్ని
బయటపెట్టాయి నేడు.
పద్మని పగలగొట్టి
పంచుకున్నప్పుడు టాగోర్
ఎన్ని వికృత శబ్దాలు
ఎన్ని హహాకారాలు
ఎంత భీభత్సం!
అంతటితో బాల్య
మంతమైంది.
సరిత్తీర నికుంజాల్లో
నిరీక్షించేవి
మెరిసే కళ్ళుకావు,
గురితప్పని
గుడ్డితుపాకులు.
వసంతాన్ని మోసుకొచ్చే
పసిడిపిట్టలు కావెగిరేవి,
మృత్యువును నోట కరచుకున్న
హత్యాకారి బుల్లెట్లు.
మోగటం లేదు
టాగోర్ ఇవాళ
హృదయంగమాలైన బాల్య
మృదంగాలు
జబ్బులతో, ఆకలితో
ఉబ్బిన
పిల్లల పొట్టలడోళ్ళు,
ఎల్లెడలా వాటి చప్పుళ్ళు.
జూన్ 313374
యాస్మీన్ కంఠం
యాస్మీన్ నీ కంఠం
తెల్లారి లేస్తూనే
పిట్టలా పైకెగిరి
ఉదయవృక్షానికి
చిటారు కొమ్మని
రెక్కలల్లాడిస్తో
ఉయ్యాలలూగుతుంది.
అప్పటికి
నా కళ్ళు
రెక్కలు రాని పక్షుల్లా
తలగడల మైదానంలో
టపటపా కొట్టుకుంటుంటాయి.
యాస్మీన్ నీ కంఠం
బరువుగా బంగారుగా
పారే
మధ్యాహ్నపు సెలయేట్లో
ఎక్కడో అడుగున
సన్నగా గొంతెత్తే
గులకరాయి.
యాస్మీన్ నీ కంఠం
రెక్కలు ముడుచుకున్న
వయొలిన్‌లా
రాత్రులు
గూటికి చేరుకుని
తారస్థాయిలో
కొత్తస్వరాలని
నిద్దట్లో
పొదుగుతుంది.
యాస్మీన్ నీ కంఠం!
241072
ముసురు
ఎవరూ ఎరగని
ఏదో కాయలా
బరువుగా నా మెదడు చెట్టుని
పెరుగుతోంది ఈ ముసురు.
నింగికి చాపుకున్నవాణ్ణి
కుంగతీస్తోంది నేలకి,
అంగుడులేని గుడ్డికన్నులా
ఆకాశాన్ని మింగింది.
ఈ అంధఫలమేమిటో
ఎందుకు పనికొస్తుందో తెలీదు
చివరికిది పగిలి
అవని అంతా
వేయినేత్రాలతో మొలిచినందాక
వేయి ఆకాశాలతో రెపరెపలాడినందాక
12975
శ్రావణ మంగళవారం
శ్రావణ మంగళవారం
సాయంత్రం
ఒకానొక మబ్బు డస్టరు
అకస్మాత్తుగా ప్రవేశించి
భూమ్మీది వెర్రి రంగుల్నీ పిచ్చిగీతల్నీ
పూర్తిగా తుడిచేసి,
మెరిసే వానసుద్దముక్క పట్టుకొచ్చి
వీధుల్లో కళ్ళనీ
రోడ్లపై పడెల్నీ
లోకంలో కాంతినీ
వెయ్యిపెట్టి గుణించేసి
చెయ్యూపి వెళ్ళిపోయింది.
అప్పుడు
చప్పుడు కాకుండా
శ్రావణ మంగళవారం
చక్కా వచ్చి,
వీధుల్లో
విలాసంగా తేలే
పేరంటపు అమ్మాయిల
పిపాళి కళ్ళపడవల్నిండానూ,
తడిసిన చెట్లపై
తళతళలాడే
ఆకుల దోనెల్నిండానూ,
అద్దాల బొట్టుల్లా మెరుస్తో
పిల్లల్ని ఆహ్వానించే
నీళ్ళ పడెల్నిండానూ
వింతగా పెరిగిపోయిన
కాంతిరాశుల్ని నింపి,
ఆనందపు తెరచాపలెత్తి
అనంతకాలంలోకి వదిలింది.
ఎరుపెక్కే
ఇవాళ్టి సంధ్యకానీ
నలుపెక్కివచ్చే
నిరాశాంధం కానీ
నా మనస్సులో
ఆనందపు తెరచాపలెత్తి
అనవరతం సాగిపోయే
ఈ కాంతిపడవల్ని
ఆర్పలేవనుకుంటాను.
12873
ఆత్మహత్య
తనని బాధిస్తున్న
ప్రపంచపు ముల్లుని
పీకి పారేసి
ఈ పిల్ల చక చకా
ఎటో నడిచిపోయింది.
25975
ప్రేమలోంచి పడ్డం
ఎవరూ ప్రేమలో పడరు
ఎగురుతారు ప్రేమలోకి తేలిగ్గా,
రెక్కల్ని పోల్చుకొని
చక్కగా విదిల్చుకొని
పాతుకుపోయిన మనుషుల
ఎత్తిన తలకాయలమీదుగా,
చప్పట్లు కొట్టే ఆకుల
చప్పుళ్ళు సాగనంపగా
ప్రియురాలి నీలి
నయనగగనం లోకి
ఎగిరిపోతారు
ఎంచక్కా.
ప్రేమలోంచి పడ్డ
పిచ్చివాళ్ళ నెరుగుదును.
ప్రణయపు ఔన్నత్యాల్లో
ప్రాణవాయువు పలచబడో,
జవరాలి నేత్రగోళాల
ధ్రువాలు తారుమారైపోయో
దారీ తెన్నూ తెలీక
తపతప కొట్టుకొంటో
భూమికి రాలిపోతారు
ప్రేమికులు కొంతమంది.
మచ్చెకంటి నిసర్గభూమిపై
మచ్చగా మనగల్రు.
10274
బావి
రివ్వున ఆకాశానికి
ఉవ్వెత్తుగ లేస్తుంది మంట.
సవ్వడిచెయ్యక భూమిబుగ్గపై చల్లటి
నవ్వు సొట్టలా ముడుచుకుంటుంది బావి.
పిల్లంగోవిలా లోతుగా
చల్లటి నీడల్ని ఊదుతో
వేళ్ళనీ పెదిమల్నీ
ఒళ్ళంతటినీ ఆహ్వానిస్తుంది బావి.
స్వరాల చల్లటి పిట్టలు వాలగా
పరచి సంగీతపు ఊడల్ని,
మరచిపోయిన పాతవానల్ని
గురుతుకు తెస్తుంది బావిపిల్లంగోవి.
నీడల విసనకర్రని విప్పి
ఎండలో సేదతేరుస్తుంది చెట్టు;
నీడల మడతవిసనకర్ర బావి,
వాడుకొమ్మంటుంది చేదలితో విప్పి.
పాతవానల రహస్యనిద్రల్ని తట్టి
పాతస్మృతుల సుడిగుండాల్ని గాలించి
ఆతపించే వర్తమానం కోసం
శైతల్యాన్ని తెస్తాయి చెట్టూ, బావీ, పిల్లంగోవీ.
12572
వర్షంలో ఊగే చెట్లు
సాగరంలా
ఊగుతోంది.
భోరున కురిసే వర్షంలో
పారం కనిపించని తోట
అహర్నిశీధులు క్షోభిస్తుందేం?
మహాసముద్రం చోద్యంగా ?
గుండెల్లో నిత్యం వానలు
కురుస్తో ఉంటాయి గావును.
అంత కల్లోలంలోనూ
ఎగిరిపడి కసిరేసే
వృక్షతరంగాల్నే
పక్షులాశ్రయిస్తాయేం?
తూర్పున నల్లటి ఉచ్చులు
తుఫాను పన్నుకుంటూ రాగా
చప్పున సాగరవృక్షాగ్రానికి
తప్పించుకుంటాయిట ఓడలు
మూలాల్ని ప్రశ్నించే గాలికి
కూలుతాయి మహావృక్షాలు,
ఊగుతాయి ఆ శూన్యంలో
ఊడిన వేళ్ళ ప్రశ్నార్థకాలు
చుట్టుకుపోయిన మహాసముద్రాల
అట్టడుగున మిగుల్తాయి
బలిసిన ప్రశ్నార్థకాలతో
కుల్కులలాడే మహానగరాలు.
భుజాలు పతనమైనా
బీజాలూ ద్విజాలూ ప్రసరిస్తాయి
కొత్తనీడల్ని పాతుతాయి
కొత్తపాటల్ని మొలకెత్తుతాయి
జలనిధికీ, ఝంఝ కీ
అలజడి పైకే కానీ
హృదయాలతి ప్రశాంతమట.
21373
చేతులు తెగాక
మెరిసే నీ
చిరునవ్వుల్నేరుకుందామని వచ్చాను.
అరికాళ్ళ నిండా
అరచేతుల్లోనూ
గిచ్చుకున్నాయి.
పిచ్చివాణ్ణి!
మెరిసేవన్నీ
మెత్తటివనుకున్నాను.
పగిలిన నీ
పగటికలలని తెలీదు.
28874
ములిగిన ఓడలు
(కాశీ గారికి, ఆయన నలభైయో జన్మదినంనాడు)
బిడియంగా కాశీగారు
అడిగారొకనాడు
‘విస్మయమౌతుంది నాకు
ఇస్మాయిల్ గారు!
ఇంత కూల్గా మీరు
ఎలా ఉండగలుగుతున్నారు?’
ఈ ప్రశ్నే నేనూ
అప్పటి కెన్నాళ్ళనించో
ఆయన్నడుగుదామనుకుంటున్నా!
కాశీగారూ, మనం
జారిపోయే అలలతో
బేజారెత్తిపోయో,
ఏ గాలి కా తెరచాప
ఎత్తటం చాతకాకో
ఎప్పుడో మన చిన్నప్పుడు
పవనఝంఝామహాసోపానా
న్నవరోహించి
సాగరగర్భానికి
సాగిపోయిన ఓడలం.
మహాసముద్రఫలంలో
మధ్యని రెండు బీజాలమై
అల్లనల్లన ఊగుతో
ఆకుపచ్చటి కలల్ని కాదంటాం,
పగడాలుగా చివురించి కొత్త
జగత్తుని సృష్టిస్తాం,
అర్కబింబం ఆవర్తాలని
అంతఃచ్చక్షువులతో అనుసరిస్తాం.
సంవర్తాలూ సంక్షోభాలూ
సాగిపోయాక పైని
మెత్తటి అలొకటి వచ్చి
మెల్లిగా చెబుతుంది ఊసు,
చప్పుడు చెయ్యని
చేపలు మన నేస్తాలు,
సూర్యుడి జండా మన తెరచాపకొయ్యని
సుతారంగా రెపరెపలాడుతుంది.
కాశీగారూ!
నిశ్చలంగా మనం
నిలబడి ఉన్నా
పయోరాశి మనచుట్టూ
ప్రయాణిస్తుంది,
మనకోసమే మహాసముద్రం
పరిపక్వమౌతోంది.
15974
చిగిర్చే చెట్లు
నడచివచ్చి నిశ్శబ్దంగా
నా కిటికీ దగ్గిరాగి
హటాత్తుగా
పటేలుమని
వంద వాయిద్యాలతో
వికసించిన బ్యాండుమేళంలా
ఒక రోజు
అకస్మాత్తుగా
చివురించిన చెట్టు
గవాక్షం వద్ద నన్ను ఆపేసింది.
పడవంచున కూచుని
పరికించే సాగరప్రియుడికి
ఒకొక్కప్పుడు
అకస్మాత్తుగా
సముద్రపు నీలికళ్ళల్లో
సందర్శనమిచ్చే
చేపల గుంపులా
చిరుతోకల్ని ఊపుతో
ఏకాభిముఖంగా
ఆకుచివుళ్ళు ఈదుతున్నాయి.
కొమ్మల
కొసల్ని
దూరాభారం చేత పలచబడ్డ
దూరపు కొండల్లా
నిద్దట్లో వికసించిన
పొద్దుటి కనురెప్పల్లా
ఆకాశాన్ని వడపోస్తున్నాయి
ఆకులు
చిగిర్చే చెట్టుకి
ఎగిరే పిట్ట ఆదర్శం!
పత్రాల్ని విదిల్చి
పైకెగరాలని ప్రయత్నం.
కదలక మెదలక
కప్పులు మూసుకుని
నిద్రపోయే
క్షుద్రగృహాలకు
అతీతంగా ఎదుగుతుంది.
అందుకనే,
శీతాకాలం ఎత్తివచ్చినా
భీతిచెందును చెట్టు :
వీపులపై
మ్యాపులతో
పత్రాలన్నీ నిశ్శబ్దంగా
ధాత్రికి దిగివచ్చి
సామాన్యమైన మట్టితో
సారూప్యం పొంది
మ్యాపుల్లోని రహస్య
మార్గాల గుండా
చేరుకుని వృక్షశిఖరాన్ని
చలిమూకని
చావుదెబ్బ తీస్తాయి.
2672
శ్యామలరావు గారికి
శ్యామలరావు గారూ,
ప్రతి సాయంత్రం మీరు
స్మితవదనంతో వచ్చి
ఊరే గదిచీకట్లలో
కూరుకుపోయిన నన్ను
చెయ్యట్టుకు లాగి
షికారు తీసుకుపోతారు.
వంగిన సంధ్యాకాశాన్నించి
రంగులమాటల్ని తెంపుకుంటో
చీలిపోయిన రహదారుల్ని
చిరునవ్వుల్తో అతికిస్తో,
వీధుల్లో మన అంగలతో
విజయద్వారాల్ని సృష్టిస్తో,
ఊరంతా తిరుగుతాం.
అప్పుడు
మీ హాసాల హోరుగాలికో,
ఊహల ఋజుత్వానికో, తెలీదు,
ఇళ్ళు విశాలంగా వెనక్కి జరిగి
రోడ్లు తిన్నగా పరచుకుని
జగమంతా అందంగా తెల్లపడి
చంద్రోదయ మౌతుంది.
అప్పటికిగాని
ఇంటికి తిరిగిరాము.
అంతే కద,
శ్యామలరావు గారూ!
201273
కోసిన మామిడిపండు
అలల కనురెప్పల కింద
అలజడిలేని స్వప్నంలా
నిశ్చలంగా వేలాడుతుంది చేప.
ఆకుల జలపాతం కింద
ఆకుపచ్చని నీడల్లో
నిశ్చింతగా ఈత్తుంది మామిడికాయ.
ఎండాకాలం గాలం విసిరి
ఎండలాంటి ఎర్రటి ఎండుగడ్డిలో
పండబెడుతుంది కాయని.
ఎండాకాలం పుటుక్కున తెంచి
ఎండుగడ్డిలాంటి ఎర్రటి ఎండల్లో
మండబెడుతుంది నా కాయాన్ని.
మందహాసంవంటి కత్తి వచ్చి
అంతరాళాల్ని ఆరబెట్టి
చెర విడిపిస్తుంది మామిడిపండును.
మంతహాసంలాగో మాన్సూనులాగో
అంతరాళాల్ని కోసి ఏ కత్తి
చెర విడిపిస్తుందో నన్ను.
24772
హాస్పిటల్లో ప్రేమ
నువ్వొచ్చేవేళ కాలేదింకా
గవాక్షంలోంచి చూస్తున్నాను ఊరివంక
నీడల వాడిగోళ్ళని చాచింది ధరణి
నింగి పొట్టని చీల్చి మింగింది రవిని
మూలమూలలా ” బేసిలై ” తోడుకుంటున్నాయి
మూలుగుల్లోని వెలుగుల్నికూడా తోడేస్తున్నాయి.
నువొచ్చే వేళైంది
చివాల్న ట్యూబ్లైట్ల ఇంజక్షను మొదలైంది
పట్టణం నరాల్లోకి కాంతులు ప్రవహించాయి
కట్టకడకు కిటికీలు కళ్ళుతెరిచాయి
మెల్లగా మెట్లపై నీ బూట్ల చప్పుడు
తెల్ల జీవకణంలా ప్రవేశిస్తావప్పుడు.
21174
ఆమె చిన్నప్పటి ఊరు
అగాధమైన రైలుహోరులోంచి
ఎగతోడుతున్న నిదరబాల్చీలనించి
ఒకటిరెండు మాటలొలికి
ఒడిలిపోయిన స్మృతుల
ముసిలివేళ్ళని తడిపి,
ముడుచుకు పడుకున్న నన్ను
వికసించిన చివురాకులా
విప్పి కూచోబెట్టాయి.
ఆమె చిన్నప్పటి ఊరు!
రైలాగినట్లుంది
లైట్లతో విప్పారాయి కిటికీలు
కిటికీలోంచి చూశాను.
కటకటాల వెనకాతల
కైదీలా ఒదిగిన ఊరు.
కటకటాలు రెక్కలిప్పుకుని
కాకుల్లా ఎగిరిపోతున్నాయి.
ట్రెయిను కదిలినట్లుంది
బయటికి తొంగిచూశాను.
ఆమె మాటల్ని వెలిగించిన
అలనాటి ముచ్చట్లు గుర్తుకొచ్చాయి.
ఉబ్బుగా ఊదిన
రబ్బరు బెలూన్‌లా
పలచగా, తేలిగ్గా
మిలమిలలాడుతూ
విస్తరించిన
వేసవిదినాల
సరోవర సౌందర్యాలు
సురిగిపోకుండా పైకిలేచి,
ముడుచుకుపోయిన వానాకాలపు
ముసురుసంజల్లో
మెరిసే మబ్బంచులై
సరస్సుని వెలిగించినట్లు
ఆమె చిన్నప్పటి
ఆటలూ, ఆనందాలూ
ఎడబాయకుండా
ఏ మూలనో మెరుస్తో
అంటిపెట్టుకుని
ఉంటాయనుకున్నానా?
పురవీధుల దీపాలపై
పురుగు మబ్బులు తేలుతున్నాయి.
కొత్తగా లేచిన సినిమాహాల్ లైటుని
కేంద్రబిందువుగా తీసికొని,
విచ్చుకున్న వ్యాసార్థాల
వీధిరేఖల్ని ప్రదర్శించి,
ఒత్తుకుంటో ఊరిని
వృత్తార్థం గీసి
నీ చిన్నప్పటి ఊరిని
నిర్వచించి విడిచింది
పట్టాలు పట్టుకు
పాకులాడే శాస్త్రీయరైలు
17874
నీడలా ధృడంగా
ఎక్కడికో
హడావుడిగా
పరుగులెత్తే కాలవ
తన నీడల్ని
తనతో రమ్మని
చెయ్యట్టుక
లాగుతోంది
రామంటూ అవి
తలలాడిస్తున్నాయి.
ఇవాళ
ప్రపంచమంతా
ప్రయాణసంరంభంలో
ఉన్నట్లుంది.
పైని
మబ్బుతునకలు
గుంపులు గుంపులుగా
ఎక్కడికో
ఎగిరిపోతున్నాయి.
కింద
కాలవగట్టు మీద
తొందరలేని నీడలా
ధృఢంగా
నేనొక్కణ్ణే!
281072
నిద్దట్లో ఆమె కళ్ళు
అర్ధరాత్రి దూరాన
ఎక్కడో పడగవిప్పిన చప్పుడుకి
నిద్దట్లో
కలవరపడి
పక్కకి తిరిగి
నన్ను హత్తుకుందామె.
ఆమె కళ్ళు
జలజలపారే
నిద్దర సెలయేటి అడుగుని
గలగలమని పాడే
అందమైన
గులకరాళ్ళు.
ఈ మెరిసే నీళ్ళ చప్పుడుకి
ఆకర్షితులై
చీకట్లో మెసిలే
ఏవో వింతమృగాలు
ఆమె నిద్దర ఒడ్డుల్ని
తచ్చాడుతాయి.
231072
ఆడదన్నా, కొండలన్నా
” ఆడదాని అందానికి
అలవాటైపోతాం క్రమంగా
ఎంత అందక్తౖతెనా
కొంత పరిచయంతో విసుగుపుట్టిస్తుంది ”
అన్నారెవరో : కాని
అలా అనిపించదు నాకు.
ఊరెనకాతల కొండలా
ఉన్నతంగా లేచి
నే చేసే ప్రతిపనికీ
నేపథ్యంగా నిలుస్తుందామె.
కొండలాగే క్షణక్షణమూ
రంగులు మారుస్తుంది.
కొండలకేసి చూస్తో నేను
కొన్ని యుగాలు గడిపేయగలను.
కొండొక ఊళ్ళో కొన్నాళ్ళు
కొండపక్క కాపురమున్నాం.
మిత్రుడొకతను మాట్లాడుతుంటే
చిత్రంగా మారే కొండకేసి చూస్తున్నా
‘Obsession(ఆ) నీకు? ‘
అన్నాడతను విసుగ్గా.
అంతే ననుకుంటా __
ఆడదన్నా, కొండలన్నా
చిన్నప్పుడు కొంతకాలం
గన్నవరంలో గడిపాం :
ఈ మధ్యని వెళితే
నేపథ్యంలో కొండలు తలెత్తి చూశాయి :
చెరువొక్కటే
చిన్నప్పటి జ్ఞాపకం.
ఇరు Obsession లూ ఒకేమారు
తరువాత పుట్టాయనుకుంటా.
51074
ఏకాంతానికి గేలం
పట్టణం ట్యూబు నించి
పంచరంగుల సంధ్యని
పిసికి పడేస్తారెవరో
పరిచయాల గోడలు
మరీదగ్గిరగా జరిగి
ఇరుకులోంచి ఉరికి
ఊరవతల పడతావు
కాలవొడ్డున ఏకాంతానికి
గేలమేసి కూచుంటావు
నీ మల్లే కాలవకి
బయళ్ళంటే ఇష్టం.
గట్లు లేని గగనాన్ని
గడగడా తాగేసి
కొత్త ఆకాశాలకోసం
వెతుక్కుంటో పోతుంది
సాయంత్రపు టూత్పేస్టు
సాంతమై పోయాక
కాలవా, నువ్వూ
లోలోన మెరుస్తారు
ఆకాశపు ప్రమిదలో
ఏకాంతపు వత్తిలా జ్వలిస్తారు
అప్పుడూళ్ళో దీపాలు
గప్పున వెలిగి
పట్టణం విశాలంగా
పరుచుకుంటుంది
అంతులేని ఆకాశంతో
అంతట పురప్రవేశం చేస్తావు
13575
గోదావరి దాటాం
ఆకాశప్పాఠాలని
ఆగి ఆగి
వప్పగించే
వరిమళ్ళని దాటి,
ఎక్కాల పట్టీల్లా
ఎడతెగని
బాతుల
బారుల్ని దాటి,
కొమ్ముల
కుండలీకరణాలతో
లెక్కచెయ్యకండా నిలబడ్డ
లెక్కల్లాంటి గేదెల్ని దాటి
ఊళ్ళమ్మట వేదుతో
ఇళ్ళరుగుల పెదిమలపై
పలకరించే చిరునవ్వుల్లా
కలకలలాడే జనాన్ని దాటి,
చరిత్ర గమనంలా
విచిత్ర దృశ్యాల్ని మార్చి చూపించే
కలైడస్కోపు మలుపుల్లాంటి
ములుపుల్ని దాటి,
గొణుక్కుంటో గలగలమని
వణుక్కుంటో ముసలినౌకరులా
వెంటవచ్చే
పంట కాలవల్ని దాటి,
కెరటాలుగా తాకే
తరుచ్ఛాయల వాత్సల్యాన్ని దాటి,
చెయివేసి మెడచుట్టూ
చెవిలో గుసగుసలాడే
చిరుగాలుల నేస్తాన్ని దాటి,
చివరికి
చేరుకొన్నాం కోటిపల్లి.
రంగురంగుల చిట్టి బాల్యదృశ్యాలపై
చెంగుచెంగున గెంతే మా పిచికిమనసు
ఆచ్ఛాదన లేని
ఆకాశాన్నీ
సీమలూడ్చిన
భూమినీ చూసి
రెక్కలు చాచలేక
బిక్కు బిక్కుమంది.
ఇసకతిన్నెల
పసిడికండువా
పల్లెవాటు వేసుకొని మేనువాల్చి
పెళ్ళికొడుకులా నిరీక్షిస్తున్న నదిని చూసి
విస్తుపోయి, శోభనం గదిముందు
పెళ్ళికూతురులా
బిడియంగా భయంగా
అడుగువేసి ఆగాము.
అరచెయ్యిలాంటి దోనెని చాపి
ఆప్యాయంగా చేరదీసి
పగిలిన గాజుపెంకుల్లా
పదునుగా మెరుస్తున్న గుండెల్లో
పడవంత చోటివ్వగా,
ఉడువీధిలో విహరించిన
మా మనోవిహంగం
పక్షాల్నిడుల్చేసి
నగ్నంగా చేపై
నదీప్రవేశం చేసింది.
14373