భారతీయ పరిచయక్రమం – అస్తిత్వవాద సాహిత్యం

ప్రవేశిక

– నాకు మాత్రమే సత్యమైన సత్యాన్ని నేను కనుగొనాలి. (కీర్కెగాడ్)

– దేవుడు లేకుంటే అన్నిటికి అనుమతి. (దోస్తోయెవ్‍స్కీ)

– జగత్తు మిథ్య అంటావా? కానివ్వు. ఈ మిథ్య నాకు సచేతనం. (నీచ)

– ప్రతి ఒక్కరి మనసులో ఒక ప్రమాదకరమైన అనుమానం కలుగుతుంది, భ్రమకంటే వాస్తవం ఏం మేలు? వాస్తవమైన ప్రతిదీ భ్రమ కావచ్చు, అలాగే భ్రమ కూడా. (పిరాన్దెల్లో)

– జగత్తు నడవడానికి అసత్యం అత్యంతం అవసరం. విషాదకరమైన ఆలోచన. (కాఫ్కా)

– గమ్యం ఉంది, దారి లేదు. (కాఫ్కా)

– ప్రతి మనిషి అనేకులుగా పుడతాడు, ఒకడుగా చనిపోతాడు. (హైడిగర్)

– స్వేచ్ఛ మనిషికి శిక్ష. (సార్త్ర)

– తీవ్రశిశిరంలో చివరకు నాకర్థమైంది, నాలో ఒక అజేయమైన గ్రీష్మం ఉందని. (కామూ)


‘ఇంకా లోతుగా తవ్వు, నీవు సనాతనభూమిపై నిలబడి ఉంటావు. [‘Dig deeper and you will find yourself standing on Catholic ground.’ -Josef von Görres]

‘మమ మాయా దురత్యయా’. (గీత.7.14.)

(‘నా మాయను దాటడం కష్టం.’)


వేలసంవత్సరాలనుండి వేదాంతడిండిమం, యీ జగత్తు మాయ అని వీథుల్లో ఢంకా కొట్టి మాయావాదం వినిపిస్తున్నా, అది వాదనగా ఉండిపోయింది తప్ప వేదన కలగలేదు. అస్తిత్వవాదం మాయను వేదనగా, అనుభవంగా అందించే ప్రయత్నం చేసింది.

మాయ అంటే అర్థం కానిది. అంటే బుద్ధికి అందనిది. మాట సహాయంతో మనసు ఎంత దూరం వెళ్ళినా విఫలమై వెనక్కు తిరిగి రావలసిందే. (యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ- తై.ఉ.) కాదని ముందుకు వెళుతావా, యింకా ముందుకు యింకా ముందుకు అని? ఒక పెద్ద గోడ అడ్డంగా నిలబడి ఉంది. ‘రెండు రెళ్ళు నాలుగు అనడం నాకిష్టం లేదు. నాకు తెలుసు, ఈ రాతిగోడను నా బుర్రతో బద్దలుకొట్టలేను. అలా అని, దానితో రాజీపడలేను కూడా…‘ (దొస్తోవ్‌యెస్కీ: నోట్స్ ఫ్రమ్ అండర్‍గ్రౌండ్). సార్త్ర కథ ‘గోడ’ కూడా హేతువాదపరిమితికి ప్రతీక.

గోడ కూలగొట్టే ప్రయత్నం చేస్తాడొకడు. దూకి పోవాలనే వాడొకడు. ఢీ కొట్టి తలబొప్పి కట్టినవాడొకడు. అస్తిత్వవాదసాహిత్యం యీ బొప్పులు నొప్పులు అరుపులు ఆక్రోశము ఆగ్రహము ఆవేదన అయోమయము. ఈ అరుపులు అనాదినుండి వినిపిస్తున్నవే.

గాంధారదేశవాసిని ఒకణ్ణి కొందరు దారిదొంగలు కళ్ళకు గంతలు కట్టి దూరపు కారడవిలో వన్యమృగాల మధ్య వదిలి వెళ్ళారు. వాడు, ‘దారి తెలియడంలేదు. నేనెక్కడున్నాను? ఇక్కడ కాపాడేవారెవరైనా ఉన్నారా? నా మాట ఎవరికైనా వినిపిస్తోందా?’, అని అరిచాడు. (ఛాందోగ్య ఉ. 6.14.)

కాఫ్కా కథలలోని కళ్ళకు గంతలు యివి కావా? కామూ చెప్పే అసంబద్ధత యిది కాదా? (The absurd is born of the confrontation between the human need and unreasonable silence of the world. – Camus: The Myth Of Sisyphus) సృష్టి అర్థం కాదని కొందరు, అర్థం లేదని కొందరు అంటారు. కాని ఒకటి మాత్రం అస్తిత్వవాదులు తెలుసుకున్నారు, బుద్ధి చాలదు అని. (నైషా తర్కేణ మతిరాపనేయా – కఠ.ఉ. 1.2.9.) బుద్ది రాని, బుద్ధి లేని బుద్ధికి బుద్ధి చెప్పడం అస్తిత్వవాద అశయం. హేతువాదపరిమితిని గుర్తించడం అస్తిత్వవాద ఆవిర్భావం.

అస్తిత్వవాదులు ఒక్కొక్కరు ఒక్కొక్క ముఖంపై ముసుగును తొలగించి తొంగిచూసే ప్రయత్నం చేశారు. కాని, పిరాన్దెల్లో (Pirandello) మొత్తం సృష్టిని కప్పిన పెనుమాయను తొలగించే ప్రయత్నం చేశాడు. ఎలా? యీ సృష్టి వెనుక ఏముందో అర్థంకాక అందరూ పిచ్చిపట్టి బుర్రబద్దలు కొట్టుకుంటుంటే, ఆ పిచ్చిని హాస్యంగా మార్చి, అద్భుతమైన సాహిత్యం సృష్టించాడు, తన ప్రసిద్ధ నాటకంలో (Six Characters in Search Of an Author). ఆ నాటకం జగన్నాటకమే. దాని వస్తువు ఆద్యంతము మాయ. నాటకమంతా మాయావిషయం. అందులో పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు, చివరకు రంగస్థలనిర్దేశాలు (stage directions) కూడా మాయావిషయాలే. ప్రస్తుతరచనకు ముందుంచిన ఉద్దృతం (quote) అటువంటి రంగస్థలనిర్దేశమే. భర్త చనిపోతే శోకసూచకంగా తాను ధరించిన ముసుగును తొలగిస్తున్న ‘తండ్రి’ని వారిస్తుంది ‘తల్లి’. (ఇక్కడ ‘తండ్రి’ ఆమె మొదటి భర్త.) అస్తిత్వవాదమంతా యీ మేలిముసుగుతో గుద్దులాట. (మమ మాయా దురత్య యా. -గీత. 7.14.)


తత్త్వం ముందు, బతుకు వెనుక. Essence precedes existence.

బతుకు ముందు, తత్త్వం వెనుక. Existence precedes essence.

పేరే తత్త్వశాస్త్రం. దానికి తత్త్వం ముందు. తత్త్వశాస్త్రం ఎక్కడ మొదలుపెడుతుంది? ‘మొదట ఏముండెను?’ అని ‘మొదట’ (అగ్రే) మొదలవుతుంది. (ఆత్మవేదమగ్ర ఆసీత్) సృష్టికి ముందు, సృష్టికి అవతల ఏముంది అన్న విచారణ చేస్తుంది. సృష్టిలో మనిషి కూడా ఉంటాడు కనుక, తత్త్వశాస్త్రంలో మనిషి కూడా ఉంటాడు, అనంతమైన సృష్టిలో ఎక్కడో ఒక మూల. ఆ మూల ఉండిపోయిన మనిషిని ముందుకు తెస్తుంది అస్తిత్వవాదం. కంటికి కనిపిస్తున్న యీ వాస్తవ ప్రపంచం వాస్తవం కాదు, యిది పరవస్తువుకు నీడ అంటాడు ప్లేటో. మనిషి మట్టిమనిషి, మట్టిమనిషిలో మనిషి సత్యం కాదు, మట్టి సత్యం అంటాయి ఉపనిషత్తులు. (మృత్తికేత్యేవ సత్యం. -ఛాందోగ్య ఉ. 6.1.4.) ప్లేటో నీడలలో నుండి మనిషిని వెలుగులోకి లాగి, మనిషి అంటే మట్టి కాదోయ్ మనిషే అని గుర్తుచేసే ప్రయత్నమే అస్తిత్వవాదం.

మనిషి అంటే మట్టి కాదోయ్ అని మధ్యమధ్య అరుస్తున్నవారిలో ముఖ్యుడు రుసో (Rousseau). ‘పుట్టినపుడు మనిషి ముక్తుడు. ఆ తరువాత అడుగడుగునా అతనికి సంకెళ్ళు’ (రుసో). మనిషి అనాది స్వేచ్ఛారావానికి రుసో వాక్యం కొత్త ఊపిరి పోసింది. ఈ రుసో వాక్యంలో స్వేచ్ఛారావం ప్రకటం. దాని ప్రభావం విప్లవాత్మకం. కాని అందులో అప్రకటంగా ఉన్న అర్థం అంతకంటే విప్లవాత్మకం. ‘పుట్టినపుడు మనిషి ముక్తుడు’ అంటే ఏమిటర్థం? పుట్టినపుడు మనిషి ‘తుడిచిన పలక’ (tabula rasa: John Locke). వెనకజన్మ లేదు. పరం లేదు. పరదైవం లేదు. విధి లేదు, విధిరాత లేదు. ‘అడుగడుగునా అతనికి సంకెళ్ళు’ అంటూనే, అతడికి బంధముక్తిని కూడా ఘోషిస్తోంది రుసో వాక్యం, పరం నుండి యిహాన్ని విడగొట్టి. (పుట్టినపుడు మనిషి ‘తుడిచిన పలక’ అవునా కాదా, ప్రస్తుతానికి పక్కన పెడదాం.)

ప్రతి వాదమూ ఒక ప్రతివాదమే. ప్లేటోనుండి, అంతకుముందు మన వేదాలనుండి, వచ్చిన ఆదర్శవాదం, వాదప్రతివాదాలతో నడిచి హెగెల్ హేతువాదం వరకు వచ్చింది. పరమో గిరమో ఏదైనా తర్కానికి లొంగితే ఉన్నది, లేకుంటే లేదు, అంటాడు హెగెల్. అంటే, బుద్ధికి అందిందే వాస్తవం (real), అందనిది అవాస్తవం (Real is the rational).

అక్కడ మొదలవుతుంది అస్తిత్వవాదం, ఒక ప్రతివాదంగా. అస్తిత్వవాదం యీ హేతువాదంపై దాడితోనే ఆవిర్భవించింది అని చెప్పవచ్చు. సత్యం సహేతుకం (Real is the rational -Hegel) అన్న తాత్త్వికదృక్పథంపై తన సమస్త వ్యంగ్యాస్త్రాలు సంధించాడు కీర్కెగాడ్. తర్కం, హేతువాదం సహాయంతో మనిషి కొంతవరకే తెలుసుకోగలడు. ఆ తరువాత అగాధమే. అగాధంపై నడిచి వెళ్ళలేవు, దూకవలసిందే అవతలి ఒడ్డుకు. (leap of faith… faith begins precisely where reason leaves off. -Kierkegaard) అతడు పేరు పెట్టకపోయినా, అస్తిత్వవాదానికి ఆద్యుడు కీర్కెగాడ్ అన్నది అందరూ ఒప్పుకుంటారు.

విధిరాతను తుడిచేశాడు రుసో. విధిరాత తుడిచేయడం సులభమేమీ కాదు. కాని అది సాధించడంతో పని అయిపోదు. కొత్త రాత రాసుకోవలె. ‘దేవుడు మరణించాడు… ఆయన ఆనవాళ్ళు లేకుండా దిగంతాలను ఏ తడిగుడ్డతో తుడిచేశాం? సంకెళ్ళు తెగగొట్టి యీ భూగోళాన్ని సూర్యుడినుండి విడిపించినపుడు, మనం ఏం చేస్తున్నామో తెలిసే చేశామా?’ (నీచ: పిచ్చివాడు. Nietzsche: GS.Aphorism 125) అస్తిత్వవాదం యీ కొత్త రాత, మట్టి (Earth) పై రాయవలసిన రాత. సంకెళ్ళు తెగిన మట్టిమనిషి తనకు తాను రాసుకోవలసిన తలరాత. సూర్యుడినుండి విడిపించుకున్న ‘భూగోళం’పై మనిషి రాయవలసిన రాత. సంకెళ్ళు తెగిపోయాయని సంబరపడడం కాదు. తెచ్చుకున్న స్వేచ్ఛ మనిషి కోరి తెచ్చుకున్న శిక్ష. ఆ శిక్షే మనిషిని మనిషిగా చేసేది. (Man is condemned to be free -Sartre) ఆ స్వేచ్ఛను ఉపయోగించుకోడంలో మనిషి మనిషి అవుతాడు.అంతవరకు మనిషి కాడు.

ఆదర్శవాదానికి అస్తిత్వవాదానికి ఏమిటి తేడా?

‘వాడు రాక్షసుడు, హత్య చేశాడు’ అంటారు ఆదర్శవాద తాత్త్వికులు. (తత్త్వం ముందు, బతుకు వెనుక. Essence precedes existence.)

‘వాడు హత్య చేశాడు, రాక్షసుడు’ అంటారు అస్తిత్వవాదులు. (బతుకు ముందు, తత్త్వం వెనుక. Existence precedes essence.)

అంటే, పుట్టడానికి ముందే రాక్షసుడుగానో హంతకుడుగానో ఎవడూ నిర్ణయించబడడు. అతడి ప్రవర్తన అతని తత్త్వాన్ని నిర్వచిస్తుంది. (…man first of all exists, encounters himself, surges up in the world – and defines himself afterwards.’ in Existentialism is a Humanism: Sartre.) రాక్షసుడో రాముడో పుట్టుకతోనే రాసిపెట్టిలేదు. ఏది కావాలనుకుంటే అది కావడానికి మనిషికి స్వేచ్ఛ ఉంది. ఇది నా రాత, నా స్వభావం అనడం, నీ స్వేచ్ఛను నీవు కాదనడమే. దుర్యోధనుడు ‘నాకు ధర్మం తెలుసు. కాని ధర్మం ఆచరించవలె అనిపించదు’ అంటాడు. (జానామి ధర్మం న చ మే ప్రవృత్తిః, జానామ్యధర్మం న చ మే నివృత్తిః.) దీనినే సార్త్ర కుంటిసాకు (mauvaise foi, bad faith) అంటాడు.

బంధము, స్వేచ్ఛ:

మనిషికి ముక్తికాంక్ష సహజం, శాశ్వతం. అయితే దేనినుండి స్వేచ్ఛను కోరుకుంటాడు? బంధస్వరూపం మారుతూ ఉంటుంది. ఆదర్శవాదంలో మనిషి తత్త్వానికి (essence) బద్దుడు. అస్తిత్వవాదం ఆవిర్భవించే సమయంలో బంధతత్త్వము, బంధస్వరూపం ఏమిటి? హేతువాదపు వేళ్ళుగా పెరిగిన శాస్త్ర విజ్ఞాన మహావిజ్ఞానవృక్షం. ఆ వృక్షాన్ని ఆశ్రయించిన ద్విజులు హేతువాదులు. అన్యాయం అక్రమం దోపిడీలు లేని ఒక ఊహాహర్మ్యపు నమూనాను ప్రదర్శించి జనాలను అందులోకి ఆహ్వానించారు హేతువాదులు. [నికొలాయ్ చెర్నెషెవ్‌స్కీ (Nikolay Chernyshevsky) నవల ‘What is to Be Done?’ లోని ‘స్ఫటికహర్మ్యం’ను (Crystal Palace) దోస్తోయెవ్‍స్కీ తన నవల ‘నోట్స్ ఫ్రమ్ ది అండర్‌గ్రౌండ్’లో తీవ్రవ్యంగ్యశైలిలో విమర్శించాడు] అస్తిత్వవాదం కూడా యీ బంధముక్తి కొరకే ఆవిర్భవించింది. అది హేతువాదంపై తిరుగుబాటు. (‘రెండూ రెండూ కలిపితే నాలుగే ఎందుకవాలి? నామటుకు నాకు రెండూ రెండూ అయిదైతే యిష్టం’, అంటాడు, గణితదౌర్జన్యంపై గర్జిస్తూ దోస్తోయెవ్‍స్కీ నవలలో కథానాయకుడు.)

సాంకేతిక ప్రగతి మనిషి జీవితాన్ని సులభతరం సుఖతరం చేయటానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. ఆ సుఖాలకు బానిస అయిన మనిషి క్రమంగా తన యిచ్ఛను స్వేచ్ఛగా వదులుకొంటున్నాడు. ‘మరక మంచిదే’ అన్నట్టు, ‘బానిసత్వం బాగుంది’ అంటాడు. ‘కార్మికులారా! పోరాడండి! పోయేదేమి లేదు మీకు, సంకెళ్ళు తప్ప’ అన్నది ఒకప్పటి కమ్యూనిస్టు నినాదం. కాని యిప్పుడు పరిస్థితి మారింది. తిరగబడితే పోయేవి సంకెళ్ళు మాత్రమే కావు, పోయేవి చాలా ఉన్నాయి. (The working class now has many things to lose beside their chains. -Marcuse.) ముందు సుఖజీవనం పోతుంది. ‘సుఖజీవనం బానిసల ప్రత్యేకహక్కు’ (The easy life is the privilege of the slave. -The Grand Inquisitor in The Karamazov Brothers: Dostoyevsky). ఇది సుఖజీవనానికి ఒక ముఖం. బెకెట్ (Samuel Beckett) ‘గొదో కోసం ఎదురుచూపు’ (En attendant Godot, Waiting for Godot) నాటకంలో లకీ (Lucky) పాత్ర యిదే చెబుతుంది. ఆ బానిసపాత్ర పేరులోనే, (Lucky!) బానిసత్వపు భాగ్యం ఉంది.

సిమోన్ ద బువార్ (The Second Sex: Simone de Beauvoir) స్త్రీల బానిసత్వం గురించి కూడా యిదే అంటుంది. స్త్రీకి తన బానిసత్వంలో భాగస్వామ్యం ఉంది అని (woman’s complicity in her unfreedom).

మనిషి స్వేచ్ఛకోసం వేసే వెర్రికేక గురించి అస్తిత్వవాదులేమంటారు? ‘స్వేచ్ఛ కోసం నీవు గావుకేక వేయనవసరంలేదు. నీవు నిత్యముక్తుడవు.’ (నిత్యోసి ముక్తోసి) ముక్తుడవే కాదు, స్వేచ్ఛ నీకు శిక్ష, నీ ‘విధి’ రాత. (Man is condemned to be free – Sartre.) ఇంతలో అస్తిత్వపు అట్టు యిలా తిరగబడింది! అంటే ఏమయింది? అస్తిత్వవాద మూలంలోకి వెళదాం. ‘నన్ను దేవుడు యిలా పుట్టించాడు’, లేక ‘సమాజమో మరొకటో నా చేత యిలా చేయిస్తోంది. నేనేం చేయను? నేను రాక్షసంగానే ప్రవర్తిస్తాను’, అనలేడు ఎవడూ. రాక్షసంగా ప్రవర్తించడానికి, ప్రవర్తించకపోవడానికి నీకు స్వేచ్ఛ ఉంది. అదే నీ శిక్ష కూడా. ఆ స్వేచ్ఛ మనిషికి లేకపోయివుంటే, మనిషి సుఖంగా బానిసబతుకు బతుకుతాడు. అత్యధికులు చేసేదదే. స్వేచ్ఛ ఊరకే రాదు. నరకం తెస్తుంది. ఆ నరకానికి అస్తిత్వవాదులు అనేకమైన పేర్లు పెట్టారు, angst, dread, nausea. స్వేచ్ఛ వద్దు, నరకము వద్దు, అని సుఖంగా బతకొచ్చు. బండరాయికి నరకం లేదు. కాని దానిది బతుకు అనగలమా? కనుక నీవు స్వేచ్ఛగా బతకవలెనంటే, చతికిలబడ్డ జనసమూహంలో నీవు లేచి నిలబడాలి.

(Existence: ‘to exist’ అనే ధాతువు ex-sistere (లాటిన్) నుంచి వచ్చింది. stand out లేక emerge.) నీవు లేచి నిలబడితే, నీవు జనానికి దూరం, జనం కంటే వేరు. ఇదే పరాయీకరణం (alienation). దీనినే కీర్కెగాడ్ ‘మంద అసత్యం’ (Crowd is the untruth) అన్నాడు. మనిషి తన అస్తిత్వాన్ని నిలుపుకోవలెనంటే, మందనుండి విడివడాలి. అంటే ప్రపంచంలో తాను ఒంటరిగా నడవాలి. ఇబ్సెన్ అదే అన్నాడు: ‘మనిషి ఎంత బలవంతుడో అంత ఒంటరి.’ (You see, the point is that the strongest man in the world is he who stands most alone. -An Enemy of the People: Ibsen) ‘అకేలా చల్.’ ఇదీ పరాయీకరణమంటే. దిగాలుపడి ఓ మూల పడి ఉండడం కాదు, ‘నన్నెవరూ పట్టించుకోడంలేదు, యీ లోకానికి నేను వద్దు’ అని నిస్సహాయంగా.

అస్తిత్వవాదులెవరూ ప్రజాస్వామ్యాన్ని, అంటే, మందను నమ్మేవారు కారు. కిఎర్కగాడ్‍లా ‘మంద అసత్యం’ (Crowd is the untruth) అని నమ్మేవారే. నీచ (Nietzsche) కూడా అతిమానవుణ్ణి (overman, ubermensch) బోధించాడు, అల్పమానవుణ్ణి కాదు. హైడెగర్ అంటాడు, ‘మనిషి అనేకంగా పుడతాడు, ఒక్కడై చనిపోతాడు.’ (Man is born as many, but dies as one. -Heidegger). ప్రజలందరి సత్యము తన సత్యం కాదు. తన సత్యం తానే సాక్షాత్కరించుకోవలె. I must find the truth that is true only for me అన్నది కీర్కెగాడ్ ప్రసిద్ధవాక్యం. ఇది అస్తిత్వవాదంలో ప్రధానాంశం. ఇదే, గీతభాషలో ‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ.’ అన్ని సామాజికధర్మాలను దాటి, ‘మామ్ ఏకం’ (‘నన్నొకనినే’) అంటే, ‘ఉన్నది నేనొక్కణ్ణే, ఆ ఉన్న నన్నొక్కణ్ణి ఆశ్రయించు’ అని అర్థం. ఆ ఒక్కణ్ణి, అంటే ‘ఆత్మను ఆశ్రయించు’ అని అర్థం. హైడిగర్ వాక్యంలో one కూడా ఆ ఆత్మే (Man is born as many, but dies as one). సర్వధర్మాలను పరిత్యజించి స్వధర్మాన్ని ఆశ్రయించు, అందులో ప్రాణాలు పోయినా మేలే. ఇదే అస్తిత్వవాదం కూడా, వారి భాషలో.

సర్వసామాజికధర్మాలను పరిత్యజించినవాడు, మంద ఆమోదించనివాడు, మందను ఆమోదించలేనివాడు, తిరుగుబాటు చేయకతప్పదు. కనుక అస్తిత్వవాదంలో తిరుగుబాటు అంతర్భాగం. (కామూ తిరుగుబాటుదారు: Camus: The Rebel) ప్రతి అవధూత తిరగబడినవాడే.

స్వేచ్ఛాకాంక్షనుండి పరాయీకరణము, పరాయీకరణంనుండి తిరుగుబాటు, తిరుగుబాటుతో వచ్చే వ్యథ (angst). కనుక స్వేచ్ఛకోసం మనిషి వేసే కేకలో స్వచ్ఛత ఎంత? మనిషి నిజంగా కోరుకునేది స్వేచ్ఛనా, సుఖమా? అస్తిత్వవాదం ఒక విధంగా యీ సుఖలాలసతకు సుఖజీవనానికి, జీవితాన్ని అంతకంతకూ సుఖతరం చేయవలె చేయగలం చేస్తాం అనే నినాదాలకు, నిరసనగా వచ్చింది అనికూడా అనవచ్చు. ఈ వైరాగ్యమే కొందరు అస్తిత్వవాదుల్లో పలుకుతోంది. కీర్కెగాడ్‍కు శ్రద్ధ పరమం. కాని ఆ చరమస్థితికి చేర్చేది అత్యంత వైరాగ్యమే (infinite resignation). ఆశ్చర్యమేమంటే, ఉల్లాసము ఉత్సాహము చెప్పే నీచ కూడా వైరాగ్యమే -మందవైరాగ్యం కాదు- తీవ్ర వైరాగ్యం, చెబుతాడు. ‘జీవితంలో కలుగగలిగిన మహోత్తమమైన అనుభవం ఏది? తీవ్ర తృణీకారభావోద్భవక్షణం. నీ సంతోషం కూడా నీకు వెగటు అనిపించే క్షణం, నీ వివేకం నీ సుగుణం కూడా.’ (What is the greatest experience you can have? It is the hour of the great contempt. The hour when your happiness, too, arouses your disgust, and even your reason and your virtue. –Thus Spoke Zarathustra: Nietzsche). ఈ విషాదయోగ ప్రాప్తి సత్యసాక్షాత్కారద్వారం.

జీవితసత్యం ఎప్పుడు ఎలా సాక్షాత్కరిస్తుంది? మృత్యుభయంలో అంటాడు హైడిగర్ (Dread reveals Nothing. -Heidegger: What is metaphysics?) Nothing (Nicht) అంటే శూన్యం అని సామాన్యార్థం. కాని, అసత్ అని ఉపనిషత్తులు వాడే పదం హైడిగర్ ఉద్దేశించిన అర్థానికి సమానార్థకం అని చెప్పవచ్చు. హైడిగర్ Nothing అనే పదాన్ని మృత్యువు అన్న అర్థంలో, అస్తిత్వంలోని ‘అస్తి’కి వ్యతిరేకార్థంలో, వాడుతాడు. ఈ వ్యతిరేకమే (లేక నిషేధము లేక అపవాదము, negation), యీ ‘నాస్తి’ అనుభవంలోగాని ‘అస్తి’ అనుభవం కాదు అంటాడు. అంటే అస్తినాస్తి ఏకకాలంలో ఏకమై అనుభూతమౌతాయి. హైడిగర్ ప్రధానరచన Being and Timeలో (Sein und Zeit)  దీనినే అతడు Being towards-death అంటాడు. మృత్యువునుండి పారిపోవడం అస్తిత్వం కాదు. మృత్యువును ముందుంచుకొని నడవడమే సరి అయిన నడవడి. నచికేతుడు మృత్యుముఖంలోనే నడిచి సత్యాన్ని సాక్షాత్కరించుకున్నాడు.

ఉపపనిషత్తులు యీ అసత్తును, యీ మృత్యువునే చెబుతున్నాయి. (నైవేహ కించనాగ్ర ఆసీత్, మృత్యునైవేదమగ్ర ఆసీత్.’ బృహ.ఉప.1.2.1. ‘ఇక్కడ మొదట ఏమియు లేకుండెను. కేవలం మృత్యువు చేత యిది కప్పబబడియుండెను.’ ‘ప్రాగుత్పత్తేః మన ఆదే!’. శం.భా. ‘మనసు మొదలైనవి ఉత్పత్తి కాక ముందు’, అనగా సృష్టికి పూర్వము.) హైడెగర్ రాసిన Being and Timeలో, Being నచికేతుడు, Time కాలుడు. అస్తిత్వవాదం మృత్యువులో పుట్టి పెరిగింది. ‘ఈ మూణ్ణాళ్ళ ముచ్చటకా పుట్టడం?’ (‘Why was I born if not for eternity?’ Ionesco…) జీవితం ముందుకుసాగలేక ఆగిపోవలసిన గోడ మృత్యువు. (Le Mur (The Wall): Sartre.) ఆ గోడకు ముఖం పెట్టి నిలిచినపుడు, వెన్నుకు గురిపెట్టిన మృత్యువు అనుభూతమవుతుంది. జీవితం విలువ అప్పుడు తెలుస్తుంది. ‘మృత్యువు జీవితసహచరి.’ (…death is just a fellow Existence. – Heidegger)

అయితే బతుకంటే చస్తూబతకడమేనా? హైడిగర్ కాదంటాడు. ‘వాస్తవం కన్నా, సాధ్యం మిన్న.’

(‘Higher than actuality stands possibility’. in Being and Time: Heidegger). మృత్యువు వాస్తవం. కాని దానికోసం ఏడుస్తూ ఎదురుచూడనవసరంలేదు. ‘రానీ’ అని సిద్ధమై స్వేచ్ఛగా జీవించు అంటాడు. హైడిగర్ రెంటినీ రెండు పదాలతో వేరు చేస్తాడు. anticipation, (Vorlaufen), awaiting (Erwarten); anticipation సక్రియం, awaiting నిష్క్రియం, జడం. మనిషి ఆత్మను ఆవిష్కరించుకోడానికి సాధనమైన జీవిత సత్యం మృత్యువు.

మృత్యుభయం మృత్యువంటే భయంకాదు, మృత్యుసాక్షాత్కారంలో కలిగే భయం. మనిషిని ఉద్ధరించి ఉద్యుక్తుణ్ణి చేసే అవబోధ. మృత్యుముఖంలో కాని జీవితమేమిటో తెలియదు.

ఈ సందర్భంలో చెప్పుకోతగ్గమాట మరొకటి. పద్యానికి మద్యానికి ఫ్రాన్స్ ప్రసిద్ధి. చిత్రలేఖనం కూడా అంటారు. జర్మనీ తత్త్వచింతనకు సంగీతానికి పేరు. కాని జర్మన్ తాత్త్వికులు పద్యము మద్యము కలిపి తత్వం అనుభవించి పలవరించారు. వారు ప్రధానంగా కవులు. నీచ (Nietzsche) ప్రొవెన్సల్ జీవనతత్త్వాన్ని గానం చేస్తాడు. బహుశా కీట్స్‌తో స్వరం కలుపుతాడేమో, (of Provencal song and sunburnt mirth: Nightingale, Keats). అతని సముల్లాసశాస్త్రం (The Gay Science) ఆ భావంలో స్వభావంలో నుండి వచ్చిందే. విద్వదౌషధం అనబడే హైడిగర్‌లో కూడా, ‘ఇది మాటలాటగా (word play) అనిపించవచ్చు’, అంటూనే నిత్యవ్యవహారంలోని మాటలతో ఆడుతూ అత్యంత గంభీరమైన తత్త్వం పిండుతాడు.


అసలు అస్తిత్వవాదమంటే యిది అని చెప్పగలిగిన దర్శనమేదీ లేదనే చెప్పాలి. ఇందులో చెప్పుకునే ముఖ్యమైన రచయితలలో ఏ యిద్దరూ ఏకీభవించరు. ఆస్తికనాస్తికవర్గాల విభేదాలటుంచి, ఆయా వర్గాలలో కూడా ఒకరితో ఒకరు ఏకీభవించరు. సార్త్ర నా వాదాన్ని తనకు కావలసినట్టు మార్చేసుకున్నాడని హైడెగర్ అంటాడు. నా పేరు సార్త్ర్ పేరుతో కలపవద్దు, నేనసలు అస్తిత్వవాదినే కాను, అంటాడు కామూ. కామూతో సార్త్ర అన్నాడు, ‘నా Being and Nothingness చదవమని నీకు చెప్పను. చదివినా అది నీకు అర్థం కాదు కనుక.’ ఆ మాటకొస్తే అన్ని తత్త్వశాస్త్ర గ్రంథాలగతి అదే. అవి దారిపక్కన మైలురాళ్ళు, విశ్రాంతిస్థలాలు కావు. డస్ కేపిటల్ ఎంతమంది చదివి ఉంటారు? దాని గురించి మాటాడని వాడెవడు?

అస్తి, నాస్తి:

ఈ అస్తిత్వవాదంలో అస్తివాదులు కొందరు, నాస్తివాదులు కొందరు. అటో యిటో నిర్ధారించలేనివారూ కొందరున్నారు. (లేక, ఆస్తికతను నాస్తికతనూ పునర్విచారించుకోవలసిన అవసరం కల్పిస్తారు వీరు.) కీర్కెగాడ్, ఆస్తిక్యవర్గంలో ప్రధాని, అస్తిత్వవాద ఉద్యమానికి ఆద్యుడు కూడా. ఇక, నాస్తికవర్గానికి నాయకుడు సార్త్ర. హైడిగర్‌ను తన వర్గంలో చేర్చుకొంటాడు సార్త్ర. కాని, హైడిగర్ ఒప్పుకోడు. అతడు ఆస్తికుడో నాస్తికుడో తేల్చడం కష్టం. నీచను (Nietzsche) నిస్సందేహంగా నాస్తికవర్గంలో చేర్చేశారు. ఎందుకు చేర్చరు? దేవుడు చచ్చిపోయాడు (God is dead) అని ప్రకటించినవాడు కదా! కాని అతణ్ణి నాస్తికుడు అనడం అతని ఆవేదనను దర్శనాన్ని అర్థం చేసుకోలేకనే. పశుస్థితి నుండి పురుషోత్తమస్థితికి నడవటానికి మనిషి ఒక తాడు, అంటాడు నీచ. (Man is a rope stretched between animal and the Superman – a rope over an abyss: Nietzsche) అతడు మనిషిని తాటిమీద కాదు, కత్తి అంచుమీద (క్షురస్యధారా) నడిపించాలని ఆశించాడని అర్థమవుతుంది. అంచుమీద జారితే అగాధమే (abyss). సృష్టి అర్థం కానిది అని ఆస్తికులు, అర్థం లేనిదని నాస్తికులు. దేవుడున్నా లేకున్నా, అస్తిత్వవాద ప్రధానాంశాలలో తేడా ఉండదంటాడు సార్త్ర. ఇద్దరికీ జీవితం అర్థం లేనిదే. ఈ అర్థం లేని జీవితానికి అర్థం కల్పించడము, తమ జీవితాలను సార్థకం చేసుకోడము యిద్దరికీ సామాన్యం.

అబ్రహాంను తన కొడుకును బలి యివ్వమని ఆదేశించాడు యెహోవా. అబ్రహాంకు దైవమందు అపారమైన విశ్వాసం ఉంది. కాని, తను చేయవలసిన త్యాగం కూడా సామాన్యమైనది కాదు. ఈ త్యాగం చేయాలా? మానాలా? ఎందుకు చేయాలి? పరలోకంలో కలగబోయే మేలుకొరకా? అపూర్వమైన త్యాగం చేశాడన్న లోకం మెప్పుకొరకా? ఇంతటి అమానుషత్యాగం లోకానికి తెలిసేటట్టు చేయాలా, లోకంతో పనిలేదా? భార్యతో సంప్రదించాలా? బలి కాబోతున్న కొడుకు, వాడికి చెప్పాలా, వద్దా? ఇంతకూ బలి యివ్వమని అడిగింది దేవుడేనా? దయ్యం కాదన్న నమ్మకం ఎలా కలుగుతుంది? లేకలేక కలిగిన, భగవత్ప్రసాదంగా కలిగిన, స్వయంగా భగవంతుడే, నీ కొడుకు వంశోద్దారకుడవుతాడని చెప్పిన తన కొడుకును, బలి ఇవ్వమని అడిగినవాడు దేవుడెలా అవుతాడు? అడిగింది దైవమే, దయ్యం కాదు, అని నిర్ణయించుకోవలసిందీ, బలి యివ్వవలె అన్న నిర్ణయం తీసుకోవలసిందీ అబ్రహాం మాత్రమే. ఆ నిర్ణయంలో రాజ్యానికి కాని, మతానికి కాని, సమాజానికి కాని, తన కుటుంబానికి కాని, చివరకు బలి అవుతున్న తన కొడుక్కుకాని ప్రమేయం లేదు. సమస్త సృష్టిలో అబ్రహాం ఒంటరివాడు. అదీ అతని స్వేచ్ఛాస్వరూపం. దానివల్ల కలిగే సందేహం, సంఘర్షణ, వ్యథ – వీటిలో మార్పు ఉండదు, దేవుడున్నా లేకున్నా. ఇదే అంటున్నాడు సార్త్ర: ‘దేవుడనేవాడు ఉన్నాకూడా అస్తిత్వవాదదృక్కోణంలో తేడా ఉండదు. అలా అని మేము దేవుడున్నాడని నమ్ముతున్నామని కాదు. కాని మా దృష్టిలో అసలు సమస్య దేవుడు ఉండడం లేకపోవడం కాదు. మనిషి తిరిగి తనను తాను కనుక్కోవడం అవసరం. తననుండి తనను కాపాడగలిగినదేదీ లేదు, దేవుడు కూడా.” (Existentialism as humanism: Sartre)

కనుక దేవుడుండడం లేకపోవడంలో అస్తిత్వవాదానికి బాధలేదు. ఉండకూడదు. అస్తిత్వవాదం ఆత్మవాదమని చెప్పవచ్చు. దేవుడులేడా? అయితే ఆ శూన్యాన్ని నీవు పూరించాలి. నీవు దేవుడవ్వాలి. దేవుడున్నాడా? అయితే నీవు లేవు, దేవుడే ఉన్నాడు. నీవు లేని దేవుడు అసంపూర్ణుడు, కనుక దేవుడు కాలేడు. కనుక ఎటొచ్చీ ఉన్నదొకటే, దేవుడను, ఆత్మ అను. ఆత్మవాదమంటే ఆత్మత, ఆత్మీయత. అస్తిత్వవాదపు తిరుగుబాటులో కూడా ఉన్నది ఆత్మీయతే. కాని యీ ఆత్మీయతను అస్తిత్వవాదులు పూర్తిగా సిద్ధాంతస్థాయిలో స్వీకరించారని చెప్పలేము. కాని అత్యంత ఆత్మీయతకు, అత్యంత బాధ్యతారహితస్వార్థానికి మధ్య సంఘర్షణ వారి రచనల్లో స్పష్టం.

రూపం (Form):

ఒక ఇంటర్‍వ్యూలో, బెకెట్‍ను (Samuel Beckett) ‘నీ రచనలలోని అసంబద్దప్రపంచం ఎక్కడ ఉంది?’ అని అడిగితే, ఆయన ఇచ్చిన సమాధానం: ‘మనం కళ్ళు తెరిస్తే మన చుట్టూ కనిపించేదంతా అదే. శిథిలప్రపంచాన్ని పునర్నిర్మించాలంటే ఒక్కటే మార్గం, మనం కళ్ళు తెరవాలి.’ (It is all around us… The only chance of renovation is to open our eyes and see the mess. -Beckett.) సాహిత్యాన్ని గురించి ఒకప్పటి సిద్ధాంతం, అర్థరహితసృష్టిలో సాహిత్యరూపమైన (Form) అర్థాన్ని సృష్టించడమని. అరిస్టోటిల్ చెప్పిన ‘రూపం’ మారింది. అస్తిత్వవాదంలో అర్థరాహిత్యమే సాహిత్యం, రూపరాహిత్యమే సాహిత్యరూపం.

సాహిత్యంలోగాని ఇతర కళలలోగాని ఉద్యమాలు ఆయాకాలాల జీవనదర్శనాలప్రభావంలో ఆవిర్భవిస్తాయి. కాని వాటితో పోవు. అస్తిత్వవాదం అనేక సాహిత్యోద్యమాలలాగే వచ్చింది, పోయింది. ఉద్యమం చరిత్రలో కలిసిపోతుంది, సాహిత్యం నిలిచి ఉంటుంది. నిలిచి ఉన్న అస్తిత్వవాద సాహిత్యపరిచయమే ప్రస్తుత ప్రయత్నం. వాదం గౌణము, సాహిత్యం ముఖ్యము.

ముగించేముందు భారతీయత గురించి. ఏ వాదమైనా, ఎంత అధునాతనమైనా, అధునానంతరమైనా కొత్తగా చెప్పేదేమీ ఉండబోదని చెప్పుకున్నాం. కనుక భారతీయ దర్శనాలతో అస్తిత్వవాదం సమన్వయం చేసే ప్రయత్నంలో వింత లేదు. (Dig deeper and you will find yourself standing on Catholic ground: Josef von Girres). లోతుగా మాత్రమే కాదు, విశాలంగా కూడా తవ్వవచ్చు. గ్లోబల్ యుగంలో ప్రాచ్యపాశ్చాత్యపదాలకు అర్థం లేదు. షోపెన్‍హోవర్, ప్రత్యక్షంగానో పరోక్షంగానో, అస్తిత్వవాదులను ప్రభావితం చేసినవాడు. అతడి మాట విందాం: (తన The World as Will and Representation/Preface to the First Edition నుండి.)

ఇక్కడ నేను చెప్పబోయే విషయంలో ఒక్క కాంట్ తత్త్వపరిచయం అవసరం. అది కాక, పాఠకుడికి ప్లేటో దివ్యతత్త్వంతో కూడా పరిచయం ఉంటే మంచిదే, నేను చెప్పబోయేది వినడానికి మరింత సుముఖత కలుగుతుంది. ఇది కాక అతనికి, ఉపనిషత్తుల ద్వారా అందిన వేదవిజ్ఞానం కూడా లభించి ఉంటే, అది అత్యుత్తమమైన అర్హత. నా దృష్టిలో యీ నవశకంలో సంస్కృతం నుండి మనం పొందగలిగింది, గ్రీకుభాషనుండి పొందినదానికి ఏ మాత్రము తక్కువకాదు. అటువంటి లాభం పొందినవానికి, యిక్కడ నేను చెప్పబోయేది పరభాషలా, విరోధిభాషలా అనిపించదు. దాని అర్థం ఉపనిషత్తులు చెప్పిందే నేను మళ్ళీ చెబుతున్నాను అని కాదు. నేను చెప్పిందే ఉపనిషత్తులు చెప్పాయి.

వెనుక, ముందు. ఎవరు చెప్పినా ఎక్కడ చెప్పినా ‘ఏకం సత్’.

‘…ఈ చిత్తవృత్తిని నిరోధించగలిగితే ఎంత బాగుండును? ఆలోచనలు మహాజడం. దేహంకంటే స్థూలం. అవి అలా సాగుతూనే ఉంటాయి, ఆపులేదు. వాటితో రుచి చెడిపోతుంది కూడా. ఇక, మాటలు. ఆలోచనలలో, తెగని మాటలు, పూర్తికాని వాక్యం, తిరిగి తిరిగి వస్తుంది.’ ఇవి సార్త్ర మాటలు (Nausea). పతంజలి మాటలు కావు. వాక్కు మనసులసంయోగం చెప్పే ఉపనిషత్తులు కావు (యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ -తై.ఉప.) కనుక భారతీయపరిచయంలో విరోధమేమీ లేదు.

ఈ ముందుమాటను ముగిస్తూ రెండు మాటలు. అస్తిత్వ ‘వాదా’నికి మూలపురుషుడు హైడిగర్. అస్తిత్వమంటే దేశకాలప్రమాణాలకు అందేది అని హైడిగర్ (Being and Time) గుర్తుచేశాడు. ప్రమాణం (ప్రకృష్ట మానం ప్రమాణం’) అంటే మంచి కొలత. (‘మానం’, కొలమానము అనేది నిత్యవ్యవహారంలోని పదమే.) అంటే అస్తిత్వాన్ని కొలవడానికి సాధనాలు దేశకాలాలు. (ఒక వస్తువు ఉన్నది అంటే, ఎక్కడ ఉన్నది, ఎప్పుడు ఉన్నది అన్న కొలతలకు అందేది అయిఉండవలె. అప్పుడే ‘ఉన్నది’ అంటాం. అదే ‘అస్తి’త్వం. ఈ కొలమానమే మాయ అంటుంది వేదాంతం (‘మీయతే అనేన ఇతి మాయా’).

ఒక కోణంలో అస్తిత్వవాదం మాయతో ఢీ. ఇది సిద్ధాంతంగా హైడెగర్ చేశాడు. సాహిత్యంగా అందరూ చేశారు. ఈ గ్రంథానికి ముందుంచిన పిరాన్దెల్లో (Pirandello) వాక్యం ఈ అస్తిత్వవాదసత్యాన్ని చెబుతున్నది. మరో కోణంలో అస్తిత్వవాదం మనిషిని ఒక దేశకాలాద్యవిచ్ఛిన్నమైన తత్త్వంగా ఏ పై లోకంలోనో కాక, నేలమీదకు దించి నడిపించింది.

ముగింపుగా, తత్త్వం ముందా మనిషి ముందా అన్న అస్తిత్వవాదవిషయం వాల్మీకిమహర్షి నోట విని, యీ భారతీయపరిచయం ప్రారంభిద్దాం. సాక్షాత్తూ బ్రహ్మమానసపుత్రుడు బ్రహ్మర్షి అయిన నారదుడు తనను వెదుక్కుంటూ వస్తే, వాల్మీకి మహర్షి ఏమడిగాడు? ‘నాకు తత్త్వం ఉపదేశించండి’ అని అడగలేదు, మనిషిని (‘కః’) అడిగాడు. నారదుడు కూడా ‘మనిషెంత, వాడి బతుకెంత? నీకు నేను బ్రహ్మతత్త్వం ఉపదేశిస్తాను’ అనలేదు. వాల్మీకి అడిగిన ప్రశ్నను పరిశీలిద్దాం: ‘కోన్వస్మిన్ సాంప్రతం లోకే‘. ఇది ఆదికావ్యంలో ఆదివాక్యం, ఆదిఅస్తిత్వప్రవచనం కూడా. ‘కః’ ఎవడు? ఈలోకంలో యిప్పుడు ఎవడు? అస్తిత్వం అడిగే ప్రశ్న ‘ఏది’ అని కాదు, ‘ఎవరు’ అంటాడు హైడెగర్. వాల్మీకి ప్రశ్న వాక్యనిర్మాణంలో, వాక్యార్థమేకాక వాక్యరూపం కూడా, అస్తిత్వలక్షణాన్ని పట్టి చూపిస్తోంది. ‘అస్మిన్ లోకే, సాంప్రతం’ (‘ఈ లోకంలో యిప్పుడు’) అనవచ్చు. వాల్మీకి అలా అనలేదు. స్థలాన్ని (space) వేరుగా చెప్పడం వలన మహర్షి ఆశించిన అస్తిత్వప్రయోజనం సిద్ధించదు. దాన్ని కాలంతో (Time) ముడిపెట్టవలె. రెంటినీ విడివిడిగా కాదు, రెంటినీ విడివడలేనట్టు ముడివేసి చెప్పవలె. ‘అస్మిన్’కు ‘లోకే’కు మధ్య ‘సాంప్రతం’ ఉంచాడు. ‘సాంప్రతం’, ‘లోకే’ (Time, Space) దేశకాలాల అవిభాజ్యతలో మనిషి అస్తిత్వాన్ని దర్శించాడు ఆదికవి మహర్షి వాల్మీకి. (హైడిగర్ యిలాంటిదే చేశాడు, తన Da-seinలో (Da, అక్కడ; sein, ఉండునది). అయితే హైడెగర్ ఒక పదాన్ని రెండు ముక్కలు చేశాడు, ముక్కల మధ్య అతుకు కనిపించేవిధంగా.)

ఇలా మనిషిని దేశకాలాలలో గుర్తించి, నేలమీదికి దించిన మొదటి అస్తిత్వవాద రచయిత ఆదికవి వాల్మీకి.


పేరు: భారతీయ పరిచయక్రమం – 1. అస్తిత్వవాద సాహిత్యం (2021).
ప్రచురణ: ఆథర్స్ ప్రెస్, న్యూఢిల్లీ.
వెల: 295 రూ. (25$)
ప్రతులకు: authorspressgroup@gmail.com, : www.authorspressbooks.com