అస్తిత్వవాద సాహిత్యం: 2ఆ. దొస్తోయెవ్‍స్కీ

[భారతీయ పరిచయక్రమం అన్న శీర్షిక కింద సూరపరాజు రాధాకృష్ణమూర్తి కొన్ని పుస్తకాలు ప్రచురించారు. అందులో మొదటిది – అస్తిత్వవాద సాహిత్యం. ఈ పుస్తకంలో కీర్కెగాడ్, దొస్తోయెవ్‌స్కీ, నీచ, పిరాన్దెల్లో, కాఫ్కా, హైడెగర్, సార్త్ర, కామూ పరిచయం చేయబడ్డారు. అదే వరుసలో తిరిగి ఈమాటలో వ్యాసాలుగా పరిష్కరించి ప్రచురించడానికి అనుమతి ఇచ్చిన వారికి కృతజ్ఞతలు. ఈ పుస్తకపు ముందుమాట ఇక్కడ చదవండి.]


(దొస్తోయెవ్‌స్కీ – 1అ.)

స్ఫటికహర్మ్యం: ఉదాత్తత సౌందర్యము (sublime and beautiful)

సీతాకోకచిలుక పురుగునుండి బయటపడడంతో కథ పూర్తి కాదు. వచ్చిన రెక్కలతో ఎగరగలగాలి. త్యాగము ప్రేమ నిండిన జీవితం కోరుకోవడం, అభ్యుదయభావాలను నిరసించి నిశ్శ్రేయసం వైపు రావడం, పోరాటంలో సగభాగమే. పోరాటం కేవలం బయటి ప్రపంచంతో కాదు, తన లోపల నిలిచిపోయిన ఊహలతో కూడా. ఆ అంతస్సంఘర్షణను ఈ కథలోని శైలి ప్రతిబింబిస్తుంది. అభ్యుదయవాదులలోని ఆత్మవంచన, నిశ్శ్రేయసాన్ని వల్లించేవారిలోను ఉంటుంది. వీరిలో ఈ వంచన అంతకంటే అసహ్యంగా కూడా ఉంటుంది. ప్రేమ త్యాగం దివ్యత్వం, వీటితో కూడా ఒక స్ఫటికహర్మ్యం నిర్మించుకోవచ్చు. ప్రేమను వాస్తవ జీవితంలోకి వంపుకోడం అనుకొన్నంత సులభం కాదు. అక్కడ కూడా ఆలోచనకు ఆచరణకు ఉన్న అంతరాన్ని వదలడు దొస్తోయెవ్‌స్కీ. కథానాయకుడంటాడు: “ఈ కలలు నిరంతరాయంగా మూడు నెలలకు పైన భరించడం నా వల్ల అయేది కాదు. మళ్ళీ వెళ్ళి జనాలమధ్య పడి తిరగాలనిపించే కోరిక ఆపుకోలేకపోయేవాడిని… తిరిగి తిరిగి ఇంటికి రాగానే, సమస్తమానవాళిని ప్రేమతో కౌగిలించుకోవాలన్న నా కోరికను కొంతకాలం వాయిదా వేస్తాను.”

ప్రేమ త్యాగం ఆగుతాయి, తొందరలేదు!

నవల పూర్వభాగం ఈ కథానాయకుని స్వీయపరిచయంతో ముగుస్తుంది. ఉత్తరభాగం కథ. పూర్వభాగంలో తనను పరిచయం చేసుకున్న కథానాయకుడికి అప్పుడు ఇరవై నాలుగేళ్ళ వయసు. (ఇప్పుడు నలభై అట.) మొదటి భాగంలో తత్త్వం చెప్పి, రెండవభాగంలో దాని ఆచరణస్వరూపం కథారూపంలో చూపిస్తాడు. ఆదర్శానికి ఆచరణకు, కల్పనలకు వాస్తవాలకు మధ్య అంతరం. ఈ అంతరాన్ని సూచించడానికి నవలలోని పూర్వోత్తరభాగాలకు సంధిగా దొస్తోయెవ్‌స్కీ నెక్రసోవ్‌ అనే రష్యన్ కవి రాసిన ఒక ప్రేమకవితను ఉపయోగించాడు. ఆ కవితలో ఒకడు ఒక స్త్రీని ప్రేమించాడు. పెళ్ళి నిశ్చయం అయింది. కాని పెళ్ళికి ముందే ఆమె తన హేయగాథను చెబుతుంది, ఎంతో దుఃఖభారంతో, అవమానభావంతో. అతడు ఆమెను క్షమించి పెళ్ళి చేసుకుంటాడు. వారి వైవాహికజీవితం సంతోషంగా సాగింది అని కవిత సూచిస్తుంది. ఈ కవితలో నాయకుడు ఉదాత్తుడు (hero). ఒక పతితను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. కాని, ఇందుకు విరుద్ధంగా ఈ నవలలో ప్రతినాయకుడు (anti-hero), ఊహలలో ఉదాత్తుడు, వాస్తవంలో అల్పుడు, ఆత్మవంచకుడు. వాస్తవం ఎప్పుడూ అల్పమే. రాజకుమారులు కథలలో మాత్రమే పతితలను రాణులను చేస్తారు. ఈ పుస్తకజీవితాలలోని వైరుద్ధ్యాలనే నిలదీస్తాడు ఈ నవలలో దొస్తోయెవ్‌స్కీ.

కథాభాగం

ఈ భాగంలో మూడు ప్రధాన యితివృత్తాలున్నాయి. ఒకటి, కథానాయకుడు (అదే, అతడే చెప్పుకున్న ప్రతినాయకుడు) ఒక మిలిటరీ ఆఫీసర్‍తో తలపడడానికి చేసే విఫలప్రయత్నాలు; రెండు, అతడు ద్వేషించే అతడి ‘మిత్రబృందం’తో అతని ప్రవర్తన; మూడు, (ఇది ఈ భాగంలోనే కాక మొత్తం నవలలో ప్రధానభాగం) లీసా (Lisa) అనే వేశ్యతో అతని ప్రవర్తన. (నవల ఉత్తరభాగం, కథానాయకుడి ఇరవై ఏళ్ళ వెనుకటి కథ.)

మిలిటరీ ఆఫీసర్: కథానాయకుడికంటే మిలిటరీ ఆఫీసర్ హోదాలో డబ్బులో శరీరబలంలో అధికుడు. అడ్డమొస్తే రెండు జబ్బలు పట్టుకొని వీధిలోకి విసిరేయగలడు. ఒకరోజు పబ్‍లో అతడి దారికి అడ్డొచ్చాడు. ఇతని వైపైనా చూడకుండా, కోటుమీద వాలిన పురుగును విదిలించినట్టు పక్కకు నెట్టి తన దారిన వెళ్ళిపోతాడు. ఆ అవమానం తరువాత మన కథానాయకుడు ఆ ఆఫీసర్‍తో గొడవపడాలని అనేక విఫల (హాస్యపూరిత) ప్రయత్నాలు చేస్తాడు. ఆఫీసర్ తనను ఒకటి పీకుతాడా, కేసుపెట్టి జైలుకు పంపుతాడా, ఇంకేమైనా హాని చేస్తాడా? ఏదో ఒకటి చేయనీ. అది కనీసం తన అస్తిత్వాన్ని గుర్తించినట్టు. కాని ఆఫీసర్ అలాటివేవీ చేయడు. ఇతడికి ఉక్రోషం పెరుగుతుంది. కాని ఏమీ చేయలేడు. కనీసం ఒక చెంపదెబ్బ అయినా తినలేడు. ఏమిటి దీని అర్థం? ఇతడికి తెలియదా, ఆ ఆఫీసర్‍ను తనేమీ చేయలేడని. తెలుసు, రెండూ రెండూ నాలుగే అని తెలుసు. కాని అయిదు ఎందుకు కాదు? అది మనిషి స్వేచ్ఛాస్వభావం. స్వేచ్ఛకొరకు బలమైన ఇచ్ఛ, పరిమితులను ఒప్పుకోలేని స్వేచ్ఛాప్రకటన. తల పగులుతుందని తెలుసు. అయినా పొట్టేలు కొండను ఢీకొడుతుంది. దానికి తలజిల.

మిత్రబృందం: సౌందర్యమయమైన ఉదాత్త కాల్పనికలోకం కథానాయకుడిది. మన అనామక కథానాయకుడు తను చదువుకునే రోజులనుండీ ఇంతే. తన మొదటి వాక్యంలోనే చెప్పుకున్నాడు కదా, తనది ద్వేషస్వభావమని, తననెవరూ ఇష్టపడరని. చదువులో క్లాసు ఫస్టు వచ్చేవాడు, చదువులో శ్రద్ధ వల్ల కాదు, ఎక్కువ చదివి తక్కిన పిల్లలను తక్కువ చేయడానికి. చదువు ముగిసిన తరువాత కూడా వాళ్ళలో ఎవరితోను అతనికి సంబంధాలు లేవు, ఒకే ఒకడు సిమనోవ్‍‍తో తప్ప. అతడు కూడా తనను పూర్తిగా ఇష్టపడడని తనకు తెలుసు. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఏదైనా బార్‍కు వెళతాడు, ఒంటరిగా. తాగడం కంటే తనకు కావలసింది అక్కడ ఎవడితోనైనా ఏదోవిధంగా గొడవపడాలి. ఎవరినైనా అవమానించాలి. ఎవడినన్నా చెంపమీద ఒకటి పీకాలి. వాడు తిరిగి కొడతాడా? లేక పోలీస్ స్టేషనుకు లాక్కెళతాడా? లేక, రా బయటికి తేల్చుకుందాం బలాబలాలంటాడా? ఏదో ఒకటి చేయాలి, మహా బోరుగా ఉంది. పుస్తకాలు చదివి చదివి. (మనిషికి పుస్తకాల వెలుపలకు వచ్చి బతకాలనే ఉంటుంది. కాని పుస్తకాల అట్టలమధ్య అందమైన అవాస్తవిక ఆదర్శకాల్పనిక జగత్తు మరొక వైపు లాగుతుంటుంది.)

ఇతని ఒకప్పటి సహాధ్యాయులతో ఇతడు ఎప్పుడూ స్నేహం చేయలేదు. వారంతా చదువులో, పరీక్షల చదువులో, బయట చదువులో కూడా, తనకంటే వెనుకబడినవాళ్ళు. వారంతా నేలబారు బతుకు బతికేవారు. వారిలో ఒకడు జ్వెర్కోవ్, భూస్వామి. అతడి పొలాలు సాగుచేసుకొని బతికే బానిసలు వందలమంది ఉన్నారు. అతడి డబ్బు, హోదా చూసి, అతన్ని అనుసరించే మిత్రబృందం ఉంది. వాళ్ళ తాగుడుకు సరదాలకు జ్వెర్కోవ్ డబ్బు ఖర్చు పెడుతుంటాడు. వేశ్యాగృహాలు వాళ్ళకు పరిచయస్థలాలు. జ్వెర్కోవ్ అంటే మన కథానాయకుడికి అసహ్యము, అసూయ. ఏకకాలంలో రెండూను. వాళ్ళ జీవనవిధానాన్ని తాను అవహేళన చేస్తాడు. వాళ్ళతో కూడా గొడవపడాలని ప్రయత్నిస్తాడు. అదీ వాళ్ళదగ్గర అప్పుచేసి, వాళ్ళతో గొడవపడడానికి అక్కడికి వెడతాడు. ఆ గొడవలో భాగమే వేశ్యాగృహంలో లీసాతో తన పరిచయం.

కథానాయకుడు వాళ్ళముందు కీటకమే, అన్ని విషయాలలోనూ. అన్నిటికంటే ముఖ్యంగా అతని అవాస్తవిక ఆదర్శకల్పనాలోకం. అలా అని అతని మిత్రులు జీవనవిధానాన్ని, విలువలులేని విశృంఖలతను ఆమోదిస్తున్నాడా రచయిత? లేదు. కాని, విలువలు బతుకులోనుండి రావలె, పుస్తకాలనుండి కాదు. అదీ, పరసంస్కృతినుండి కాదు. ఫ్రెంచి జర్మన్ కాల్పనికవాదప్రభావంలో పడిపోతున్న తన రష్యన్ యువకులను హెచ్చరిస్తున్నాడు దొస్తోయెవ్‌స్కీ. అస్తిత్వంలోనుండి రావలె అవగాహన. కామంనుండి మోక్షకామం, తత్త్వంనుండి కాదు.

లీసా: జ్వెర్కోవ్‌ను అవమానించి అతడితో గొడవపడాలని, సిమనోవ్ దగ్గర సిగ్గులేకుండా వాడు చీదరించుకొని విసిరికొట్టిన డబ్బు తీసుకొని వేశ్యాగృహానికి వెళతాడు. అప్పటికి తన మిత్రబృందం వారి పని ముగించుకొని వెళ్ళిపోయారు. ఇతడు మహాకసితో ఉన్నాడు. అప్పుడు ఆ వేశ్యాగృహంలో, అడుక్కుని తెచ్చుకున్న డబ్బుతో, లీసాతో ఆ రాత్రి గడుపుతాడు. అతడికి అది ఒక నీచస్థలమని తాను చాలా ఉన్నవాడు ఉన్నతుడు సంస్కారవంతుడు అన్న అధిక్యభావం ఆవేశించి, మిగిలిన రాత్రంతా తానొక ఆదర్శవంతుడి పాత్రను ఆమె వద్ద అభినయిస్తాడు. ఆ లీసాకు సుదీర్ఘమైన ఉపన్యాసం యిస్తాడు, ‘ఏమిటి ఈ బతుకు, ఇదీ ఒక బతుకేనా, ఇలా ఎన్నాళ్ళు ఈ వృత్తిలో సంపాదించగలననుకొంటున్నావు, త్వరగా ముసలిదానివైపోతావు, అప్పుడు నీ ముఖం ఎవరు చూస్తారు, ఈ నీచమైన బతుకులోనుండి బయటపడు’ అంటూ ధార్మికబోధ చేస్తాడు. ఆమె ఇటువంటి ఉపన్యాసాలు చాలానే విన్నది, తన దగ్గరకు వచ్చేవారి నుండి. కాని కొంతసేపటికి ఇతని మాటలు ఆమెను పశ్చాత్తాపంతో నింపివేశాయి. తన బతుకుపై అసహ్యం వేసి దుఃఖంతో కుంగిపోయింది. తల దించుకొని అతడి చేతిని తన చేతిలోకి తీసుకుని కూర్చుంది. అతడు, సారీ చెప్పి, బాధపడకు అంటూ తన అడ్రసు కార్డు యిచ్చి ‘ఎప్పుడైనా రా’ అని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తరువాత, ఆమె నిజంగా వస్తుందేమోనని భయం. ఆమెకు తన గురించి గొప్ప ఇమేజ్ యిచ్చుకున్నాడు. ఆమె తనను ఇక్కడ చూస్తే, ఈ చెత్త ఇల్లు, ఈ పాత రూము, తనను ఏ మాత్రము లక్ష్యం చేయని తన పనివాడు (వాడికి ఏనాడూ తను జీతం సరిగా ఇవ్వలేదు).

కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆమె రాలేదు. అమ్మయ్య, అనుకున్నాడు. ఇక రాదులే అనుకొంటుండగా, ఒక రోజు లీసా వచ్చింది. తను బాత్‍రూము డ్రెస్‍లో ఉన్నాడు. ఇల్లు, అది ఇల్లా! ఈ పనివాడు! ఏనాడు ఒక్కమాట మర్యాదగా మాట్లాడడు. ఇద్దరిలో పనివాడు ఎవరు అన్న అనుమానం వస్తుంది ఎవరికైనా. తనమీద తనకు విపరీతమైన అసహ్యం కలిగింది. లీసా మీద విపరీతమైన కోపం వచ్చింది. ‘బుద్ధి చెప్పాలి’ అనుకున్నాడు. ఆమెతో చాలా అసహ్యంగా ప్రవర్తించాడు. ఆమెకు పరిస్థితి అర్థమైంది. అతని స్థితిని అర్థం చేసుకుంది. ఆమెకు కోపం రాలేదు. మనసు ఆర్ద్రమైంది. అతనికి దగ్గరైంది. అతడు ఆ అవకాశాన్ని అప్పుడు కూడా వదులుకోలేదు. కాని, ఆ పని కాగానే, మళ్ళీ ఆమెను అసహ్యించుకొని వెళ్ళిపో అన్నాడు. ఆమె వెళ్ళిపోతుంటే ఆమె చేతిని లాక్కుని అందులో డబ్బు ఉంచాడు, ఆమెను ఇంకా అవమానించడానికి. ఆమె వెళ్ళిపోయింది. అతడు తప్పు చేశాననుకుంటాడు. అతడు ఈ విధంగా ప్రవర్తించడం మనసు ఒప్పుకోవడం లేదు. ‘లీసా లీసా’ అని పిలుస్తాడు. ఆమె తలుపు దభీమని మూయడం వినిపించింది. టేబుల్ మీద ఆమె నలిపి పడేసిన కరెన్సీ నోటు కనిపిస్తుంది. వీధిలోకి వెళతాడు, ఆమెను కలిసి క్షమించమని అడగుదామని. ఆమె వెళ్ళిపోయింది. ఇంటికి తిరిగి వచ్చి, ‘మంచిదయింది, ఆమె వెళ్ళిపోయింది’ అనుకుంటాడు. తను ప్రేమించలేడు. లీసా అది గ్రహించి వెళ్ళిపోయింది.

లీసా తనను తన పేదరికాన్ని తన మనస్సంఘర్షణను తన బలహీనతను అన్నిటిని బేషరతుగా స్వీకరించడానికి సిద్ధమయింది. ఆమె ప్రేమించగలదు. అతడు ప్రేమకలలు మాత్రమే కనగలడు. తను కలలుకన్న స్వర్గం (sublime and beautiful) నడిచివచ్చి తన గడప ముందు నిలబడితే, అతడు కాలితో తోసిపడేశాడు. ఆ ‘పతిత’ ప్రేమౌన్నత్యంముందు అతడు పాతాళానికి పడిపోయాడు. ఆదర్శాలమేడలు కట్టడం వేరు, వాటిలో జీవించగలగడం వేరు.

నాచ్ గర్ల్స్ సముద్ధరణ, విధవావివాహాలు అంటూ ఉపన్యాసాలు దంచే కన్యాశుల్కంలో గిరీశం మనకు తెలుసు. కాని గిరీశంలో సంఘర్షణ లేదు. పాత్రలో సంక్లిష్టత లేదు. ఈ దొస్తోయెవ్‌స్కీ నవలలో ప్రతినాయకుడికి తన అల్పత్వం తనకు తెలుసు. తెలుసు కనుక, తనపై తనకు అసహ్యం, కోపం. వాటిని లోకంపైకి తిప్పుతాడు. తనను తాను అవమానానికి గురిచేసుకుంటాడు. తనకు తాను హాని కలిగించుకోవాలనుకుంటాడు. పశ్చాత్తాపపడతాడు. కాని అంతకు మించి ఏమీ చేయలేడు. ఈ కథానాయకుడి పాత్రద్వారా దొస్తోయెవ్‌స్కీ ఏం చెబుతున్నాడు? ఆ పాత్ర ఆత్మవంచన చెబుతున్నాడా? అదేమంత విశేషపాత్రచిత్రణ? కాల్పనిక ఆదర్శాలకు (రొమాంటిక్ ఐడియలిజమ్) మనిషి బతుకుతున్న వాస్తవానికి మధ్య ఉన్న సహజమైన అంతరం చెబుతున్నాడా? రెంటినీ కలపడం అవసరం అంటున్నాడా? ఫ్రెంచి జర్మన్ కాల్పనికవాదానికి రష్యన్ కాల్పనికవాదానికి మధ్య ఉన్న తేడాను చెబుతున్నాడు. యూరపియన్ కాల్పనికత వాస్తవాన్ని వదిలేస్తుందని, రష్యన్ కాల్పనికత ఆదర్శాన్ని వాస్తవంతో కలుపగలదని దొస్తోయెవ్‌స్కీ భావం. ఊహల ఆకాశంలో కాక, ఉదాత్తతను సౌందర్యాన్ని నేలమీద నడిపించడం రష్యన్లకు స్వభావసిద్ధమని, ఇది యూరపియన్ ప్రభావంలో అడుగంటుంతోందని దొస్తోయెవ్‌స్కీ ఆవేదన.

ఈ కథలో కథానాయకుడి అవగుణం భావదారిద్ర్యం కాదు, దారిద్ర్యభావం. అతడు తన పేదతనాన్ని సహజంగా స్వీకరించగలిగితే, లీసా అతన్ని స్వీకరించేది. అతడు అసహ్యించుకొన్నది అతని పేదతనాన్ని మాత్రమే కాదు. పేదతనాన్నే అసహ్యించుకొంటాడు. (‘సుఖజీవనం మాత్రమే కోరడం నిస్సందేహంగా కుసంస్కారం.’) డబ్బు హోదా సామాజికస్థాయి తప్ప అతడు మనిషిని ప్రేమించలేడు.

అతనిది పుస్తకపు బతుకు. చదువుకునే రోజుల్లో, ఇతరులను తక్కువచేయడానికి ఎక్కువ మార్కులు తెచ్చుకునేవాడు. ఇప్పటికీ అతని తత్త్వం అదే. అందుకే మొదటి సారి అతన్ని కలిసినపుడు, లీసా అన్నది, ‘పుస్తకంలా మాట్లాడుతావు’ అని. మాటే కాదు, అతడు పుస్తకంలోనే బతకగలడు. లీసా మట్టిలోనుండి వచ్చిన మనిషి, మట్టిలో బతికే మనిషి. మట్టి అంటకుండా బతకగల మనిషి. ఆమె నలిపి టేబుల్ మీద పడేసిపోయింది కరెన్సీ కాగితాన్ని కాదు, అతడి జీవితపు విలువల్ని.

ఈ నవలలోని పూర్వోత్తరభాగాలను ఉత్తరపూర్వభాగాలుగా అతికించడంలో రచయిత ఏ ప్రయోజనం సాధించాడు? ఈ రెండవభాగం ముగింపు మరొకసారి చూద్దాం. ఈ కథ ముగిసిన ఇరవై సంవత్సరాల తరువాత, మొదటి భాగం (నోట్స్) రాసుకున్నాడు. ఈ ఇరవై ఏళ్ళలో కథానాయకుడు మారాడా? ఎలా మారాడు? ఆ మార్పు వయసును బట్టి వచ్చిందా? యువకుడుగా తన అనుభవం ఈ నోట్స్‌లో ప్రతిఫలిస్తున్నదా? ఆ కథ ముగింపులో అతడు అల్పుడు నీచుడు. కాని అతనిలో సంఘర్షణ ఉంది. ఆ సంఘర్షణ వయసుతో ఎలా పరిణమించింది? ఏమీ మార్పు లేదా? నలభై ఏళ్ళ వయసులో రాసిన (మొదటిభాగంలోని) అతని నోట్స్ మనం ఎలా చదవాలి? అది తిక్కవాగుడు కాదు అని తెలుసు. కాని, అతని పుస్తకప్రపంచానికి వాస్తవప్రపంచానికి మధ్య జరిగే సంఘర్షణలో అతడు నిజాలే చెబుతాడు.

రెండవదైన కథాభాగం ప్రారంభించేముందు, మొదటిభాగం ముగింపులోని మాటలు: “ఈ వేళ ముఖ్యంగా చాలా వెనుకటి ఒక జ్ఞాపకం నన్ను బాధిస్తోంది. కొన్ని రోజుల క్రితం అది చాలా స్పష్టంగా గుర్తొచ్చింది. వదలకుండా చాలా వెంటాడుతోంది… దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలి. ఎందుకోగాని నాకనిపిస్తోంది, దాన్ని కాగితంమీద పెడితే అది వదిలిపోతుందని, ప్రయత్నిస్తే తప్పేముంది?… పైగా పనిలేక బోర్ కొడుతోంది. రాయడం కూడా పనే కదా? పని, మనిషిలో కరుణ కలిగిస్తుందని అంటారు. చూస్తా.” [పని, కనిపించే ప్రేమ (జిబ్రాన్) అన్నమాట విన్నాం.]

ఇరవై ఏళ్ళయినా ఆనాడు జరిగింది తాను మరచిపోలేకపోయాడు. పైగా అతన్ని వెంటాడుతోంది. అంటే ఆనాటి అతని హేయమైన ప్రవర్తన, వెతుక్కుంటూ వచ్చిన లీసాకు తను చేసిన అవమానం, అతని గుండెలో గుచ్చుకొనే ఉన్నాయి. అవమానం కూడా జీవితానికి అర్థం కల్పిస్తుంది. లీసాకు తను చేసిన అవమానం ఆమెను ఆమె జీవితకాలమంతా మనిషిగా నిలబెడుతుంది. అని ఆమె గురించి తానన్న మాట తనకూ వర్తిస్తుంది: “ఆమె తన అవమానానికి నిరసనను శాశ్వతంగా ఉంచుకోవడం మంచిది కదూ? నిరసన? కాదు, అది ప్రక్షాళన; అది గుచ్చుకొని, తీవ్రంగా బాధిస్తూనే ఉంటుంది… కాని ఆమె అభిమానంతో బతుకుతుంది కాని, సుఖంగా? ఇక్కడ నేనే ఒక ప్రశ్న అడుగుతాను, పనికిరాని ప్రశ్న. ఏది మేలు, చౌకబారు సుఖమా, ఉదాత్తమైన బాధా? ఏది?”

ఇతన్నికూడా ఆ ఘటన ఇన్నాళ్ళూ ఒక వ్రణంలా బాధిస్తూ శోధిస్తూనే ఉంది.

లీసా ఆనాడు అలా వెళ్ళిపోతున్నపుడు, తను వీధిలోకి, ఒంటిమీద బట్టకూడా సరిగా లేక, ఆతురతతో పరుగెత్తాడు ఆమె కోసం: “ఎందుకు? ఆమె కోసం ఎందుకిలా పరుగెడుతున్నాను? ఆమె ముందు పడిపోయి, వెక్కివెక్కి ఏడ్చి, ఆమె పాదాలను ముద్దుపెట్టుకొని, క్షమాపణ అడగాలని! నా గుండె ముక్కలుగా కోసినట్టవుతోంది. ఎన్నటికీ, ఎన్నటికీ ఆ క్షణాన్ని ఉద్వేగంలేకుండా గుర్తుచేసుకోలేను.”

వీడు కీటకమే. కాని ఆడుతున్నది నాటకం కాదు. కనుక, నవలలోని మొదటి భాగమైన ‘నోట్స్’లోని వ్యంగ్యం ఆ సంఘర్షణతో రంగరించి రాసిన నోట్స్‌గానే చదవాలి. సమసిన సంఘర్షణ కాదది. సాగుతున్న సంఘర్షణ. అప్పటిలాగే ఇప్పుడూ అతడు సమాజంతో బతకలేక, ‘కలుగుల్లో’నే కలలు కంటూ బతుకుతున్నాడు. మనిషి కలుగులో బతకడానికి అనేక కారణాలుంటాయి. ఒకటి కీర్కెగాడ్ చెప్పిన ‘మంద అసత్యం’ (crowd is untruth). హైడెగర్ అదే అంటాడు: Everyone is the other and no one is himself… Every man is born as many men and dies as a single one. (Being and Time: Heidegger.) కనుక, ఆత్మ కలవాడు మందలో బతకలేడు. అతని బతుకు విలువలు వేరు, పరమార్థం వేరు. అతడు లోకం దృష్టిలో వెర్రివాడో, విప్లవకారుడో, సమాజంలో కలవలేని అనర్హుడైన అల్పుడో. కనుక కలుగు అతని ఆవాసం (alienation). మరొకటి, అతడు తనలోని వైరుధ్యాలను సమన్వయం చేసుకోలేని మానసికప్రవాసి (self-exile). లేక, అతడే చెప్పుకున్నట్టు, అతడికి నిజంగానే ‘జబ్బు’. లివర్ జబ్బు కాకపోవచ్చు. మానసిక వ్యాధి. అది లేనివాడెవడు ఈ కాలంలో? ఈ నవలలో ఈ అర్థాలన్నీ ఇమిడి ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది, కలుగులోని జీవులు బతుకును గురించి తీవ్రంగా ఆలోచించవు. ఆలోచన (reflection) కాక, ఆర్తి (passion) వారి బతుకును నడిపిస్తుంది.

రెండవభాగం కథలో మంచు ఎక్కువ. జ్వెర్కోవ్‌తో డిన్నర్ సమయంలో మంచు. అంతకంటే ముఖ్యమైన మరో సన్నివేశం, అవమానంతో వెళ్ళిపోతున్న లీసాను వెతుకుతూ కథానాయకుడు (నవలలో ఇతడికి పేరు లేదు) వీథిలోకి పరుగెత్తినపుడు, విపరీతమైన మంచు కురుస్తోంది. మొదటిభాగం ముగింపులో ఈ మంచే అతనికి ఆనాటి ఘటనను గుర్తు చేస్తుంది. కథ ఆద్యంతాలలో హిమపాతం. ఇతడి జీవితం హేమంత కృష్ణానంత శర్వరి అంటున్నాడా, దొస్తోయెవ్‌స్కీ? అనడు. కాని, మనిషి జీవితం నిత్యవసంతం అని ఎవడైనా అంటే నమ్మవద్దు అంటున్నాడు. స్ఫటికహర్మ్యాలు (Crystal Palace) ఆకాశంలో ఉంటాయి కాని, నేలమీద ఉండవు. కాల్పనికవాదులు, వికాసవాదులు, విప్లవవాదులు, చివరకు ఆధ్యాత్మికవాదులు, చౌకగా అమ్ముతున్న కలలు కలలే. Not just in commerce but in the world of ideas too our age is putting on a veritable clearance sale. Everything can be had so dirt cheap… కీర్కెగాడ్ భయము-కంపములో మొదటి వాక్యం. జీవిత పరమార్థం స్వేచ్ఛ, దుఃఖస్పర్శలేని సుఖం కాదు. ఆ స్వేచ్ఛకోసం మనిషి తనకు తాను ఎంత కష్టమైనా నష్టమైనా కలిగించుకుంటాడు. బుద్ధి ఉన్నవాడు, తెలివిగా ఆలోచించగలవాడు, తనకు తాను ఎన్నటికీ హాని కోరడు, అన్న వాదాన్ని దొస్తోయెవ్‌స్కీ ఇందులో ఖండిస్తున్నాడు. శిక్ష మనిషిని శిక్షితచిత్తును చేస్తుంది అంటాడు, దొస్తోయెవ్‌స్కీ, ఆ శిక్ష, శిక్షణ బతుకులోనుండి రావలె, బయటనుండి కాదు, ఈ నవలలో లీసాకు వలె.

నవల పేరు, అనువాదసమస్యలు:

ఈ నవల పేరు ఆంగ్లంలో నోట్స్ ఫ్రమ్ ది అండర్‍గ్రౌండ్ (Notes from the Underground. కొందరు Notes from Underground, అని కూడా అనువదించారు, the లేకుండా.) కాని ఇది సరి అయిన అనువాదం కాదంటారు కొందరు. ఒక కారణం, అండర్‍గ్రౌండ్ అనగానే, ప్రభుత్వ వ్యతిరేక ఉగ్రవాదుల స్థావరం అన్న అర్థస్ఫురణ కలుగుతుంది. ఈ నవలలో అటువంటిదేమీ లేదు. లోకానికి ముఖం చూపించలేక, ఏకాంతంగా అజ్ఞాతంగా బతుకుతున్న ఒకడి కథ ఇది. కనుక, అండర్‍గ్రౌండ్ సరి అయిన పదం కాదు. ఈ పేరుకు అనేకులు అనేక పర్యాయపదాలు సూచించారు.

నబకోవ్ Under the Floor (podval, basement, cellar) అని సూచించాడు. ఇది ఫ్లోర్ కింద విశాలమైన ఖాళీస్థలాన్ని సూచిస్తుంది. అది దొస్తోయెవ్‌స్కీ ఉద్దేశించింది. కాదు. మరి కొన్ని సూచనలు కూడా ఇటువంటివే (Notes from the Cellar, Notes from the Basement). రష్యన్ భాషలో ఈ నవల పేరు Zapiski iz podopolya. దొస్తోయెవ్‌స్కీ ఉద్దేశించినది, మనుషులు నివసించడానికి యోగ్యం కాని, ఎలుకల వంటివి నివసించే కలుగులు. లేక, భూతప్రేతపిశాచాలు ఉండే ప్రదేశం. మనిషి అంతరాంతరాలలో తనకే తెలియక దాగి ఉండే ఆలోచనలకు ప్రతీకలు. ఈ అర్థంలో నవలకు సరి అయిన పేరు Notes from Under the Floorboards. ఇది చెక్కఫ్లోరింగ్ కింద కాపురం ఉండే కీటకాలు, అన్న అర్థం స్ఫురింప చేయగలుగుతుంది. “నేను ఒక కీటకంగా మారి పోవడానికి తీవ్రప్రయత్నం చేశాను. కాని కాలేక పోయాను”, అంటాడు కదా ఇందులోని కథానాయకుడు!

పాపము ప్రక్షాళనము

(ది కరమజోవ్ బ్రదర్స్‌లో అంతర్భాగమైన ఒక కథ)

ఆయన మా టౌన్లో పెద్ద అధికారి. చాలాకాలంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. సంపన్నుడు. ఉదారుడు. అనాథ శరణాలయాలకూ ఉచితాన్నదానసంస్థలకూ విరివిగా విరాళాలు ఇచ్చేవాడు. అతడంటే అందరికీ గౌరవం. దయాగుణం కలవాడు. అవసరంలో అనేకులను ఆదుకున్నాడు. (ఆయన దయాగుణం ఆయన పోయిన తరువాతనే తెలిసింది.) ఏభై ఏళ్ళుండవచ్చు. భార్య, ముగ్గురు పిల్లలు. ఒకరోజు సాయంత్రం హఠాత్తుగా తలుపు తోసుకుని నా గదిలోకి వచ్చాడు. ఎందుకొచ్చాడో తెలియదు. గంభీరంగా ఉన్నాడు. ముఖంలో ఒక తీవ్రత కనిపిస్తోంది. కూర్చుంటూ అన్నాడు: ‘ఈ మధ్య మీరు ఈ టౌన్లో తిరుగుతూ, కొందరి ఇళ్ళకు వెళ్ళడం, వారితో వాళ్ళ కష్టసుఖాలు మాట్లాడడం చూస్తున్నాను. మీరు వాళ్ళకు చెపుతున్న మాటలు వింటున్నాను కూడా. మీరు సామాన్యవ్యక్తి అనిపించడం లేదు. మీది దృఢమైన ధార్మికప్రవృత్తి. మీలో సత్యనిష్ఠ కనిపిస్తున్నది. మీరు చేస్తున్న పని అందరూ చేయగలిగింది కాదు. పరువు నష్టమని, నలుగురూ చులకన చేస్తారనీ తెలిసి కూడా మీరు చేయదలచుకున్నది చేసేస్తారు. అలా చేయడానికి చాలా ధృతి ఉండాలి.’

‘అదేం లేదండీ. మీరంటున్నంత గొప్ప విషయమేమీ కాదది. నన్ను ఎక్కువగా పొగుడుతున్నారు,’ అన్నాను.

ఇక్కడ నా గురించి కొంత చెప్పుకోవాలేమో? నేను నిన్నమొన్నటిదాకా ఒక ఆర్మీ ఆఫీసర్ని. నేను ఒకప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమెను మరొకడు సొంతం చేసుకున్నాడు. నాకు వాడిమీద విపరీతమైన కోపం వచ్చింది. ‘బలాబలాలు తేల్చుకుందాం రా’ అని వాణ్ణి ఛాలెంజ్ చేశాను. మర్నాడు ఉదయాన్నే ఊరి చివర కలుసుకుందాం అనుకున్నాం. ఆ రాత్రి సరిగా నిద్రపోలేకపోయాను. తెల్లవారితే ప్రేమప్రత్యర్థితో జరగబోయే బలపరీక్ష గురించి చాలాసేపు ఆలోచించాను. నన్ను ప్రేమించని అమ్మాయి కొరకు పోట్లాట ఏమిటి? పైగా ఒకవేళ నేను అతన్ని చంపాననుకో? ఏం చేసినట్టు? ఆమె జీవితాన్ని దుఃఖమయం చేయడమే కదా? అలా జరుగకూడదనుకున్నాను. తెల్లారింది. కలుసుకుందామనుకున్న చోటికి చేరాం. రాత్రి నిర్ణయించుకున్నట్లే అతనితో నేను పోటీనుండి విరమించుకుంటున్నాను అని చెప్పేశాను. క్షమించమనికూడా అన్నాను. ఆ సందర్భంలో అవతల వ్యక్తి నన్ను ఎంత నీచంగా అవహేళన చేస్తాడో తెలుసు. అందులో, నేనొక ఆర్మీ ఆఫీసర్ని కూడా. ఆర్మీలో కూడా ఇటువంటి పిరికిమనుషులుంటారా అని అతడే కాదు బయటకూడా నన్ను అవహేళన చేస్తారు. అయినా అనుకున్నది చేసేశాను. ఇది జరిగిన తరువాత నాకు సైన్యంలో పనిచేయాలనిపించలేదు. రాజీనామా చేశాను. ఇప్పుడీ పెద్దమనిషి నాగురించి అంటున్న మహత్కార్యం ఆనాడు నా ప్రేమప్రత్యర్థిని నేను క్షమించమని అడగడం గురించే.

‘లేదు. లేదు. ఎక్కువ ఏమాత్రము కాదు. మీరు చేసిన పని చేయగలగడానికి చాలా చాలా మనోబలం కావాలి. మీరనుకున్నంత తేలికేమీ కాదు. నిజానికి నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చింది ఆ బలమే. చూడండి, మిమ్మల్లి విసిగిస్తున్నానేమో? మీ వ్యక్తిగత విషయంలోకి తలదూరుస్తున్నాను అనుకొంటారేమో కాని, మిమ్మల్ని ఒకటి అడగాలని ఉంది. ఆనాడు అతన్ని మీరు క్షమించమన్నప్పుడు మీ మనస్థితి ఎటువంటిదో, మీ మనసులో ఏ భావాలు కలిగాయో చెప్పగలరా? ఈ విధంగా అడగడంలో నాదొక రహస్యప్రయోజనం ఉంది. దాని గురించి తరువాత సమయం వచ్చినపుడు, మనం ఇంకా దగ్గరవడం భగవంతుడి సంకల్పమైతే, చెబుతాను’ అన్నాడు.

‘అప్పటి నా మనస్థితి ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ, నేను ఇంతవరకు ఎక్కడా చెప్పని విషయం ఒకటి మీకు చెప్పాలి. నా ప్రత్యర్థిని ఛాలెంజ్ చేసి వచ్చిన ఆ రాత్రి జరిగిన ఒక సంఘటన నా జీవితాన్ని మార్చేసింది. అది నా జీవితంలో నేను ఊహించి ఉండలేని గొప్ప మలుపు. అతణ్ణి ఛాలెంజ్ చేసి ఇంటికి వచ్చానా? ఆ సాయంత్రం అంతా కోపంతో ఊగిపోయాను. ఉన్నట్టుండి అకారణంగా, నాదగ్గర పనిచేసేవాణ్ణి ముఖంమీద రెండు గుద్దులు గుద్దాను. వాడి ముఖమంతా రక్తం. నిశ్చేష్టుడై నిలబడిపోయాడు వాడు. ఆ రాత్రి నాకు సరిగా నిద్ర పట్టలేదు. పక్కమీదినుంచి లేచిపోయాను. మనసంతా అలజడి. నా పనివాణ్ణి కొట్టడమేమిటి? వాడు నా లాంటి మనిషే కదా? పాపం, కొడుతుంటే, వాడు చేయి కూడా ఎత్తలేదు. కవాతులో నిలుచున్న సైనికుడిలా కదలకుండా ఉండిపోయాడు. నా మీద నాకే అసహ్యం వేసింది. నేను చేసిన పని తప్పు అని తెలుసుకున్నాను. తెల్లవారగానే వాడి కాళ్ళమీద పడి క్షమించమన్నాను. వాడికి చాలా ఆశ్చర్యం కలిగివుంటుంది. వాడు చాలా ఇబ్బంది పడిపోయాడు. నాకు మతిచెడిందేమోనని అనుమానించినా అనుమానించి ఉండవచ్చు. కాని నా మనసులో అలజడి ఆగిపోయి తేలికపడింది. ఆ తరువాత నా ప్రత్యర్థిని క్షమించమని అడగడం నాకు సులభం అయింది. ముందే దారి చేసుకుని ఉన్నాను కనుక. దారి చేసుకుని మొదటి అడుగు వేయడంలోనే ఉన్నది కష్టమంతా. తరువాత దారి సులభం. నా ప్రత్యర్థితో అలా ప్రవర్తించడంలో అవమానం కాదు, ఆనందం ఉండింది’ అన్నాను.

నేను ఇదంతా చెబుతున్నపుడు అతడు నావైపు ఎంతో ఆసక్తితో విన్నాడు. ‘మీరు మాట్లాడడం వినడం చాలా బాగుంది. అప్పుడప్పుడూ వస్తుంటాను’ అని వెళ్ళిపోయాడు.

అప్పటినుండి అతడు ఇంచుమించు ప్రతిరోజు సాయంత్రం నన్ను కలవడానికి వచ్చేవాడు. మేము ఇంకా చాలా దగ్గరి స్నేహితులం అయ్యేవాళ్ళమే. కాని అతడు తనగురించి ఏమీ మాట్లాడేవాడు కాదు. నాగురించి అడుగుతూ ఉండేవాడు. శ్రద్ధగా వినేవాడు. అయినా అతడంటే నాకు ఇష్టంగానే ఉండేది. నా గురించి నేను చాలా మనసు విప్పి మాట్లాడేవాణ్ణి. అతని జీవితరహస్యాలు నాతో చెప్పుకోవలె అని నేనెందుకనుకోవాలి? అతని మంచితనం సరళస్వభావం స్పష్టంగా తెలుస్తున్నాయి. పైగా, నాకంటే వయసులో హోదాలో పెద్దవాడు. అయినా, సమవయస్కుడితో లాగా పెద్దరికం చూపకుండా మాట్లాడుతున్నాడు. ఎక్కువ విన్నది అతడైనా, ఎక్కువ నేర్చుకున్నది నేను. అతడు ఉదాత్తుడు. అతడు నేలమీద నడుస్తున్నా, అతని తల స్వర్గంలో ఉన్నది అనిపించేది.

ఒకరోజు అన్నాడు హఠాత్తుగా: ‘ఆ జీవితం ఉందే, అది, అది స్వర్గం. దాన్ని గురించే ఆలోచిస్తుంటాను. నిజానికి అది తప్ప మరోవిషయం గురించి ఆలోచించడం లేదు’ అంటూ, నా వైపు చూచి చిన్నగా నవ్వాడు. ‘నీకంటే దానిపై నాకు ఎక్కువ నమ్మకం. ఎందుకంటున్నానో తరువాత చెబుతాను.’ అతడేదో చెప్పాలనుకుంటున్నాడనిపించింది.

‘దివ్యలోకం దాగి ఉంది ఎక్కడో కాదు, మనలో. ఇక్కడ, ఇప్పుడు. ఈ క్షణం నాలో ఉంది. నా గుండెలో. నేను సంకల్పిస్తే, రేపు అవతరిస్తుంది, శాశ్వతంగా.’

నేను అతని వైపే చూస్తూ ఉండిపోయాను. అతడు చాలా ఉద్రేకంతో మాట్లాడుతున్నాడు.

‘అవును. నీవంటూ ఉంటావే, అదినిజం. మనం మన కర్మలకే కాదు, లోకంలో అందరి కర్మలకు అందరి పాపపుణ్యాలకు బాధ్యులం. ఈ సత్యం, దాని బహుముఖప్రాధాన్యం ఇంత చిన్న వయసులో నీవు తెలుసుకోగలగడం ఆశ్చర్యం. ఇది తెలిసిన మరుక్షణం అప్పటివరకు కలగా ఉండిపోయిన ఆ దివ్యలోకం దిగివస్తుంది.’

‘ఎప్పుడు అది వచ్చేది? అసలు వస్తుందా?’ అన్నాను, కొంత అపనమ్మకంతో, కొంత అసహనంతో.

‘అంటే నీవు నమ్మవన్న మాట? నీవు నలుగురికీ నమ్మకం కలిగిస్తావు, కాని నీకు నమ్మకం లేదూ? విను. తప్పక వస్తుంది. కాని వచ్చే ముందు ఈ వెలివేత, ఈ భయంకరమైన ఒంటరితనం తప్పదు.’

‘వెలివేతా? ఏ వెలివేత?”

‘మనిషి మనిషిని వెలివేయడం. మనిషి మనిషితో కలిసి బతకలేకపోవడం. వెలిగా వెలితిగా బతకడం. లోకమేమైపోయినా సరే, నేను బాగుంటే చాలు అనుకోడం.’

అతడు నన్ను కలవడానికి రావడం ఎక్కువయింది. నేనూ అతడి రాక కోసం ఎదురుచూసేవాడిని. అతడేదో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకొనే విషయంలో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు అనిపించేది. నేను ఆ విషయంలో ఏమీ ఆరాలు తీయవలెనని ప్రయత్నం చేయకపోవడం అతడికి నచ్చింది. కాని అతడు ఎప్పటికప్పుడు నాతో ఏదో చెప్పాలనే అనుకుంటున్నట్టు అనిపించేది నాకు.

ఒక రోజు అన్నాడు, ‘నీకు తెలుసా? మన సమావేశాలగురించి ఊళ్ళోవాళ్ళు చాలా మాట్లాడుకుంటున్నారు. మనం ఇంత తరచుగా ఎందుకు కలుస్తున్నామో ఏం మాట్లాడుకుంటున్నామో తెలుసుకోవలెనని చాలా కుతూహలంతో ఉన్నారు. ఉండనీ. ఉండనీ. సమయం వచ్చినపుడు తెలుస్తుంది.’

మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కోసారి అతడు ఉన్నట్టుండి ఉద్విగ్నుడయేవాడు. అట్లాంటి సమయాలలో హఠాత్తుగా లేచి వెళ్ళిపోయేవాడు. ఒక్కోసారి నా కేసి తీక్షణంగా చూస్తూ ఉండిపోయేవాడు. అటువంటపుడు అనిపించేది, ఇప్పుడేదో చెప్పబోతున్నాడని. వెంటనే ఏదో పిచ్చాపాటీలోకి దిగిపోయేవాడు. చాలాసార్లు అతడికి విపరీతమైన తలనొప్పి వచ్చేది.

ఒక రోజు చాలాసేపు ఏవో విషయాలు ఉద్రేకంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉన్నట్టుండి అతడి ముఖం వివర్ణమయింది. మూర్ఛవచ్చే వాడికి లాగా ఒళ్ళు, ముఖం వణుకుతున్నాయి. నావైపు చూస్తాడు, చూపుపక్కకు తిప్పుకుంటాడు. మళ్ళీ చూస్తాడు.

‘ఏమయింది? ఎలా ఉంది?’ అన్నాను.

‘నేను… నేను… నీకు తెలుసా? నేనొకరిని హత్య చేశాను’ అంటూ ఒక పేలవమైన నవ్వు నవ్వాడు.

అతడన్న మాటకు నిర్ఘాంతపోయాను. కాని ఆ మాట దాని అర్థం నా తలకెక్కే లోపల అతడి నవ్వు నన్ను పట్టుకుంది. నవ్వడమేమిటి? ఎందుకు నవ్వుతున్నాడు?

‘ఏమన్నావ్?’ అరిచాను.

‘చూశావా, ఆ మాట నానుండి బయటపడడానికి ఎంత కష్టపడ్డానో! ఇప్పుడు చెప్పేశాను. మొదటి అడుగు వేశాను. ఇక నడిచేస్తాను’ అన్నాడు.

వినగానే నేను నమ్మలేదు. ఆ తరువాత కూడా చాలాసేపు నమ్మలేదు నేను. ఆ తరువాత వరుసగా మూడు రోజులు వచ్చాడు. జరిగింది చెప్పాడు. అతడికి మతి చలించిందేమో అనుకున్నాను. కాని నమ్మక తప్పలేదు. అతడు చేసింది చాలా ఘోరమైన నేరం.

పధ్నాలుగు సంవత్సరాల క్రితం అతడు ఒక స్త్రీని హత్యచేశాడు. ఆమె భర్త చనిపోయాడు. బాగా ఉన్నవారు. పెద్ద ఇల్లు. తోట. ఆమె అందంగా ఉండేది. వయసులో ఉన్నది. ఇతడు ఆమెను గాఢంగా ప్రేమించాడు. తన ప్రేమను ఆమెకు చెప్పుకున్నాడు. పెళ్ళికి ఆమెను ఒప్పించాలని ప్రయత్నం చేశాడు. కాని ఆమె అంతకు ముందే మనసు మరొకరికి ఇచ్చేసింది. పెళ్ళి కూడా నిశ్చయం అయింది. ఆమె వరుడు సైన్యంలో పెద్ద పదవిలో ఉన్నవాడు. దూరప్రాంతంలో సేవలో ఉన్నాడు. త్వరలో వచ్చి ఆమెను వివాహం చేసుకోబోతున్నాడు. ఇతడి ప్రేమను స్వీకరించలేనని చెప్పి, దయచేసి తనను కలుసుకోడానికి రావద్దని చెప్పింది. ఆమెను కలవడం మానేశాడు. కాని ఇల్లు, ఇంటితోట, ముందు ద్వారం, వెనుకవైపు దారి అన్నీ బాగా తెలుసు అతనికి. ఒక రాత్రి చాలా సాహసం చేశాడు. ఇంటివెనుక తోటలోనుండి వచ్చి, వెనుక తలుపు తీసి ఉండడం గమనించి, ఆమె గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమె ఒక్కతే ఉంది గదిలో, పక్కపై ఒత్తిగిలి పడుకుని. ఆమెను చూడగానే అతడి కోరిక ఉవ్వెత్తుగా ఎగిసింది. అసూయ రేగింది. కోపం తాచులా తలెత్తింది. ఉన్మత్తుడిలా చేతిలో కత్తి ఆమె గుండెలో కసక్కని దింపాడు. ఆమె అరవనుకూడా లేదు. ఆమె ప్రాణం పోయింది. అతడు దయ్యపు సాహసం, పిశాచపు తెలివి ప్రదర్శించాడు. డబ్బుకోసం చేసిన హత్యలాగా కనిపించడం కోసం, ఆమె పర్సులో డబ్బు తీశాడు. ఆమె దిండుకింద ఉండిన తాళపుచెవులు తీసుకొని బీరువాలు తెరిచి వాటిలో పెద్ద పెద్ద నగలు తీసుకున్నాడు. చిన్నవి చాలానే ఉండినవి. కాని, వదిలేశాడు. ఆస్తుల పత్రాలు తాకలేదు. ఈ పత్రాల విలువ తెలియని చదువురాని వెధవలెవరో దొంగతనం చేసి ఉంటారన్న అనుమానం కలగాలి. ఇవన్నీ భ్రమ కలిగించడానికి. ఇవి కాక, తనకు కావలసిన తనకు మాత్రమే విలువగలిగిన వస్తువులు, కొన్ని తీసుకున్నాడు. వచ్చినదారినే వెళ్ళిపోయాడు.

మర్నాడు కాని ఆ తరువాత కాని ఎన్నడూ ఇతనిమీద ఎవరికీ ఇంతవరకూ కలలోకూడా అనుమానం కలగలేదు. అతడి ప్రేమ విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే, అతడు ఎప్పుడూ ఎవరితోను కలిసేవాడు కాదు. మనసు విప్పి మాట్లాడుకునే మిత్రులూ ఎవరూ లేరు. హత్యచేయబడిన స్త్రీ దగ్గర పనిచేసే వాడి ప్రవర్తన సరిగా లేకుంటే, హత్యకు రెండు రోజులు ముందు ఆమె పనిలోనుండి తీసేసింది. అందరూ ఈ హత్య వాడి పనే అనుకున్నారు. మర్నాడు వాడు ఊరి చివర తప్పతాగి ఒళ్ళు తెలియని స్థితిలో పడి ఉండినాడు. వాడి జేబులో ఒక కత్తి కూడా దొరికింది. వాడి కుడిచేతిన నెత్తురు మరకలుండినాయి. ఏమిటి ఈ రక్తం అంటే, రెండు రోజులనుండి ముక్కున రక్తం కారుతూ ఉండింది అన్నాడు. వాడి కథ ఎవరూ నమ్మలేదు. అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో హత్య అతడే చేశాడని నిర్ధారణ అయింది. ఈ లోపల అతడికి జబ్బు చేసి హాస్పిటల్లో చేర్చారు. చనిపోయాడు. కేసు మూసేశారు. అప్పుడు శిక్ష మొదలైంది.

(సశేషం)