వేస్ట్‌ లాండ్: 4. ది ఫైర్ సెర్మన్ 2

[ఎలియట్ పరిచయం కోసం ఉపయుక్త వ్యాసాలు: టి. ఎస్. ఎలియట్: కవితాశిల్పం; టి. ఎస్. ఎలియట్: జెరోన్షన్. ది వేస్ట్‌ లాండ్ పూర్తిపాఠం పిడిఎఫ్.]


టైపిస్ట్:

వేస్ట్ లాండ్‌ లోని యీ సన్నివేశం చాలా ప్రచారం పొందింది. దీనికి వివరణ కూడా ఎక్కువ అవసరం లేదు. ఈ దృశ్యాన్ని మనకు వర్ణిస్తున్న పాత్ర టిరీసియస్. ఇతని గురించి వెనుక వివరంగా చెప్పుకొన్నాం. అతడికి కళ్ళు లేవు, కాని భూతభవిష్యవర్తమానాలు చూచినట్టు చెప్పగలడు. ఆ గదిలో ఏం జరుగబోతోందో ముందుగానే తెలిసినవాడు.

At the violet hour, when the eyes and back
Turn upward from the desk, when the human engine waits
Like a taxi throbbing waiting,
I Tiresias, though blind, throbbing between two lives,

The typist home at teatime, clears her breakfast, lights
Her stove, and lays out food in tins.
Out of the window perilously spread
Her drying combinations touched by the sun’s last rays,
On the divan are piled (at night her bed)
Stockings, slippers, camisoles, and stays.
I Tiresias, old man with wrinkled dugs
Perceived the scene, and foretold the rest –
I too awaited the expected guest.
He, the young man carbuncular, arrives,
A small house agent’s clerk, with one bold stare,

The meal is ended, she is bored and tired,
Endeavours to engage her in caresses
Which still are unreproved, if undesired.
Flushed and decided, he assaults at once;
Exploring hands encounter no defence;
His vanity requires no response,
And makes a welcome of indifference.

Bestows one final patronising kiss,
And gropes his way, finding the stairs unlit…
She turns and looks a moment in the glass,
Hardly aware of her departed lover;
Her brain allows one half-formed thought to pass:
“Well now that’s done: and I’m glad it’s over.”
When lovely woman stoops to folly and
Paces about her room again, alone,
She smoothes her hair with automatic hand,
And puts a record on the gramophone.

పగలంతా ఆఫీస్‌లో పనిచేసి అలసిపోయి, సాయంత్రానికి తన గూడు చేరుకొన్న టైపిస్టుకు, శృంగారానికి ఓపిక గాని ఉత్సాహం గాని లేవు. లోపలికి వస్తూనే, స్టవ్ వెలిగించి, ఉదయం తిని టేబుల్ మీదే వదిలేసి వెళ్ళిన పళ్ళేలు గిన్నెలు తీసి టేబుల్ శుభ్రం చేసుకొంటున్నది. తనకోసం ఎవడో వస్తున్నాడని తెలుసు. కాని, ఆ ప్రణయసన్నివేశానికై ప్రత్యేకమైన సన్నాహమేమీ లేదు. (Portrait of a Ladyలో లాగా, “You have the scene arrange itself”… with “I have saved this afternoon for you”) ఆ వచ్చే ప్రియుడు సుందరుడేమీ కాడు. ఆరోగ్యవంతుడూ కాడు (carbuncular). తను కోరుకున్నవాడూ కాడు. వండిందేదో తిన్నారిద్దరూ. ఆ తరువాత అతడు వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ ‘పని’లో ఆమె పాలు లేదు. ఆమె అవుననలేదు, అడ్డగించనూ లేదు. అతడు ఎప్పుడు వెళ్ళిపోయాడో కూడా ఆమె గమనించలేదు. ‘ఒక పని అయిపోయింది’ అనుకొంది. గిన్నెలు కడుక్కోవడం, బట్టలుతికి ఆరవేసుకోడం లాగా అదీ ఒక పని. ఈ పూటకు పని అయింది. ఇక కాసేపు వినోదం. అదీ యాంత్రికమే: She smoothes her hair with automatic hand, /And puts a record on the gramophone. పాట ముగిసి రికార్డ్ ఆగినపుడు తెలుస్తుంది ఆగింది పాట అని. శృంగారం కూడా అంతే ‘automatic’.

డ్రెసింగ్‌కు డైనింగ్‌కు ఒకే టేబుల్ ఆమెకు. పగలు సోఫా, రాత్రి పడక. ఆమెకు పిల్లలను కనే కోరిక లేదు. సంతానాపేక్ష లేకపోవడానికి కారణం ఆర్థికస్తోమత ఒకటే కాదు. పిల్లలను కనడం ఆధునికతా లక్షణం కాదు. ‘కాలం!’ అంటుంటాం. ఏ కాలంలో కూడా ఉండినదే. ఎలిజబెత్ కాలానికి తీసుకెళుతాడు ఎలియట్.

Elizabeth and Leicester:

వీరి ప్రేమకథ కూడా వెనుకవ్యాసంలో చూచాం. ఇక్కడ వారిద్దరూ పడవలో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ (Beating oars) అంటూ పాడుకొంటూ ప్రయాణం చేస్తున్నారు. కాని వారిది కూడా, కారణమేదైనా, ఫలించే ప్రేమ కాదు. ఈ పడవలో ప్రేమలు వెనుక కూడా చూశాం: A Game of Chessలో, కుర్చీ కూడా క్లియోపాత్ర కూర్చున్న పడవలాగా ఉన్నదంటాడు ఎలియట్ (The Chair she sat in, like a burnished throne). నదిలో కాలుష్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాడు. విఫలవిషాదప్రేమను కూడా.

The river sweats
Oil and tar
The barges drift
With the turning tide
Red sails
Wide
To leeward, swing on the heavy spar.
The barges wash
Drifting logs

ఎలిజబెత్, లెస్టర్‌లు ప్రవాహవేగంలో ఎటో దిక్కుతెలియక కొట్టుకపోతున్న కట్టెలు – Drifting logs. ఈ రాజకుటుంబాల ప్రేమనుండి చరిత్రనుండి ఎలియట్ తిరిగి మనల్ని మన కాలానికి మన లోకానికి తీసుకువస్తాడు.

ముగ్గురు కన్యలు:

ఎలియట్ తిరిగి వేగ్నర్ ఆపరా నుండి ఒక దృశ్యాన్ని గ్రహిస్తాడు. వేగ్నర్ రూపకంలో, రైన్ నదీతీరంలో ముగ్గురు కన్యలు వారి బంగారం పోయిందని వాపోతారు. వేస్ట్ లాండ్‌లో, ఠేమ్స్ నదీతీరంలో ముగ్గురూ వారి కన్యాత్వాన్ని ఎలా పోగొట్టుకొన్నది చెప్పుకొని వాపోతారు.

“Weialala leia / Wallala leialala.”
Trams and dusty trees.
Highbury bore me. Richmond and Kew
Undid me. By Richmond I raised my knees
Supine on the floor of a narrow canoe.”
“My feet are at Moorgate, and my heart
Under my feet. After the event
He wept. He promised a ‘new start. ’
I made no comment. What should I resent?”
“On Margate Sands.
I can connect
Nothing with nothing.
The broken fingernails of dirty hands.
My people humble people who expect
Nothing.”

ఎక్కడో పుట్టి, ఎక్కడికో చేరి, కోరి కన్యాత్వాన్ని పోగొట్టుకున్నారు వీరు. వారినెవరూ బలాత్కారం చేయలేదు: I raised my knees/Supine on the floor of a narrow canoe. ఇక్కడ supine అంటే కేవలం వెల్లకిలా పడుకోడం కాదు. ఆత్మబలాన్ని పూర్తిగా వదిలేయడమే. చర్యను ఎంత మాత్రము నిరోధించడం లేదు. పైగా, I raised my knees అంటోంది. అదీ ఎక్కడ? narrow canoe – చిన్న యిరుకు పడవలో.

మరొక యువతి కథ. ఆమెకు కూడా పాదాలు పైన, గుండె కింద – my heart / Under my feet. అంటే జరుగుతున్న కామకర్మలో ఆమె ‘మనసు’ లేదు. ఆ పని జరిగిన తరువాత, ‘అతడు’ ఏడ్చాడట! చేసిన తప్పు తెలిసికొని, కొత్త జీవితం ప్రారంభం చేద్దామన్నాడు. (He promised a ‘new start.) ఆ సందర్భంలో అందరూ అనే మాటే! ‘New start’ అంత సులభం కాదు, వ్యక్తికైనా సంస్కృతికైనా.

మూడో యువతి ఎందరికో అప్పగిస్తూనే ఉంది ఆమె దేహాన్ని. ఇప్పుడామె దగ్గర యివ్వడానికేమీ లేదు, తన మురికి చేతులు, విరిగిన గోళ్ళు, చెడిన మతి తప్ప. పాపం! ఆమె కస్టమర్లు అల్పసంతోషులు! అవేవీ చూడరు! I can connect/Nothing with nothing – తనకు మతి ఉన్నా చెడినా వాళ్ళకొకటే.

ఇంతకూ వీరు ముగ్గురా, ఒకరేనా? ఏదైనా కావచ్చు. ఈనాటి కన్యలు, కన్యాత్వపు విలువలు యిక్కడి విషయం. ఏమిటి యీ కన్యాత్వము, దాని ఛాందసపు విలువ?

ఒక చిన్న యిరుకు పడవలో జరిగిన ఒక వృత్తాంతం చెప్పాడు కదా ఎలియట్?

I raised my knees
Supine on the floor of a narrow canoe.

పరాశరుడు-పడవలో ప్రణయం:

ఇది చదివినప్పుడు మరో పడవప్రణయం గుర్తొస్తుంది. పరాశరమహర్షిని తన పడవ ఎక్కించుకొన్నది మత్స్యగంధి. నది దాటిస్తుండగా, పరాశరుడు ఆ కన్యను కోరాడు, ఆ చిన్న యిరుకు పడవలోనే, అప్పటికప్పుడే జరిగిపోవలె అన్నాడు. ఆ కన్నెపిల్ల సందేహిస్తుంటే, ‘నీ కన్యాత్వంబు దూషితంబుగాదోడకు’ అని ఆశ్వాసించాడు. నదిలో యింకా పడవలున్నాయి. ఒడ్డుపైన జనాలు. పట్టపగలు. ఇక్కడనా! అన్నది: ఎల్లవారును జూడంగనిట్టి బయల నెట్లు సంగమమగునని యింతి యన్న, నమ్మునీంద్రుండు కావించెనప్పుడఖిలదృ ష్టిపథరోధినీహారతిమిరమంత. (నన్నయ)

పొగమంచు సృష్టించి, లోకం కన్ను కప్పి, అంత పెద్దమనిషి అంత narrow canoeలో ఆమెతో సంగమించాడు. (కాని, మత్స్యగంధి I raised my knees అనలేదు.)

ఈ నాడు అందరూ చేసే అధిక్షేపం, ‘పరాశరుడు చేస్తే కన్యాత్వం దూషితం కాదా, మరొకడైతే దూషితమవుతుందా!’

కన్యాత్వం దూషితం కావడమంటే ‘టెంటు’ చిరగడం కాదు, (the river’s tent is broken) దోషం కర్మలో ఉండదు, దాని ఫలంలో ఉంటుంది. పరాశరమహర్షి ‘దోషం’ ఒక జాతి సంస్కృతికి రూపమిచ్చి, కొన్ని యుగాలు రక్షించి పోషించింది, వ్యాసమహర్షి రూపంలో సత్సంతానఫలమిచ్చింది. భారతీయసంస్కృతిలో ఏదీ దానికదే సుగుణం కాని దుర్గుణం కాని కాదు, దాని ఫలితాన్ని బట్టి అవుతుంది. కన్యాత్వమైనా పాతివ్రత్యమైనా చివరకు సత్యమైనా సమాజసువ్యవస్థకు లోకకల్యాణానికి కారణాలైనంత వరకే గుణాలు. లోకకంటక కారణమైతే పాతివ్రత్యమైనా భంగపడవలసిందే, సత్యమైనా వదలవలసిందే. ఈ సత్యం భారతీయ పురాణగాథలలోని అతిగహనమైన ధర్మసూక్ష్మం. లోకకల్యాణకారకమైన కర్మచేత, చేపలకంపు మల్లెల గుబాళింపుగా మారిపోతుంది.

[ఈ విషయంలో సాధారణంగా వినిపించే ప్రశ్న: పరాశరవ్యాసులు యింకా యితరులనేకులు చేస్తే తప్పు కానిది, మరొకరు చేస్తే తప్పు ఎలా అవుతుంది? దీనికి అస్తిత్వవాదం యిచ్చే సమాధానం: నీవు చేయదలచుకొన్న పని తప్పో ఒప్పో తేల్చుకోవలసింది నీవు, పరాశరుడు కాదు. మరొకడి ధార్మికకొలతలు నీకు ఉపయోగించవు. అలాగే, నీ ధర్మాధర్మనిర్ణయం మరొకడికి పనికిరాదు. ఎవడి ధర్మం వాడు తెలుసుకోవలె. వాడు తెలుసుకున్న ధర్మం వాడికి మాత్రమే ధర్మం. ఎవడి సత్యం వాడు సాక్షాత్కరించుకోవలె. వెనక వేల సంవత్సరాలు తపించేవారు, ఆ సత్సాక్షాత్కారంకోసం. ఎవడి తపన, తపస్సు వాడిది – I want to find out the truth which is true only for me. – Kierkegaard). నీవు పరాశరుడివి అయినప్పుడు ఆ పరాశరసత్యం నీకు తెలుస్తుంది.]

ఈ మహర్షి ‘పంట’ కొరకే ఎలియట్ తపన. మరుభూమిని (వేస్ట్ లాండ్‌ని) పంటపొలంగా చూడవలెననే తపనే, ఎలియట్ కావ్యతపస్సు.

సాధారణంగా సాహిత్యవిమర్శకులు, వేస్ట్ లాండ్‌లో ఒక ఎలియట్‌ను ఫోర్ క్వార్టెట్స్‌లో మరొక ఎలియట్‌ను చూస్తారు. అంతరం అభివ్యక్తి విధానంలో, వ్యక్తిలో కాదు. మౌలికమైన జీవితదృక్పథంలో మార్పు లేదు.

ఆగస్టిన్, అగ్ని, బుద్ధుడు:

To Carthage then I came
Burning burning burning burning
O Lord Thou pluckest me out
O Lord Thou pluckest
burning

వెనుకవ్యాసంలో బుద్ధుని ‘ఆదిత్తసుత్త’ వివరంగానే చెప్పుకొన్నాం. ఆగస్టిన్ ఆత్మకథ కూడా. ఇద్దరిదీ ఒక బోధ కాదు. ఆగస్టిన్ ప్రభువును ప్రార్థిస్తాడు: ‘నాకు నిగ్రహం అనుగ్రహించు. కాని యిప్పుడే కాదు. ముందు నన్ను అన్నీ అనుభవించనీ’ (“Lord, make me chaste (sexually pure) – but not yet!”).

భోగి కాని వాడు యోగి కాడు అని వేమన కూడా అంటాడు. కాని కామం ‘అనలం’ కదా! (న అలం: చాలదు) చాలు అని ఎప్పటికీ అనదు. కాని ఎప్పటికైనా, నిగ్రహం భగవదనుగ్రహం వల్లనే సాధ్యమని ఆగస్టిన్ తెలుసుకొన్నాడు. బుద్ధుడు నీకు నీవు నియమించుకోవలె అంటాడు.

ఇద్దరూ చెబుతున్నది కామాగ్నినే. ఈ అంకం ముగింపులోని శిల్పం గమనించవలసినది. చివరి పాదం, ఏకపదం: burning. ఆ పదానికి కుడిఎడమలలో మరో పదం లేదు, విరామచిహ్నం కూడా లేదు. మంట నిర్విశేషం నిర్విరామం.

కామం యీనాడు పుట్టిన పాపం అనడం లేదు ఎలియట్. ఎవరూ అనలేరు.

వసంతం నన్ను చూసి నవ్వుతోంది
విరగబడి వికటంగా
కోరలు చూపి కరాలు చాపి
ఏదో పురాణపిశాచం వలె
వసంతం యీనాటిది కాదు
యిక్ష్వాకులనాటిది యింకా ముందుది ముసలిది. (నైనం దహతి: నా అగ్నిమీళే నుంచి.)

వేస్ట్ లాండ్‌ అనాదికామాన్ని దాని ఆధునిక అవతారంలో ఆవిష్కరిస్తుంది.

(సశేషం)