షేక్స్‌పియర్‌ సాహిత్యలోకం: ఒక ఆలోకం

షేక్స్‌పియర్‌పై ఆంగ్లంలో నాలుగు వందల సంవత్సరాలనుండి సాహిత్య విమర్శ వస్తూనే ఉంది. సాహిత్యాభిమానులు, సాహిత్య విద్యార్థులు అందులో కొంతైనా చదివే ఉంటారు. కాని, తెలుగులో షేక్స్‌పియర్‌పై విమర్శ ఎక్కువగా వచ్చింది అనుకోను. షేక్స్‌పియర్ మాత్రమే కాదు, ప్రపంచ రచయితలను తెలుసుకోవాలంటే, అనువాదాలకు గాని వారిపై విమర్శకు గాని, మనం ఆంగ్లాన్నే ఆశ్రయిస్తున్నాం. తెలుగులో ఆ విషయంలో జరగవలసినంత ప్రయత్నం జరగలేదనిపిస్తోంది. ఆ దిశగా అల్పప్రయత్నమే యీ పుస్తకం. ప్రస్తుత వ్యాసాలలో షేక్స్‌పియర్ నాటకసాహిత్యాన్ని భారతీయ సాహిత్యంతో అనుసంధించే ప్రయత్నం చేశాను. షేక్స్‌పియర్ నాటకాలు చదువుతుండగా గుర్తొచ్చే కొన్ని యితర కావ్యభాగాల పరామర్శ అనేక భాషల కవుల, కావ్యాల ప్రసక్తి యిందులో వస్తుంది. ఇదొక కావ్యసల్లాపం అనవచ్చు.

ఈ పుస్తకంలో నేను ఎన్నుకున్న నాటకాలు, విషాదాంత నాటక చతుష్టయంగా ప్రసిద్ధమైన నాలుగు నాటకాలు (హేమ్‌లెట్, ఒథెలో, కింగ్ లీర్, మెక్‌బెత్) కాక మరి రెండు, ద టెంపెస్ట్, పెరిక్లీస్. ఈ ఆరు నాటకాలు షేక్స్‌పియర్ యిదే వరుసలో రాశాడు (1601 నుండి 1612 మధ్యకాలంలో). కాని నేను వీటిని విలోమ క్రమంలో చర్చించాను. పెరిక్లీస్‌పై వ్యాసం అతి చిన్నది. దానిని యిందులో చేర్చడానికి కారణం, ఆ వ్యాసం రాసిన తరువాత కలిగిన ఆలోచనే యీ వరుసవ్యాసాల పుస్తకం. కనుక దానిపై అభిమానం.

ఈ వ్యాసాలు ద్విభాషాసాహిత్యమనవచ్చు. ఆంగ్ల సాహిత్యాన్ని తెలుగులో వివరించాను. షేక్స్‌పియర్ నాటకాలతో పరిచయం ఉన్నవారిని ఉద్దేశించి రాసినవి యీ వ్యాసాలు. నాటకాల పేర్లను కూడా అనువదించలేదు. ఆయా నాటకకథలుగాని నాటకంలోని పాత్రలుగాని పాఠకులకు తెలిసి ఉంటాయి కనుక వాటిని వివరంగా పరిచయం చేయలేదు. ఈ వ్యాసాలు సాహిత్యానందం తప్ప ఏ ప్రయోజనము ఆశించక రాశాను. మరొక ప్రయోజనం ఆశించని సాహిత్య ప్రియులు అభిమానిస్తారని ఆశిస్తాను. – సూరపరాజు రాధాకృష్ణమూర్తి.


మెక్‌బెత్ (Macbeth)

మనసే మనిషికున్న పెద్ద అనారోగ్యం, ఆ అనారోగ్యం యొక్క అనేకదశలే మనమనుకునే ఆరోగ్యవంతమైన మనసు అని దర్శించినవాడు షేక్స్‌పియర్. ‘బాంకో ప్రేతం తన కళ్ళముందు… like a summer’s cloud’ అని మెక్‌బెత్ చేత అనిపిస్తాడు. అటువంటి భయంకరమైన మానసిక స్థితిలో కూడా నిదాఘమేఘాన్ని తలచుకోగలిగినవాడు కవి మాత్రమే. పధ్నాలుగేళ్ళ చరిత్రను ఏడు రోజులకు కుదించలేదు షేక్స్‌పియర్. సృష్ట్యాదినుండి సృష్ట్యంతదినం వరకు కాలాన్ని తన నాటక కథాసమయంగా దర్శించాడు. అధోలోకాల అసురశక్తులతో సాగే శాశ్వతపోరాట వాస్తవరూపాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అందుకు నాటక చతుష్టయంలో మెక్‌బెత్ శిఖరాయమానమైన చరమాంకమనదగినది. మిల్టన్ పారడైజ్ లాస్ట్ ఎక్కడ మొదలైందో మెక్‌బెత్ అక్కడే మొదలైంది. ‘The Queen my lord is dead’ అన్న వార్త విన్న మెక్‌బెత్ స్పందనలో అనార్ద్రత కాదు, ఆనంత్యదర్శనం ఉంది. మెక్‌బెత్ పరమఘాతుకుడు. ఇతడు కథానాయకుడు ఎట్లా అయ్యాడు?

షేక్స్‌పియర్ నాటకాలలో నాలుగింటిని ప్రధాన విషాదాంతనాటకాలుగా పరిగణిస్తారు. అవి: హేమ్లెట్, కింగ్ లీర్, ఒథెలో, మెక్‌బెత్. ఈ నాలుగు ప్రధాన నాటకాలు 1601 నుండి 1606 మధ్యకాలంలో రాసినవి.

ఒక రచయిత తన రచనకు గ్రహించిన మూలాన్ని–అది చరిత్ర గాని పురాణం గాని–తన రచనకు అవసరమైన విధంగా మార్చుకోడంలో విశేషం లేదు. షేక్స్‌పియర్ చరిత్రను మార్చడమే కాదు, ఆ చరిత్రను తన వ్యక్తిజీవనావసరాలకు అనుగుణంగా మార్చుకున్నాడు. ఇది కూడా విశేషమేమీ కాదు. విశేషమేమంటే, ఆ అవసరాలు నాటకంలో తొంగికూడా చూడలేనంతగా కథను కళగా మలచుకోవడం. మెక్‌బెత్ నాటకానికి ఆధారమైన హాలిన్‌షెడ్ చరిత్ర గ్రంథంలో (Holinshed’s Chronicles of England, Scotland, and Ireland) డంకన్ అంత ఉదాత్తుడేమి కాదు. అక్కడి ప్రజలు ప్రత్యేకమైన ప్రభుపరాయణులుగా చిత్రించవసినవారూ కారు. కాని షేక్స్‌పియర్‌కు తన దేశప్రభువైన జేమ్స్‌ను, ఆతని స్కాట్లండ్ మూలాలను స్తుతించి సంతుష్టుణ్ణి చేయవలసిన అవసరం కలిగింది. ప్రభువు నుండి కానుకలు బహుమానాలు కోరి కాదు. తల కాచుకోడానికి అవసరమయింది. షేక్స్‌పియర్ తండ్రి కాథలిక్. ఇంగ్లండ్‌లో కాథలిక్కులకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడడానికి ప్రభుత్వ వ్యతిరేకంగా జరుగుతున్న ప్రయత్నాలలో షేక్స్‌పియర్ తండ్రి చేయి కూడా ఉండింది. ఈ సమాచారం ప్రభువుకు చేరితే షేక్స్‌పియర్ ప్రాణానికే ప్రమాదం. కనుక, జేమ్స్‌ను, ఆయన జాతిని ఆభిజాత్యాన్ని, ఉదాత్తంగా చిత్రిస్తూ ఒక నాటకం రాయడం షేక్స్‌పియర్‌కు ఆ సమయంలో ఎంతైనా శ్రేయస్కరం. అంతే కాదు రాజుగారికి దయ్యాలంటే చాలా యిష్టం. ఒట్టి యిష్టమే కాదు, ఆయన దయ్యాలశాస్త్రంపై ఒక గ్రంథం కూడా రాశాడు. కనుక షేక్స్‌పియర్ నాటకంలో మూడు దయ్యాలు (Three Witches). కాని ఆ దయ్యాలచేత ఎంత చాకిరీ చేయించుకున్నాడు షేక్స్‌పియర్!

విషాదాంత నాటకచతుష్టయంలో మెక్‌బెత్‌ను ఎలా చేర్చారు అని యింతవరకూ ఎవరూ ప్రశ్నించలేదు. ప్రశ్నించడమెందుకు అనవచ్చు. స్థూలంగా చూచినప్పుడు, పాత్ర స్వభావాన్ని బట్టి, చేష్టలను బట్టి తక్కిన ముగ్గురు కథానాయకుల వరుసలో కాక, దుష్టచతుష్టయంలో (ఒథెలో: ఇయాగో, కింగ్ లీర్:ఎడ్మండ్, 3వ రిచర్డ్) చేర్చదగినవాడు మెక్‌బెత్‌. ఎందుకు? అతనిని నడిపించేది మూడు దయ్యాలు. (మెక్‌బెత్ భార్య నాలుగవ దయ్యం, అన్నారు కొందరు!) తన దురాశకు ఆ దయ్యాల ప్రేరణ కలిసింది. ఆ ప్రోద్బలంతో మెక్‌బెత్ ఏం చేశాడు? తనను ఆదరించి, అభిమానించి తన యింటికి అతిథిగా తనను తాను ఆహ్వానించుకొని, తనను నమ్మి తన యింట్లో నిశ్చింతగా నిద్రపోతున్న, బంధువు కూడా అయిన, దేశప్రభువును ఘాతుకంగా హత్య చేశాడు. రాజ్యాపహరణకాంక్షతో. అన్యాయంగా పొందిన పదవిని భద్రం చేసుకోవడం కోసం, వరుసగా హత్యలు చేస్తూ పోయాడు. ‘I’ve supped full with horrors’ అని అతనిని గురించి ఎవరో అనడం కాదు, స్వయంగా తానే చెప్పుకున్నాడు. ఇటువంటి ఘాతుకునిలో ప్రేక్షకుడు గాని పాఠకుడు గాని తనను తాను ఎట్లా చూచుకోగలడు? అతని పతనంలో సహానుభూతి ఎందుకు పొందుతాడు? విషాదాంతనాటకం సఫలమయేది, అరిస్టాటిల్ చెప్పినట్టు, ఉదాత్తకథానాయకుని పతనంలో ప్రేక్షకుడు సహానుభూతి పొందగలిగినప్పుడు కదా? మరి, మెక్‌బెత్ నాటకంలో అటువంటి సహానుభూతి కలిగే అవకాశం లేదంటే, నాటకం విఫలమైనట్లే కదా? కాని, విఫలమయిందా? లేదు. ఇప్పటికీ నాటకచతుష్కంలో దాని స్థానం చెక్కుచెదరలేదు. అంతే కాదు, నాటకరచనలో, ఆ నాలుగింటిలో చివరిదైన మెక్‌బెత్ శిల్పపరిణతిని పొంది శిఖరాయమానమయింది.

ఇది గొప్పనాటకంగా ఎలా నిలిచిపోయింది? ఏమిటి దానిలోని శిల్పపరిణతి, దాని విశిష్టత? పొదుపు శిల్పమంటే రాయిలోని అనవసరమైన భాగాలు చెక్కి వేయడమే అన్నాడట మైకలాంజిలో. నాటకంలోనుండి ఎన్ని రాతిముక్కలను నిర్దాక్షిణ్యంగా చెక్కివేశాడు షేక్స్‌పియర్? ఆ నిర్దయలో ఉంది అతని శిల్ప నైపుణ్యం. కొందరు సంపాదకులు, యిప్పుడు మనకు దొరికిన మెక్‌బెత్ ప్రతి మూలప్రతి కాదని, మూలప్రతిలోని కొన్నిభాగాలు కత్తిరించిన అసంపూర్ణప్రతి అని నమ్ముతారు. కాని అటువంటి అనుమానం అనవసరమనిపిస్తుంది. మరెవడో తొలగించలేదు. అవి రాయకముందే షేక్స్‌పియర్ తొలగించిన భాగాలు. మరి యిలా తొలగించుకొంటూ పోతే, కేవలం పతాక శీర్షికల వార్తాపత్రిక అవుతుందా? సంతృప్తికరమైన వివరాలు లేకపోతే, కథ కండలేని ఎండిన ఎముక కాదా? అవుతుంది. కాకూడదంటే, అటు కండగల బండకు, యిటు కండలేని ఎండిన ఎముకకు మధ్య ఒక సన్నని, దారం దూరగలిగిన దారి ఉంది. ఆ దారిన నడిపించాలి కథను. అదే కావ్యమార్గం.

పద్దెనిమిది సంవత్సరాల చరిత్రను తొమ్మిది రోజులలోకి కుదించి, తొమ్మిది రోజుల సంఘటనలను రెండు గంటలలో చూపడంలో విశేషం లేదు. ఎంచుకున్న కథను రంగస్థలం మీదికి ఎలా దించుకున్నాడు అన్నది శిల్పవిషయం. శిల్పి షేక్స్‌పియర్ వాడిన ఉలిని, దాని వాడిని రెండు అంశాలలో పరిశీలించవచ్చు. ఒకటి, కథాగమన వేగంలో రెండు, పాత్రోన్మీలనంలో.

కథాగమనం-పాత్రోన్మీలనం

ముందు కథాగమనం చూద్దాం. కథ మొదలు కాకముందే ఒక యుద్ధం జరిగిపోయింది. ఆ యుద్ధ విజయవార్తతో మొదలవుతుంది కథ. ఆ యుద్ధం ఎందుకు జరుగుతోంది. దానికి కారణమైన తిరుగుబాటు, దాని స్వరూపం గురించి ఒక అంకమో దృశ్యమో కాదు కదా, ఒక్క మాట కూడా లేదు. ఆ తిరుగుబాటును అణచడంలో మెక్‌బెత్ పాత్ర, ముందు నడువవలసిన కథకు అవసరం. కథకు అవసరమైనంత తప్ప, అవసరంలేని, ఒక్క మాట లేదు. తిరుగుబాటు అన్న మాట స్కాట్లండ్ రాజు డంకన్ (Duncan) నోట ఒకే ఒక్కసారి వింటాం. ఒక గాయపడిన సైనికుడు రాజు ముందుకు వచ్చినప్పుడు రాజు అడుగుతాడు, యుద్ధభూమిలో తాజా పరిస్థితి ఏమిటి అని (of revolt the newest state). దానికి సమాధానం, జరుగబోయే కథకు అవసరమైన మెక్‌బెత్ వీరోచితమైన పాత్ర వర్ణన. అందుకు అవసరంకాని ఒక్క మాట లేదు.

Sergeant: Doubtful it stood;
As two spent swimmers, that do cling together
And choke their art. The merciless Macdonwald.
Worthy to be a rebel, for to that
The multiplying villanies of nature
Do swarm upon him.from the western isles
Of kerns and gallowglasses is supplied;
And fortune, on his damned quarrel smiling,
Show’d like a rebel’s whore: but all’s too weak:
For brave Macbeth–well he deserves that name.
Disdaining fortune, with his brandish’d steel,
Which smoked with bloody execution,
Like valour’s minion carved out his passage
Till he faced the slave;
Which ne’er shook hands, nor bade farewell to him,
Till he unseam’d him from the nave to the chaps,
And fix’d his head upon our battlements.

సైనికుడు యుద్ధవార్త ఎక్కడ మొదలుపెడుతున్నాడు? విజయం అటా యిటా అన్న దశ వద్ద మొదలుపెట్టాడు: Doubtful it stood; As two spent swimmers, that do cling together/And choke their art— ఇరుపక్షాల సైన్యాలు సమంగా పోరాడి అలసిపోయాయి. ఒక సమయంలో, విజయం మనది కాదేమో అన్న విషమదశకు చేరింది పోరాటం. పరాజయపు కోరలనుండి విజయాన్ని సాధించినప్పుడు కదా మెక్‌బెత్ ప్రభుభక్తి శౌర్యము మరింత ప్రకాశిస్తాయి? అది ఆ సైనికుడి యుద్ధవార్త ప్రయోజనం. కాని, అందులో ఆ వార్త చెబుతున్న సైనికుడికి గాని, విన్నవారికి గాని తోచని భయంకరమైన నాటకీయ వ్యంగ్యం (dramatic irony) ఉంది. కాలమే దానిని ఆవిష్కరిస్తుంది. తెలిసిన గతాన్ని తెలియని భవిష్యత్తును దాచిన రచన యీ సైనికుడి నోట పలికిన యుద్ధవర్ణన.

పదాల పొదుపుకు మరొక ఉదాహరణ. రాజు డంకన్ హత్యలో భాగస్వాములైన జీవిత భాగస్వాములు మెక్‌బెత్, అతని భార్య. వారు యిద్దరా ఒకరా అన్నంత దగ్గర ఒకరికొకరు, హత్య జరిగేవరకు. కాని హత్య జరిగిన తరువాత, వారి మధ్య దూరం పెరిగింది. ఎంత పెరిగింది? ఏ దశలలో పెరిగింది? మనకు దూరం ఎంత పెరిగిందో మాత్రం తెలుసు. ఎలా? పదమూడు పదాలలో!

LADY MACBETH: Say to the king, I would attend his leisure for a few words (Act-3).

మహారాణి ఒక పనివాడిని అడుగుతోంది: మా ఆయనతో మాట్లాడాలి, ఆయనతో చెప్పు. రెండు మూడు మాటలే (for a few words). ఏ రాజ్యకాంక్ష వారిద్దరినీ ఒకటి చేసిందో, ఆ రాజ్యం దక్కిన తరువాత వారిద్దరూ అంత దూరమైనారు. దూరమెంతనో యింతకన్నా ఎలా చెప్పడం? ఇంత తక్కువ మాటల్లో. వారు కలిసి మాట్లాడుకోడం రాజును హత్య చేయడంతోనే ఆగిపోయింది. తరువాత మెక్‌బెత్ చేయదలచిన బాంకో (Banquo) హత్య విషయం గాని, మెక్‌డఫ్ (MacDuff) భార్యాపిల్లలను చంపడం గాని భార్యతో చెప్పలేదు. సలహా కాదు కదా, సమాచారం కూడా లేదు ఆమెకు!

షేక్స్‌పియర్ ఎంత తక్కువ మాటలు వాడుతాడంటే, ఒక్కొకసారి యింక రెండు మాటలు చెప్పవచ్చుగదా, అనిపిస్తుంది. మెక్‌బెత్ మూడు దయ్యాలతో అన్నట్టు: Stay, you imperfect speakers, tell me more. దయ్యాలు అంతకంటే ఎక్కువ చెప్పలేవు, వాటికంతే తెలుసు. షేక్స్‌పియర్‌కు అంతా తెలుసు. కాని అంతకంటే ఎక్కువ చెప్పడు. చెప్పడం కళకు లోపం. ఈ పొదుపుకు మనల్ని ఎంత అలవాటు చేశాడంటే, ఎక్కడైనా ఒక్కమాట ఎక్కువ కనిపిస్తే మనం ‘ఎందుకీ మాట?’ అంటాం. మూడు దయ్యాల గురించి బాంకో అంటాడు: The earth has bubbles, as the water has. ఈ వాక్యంలో రెండవ సగం అనవసరం కదా, అనుకుంటాం.

ఇవి యీ నాటకంలోని కథాగమనంలో పదాల పొదుపుకు ఒకటి రెండు ఉదాహరణలు.

ఇక పాత్రోన్మీలనంలో, ఆయన చేతిలో ఉలి కాదు కులిశమేమో అనిపిస్తుంది. ఒక్కొక్క పాత్ర స్వభావాన్ని నిర్ణయించడానికి ఆధారం మొత్తం నాటకంలో ఒకటి రెండు మాటలో వాక్యాలో ఉంటాయి. ఒక మాట ఒక వాక్యం ఆధారంగా, ఒక పాత్రచిత్రాన్ని భావించడం, వేల ఏళ్ళనాటి ఒక పన్ను ఆధారంగా ఆ ప్రాణి రూపాన్ని నిర్మాణాన్ని పునస్సృష్టి చేయడమే. ప్రధాననాయకపాత్ర అయిన మెక్‌బెత్ స్వభావం కూడా అతడు మాట్లాడిన అతితక్కువ మాటలనుండి, అతని గురించి యితరులన్న ఒకటి రెండు మాటలను పట్టుకొని, మనం నిర్ధారణ చేయవలసి ఉంటుంది. చేశాం కూడా.

మరొక ముఖ్యమైన అంశం యీ పొదుపులో, తక్కిన విషాదనాటకాలలో కనిపించే హాస్యదృశ్యాలను యిందులో తొంగి చూడనివ్వలేదు షేక్స్‌పియర్, మెక్‌బెత్ నాటకంలో ఒక దృశ్యాన్ని సాగదీశాడు అనిపించేది ఒకే ఒక్క సన్నివేశంలో. తన తండ్రి హత్య చేయబడినపుడు, తమ ప్రాణాలకు కూడా ప్రమాదముందని రాజకుమారులిద్దరూ చెరొక వైపుకు పారిపోతారు. చిన్నకుమారుడు డోనల్‌బెయ్‌న్ (Donalbain) ఇంగ్లండ్ రాజు వద్ద తలదాచుకుంటున్నాడు. అతనిని తిరిగి స్వదేశానికి తీసుకువెళ్ళి, మెక్‌బెత్‌ను పదవినుండి కూలదోసి, అతడు అన్యాయంగా ఆక్రమించిన సింహాసనంపై రాకుమారుణ్ణి కూర్చోబెట్టవలె అనే ప్రయత్నంలో మెక్‌డఫ్ అతనిని కలిసిన సన్నివేశం. రాకుమారుడు మెక్‌డఫ్‌ను అనుమానిస్తాడు తనను చంపడానికి మెక్‌బెత్ యితనిని పంపి ఉంటాడని. (రామాయణంలో సుగ్రీవుడు కూడా రామలక్ష్మణులను అనుమానిస్తాడు. హనుమను పంపుతాడు. వాళ్ళ గురించి తెలుసుకోడానికి. స్వయంగా ఎన్నో పరీక్షలు పెడుతాడు.)

డోనల్‌బెయ్‌న్ అనుమానించడానికి కారణం లేకపోలేదు. మెక్‌డఫ్ తన భార్యాపిల్లలను వదిలి వచ్చాడు తనను కలవడానికి. కొత్తగా రాజైన మెక్‌బెత్ వలన తన భార్యాపిల్లలకు హాని ఉంటుందనుకుంటే, వారిని నిస్సహాయులుగా వదిలి తనను వెదుక్కుంటూ అలా రాడు కనుక చాలాసేపు అతనిని నమ్మడు. ఆ మాట చెప్పలేడు. ‘నేను దుర్మార్గుణి నీచుణ్ణి, సింహాసనానికి తగను’ అంటూ ఏవేవో తనను గురించి అసత్యాలు చెబుతాడు. ఈ సన్నివేశ నిర్వహణ మరొకవిధంగా చేసివుండవలసింది అనిపిస్తుంది. ఇలా అనిపించడానికి కారణం, తక్కిన సన్నివేశాలలో నాటకకర్త చూపిన అసామాన్యమైన పొదుపు, ఆ పొదుపులోని తీక్షణత. మరొకరి రచనలో యీ లోపం లోపమనిపించకపోవచ్చు.

నాటకకర్త అనుసరించిన పొదుపు గురించి యింత విశ్లేషణ ఎందుకు? మెక్‌బెత్ నాటకంలో షేక్స్‌పియర్ దృష్టి ఒక ముఖ్యమైన అతిగంభీరమైన నాటకవస్తువుపై ఉంది. దానినుండి పక్కకు తొలగకుండా అన్ని విధాలైన విక్షేపాలను నిర్దాక్షిణ్యంగా దూరంలో ఉంచుతూ, లక్ష్యం వైపు రచనను నడిపాడు. ఏమిటా నాటకవస్తువు? ఈ వస్తువుకు తరువాత వద్దాం.

మానసిక వాస్తవికతాచిత్రణ: షేక్స్‌పియర్ ప్రతిభ

మనసెరిగినవాడు షేక్స్‌పియర్. మానసిక ఆరోగ్యం తెలుసు, అనారోగ్యమూ తెలుసు. మానసిక వ్యాధిగ్రస్తుల ప్రవర్తన ఫ్రాయిడ్‌కు నాలుగు వందల ఏళ్ళముందే షేక్స్‌పియర్ అర్థం చేసుకున్నాడని ఆయనను మెచ్చుకున్నారు. లేడీ మెక్‌బెత్ మాటిమాటికి చేతులు కడుక్కోవడం, నిద్రలో నడవడం, మెక్‌బెత్ గాలిలో కత్తిని చూడడం (fatal vision), బాంకో ప్రేతాత్మను డైనింగ్ టేబుల్ వద్ద కుర్చీలో చూడడం (hallucinations) యివన్నీ షేక్స్‌పియర్ అసాధారణ మానసిక శాస్త్రవిజ్ఞానానికి నిదర్శనాలు. ఈ విజ్ఞానానికి ఆయనను ఎంత మెచ్చుకోవలెనో అంతకంటే ఎక్కువగానే మెచ్చుకున్నారు. (ఇటువంటి విభ్రాంతి కంసుడికి కూడా ఉండేవి అని భాగవతం కూడా చెబుతుంది. భాగవతం ఫ్రాయిడ్‌కు ఎంతముందు రాయబడిందో ఖచ్చితంగా తెలియదు.) అయితే యిదంతా, షేక్స్‌పియర్ విజ్ఞానశాస్త్ర పరిజ్ఞాన విషయం. కాని షేక్స్‌పియర్ దార్శనికతలో దీనిని ఒక అంగంగా చూడగలిగితే, అంటే మనసే మనిషికున్న పెద్ద అనారోగ్యం, ఆ అనారోగ్యం యొక్క అనేక దశలే మనమనుకునే ఆరోగ్యవంతమైన మనసు అని దర్శించినవాడు షేక్స్‌పియర్; ఆ మనసును అన్ని దశలలో పట్టుకొని ప్రదర్శించినవాడు షేక్స్‌పియర్; అది అతని నిజమైన మానసిక వాస్తవికత (psychological realism) అని తెలుస్తుంది.

LENNOX: The night has been unruly: where we lay,
Our chimneys were blown down; and, as they say,
Lamentings heard i’ the air; strange screams of death,
And prophesying with accents terrible
Of dire combustion and confused events
New hatch’d to the woeful time: the obscure bird
Clamour’d the livelong night: some say, the earth
Was feverous and did shake.

‘ఇంత భయంకరంగా ఉండింది గడచిన రాత్రి’ అని లెనక్స్ ఎంతో ఆందోళనపడిపోయి చెబుతున్నాడు. దానికి మెక్‌బెత్ ప్రతిస్పందన: రాత్రి అలజడిగా ఉండింది (‘twas a rough night).

‘అవునవును. నేనూ చూశాను. చాలా భయంకరమైన ఉత్పాతాలు’ అనలేదు. అని ఉంటే మనం ఆశ్చర్యపోవలె. ఎందుకు? రాత్రి వెలుపల జరుగుతున్న బీభత్సం మెక్‌బెత్ గమనించనేలేదు. అతని తలలో అంతకంటే భయంకరమైన తుఫాను చెలరేగుతూ ఉండింది. ఆ సమయంలో, అందుకే అతనిది ప్రతిస్పందన కాదు, స్పందన. మెక్‌బెత్ స్పందన రాత్రి బయట జరిగిన ప్రకృతి బీభత్సం గురించి కాదు. తన అంతరంగంలోని పెనుతుఫాను గురించి. భావంలోని యీ పెనుతుఫాను ముందు, బాహ్యంలోని బీభత్సం సామాన్యమైన ‘అలజడి.’ ఈ మెక్‌బెత్ స్థితిని లేడీ మెక్‌బెత్ స్థితితో పోల్చి చూద్దాం:

MACBETH: I have done the deed. Did you hear a noise?
LADY MACBETH: I heard the owl scream and the crickets cry.

మెక్‌బెత్ మనస్థితి మనకు తెలుసు. లెనక్స్‌కు తెలియదు కదా! తెలియనివాని ప్రతిస్పందన తెలిసినట్టుంటే, అది కథనంలో లోపం. కనుకనే మెక్‌బెత్ స్పందన లెనక్స్‌కు అర్థం కాలేదు. కాలేదు కనుకనే ‘నేను చెప్పింది నీకు వినబడడం లేదా’ అంటాడు: My young remembrance cannot parallel a fellow to it.

‘రాత్రి జరిగిన ప్రకృతి వైపరీత్యాలు నా జీవితంలో మునుపెన్నడూ చూచి ఎరుగను’ అన్నాడు లెనక్స్. అలా అనడంలో అర్థమేమిటి? ‘అదేదో ప్రతిరోజూ జరిగేదే, అన్నట్టుంది నీ స్పందన’ అని, మెక్‌బెత్‌తో అంటున్నాడా, తనలో తాను అనుకొంటున్నాడా? పది పన్నెండు పదాలలో, షేక్స్‌పియర్ యింత మనస్తత్వాన్ని ఆవిష్కరిస్తాడు. (మెక్‌బెత్ అంతరంగంలోని అలజడి మరో కోణం నుండి కూడా పరిశీలించవలసి ఉంటుంది. అది మరోసారి.)

ఇది మానసిక వాస్తవచిత్రణలో షేక్స్‌పియర్ ప్రతిభకున్న ఒక పొర. మనసుకున్న పొరలన్నీ తెరవిప్పి చూడగలడు షేక్స్‌పియర్, మనసు రెండు కొనలను (mind’s full range) పూర్తిగా తెలిసినవాడు. మనసు ఆడే దొంగాటలు కనిపెట్టడం షేక్స్‌పియర్‌కు తెలుసు. అతడు కనిపెట్టిన ఆ ఆటను పట్టుకోడం, అవి దొంగాటలని తెలియడం మన వంతు.

మూడు దయ్యాలు జోస్యం చెప్పాయి, నీవు రాజు అవుతావు, అని. అంతకు ముందు అతనికి లేని ఆశ, మూడు దయ్యాలు మెక్‌బెత్ తలలో నాటిన దురాశ కాదది. అప్పటికే దూరిన దురాశకు ధైర్యం చెప్పి బలపరచాయి అవి. ఆ విషయం మెక్‌బెత్ జనాంతికంగా అనే మాటలలో తెలుస్తుంది: Two truths are told, as happy prologues to the swelling act of the imperial theme.

If it were done when ’tis done, then ’twere well
It were done quickly. If th’assassination
Could trammel up the consequence, and catch
With his surcease success: that but this blow
Might be the be-all and the end-all, here,
But here upon this bank and shoal of time,
We’d jump the life to come. But in these cases
We still have judgement here, that we but teach
Bloody instructions which, being taught, return
To plague th’inventor. This even-handed justice
Commends th’ingredience of our poisoned chalice
To our own lips. He’s here in double trust:
First, as I am his kinsman and his subject,
Strong both against the deed; then, as his host,
Who should against his murderer shut the door,
Not bear the knife myself. Besides, this Duncan
Hath borne his faculties so meek, hath been
So clear in his great office, that his virtues
Will plead like angels, trumpet-tongued against
The deep damnation of his taking-off,
And pity, like a naked new-born babe,
Striding the blast, or heaven’s cherubin, horsed
Upon the sightless couriers of the air,
Shall blow the horrid deed in every eye
That tears shall drown the wind. I have no spur
To prick the sides of my intent, but only
Vaulting ambition which o’erleaps itself
And falls on th’other. (1.7.)

కనుక మెక్‌బెత్‌కు సింహాసనం అధిష్ఠించాలన్న కోరిక, మూడు దయ్యాలో అతడి భార్యో తలకెక్కించింది కాదు. అతడికి ఉన్న ఆశను ఆలోచనను వారు బలపరిచారు. ఇక దాని ఆచరణ గురించి మెక్‌బెత్‌ మనసులో మథన (If it were done when ’tis done). ఈ స్వగతంలో (soliloquy) రెండు భాగాలున్నాయి.

మొదటి సగంలో నిశ్చయము, శంక, భయము ఉన్నాయి. అనుకున్నది త్వరగా చేసేయడం మంచిది. సరే, రాజును హత్య చేస్తాడు. హత్యతో (his surcease) అయిపోతుందా? దారుణ పరిణామాలుండవా? నీవు నేర్చిన విద్యయే (for which being taught return) అని, నేను సిద్ధం చేసిన విషపాత్రను నా చేతనే తాగించదా? (commends… our poisoned chalice to our lips). ఈ సగంలో హత్య చేయవలె అన్న నిశ్చయం ఉంది. పరిణామాల గురించిన అనుమానం ఉంది. నేను డంకన్‌కు చేసిందే నాకు జరగదని నమ్మకమేమిటి? నా పాపానికి నన్ను కట్టికుడుపవా, అన్న పాపభయం.

రెండవ సగంలో, హత్య చేయాలన్న నిర్ణయం బలహీనమవుతుంది. భయం వల్లనా? కాదు. డంకన్ మంచితనం తలచుకొంటాడు: ఇతడు మృదుస్వభావుడు. మచ్చలేని పాలన (this Duncan Hath borne his faculties so meek, hath been so clear in his great office). డంకన్ మంచితనం తలచుకోడం ఎందుకు? హత్య జరిగిన తరువాత పరిణామాల భయకారణంగా, తన హత్యానిశ్చయాన్ని నీరుగార్చడానికా? లేక, పరిణామాలు తానూహించినదానికంటే యింకా ఎక్కువగా ఉంటాయనడానికా? ఎందుకంటే, దుర్మార్గుడైన రాజును హత్యచేస్తే, పరిణామాలు భయపడవలసినంతగా ఉండవు. డంకన్ వంటి రాజును హత్యచేస్తే, అతని సుగుణాలు దేవదూతలై ఆ హత్యను బాకాలై లోకానికి ప్రకటించవా? (his virtues Will plead like angels, trumpet-tongued…) అప్పుడే పుట్టిన హత్య అనే పసిపాపను లోకానికి చూపితే హాహాకారాలు చేయరా? మనసులో మరో మెలిక డంకన్ సుగుణాలను సుగుణాలుగా తలచుకుంటున్నాడా? లేక, అవి సుగుణాలు కనుక, వాటి తీవ్రతరప్రభావాన్ని తలచుకొంటున్నాడా? మెక్‌బెత్‌కు మనిషిలోని మంచిని గుర్తించగలిగే మంచితనం ఉందనాలా? లేదనాలా? ఇది, మనసు ఆడే దొంగాట. ఇన్ని మెలికలు నిజమే. ఏదీ నిజమనడానికి లేదు అన్నది నిజమే. వీటిలో ఏది నిజమైన నిజమో తెలుసుకోండి అనడం లేదు షేక్స్‌పియర్. ఈ అసందిగ్ధతను మనసు లక్షణంగా అర్థం చేసుకోమంటాడు షేక్స్‌పియర్. ఇది మానసిక వాస్తవికతావగాహనాస్వరూపం. మనసు రెండుకొనలను కలిపి చూడగలగడమంటే యిదే.

నాటకవస్తువు

అలవాటైన హాస్యాన్ని తొంగిచూడనివ్వకుండా, అన్ని విధాలైన విక్షేపాలను నిర్దాక్షిణ్యంగా దూరంలో ఉంచుతూ, అతిగంభీరమైన లక్ష్యం వైపు రచనను నడిపాడు, అని చెప్పుకున్నాం. ఈ నాటకంలోని కావలివాని దృశ్యం (porter scene) హాస్య సన్నివేశమనుకుంటే, అంతకంటే గంభీరము భయంకరము అయిన హాస్యం ఉండదు. మరి, మెక్‌బెత్ నాటకంలో కావ్యవస్తువు ఏది?

తక్కిన మూడు విషాదాంతనాటకాలలో తండ్రి బిడ్డల లేక కుటుంబసభ్యుల అనుబంధం ప్రధాన వస్తువు. హేమ్‌లెట్‌లో తండ్రి హత్యకు ప్రతీకారం తీసుకోడం. కింగ్ లీయర్లో తండ్రి కూతుళ్ళ అనుబంధాల రెండు రూపాలు. ఒథెలోలో భార్యాభర్తల అనుబంధం. కాని, మెక్‌బెత్‌లో యీ అనుబంధాలకు అవకాశమే లేదు. ఒకే ఒక చోట అది తొంగి చూస్తుంది. కాని, అది ప్రధాననాటకవస్తువుతో అనుబంధించదు. ‘అతనిలో మా నాన్న పోలికలు కనిపించి ఉండకపోతే, ఆ హత్య నేనే చేసి ఉండేదాన్ని’ అంటుంది లేడీ మెక్‌బెత్ (Had he not resembled My father as he slept, I had done it). ఆమె ఆ హత్య చేసేదో లేదో, తెలియదు. ఆమెకు పథకాలు వేయడంలో పురికొల్పడంలో ఉన్న శక్తి, తెగింపు కార్యాచరణలో లేదు. మెక్‌బెత్ యిందుకు విపరీతం. అతడికి పథకరచనలో మథనం, కార్యాచరణ సమయంలో తెగింపు. మెక్‌బెత్లో కుటుంబసంబంధాలు, అనుబంధాలు వస్తువు కాదు. మరేమిటి? వ్యక్తులు సమాజాలు రాజ్యాలు అన్నిటినీ దాటి, అసలు సృష్టి మూలాల్లోకి వెళ్ళి, సృష్టిలో పెనవేసుకున్న మంచిచెడుల సంఘర్షణ. దీనిని పట్టుకునే ప్రయత్నం చేశాడు షేక్స్‌పియర్ యీ నాటకంలో. ఆ ప్రయత్నంలో పధ్నాలుగేళ్ళ చరిత్రను ఏడురోజులకు కుదించాడు షేక్స్‌పియర్ అనుకొన్నాం. కాదు, సృష్ట్యాదినుండి సృష్ట్యంతదినం వరకు (doomsday)కాలాన్ని తన నాటకకథాసమయంగా దర్శించాడు. అధోలోకాల అసురశక్తులతో సాగే శాశ్వతపోరాట వాస్తవరూపాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అందుకే, నాటకచతుష్టయంలో మెక్‌బెత్ శిఖరాయమానమైన చరమాంకమనదగినది.

మెక్‌బెత్ ఒక హత్యనుండి మరో హత్యలోకి దిగజారుతాడు. అందులో ఆశ్చర్యం లేదు. ఏ హంతకుడు ఒక హత్యతో ఆగలేడు. ఆశ్చర్యమేమంటే, అంతకంతకూ అతడు అధఃపతనమవుతూ కూడా, అంతకంతకూ అతని అవగాహన విశాలమవుతుంటుంది. అంతకంతకూ కాదు, ఆ విశాలదృష్టి అతని స్వభావం. అది అతని సహజస్థితి. అతని చర్యలు సన్నిహితదేశంలో సమీపకాలంలో. కాని అతని అవగాహన దేశకాలాల అంచులను తాకుతూ ఉంటుంది. ఆ అవగాహనలో, క్షణక్షణమూ తన అధఃపతనకారణమైన రాజ్యకాంక్ష, రాజ్యము కూడా అల్పమై కనిపిస్తాయి. నాటకం పేరు కింగ్ మెక్‌బెత్ కాదు, కింగ్ లీర్ లాగా (Ay, every inch a king!). బాహ్యంలో మెక్‌బెత్ ప్రతి అంగుళము రాజ్యకాంక్ష. కాని భావంలో రాజ్యం అంగుళమంత అల్పమయిపోయింది. అంటే, అతని రాజ్యకాంక్ష బాహ్యానికేగాని నిజం కాదు అని అర్థమా? కాదు. అది నిజం. అదెంత నిజమో, అతడు దాని అల్పత్వాన్ని స్పష్టంగా దర్శించగలిగిన స్థాయిలో ఉన్నాడు అన్నది అంతే నిజం. ఆ స్థాయినుండి అతని దృష్టిలో దేశం దిగంతాలకు, కాలం కల్పాంతాలకు విస్తరించింది. ఈ విషయం అతని స్వగతాలలో స్పష్టంగా తెలుస్తుంది. వెనుక చూసిన మెక్‌బెత్ స్వగతంలో మనోమథనం చూశాం. ఇప్పుడు, అతని మానసికస్థాయిని చూద్దాం.

But here, upon this bank and shoal of time, We’d jump the life to come. మెక్‌బెత్ తను చేయదలచిన హత్యకు పరిణామాలను తూకం వేస్తున్నాడు. ఈ లోకంలో జరుగగల పరిణామాలు సరే. పారలౌకికపరిణామాలకు నేను సిద్ధమే అంటున్నాడు (We’d jump the life to come). కాని ఎలా అంటున్నాడు? ఆ పారలౌకికం పరిమాణాన్ని దాని ఆనంత్యాన్ని స్పష్టంగా చూస్తున్నాడు (this bank and shoal of time). తన నేరాన్ని ఆ అనంతాల అంచుల వద్ద నిలబడి చూస్తున్నాడు. ఈ భావనా వైశాల్యమే మెక్‌బెత్‌ను కథానాయకుడిని చేసింది. ఒక హంతకుడు జీవితానంతరం అనుభవించబోయే పాపం తలచుకోవచ్చు. ఇలా ద్రష్టగా భావించలేడు. (ఇక్కడ, bank and shoal of time అంటే school bench అని కొందరు అర్థం చెప్పారు. కాని అది సరికాదనిపిస్తుంది.)

మరొక ఉదాహరణ. బాంకోను, అతడి కొడుకును చంపడానికి నియోగించినవారు తిరిగి వచ్చి, బాంకోను చంపాము, కాని అతని కొడుకు పారిపోయాడు అని చెబుతారు. అప్పుడు మెక్‌బెత్ అంటాడు: As broad and general as the casing air. But now I am cabined, cribbed, confined, bound. ఈ స్థితి కేవలం యీ సందర్భానికి సంబంధించింది కాదు. మెక్‌బెత్ స్వభావాన్ని చెప్పే మాటలు యివి. అతని స్వేచ్ఛావాంఛకు ఆకాశం హద్దు (the casing air). అంతకు తక్కువది తనకు భరించలేని యిరుకు (cabined, cribbed, confined, bound).

లేడీ మెక్‌బెత్ తన చేతుల నెత్తుటివాసనను కడిగేయడానికి అరేబియా అత్తర్లు కూడా చాలవంటుంది (All the perfumes of Arabia will not sweeten this little hand). ఆమె భావన అత్తరుసీసాలను మించి పోదు, మెక్‌బెత్‌కు అంగుళం పరిమాణంకల సీసాలు గుర్తు రావు. అపారసాగరాలు గుర్తొస్తాయి. తన చేతుల రక్తపు మరకలు కడిగి పచ్చసముద్రాలు (సముద్రం కాదు, సముద్రాలు) ఎర్రసముద్రాలుగా అయిపోతాయట! (Will all great Neptune’s ocean wash this blood Clean from my hand? No, this my hand will rather The multitudinous seas incarnadine, Making the green one red.)

ఇది మెక్‌బెత్ దేశాన్ని (space) భావించే విధం. ఇక కాలం (time). మెక్‌బెత్ మూడు దయ్యాల దగ్గరకు వెళతాడు. మొదటిసారి వాళ్ళ అవసరం, వాళ్ళు మెక్‌బెత్‌ను కలిశారు. రెండవసారి మెక్‌బెత్ అవసరం. కనుక తనే వెళ్ళాడు వాళ్ళను కలవడానికి. అప్పుడు వాళ్ళు మెక్‌బెత్‌కు భవిష్యత్తులో రాజులు కాబోయే బాంకో వారసుల ఆకారాలను ఒకరి తరువాత ఒకరిని వరుసలో చూపిస్తారు. మెక్‌బెత్ వారసులెవ్వరూ రాజులు కాబోరు. ఇది మెక్‌బెత్‌తో మొదటి సమావేశంలోనే సూచించాయి దయ్యాలు. ఇప్పుడు యింకా స్పష్టంగా ప్రదర్శించాయి. ఆ ఆకారాలు వరుసగా నడిచివస్తుంటే మెక్‌బెత్‌‌కు రంపంతో పరపరా కోస్తున్నట్టుంది. అంటున్నాడు: Filthy hags! Why do you show me this? A fourth? Start, eyes! What, will the line stretch out to th’ crack of doom? (ముసలి ముండల్లారా! ఎందుకే చూపిస్తారు నాకిది!ఈ [బాంకో వారసుల] ఊరేగింపు ఆగదా? కల్పాంతం వరకు సాగుతుందా?)

కల్పాంతానికి తక్కువ కల్పన చేయలేడు మెక్‌బెత్.

మహారాణిగారు మరణించారు (The queen, my lord, is dead) అని వార్త. దానికి మెక్‌బెత్ స్పందన చాలా ప్రసిద్ధం:

Tomorrow, and tomorrow, and tomorrow,
Creeps in this petty pace from day to day,
To the last syllable of recorded time;
And all our yesterdays have lighted fools
The way to dusty death. Out, out, brief candle!
Life’s but a walking shadow, a poor player,
That struts and frets his hour upon the stage,
And then is heard no more. It is a tale
Told by an idiot, full of sound and fury,
Signifying nothing.

ఇందులో చెప్పుకోవలసినది చాలానే ఉన్నది. కాని ప్రస్తుత విషయం కాలదర్శనం. రేపు ఎల్లుండి ఆవలెల్లుండి అనడం చాలదు. The last syllable of recorded time వరకు వెళ్ళవలసిందే. ఇది హంతకుడి భాష కాదు. వరుస హత్యలు చేసేవాడి భావన కాదు. కరడుగట్టిన మనిషి హృదయకల్పన కాదు. ఇది ఒక ద్రష్ట భాష, భావన, కల్పన. మెక్‌బెత్‌కు ఆకాశపు ఆనంత్యము కాలపు అవధులు స్పష్టంగా ఎదుట ఉన్న వస్తువులలాగా కనిపిస్తున్నాయి.

ఇదొక మానసిక రోగలక్షణమనవచ్చు. గాలిలో, కళ్ళ ఎదుట కదులుతూ కనిపిస్తున్న కత్తిని చూచినట్టే వీటిని కూడా చూస్తున్నాడనవచ్చు. కావచ్చు. అయినా, ఆ మాత్రపు అస్వస్థత సృజనలక్షణం, గొప్ప రచయితలందరు ఆ మాత్రం మానసిక అస్వస్థత ఉన్నవాళ్ళే అంటున్నారు కదా? మెక్‌బెత్ అస్వస్థత కూడా అటువంటి లక్షణమే. అతనిలో ఒక కవి ఉన్నాడు. ఒక తార్కికుడున్నాడు, రెండు విరుద్ధమైన లక్షణాలు. బాంకో ప్రేతం తన కళ్ళముందు నడిచివచ్చి భోజనం బల్ల ముందు కుర్చీలో కూర్చోవడం చూశాడు. అప్పుడు మెక్‌బెత్ మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? భయం ఆశ్చర్యం. కాని అంత భయంలోనుండి తేరుకొని, అతడి నోట వచ్చిన మాటలేమిటి?

Can such things be
And overcome us like a summer’s cloud
Without our special wonder?

అత్యంత ప్రశాంతమనస్కుడు ప్రసన్నుడు అయిన కవిలా మాట్లాడాడు. అటువంటి భయంకరమైన మానసిక స్థితిలో కూడా నిదాఘమేఘాన్ని తలచుకోగలిగినవాడు కవి మాత్రమే. మెక్‌బెత్ కవితాభివ్యక్తికి మరో ఉదాహరణ:

The innocent sleep,
Sleep that knits up the raveled sleave of care
The death of each day’s life, sore labor’s bath
Balm of hurt minds, great nature’s second course
Chief nourisher in life’s feast.

తాను హత్య చేసింది నిద్రపోతున్న డంకన్‌ను కాదు, నిద్రనే హత్య చేశానని తెలుసుకున్నాడు మెక్‌బెత్. తన చేతులమీద డంకన్ నెత్తుటితడి ఆరనే లేదు. ఆ స్థితిలో కూడా ఆ ‘పాపమెరుగని నిద్ర’పై (innocent sleep) మెక్‌బెత్ కవిత చెప్పగలిగాడు.

మెక్‌బెత్ వఠ్ఠి కవి కాదు, నాటకకవి. బ్రేడ్లీ అంటాడొకచోట, షేక్స్‌పియర్ కథానాయకులలో షేక్స్‌పియర్ నాటకాలు రాయగలవాడెవడైనా ఉంటే, అతడు హామ్లెట్ అని. మెక్‌బెత్‌కు ఆ సమర్థత లేదనలేము. అతడి భాష, భావన, కల్పన షేక్స్‌పియరువే. షేక్స్‌పియర్ వరుసహత్యలు చేసి ఉంటే (పాపము శమించుగాక!) మెక్‌బెత్‌లానే మాటాడేవాడు. ఊరకే అనడం లేదీమాట. నాటక ప్రారంభంలోనే దయ్యాల జోస్యానికి మెక్‌బెత్‌ స్పందనలో యీ నాటక ప్రసంగం స్పష్టంగా ఉంది: As happy prologues to the swelling act of the imperial theme.

ఇందులో మూడు పదాలు – prologues, act, theme – మెక్‌బెత్ నోట పలుకవలసినవా, షేక్స్‌పియర్ నోటనా?

ఇక్కడ ఒక ప్రశ్న అడగవచ్చు. ఒక మిలిటరీ జనరల్ నోట యిటువంటి భాష పలికించడం అనౌచిత్యం కదా? విరాటపర్వంలో (మహాభారతం) ఉత్తరుడి నోట తిక్కన పలికించిన పద్యం–భీష్మద్రోణకృపాదిధన్వినికరాభీలంబు దుర్యోధనగ్రీష్మాదిత్యపటు ప్రతాపవిసరాకీర్ణంబు, శస్త్రాస్త్రజాలోష్మస్పారచతుర్విధోజ్వలబలాత్యుగ్రంబు…–పాత్రను మించి ఉన్నదనిపించడం లేదా?

తిక్కన విషయం పక్కన ఉంచుదాం. ప్రస్తుత విషయం షేక్స్‌పియరు. షేక్స్‌పియర్ తెలియక చేసింది కాదిది. అతడు మెక్‌బెత్ పాత్రను అటువంటి విరుద్ధలక్షణాలతోనే భావించి రూపించాడు. ఆ రూపకల్పన నాటకవస్తువుకు దోహదం చేసేదే. పాత్రచిత్రణ నాటకంలోని తక్కిన అంగాలవలెనే నాటకవస్తువులో అంతర్భవించినప్పుడే సార్థకం అవుతుంది. పాత్రకు వ్యక్తిత్వం ఉండదు. ప్రయోజనం మాత్రమే ఉంటుంది. షేక్స్‌పియర్ ఆశించిన ప్రయోజనమేమిటి?

ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మిల్టన్ ఒకప్పుడు మెక్‌బెత్ కథను కావ్యంగా రాయవలె అనుకున్నాట్ట. ఇది ఆశ్చర్యకరమైన సాహసమే. ఎందుకో మరి, ఆ ఆలోచన వదిలేసి పారడైజ్ లాస్ట్ రాసుకున్నాడు. ఇప్పుడు మనకు కొంత అర్ధమవాలి మెక్‌బెత్ మూలాలు. స్వర్గం (Paradise) పోగొట్టుకున్నవాడు ఎక్కడ ఉంటాడు? షేక్స్‌పియర్ అక్కడికే మారుస్తున్నాడు. తరువాతి దృశ్యం. అధోలోకద్వారం వద్దకు.

కావలివాని దృశ్యం (porter scene)

నాటకంలో యిది చాలా ప్రసిద్ధమైన దృశ్యం. దీనిపై థామస్ డి క్విన్సీ (Thomas De Quincey) వ్యాసం (On the knocking at the Gate in Macbeth) కూడా ప్రసిద్ధమే. డంకన్ హత్య జరిగిన రాత్రి తెల్లవారకముందు. మెక్‌బెత్ నివాసభవనద్వారం. ద్వారపాలకుడు యింకా మత్తులోనుండి మేలుకోలేదు. ఆ మత్తులో అతడు తాను మెక్‌బెత్ యింటి ద్వారం కాక, నరకద్వారం వద్ద కావలి ఉన్నానని ఉహించుకుంటాడు. ఆ నరకద్వారపు తలుపు ఎవరో తట్టినట్టు, ఊహించుకొని మాట్లాడుతుంటాడు. సాధారణంగా యిదొక హాస్య సన్నివేశం అయి ఉండవలసింది. కాని యిక్కడ అది ఒక గంభీరమైన నాటక ప్రయోజనాన్ని సాధిస్తున్నది. మెక్‌బెత్ యిల్లు యిప్పుడు గంటల వ్యవధిలో నరకంగా మారిపోయింది. దాన్తె ఇన్‌ఫెర్నో 34 ఆశ్వాసాలను పదిహేను పంక్తులలో పట్టుకున్నాడు షేక్స్‌పియర్ అనడం సాహసమనిపించవచ్చు. అయినా అనిపిస్తుంది. నిద్రలో హత్య చేయబడిన డంకన్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మెక్‌బెత్ యింట్లో నిద్ర హత్య చేయబడింది. ఆ యింట్లో యిక నిద్ర ఉండదు. Macbeth shall sleep no more.

ఇక్కడ అప్రస్తుతం. కాని, ఈ దృశ్యంలో ఒక జనాంతికం (Aside) వంటిది. మెక్‌డఫ్ కావలివాణ్ణి అడుగుతాడు, రాత్రి బాగా ఆలస్యంగా పడుకున్నావా? అని. కావలివాడు, ‘ఒక చుక్క ఎక్కువే వేసుకున్నాను, మద్యానికి మూడు గుణాలు’ అంటాడు. ‘ఏవి ఆ మూడు?’ అని అడుగుతాడు మెక్‌డఫ్. దానికి వాడి సమాధానం:

Marry, sir, nose-painting, sleep, and
Urine. Lechery, sir, it provokes, and unprovokes;
It provokes the desire, but it takes
Away the performance: therefore, much drink
May be said to be an equivocator with lechery:
It makes him, and it mars him; it sets
Him on, and it takes him off; it persuades him,
And disheartens him; makes him stand to, and
Not stand to; in conclusion, equivocates him
In a sleep, and, giving him the lie, leaves him.

(Marry=indeed. ఈ పోర్టర్ మాట వాల్మీకి రామాయణాన్ని [కిష్కింధా కాండ]గుర్తు చేస్తుంది. “పానాదర్థశ్చధర్మశ్చ కామశ్చపరిహీయతే’ ఈ నాటకంలో మద్యపానం వలన కాకపోయినా ధర్మార్థకామాలు పరిహీనమైనాయి.)

ఈ కావలివాని దృశ్యం ఏ నాటకప్రయోజనాన్ని సాధిస్తున్నది? హత్యచేయబడినవానినుండి మన దృష్టిని లాగేస్తుంది. డంకన్ యీ లోకపు మంచిచెడులను సంఘర్షణలను ఒక్క వేటుతో దాటిపోయాడు. నాటకం యిప్పుడు మన దృష్టి హంతకులపైకి మరల్చవలె, మెక్‌బెత్, లేడీ మెక్‌బెత్‌లను యీ లోకం నుంచి తరలించవలె. అదే చేస్తున్నది. యీ దృశ్యం. భార్యాభర్తలిద్దరూ యికపై భార్యాభర్తలు కారు. ఆ మానవసంబంధం తెగిపోయింది. కలిసి చేసిన హత్యతో వారు తిరిగికలవలేనంతగా వేరయారు. వారిద్దరూ యిప్పుడు దయ్యాలుగా మారిపోయారు. ఇప్పుడు వారు అధోలోకపు ఆసురశక్తుల ప్రతినిధులు. నాటకప్రారంభంలో మెక్‌బెత్‌ను కలిసిన మూడు దయ్యాలకు వారిద్దరికీ తేడా లేదు. రంగస్థలం, అంతరంగస్థలం, యీ లోకం నుండి అధోలోకానికి మారింది. ఇది యీ కావలివాని దృశ్యప్రాధాన్యం, ప్రయోజనం.

అంటే, నాటకం మొదలైనచోటికి చేరిందన్నమాట. కాదు, మొదటి నుండి కూడా యీ నాటకరంగస్టలం యీ లోకం కాదు, కనిపించే యీ లోకం మాత్రమే కాదు. మిల్టన్ పారడైజ్ లాస్ట్ ఎక్కడ మొదలైందో యిదీ అక్కడే మొదలైంది. సృష్ట్యాదినుండి అదృశ్యంగా ఉండి యీ లోకాన్ని కదుపుతూ కుదుపుతూ ఉన్న అధోలోకపు ఆసురశక్తులను రంగస్థలం పైకి తెచ్చి చూపుతున్నాడు షేక్స్‌పియర్. అవే నాటకం ప్రారంభంలోని మూడు దయ్యాలు.

మూడు దయ్యాలు (The Three Witches)

షేక్స్‌పియర్ నాటకాలు చదవకూడదు, చూడాలి అంటారు. ఇది నిజం కాదని మెక్‌బెత్ ప్రారంభదృశ్యంలోనే తెలుస్తుంది. ఆ దృశ్యం చదువుతున్నపుడు కలిగిన అనుభూతి రంగస్థలం మీద కాని తెరపై గాని చూచినప్పుడు కలగదు. ఆ ప్రదర్శనలు ఘోరంగా విఫలమైనవి అనే చెప్పవలె. షేక్స్‌పియర్ యీ దృశ్యాన్ని ఎలా భావించాడు?

Three Witches అనీ Three Weird Sisters అనీ రెండు విధాలుగా వ్యవహరించాడు నాటకంలో. (The weird sisters, hand in hand, Posters of the sea and land, అని ఆ దయ్యాల కోరస్.) వియర్డ్ అన్న పదానికి యిప్పుడున్న వింత అన్న అర్థం కాదు షేక్స్‌పియర్ కాలంలో, అప్పుడు ఆ పదానికి విధి (fate), విధాత అని అర్థం. గ్రీకు నాటకాలలో యీ విధులు స్త్రీరూపాలలో కనిపిస్తారు. వీరు భవిష్యజ్ఞలుగా విధాతలుగా కూడా గ్రీకునాటకాలలో వ్యవహరిస్తారు. కొన్ని సందర్భాలలో వీరు ప్రకృతిని శాసించి తుఫానులవంటి వైపరీత్యాలను కూడా సృష్టించగలరు. షేక్స్‌పియర్ దయ్యాలు యీ మూడూ కూడా చేయగలవు. ఈ మూడూ కాక మరొకటి కూడా చేస్తాయి. వీటికి మాంత్రికశక్తులు కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే ఉంటే వీటిని దయ్యాలు అనడం సరికాదు. మంత్రకత్తెలు అనవలసి ఉంటుంది. ఆభిచారికలు అని కూడా అనవచ్చు. (భారతీయ సంస్కృతిలో సైతానుకు సరిగా చెప్పదగిన శక్తిని కృత్య అంటారు. మహాభారతంలో అరణ్యపర్వంలో దుర్యోధనుడు ప్రాయోపవేశం చేయవలె అనుకొన్నపుడు, నీవు కారణజన్ముడవు అని అతనిని ఉత్తేజపరచింది పాతాళలోకంలోని ఒక కృత్య.)

ఈ మూడు దయ్యాలు వాటి శక్తి గురించి అవి చెప్పుకున్న దానికన్నా, మెక్‌బెత్ మాటలలో వాటి శక్తి బాగా తెలుస్తుంది:

Though you untie the winds and let them fight
Against the churches; though the yeasty waves
Confound and swallow navigation up;
Though bladed corn be lodged and trees blown down;
Though castles topple on their warders’ heads;
Though palaces and pyramids do slope
Their heads to their foundations; though the treasure
Of nature’s germens tumble all together,
Even till destruction sicken; answer me
To what I ask you.

ఈ మూడు దయ్యాలు, ప్రభంజనాలకు కట్లు విప్పి వదులుతాయట, దేవాలయాలను ధ్వంసం చేయమని. సముద్రంలో అలల అల్లకల్లోలం సృష్టించి నావలను మింగివేయమంటాయి. కోతకొచ్చిన పంటను నేలమట్టం చేస్తాయి. చెట్లను నేలకూలుస్తాయి. భవనాలు దుర్గాలు పిరమిడ్లు ఒరిగిపోతాయి. విధ్వంసానికే విసుగువచ్చేటంత విధ్వంసం సృష్టించగలవు, ఏం చేస్తున్నారు మీరు అని అడిగితే వాటి జవాబు, A deed without a name. పేరు లేనిది కాదు, పేరు చెప్పలేనిది, ఒక పేరు మాత్రమే ఉన్నది కాదు.

మొదటిసారి మెక్‌బెత్ వీటిని కలిసినపుడు, నీవు రాజవుతావు అని మాత్రం చెప్పాయి. మెక్‌బెత్ మనసులోని మాటను అవి బయటకు చెప్పాయి. అనవచ్చు. లేని దురాలోచనను తలలో దూర్చలేవు కదా? రెండవసారి మెక్‌బెత్‌ను అవి కలవలేదు. మెక్‌బెత్ వాటిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇప్పుడేం చెప్పాయి? అతనికి చావు లేదు అన్నంత దురాశను కల్పించాయి. ‘బర్నమ్ అడవి కదలి వచ్చేవరకు నీకు మరణం లేదు.’ అడవి నడచిరావడమా! నిస్సందేహం, తనకు చావు లేదు. అంతటితో ఆగలేదు ఆ దయ్యాలు. ‘ఆడదానికి పుట్టినవాడెవడూ నిన్ను చంపలేడు.’ హ హ హ! తనకు చావు రమ్మన్నా రాదు. మెక్‌బెత్ యీ వరాలు అడగలేదు, హిరణ్యకశిపుడిలాగా (గాలిం కుంభినినగ్నినంబువులనాకాశస్థలిన్ దిక్కులన్…). ఆ దయ్యాలే చెప్పాయి ఆ వరాల వంటి జోస్యాలు. అవి నిజం కాబోవు అని హిరణ్యకశిపుడికి తెలుసు, మెక్‌బెత్‌కు తెలుసు. తెలిసినా నమ్ముతాడు మనిషి. ప్రియం అసత్యమని తెలిసినా నమ్మడం మనిషి స్వభావం.

గ్రీకునాటకాలలోని దైవాలను దయ్యాలుగా మార్చివేశాడు షేక్స్‌పియర్. కనుకనే వీటిని దయ్యాలు అనడం. వాస్తవంలో షేక్స్‌పియర్ వీటిని గ్రీకునాటకాల దివ్యశక్తులకన్నా, బీభత్సం సృష్టించగల మంత్రకత్తెలకన్నా కూడా ఎక్కువ ప్రాధాన్యంగల ప్రాకృతికశక్తికి ప్రతిరూపాలుగా భావించాడు. షేక్స్‌పియర్ దయ్యాలు, సృష్టిలో అంతర్భవించిన ఆదిమ ఆసురశక్తికి రూపాలు. అచ్చపు చీకటి ముద్దతో తయారుచేసిన మూడు కరాళవికారాలు. మనిషి మనసులోని అధోలోకాలు వాటి స్థావరాలు. సమయం చూసుకొని భూమిని చీల్చుకొని పైకి వస్తాయి. వాటి శక్తిని నమ్మితే అవి భూమిబుద్భుదాలు (The earth hath bubbles). నమ్మకపోతే అవి నీటి బుడగలు (as the water has). మొదటిసారి మెక్‌బెత్‌ను బాంకోను యీ దయ్యాలు కలిసినపుడు ఆ యిద్దరి స్పందనలలో తేడా యీ రహస్యాన్ని చెబుతుంది. మెక్క్‌బెత్ వాటిని చూసి భయపడతాడు. అంటే, నమ్ముతాడు. కాని బాంకో వాటిని బుడగలంటాడు.

BANQUO: The earth hath bubbles, as the water has, And these are of them. Whither are they vanish’d?
MACBETH: Into the air,

భూమి జలము వాయువు (earth, water,air), మూడు మహాభూతాలకు రూపాలు. ఈ మూడు కలిస్తే నాలుగవది అగ్ని. అంటే సృష్టి నిర్మాణానికి ఏ మహాభూతాలు వస్తువులో, విలయానికి కూడా అవే భూతాలు. సృష్టి విధ్వంసము రెండూ ఒకే తత్త్వంలోవి. వాటి మధ్య ఘర్షణ నిరంతరం. ఈ ఘర్షణను దాని మూలంలో పట్టుకొని ప్రదర్శిస్తున్నాడు షేక్స్‌పియర్.

మెక్‌బెత్ వాస్తవఘర్షణ బయటి శత్రువులతో కాదు. అతనిది స్వభావంతో సంఘర్షణ. తన విధితో కూడా. విధి అంటే, ముందుగానే తన చేష్టలను విధించిన అదృశ్యశక్తి విధి(Fate), స్వభావం (nature). ఈ బాహ్యాభ్యంతరశక్తులకు, దైవాసురశక్తుల సంయోగశక్తికి ప్రతీకలు మెక్‌బెత్ లోని మూడు దయ్యాలు. అవి మూడు రూపాలు, కాని ఒకే తత్త్వం. In lightning, thunder or in rain? ఈ మూడూ ఎప్పుడైనా ఒకటి లేకుండా ఒకటి సంభవిస్తాయా? ఈ మూడు దయ్యాలు అంతే. అవి విడిగా కనిపించవు.

ఈ మెక్‌బెత్ మూలాలను పట్టుకోడానికి షేక్స్‌పియర్‌కు స్పూర్తి ఎక్కడనుండి వచ్చింది? తనకు కొద్దిగా ముందు మార్లో (Marlowe) యీ చెడుతో మర్షణపడ్డాడు డాక్టర్ ఫాస్టస్‌లో. ఇంకా వెనక్కు చూస్తే గ్రీకునాటకం ఉంది. కాని షేక్స్‌పియర్ స్పూర్తి కొరకు వీటి వైపు చూడలేదు. అసలు మూలానికే వెళ్ళాడు. బైబిల్ (old Testament) లోని జోబ్ (Job) ఐసయ (Isaiah) వంటి అధ్యాయాలు యీ సంఘర్షణ విషయాలే. ఆదిమ ఆసురశక్తులతో పోరాటమే షేక్స్‌పియర్‌కు స్పూర్తి, ఆ బైబిల్ పాత్రల స్థాయి కాకపోవచ్చు కాని, సంఘర్షణ స్వరూపమదే. కనుకనే మెక్‌బెత్ విషాదాంతనాటకాలలో శిఖరాయమానమయింది.

ఈ సంఘర్షణ మెక్‌బెత్ పాత్ర దౌష్ట్యాన్ని తక్కువ చేస్తుందా? చేయదు. మెక్‌బెత్ ప్రవర్తన అత్యంత హేయం. డంకన్ వంటి సౌజన్యమూర్తిని, అతని సౌజన్యాన్ని తెలిసి, నిద్రపోతున్నవాణ్ణి హత్య చేయడంతో అతడు సైతానుకు అమ్ముడుపోయాడు. ఆ మొదటి హత్యలో మెక్‌బెత్‌కు ఉండిన మానవత్వపు ఛాయలు కూడా ఆ తరువాత పూర్తిగా వదిలేశాయి. బాంకో హత్య, అతని కొడుకును చంపాలన్న ఆలోచన, అమాయకులైన మెక్‌డఫ్ భార్య, పిల్లల దారుణమైన హత్య, యివేవి దారుణము అమానుషము కాకుండా పోవు. అతడు గుండెలు తీసివేసిన బండ. కాని అతనిలోని ఆసురశక్తులతోటి ఆదిమపోరాటం మనందరిదీ. అతని పోరాటంలో మనిషి ఉన్నాడు. అతనిలో మనం ఉన్నాం. కనుక, అతడి విషాదంలో మన సహానుభూతి. అతడు చేసిన ఘాతుకాలు మనం చేయము. అతడు చేసిన పోరాటము మనం చేయలేము. అతడు చేసిన హత్యలు మనకు తెలుసు. అతడు తన స్వభావం పైకి ఎదిగిన ఎత్తులు మనకు అందనివి. ఆ ఎత్తునుండి తన చర్యలను వాటి అప్రాధాన్యాన్ని వాటి అల్పత్వాన్ని అతనివలె దర్శించలేము. అతని చూపు దిగంతాలవరకు, కల్పాంతాలవరకు. ఆ చూపులో మనిషి జీవితం అల్పదీపం (brief candle). తన ప్రియమైన భార్య మరణించింది. అన్న వార్త విన్న మెక్‌బెత్ శుష్కస్పందనలోని అనార్ద్రతను చూశాం. అది మాత్రమేనా ఆ స్పందనలో?

To the last syllable of recorded time; And all our yesterdays have lighted fools The way to dusty death. Out, out, brief candlel Life’s but a walking shadow, a poor player… ఇది అనార్ద్రత కాదు. జీవితము జీవితాశయాలు వాటి అల్పత్వం-వీటి అనుభూతి ఉంది యిందులో. ‘కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ చెందరే వారేరీ… (బలి చక్రవర్తి: భాగవతం.) ఇవి, బలి అవసర వైరాగ్యంలో అన్న మాటలు కావు. అనంతమైన కాలస్వరూపానుభవంలో (To the last syllable of recorded time) వెలువడిన మాటలు. మెక్‌బెత్‌కు కూడా ఆ అనుభవం కలిగింది. మహారాణి మరణించింది (The Queen my lord is dead) అన్న వార్త విని మెక్‌బెత్ అంటున్నాడు, ‘వారేరీ’ అని. ఎంతమంది మహారాణులు మరణించలేదు? ఎందరికి భార్యావియోగం కలుగలేదు? మెక్‌బెత్‌కు ఆ క్షణంలో ఆనంత్యదర్శనం అయింది.


పేరు: షేక్స్‌పియర్‌ సాహిత్యలోకం (2019).
ప్రచురణ: ఆథర్స్ ప్రెస్, న్యూఢిల్లీ.
వెల: 595 రూ. (30$)
ప్రతులకు: authorspressgroup@gmail.com, : www.authorspressbooks.com