ది వేస్ట్‌ లాండ్: 1. కావ్యప్రవేశం

[ఎలియట్ పరిచయం కోసం ఉపయుక్త వ్యాసాలు: టి. ఎస్. ఎలియట్: కవితాశిల్పం; టి. ఎస్. ఎలియట్: జెరోన్షన్. ది వేస్ట్‌ లాండ్ పూర్తిపాఠం పిడిఎఫ్.]


కావ్యప్రవేశం

ఈ కావ్యాన్ని ఎలియట్ ఎజ్రా పౌండ్‌కు (Ezra Pound: మెరుగైన శిల్పి, Il miglior fabbro) అంకితమిచ్చాడు. ఎలియట్ యీ కావ్యం రాతప్రతిని పౌండ్‌కు యిచ్చాడు చూడమని. అతడు మూలకావ్యంనుండి సగానికి సగం తగ్గించాడు. ఇప్పుడు అది 434 పాదాల కావ్యం. పౌండ్ ప్రతిభపై ఎలియట్‌కు అంత విశ్వాసం. అయిదో తరగతి విద్యార్థి కూడా ఆగ్రహిస్తాడు, వాడు రాసిన వాక్యం సరిదిద్దితే.

తన అన్ని కవితలలో లాగానే వేస్ట్‌లాండ్‌కు కూడా ఒక ఉల్లేఖనం (Epigraph):

Nam Sibyllam quidem Cumis ego ipse oculis meis
vidi in ampulla pendere, et cum illi pueri dicerent:
Sibylla ti theleis; respondebat illa: apothanein thelo.

నేను నా కళ్ళతో చూచాను, సిబిల్ ఆఫ్ క్యుమే ఒక గాజు జాడీలో వేలాడడం. పిల్లలు ఆమెను ‘సిబిల్, నీకేం కావాలి?’ అని అడిగితే, ఆమె అన్నది, ‘నాకు చావు కావాలి’ అని.

ఒక పురాణగాథలో, సిబిల్ వరమడిగింది అపోలోను, ‘పిడికెడు యిసుకలో ఎన్ని రేణువులుంటాయో అన్ని సంవత్సరాల ఆయువు యివ్వు’ అని. అపోలో అలాగే అన్నాడు. దురదృష్టమేమంటే, ఆమె ఆయుష్షు అడిగింది కాని, యవ్వనం అడగడం మరచిపోయింది. ఏళ్ళు గడిచిపోయి చిక్కి శల్యమైపోతోంది. అల్లరిపిల్లలు ఆటపట్టిస్తున్నారు. ఆమెకు మరణమే శరణం. మరణిస్తేగాని మరో బతుకు లేదు. కాని చావు రావడం లేదు.

ఇదీ వేస్ట్‌లాండ్‌కు ముందు ఎలియట్ ఎంచుకొన్న సన్నివేశం.

కావ్యవస్తువు

ఈ కావ్యం:

  • ప్రపంచయుద్ధపు బాంబులవర్షంలో భవనాల, మానవశకలాల మధ్య (A heap of broken images) నిలబడి కవి చదివిన శాంతిమంత్రమా (శాంతిః శాంతిః శాంతిః)?
  • ఈ శతాబ్దపు ‘శాంతి పావురమా?

    Falling Towers
    Jerusalem Athens Alexandria
    Vienna London.

    (న్యూ యార్క్ మర్చిపోయాడా? సెప్టెంబర్ 11, 2001. జంట భవనాలను కూల్చిన శాంతి పావురం: The dove descending breaks the air with the flame of incandescent terror. Little Gidding: Four Quartets.)

  • నిర్వీర్యమైన సమాజాన్ని చూచి ఒక కవి పొందిన నిర్వేదమా?
  • దైవానికి దూరమైన మనిషిపై ఒక మహర్షి కోపంలో యిచ్చిన శాపమా? (I will show you fear in a handful of dust.)
  • గతించిన పాశ్చాత్యసంస్కృతికి నిర్వర్తిస్తున్న అంత్యక్రియలా (Burial of the Dead)?
  • పాశ్చాత్యసంస్కృతిపై రవి అస్తమించాడని, ఎలియట్ తూర్పుకు తిరిగి దణ్ణం పెడుతున్నాడా? (The Fire Sermon; What the Thunder said.)

వేస్ట్‌ లాండ్‌లో యివన్నీ ఉన్నాయి, ఇవేవీ లేవు. ఈ వేస్ట్ లాండ్ ఎక్కడ ఉంది అని మనం వెదుక్కుంటూ వెళ్ళనక్కరలేదు. ఎలియట్ రాసిన ది రాక్ (The Rock) అనే రూపకంలో దాని అడ్రసు యిచ్చాడు:

The desert is not remote in the southern tropics,
The desert is not only around the corner,
The desert is squeezed in the tube-train next to you
The desert is in the heart of your brother.

ఈ కవితలో ప్రధానవస్తువు సాఫల్యము (fertility). ఎలియట్ తన కావ్యానికి చివర యిచ్చిన నోట్స్‌లో అందులో తాను విస్తారంగా వాడుకొన్న ప్రతీకలు రెండు పుస్తకాలనుండి గ్రహించానని చెప్పుకున్నాడు. అవి: 1. Jessie Weston’s From Ritual to Romance; 2. Sir James Frazier’s The Golden Bough.

ఈ రెండు పుస్తకాలలో ప్రధానవిషయం ‘పవిత్ర పాత్ర’ (Holy Grail) కొరకు అన్వేషణ. క్రీస్తు తన చివరి భోజనంలో వాడిన పాత్ర. క్రీస్తును శిలువ వేసిన తరువాత, ఆ పాత్రలో క్రీస్తు రక్తం పట్టి ఉంచారని ప్రతీతి. ఆ పాత్ర కొరకు ఆర్థర్ రాజు పాలనలోని యోధులు జరిపిన అన్వేషణలు అనేక గాథలకు మూలం. వెస్టన్ తన పుస్తకంలో ఈ క్రైస్తవగాథలను క్రీస్తుకు పూర్వం ఉండిన గాథలతో అనుసంధానం చేసే ప్రయత్నం చేసింది. ఈ రెండు పుస్తకాలలోను సంతానసాఫల్యం కొరకు ప్రాచీన సంస్కృతులలో ఆచరించిన క్రతువుల వర్ణనలు ప్రధాన విషయం. ఒక బెస్తరాజు జననాంగం దెబ్బతిని, అతడు నిర్వీర్యుడుతాడు. దాని దుష్ఫలితంగా అతని రాజ్యంలో దుర్భర దుర్భిక్షం. రాజ్యం తిరిగి సుభిక్షం కావలెనంటే, రాజు వీర్యవంతుడు కావలె. ఎలియట్ ఈ ప్రాచీన గాథను తన కాలపు సమాజంలోని ధర్మదుర్భిక్షానికి (spiritual famine) ప్రతీకగా గ్రహించాడు. కాని అతని కావ్యంలో, రాజు తిరిగి వీర్యవంతుడు కాగలడా? అటువంటి ఆశ లేదు. అసలు వేస్ట్‌ లాండ్‌కి రాజే లేడు. దుర్భిక్షం మాత్రం ఉంది. కావ్యం ముగింపులో కూడా వఠ్ఠి ఉరుమే కాని, వానచినుకేది (sterile thunder)?

వేస్ట్‌ లాండ్‌లో, మనలను చివరి వరకు తరుముతూ వస్తుంది మృత్యువు (I will show you fear in a handful of dust). కాని, ఇందులో ప్రధానవస్తువు, పునరపి జననం పునరపి మరణం కాదు – పునరుజ్జీవనం, బతికుండగానే చచ్చి పుట్టడం. అంటే, ద్విజత్వం. పాశ్చాత్యసంస్కృతి వేళ్ళతో సహా వాడిపోయి ఉంది (dull roots). అందులో నుండి కొత్త మొలకలేమి వస్తాయి? శవాలను నాటితే పూలతోట వస్తుందా? (That corpse you planted last year in your garden, Has it begun to sprout?) ద్విజన్మనెత్తాలంటే చావులాంటి బతుకులో సాధ్యం కాదు, చావులోనే సాధ్యం. అదే, కావ్యానికి ముందు ఉల్లేఖనంలోని సిబిల్ కోరుకున్నది. పాశ్చాత్య సంస్కృతికి చచ్చిపోవలసిన సమయం వచ్చింది. దానికి చావు కావాలి. దానికి కొత్త బతుకు కావాలి.

కావ్యనిర్మాణం

ఇందులో అయిదు ఖండాలున్నాయి.

  1. బరియల్ ఆఫ్ ది డెడ్ (Burial of the Dead)
  2. ఎ గేమ్ ఆఫ్ చెస్ (A Game of Chess)
  3. ది ఫైర్ సెర్మన్ (The Fire Sermon)
  4. డెత్ బై వాటర్ (Death by Water)
  5. వాట్ ది థండర్ సెడ్ (What the Thunder Said)

వెంటనే మనం పృథివ్యప్తేజోవాయురాకాశాలా? అంటాం. పాశ్చాత్యులకు నాలుగు మహాభూతాలు (వాయువు, పృథివి, జలము, అగ్ని); నాలుగు ఋతువులు (Spring, Summer, Autumn and Winter). వేస్ట్‌ లాండ్‌లోని మొదటి నాలుగు భాగాలు, నాలుగు మహాభూతాల విషయమంటారు విమర్శకులు. మరి నాలుగు భాగాలలో ముగించి ఉండవచ్చు కదా? లేక, ఎలియట్, భారతీయసంస్కృతిలోని అయిదు మహాభూతాలు, అయిదు ఋతువులు గ్రహిస్తున్నాడా? మన చట్రంలో ఎంత వరకు యిముడుతుంది ఈ కావ్యం? పరిశీలించవలసి ఉంది.

కావ్యరూపం

ఈ కవితను ఎలా చదవాలి? అడగవలసిన ప్రశ్న: ఎలా చదవకూడదు?

ఇది చదవకూడని కవిత. సరిగమలు చదివితే సంగీతమవుతుందా? వేస్ట్‌ లాండ్‌లోని పదాల, పదార్థాల స్వరాలకు సంగీతరచన చేసుకొని, చెవులు మూసుకొని వినాలి. (Music of Ideas – I. A. Richards.)

ఇది ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవలసినది కూడా కాదు. (A poem should not mean/But be. – Ars Poetica: Archibald Macleish.)

వేస్ట్‌ లాండ్‌ (1922) వచ్చిన 15 సంవత్సరాలకు, పికాసో గెర్నికా (Guernica, 1937) గీచాడు. పికాసో తన చిత్రంలో స్పానిష్ సివిల్ వార్ సృష్టించిన మనోవికారాలకు ఆకారాలు కల్పించాడు. ఎలియట్ తన కావ్యంలో మొదటి ప్రపంచయుద్ధం యూరప్‌లో సృష్టించిన భౌతికమానసిక బీభత్సాన్ని చిత్రించాడు. చిత్రకారుడు తెగిన తలలొక చోట, తలలో కళ్ళొక చోట, కళ్ళలోని భయమొక చోట, కాళ్ళొక మూల, తెగిన వేళ్ళొక మూల, చిత్రించవచ్చు. పికాసో అలా చిత్రించలేదు. అలా చేస్తే అది కళ కాదు. వార్తాపత్రికలో ఫోటో అవుతుంది. అలాగే, ఎలియట్ యీ శకలాలను (a heap of broken images) వస్తువుగా కాక, విధానంలో పట్టుకున్నాడు. పాఠకుడూ అలానే పట్టుకోవలె. కావ్యాన్ని ఒక బాంబులా పేల్చి, ఆ పేలుడులో పడిన ముక్కలను ఏరుకోండి అనడం, కవికి అదో పైశాచిక ఆనందమా? కాదు, ఆ శకలాలను గుర్తించడంలో, వస్తువు అర్థంగా కాక అనుభవంగా అందుతుంది. అదీ ఆ విధానప్రయోజనం. ఈ శకలశిల్పానికి చాలా స్థూలమైన ఉదాహరణ, మనం వెనుక జెరోన్షన్‌లో చూచాం. మళ్ళీ చూద్దాం:

Here I am, an old man in a dry month,
Being read to by a boy, waiting for rain.

And the Jew squats on the window sill, the owner,
Spawned in some estaminet of Antwerp,
Blistered in Brussels, patched and peeled in London.
The goat coughs at night in the field overhead;
Rocks, moss, stonecrop, iron, merds.
The woman keeps the kitchen, makes tea,
Sneezes at evening, poking the peevish gutter.

ఇందులో మొదటి పాదంలో ఒక ముసలివాడు. పది పాదాల తరువాత, అతడు పొలంలో మేకగా కనిపిస్తాడు (The goat coughs at night). పదమూడో పాదంలో, అతడి భార్య అనుకోవాలి, ముసలిది కనిపిస్తుంది (The woman keeps the kitchen, makes tea, Sneezes at evening). మధ్యలో యుద్ధదృశ్యాలు, మూడు నగరాలు: ఆన్ట్‌వెర్ప్ (Antwerp), బ్రసెల్స్ (Brussels), లండన్ (London). ముసలి దంపతులకు మధ్య యింత దూరం కల్పించి విడదీయడంలో ఏ ప్రయోజనం ఉంది? ఒకచోట చెప్పేస్తే ‘అనగనగా ఒక ముసలాడు ముసలిది’ కథ అవుతుంది. (Rocks, moss, stonecrop, iron, merds.) ఇది అక్కడి బంజరుభూమి వర్ణన: the field overhead. మెర్డ్స్ (merds) పదానికి అర్థమేమిటని పాఠకులు యింకా జుట్టు పీక్కుంటున్నారు. పెంట కావచ్చు. అది పంటపొలం కాదు.) ఇప్పుడు ఆ యిద్దరూ ఒక జంట, కాని యిద్దరిదీ జంటలోని ఒంటరితనమే, విడి బ్రతుకు. అంతే కాదు, అతనినీ ఆమెనూ విడివిడిగా సృష్టిలోని ఏ జంటలోనైనా చూడవచ్చు. అంటే, రచనలోని ఈ విధానం వలన, విడిపోయిన ముక్కకు తనకొక ఉనికి విస్తృతి కలుగుతున్నాయి.

ఇది ఎలియట్ అనుసరించిన విధానానికి చాలా సాధారణమైన ఉదాహరణ. వేస్ట్‌ లాండ్‌లో యీ శిల్పం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ‘బరియల్ ఆఫ్ ది డెడ్’లో ఒక ప్రేమజంటలో యువతి అంటుంది:

You gave me hyacinths first a year ago;
They called me the hyacinth girl.

ఆమె ఒక అనాఘ్రాతపుష్పం. ఏ దివిలో విరిసిన పారిజాతమో! పట్టగలిగినన్ని పూలు చేతుల్లో నింపుకొని, తడిసిన జుట్టుతో, అతని ఎదురుగా నిలబడింది. అతడంటున్నాడు: అంత అందంతో ఉత్సాహంతో, వేల తీయని ఊహలతో నిండిన ప్రేమతో ఆమె తన ఎదురుగా నిలబడితే:

–Yet when we came back, late, from the Hyacinth garden,
Your arms full, and your hair wet, I could not
Speak, and my eyes failed, I was neither
Living nor dead, and I knew nothing,
Looking into the heart of light, the silence.

నాకు అప్పుడు మాట రాలేదు, కళ్ళకు ఏమీ కనిపించలేదు, అప్పుడు నేను బతికున్నానో చనిపోయానో తెలియదు, నాకేమీ తెలియలేదు – అంటున్నాడు. ఆమె దివ్యసౌందర్య దర్శనంలో, అతడు ఒక ప్రేమసమాధిస్థితి లోకి వెళ్ళిపోయాడు. ఆమె కనిపించడం లేదు, ఆమెను చూడడం లేదు. ఏం చూస్తున్నాడు? Looking into the heart of light, the silence. వీరు దాన్తె, బియాత్రీచెలు అనుకోవాలా (Vita Nuova)? లేక, యిదంతా మన కల్పనా? ఇద్దరూ ఒక గతసందర్భం గురించి మాట్లాడుతున్నారా? అతడి మాటలు ఎవరితో, ఏ ప్రశ్నకు సమాధానం? ‘ఆనాడు, నీవు ఎందుకు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయావు?’ అని ఆమె అడగలేదు. అడగని ఆమె ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడా?

అసలు వీరిద్దరూ ప్రేమజంట అనుకోవచ్చా? ఇది ఆ యిద్దరి సంభాషణ కాదేమో? ఎందుకంటే, అతడి మాటలు, ఆమెతో అన్నవి కాకపోవచ్చు. డెబ్భై పాదాల తరువాత ఒక స్త్రీ అడిగిన ప్రశ్నలకు సమాధానం కావచ్చు.

Speak to me. Why do you never speak. Speak.
“What are you thinking of? What thinking? What?
“I never know what you are thinking. Think.

ముందు సమాధానం, తరువాత ప్రశ్నలు, ఎక్కడో ఎప్పుడో ఎవరో అడిగినవి. అక్కడి అతని మాటలు యిక్కడి ప్రశ్నలకు సమాధానం కావచ్చు. రెండూ కావచ్చు. అంటే, ఆ సమాధానానికి, ఈ ప్రశ్నలకు కూడా, రెండు సందర్భాలు, రెండు ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయి. ఆ విధంగా అర్థవిస్తృతి. ఆ సమాధానం అనేక సందర్భాలలో అన్వయించదగినది. అలాగే, ఈ ప్రశ్నలు అనేక సందర్భాలలో అడిగేవే.

ఈ విధమైన సంవిధానంలో కవి ఏమి సాధిస్తున్నాడు? ప్రశ్న-సమాధానాల రెంటికీ పరస్పర సంబంధమే కాక, అదనంగా ఆ రెంటికీ విడి ఉనికి ఏర్పడుతుంది. ఆ సమాధానము ఆ ప్రశ్నలు ఒక్క సందర్భానికి పరిమితం కాక, సార్వత్రిక ప్రయోజనాన్ని సంపాదించుకొంటాయి. విరిగిన ముక్కలకు విస్తృతార్థం కలుగుతుంది.

వేస్ట్‌ లాండ్‌లో కవి అనుసరించిన ఈ విధానం పాఠకుడితో మొదట ఏ మాత్రము సహకరించదు. పదానికి పదానికి, పాదానికి పాదానికి, దృశ్యానికి దృశ్యానికి, సన్నివేశానికి సన్నివేశానికి మధ్య అతుకులు తొలగించాడు ఎలియట్. అతుకులు తొలగిన ఈ కావ్యశకలాలలో, వికలసమాజదర్శనం చేయమని కవి ఆశయం. అదే ఈ శిల్పప్రయోజనం. (A heap of broken images; These fragments I have shored against my ruins.) ఇది ఒక విధంగా, చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పే విధానంలోకి వొంపుకోడం. కాని, ఆధార ఆధేయాలు రెండూ ఒకటిగా ఆస్వాదించదగినవే, కోన్ ఐస్‌క్రీమ్ లాగా.

కవి అన్నవాడికి వేపకాయంత వెర్రి ఉంటుందంటారు. ఎలియట్‌కు కొంచెం ఎక్కువే ఉంది: …it is a commonplace that some forms of illness are extremely favorable, not only to religious illumination, but to artistic and literary composition. – Eliot on Pascal.)

ది బ్రదర్స్ కరమజవ్ (The Brothers Karamazov) రచయిత తలలోకి తొంగి చూడగలిగితే ఏం కనపడుతుంది? బుసలు కొట్టే పాముల పోట్లాట. దోస్తొయెవ్‌స్కీ (Dostoevsky) సృష్టించిన ముగ్గురు సోదరులలో, ఒకడు పిల్లవాడు, ఒకడు పిచ్చివాడు, ఒకడు పిశాచము. మహాకవి అంటే, ఈ మూడు కరగిన ముద్ద. వేస్ట్‌ లాండ్ రాసిన కవి కూడా యీ మూటి ముద్ద. ‘Hieronymo’s mad again’ అంటాడు ఎలియట్. ఎలియట్ గురించి ‘Dostoevsky’s mad again’ అనవచ్చు.

(సశేషం)