“ఈ మాట” సంపాదకులు “అమెరికాలో వరకట్నాలు” అన్నప్పుడు “రామేశ్వరం వచ్చినా శనేశ్వరం తప్పదన్నట్లు, ఈ దేశం వచ్చినా వీళ్ళకీధ్యాస పోలే”దని నవ్వుకున్నా. భావాలు, అలవాట్లూ ఎముకలకి పట్టే రోగాలన్నాడొక కవి ఇలాంటివాళ్ళని చూసేనేమో.
నా ఆలోచనల్ని ఛేదిస్తూ, “సుధీర్‌గారి అబ్బాయి పెళ్ళిట, శుభలేఖ పంపారు”అంటూ ఒక తళతళలాడే కార్డు చేతిలో పెట్టింది శచి. ఒక్కొక్క కార్డు తక్కువ లేకుండా పాతిక డాలర్లయినా చేస్తుంది. సుధీర్తో నాకున్న పరిచయం చాలా తక్కువ. ఆయినా పంపించాడంటే ఆశ్చర్యమే!
“ఈ మధ్య ఇండియానుంచి అడ్డమైనవాళ్ళూ వచ్చేస్తున్నారంటూ మనవాళ్ళు గింజుకుంటున్నారుగాని, ఇలాంటి సౌకర్యాలు పదేళ్ళ క్రితం కనీవినీ ఎరుగుదుమా? ఆగ్నిహోత్రం పెట్టి పెళ్ళి చేసి, అరిటాకుల్లో భోజనాలు పెడతారట..”
ఆవేశం వస్తే మా శచి జాతీయత ఉట్టిపడేలా మాట్లాడగలదు. “ఆన్నీ వస్తున్నాయిగాబట్టి వరకట్నాలు కూడా వస్తాయంటావా?”
మళ్ళీ “ఈ మాట” వాళ్ళ మాట గుర్తొచ్చింది నాకు. “సురేఖ చెప్పింది. పెళ్ళికూతురు కూడా డాక్టరేనట.ఆబ్బాయికి ముచ్చటగా లెక్సస్‌కారు, రోలెక్స్‌వాచీ, వజ్రాల ఉంగరం,…” లిస్టుపెద్దదిగానే ఉంది.
“ఇదంతా కట్నార్ధమేనా?” ప్రశ్నార్ధకమైన నా మొహం శచికి నచ్చినట్లులేదు. “కట్నమేమిటండీ? బూజు పట్టిన బుర్రా మీరూను. ముచ్చటగా ఇవన్నీ వాళ్ళు అడగకుండానే ఇస్తున్నారుట.” ఆప్పీల్లేదు ఫో అన్నట్లుచూసి లోపలికెళ్ళిపోయింది శచి.
మొదట డబ్బున్న వాళ్ళ మధ్య ఒక ముచ్చట లేదా వేడుకగా మొదలైన ఈ అలవాటుకొంతకాలానికి వరకట్నపిశాచమై సమాజాన్ని ఎన్ని చిత్రవధలు చేసిందీ వేరే చెప్పక్కర్లేదు. వరకట్నం అంటే కేవలం పెళ్ళిలో చేసే ఖర్చేకాదు; ఆ తర్వాత పండుగలూ, పబ్బాలూ, పురుళ్ళూ, పుణ్యాలూ అన్నీ.
సుధీర్‌కొడుక్కి ఆడపెళ్ళివారిచ్చేది చూస్తూంటే, వరకట్నం అమెరికాలో ఆరంభదశలోఉందా అనిపిస్తోంది.
ఇక్కడి పెళ్ళిళ్ళు ఏ దారులు తీస్తాయి? ఇక్కడ ఎలాంటి సమస్యలు పుడతాయి? ఆనిపించటం మొదలెట్టింది. వధూవరుల్లోఏ ఒక్కరు రెండవ తరం వారైనా (ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు), వాళ్ళ మీద తల్లిదండ్రుల ప్రభావం గట్టిగా లేకపోతే,వరకట్న సమస్యల్లాంటివి వస్తాయనుకోను. (ఏమో! డబ్బెవడికి
చేదు? ఆందులో, డబ్బును ప్రేమించే ఈ సమాజంలో పుట్టి పెరిగినవాళ్ళు ఇలాంటిఅవకాశాల్ని వదిలేస్తారని గ్యారంటీ ఏం లేదు. అయినా, బాగా ఆలోచిస్తారని నాకు నమ్మకం).
ఇక ఒకటవ తరం వాళ్ళ, ఇండియాలో వాళ్ళ, పెళ్ళిళ్ళ గురించి ఏమవుందోననిఊహించనక్కర్లేదు. తెలుపు, నలుపుల్లో వాళ్ళ రంగుల కలలు కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా పెళ్ళికొడుకు (అపెకొ) అన్నది, పెళ్ళివ్యవస్ఠనీ తల్లిదండ్రుల అవస్ఠనీ (నిజంగా చెప్పాలంటే, వరకట్న వ్యవస్ఠనే),మార్చేసింది.కొన్ని మార్పులు కొందరి మంచికే వచ్చాయనిపిస్తోంది.
మొన్న ఇండియా బజార్లో ఒకాయన చెపుతున్నాడు “డొనేషన్‌కట్టైనా సరే అని,ఒక అమ్మాయిని ఎంసీయ్యే, మరొక దాన్ని ఎంటెక్‌చదివించాను. ఏదో ఒకటి చదివించక తప్పదు కదా అని. కట్నాలక్కర్లేకుండా పెళ్ళిళ్ళయిపోయాయి” అంటూ.ఆంటే, కంప్యూటర్‌సైన్స్‌చదువే ఒక కట్నమనీ, అది ఉన్న పిల్లల్న్లి ఎగరేసుకు పోతున్నారనీ భావం.
ఇదివరకు డబ్బున్న పిల్లని చేసుకునేవారు,ఇప్పుడు కంప్యూటర్‌చదువున్న పిల్లని చేసుకుంటున్నారు. ఏదైనా రెడీమేడ్‌కావాలి. విషయంలో తేడా ఏమీ కనబడటల్లేదు. ఆయన ముఖం చూస్తే నాకొక వింతఅనుభూతి కలిగింది.పెద్ద మొత్తాన్ని గుర్రప్పందెంలో పెట్టక్కర్లేకుండా, వాయిదాల పద్ధతినిజాతి గుర్రాలమీద పందెం కాసే అవకాశం వచ్చినవాడిలా సంతోషపడిపోతున్నాడా ఆసామీ.
ఏది ఏమైనా కంప్యూటర్‌సైన్స్‌కి జోహార్! చాలామంది కోర్కెల్ని సులభంగాతీర్చింది. వరకట్నానికి కొత్త రూపం తెచ్చింది. వాయిదాల్లో వరుల్ని కొనే అవకాశంమధ్య తరగతికి ఇచ్చింది. ఇంకా ఒక చిన్న ప్రశ్న నన్ను తొల్చేస్తూంటే, ఆయనకివిన్నవించా, “అప్పర్‌మిడిల్‌క్లాస్‌వాళ్ళకి కష్టం కాక పోవచ్చు గాని, లోయర్‌మిడిల్‌క్లాసు వాళ్ళకి ఈ డొనేషన్‌ఇవ్వడం కష్టమే కదా!”అని. ఆ ఆసామీ నా వంక చూసి వేదాంతిలా నవ్వుతూ, “చూడండి మాష్టారూ! లక్ష కట్నమిచ్చేకన్న ఏభై వేలు డొనేషన్ బెటర్ అనుకుంటున్నారు పిల్లతల్లిదండ్రులు. అప్పరా లోయరా అన్నది కాదు ఇక్కడ చూడాల్సింది.
మన బాధ్యత గురించీ పిల్లల భవిష్యత్తు గురించీనూ” మాంఛి ఫోర్సైనకంఠం తో అన్నాడు పిల్లల తల్లిదండ్రుల సమాఖ్య ప్రెసిడెంటులా.
ఆహా! ఏమి వ్యవస్థ! ఏమి సౌకర్యాలు! ఏమి సౌలభ్యాలు! ఏమి ఉదారత! ఎంతటిదాతలు!
నిన్న ఉపేంద్ర వాళ్ళింట్లో ఒక యువకుడు ఉర్రూతలూగిపోతూ ప్రసంగిస్తున్నాడు.వాళ్ళ స్నేహితుడెవడో ఎందుకూ పనికిరాడనుకుంటున్న సమయంలో (బికాం చదివాడట), హైదరాబాద్‌చిరాగ్గల్లీలో (చిరాగ్‌ఆలి) ఓరకిల్‌చేసొచ్చి, ఫిఫ్టీఫైవ్‌కే జాబ్ కొట్టేసి, రెండేళ్ళల్లో హండ్రెడ్‌కే అయిపోయి, డాక్టరైన పిల్లనే తప్ప చేసుకోనని పట్టుబట్టి, గెలిచొచ్చిన వైనం చిత్రవిచిత్రంగా కథలా చెబుతున్నాడు.రెండు లక్షల
కట్నం కూడా కొట్టేశాట్ట. “పదేళ్ళా క్రితమ్‌బీకామ్‌గాన్కీ అస్సలేపోర్నీ ఇయ్యకున్రీ”అంటూ ఆయన పక్కాయన ఆశ్చర్యరసానికి అభినయం పట్టాడు. “ఔనండీ, దానికితోడుఎమ్బీబీయ్యస్ని పెళ్ళాడ్డం, అందునా కట్నం పుచ్చుకుని, అసంభవం అనుకునేవాళ్ళం”అంటూ పెద్దవాడిలా వాపోయాడు. బహుశః పదేళ్ళ క్రితం కేవలం లక్ష కట్నంతోనే(ఎందుకూ పనికిరాని?) బియ్యెస్సీతో జరిగి పోయిన తన పెళ్ళి విషయం తల్చుకుంటే నీరసం వచ్చినట్లుంది, భోజనంపై లంఘించాడు.
అతగాడే, భోజనానంతరం, వరకట్నాలు ఎందుకు పెరిగిపోతున్నాయి అన్న టాపిక్‌తనే తెచ్చి, తనే గుత్తాధిపత్యం పుచ్చుకుని చాలా విషయాలు చెప్పాడు. అన్నీ గుర్తులేవు కాని కొన్ని. గల్ఫులో డబ్బు సంపాదించిన వాళ్ళు ఇండియారాక తప్పదు. అందువల్ల, డబ్బు తెచ్చి ఇండియాలో పెడతారు. వాళ్ళవల్ల, ఇచ్చేవాళ్ళెక్కువై, పెళ్ళికొడుకులకి మార్కెట్‌పెరిగింది. ఆ కోవలో సంపాదించలేనివాళ్ళంతా డీలా పడిపోతున్న సమయంలో కంప్యూటర్ చదువులూ, అపెకోలు వాళ్ళని ఆదుకుంటున్నారు. ఒకసారి ఈ గడ్డ (అమెరికా)మీద కాలుపెడితే, గడ్డం పట్టుకుని బతిమాలినా వదలి రావాలని ఉండదు
వాళ్ళకి (వీడు తన్ని తగిలేస్తే తప్ప). అపెకొకి పిల్లనిస్తే ఒకేసారి ఖర్చు,ఆ తర్వాత వాడే అత్తమామలకి కానుకలు తెస్తాడు. పురుళ్ళూ, పుణ్యాలూ ఖర్చులుండవు.
ఇంకా చెప్పాలంటే, వాటి పేర పిల్లనిచ్చిన అత్తమామలకువిదేశయాన యోగం (అల్లుడి లేదా అమ్మాయి డబ్బుతో), పండగలకీ, పబ్బాలకీ సాధింపులుండవు.ఇవన్నీ కలబోసుకుని, పిల్ల తల్లితండ్రులు ఈ సంబంధాలకై తపించి, దొరికితేపులకించి పోతున్నారు. పైగా, ఇదో స్టాటస్‌సింబల్‌గూడాను. అదే, ఏ గల్ఫు వాడికో పిల్లనిస్తే, వాడేదోరోజుకి నెత్తికెక్కక మానడు. సద్దామ్‌హుస్సేన్‌మీద అమెరికావాడుబాంబులేసినప్పుడల్లా, డబ్బూ, దస్కం అంతా పోయి, వాళ్ళంతా అత్తమామలమీద వచ్చి వాలే ప్రమాదముంది. అపెకోల్తో ఈ ప్రమాదాలు తక్కువ. వచ్చినా రెండువారాలు మించి ఉండరు.
“మీ అమ్మాయిని కానీ కట్నం లేకుండా పెళ్ళి చేసుకుంటా. ఆమెరికా టికెట్‌ఖర్చు,వీసా ఖర్చు మాత్రం మీరు పెట్టుకోవాలి”అనే ధోరణి కొందరిది. “నేనెలాగూ వెళ్ళకమానను. ఉన్న నాలుగు రోజులూ ఎంజాయ్‌చేసి పోతాను. మీరుటికెట్‌కొన్ననాడే కాపురానికి వస్తుంది” అన్న సంజ్ఞా ఇది?
“మా అత్తారిచ్చిన కట్నమంతా పెట్టి మా ఆవిణ్ణి చదివిస్తున్నా, మరి వాళ్ళునాక్కావలిసింది చదివించలేదుగా” అనేవాళ్ళు కొందరు.
పెళ్ళంటే ప్రేమ, బాధ్యత ఒకరిదొకరు పంచుకోవడం అనే ఇంగితం లేనివాళ్ళకిపెళ్ళెందుకు?
అన్నిటినీ వదిలి, ఇంటి పేరునీ, మనసునీ మార్చుకుని, మలుచుకుని తనతోవద్దామనుకునే సహచరిని, సాదరంగా, తనంతట తానుగా తీసుకుని వెళ్ళలేని వాడికి ఆ సాహచర్యాన్ని అందుకునే అర్హత ఉందా?
అందరూ అలా లేరు. ఎందరో యువతీయువకులు సభ్యతాసంస్కారాలకి పెద్ద పీటవేసి, జీవిత భాగస్వామిని ఎన్నుకొని, కష్టసుఖాల్ని సమంగా పంచుకుంటూ, ప్రవాస జీవితాల్ని గడుపుతున్నారు ఈ రోజుల్లో. వాళ్ళందరికినా హృదయపూర్వకమైన అభినందనలు.
నా ఆలోచనల్ని ఆపమంటూ ఫోను విన్నపం చేసింది. ఇండియానించి కాల్. ఆవతలపక్క పెళ్ళిళ్ళ పేరయ్య మాట్లాడుతున్నాడు “అయ్యా! మీ అమ్మాయి ఇప్పుడిప్పుడే ఇండియాకి రాదంటున్నారు. అమ్మాయి టెన్నిస్‌ఆడుతున్న విడియో క్లిప్పింగ్‌ఒకటి ఇంటర్నెట్లో పెట్టారంటే పెళ్ళికొడుకు చూస్తాట్ట…” ఇక వినలేక ఫోను కట్‌చేసేసాను.
పెళ్ళి వ్యాపారం కాదనుకునే వారందరికీ ఇది అంకితం