అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే


జిమ్ గ్రే

ఎవరీ జిమ్ గ్రే? తెలుగు వాళ్ళకీ ఆయనకీ వున్న సంబంధం ఏమిటి? అని అడిగితే తిన్నగా ఏమీ లేదనే చెప్పాలి. కాని, మీరెప్పుడైనా ఏ.టి.ఎం. (Automatic Teller Machine) నుండి డబ్బులు తీసుకున్నారా? బట్టలషాపులోగానీ, కూరగాయల దుకాణంలో గానీ క్రెడిట్‌ కార్డ్‌ వాడారా? మీ ఇంట్లో కూర్చొని అమెజాన్‌.కాం లో పుస్తకమేదన్నా కొన్నారా? నాలుగు క్లిక్కులతో ప్రపంచం చుట్టూ తిరిగొచ్చే ప్రయాణానికి ప్లాన్‌ చేశారా? అయితే ఒక క్షణం ఆగండి. పాతికేళ్ళ క్రితం ఇవన్నీ ఇంత సులభంగా చేసేవాళ్ళా? ఈ సౌకర్యాల వెనక వున్న సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి? దానిని సగటు మనిషికి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసిన వాళ్ళెవరో తెలుసుకోవాలని కుతూహలంగా లేదూ? వాళ్ళలో ఎందరో మహానుభావులు – అందరిలో ఓ మహనీయుడు – జిమ్ గ్రే [1] (Jim Gray) – ఆయన్ని తెలుగు వాళ్ళకి పరిచయం చెయ్యాలన్నదే నా ఈ వ్యాసం ఉద్దేశం.

Transaction Processing

“ఈ రాణి ప్రేమ పురాణం,
ఆ ముట్టడికైన ఖర్చులూ,
మతలబులూ, కైఫీయతులూ,
ఇవి కావోయ్ చరిత్రసారం.

చారిత్రక విభాతసంధ్యల
మానవకథ వికాసమెట్టిది?
ఏ దేశం ఏ కాలంలో
సాధించినదే పరమార్థం?”

అంటూ శ్రీశ్రీ చిరకాలం నిలిచే ఓ గీతం, “దేశచరిత్రలు,” రాశాడు. కాని, చరిత్రలో జరిగిన ఒక చిత్రమేమిటంటే, మానవపరిణామంలో ఓ గొప్ప మైలురాయి అనదగ్గది – “లిపి” – దీన్ని ఆరువేల సంవత్సరాల క్రితం, సుమేరియన్‌లు కనిపెట్టినది, కవిత్వం రాయడానికో మరో పరమార్థానికో కాదు. రాణీగారి కెన్ని నగలున్నాయీ, రాజుగారికి రాబడెంత లాంటి జమాఖర్చులకే! కాబట్టి పద్దులు రాసేవాళ్ళని చిన్నచూపు చూడకండి.

ఆకాలంలో లావాదేవీలన్నీ మట్టి పలక మీద చిరస్థాయిగా చెక్కేవాళ్ళు. గత ఆరువేల సంవత్సరాలుగా ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ వచ్చింది. మట్టి పలకల స్థానంలో ఆకులు, చర్మం, తర్వాత కాగితం వాడేవాళ్ళు. దాదాపు వంద సంవత్సరాల క్రితం హెర్మన్ హాలెరిత్ (Herman Hollerith) అనే అతను అమెరికా జనాభా లెక్కల కోసం రంధ్రాలున్న కార్డులని (punched cards) ఉపయోగించడంతో కంప్యూటర్లని లావాదేవీలకి వాడటానికి అంకురార్పణ జరిగింది. ఇప్పుడు చిన్న చిన్న ఆఫీసుల నుండి పెద్ద పెద్ద కంపెనీలు, గవర్నమెంటుల దాకా కంప్యూటర్లు లేకుండా ఏపనీ ఒక్క అడుగు కూడా సాగదు. పద్దులు రాయడానికి మొదలెట్టి ఇప్పుడు ఫొటోలు, పాటలు, సినిమాలు, మ్యాపులు అన్నిటికీ కంప్యూటర్లని వాడుతున్నాం. దీనికంతటికీ వెనుక గ్రే చేసిన కృషి ఎంతో ఉంది.

చాలా మందికి అనుభవం వున్న ఏ.టి.ఎం. ని తీసుకుందాం. బాంక్‌ తో లావాదేవీలు (transactions) జరపడానికి ఏ.టి.ఎం. ని వాడతాం. ఈ లావాదేవీలు కొన్ని ధర్మాలకు కట్టుబడి ఉండాలి. ఈ ధర్మాలను ఇంగ్లీషులో ముద్దుగా ACID properties అని అంటారు.

A అంటే Atomicity = అవిభాజ్యత
C అంటే Consistency = నియతత్వత (ఒకే క్రమమైన నియమాలను పాటించేది)
I అంటే Isolation = వివిక్తత (ఒకదానికొకటి వేరుగా ఉండాలి)
D అంటే Durability = మన్నిక లేదా చిరస్థాయిత

ఈ ధర్మాల ప్రాముఖ్యత ఏమిటో తెలపడానికి ఈ ఉదాహరణతో ప్రయత్నిస్తాను: నాకొక బాంక్ అకౌంట్ ఉంది. దాంట్లో వెయ్యి డాలర్లు ఉన్నాయి. ఓ వంద డాలర్లు తీసుకోడానికి ఎ.టి.ఎం. కి వెళ్ళాను. ఈ లావాదేవీ అవిభాజ్యం అయినా, దీంట్లో ఈ క్రింది అంచెలు లేదా స్టెప్పులు ఉన్నాయి:

  1. లావాదేవీ మొదలు పెట్టాలి.
  2. అక్కౌంట్‌లో డబ్బులెంత ఉన్నాయో చూడాలి. దీనిని x అందాం.
  3. అక్కౌంట్‌ బేలన్స్‌ని x-100 గా మార్చాలి.
  4. బాంకు బేలన్స్‌ నుండి వంద డాలర్లు తీసివెయ్యాలి.
  5. నాకు వంద డాలర్లు ఇవ్వాలి.
  6. లావాదేవీ పూర్తి చెయ్యాలి.

పై లావాదేవీలోని ఆరు అంచెలూ జరగాలి, లేదా ఏ ఒక్కటీ జరగకూడదు. అటు ఇటూ కాకుండా, కొన్ని మాత్రమే చేస్తే ప్రమాదమవుతుంది. మూడో మెట్టు దాటి, నాలుగో దాని దగ్గరకొచ్చేటప్పటికి కరెంటు పోయి కంప్యూటర్ ఆగిపోయిందనుకోండి. నా అక్కౌంట్‌లోనుంచి డబ్బులు తీసుకున్నారు కాని నాకు డబ్బులివ్వలేదు! అలా జరగకుండా ఉండటానికి లావాదేవీలనెప్పుడూ కూడా అవిభాజ్యంగా నిర్వర్తించాలి. దీనినే అవిభాజ్యత (Atomicity) అంటారు.

బ్యాంకులో అందరి అక్కౌంట్ల బేలన్స్‌ కలిపితే ఎంత డబ్బు ఉందో అది బ్యాంకు బేలన్స్‌కి సమానంగా ఉండాలి. ఇది ప్రతి లావాదేవీకి ముందరా పూర్తయింతర్వాతా కచ్చితంగా సరిపోవాలి. ఈ క్రమం తప్పకపోకుండా నియతంగా ఉండే ధర్మాన్ని నియతత్వత (Consistency) అంటారు.

నేను డబ్బులు తీసుకుంటున్నప్పుడే, వేరే బజార్లో, మా ఆవిడ గూడా డబ్బు తీసుకుంటుందనుకోండి. మేమిద్దరం వెయ్యి డాలర్లు ఉన్నాయని మొదలెడితే, రెండు లావాదేవీలు ఒకదానితో ఒకటి కలిసిపోతే చాలా తేడాలు రావొచ్చు. ఉదాహరణకి, మా అక్కౌంట్‌లో వెయ్యి డాలర్లు ఉన్నాయి. నేను వంద డాలర్లు తీసుకోవాలనీ, మా ఆవిడ రెండొందలు (ఆవిడకి “taste” ఎక్కువ) తీసుకోవాలనీ వేరే వేరే ఏ.టి.ఎం.ల దగ్గరికి వెళ్ళామనుకోండి. నా లావాదేవీ రెండో అంచె ముగించి మూడోది మొదలెట్టకముందే, మా ఆవిడ లావాదేవీ మొదలయిందనుకోండి. ఈ రెండు ఏ.టి.ఎం.లూ ఒకే కంప్యూటర్ కి కనెక్ట్ అయి ఉన్నాయనుకోండి. ఆవిడ లావాదేవీ పూర్తి అయింతర్వాత నా లావాదేవీ మూడో మెట్టుకొచ్చి బేలన్స్‌ని 900 డాలర్లు గా చేస్తుంది. ముందర వెయ్యి డాలర్లు ఉన్న అక్కౌంట్‌లో భార్యాభర్తలం మూడొందలు తీసుకున్నా, చివరకి మా అక్కౌంట్‌లో 900 డాలర్లు మిగిలాయన్నమాట! అలా చేస్తే బాంక్‌ కాస్తా దివాళా తీస్తుంది.

ఇలాంటి అవకతవకలు రాకుండా ఉండాలంటే, మా ఇద్దరి లావాదేవీలు ఒకదాని తర్వాత ఒకటి జరగాలి, ఒకదానితో ఒకటి కలిసి కాదు. కాని పెద్ద పెద్ద బ్యాంకుల్లో కొన్ని లక్షల మందికి అక్కౌంట్లు ఉంటాయి. వాళ్ళంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బిజినెస్ చేస్తే ఇక తెల్లారినట్లే. దీనికి సూత్రం ఏమిటంటే, లావాదేవీలు ముడిపడి వున్నా, చివరకి ఫలితం మాత్రం వేరువేరుగా ఉంటే ఎలా ఉంటుందో అలా వచ్చేటట్లు చెయ్యాలి. దీనినే ఏకాంత ధర్మం లేదా వివిక్తత (Isolation) అంటారు.

మట్టిపలక మీద చెక్కినది చెరిగిపోదు. కాని కంప్యూటర్ మెమరీలో ఉన్నది కరెంటు పోతే చెరిగిపోతుంది. మరి మన లావాదేవీ పూర్తయిన తర్వాత మన అక్కౌంట్‌కి సంబంధించిన సమాచారం తాత్కాలికమైన మెమరీలో ఉంటే, అప్పుడు కరెంటు పోతే కొంపలు మునిగిపోతాయి. చిరస్థాయిగా ఉండేచోట రికార్డు చెయ్యాలి. దీనిని మన్నిక లేదా చిరస్థాయిత (Durability) అంటారు.

ఓస్! ఈ మాత్రానికేనా ఈ ఇంజనీర్లు గొప్పలు పోతారనిపించవచ్చు. కాని ఈ లావాదేవీల భావనను (Transaction conept), దానికుండాల్సిన ధర్మాలను జిమ్ గ్రే సిద్ధాంతపరంగా నిర్వచించిన తర్వాతనే వాటిని సమర్థవంతంగా తప్పులు లేకుండా ఆచరణలో పెట్టగలిగేరు. దీనికి, చాలామంది కొన్ని దశాబ్దాలు కృషి చెయ్యడం మూలానే, ఇప్పుడు మనమందరం వాటిని నమ్మకంగా సులభంగా వాడుకోగలుగుతున్నాం.

ఈ మౌలికమైన పనిని గుర్తించే జిమ్ గ్రే కి కంప్యూటర్ సైన్స్‌లో నోబెల్ ప్రైజ్ లాంటిదయిన టూరింగ్ అవార్డ్ (Turing Award) ని 1998లో ఇచ్చారు.

TerraServer

చిన్న కంప్యూటర్‌లు చవకేగాని పెద్ద కంప్యూటర్లు చాలా ఖరీదు గా ఉంటాయి. గ్రే చాలా కాలంగా అనేక చిన్న కంప్యూటర్లని కలిపితే ఓ పేద్ద కంప్యూటర్ కన్నా శక్తివంతమైనది చెయ్యవచ్చని చెప్పేవాడు. “బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ!” అని మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుందా? ఆ సామెత దీనికి పనికొస్తుంది. చిన్న కంప్యూటర్ ఖరీదు వెయ్యి డాలర్లనుకోండి. అందుకు వంద రెట్లు శక్తివంతమైనది కంప్యూటరు, లక్ష కాదు పది లక్షల డాలర్లవుతుంది. కాని ఆ పది లక్షల డాలర్లతో మనం వెయ్యి చిన్న కంప్యూటర్లని కొనొచ్చు. వాటిని కలిపి పనిచేయిస్తే అది పది లక్ష డాలర్ల పెద్ద కంప్యూటర్ కన్న పది రెట్లు శక్తివంతంగా ఉంటుంది!

అంతంత కంప్యూటర్లు ఎవరిక్కావాలి అనే సందేహం రావొచ్చు. కాని మీరు గూగుల్ కెళ్ళి వెబ్ మీద దేనికోసమైనా వెతికితే అందుకు ఎంతో శక్తివున్న కంప్యూటర్లు కావాలి. కొన్ని మిలియన్ల డాలర్లు పెట్టినా అంత శక్తివంతమయిన కంప్యూటర్ దొరకదు. అలాంటి పనులకి అనేక వేల చిన్న కంప్యూటర్లను కలిపి వాడతారు.

దానికేమన్నా ప్రయోగం చేసి చూపెడదాం అని జిమ్ గ్రే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాడు – 1990 దశాబ్దపు చివర్లో. అదేమిటంటే, అమెరికాలోని పట్టణాల ఫొటోలన్నీ సేకరించి ఈ చిన్న కంప్యూటర్ల సమూహంలో ఉంచి ఆ ఫోటోలని అందరికీ అందుబాటులో ఉంచడం. మీ ఇల్లు, పార్కు కూడా మీ స్నేహితులు ఎక్కడ నుంచయినా చూడొచ్చన్న మాట. భూమికి సంబంధించిన ఫొటోలు కనుక “టెరా” (Terra – సంస్కృతంలోని “ధరా” దీనికి సోదర పదం) అనే పేరు సముచితంగా ఉంది. అంతే కాక, “టెరా” (Tera) అంటే కంప్యూటర్ భాషలో సమాచారం సైజు చెప్పేది కూడాను – కిలో అంటే వెయ్యి, మెగా అంటే అంతకు వెయ్యి రెట్లు (మిలియను), గిగా అంటే అంతకు వెయ్యి రెట్లు (బిలియను), టెరా అంటే అందుకు వెయ్యి రెట్లు (ట్రిలియను) – టెరాబైట్లు అంటే లక్ష కోట్ల బైట్లన్న మాట. అప్పట్లో టెరాబైట్ల సైజున్న సమాచారం తక్కువ.

ఈ టెక్నాలజీ వృద్ధిచెంది ఇప్పుడు Google Earth, Virtual Earth రూపాల్లో ఎంతోమంది వాడుకోగలుగుతున్నారు.

The World Wide Telescope

“అమలిన తారకా సముదయంబుల నెన్నను, …
… విధాతృన కైనను నేరఁబోలునే.”
— “మహాభారతం, ఆదిపర్వం, ప్రథమాశ్వాసం,” నన్నయ్య.

నక్షత్రాలని లెక్కపెట్టడం దేవుడి తరం కూడా కాదన్నాడు నన్నయ్య. తన కవితలు “శతకోటి నక్షత్రాల పాటలు” అన్నాడు శ్రీశ్రీ. కాని చంద్రుడు లేని రాత్రి మబ్బులు పట్టని ఆకాశం కేసి చూడండి, ఎన్ని నక్షత్రాలు కనిపిస్తాయో. మహా వుంటే రెండు వేలకి మించి ఉండవు! “రవి గాంచనిది కవి గాంచగలడు” అని సైంటిస్టులు సమాధానపడి ఉండలేరు.

క్రీ.పూ. రెండవ శతాబ్దిలో హిపార్కస్ (Hipparchus) అనే పేరున్న గ్రీకు ఖగోళ శాస్త్రజ్ఞుడు మొదటిసారిగా కంటికి కనబడే నక్షత్రాల జాబితాను ఒక కేటలాగ్ లాగా తయారుచేశాడు – ఏ నక్షత్రం ఏస్థానంలో ఉన్నది అని. ఆపై ఆ వివరాలతో ఆయన ఆకాశ పటాన్ని (map of the sky) చిత్రించాడు. ప్రతి సంవత్సరమూ వసంత ఋతువు మొదటి రోజు నక్షత్రాలను చూసి వాటి స్థానాలను రికార్డు చేశాడు. కొన్నేళ్ళ తర్వాత వాటిని పరిశీలిస్తే ఓ కొత్త విషయం బయటపడింది. అదేమిటంటే – నక్షత్రాలు అంతకుముందు సంవత్సరంలో ఉన్న చోటు కంటె కాస్త కదిలి ఉన్నాయని! అందుక్కారణం నక్షత్రాలు కదలడం కాదు – భూమి ఇరుసు స్థిరంగా ఒకే దిశగా ఉండక చాలా నెమ్మదిగా దిశ మారూతూండటం మూలాన! అది అప్పట్లో చరిత్రాత్మకమైన విషయం. ఆ సత్యం గ్రహించడం అతనికి ఆకాశ పటం లేకుండా సాధ్యం అయ్యేది కాదు.

మరో 1700 సంవత్సరాల దాకా అంత పద్ధతిగా ఎవరూ ఆకాశాన్ని సర్వే చెయ్యలేదు. క్రీ. శ. పదహారో శతాబ్దంలో టైకో బ్రాహి (Tyco Brahe) అనే డేనిష్ దేశస్థుడు నావికులు వాడే పరికరం సెక్స్‌టంట్ (sextant) తో అనేక సంవత్సరాలు ప్రయాసపడి, ఆకాశాన్ని సర్వే చేశాడు. అతను చనిపోయిన తర్వాత అతని శిష్యుడు యోహానస్ కెప్లర్ (Johannes Kepler) ఆ సర్వే ఆధారంగా, భూమి తోపాటు మిగిలిన గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ దీర్ఘవృత్త కక్ష్యలో (elliptical orbit) తిరుగుతున్నాయని నిరూపించాడు. అది అప్పట్లో విప్లవాత్మకమైన విషయం. బ్రాహి తయారుచేసిన ఆకాశ పటం లేకుండా కెప్లర్ ఈ సత్యాన్ని కనుక్కోగలిగే వాడు కాదు.

కెప్లర్ కి సమకాలికుడైన గెలీలియో, టెలిస్కోపులను బాగా వాడి అనేక కొత్త విషయాలు కనుగొన్నాడు. చంద్రుడి ఉపరితలం అందమైన ఆడవాళ్ళ ముఖంలా నున్నగా లేదనీ, దానిపై కొండలూ గుంటలూ ఉన్నాయని చూపెట్టాడు. తర్వాత మరో మూడు వందల ఏళ్ళదాకా శక్తివంతమైన టెలిస్కోపులతో ఎన్నో కొత్త విషయాలని కనుగొన్నారు. కాని మన పాలపుంత (The Milky Way) ఒక్కటే విశ్వంలో ఉన్నదనీ కంట్లో నలుసులాగే కనబడే మిగిలినవి మన పాలపుంతలోనివే మరేవో వస్తువులని అనుకున్నారు.

1917లో మౌంట్ విల్సన్ (Mount Wilson) కాలిఫోర్నియాలో నిర్మించిన అతిపెద్ద టెలిస్కోప్ ద్వారా సైంటిస్టులు మరో వింత కనుగొన్నారు. అదేమిటంటే ఆ కంట్లో నలుసులాగ వున్నవి కూడా మన పాలపుంత లాంటి గెలాక్సీలే! అవి కొన్ని మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అలాంటివి విశ్వంలో ఊహించలేనన్ని ఉన్నాయి. అంటే విశ్వంలో మన స్థానమే కాదు, మన గెలాక్సీ అంతా కలిపినా కంటిలో నలుసంతది కూడా కాదన్నమాట! శ్రీశ్రీ అన్న శతకోటి నక్షత్రాల కన్నా కొన్ని వేల కోట్ల రెట్లు నక్షత్రాలున్నాయన్న మాట!

మరో పదేళ్ళకి, 1924లో, ఎడ్విన్ హబుల్ (Edwin Hubble) అనే శాస్తజ్ఞుడు, మౌంట్ విల్సన్ టెలిస్కోపుతో మరో ఆకాశపటం తయారుచేశాడు. దీనిద్వారా ఆయన ఏం కనుక్కున్నాడంటే, మన విశ్వం స్థిరంగా లేదు, విస్తరిస్తూ ఉందని. ఇది అప్పటిదాకా ఎవరూ ఊహించలేదు కదా, ఐన్‌స్టైన్ లాంటి గొప్ప శాస్త్రజ్ఞులు కూడా తమ సూత్రాలను విశ్వం స్థిరంగా ఉందన్న తప్పుడు అభిప్రాయానికి అనుకూలంగా “సరి” చేశారు! హబుల్ టెలిస్కోపుతో చేసిన ప్రయోగాలతో విశ్వం విస్తరిస్తోందనీ, గెలాక్సీలన్నీ ఒకదానినుండి మరొకటి దూరంగా పరిగెడుతున్నాయనీ కనుగొనడంతో ఖగోళ శాస్త్రంలో ఓ నూతనాధ్యాయం మొదలయింది. ఇదంతా జరిగి వంద ఏళ్ళు కూడా కాలేదు.

ఈ కథంతా [2] ఎందుకు చెప్తున్నానంటే, గత రెండున్నర వేల ఏళ్ళుగా ఆకాశాన్ని సర్వే చేసి వేసిన ఆకాశపటాల వల్ల మనకి విశ్వస్వరూపం గురించిన ఎన్నో అపోహలు తొలిగిపోయాయి. ఇంకా తెలియవలసినవి ఎన్నో వున్నాయి. ఈ సర్వే చెయ్యడానికి ఉపయోగించే పరికరాల నాణ్యత బాగా పెరగడం మూలానా ఎంతో సమాచారాన్ని సేకరిస్తున్నాం. నాలుగయిదు రాత్రుళ్ళు ఆకాశాన్ని సర్వే చేసి ఈ టెలిస్కోపులు కొన్ని టెరాబైట్ల సమాచారాన్ని తీసుకురాగలవు. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (Library of Congress) లోని కొన్ని మిలియన్‌ల పుస్తకాలనన్నిటినీ కలిపితే 15 టెరాబైట్లు ఉండొచ్చు. మరి ఇంత సమాచారాన్ని ఏ సైంటిస్టూ స్వయానా పరిశీలించడానికి అలువు కాదు.

జాన్స్‌ హాప్కిన్స్ యూనివర్సిటీ కి చెందిన అలెక్స్ జాలై (Alex Szalay) అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు దీనికి మార్గమేమిటా అని ఆలోచిస్తుంటే, ఆయనకి కుటుంబ స్నేహితులెవరో జిమ్ గ్రే ని పరిచయం చేశారు – 2000 సంవత్సర ప్రాంతంలో. అప్పుడు గ్రే భూమి నుండి తన దృష్టి ఆకాశం వైపు మరల్చాడు.

ఎన్నో ఏళ్ళుగా వ్యాపార రంగంలో ఎదురైన కష్టమైన కంప్యూటర్ సమస్యలని పరిశోధించిన గ్రే ఆ అనుభవాన్ని శాస్త్రీయ రంగంలో ఉపయోగించడానికి ప్రయత్నించాడు. అంత పెద్ద సైజులో ఉన్న సమాచారాన్ని ఎలా సేకరించాలి, దాచాలి, దాని గురించి అడిగే ప్రశ్నలకి త్వరత్వరగా సమాధానాలెలా చెప్పాలి అనే వాటి మీద గ్రే ఖగోళ శాస్త్రజ్ఞులతో కలిసి ఎంతగానో పనిచేశాడు.

ఇప్పుడు శాస్త్రజ్ఞులు “ఉపరితలం కన్నా మధ్యలో నీలంగా ఉండే నక్షత్ర సముదాయాలేవి? “, “బాగా ఎర్రగా ఉన్న సముదాయాలేవి?” లాంటి ప్రశ్నలు వేస్తే, కంప్యూటర్లు ఆ టెరాబైట్ల సమాచారంలో వెతికి సమాధానాలు ఇవ్వగలవు. ఇంతకుముందు వీలుకాని విశ్లేషణ ఇవాళ గ్రే పని వలన సాధ్యమవుతోంది. ఇప్పటికే దీని మూలంగా గ్రహాలకన్నా చాలా పెద్దవిగానూ నక్షత్రాల్లా కన్నా చాలా చిన్నవిగానూ ఉండి, కాంతి ప్రసరించకపోవడం వల్ల కనుక్కోడానికి కష్టంగా ఉండే కపిల కుబ్జాల (Brown Dwarfs) గురించి, కాళ ద్రవ్యరాశి (Dark Matter) మొదలైన వాటి గురించి ఎంతో విలువైన కొత్త విషయాలు కనుక్కొన్నారు.

దీనివల జరిగిన ముఖ్యమైన మరో ఉపయోగమేమిటంటే, ఈ ఖగోళశాస్త్ర సమాచారమంతానూ మన ఇంట్లో ఉండే కంప్యూటర్ల నుంచే విశ్లేషించడానికి వీలుకావడం. దీంట్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ ఇంట్లో నుంచే పెద్ద పెద్ద శక్తివంతమైన టెలిస్కోపులతో పనిచేసేవిధంగా చెయ్యచ్చన్న మాట. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎండయినా వానయినా, పగలయినా రాత్రయినా, మీరు బెడ్‌రూమ్ లో ఉన్నా మీ పరిశోధనను కొనసాగించవచ్చు.

దీనిని జిమ్ గ్రే రాబోయే తరం గణనశాస్త్రరంగాలకు (Computational Sciences) నాంది అన్నాడు. కొన్ని వేల సంవత్సరాలుగా మానవుడి సత్యాన్వేషణ సిద్ధాంత విధానాల (Theoretical Sciences) ద్వారాను, ప్రయోగ విధానాల ద్వారానూ (Empirical Sciences) జరిగింది. ఇప్పుడు మూడో విభాగం, గణనశాస్త్రం అనేది విప్లవాత్మకమైన మార్పుల్ని తీసుకురాబోతోంది – ఖగోళశాస్త్రమే కాక, జన్యు శాస్త్రము, వాతావరణ శాస్త్రము, ఆర్థిక శాస్త్రాల్లో కూడా, కంప్యూటర్లని ఉపయోగించి గడ్డివాములో సూదిమొనని కనుక్కొనే విధంగా మానవులకి ఇంతకుముందు వీలుకాని వెన్నో తెలుసుకోవచ్చు.

A Scholarly Life

నేను ఇండియాలో చదువుకునేటప్పుడు (1970,80 ప్రాంతాల్లో) కంప్యూటర్లు ఐ.ఐ.టి. లలో తప్ప పెద్ద పెద్ద కాలేజీలలో కూడా ఉండేవి కాదు. ఐ.ఐ.టి.లలో కూడా కంప్యూటర్ సైన్స్ పుస్తకాలు గాని, పేపర్లు గాని దొరకడం చాలా కష్టంగా ఉండేది. నేను అమెరికాలో 1985 ప్రాంతంలో యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు, “Notes on Database Operating Systems,” అని జిమ్ గ్రే మరి కొందరు కలిసి ఐ.బి.ఎమ్ (IBM) లో వున్నప్పుడు రాసిన ఒక టెక్నికల్ రిపోర్టు పంపించమని ఐ.బి.ఎమ్ కి ఉత్తరం రాస్తే, వారం రోజుల్లో వాళ్ళు అది పంపారు – వంద పేజీల రిపోర్టు, పోస్టల్ ఖర్చులు కూడా అడగకుండా! అది 1978లో రాసినది. అప్పట్లో డేటాబేస్ శాస్త్రం ఇంకా శైశవ స్థాయిలోనే ఉంది.

ఆ తర్వాత 1993లో, ఆ రిపోర్టుని విస్తరించి, “Transaction Processing: Concepts and Techniques,” అన్న పేరిట ఆండ్రేయస్ రాయిటర్ (Andreas Reuter) తో కలిసి గ్రే మా రంగంలో బైబిల్ అనదగ్గ పుస్తకాన్ని ప్రచురించారు. దాదాపు 1100 పేజీలతో ఇది ఒక ఉద్గ్రంథం. గ్రేలో ఉన్న ఓ గొప్ప సుగుణం ఏమిటంటే ఆయన శాస్త్రజ్ఞులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు అందరితోటీ మంచి సంబంధాలు కలిగి ఉండటమే కాక ఎవరికి కావలసిన సలహా వాళ్ళకి తగ్గట్టుగా ఇవ్వడం. శాస్త్రీయ పరంగా ఆయన రాసేదాంట్లో pie in the sky లాంటి భావాల కన్నా ఇంజనీర్లకి నిత్యజీవితంలో పనికొచ్చేవి ఎక్కువగా ఉంటాయి.

తన జీవితాన్ని “స్కాలర్‌లీ లైఫ్” గా అభివర్ణించుకున్న గ్రే, స్కాలర్ అంటే, ధ్యానం, ఉపదేశం, సంఘ సేవ (meditation, teaching, service) లకి జీవితాన్ని అర్పించిన వాడని నిర్వచించుకున్నాడు. నిత్య పరిశోధన, ప్రపంచమంతటా లెక్చర్లిస్తూ అనేక యూనివర్సిటీలతో సంబంధాలు కలిగి ఉండి, గవర్నమెంటు సంస్థల్లో సభ్యుడిగా ఉండి సమాజ సేవ చెయ్యడం – అదీ గ్రే జీవితం. అందువలన గ్రే అంటే బహుశా మరే కంప్యూటర్ శాస్త్రజ్ఞుడిమీదా లేనంత అభిమానం ఉంది కంప్యూటర్ ఇంజనీర్లకి.

యువతీ యువకులకి జీవితంలో పైకి రావడానికి ఏమైనా సలహా ఇస్తారా అని అడిగితే, గ్రే “చేసే పని మీద వ్యామోహం ఉండాలి. అప్పుడు జీవితంలో ఆనందమూ, పరిపూర్ణత్వమూ ఉంటాయ్. అది లేనప్పుడు జీవితం శూన్యం. కాబట్టి నీ మనసుని కట్టిపడేసేదో తెలుసుకో. నువు చేస్తున్న పనిలో నీకు ఆసక్తి లేకపోతే, అది తొందరగా విడిచిపెట్టి నీమనసుకి దగ్గరయినది వెతుక్కో” అని సమాధానం చెప్పాడు.

ఆయనతో పని చేసిన వాళ్ళందరికీ ఆయన నిర్విరామ శ్రమ ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రపంచంలోని ప్రముఖ ఖగోళశాస్త్రజ్ఞుడికి ఎంత వేగిరంగా సమాధానం చెప్తాడో ఓ విద్యార్థికి గాని, ఓ జూనియర్ ఇంజనీరుకి గాని అదే శ్రద్ధతో చెప్తాడు. శుక్రవారం సాయంత్రం మెయిల్ పంపితే రాత్రికి ఇంటికి వచ్చేటప్పటికి సమాధానం ఇచ్చి ఉంటాడు. మరలా మనం మెయిల్ పంపితే శనివారం ఉదయానికల్లా సమాధానం వచ్చి ఉంటుంది!

ఎప్పుడు రిటైర్‌ అవుతావన్న ప్రశ్నకి, రిటైర్‌ అయే ప్రసక్తి లేదు, ఇక్కడి వాళ్ళు బయట పడేస్తే తప్ప అని సమాధానం!

జిమ్ గ్రే తో లంచ్

మా కంపెనీలో ప్రతి సంవత్సరం చారిటీ డ్రైవ్ ఒకటి చేస్తారు – సెప్టెంబరు నుండి నవంబరు దాకా. ఉద్యోగస్తులు తమకు తోచిన విరాళమేదో ఇస్తారు – తమకి తోచిన సంస్థకి. ప్రోత్సాహించడానికి రకరకాల ఆశలు పెడతారు. బిల్ గేట్స్ ఇల్లు చూడటానికి వేలం పాట లాంటిది వేస్తారు. ఎవరు ఎక్కువ చెప్తే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు ఒక సాయంత్రం బిల్ గేట్స్ భవనం లోనకెళ్ళి చూడొచ్చన్న మాట. వాళ్ళు వేలంపాడిన డబ్బులు విరాళంగా ఇస్తారు. గేట్స్ ఇల్లు అన్నిటికన్నా ఎక్కువ గిరాకీ గాని, చిన్న చిన్న ఆకర్షణలు కూడా ఉంటాయి. పోయిన సంవత్సరంలో పెట్టిన ఓ ఆకర్షణ -“జిమ్ గ్రే తో లంచ్”. రెండు మూడు రోజులు చూసి, ఎవరూ వేలం పాడకపోతే, నేనే పాడి గెలిచాను.

గ్రే ఉండేది శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో. ఆ ఊరంటే ఆయనకి చాలా ఇష్టం. కంపెనీలు అక్కడ తమకు ఆఫీసు లేకపోయినా ఆయన కోసం పెట్టడానికి ఒక్క క్షణం వెనుకాడరు. లంచ్ కి ఎక్కడ తీసుకు వెళ్ళామంటావ్ అని నన్నడిగాడు. నాకు రెండు లంచ్ అవకాశాలు కావాలన్నాను. ఒకటి మా గ్రూప్ తో, మరొకటి మా అబ్బాయితో. ముందర గ్రూప్ లంచ్ ఏర్పాటు చేశాను.

గ్రే డిసెంబర్ 2006లో రెడ్‌మండ్ వచ్చినప్పుడు మా గ్రూప్ వాళ్ళంతా ఆయనతో రెండు గంటల సేపు లంచ్ సమావేశం చేశాము. ప్రతి వాళ్ళనుండి వాళ్ళేం చేస్తున్నారో కనుక్కొని, చివర్న తనేం చేస్తున్నదీ, టెక్నాలజీ ఎలా మారుతున్నదీ అది మేం చేసేపనినెలా ప్రభావం చేసేదీ ఎంతో ఉత్సాహంగా మాట్లాడాడు.

ఏ చారిటీకి ఇస్తున్నావని గ్రే అడిగితే, నేను రావినూతల అనే పల్లెటూరు నుండి వచ్చాననీ, చిన్నప్పుడు మా ఊళ్ళో కరెంటు కూడా లేదనీ, నన్ను చదివించిన మానాన్న జ్ఞాపకార్థం ఒక లైబ్రరీని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాననీ చెప్తే, ఆశ్చర్యపోయి, “It’s better than any story I can tell,” అని సంతోషం ప్రకటించి, తను కూడా కొంత సహాయం చేస్తానని చెక్కు బుక్కు తీశాడు! తిరిగి రెడ్‌మండ్ వచ్చినప్పుడు మాఅబ్బాయితో లంచ్‌కి వెళదామన్నాడు.

Jim Gray Lost at Sea

జనవరి 29, 2007 సోమవారం రాత్రి పనిచేసుకుంటుంటే, పిడుగులాంటి మెయిల్ వచ్చింది – “Jim Gray Lost at Sea?” అని. అంతకుముందు రోజు ఆదివారం ఇటీవలే చనిపోయిన వాళ్ళమ్మ అస్థికలని శాన్‌ఫ్రాన్సిస్కో తీరాన పసిఫిక్ మహాసముద్రంలో కలపడానికని ఒక్కడే తన పడవలో వెళ్ళిన జిమ్ గ్రే ఒకరోజు గడచినా తిరిగి ఇంటికి రాలేదు. యూ.ఎస్. కోస్టల్ గార్డులు నౌకలతోనూ విమానాలతోనూ కొన్నివేల చదరపు మైళ్ళ విస్తీర్ణపు సముద్రాన్ని గాలించారు. గ్రే మిత్రులు సొంత విమానాలతో వెతికారు. ఆయన అభిమానులు, తోటి ఉద్యోగస్తులు, ఉపగ్రహ ఛాయాచిత్రాల నాధారంగా, కంప్యూటర్ల సహాయంతో ఎంత వెతికినా జిమ్ గ్రే జాడ కానీ ఆయన పడవ టెనేషస్ (Tenacious) జాడ కానీ తెలియలేదు[3]. ఏ కల్లోలమూ లేని వాతావరణంలో అంత పెద్ద పడవ ఎలా అదృశ్యమయిందన్నది ఇప్పటికీ తేలని విషయం. అధునాతన సాంకేతిక పరికరాలు వున్న పడవ నుంచి ఎలాంటి అపాయకరమైన సూచనలు రాకపోవడం మరో అర్థం కాని విషయం. జిమ్ గ్రే ఇంత హఠాత్తుగా ఇలా అదృశ్యమవడం ప్రపంచమంతటా అనేకమంది శాస్త్రజ్ఞులనీ, కంప్యూటర్ ఇంజనీర్లనీ దుఃఖ సముద్రంలో ముంచేసింది.

ప్రపంచంలో అనేక మంది గొప్ప శాస్త్రజ్ఞులున్నారు. జిమ్ గ్రే కన్నా ఎక్కువ సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు కాని, ఆయనలా శాస్త్రరంగంలో ఇంతమంది మనుషులకి ఆప్తుడుగా దగ్గరయిన వాళ్ళు ఈకాలంలో ఎవరూ లేరు. ఇంతమంది గుండెలని తాకిన జిమ్ గ్రే ని తలచుకుంటే డబ్ల్యు. బి. యేట్స్ (W.B.Yeats) ని స్మరిస్తూ డబ్ల్యు. ఎచ్. ఆడెన్‌ (W. H. Auden) రాసిన కవిత గుర్తొస్తుంది:

“He disappeared in the dead of winter:
The brooks were frozen, the airports almost deserted,
The snow disfigured the public statues;
The mercury sank in the mouth of the dying day.
What instruments we have agree
The day of his death was a dark cold day.”

నోట్స్

[1] జిమ్ గ్రే వెబ్ సైటు
[2] ఖగోళం కథ
[3] “Inside The High Tech Hunt for a Missing Silicon Valley Legend, Wired Magazine, Issue 15.08.”

కొడవళ్ళ హనుమంతరావు

రచయిత కొడవళ్ళ హనుమంతరావు గురించి: పుట్టిందీ పదో తరగతిదాకా చదివిందీ ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో. ఇప్పుడు ఉండేది Washington రాష్ట్రంలో Seattle నగరానికి దగ్గర్లో. ఇంజనీరుగా పని చేసేది సాఫ్ట్ వేర్ రంగంలో. దాదాపు పాతికేళ్ళుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగంలో లీనమై సాహిత్యదృష్టి కొరవడిన లోపాన్ని సరిదిద్దుకోడానికి, గత మూడేళ్ళుగా కొందరు తెలుగువాళ్ళతో పరిచయం, కాస్త తెలుగు చదవడం, ఎప్పుడన్నా ఓవ్యాసం రాయడం - అదీ ప్రస్తుత వ్యాపకం.  ...