రెండో చేగోడీ కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ కథ

ఇది జరిగి సరిగ్గా ముప్ఫయి సంవత్సరాలయింది. అంటే 1969 అన్నమాట. నాకు తెలిసి ఆంధ్ర దేశంలో ఇంట్లో మానేసి హాస్పిటల్‌లో ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబీకులు పిల్లల్ని కనడం మొదలుపెట్టిన రోజులవి. ఆ రోజు హాస్పిటలు పురిటివార్డులో చంటిపిల్ల లందరూ ఉంగా, ఉంగా అనీ, క్యారు, క్యారుమనీ శుద్ధ తెలుగులో ఏడుస్తున్నారు. ఒక చంటి వెధవ మటుకు అమ్మా, అమ్మా అనీ, కంపూ, కంపూ అనీ సరికొత్త రాగంతో, తాళం తప్పుతూ రోదిస్తున్నాడు. ఆ చంటివాడు ఆవిధంగా అందరి దృష్టినీ ఆకర్షించి పుట్టగానే పరిమళించాడు. చంటాడికి, అంటే శివరాం కి ఆ హాస్పిటల్‌ వాతావరణం ఏదో రకమైన వాసన వేస్తోందనీ, అందుకే అమ్మా, కంపూ అను ఏడుస్తున్నాడనీ అందరూ అనుకుని, వాడి తెలివి తేటలకి ఆశ్చర్యపోయారు. పైన, ఆకాశవాణి ఏదో ఘోషిస్తోంది…. ఆ సంతోషంలో అది ఎవరూ వినిపించుకోలేదు. వారంతా అమాయకులు.

బారసాల నాటికల్లా పురోహితుడు అమ్మురాజు గారు శివరాం జాతకం వేసి పట్టుకొచ్చారు. ఈ కుర్రాడికి ముప్ఫయ్యో ఏడు దాటగానే, అంటే 21 వ శతాబ్దం ప్రారంభం అవగానే, ప్రారబ్ధం చుట్టుకునే అవకాశం ఉందనీ… వైటు వాళ్ళు, అంటే దొరల మూలాన ఆ కష్టం మొదలౌతుందనీ ఖచ్చితంగా చెప్పారు. సరే, అది వచ్చినప్పుడే చూసుకుందాంలే అని ఎవరూ పట్టించుకోలేదు. పైన ఆకాశవాణి ఏదో ఘోషిస్తుంటే, ఎవరూ వినిపించుకోలేదు.

అందరి లాగే శివరాం దుంపల బడిలో అ, ఆ లు నేర్చుకుని, ఎర్ర కాన్వెంటులో … అంటే పిల్లల యూనిఫారం ఎర్రరంగు… దానికి పోటీ బ్లూ కాన్వెంటు లెండి… హైస్కూలు దాకా చదివి ఆంధ్రాలో ఎక్కడా సీటు రాక కన్నడ దేశంలో డొనేషన్‌ కాలేజీలో కంప్యూటర్‌ సైన్సెస్‌ లో డిగ్రీ సంపాయించాడు. ఆ రోజుల్లోనే అసలు అమెరికా వాళ్ళ కంటే ఎక్కువ అమెరికా వాడిలాగా ఉండేవాడు. దైవవశాత్తూ ఆంధ్రాలో పుట్టాను గాని, నా అసలు స్వస్థలం వాషింగ్టన్‌ గాని వాకలపూడి కాదనీ, గాఢనమ్మకంతో, ఆ దారుణానికి కారకుడైన వాకలపూడిలో తెలుగు మాస్టారు అయిన కన్నతండ్రిని చులకనగా చూసిన రోజులు కూడా ఉన్నాయి.

డిగ్రీ పూర్తవుతుండగానే అమెరికా వెళ్ళే మంత్రతంత్రాలన్నీ అర్జంటుగా నేర్చేసుకుని క్రిస్‌ మర్టీ గారి చేగోడీ కంప్యూటర్‌ కంపెనీలో అవసరమైన అరడజను కోర్సులు నేర్చుకుని .. “ఆంధ్ర మాతా, ఇదే నీకు నా ఆఖరి నమస్కారం” అని Air India వారి విమానంలో Dallas చేరుకున్నాడు అయిదేళ్ళ క్రితం. 1994 లో.. తన పాతికో ఏట. క్రిస్‌ మర్టీ గారు … అంటే అసలు పేరు కృష్ణమూర్తి … చాలా మంచివాడు వ్యక్తి గానూ, వ్యాపారస్తుడి గానూ. తను అమెరికా వచ్చినప్పటికి శివరాం ఇంకా పుట్టలేదు. బాగా చదువుకున్నవాడు. చదువుకు తగ్గ మంచి ఇంజనీరింగు ఉద్యోగం చేసి, చేసి ఇంక రిటైరైపోదాం అనుకునే టైమ్‌లో ఆ ఇంజనీరింగ్‌ కంపెనీ వాళ్ళు హఠాత్తుగా ఉద్యోగం తీసెయ్యగానే అందరితో పాటు కంప్యూటర్‌ వారి బానిస వ్యాపారం మొదలుపెట్టాడు. అందరిలోకి అతిపెద్ద బానిస తనే … శివరాం తనని అలాగే చూశాడు మరి … అతనే కాదు చాలా మంది H1 వీసా ఉద్యోగస్తులు తనని అలాగే చూశారు మరి.

అయిదు సంవత్సరాల క్రితం, అంటే శివరాం అమెరికా వచ్చినప్పుడు కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ వాళ్ళదే రాజ్యం. వాళ్ళు పట్టుకున్నది బంగారం. పది అమెరికా కంపెనీల వాళ్ళు హైదరాబాదు వచ్చి బతిమాలగా, అందరితోటీ బేరం ఆడి .. అరవై వేల డాలర్ల జీతం మీద చేగోడీ కంపెనీ ద్వారా అమెరికా వచ్చాడు శివరాం. అమెరికాలో అడుగుపెట్టిన పదిరోజులలోనే project రావడం… చేగోడీ వారి ఖర్చు మీద అమెరికా హంగులన్నీ అంటే apartment, కారూ, credit కార్డులూ, laptop కంప్యూటర్లూ, cell ఫోనులూ, వగైరాలన్నీ ఆర్నెల్లలోనే arrange అయిపోయాయి. మరీ బావుండదని ఊరుకున్నాడు గానీ … చేగోడీ వారే ఆంధ్రా అమ్మాయిని పెళ్ళి సంబంధం చూపించి, ఖర్చులు పెట్టి పెళ్ళి చేయాలని కూడా కండిషన్‌ పెడదామనుకున్నాడు. పైన ఆకాశవాణి ఏదో ఘోషిస్తోంది. కాని శివరాం వినిపించుకునే పరిస్థితిలో లేడు.

శివరాంని H1 వీసా ఇచ్చి, అమెరికా తీసుకు వచ్చి ఏడాది తిరిగేలోగా రిటైర్‌మెంట్‌ వయసులో కూడా నల్లటి ఉంగరాల జుట్టుతో ఉండే చేగోడీ ఓనరు కృష్ణమూర్తి తలమీద వెంట్రుకలు లేకుండా అయిపోయాడు. నెలకొకసారి శివరాం జీతం పెంచకపోతే మరో కంపెనీ H1 కి మారిపోతానని బెదిరించడం .. ఇంత ఖర్చు భరించి తీసుకొచ్చిన ఈ computer programmer మరో చోటికి పోతే ఆ నష్టం భరించడం ఎలాగరా భగవంతుడా అని కృష్ణమూర్తి జుట్టు పీక్కోవడం, ఆ విధంగా ఖర్వాటుడుగా మారిపోవడం ఆరోజుల్లో కంప్యూటర్‌ కంపెనీ ఓనర్లకి మాత్రమే తెలిసిన చిదంబర రహస్యం. ఎక్కువ జీతం కోసం నెలకొక కొత్త H1 వీసా sponsorని మార్చేసిన computer programmers చాలా మంది ఉన్నారు ఆరోజుల్లో.

ఆరోజు కూడా షికాగోలో బయలుదేరిన విమానం హైదరాబాదులో ఆగింది. ఎంతసేపయినా ప్రయాణీకులు ఎవరూ కిందికి దిగడం లేదు. వాళ్ళని receive చేసుకోడానికి ఎప్పుడూ తండోపతండాలుగా వచ్చే బంధువులు, మిత్రులు కూడా ఎక్కువ మంది లేరు.

అమెరికాలో బయలుదేరిన దగ్గర నుంచి దించిన తల ఎత్తలేదు శివరాం. ఆ విమానంలో ఉన్నవాళ్ళలో ఇంచుమించు అందరూ అప్పుడే హీరో, హీరోయిన్లిద్దరూ ఆఖరిసీనులో చచ్చిపోయిన వీరట్రాజెడీ సినిమా నుంచి  బయటికి వచ్చిన వాళ్ళలా ఉన్నారు. అందులో రాజు విజువల్‌ బేసిక్కూ, రెడ్డి కోబాలూ, చౌదరి main frame, అలాగ అందరూ తలొక computer విద్యలోనూ ప్రవీణులూ … అందరికీ commonగా ఉన్న విద్య ఇప్పుడే అమెరికా అంతా కుదిరిపోయిన రోగం … దాని పేరు Y2K రోగం… అనగా Year 200 bug. వీళ్ళందరూ ఆరోగం మహర్దశలో ఉన్నప్పుడు అమెరికా వచ్చి, ఎంతో పోజు కొట్టి, రోగనివారణ అవగానే ఆంధ్రా విసిరివేయబడ్ద కంప్యూటర్‌ కళాకారులు.

హఠాత్తుగా శివరాం తల ఎత్తాడు. ఓరి దాని దుంపతెగ అనుకున్నాడు. అమ్మురాజు గారు చెప్పిన తెళ్ళవాళ్ళ మూలాన కలిగే కష్టం అంటే Y2K అనీ, Y2 అనగా తెళ్ళవాళ్ళనీ, K అనగా కష్టం అనీ అమ్మురాజు గారి  అన్వయం అనీ అప్పుడు అర్థం అయింది. స్వస్థలం వాకలపూడికీ, తనకీ ఉన్న సంబంధం తెగనిదనీ, Y2K కీ తనకీ ఉన్న సంబంధం పుటుక్కున తెగిపోయిందనీ కూడా అర్థం అయింది. తడబడే అడుగులతో, తెలుగు గడ్డ మీద అడుగు పెట్టగానే పైనించి ఏదో ఘోష వినబడగానే పైకి చూశాడు. “నాయనా శివరాం! నువ్వు పుట్టగానే అమ్మా అంటే అమెరికా అంటున్నావనీ, కంపూ అంటే కంప్యూటర్‌ అంటున్నావనీ నాకు అప్పుడే తెలుసు. అమెరికా వెళ్ళగానే అరవై వేల డాలర్ల జీతం చూసి అందలం ఎక్కి ఊరేగితే అపహాస్యం పాలవుతావు సుమా అంటే వినిపించుకోలేదు. ఇప్పటికైనా కొంప మునిగింది లేదు. ఓడలు బండ్లు అవుతాయి అనే సూత్రం జ్ఞాపకం పెట్టుకో” అంటూ ఆకాశవాణి అంతర్థానం అయింది … అమెరికాలో క్రిస్‌ మర్టీని కూడా ఓదారుద్దామని .. . కంగారుగా.