శివరాం కి సాధారణంగా కోపం రాదు. కానీ హైదరాబాదులో విమానం ఎక్కిన్యూయార్క్‌లో దిగేదాకా ఒళ్ళు మండుతూనే వుంది. ఎప్పుడు ఇండియా వెళ్ళినా, వచ్చినా, Air India లో ముసలి గుజరాతీ తల్లిదండ్రులు, పిల్లలకి గుళ్ళూ,గోపురాలూ చూపించి భారత లేదా తెలుగూ కల్చర్‌నాలుగు వారాల్లో crash course యిచ్చేద్దామనుకునే మధ్యవయసు భారతీయులే తప్ప ఇటువంటి ప్యాసెంజెర్లని చూడలేదు. విమానం నిండా వాళ్ళే… తనొక్కడు తప్ప.
“ఏమిటి చేశారు .. విజ్వుల్‌బేసిక్కా? ఫరవాలేదు. నేనా! ఆరేకల్ ఆర్నెల్లు training తీసుకున్నాను… ఆరేకల్‌డి బి ఏ యా లెక financials నా? ఎందుకైనా మంచిదని రెండూనూ… ఈ మధ్య AS/400, PeopleSoft కి విపరీతంగా demandఉందండీ.. అవి చేసే బదులు ఏకంగా SAP చేస్తేనే మంచిది. ఏనుగు కుంభస్థలంకొట్టొచ్చు…”
ఈ పై విధంగా ఆ Air India plane లో మాట్లాడుకునే వాళ్ళ భాషలో శివరాంకిఒక్క మాట కూడా అర్థం అవలేదు. అసలు ఆ టాపిక్‌ఏమిటో కూడా తెలియటం లేదు. పొరపాటున ఈ ఖగోళం నుంచి మరో సివిలిజేషన్‌కి వెళ్ళిపోయామేమో అనుకుంటూ పక్కనే కూచున్న చౌదరి గారికేసి చూశాడు. మన హైదరాబాదు మనిషి లాగే వున్నాడు. చౌదరి మెడలో ఒక లాకెట్‌వేలాడుతోంది. అందులో ఒక గెడ్డపాయన ఫోటో వుంది. చౌదరి గంటకొకసారిఆ గడ్దపాయన ఫోటో కళ్ళ కద్దుకుని దణ్ణం పెట్టుకుంటున్నాడు.
ఎవరండీ ఆయన? కొత్తగా వెలిసిన స్వామీజీ గారా! అనడిగాడు శివరాం ఉండబట్టలేక. ఈయన స్వామీజీ కాదు సార్! చెంద్రబాబు నాయుడు. ఆయనే మా అందరికీ నాయకుడు. ఎవరూ! chief minister ఫోటోయా? అవును సార్! నాయుడు గారు ఆంధ్రాని అమెరికా కంటే పెద్ద కంప్యూటర్ దేశం చేసి పారేద్దామని వ్రతం పట్టాడు. Bill Gates అంతటివాడు నాయుడుగారిని చూసి డంగై పోతున్నాడు. మా అందరికీ అసలు స్వామీజీ నాయుడు గారే!
“మా అందరూ” అంటే?
అదేనండీ .. ఈ విమానంలో ఉన్న వాళ్ళం అందరం కంప్యూటర్ software గాళ్ళం.మేమే నేటి బాలలం .. రేపటి పౌరులం. దేశానికి డబ్బు, పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే వీరులం. ఆవేశపడి పోతున్నాడు చౌదరి.
అప్పటికి అర్థం అయింది శివరాం కి ఇందాకా వాళ్ళు మాట్లాడుకుంటున్న భాషకంప్యూటర్‌భాష అని. మెల్లిగా వివరాలు తెలిశాయి. చౌదరితో బాటు మరొక నలుగురు ఆ విమానంలోనే కత్తిపూడి, కాపవరం,కైకలూరు వగైరా ఊళ్ళలో computer training తీసుకుని H1 వీసాల మీద అమెరికా వస్తున్నారు.
ఆముదాలవలస నుంచి అనకాపల్లి దాకా ఆంధ్రాలో అన్ని ఊళ్ళలోనూ, ప్రతి జంక్షన్‌దగ్గరా ఒకకిళ్ళీ కొట్టూ, పక్కనే కంప్యూటర్‌సెంటర్‌ఉండటం చూసి శివరాం నవ్వుకున్నాడు మొన్నమొన్ననే.చౌదరి sponsoror … అంటే H1 వీసాలు సంపాయించి అమెరికా తీసుకు వెళ్తున్న ఆసామీ పేరు క్రిస్‌మర్టీ ట. కంపెనీ అమెరికాలోచాలా పేరున్న పెద్ద కంపెనీ .. పేరు చేగోడీ కంప్యూటర్స్.
చేగోడీ … ఆ మాట విని, చేగోడీలు తిని అనేక యుగాలు అయిందే అని కొంచెంగింజుకుంటున్న శివరాంని చూసి, క్రిస్‌గారికి చేగోడీ లంటే చాలా ఇష్టం అనీ, అమెరికా వాళ్ళు ఆనియన్‌రింగ్స్‌ని ఆంధ్రాచేగోడీ నుంచి కాపీ కొట్టారని క్రిస్‌గారి అభిప్రాయం అనీ, మా ఈ కంప్యూటర్‌బ్యాచ్‌వాళ్ళందరినీ డల్లాసులో ఒక బ్రహ్మాండమైన guest house లో వుంచి projects లో పనిచేయిస్తూ నెలనెలా జీతం ఇస్తూ అఖండ గౌరవం చేస్తారనీ చౌదరి ఎంతోకుతూహలంగా వివరించాడు. విమానంలో వున్నరావు, మూర్తి, రెడ్డి, రాజు వగైరా కంప్యూటర్‌కళాకారులందరూ పైకి ఆర్భాటంగాసూటూ బూటూ వేసుకుని ఎప్పుడుఅమెరికాలో దిగుదామా అని భయం భయంగా ధైర్యం నటిస్తున్నారు.
Air India విమానం న్యూయార్క్‌లో దిగగానే కస్టమ్స్‌వాళ్ళు ప్యాసింజెర్లందరినీలైనులో నుంచోబెట్టారు. విజువల్‌బేసిక్ వాళ్ళంతా తెల్ల లైను, C, C++, java గాళ్ళందరూ నల్ల లైను, PeopleSoft, AS/400, గాళ్ళు ఎర్ర లైను, SAPవాళ్ళు మటుకు, ఇదుగో ఈ gold carpet మీద లైన్లలో నుంచోండి అని హెచ్చరికలు చేశారు. శివరాం కి మళ్ళీ ఒళ్ళు మండింది. తను అమెరికా వచ్చి పాతికేళ్ళయింది. తన గురించి ఒక్క కస్టమ్స్‌ఆఫీసరూ పట్టించుకోలేదు.తన ఒళ్ళు మంట ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూండగానే ఒక నల్ల దొర వచ్చి… దూకుడుగా .. ఏం ఇక్కడే నుంచున్నావు అని కోప్పడ్డాడు. ఎక్కడ నుంచోవాలో తెలీక అన్నాడు శివరాం.
నువ్వేమిటి? విజువల్‌బేసిక్కా, యూనిక్సా, విండోసా … అని అడుగుతున్న ఆ జాన్సన్నిచూసి అయామ్ ఎ మెకానికల్ ఇంజనియర్ అన్నాడు శివరాం.
ఇంజనియర్‌వా … ఐతే ఇక్కడ నిలబడు అన్నాడు జాన్సన్‌జాలిగా . ఆ లైనులోతనొక్కడే ఉన్నాడు. ఆఖరివాడిగా, మిగిలిన కంప్యూటర్‌లైన్లన్నిటికీ వెనకాల.
మొత్తానికి ఆ కంప్యూటర్‌వాళ్ళందరూ న్యూయార్క్‌నుంచి Dallas, Chicago, Raleigh, Atlanta, ఎవరి దారిన వాళ్ళు పోగా తను హ్యూస్టన్ flightతీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రాణం పోయినా మళ్ళీ హైదరాబాదు నుంచి బయలుదేరే Air Indiaలో ప్రయాణం చెయ్యనని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసుకున్నాడు.
DFW – Dallas – Fort Worth విమానాశ్రయం లో విమానం ఆగింది. చౌదరి,రావు, రెడ్డి, రాజు, శాస్త్రి ఐదుగురూ అర్జంటుగా వేసుకున్న సూట్లు సద్దుకుని, పౌడరు, సెంటు పూసుకుని ఎర్రగా బుర్రగా పొడుగ్గా హాయ్‌హౌ ఆర్‌యు అని అమెరికన్‌ఇంగ్లీషులో మాట్లాడే క్రిస్‌మర్టీ గారికి ఎలా షేక్‌హండ్‌ఇవ్వాలా, ఎవరు ముందు మాట్లాడాలా అని ఆ పంచ పాండవులు తర్జన భర్జన పడుతుండగా … ప్యాసెంజెర్స్‌ని రిసీవ్‌చేసుకోవటానికివచ్చిన నల్ల, తెల్ల, పసుపు .. అంటే చైనా దొరలందరూ వెళ్ళిపోయారు.
క్రిస్‌గారు ఎలా ఉంటారో తెలియక ఇప్పుడెలాగరా భగవంతుడా అని చౌదరికంగారు పడుతుండగా,క్రిస్‌మర్టీ వచ్చి హలో అయామ్‌క్రిస్‌మర్టీ అనిపరిచయం చేసుకున్నాడు. అతని మొహం చూసి చౌదరి రావు మొహం, రావు రెడ్డి మొహం, రెడ్డి రాజు మొహం, రాజు శాస్త్రిమొహం చూసుకున్నారు. ఇలా మొహాల వీక్షణ కార్యక్రమం పూర్తయ్యాక పంచపాండవులు కలిసి క్రిస్ మొహం కేసితీవ్రం గా చూశారు. గోధుమ రంగులో, పొట్టిగా, గుజరాతీ వాళ్ళలా గిల్టు బంగారు రంగు కళ్ళద్దాలతో ఉన్న క్రిస్ వాళ్ళకి క్రిస్‌లా కనబడలేదు. మర్టీలా కనబడలేదు. క్రిస్‌మర్టీలా అసలు కనబడలేదు.
ఆర్యూ క్రిస్‌మర్టీ సార్? అని అడిగాడు చౌదరి ధైర్యం చేసి. అవునండీ welcome to America అన్నాడు తెలుగుఇంగ్లీషులో క్రిస్‌మర్టీ. క్రిస్‌మర్టీ అంటే … నసిగాడు రావు. ఓ అదా! నా అసలు పేరు కృష్ణమూర్తి లెండి. అమెరికా కదా … అంచేత వాళ్ళకిఅర్థమయ్యే పేరు పెట్టుకోవాల్సి వచ్చింది..
సరే, క్రిస్‌గారు పంచపాండవుల్ని తన లెక్సస్, అనగా చిన్న ఖరీదైనకారులో ట్రంకులో సామాను అంతా పట్టకపోతే తాడు వేసి కట్టి guest house కి తీసుకెళ్ళాడు. Guest house అంటే ఆంధ్రా గవర్నర్‌గారి ఇల్లు లాగానో రామోజీ రావు గారి ప్రపంచ ప్రఖ్యాత స్టూడియో guest house లా డజనుమంది వంటవాళ్ళు, కార్లు, డ్రైవర్లతో ఉంటుందనో, కనీసం కాలవ మీదకి ఖాకీ టోపీ పెట్టుకుని నిక్కర్‌వేసుకుని ఉప్పాడ కాలవ inspection కి వచ్చే సివిల్‌ఇంజనీరు గారి రాదారి బంగళాలా ఉంటుందనోఅనుకున్న చౌదరి ఊహాశక్తి చాలా దెబ్బ తినేసింది. డల్లాస్‌లో అతిబీద నల్ల వాళ్ళూ, మరియుమెక్సికన్‌వాళ్ళూ ఉండే సందులు గల్లీల్లో ఒక బిల్డింగ్‌లో ఎనిమిదో అంతస్తులో ఉండే రెండు గదులఫ్లాట్ అనగా అపార్టుమెంట్‌నే కంప్యూటర్ వాళ్ళందరూ guest house అంటారని తెలిసి పంచపాండవులులక్క ఇంటిలో ధర్మరాజు, అర్జునుడూ, భీముడు, మరియు అన్ని సినిమాలలోనూ ఒక్క డైలాగు కూడా లేకుండాకేవలం తలకాయలు పైకీ కిందికీ ఊపుతూ అభినయించే నకుల సహదేవులు లాగా ఫీలయిపోయారు.
పాపం పండి అమెరికా వచ్చి పడ్డామని పాండవులకి తెలియడానికి పాతికరోజులు పట్టలేదు. ఒక్కొక్కడి దగ్గరా లక్ష రూపాయలు trainingకనీ, వీసా ఖర్చులనీ డబ్బు పుచ్చుకున్నచిన్నారావు క్రిస్‌మర్టీ గారి స్వయానా రెండో బావమరిది అని తెలిసిపోయింది. వైజాగ్‌కరపాంమార్కెట్‌లోనూ, కాకినాడబోగందాని చెరువు పక్కనూ, అనకాపల్లి బెల్లం దుకాణాల మధ్యలోనూ ఉన్నకంప్యూటర్ training centers కీ, చేగోడీ కంప్యూటర్ కంపెనీకి ఉన్నది డబ్బు పంచుకోడం తప్ప అసలువ్యాపార సంబంధం ఏమీ కాదని తెలిసి పోయింది. Project మాట దేవుడెరుగు, నెలనెలా జీతం మాటదేవుడెరుగు, ఆరుగురు ఉన్న guest house లో telephone కూడా లేదనీ అందరికీ కలిపి మనోవర్తి, అంటే ప్రాణం పోకుండా తిండి ఖర్చులు మటుకు చేగోడీ కంప్యూటర్‌వారు కేవలం రెండు నెలలు భరిస్తారనీ, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన చోటికి మీరు పోవచ్చు అని అంటారని తెలిసిపోయింది. డబ్బు పుచ్చుకుని,అమాయకులైన కంప్యూటర్ ప్రోగ్రామర్లని అమెరికా తీసుకు వచ్చి, నడిరోడ్డులో వాళ్ళని వదిలెయ్యడం మాత్రమే ఇటువంటి చేగోడీ కంపెనీల వ్యాపారమని తేలిపోయింది.
మామూలు కంటే గట్టిగా టెలిఫోన్‌మోగింది.
“హల్లో” అన్నాడు శివరాం
ఓ! what a surprise, ఎలా ఉన్నారు?
ఎలా ఉందండీ మా దేశం?
అదేమిటి! నా మొహంలా వుందీ, అంటే!
ఓ … really!
… నిజంగానా! అంత మోసం చేస్తారా ఈ కంప్యూటర్ కంపెనీ వాళ్ళూ … too bad.
… I am sorry!
…ఓ పని చెయ్యండి, మా హ్యూస్టన్ వచ్చెయ్యండి. కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండొచ్చు
… అబ్బే పరవాలేదు. మా ఆవిడ చాలా understanding మనిషి.
… ఫరవాలేదు. Greyhound లో డల్లాస్‌లో ఎక్కితే హ్యూస్టన్ ఐదారు గంటల్లోవచ్చేస్తారు. నేను వచ్చి pick-up చేసుకుంటాను. Don’t worry. We will work it out చౌదరి గారూఅనిఫోన్ పెట్టేశాడు శివరాం.
శివరాం కి ఒళ్ళు మండిపోతోంది. ఈ శనివారం చౌదరి డెల్లాస్‌నుంచి వస్తాడు.పాపం, పంచపాండవులకి ఎంత మోసం జరిగిందీ … ఆంధ్రా వాళ్ళ కంప్యూటర్ వ్యాపారం ఇంత అధ్వాన్నంగాఉంటుందని అందరికీ తెలియదు కదా అని అనుకుంటూ Monica Lewinsky latest news విందామని TV remote కోసం సోఫా వెనకాల వెదుకుతూ ఉండగా శివరాం భార్య అర్జంటుగా గెంతులేసుకుంటూ వీధి తలుపు తీసుకుని లోపలికి వచ్చింది. వస్తూనే “ఏమండోయ్.. I finally did it ” అంది.
ఏమిటి ఏంచేశావు?
ఇదుగో చూడండి, అని కాయితాలు శివరాం మొహం మీద పడేసింది.
అదేనండీ, మీరు ఇండియా వెళ్ళి వచ్చిన దగ్గర్నుంచీ ప్రాణం తీశారుగా ఏదోకంప్యూటర్‌కోర్స్‌లో చేరమనీ, I finally did it.
శివరాం కి మళ్ళీ ఒళ్ళు మండింది ఆ కాయితాలు చూడగానే.
ఏమిటీ, SAP లో జేరమన్నారుగా! చూడండి This is an excellent deal.మొత్తం ఖరీదు $10,000. రెండు వారాలు training. ఎక్కడనుకుంటున్నారు … హైదరాబాదులో! వాళ్ళే ticket పెట్టి అక్కడికి తీసుకెళ్ళి training ఇస్తారట. అటు ఇండియా వెళ్ళినట్టూ ఉంటుంది. రెండువారాలు training కి మూడు నెలలు training అయినట్టు సర్టిఫికెట్ ఇస్తారుట. చూశారా, అన్నీలాభాలే. వెనక్కి వచ్చాక గంటకి 150 డాలర్లు ముందు అంటే ఏడాదికి $300,000 – ఆ తర్వాత 200 డాలర్లు… ఇక మీరు ఉద్యోగం మానెయ్య వచ్చు, నేను సెటిల్‌అయాక మీరు కూడా SAP లో …
శివరాంకి సాధారణంగా కోపం రాదు. ఇవాళ మటుకు ఒళ్ళు మండి పోతోంది.
ఏమిటండీ అంత కోపం ఎందుకూ ?
ఎందుకా! ఇదుగో ఇందుకూ, అన్నాడు ఆ కాగితాలలో ఆఖర్న ఉన్న సంతకం చూపించి. అవునండీ, He is a nice fellow .. క్రిస్‌మర్టీ from చేగోడీ కంప్యూటర్స్. Head quarters డల్లస్‌లో నట. వాళ్ళకి ఇండియాలో కూడాఅన్ని ఊళ్ళలోనూ training centers ఉన్నాయిట.
అందుకు కాదు, అందుకే .. ఇందుకే .. అసలు అందుకే అన్నాను. శివరాంకి మాటలు తడబడు తున్నాయి.
శివరాంకి ఎందుకు ఒళ్ళు మండుతోందో ఆవిడకి ఏమాత్రం అర్థం కాలేదు.