ఒక హత్య జరిగింది. ఒక మనిషిని కొట్టి చంపేశారు. అంటే, పూర్తిగా చంపేయలేదు. చంపేశామని అనుకున్నారు. భగవంతుడి దయ వల్ల ఆయన కొన ఊపిరితో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆయన బతికేవున్నాడు కాబట్టి హత్య జరుగలేదని అంటే, నేనేమీ కాదని అనను. కానీ, ప్రయత్నించింది మాత్రం హత్య కోసమే అన్నది ముమ్మాటికీ కాదనలేని సత్యం.
అన్నట్టు, మనిషిని కొట్టారు అని చెప్పాను గానీ కొట్టిందెవరో చెప్పలేదు కదూ? కానీ, మీరు గ్రహించగలరు.
అవును, నిజమే. కొట్టిన వాళ్ళు కూడా మనుషులే. భలే చిత్రంగా వుంది కదూ? లేదా? ఏమో లెండి, అందరూ నాలాగా అమాయకంగా వుండాలని ఏముంది? ఎందుకంటే, నేను ఇదే మాట అంటే ఒకావిడ “బావుంది, మనిషిని సాటి మనిషి కాకపోతే ఏ జంతువులో వచ్చి చంపేయడానికి మనమేమైనా అరణ్యంలో వున్నామా? జనారణ్యమే తల్లీ…” అంటూ బుగ్గలు నొక్కుకోకుండానే విస్తుపోయింది.
‘మరీ అంత ఘోరమా?’ అని మీరేమీ ఆశ్చర్యపోకపోవచ్చు. ఎందుకంటే, మీరు రోజూ చాలానే చూస్తుంటారు. ఒక్క మనిషిని పట్టుకుని బోలెడంతమంది చుట్టుముట్టి చితగ్గొట్టడమా? అదీ వందలాది మంది చూస్తుండగానా? మరి, దీన్ని అడవి అనకపోతే, ఇంకేమంటారని నేను ఆవిడను గాని, మిమ్మల్నీ గానీ నిలదీయను. ముందే చెప్పాగా, మీరంతా ఇలాంటివాటికి అలవాటు పడిపోయి వుంటారని.
చంపేయడమంటే… ఏదో గొంతు కోసో, కడుపులో కసుక్కున ఓ పోటు పొడిచో చంపేస్తే – అదీ చావే అయినా, అది వేరు. అలాకాకుండా, చుట్టుముట్టి, అందిన చోటల్లా పిడి గుద్దులు గుద్దుతూ, సున్నితమైన ప్రాంతాల్లోనూ, మర్మాంగాలపైనా కాళ్ళతో తంతూ-చావు పొలిమేరల వరకు తీసుకెళ్ళడమంటే ఎంత కిరాతకం.
ఇప్పటికీ మానవత్వం మిగుల్చుకున్న దయామయులు మీలో కొందరు వుండే వుంటారు. ఇప్పటి వరకు నేను చెప్పింది విని ప్చ్! ప్చ్! అనుకుని బాధపడుతూ వుంటారు. కానీ, మిమ్మల్ని మీరు ఇంకా మనుషులు అనుకోవడం, మీలో ఇంకా మానవత్వం మిగిలే వుందనుకోవడం – దీన్ని మించిన హిపోక్రసీ ఇంకేమీ లేదు. అలాని మీకూ తెలుసు. కానీ, మీరు మాత్రం ఏం చేస్తారు? ఆఫ్ట్రాల్ మనుషులే కదా. మీలోని మానవత్వం మోసపూరితమనడానికి కారణం చెప్పనా? రోజూ ఇలా చచ్చిపోతున్న మనుషుల గురించి రెండు కన్నీటి చుక్కలు విడువడానికి ముందు మీరేం ఆలోచిస్తారో మీరెప్పుడైనా గుర్తు చేసుకున్నారా?
‘పోయినవాడి మతమేంటి? కులమేంటి? ప్రాంతమేంటి?’
ఇప్పుడైనా కాసింత సిగ్గుపడతారా? లేదు, మీరు సిగ్గుపడరు. నాకు తెలుసు. ఎందుకంటే, మీరు కరడుగట్టిన మనుషులు. అయినా, నాకు చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నా. ఈ హత్యకు కారణం ఆలీబాబా.
హ్హ హ్హ హ్హా. మీ అవస్థ చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. ఎందుకంటే, ఈపాటికే మీలోని లౌకికవాదులంతా హంతకుడి పక్షాన చేరిపోయి వుంటారు. కానీ, ఇక్కడో ట్విస్ట్ ఉంది. అదేమిటంటే, అది మతాన్ని తెలిపే పేరు కాదు. మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేసి ఏడిపించడానికి ఊరికే ఆ పేరు చెప్పా. అదిగో, చూశారా? మీ భావాలు ఎలా మారిపోతున్నాయో! గమనించుకుంటున్నారా, కొంచెమైనా? పార్టీలు మార్చే అవకాశవాద, దివాళాకోరు రాజకీయ నాయకులకంటే మీరేరకంగా మెరుగు? ప్రశ్నించుకున్నారా, ఎప్పుడైనా, మిమ్మల్ని మీరు?
మీరేమంటారోనని ఆ పేరు చెప్పాను కాని, అందరూ ఆలీబాబా అనగానే నమ్మేసే వెర్రిబాగులదాన్ని కాదు నేను. ఎందుకంటే, వాళ్ళ అసలు రంగును బయటపెట్టింది ఆయనే కాబట్టి. ఆలీబాబా రాకముందు అప్పడప్పుడు వినడమే గాని, వాళ్ళ భాగోతాలేమీ నాకు తెలిసేవి కావు. ఆలీబాబాను అర్థం చేసుకోవడంలో ఇంకా చాలామంది వెనుకే ఉన్నారనుకోండి. కొన్నాళ్ళకు వాళ్ళే వచ్చి ముందు వరుసలో నిలబడకపోరు. ఆలీబాబా పేరు ప్రస్తావించగానే, మీకు నలభైమంది దొంగలు గుర్తుకు రావడంలో తప్పులేదు. ఆ దొంగ వెధవల గుట్టు బయటపెట్టి, వాళ్ళ భరతం పట్టడానికే ఆయన – అదే ఆలీబాబా కుటుంబాన్ని సైతం కాదనుకుని ముందుకు వచ్చాడు. ఆయన నరరూప రాక్షసుడని, పచ్చి నెత్తురు తాగుతాడనీ కిట్టని వాళ్ళు ప్రచారం చేస్తారు. కిట్టని వాళ్ళని ముందే తెలుసు కాబట్టి నేను వాళ్ళ మాటలను పట్టించుకోను. కానీ, ఆయన ఎవరి కోసం నిలబడుతున్నాడో వాళ్ళు కూడా ఆయనను అర్థం చేసుకోలేకపోవడమే నాకు చిత్రంగా తోస్తుంది.
ఒకప్పుడు అంతా ఒకటే అనే మాయలో వున్నాం. ఇప్పుడు మాయ తొలగిపోయింది. దేవతలు, దానవులు ఎప్పటికీ ఒక్కటి కాలేరని నేనిప్పుడు ఘంటాపథంగా చెప్పగలను. మీకు వివరాలు కావాలంటే నాకు వాట్సప్ చేయండి. బోల్డన్ని వున్నాయి మెసేజ్‌లు, ఫార్వర్డ్ చేస్తా.
మా నానమ్మలా మడిబట్టలు కట్టుకోకపోయినా, మా అమ్మలా తలస్నానాలు చేయకపోయినా, ఆరేసిన నైటీ ఏదో వేసుకుని రెణ్ణిమిషాల్లో దేవుడి దగ్గర దీపం పెట్టేసి వంటావార్పు లాంటి సంసారం గొడవల్లో పడిపోయే మామూలు ఇల్లాల్ని – అదే మీరు గొప్పగా చెప్పుకునే హోమ్ మేకర్‌ని. కాబట్టి వాళ్ళేదో నా మడిబట్టను ముట్టుకున్నారనే చుప్పనాతి తనమేమీ నాకు లేదు. కానీ, వాళ్ళు చేసేది చాలా ఎక్కువ.
నిజానికి ఎప్పుడో నా చిన్నప్పుడు… అంటే, మరీ చంటిదాన్నేమీ కాదనుకోండి. టెన్తో, ఇంటరో చదువుతున్నా. అప్పుడందరూ చెప్పుకున్నారు. అక్కడెక్కడో చాలామంది కలిసి ఏదో కూల్చేశారని. బాగా గొడవలయ్యాయని. ఇప్పట్లా టీవీలు, ఫోన్లూ, వాట్సప్పులూ అప్పుడెక్కడివి. దాంతో ఏదో ఆ నోటా, ఆ నోటా వినడమే గానీ ఏదీ సవ్యంగా తెలిసి చచ్చేది కాదు. అయితే, ఎవరం ఏమీ పట్టించుకోలేదు. అదేదో మనకు సంబంధం లేని గొడవలే అని అందరం ఊరికే ఉన్నాం. కొన్నాళ్ళకు అందులో పాల్గొన్న ఒకాయన ఏదో ఇటుక పట్టుకు వచ్చాడని అందరూ చెప్పుకోవడం ప్రారంభించారు. దాన్ని ఆయన అందరూ చూడటానికి వీలుగా వాళ్ళింటి బయట ప్రత్యేకంగా పెట్టి వుంచాడని తెలిసింది. చుట్టుపక్కల చాలామంది ఆడవాళ్ళు సుబ్బరంగా స్నానాలు చేసేసి, ఏ గుడికో వెళుతున్నంత భక్తితో వాళ్ళింటికి వెళ్ళి ఆ రాయిని చూసి, దణ్ణాలు పెట్టుకుని, యథావిధిగా కాస్త పసుపూ కుంకుమా మెత్తేసి వచ్చారు. ఆ తర్వాత దాన్ని అందరం మర్చే పోయాం.
కానీ, రానురానూ పరిస్థితులు మారిపోయాయి. మాకెవరికీ ఏ మాత్రం ఎరుక లేకుండానే.
మేమేమో మా పెళ్ళిళ్ళు, పిల్లలు పుట్టడం, ఉద్యోగాలు… జీవితపు హడావిడిలో పడి మారిన పరిస్థితులను అర్థం చేసుకోవడంలో కాస్త తడబడ్డా. అలాని, నేనేమీ చాదస్తురాలిని కాదు. కులమతాలకు అతీతంగా ఎంతో మంది మిత్రులున్నారు నాకు. అంతెందుకు! మా పండగలప్పుడు చేసిన పిండి వంటలన్నీ వాళ్ళింటికి వెళ్ళేవి. వాళ్ళ పండుగలప్పుడు చేసిన వాటిల్లో నాన్‌వెజ్ తప్ప అన్నీ మా ఇంటికి వచ్చేవి. మా ఆయన మాత్రం వాళ్ళింటికి వెళ్ళి చక్కగా నాన్‌వెజ్ తిని వచ్చేవాడు. చాలా కాలం అదో బహిరంగ రహస్యం. ఎన్నో ఏళ్ళ నుంచి పక్కపక్క ఫ్లాట్స్‌లో వుండటం వల్ల పిల్లలకు జ్వరాలొచ్చినా, పెద్దలకు డబ్బులవసరం వచ్చినా నేను ఎప్పుడూ వెనకాడేదాన్ని కాదు. ఏమాటకామాటే చెప్పుకోవాలి, వాళ్ళు కూడా అంతే.
ఓసారి మా అబ్బాయికి జ్వరం ఎక్కువైంది. సమయానికి తను లేడు. నాకు ఓవైపు ఏడుపు, మరోవైపు ఆదుర్దా. అప్పుడు ఆవిడ పదేళ్ళ పిల్లాడిని ఉన్నపళంగా భుజాన వేసుకుని మగరాయుడిలా రెండు వీధులు దాటి ఆటో పట్టుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. అప్పుడు దేవతలా కనిపించింది గాని, ఇప్పుడు ఆమె తెగువను తలచుకుంటే భయంవేస్తుంది. వాళ్ళ తీరే అంత, ఎంతకైనా తెగించగల మొండిఘటాలు.
రేపు అవకాశం వచ్చి వాళ్ళది పైచేయి అయితే… మనపైకి ఎగబడరని ఏమిటి గ్యారంటీ? చూశారా, నేనెంత అమాయకురాలినో? రేపెప్పుడో వాళ్ళది పైచేయి కావడమేమిటి, వాళ్ళిప్పుడే రెచ్చిపోతుంటేనూ? ఆయనపై దాడికి తెగించడమే అందుకు నిదర్శనం. వాళ్ళంటే తనకి పిచ్చి అభిమానం. అయినా, జాలీ దయా డిక్షనరీలోనే లేని కిరాతక మూకలు వాళ్ళు. అందుకే అంతపని చేశారు.
రేపాయనకు ఏమైనా అయితే, నాకూ నా పిల్లలకు దిక్కెవరు? ఆయనే పోయాక, ఇక మేమెంత? మమ్మల్నీ ఎప్పుడో అదను చూసి మెడలు కోసేయకుండా వుంటారా? వాటిని పట్టుకుని ఊరేగకుండా వుంటారా? ముందు నుంచీ కాకపోయినా, ఓ దశాబ్ద కాలంగా ఆయనను హెచ్చరిస్తూనే వున్నా. మీరు అనుకుంటున్నంత మంచివాళ్ళు కాదు వాళ్ళూ అని. వింటేనా? ఏం చేస్తాం, అంతా నా ఖర్మ. ఇంత జరిగినా కూడా పక్కింటాయన కనీసం వచ్చి పలకరించిన పాపాన పోలేదు. దాన్నిబట్టే తెలియడం లేదూ, వాళ్ళవాళ్ళు చేసిన పనికి ఆయన మద్దతుందని?
ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఇప్పుడు సమయం లేదు. ఆస్పత్రికి వెళ్ళాలి. బతికుంటే – ఆయనా? నేనా? అని మాత్రం అడక్కండి, వచ్చాక చెప్తా.
“ఆలీబాబా అనండి, సైతానే అనండి… అతడు గానీ, ఆ గొడవలు గానీ మాదాకా వస్తాయని అస్సలు అనుకోలేదంటే నమ్మండి. మొగుడికీ పిల్లలకూ వండి పెట్టడం. ఇంటి పనులు చూసుకోవడం. పొద్దంతా కిందామీదా పడినా ఆ పనులు పూర్తే కావు. బంధువులతోనూ, తెలిసినవారితోనూ కాసేపు కష్టసుఖాలు వెళ్ళబోసుకోవడం తప్ప నాకింకేమీ తెలీవు.
మేమంటేనే మండిపడిపోతున్న ఆమెకి నేను చేసిన షీర్ కూర్మా అంటే ఎంతో ఇష్టమని చెబితే ఇప్పుడు మీరు నిజంగా నమ్మరు. ‘నేనెన్నిసార్లు చేసినా ఇలా రాదేం’ అని పాపం నా దగ్గర వాపోయేదామె. అలాగే ఆమె చేసే జంతికలు, చేగోడీల్లాంటి చిరుతిళ్ళంటే పిల్లలకే కాదు, నాకూ ఇష్టమే. తింటే లావైతానని తెలిసినా, ఇద్దరు పిల్లల తల్లిని మెరుపు తీగలా వుండాలంటే కుదురుతుందాని, నాకు నేనే సర్ది చెప్పుకుంటా.
పాపం ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఏనాడూ మా వ్యవహారాలను ప్రశ్నించిన పాపాన పోలేదు. నా పిల్లలను కూడా తన పిల్లల్లాగే చేరదీసేది. వాళ్ళ పిల్లలూ మా ఇంట్లో అలాగే వుండేవారు. కలిసి కార్టూన్‌లు చూడటాలు, వీడియో గేమ్‌లు ఒక్కటేమిటి… చదువుకోడం మినహా అన్నీ చేసేవారు.
చాపకిందనీరులా అని ఆమె అంది ఒకసారి. అంటే ఏంటో నాకప్పుడు తెలీలేదు గానీ ఇప్పుడు అర్ధమవుతోంది. వాళ్ళు బయటపడకపోయినా… మమ్మల్ని ఎప్పుడూ అసింటా వుంచినట్టే నాకనిపించేది. కలుపుగోలుతనం ఒక పైపూతే. అసింటా స్థానంలో అసహ్యం, ఆగ్రహం చేరడమే నన్ను నిస్సహాయురాలిని చేస్తోంది.
నిజమే, మా ఆయన అన్నట్టు ఆమె వున్న పరిస్థితి అటువంటిది కావచ్చు. కానీ, మరీ అంత ద్వేషం ఎందుకు? ఎక్కడో ఏదో జరిగితే… అందుకు మావాళ్ళే కారణమైతే మాత్రం – మేమే చేసినట్టు మాట్లాడితే ఎలా? నేను గానీ, మా ఆయన గానీ వాళ్ళకే అపకారం తలపెట్టలేదు. వాళ్ళవాళ్ళు ఏమీ చేయడం లేదా? అప్పుడు అలాగే అంటున్నామా? ఏదో పుణ్యానికి వుండనిచ్చినట్టు పదేపదే దేశద్రోహులని ఈసడించుకుంటుందెందుకు? అయినా, ఆవిడ్నే ఎందుకు అనుకోవడం? ఆ సైతాన్ చిమ్మిన విషం చిన్నారుల్లోనూ చేరింది.
మొన్నొక రోజు మా పిల్ల దిగులుగా కనిపించింది. నెమ్మదిగా అడిగితే స్కూల్లో ఫ్రెండ్స్ అంతా ‘నువ్వెందుకు బొట్టు పెట్టుకోవు? నువ్వు రోజూ స్నానం చెయ్యవట కదా?’ అని ఏడిపిస్తున్నారట. కొద్ది రోజులు ఓర్చుకుని వాళ్ళతో కొట్లాటకు దిగిందిట. వాళ్ళకు దెబ్బ తగిలే వరకు గొడవ పడిన పిల్లలు, మా పిల్ల కాస్త గట్టిగా బుద్ధి చెప్పేసరికి ‘మీరు రోజూ బీఫ్ తింటారగా అందుకేనే నీకింత బలుపు’ అని తిట్టారుట. ఇక భరించలేక ఏడుస్తూ వెళ్ళి టీచర్‌కి చెబితే ‘నే చెబుతాలే’ అని ఊరుకుందిట.
మా ఆయనకు చెబుదామనుకున్నా. కానీ, ఆయనను కూడా బాధ పెట్టడం తప్ప ప్రయోజనమేమీ లేదు. పరిస్థితులు విషమిస్తున్నాయని అర్థమవుతోంది నాకు. కానీ, వాటిని ఎలా ఆపాలో మాత్రం తెలియడం లేదు. ఆడపిల్ల అన్నాక వేధింపులు తప్పవు కదా అని సరిపెట్టుకున్నా. కానీ, మగ పిల్లాడికీ ఇబ్బందులు తప్పలేదు.
వాళ్ళ పండుగ వేడుకల్లో మేమంతా పాల్గొంటాం. కానీ, మా పండుగల్లో వాళ్ళెవరూ కంటికి కూడా కనిపించరు. సరికదా, పండుగ వంటలు ఇస్తే తీసుకోవడానికి కూడా ముఖాలు అదోలా పెట్టుకునేవారెందరో. తిరిగి మూర్ఖులమని మాపైనే ముద్ర వేస్తారు. ఇప్పుడైనా మీకు అర్థమైందా? ఇన్ని ఏడుపులను దిగమింగుకుంటూ కూడా పైకి అంతా సజావుగా వున్నట్టు మేం అబద్ధాలే చెబుతాం. నిజం, చాలాసార్లు అబద్ధాలు చెప్పక తప్పదు. చెప్పీచెప్పీ మా బతుకే అబద్ధం అయిపోయింది.
అయితే, ఆవిడ భర్తపై ఎవరో దాడి చేశారని, ఆసుపత్రిలో వున్నారని తెలిసి పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆమె అన్న మాటలు నా కళ్ళను మరింత తెరిపించాయి. “చెయ్యాల్సిందంతా చేయించేసి, ఇప్పుడు నంగనాచిలా పరామర్శకు వచ్చావా? లేక మమ్మల్నందర్నీ కూడా లేపేయాలని ప్లాన్ వేసుకుని వచ్చావా?” అంది.
ఆ ఆలీబాబా ఎంత తెలివైనవాడో నాకప్పుడు మరింత బాగా తేటతెల్లమైంది. మన వేలితో మన కన్నే పొడిపిస్తూ కూడా దాన్నే దేశభక్తి అని ఒప్పించగల సమర్థుడు. చాటునైనా యథార్థం చెప్పుకోవాలి. అటువంటి వారిని ఎదుర్కోగలిగేది వాళ్ళాయనలాంటి వాళ్ళే. నిజమే!
“ఆవిడ నమ్మడం లేదు గాని, ఈ హత్యకు… అదే హత్యాయత్నానికి కారణం ఆలీబాబానే. కన్‌ఫ్యూజ్ చేయడానికి అని ఆమె అంది గానీ అసలు సైతాన్ అని పెడితే, ఏ కన్‌ఫ్యూజన్ వుండేది కాదు. హత్యలు, ఊచకోతల నుంచే నాయకుడిగా ఎదిగినవాడతడు. అంటే స్వయంగా చేస్తాడని కాదు, చేయిస్తాడు. అందుకు అధికారబలాన్ని అర్థవంతంగా వినియోగిస్తాడు. అందరం ఒక్కటిగా వున్న మమ్మల్ని విడదీసి, వేర్వేరని చాటింది అతడే. మమ్మల్ని బూచాళ్ళను చేసిందీ అతడే.
ఆయనేదో మా అసలు రంగు బయట పెట్టాడని అంటారు గాని, ఎప్పుడూ పచ్చగా వుండాలనుకోవడం తప్పితే, నిజానికి మాకే రంగులూ లేవు. రంగులు మార్చాల్సిన అవసరం, ఆస్తులు కూడబెట్టగలిగే అవకాశం మాకు లేవు. అలాగే పొట్ట చేత్తో పట్టుకుని ఆ మూల నుంచి ఈ మహానగరానికి వలస వచ్చాం. మొదట్లో మా వాళ్ళందరూ ఎక్కువగా వుండే ప్రాంతంలో వున్నాం. అక్కడ చాలామంది పొట్ట కూటి కోసం ఏదో ఒక పని చేసుకుని బతికేటోళ్ళే. వాళ్ళందరికీ చిన్నవో, పెద్దవో దుకాణాలు వున్నాయి. పళ్ళమ్ముతారు, గాజులు వేస్తారు, రకరకాల సెంట్లు అమ్ముతారు – ఒకటేమిటి కూటి కోసం కోటి విద్యలు. మరికొందరు ప్లంబర్లు, ఏసీలు పెట్టేవాళ్ళు, మెకానిక్‌లు, పంచర్లు వేసే వాళ్ళు. వీళ్ళు పొద్దంతా కిందామీదా పడినా బావుకునేదేమీ వుండదు. పైగా ప్రభుత్వాలు మాకేవో సబ్బిడీలు, నిధులు ఎత్తి పోసేస్తోందని ఒకటే ఏడుపు. అదేదో సవ్యంగా జరిగితే మా బతుకులు ఏళ్ళ తరబడి ఇలాగే ఎందుకుంటాయంటే మాత్రం సమాధానం ఎవరూ చెప్పరు.
అక్కడ వుంటే పిల్లల చదువులు కష్టమని అర్థమయ్యింది. వాళ్ళు బాగా చదువుకోవాలనే ఇంత దూరం వచ్చాం. కాస్త నా ఉద్యోగం కుదుట పడ్డాక పిల్లల స్కూలుకీ, నా ఆఫీసుకి దగ్గరగా వుండే ప్రాంతంలోని బస్తీకి మారాం. కానీ, అక్కడ అంతా మమ్మల్ని ఒకరకంగా చూసేవారు. ఎవరూ ఏం అనకపోయినా ఆ వాతావరణంలో ఇమడటం కష్టమైపోయింది. ఎలాగో నాలుగేళ్ళు గడిపేశాం. ఈలోగా నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి జీతం కాస్త పెరిగింది. పిల్లలూ పెద్దవాళ్ళయ్యారు. ఆర్థికంగా భారమే అయినా, ధైర్యం చేసి ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాం. ఏదో పూట గడవడానికి పెద్ద ఇబ్బంది లేదన్న మాట తప్పితే, పెద్దగా సుఖపడుతున్నదేమీ లేదు. అయినా, సందర్బం వచ్చిన ప్రతిసారీ మా దేశభక్తిని నిరూపించుకుంటూనే వున్నాం.
అదిగో అటువంటప్పుడు మామూలుగా ఏర్పడిన పరిచయం వాళ్ళాయనను స్నేహితుడిగా మార్చింది. అప్పట్నించి మావి రెండు కుటుంబాలు కాదు, ఒకటే కుటుంబం అన్నట్టు మెలిగాం. ఆర్థిక విషయాలే కాదు, ఆంతరంగిక విషయాలు కూడా అరమరికలు లేకుండా మాట్లాడుకునే వాళ్ళం. ఒకరకంగా చెప్పాలంటే, ఆయన సాన్నిహిత్యం నాకు ధైర్యంగా వుండేది.
‘ఉర్దూ కాకపోయినా, కాస్త హిందీ అయినా నేర్చుకో. లేకపోతే మీ వాళ్ళలో నీ పరువు పోతుంద’ని నన్ను ఆటపట్టించేవాడు. ఉర్దూలో చాలా మంచి కవిత్వం వుందని; ఎవరైనా ఉర్దూ వచ్చినవాళ్ళు దొరికితే తెలుగులో చెప్పించుకోవాలనే ఉబలాటం వుండేదతడికి. అన్నట్లు ఆయన ఒకప్పుడు కవిత్వం రాసేవాడు. తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అయి దాన్ని అటకెక్కించేశాడు. ఈ మాట నాది కాదు, అతని సాహితీ మిత్రులది కూడా.
రాజకీయాలు మాట్లాడేది, చేసేదీ; ఎక్కువగా కనిపించేదీ మగవాళ్ళే. కానీ, వాటి మొదట ప్రభావం మొదట పడేది మాత్రం ఆడవాళ్ళపైనే. మేమెప్పుడూ గమనించనే లేదు, మా మధ్యకు ఆ విషరాజకీయాలు ప్రవేశించాయని. కానీ, వాళ్ళావిడ చర్యే మొట్ట మొదటిసారి ఆ విషయాన్ని బయటపెట్టింది. ఫ్లాట్‌లు వేరైనా, ఒకరింట్లోకి ఒకరం స్వేచ్ఛగా వెళ్ళేవాళ్ళం. అలాంటిది ఓ రోజు ప్లాస్టిక్ కుర్చీ బయట వేసి కూర్చోమంది. హాలు దులుపుతున్నామని సాకు చెప్పింది. అప్పుటి దాకా నిద్రపోతున్న నా తెలివి మేల్కొంది. ఆమధ్య జరిగిన అనేక సంఘటనలు ఒక్కసారిగా కళ్ళముందు మెదిలాయి. నన్ను చూడగానే ఆమె ముఖంలో కనిపిస్తున్న అసంతృప్తి నాలో అణగారిపోయిన అశాంతిని మళ్ళీ నిద్రలేపింది.
నెమ్మదిగా అటూ ఇటూ మారే వంటకాలు ఆగిపోయాయి. ఏవైనా పెద్దపెద్ద పండుగలప్పుడు తప్ప ఒకరికొకరు ఏమీ ఇచ్చుకోవడం లేదు. అది కూడా పిల్లలతో పంపించడమే. పిల్లలు కూడా బయట ఏమైనా కలిసి ఆడుకుంటున్నారేమోగానీ, ఒకరిళ్ళకు ఒకళ్ళు రావడం తగ్గిపోయింది.
నా భార్య ముఖంలో కూడా దిగులు చోటు చేసుకుంది. ఎటువంటి తప్పూ చేయకపోయినా, శిక్ష అనుభవిస్తున్నామనే భావన ఆమె కళ్ళలో వ్యక్తమయ్యేది. నేను మాత్రం చేయగలిగేదేముంది. ఏం జరిగినా భరించుకోవాల్సిందే తప్పితే, తప్పించుకుని వేరే ఏ దేశానికో పోలేం కదా?
భార్యంటే గౌరవం వున్నవాడిగా ఆమెలో వచ్చిన మార్పును కూడా గౌరవించాలనుకున్నాడో లేక కుటుంబంలో కలతలెందుకనుకున్నాడో – ఆయన గతంలోలా మా ఇంటికి చొరవగా రావడం మానేశాడు. కానీ, గుడ్డిలో మెల్లలా, కలిసినప్పుడు చూపించే ఆదరణలో మార్పు ఉండేది కాదు. అంతేకాదు, మరింత ఎక్కువ ఆత్మీయత కనబరుస్తున్నాడు. కానీ, ఆ ఆత్మీయతను నేను ఇంతకుముందులా అనుభవించలేకపోతున్నా.
సరిగ్గా, అటువంటప్పుడే ఓ రోజు ‘మీ వాళ్ళు మరీ మూర్ఖులబ్బా’ అనేశాడు. ‘ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి కదా. అది నువ్వే ఎందుకు కాకూడదు’ అని ఉద్రేకపరిచాడు. కానీ, ఇప్పుడిప్పుడే జీవితంలో ఏదోలా కుదురుకుంటున్న నేను అటువైపు అడుగు వేయడానికి జంకాను. అతడు మూర్ఖులు అన్నందుకు బాధ పడలేదు. మొట్టమొదటిసారి ‘మీ వాళ్ళు’ అని నన్ను వేరు చేసి మాట్లాడినందుకు గుండెల్లో కలుక్కుమంది. అలా మా మధ్యన దూరం పెరగడం మొదలైంది. గేటెడ్ కమ్యూనిటీలో పరిచయస్తులుగా వున్న ఇతరులు కూడా క్రమేపీ దూరమయ్యారు. అలాని, వారికి నామీదేదో ద్వేషం వుందని అనుకోను. కాకపోతే, కనిపించని గోడలేవో లేచాయి మామధ్య.
చూశారా, నేను కూడా పొరబాటు మాటలు మాట్లాడుతున్నా, ‘గోడలు లేచాయి’ అని. కాదు, ‘లేపారు’ అనేది నిజం. నిజానికి వారికి వారి మానసిక ఉద్వేగాలను చల్లార్చుకోవడానికో, పంచుకోడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. సాంస్కృతిక కళా సంఘాలున్నాయి. నాటకాలున్నాయి. సినిమాలున్నాయి. సాహిత్య సంస్థలు, ప్రజా సంఘాలు… ఒక్కటేమిటీ అన్నీ వాళ్ళకే ఉన్నాయి. మరి మాకో? అలా చాలా ఏళ్ళ తర్వాత నాకు నేను పరాయినయ్యాను.
అటువంటి పరిస్థితుల్లో మా వాళ్ళు ఎక్కువగా వుండే ప్రాంతంలో అతడి మీద దాడి జరిగింది. ఎందుకు జరిగిందీ, ఎలా జరిగిందీ… ఏమీ నాకు తెలియదు. కానీ, ఎన్నో ఏళ్ళనుంచీ నాతో, నా కుటుంబంతో పరిచయం వున్న ఆమె అదేదో నేనే చేసినట్టు ఇంటికి వచ్చి నానా మాటలూ అంది. శాపనార్థాలు పెట్టింది. దాడి జరిగిన తీరు, ప్రస్తుతం వాళ్ళాయన వున్న పరిస్థితి ఆమె పూర్తిగా సంయమనం కోల్పోయేలా చేశాయని నేను అర్థం చేసుకోగలను. కాని, అంత విషం ఆమెలోకి ఎలా ప్రవేశించదన్నదే అర్థం చేసుకోలేకపోతున్నాను.
కేవలం ఆమె వున్న పరిస్థితిని అర్థం చేసుకోవడం వల్లే కాదు. ప్రస్తుత సామాజిక పరిస్థితులు కూడా తెలియడం వల్ల నేనే కాదు, నా భార్య కూడా నోరు మెదపలేదు. సైతాన్ మాయలో వున్న ఆమె నన్ను అర్థం చేసుకోగలదనే నమ్మకం నాకు లేదు.
అందుకే ఈ దాడికీ ఆలీబాబాకు ఉన్న సంబంధం గురించి ఆమెతో నేనేమీ చెప్పలేకపోయా. ఆమెను కనీసం పరామర్శించలేకపోయా.
“అల్లా దయవల్ల నా స్నేహితుడు కోలుకోవాలి. ఆయనే అసలు నిజాలు బయట పెట్టాలి.”
“ఆలీబాబా గుహలోని దొంగల సొమ్మును ప్రజలందరికీ పంచుతాడు – అది అలనాటి కథ. కానీ ఈ ఆలీబాబా అందుకు పూర్తిగా రివర్స్. దొంగలతో చేతులు కలిపి దేశాన్ని నిలువు దోపిడీ చేయడం ఈనాటి కథ. ఆవిధంగా చూస్తే మా ఆవిడ ఆ సైతాన్‌కి ఆలీబాబా అని పేరు పెట్టడం కరెక్టే. మతం మత్తుమందన్న మాటను మా వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు. అతడు బాగానే గ్రహించాడు. అందుకే కుల, ప్రాంతీయ, భాషా విభేదాలు లేకుండా అందరి రక్తంలోకి ఆ మత్తు ఎక్కించేశాడు. అందుకే నా హత్యకు కారణం ఆ ఆలీబాబానే అని చెప్పక తప్పదు. కానీ, అతడికి నేనెవరో కూడా తెలీదు. తెలియాల్సిన అవసరం కూడా లేదు. అతడు ఆడుతున్న నెత్తుటి జూదంలో పావులైన కొందరు అవివేకం కొద్దీ నన్ను చంపేయాలనుకున్నారు. కానీ వాళ్ళకూ నేనెవరో తెలియదు. ఇంకో సంగతి చెప్పనా వాళ్ళు కూడా నాకు తెలియదు.
అంతా చిత్రంగా వుంది కదూ?
ఒకరికొకరు ఏమాత్రం తెలియకపోయినా చంపేయాలనే తీవ్రమైన కసి పెల్లుబికడమే నేటి వైచిత్రి. ఈ హత్యలు పెరుగుతున్న కొద్దీ… వాటిని నివారించగలిగిన వాళ్ళు అదృశ్యమైపోతున్నారు – నాలాగే.
ఇప్పుడు నాపై చాలా పెద్ద బాధ్యత వుంది. నాపై దాడి చేసినవారి వివరాలు చెప్పకపోవడమే ఆ బాధ్యత. ఆవి బయటపడితే పరిస్థితులు ఎలా మారతాయో నాకు తెలుసు. ఎంత మారణహోమం సృష్టించచ్చో వారికి తెలుసు. అందుకే ఇప్పుడు నేనేమీ చెప్పను. మరోరకంగా చెప్పాలంటే చెప్పగలిగే పరిస్థితిలో లేను. నేను ఒక్క ముక్క చెప్పకపోయినా, నేనే అలా చెప్పానని నమ్మించగలిగే శక్తి వాళ్ళకుంది. నమ్మే అవివేకం మీకుంది.
మా ఆవిడకు ఆలీబాబా అసలు రూపం తెలియదు. అందుకే వాళ్ళని తప్పుబడుతుంది. నేనేమీ వాళ్ళను పూర్తిగా వెనకేసుకురాను గాని, వాళ్ళు కొంత బాధ్యతగా వ్యవహరించగలిగితే బావుండునని అనుకున్నా. ఈ మాత్రం అన్నందుకు మా పక్కింటాయనే కాదు, ప్రగతిశీలురమని చెప్పుకునే మా వాళ్ళలోని కొంతమంది నొసలు చిట్లించారు. సన్నిహితులు మాత్రం నేను పడగ విప్పుతున్నానని రాత్రి పూట విందులో సెటైర్లు వేశారు. చివరి విందులో ఎవరు మోసం చేస్తారో జీసస్‌కు తెలుసు. ఈ పోరాటంలో బ్రూటస్‌లెవరో నాకు తెలుసు. అయినా, నాది జనారణ్యంలో సైతం అరణ్య రోదనే.
ఇంతకీ నేనేమన్నా? మతం ఏదైనా దానిలోని ఛాందసత్వాన్ని, మూర్ఖత్వాన్ని ఖండించాల్సిందే కదా అన్నా. వాళ్ళలోంచి ఒక్కడైనా ముందుకొస్తే వాళ్ళ వాళ్ళని సంస్కరించడం సులువు అవుతుందని వాదించా. నా వంతు ప్రయత్నంగా పక్క ఫ్లాట్ ఆయన్ని కదిపా. కానీ, భయమో, బతుకుపోరో… అతడు ముందుకు రాలేదు.
అందుకు నాకేమీ అతడిపై కోపం లేదు. కానీ, నేనూ అందరిలాగే మారిపోతున్నానని అతడు అనుకున్నాడు. అప్పట్నించి కాస్త దూరం జరిగాడు. కాస్త దూరమేనా? ఇంత జరిగి… నేను ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య వుంటే కనీసం పలకరించలేదు! వాళ్ళావిడను అర్థం చేసుకోగలను. నాలుగువైపులా కమ్ముకొస్తున్న విషవాయువు నుంచి తప్పించుకోడానికి కాదు – తన భర్తనీ, పిల్లలనీ కాపాడుకోవడానికి తెగ తాపత్రయపడుతోంది. మరి, అలాంటి మహిళకు మరో స్త్రీ హృదయం అర్థం కాలేదా? నా ప్రమాదకర పరిస్థితి తెలిసీ, మా ఆవిడను గుండెలకు హత్తుకోలేకపోయిందా?
ఒకసారి ఆఫీసులో కొలీగ్ అన్న మాటలు ఇప్పుడెందుకో పదేపదే గుర్తుకొస్తున్నాయి. “మీరు వాళ్ళని ఊరికే వెనకేసుకొస్తారు సార్, ఒకసారి వాళ్ళ ఏరియాకు వెళ్ళండి. వాళ్ళ జులుం ఎలా వుంటుందో తెలుస్తుంది” అన్నాడు. నేను నవ్వి ఊరుకున్నా. ఎందుకంటే, నేను చాలాసార్లు అక్కడి మిత్రులతో కలిసి వాళ్ళ ఏరియాలో తిరిగిన సందర్భాలు అనేకం వున్నాయి.
మరి, అలాంటి నాపైనే ఇప్పుడు దాడి ఎందుకు జరిగింది? వాళ్ళవాళ్ళెవరూ నా వెంట లేకపోవడమే కారణమా? అంతేనా? అంతే…?
ఇదంతా ఒక విషవలయం. విషవాయువు వెలువడుతున్నప్పుడు ఊపిరి పీల్చినా ముప్పే, ఊపిరి బిగబట్టినా ముప్పే.
అతి కష్టం మీద ఒక కన్ను తెరవగలిగా. ప్రస్తుతం ఏ శరీర భాగాన్నీ కదపలేను. ఏవో గొట్టాలు, ట్యూబులు స్టిక్కర్లతో కదలకుండా అతికించి పెట్టారు. అవును, ఎంత హడావిడి చేస్తే ఆస్పత్రి వారికి అంత మేలు. నా భార్య దగ్గర నుంచి అంత ఎక్కువ డబ్బులు గుంజొచ్చు. విషాదం ఏమిటంటే, ఇక్కడ గుంజేవాడు మా వాడే. కానీ, ఎవ్వడూ నోరు మెదపడు. ఒక్కంటినై నీరసంగా దృష్టి సారిస్తే కుడి చేతి చివర మణికట్టు దగ్గర ఎరుపు, పసుపు దారాలతో తాడేదో కట్టివుంది. ఇంత మంది డాక్టర్లు, ఆధునిక వైద్యాలు కాపాడలేనిది ఆ తాడేం కాపాడుతుంది. కానీ అదొక నమ్మకం.
అవును, నమ్మకం స్లో పాయిజన్ లాంటిది, బాగా పని చేస్తుంది, మనకు తెలియకుండానే.
ఏవో మాటలు వినిపిస్తున్నాయి, నెమ్మదిగా. డాక్టర్లు వస్తున్నట్టున్నారు. ఇంకో రెండు రోజులు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని – బహుశా నా భార్యతో కాబోలు చెబుతున్నారు. అవును, ఎన్ని రోజులు నేనిక్కడుంటే అన్ని డబ్బు కట్టలు వెనకేసుకోవచ్చు. కానీ, నేను పోతేనో?
నాకు ప్రాణాల మీద ఆశలేదు అనను గాని, పోతానన్న భయమూ లేదు. కాకపోతే నా భార్యా పిల్లలు దిక్కులేనివారైపోతారు – ఇదొక కారణం నేను బతకాలనుకోవడానికి. మరో కారణం – నేను పోగానే జరిగిన సంఘటన వివరాలన్నీ బయటపడతాయి. దాంతో మళ్ళీ మరో ధ్వంసరచన జరగొచ్చు. కథలో ఆలీబాబా వెనుక వున్నది నలభైమంది దొంగలే, ఇక్కడ అనేకమంది దొంగలు.
బహుశా, నేను కూడానేమో?
అలా అనుకోగానే నా గుండె ఉద్వేగంతోనో, దుఃఖంతోనో, నిస్సహాయతతోనో ఎగసిపడింది.
వెంటనే ఎవరెవరో కంగారుగా లోపలకు వస్తున్న హడావిడి… ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక నేనింకేమీ చెప్పలేను – నా ప్రమేయం లేకుండానే, నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి.
మీరైనా కళ్ళు తెరవండి.
ఓపెన్ సెసేమ్!