ఎండ పొంగిపోయి,
పొర్లిపోయిన తరువాతి సాయంత్రం-
వడగాలికి విరుగుడులా,
ఆ ఉంగరాల జుట్టు పిల్ల
కిలకిలలాడుతూ కుక్కను వెంటేసుకొస్తుంది.
అప్పటి వరకు ఎక్కడో కాపేసిన పిలగాళ్ళు
భయపడుతూనే చుట్టూ చేరతారు
వాళ్ళేం మాటలు విసురుతారో-
ఫౌంటేన్‌లోంచి నీళ్ళు చిమ్మినట్టు
చివాల్న ఒకటే నవ్వుతుంది
ఆ పిల్ల, చేయడ్డెట్టుకుని.
వాళ్ళు నింపాదిగా తిరిగిన నాలుగు సందుల దారుల్లో
బుగ్గల్లా ఎరుపెక్కిన మోదుగుపూలు
పిలగాళ్ళ బితుకుబితుకు చూపులకు
తెగిన మాటల వెతుకులాటలవుతాయి.
బాదం చెట్టు నుంచో, వేప చెట్టు నుంచో
ఆకులు రాలిపడుతున్నట్టు
ఆ పదునాలుగేళ్ళ పిల్లది చూపులు తిప్పుతుంటే
కొత్త యవ్వనంతో వీధులు ఒళ్ళు విరుచుకుంటాయి
విరుపు విరుపులో విరహపు
ఉత్సవ పరిమళాలు గుప్పుమంటాయి.
యవ్వనానికి కట్టిన సమాధుల్లో
మధ్యాహ్నపు నిద్ర చాలించిన ముసలాళ్ళు
అక్కడక్కడా చూసి,
ముఖం చిట్లించుకుంటూ మరింతగా
కూరుకుపోతారు నిశ్శబ్దాల్లోకి.
ఎందుకో మరి, కుక్క కూడా
ఇక చాలించండి వేషాలన్నట్టు
మొహమాటంగా తలెత్తి
ముద్దు ముద్దుగా మొరుగుతుంది.
చివరి క్షణాల్లో తత్తరపడ్డ పిలగాళ్ళు
అటో ఇటో అదృశ్యమైపోతారు
రాలిన ఆకులపై సొమ్మసిల్లిన ఎండ
నంగనాచిలా తొలి యవ్వనాల్ని నంజుకుంటుంది
ప్రణయపు గాలి కమ్ముకున్న వీధుల్లో
ఇప్పుడు చీకటి నిర్భయంగా బీటేస్తుంది.