బాల్యం ఒర్రెలా ప్రయాణమై
నూనూగు రోషం వాగులా పరిగెత్తి
యుక్త వయస్సు నదిలా ప్రవహించి
సముద్రపు ఇరుకిరుకు బాహువులలో
నన్ను షరతులు లేకుండా
స్వచ్ఛందంగా సమర్పించుకున్నాను
నీ సంగమంలో కోడెలా మసిలి
అలలుగా వాయుగుండాలై
మెరికల్లా మెలికలు సోలి పోయి
సంగతం కన్న కలలే తుఫాన్లు
శుభ్రజ్యోత్న నీలాకాశం కింద
గుసగుసల ముచ్చెమటల ముచ్చట
ఇరువురికి తెలియని
ఒక ఆపతి ఇరువురి సోపతి
ఫెళ ఫెళ ఆర్భాటాల
ఉరుములు మెరుపులు
వానలో తడిసిన పిల్లల
తడి తడి ఆశల
పడవ ప్రయాణం
దుక్కి నేలలో మొలకెత్తిన
పచ్చ పచ్చని పంట స్వప్నం
ఒకానొక సంజీవని జీవకళ
చుక్కల అంశ పసికందు మొక్కలు
కాల్చుకున్న ఉడుకుడుకు
పల్లి కాయ బెల్లంతో కలిపి తిన్నట్టు
విరహ వియోగ సంయోగ సముద్రం
నీతో నేను నాతో నీవు
రహస్యమో బహిరంగమో
నీళ్ళాడే మళ్ళీ మళ్ళీ
కిరణజన్య రసక్రియ విద్య