‘నన్ను పీడించే ఒక జీవితకాల వేదన ఈ నవల’ అంటారు ఒంటరి నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి.
బాలగోపాల్ చెప్పినట్టు, చైతన్యయుతంగా జీవించక తప్పని మనిషికి జ్ఞానం చాలా అవసరం. మన కళ్ళ ముందు ఉండి కూడా మనం చూడనీ చూడజాలనీ విషయాలనేకం ఉంటాయి. కొన్ని భయం వల్ల చూడము. కొన్ని అభద్రత వల్ల చూడము. కొన్ని ఒక బలమైన భావజాలం వల్ల మన ఎదుట ఉండీ మనకు కనిపించవు. ఒక్కొక్కసారి మనకు అలవడిన దృక్కోణం వల్లగానీ మనం ఎంచుకున్న దృక్కోణం వల్లగానీ కొన్ని విషయాలు కళ్ళముందే ఉండీ కనిపించవు. వీటిలో విడివిడి విషయాలే కాక, సామాజికక్రమ పరిణామాలు కూడా ఉంటాయి. వీటిని మనకు చూపించడం సాహిత్యం చేసే పనులలో ఒకటి. అలా చూపించే క్రమంలోనే, ఏ భయం, ఏ అభద్రతా భావన, ఏ భావజాలం, లేదా ఏ పాక్షిక దృక్కోణం, మన చూపును కప్పేసిందో కూడా సాహిత్యం చెప్పకుండానే చెప్తుంది. ‘అరె! ఇది నాకు తెలిసిన విషయమే గానీ చూడలేకపోయానే!’ అనుకునేటట్టు చేస్తుంది. మంచి సాహిత్యమెప్పుడూ ఆ అనుభూతి కలిగిస్తుంది. ఒంటరి అటువంటి కోవకు చెందిన రచన.
క్లుప్తంగా కథ ఏంటంటే…
డాక్టర్ రాఘవ హృద్రోగ నిపుణుడు. వృత్తితో కోట్లు, షుగరుతో పాటు ఇంకా అనేక వ్యాధులూ సంపాదించిన వ్యక్తి. ఏభై ఏళ్ళ వయసులో పుట్టిన ఒక తపనతో కొంతమంది సాధువులనూ అవధూతలనూ కలుస్తాడు. వారు ఇతని ఆరోగ్యం కూడడం కోసం అరికెలు తినడం, ప్రకృతితో సహజీవనం చేయడం ఉపాయాలుగా చెబుతారు. ఆ అన్వేషణలో ఇతను నర్సయ్య అనే రైతును కలుస్తాడు. నర్సయ్య తాత్త్వికుడు. వ్యవసాయం వృత్తి. తీరిక దొరికిందంటే రామాయణం చేతిలో ఉండాల్సిందే. పద్యజ్ఞానం బాగా ఉంది. ప్రకృతితో మమేకమైన ఆత్మ. ఇప్పుడు అరికెలు ఎవ్వరూ సాగుచేయడం లేదు. తను జాగ్రత్తగా దాచిన సొరకాయ బుర్రలో నిలువచేసిన అరికె విత్తనాలు అదృష్టవశాత్తూ కూతురు జ్ఞాపకం చేయగా దొరకుతాయి నర్సయ్యకు. అరికెల కోసం, సహజ ప్రకృతిలో బ్రతకడం కోసం, అన్నీ వదలుకొని నర్సయ్య ఇంటి వద్ద నర్సయ్యే వేసిన గుడిసెలో నివాసం ఉంటాడు రాఘవ.
నర్సయ్య భార్య ఓబులమ్మ. కూతురు రాములమ్మ. మేనల్లుడికే ఇచ్చి చేస్తే కాపురం కుదరలేదు. తల్లి తొంభై ఏళ్ళ ముసిల్ది. ఆరోగ్యం కుదుటపడే వరకు షుమారు ఒక ఆరు నెలలు అక్కడే ఉండి అరికెలు పండింపించి, తీసుకుని వెళ్ళి సాధువుకు ఇవ్వాలని ఒక ప్రణాళికగా అనుకుంటాడు రాఘవ. అతని కోసం కాకున్నా, అంతరించిపోతున్న అరికెల్ని బ్రతికించాలని విత్తుతాడు నర్సయ్య. మెల్లగా ప్రకృతితో మమేకమైన నర్సయ్య బ్రతుకు అలవాటు చేసుకుందుకు ప్రయత్నిస్తూంటాడు డాక్టర్ రాఘవ. నర్సయ్య చేసే ప్రతి పని వెనుక, ప్రతి సంఘటన వెనుక, వ్యవసాయ (ప్రకృతి) జ్ఞానాన్నీ, తాత్త్వికతనూ పరిశీలిస్తూ అచ్చెరువొందుతూ, తను (మనిషి) ఎక్కడ తప్పిపోయిందీ విమర్శించుకుంటూ ఉంటాడు. నర్సయ్య తల్లి జిహ్వ చాపల్యం కలది. మాటలు విసరడంలోనూ జిహ్వ అదుపులేనిది. అన్నీ మంచంలోనే. కోడలూ మనవరాలూ, తిట్టుకుంటూనే పరిచర్యలు చేస్తుంటారు.
ఆ కుటుంబంతో ఉంటూ, వారి వారి పనులతోనూ, ప్రకృతితోనూ చెలిమి చేస్తూ ఆరోగ్యాన్ని నెమ్మదిగా కుదుట పరుచుకుంటుంటాడు రాఘవ. చక్కగా పైకి వచ్చిన అరికె పంటను గొర్రెలు తినేస్తాయి. గొర్రెల తప్పు కాదు, తప్పు కరువుది అంటాడు నర్సయ్య. అదృష్టవశాత్తూ ఆ రోజే వర్షం పడుతుంది. మరలా పుంజుకుంటాయి. కష్టమైన పరిస్ధితులలో తరతరాల చెట్లు కొట్టేసి అమ్ముకోవడానికి వస్తారు కొడుకూ ఊరి యువతరమూ. నర్సయ్య ప్రతిఘటిస్తాడు. నాగరికత పేరుతో పల్లెలు ఎలా కృశించి నశించి పోతున్నాయో నర్సయ్య చెబుతుంటాడు. రాఘవ డబ్బిచ్చి చెట్లను దత్తత తీసుకుంటాడు. ఫేసుబుక్కులో పెడతాడు. ఊరి జనానికి వైద్యం చేస్తాడు. పేరున్న హాస్పిటల్స్‌కు తన రిఫరెన్సుతో పంపిస్తాడు. అరికెలు పండుతాయి. నర్సయ్యను ఏం కావాలో కోరుకోమంటాడు. రంగనాథ రామాయణం కావాలంటాడు. రాములమ్మను ఒక ఫ్రెండ్‌లా భావిస్తాడు రాఘవ. వయసు అంతరమున్నా రాఘవ, రాములమ్మ ఆత్మీయ స్నేహితులవుతారు. ఆరునెలల సాంగత్యంలోనే అక్కడి మనుషులతోటి, చెట్టూచేమా రాయీరప్పా గాలీనీరూ ఆకాశంతో రాఘవ మమేకమవుతాడు. ఇపుడు అవన్నీ వదలి వెళ్ళాలా అని ఆలోచిస్తుంటాడు. రాములమ్మ ఆ సాధువును కూడా ఇక్కడికే రమ్మని, రాఘవను ఒక ఆసుపత్రిని ఇక్కడే కట్టమని అడుగుతుంది.
నగరాల్లో కెరీర్ వెంట పడి డబ్బూ పేరూ సంపాదించిన వారు మనిషి మౌలిక జీవనాన్ని వెతుక్కుంటూ ఇలా మసి మాడవుతున్న పల్లెలను కాపాడే ప్రయత్నం చేయమనే అభ్యర్ధనతో నవల ముగుస్తుంది. ఇంతే కథ.
ఇది ఉత్త కథే కాదు, అంతకు మించి…
నవల చదివిన తరువాత, కథనం కొన్ని రోజులు ఆలాపనగా వెంటాడుతుంది. మన గుండె లోతుల్ని తట్టి గతకాలపు స్మృతుల నెమరువేతకు తీసుకుపోతుంది. ఏది లోపించిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అసంకల్పితంగానే. ఇంకా ఆలోచిస్తే రచయిత పరచిన జ్ఞానం మీదనుండి, విస్తృతంగా, అతను స్పృశించిన అనేక కోణాలమీదికి దృష్టి పోతుంది. అనేకానేక ప్రశ్నలు ఉదయిస్తాయి. తల్లావజ్ఝల పతంజలి శాస్త్రిగారు చెప్పినట్టు ఇది కనీసం నాలుగువేల సంవత్సరాలకు జీవశక్తిని ప్రసాదించిన వ్యవసాయ సంస్కృతి గాథ. మఱ్ఱి విత్తనం లాంటి కథ. మనం గుటక వేసిన తరువాత మనలో విస్తరిస్తుంది. ఒక వ్యవసాయ జ్ఞానమే కాదు. మనిషి పుట్టుకకూ జీవితానికీ జీవికకూ, ప్రకృతికీ పరిసరాలకూ, పర్యావరణానికీ, కర్మకూ, బాధ్యతకూ, మరణానికీ ఉన్న సంబంధాలనూ, అన్నింటికీ ఆలంబన దేవుడే అని భావించి జీవించే భారతీయ తాత్త్వికతనూ సంపూర్ణంగా చిత్రించిన రచన. ఇది ఏదో అలవోకగా రాసిన రచన కాదు. ఎంతో అనుభవించి, స్పందించి, ఆక్రోశించి, పలవరిస్తే గాని ఇలాంటి అద్భుతమైన రచన వెలువడదు. వెతుక్కుంటే, ఉత్తి సంఘటనలూ సంభాషణలూ కావు, ఒక మెదడు తడుముడు ఉంటుంది. అది గుండెను తడుపుతుంది. అప్పుడప్పుడు కళ్ళను కూడా. నర్సయ్యను చూస్తే ఒక ఆరాధనా భావం కలుగుతుంది. అసూయ కూడా కలుగుతుంది అలా ఉండలేనందుకు. నర్సయ్య-మనిషి తాత్త్వికతకు ప్రతినిధి.
ఆ తాత్వికత నుంచి మచ్చుకు కొన్ని కనువిప్పులు…
– ప్రకృతి ఒడిలో జీవించాలంటే దాన్నుంచి కొంత పొందడమే కాదు. కొంత కోల్పోవడం కూడా ఒక ధర్మం.
– డబ్బుతో డబ్బు పండుతుంది గాని పంటలు పండవులే సారూ.
– పైరు సాగుచేస్తే కుందేళ్ళూ, జింకలూ పక్షులూ అందులోకి వస్తున్నాయా లేక వాటి కోసమే పైరు సాగు చేస్తున్నాడా?
– లెక్కతో ఏమైనా కొంటావు సారూ. విత్తనాలు,సేద్యం కూడా కొంటావు ఏదీ ఒక్క పదును వాన కొను.
– పెద్దపులుల్ని తరిమినోల్లం ఈ రోడ్డు మోజును తరమలేకపోయినం. రోడ్డు పెద్ద కొండచిలువయి ఊరును మింగింది.
– అయినా నేను చావనిస్తానా… స్ప్రేయర్‌తో నీరు చిలకరించి మొలకలన్నీ తడపనా… బతికించనా… రైతును నేను.
– గోడ కింద కూకొని కూకొనీ ఒళ్ళు చెదలు బట్టదా సారూ. భూమిలో పాతుకుని ఉండే ఈ చెట్టును కాసేపు కొమ్మలు ఆడించకుండా బిగదీసుకొని ఉండమను సూజ్జాం.
– రైతులమయ్యుండీ ఉత్త చేతుల్తో ఎట్లా పోతాము.
– నీలాంటి మాసి ఎవరోకరు ఎప్పుడోసారి అరికెలు కావాలనో కొర్రలు కావాలనో వస్తే అవి లేవని సెప్పాలంటే మాకు పానం సచ్చిపోతాది. నువ్వేం రైతువయ్యా అని యీసడించినట్టుంటాది.
– ఇన్ని రకాల చెట్లూ చేమా పిట్టలూ జీవులూ అన్నిట్నీ గుర్తుబెట్టుకున్నే… ఇవన్నీ నన్నొకన్ని గుర్తుబెట్టుకోలేవా. వీటన్నిటికీ నేను పరిచయమే… నా మాటలు గుర్తుబడ్తాయి.నా వొల్లు వాసన గుర్తుబడ్తాయి. నా ఎగుబుస దిగుబుస గుర్తుబడ్తాయి నేనంటే వాటికి భయం లేదుసార్… అందుకే నన్నేమనవు…
– నాకు నా బాసేలీ నా కుంటా రొండూ ఒక్కటే
ఇక కొన్ని ప్రశ్నలూ, కొన్ని ఆలోచనలూ…
ఇక్కడ రచయిత చెప్పిన మాటల్లో ఉదాత్తత ఉంది. కొన్ని ప్రశ్నలున్నాయి. ప్రకృతిని అర్థం చేసుకున్నవాడెవడూ దాన్ని విధ్వంసం చేయడు అంటారు రచయిత అదే మంచితనంతో. అయితే, ఇప్పుడు వ్యాపార ప్రయోజనాల నిమిత్తం విధ్వంసం చేస్తున్న వారెవరూ ప్రకృతిని అర్థం చేసుకోలేదనా? ప్రకృతి గురించి ఎక్కువ పరిజ్ఞానం ఉన్నవారు కదా వాళ్ళు? ప్రకృతిని కాపాడుకోవాలంటే కేవలం అర్ధం చేసుకోవడమొకటే చాలదు. మమేకం అవ్వాలి. దానికి తరతరాల కట్టుబాటు, ఒక సాంస్కృతిక వాతావరణం అవసరం.
అయితే, చిన్న కమతాలనుండి పెద్ద కమతాలకు మారడం అనే అనివార్యమైన ఈ సంధికాలంలో, ఇది ఎలా సాధ్యం? చిన్న కమతాలు ఒక కుటుంబాన్ని పోషించలేని పరిస్ధితి. కనీసం 15 ఎకరాలు నీటి వసతిగల పొలంగాని, 30 ఎకరాల వర్షాధారపు భూమిగాని (రెండు పంటలు లేదా ఒక పంట+పశుగ్రాసం) ఉంటేనే ఓ నలుగురు ఉన్న కుటుంబం గౌరవంగా బ్రతుక గలిగిన పరిస్ధితి, అదీ కనాకష్టంగా. అంత పొలం సాగుచెయ్యడానికి నలుగురున్న కుటుంబశ్రమ మాత్రమే సరిపోదు. ఇతర కూలీల శ్రమ అవసరం. యంత్ర సహాయం అవసరం. యంత్రాలకు కూడా మన్నిక లేని పరిస్ధితి. విత్తనాలకు మన్నిక లేని పరిస్ధితి. ఎరువులూ మందులూ అదే స్ధితి. నీరూ వర్షమూ నమ్మకం లేని స్ధితి. నర్సయ్యలాగా వర్షాన్ని నిలదీయడం వల్ల ప్రయోజనం లేదు. చిన్న కమతపు బిందువులన్నీ పెద్దవై వ్యవసాయం ఒక పెద్ద వ్యాపార నియామకంగా మారడం ఒక సామాజిక అనివార్యతలా అగుపిస్తోంది. రైతులందరూ అదృశ్యమయితే తరువాత జరగబోయేది అదే. అటువంటి వాకిట్లో ఉన్నాం. వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయానికే తప్ప, అందులో మిళితమైన రైతు ఆత్మాభిమానానికి విలువ లేదు. రైతు పొలంతో ఐడెంటిటీని పొందనపుడు ప్రకృతితో ఎలా పొందగలడు అనే ప్రశ్న వస్తుంది. ఇది ఒక ఉప్పెన. సాంస్కృతిక వ్యవస్ధ బద్దలైనపుడు మరేదో వెతకాలి– బహుశా పెద్ద కమతాలు ఏర్పడేటట్లయితే, దానికి కొన్నిరెట్ల అడవిని సృష్టించాలనే నియమం లాంటిదేదో. ఈ నవల ఇటువంటి బలీయమైన ఆలోచనలను ఆదేశిస్తుంది.
ఇందులో నర్సయ్య అతి ఆదర్శవంతుడైన రైతు/మనిషి. నిజ జీవితంలో అలా అంత కర్షకఋషిలాగా ఉండగలగడం, రైతులందరూ, ఆ మాటకొస్తే ఏ వృత్తిలో వారైనా, అందరూ అలాగే ఉండాలని ఆశించడం భంగపాటుకే దారితీస్తుంది. ఏ సమాజంలోనైనా, వ్యవస్ధలోనైనా అందరు వ్యక్తులు అలా పోతపోసిన ధర్మనిరతి కలిగి ఉండడం అసంభవం. కానీ ఆశించడం అత్యంత అవసరం. రచయిత నిజాయితీ అయిన ప్రయత్నం ఇక్కడ కనబడుతుంది.
ఇక, నవలలో పరచిన వ్యవసాయ విజ్ఞానం కంటే, చివరిలో ప్రత్యక్షమయే ఆత్మీయ స్నేహం తీరు కంటే, నోస్టాల్జియా కంటే (ఎవరి నోస్టాల్జియా వారిదైనప్పటికీ బెంగటిల్లడం ఒకటే), రచయిత చెప్పే కర్మసిధ్ధాంతం కంటే, ముఖ్యంగా అందరూ ఈ నవలలో ప్రస్తుతం తఱచి తఱచి చూడాల్సింది రచయిత నిరూపించిన, ప్రకృతితో మమేకమయిన మన జాతి తాత్త్వికతనే. ఎందుకంటే, మనం మన పూర్వీకుల తాత్త్వికతకు మాత్రమే వారసులం, సహజ సంపదలకు కాదు. సహజ సంపదలు భావి తరాలకు చెందినవి.
ఈ నవల- ప్రకృతి, పరిసరాలు, వసతులు, సంపద, సుఖాలు, సౌకర్యాలు, బాధ్యతలు సమానంగా పంచుకోవడం చేతగాని మనిషి సాధించిన అభివృద్ధి, టెక్నాలజీ, యేడ్సనా అని అంతర్లీనంగా ప్రశ్నిస్తుంది. లక్షల సంవత్సరాలుగా మనిషి పొందిన అభివృద్ధి, అసమానతల కోణం నుండి చూస్తే వెనుకబడినట్టు కాదా అని అడుగుతుంది. దీనికి జవాబు చెప్పాలంటే, మనిషికి ప్రకృతితో ఒక కనీస సయోధ్య కుదిరే దిశగా అడుగులు వేయక తప్పదు. అందుకు ఇట్లాంటి రచనలు అందరూ చదువుతూ, ఆలోచిస్తూ, అవి లేవెనెత్తే ప్రశ్నలకు పరిష్కారాలను చర్చిస్తూ, వాటిని ఆచరణలోకి తెస్తూ ఉండడం, ఒక సామాజిక తక్షణ అవసరం అనిపిస్తుంది. అలా కానప్పుడు మనిషి చేసే కబళింపుకు ఒక్కొక్కటీ అదృశ్యమై చివరికి మనిషి మిగిలేది ఒంటరి గానే.