మీరు ఇంట్లో ఉన్నారు
ఆవేళ చికెన్ తింటున్నారు
కానీ, మీరా కోడిని అంతకుముందు
ఎప్పుడైనా పలకరించారా?
దాని కుటుంబ సభ్యులనో?
పోనీ, దాన్ని వండిన వారినో?
మరోసారి ఆదివారం కూడా మీరు
చికెనే తింటున్నారనుకుందాం.
అప్పుడైనా కోడి తాలూకు ఎవరితోనైనా మాట్లాడారా?
యోగక్షేమాలు విచారించారా?
మీరు కత్తి కాదు, అలాని పత్తిత్తూ కాదు-
పోనీ, అది పెట్టో, పుంజో చెప్పగలరా?
లేరు. అయినా-
మీ జీవితం ఎవరో దొంగిలించారని
అప్పటికైనా మీ ఆవిడకు చెప్పగలిగారా?
ఇప్పుడు మీరెక్కడైనా ఉండొచ్చు.
మీరీసారి మటన్ తింటూ ఉండొచ్చు
ఇప్పుడైనా చెప్పండి, మీకు ఆ కత్తి పదునెంతో తెలుసా?
పోనీ మేక మెడ నునుపు?
కనీసం అది మేకపోతుదో, పొటేలుదో?
తప్పించుకోడానికి సాధుజీవుల ముసుగేసుకుని
ఆకులు, అలములతో నోరు కట్టుకుంటారు
పొద్దుటి పోపు ఘాటుకు పొలమారిన గొంతులను
సంధ్యలో శృతి చేసుకుంటారు
అందుకే, నిగ్రహం విగ్రహం వదిలి
ఎప్పుడో నిమజ్జనమైపోయింది
అన్నట్టు, మీలోని రెండు గదులని
ఒకే గదిలో కాపురముండే ఇద్దరూ గుర్తించలేదు కదూ?
కావాలంటే, బెడ్రూమ్‌లోని డ్రాయర్‌ను
సర్..ర్ర్..న లాగి చూడండి
చటుక్కున మీ చేతిని తాకుతాయ్
కొన్ని ఈకలు, చర్మాలు
మెత్తగానో, మృదువుగానో మాత్రమే కాదు-
ఘనీభవించిన శిలల్లా,
దాంపత్యపు శిలాజంలా.
సరే, సర్దుకుపోయి చావండి
ఈ జన్మకి, పక్క టెముకల్లా.
అన్నట్టు, ఈ రోజైనా
తోడెట్టారా?
చల్లారిన పాలల్లోనైనా?