బహురూపుల వాన

ఆకాశం నుంచి ముత్యాలు
భూమి తలపైన దోసిల్లతో పోస్తుంది
దుక్కులు తడిసేంత వాన పడింది

ఉరుములు మెరుపుల చినుకులు
తెల్లారేసరికి ఏమి ఎరగనట్టు ఆకాశం
వాకిలి సాన్పు చల్లిపోయిన వర్షం

ఎండాకాలం పోలేదు వానాకాలం రాలేదు
దొంగ రాత్రి రేకుల మీద దబదబ సప్పుడు
బట్టతడుపు వాన కురిసి పోయింది

పగలంతా కురిసింది
భూమంతా తడిసింది
నాగలిసాలు వాన దంచి కొట్టింది

ఏనుగు తొండం దొడ్డు వాన
వరదలు పారి ఒర్రెలు పొర్లి
నడుముల వంటి వాగు పారుతుంది

నేల నెలత పచ్చి బాలింత
మూలకున్న నాగలి
పావురంగా రైతు భుజం ఎక్కింది

రెండు రోజులుగా ఒకటే ముసురు
అంపశయ్య మీద ముసలి ఎదురుచూపులు
బొండిగెల వంటి పారుతున్న మానేరు

ఒక్క వానకు రోడ్లు వాగులైనయ్
మొగ్గ తొడిగిన గొడుగులు పుష్పించినయ్
నగరం బతుకులు ఆగమాగం అడివడివయ్