ఎంత శ్రుతి చేసినా
పాట రాగం కుదరడం లేదు
గొంతు ఎంత సవరించినా
పల్లవికి యోగం కలగడం లేదు
పూల పరిమళాలను మోసుకొచ్చే
ఋతువు జాడ కానడం లేదు
కొనగోటితో మీటితేనే
సరిగమలు జలపాతాలై దూకేవి
చిన్న స్పర్శ తాకిడికే
శరీరం కువకువ పులకరించేది
బిగి కౌగిళ్ళ పొగలు
కక్కే వేడి నిట్టూర్పులు
పడకగది దాంపత్యం సత్యం
అవయవాలు తావు తప్పిన ఆనవాళ్ళు
వరమివ్వని వ్యవహారాలు
మంచాలు విడివడిపోవడం సత్యం
పడుతూ లేస్తూ
గౌరవ సూచకంగా
వయస్సు వెనకడుగు వేస్తుంది
మిసిమి మనసు
మూతి ముడిచి
పరువు పరుగు పందెం కాస్తుంది
బతుకు పుస్తకం
చివరి అధ్యాయంలో
సరిదిద్దుకోలేని
తప్పొప్పుల పట్టిక
ఎంతకూ కుదరదు గాత్రం
అంతు దొరకనే దొరకదు
నవ పునర్జీవన సూత్రం
రచయిత జూకంటి జగన్నాథం గురించి:
జూకంటి జగన్నాథం తెలంగాణకు చెందిన వచన కవి, కథకులు. ప్రధానంగా వచన కవిత్వం రాస్తారు. 16 కవితా సంకలనాలు, రెండు కథల పుస్తకాలు వెలువరించారు. ఆయనను 2025 జూన్ 30న తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ సభ్యుడిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1993లో ఆయన సాహితీ ప్రస్థానం ప్రారంభించారు. 2007- 2013ల మధ్య తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షునిగా వ్యవహరించారు. 2014 నుంచి ప్రస్తుతం అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. శ్రమదోపిడీ, రాచరిక వ్యవస్థ, ప్రభుత్వ వైఫల్యాలను తన కవితలు, రచనల ద్వారా ఎండగట్టారు. ప్రపంచీకరణపై మొదట్లోనే నిరసన గళం విప్పిన కవి ఆయన. స్థానిక మాండలికంతో సాగే ఆయన కవితలు కన్నడ, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లోకి అనువాదమయ్యాయి.