ఎడారి ఆకాశంలో
దిక్కుతోచని పక్షులమై ఎగురుతున్నప్పుడు
కొందరు వాలదగ్గ కొమ్మల్లా కనిపిస్తారు
గూడు విడవలేని బుల్లిపిట్టల నోటికి
ముద్దలందించే తల్లిపక్షుల్లా తోస్తారు
కొందర్ని మనం
పత్రహరితపు చెలమలనుకుంటాం
మనల్ని వాడిపోనివ్వని జీవసారమేదో
ఆ లోతుల్లో దాగుందనుకుంటాం
వెలుగు కన్నెత్తికూడా చూడని చీకటిగదిలో
ఒంటరితనపు పక్కమీద
నిద్రపట్టక దొర్లుతున్నప్పుడు
మనం ఆశాదీపాలనుకున్నవాళ్ళు
కిటికి సందుల్లో నుండి మిణుగురుల్లా
మెరిసి మాయమైపోతారు
కనబడని కాలం ఇరుసు చుట్టూ
భ్రమణాలు భ్రమణాలుగా చరిస్తున్నప్పుడు
ఎప్పుడో
ఏ పరావలయపు అంచుమీదో
ఇంకాస్త దగ్గరగా తారసపడతారు
ఇన్నాళ్ళూ దూరతీరాల్లో ఉంటూ
ఊరించిన వ్యక్తిత్వం ఉల్లిపొరల్లా విడివడగానే
గాఢ నిద్రలో ఉన్నప్పుడెవరో
ముఖాన కొన్ని చన్నీళ్ళను కుమ్మరించినట్టు
ఒక ఉలికిపాటు మనల్ని కుదిపేస్తుంది
గుండె ముక్కలవుతున్న చప్పుడు
అంత బతుకురొదలోనూ స్పష్టంగా వినబడుతుంది.