జానపద సాహిత్యంలో స్త్రీలు – 1

జానపదసాహిత్యం చరిత్రకందని యుగాల నుండి జీవిస్తూ జాతి జీవన చైతన్యాన్ని, క్రమ వికాసాన్ని ప్రతిబింబచేస్తున్నది. జానపద సాహిత్యంలో భిన్న భిన్న ప్రక్రియలున్నాయి. అయా ప్రక్రియల్లో సమాజగత నియమాలు, ఆచారాలు, సంప్రదాయాలు, దైవీభావన, స్త్రీ పురుష సంబంధాలు మొదలైన వెన్నో సందర్భానుసారంగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్త్రీ జీవిత చక్రంలోని పుట్టుక, బాల్యం, సమర్త, వివాహం, శోభనం, గర్భం, సీమంతం, ప్రసవం, మరణం లాంటి దశల ప్రతిఫలనాలు, భావ సంఘర్షణలు జానపద సాహిత్యంలో ఎంతో సమర్థవంతంగా చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా స్త్రీలే పాడుకున్న పాటలలో చెప్పిన కథలలో స్త్రీల హృదయావిష్కరణలు, అనుభూతులు చాలా సహజంగా కనిపిస్తాయి. భావాల వ్యక్తీకరణలో ఎంతో స్వేచ్ఛ ఉంటుంది. ముఖ్యంగా శ్రామిక వర్గానికి సంబంధించిన స్త్రీల పాటలలో విషయ వైవిధ్యంతో పాటు స్వేచ్ఛాప్రవృత్తిని మనం ఎక్కువగా గమనించవచ్చు. మధ్య తరగతి స్త్రీలకున్న నిర్బంధాలు, స్వేచ్ఛారాహిత్యం అక్కడ కనిపించదు.

జానపద సాహిత్యంలో గేయాలు, కథాగేయాలు, కథలు, ఆయా కళారూపాలు విశాలమైన పరిధిని కలిగి ఉండి స్త్రీల మనోభావాలను వ్యక్తిత్వాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తాయి. అటువంటి భావ ప్రకటనలున్న పాటలను పరిశీలించమే ఈ వ్యాస ఉద్దేశ్యం.

జానపద సాహిత్యంలో రామాయణ భారత భాగవతాదులకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా రామాయణంలో మానవ హృదయ స్పర్శ ఎక్కువగా ఉండడంవల్ల సీతారాములను జానపదులు తమవంటి వ్యక్తులుగా భావించి లెక్కకు మించిన పాటలు పాడుకున్నారు. వాటిలో స్త్రీలు తల్లిగా, కూతురుగా, అత్తగా కోడలుగా, వదినెలుగా బహుముఖాలుగా కనిపిస్తారు.

భూదేవి సీతమ్మను అత్తవారింటికి పంపుతూ బంగారు గిన్నెలో పాలు నెయ్యి పోసి సీతమ్మ చేయిముంచి వరుసగా రామునికి కౌసల్య, సుమిత్ర, కైకమ్మలకు శాంతమ్మకు అప్పగింతలు చేసింది. కౌసల్యతో

వదినరో నాపుత్రి ఇదివప్పగింత
పదిలంబుగా దీని బాగా చూడమ్మ
పాలు కాచగ లేదు బాల మా వదినరో
నెయ్యి కాచగ నేరదు నెలత సుమి మదినా
నేర్పుగా చెప్పు సీత మీదమ్మా

అని చెప్పింది. లోకంలో తమ కూతుళ్ళ స్వభావం ఎటువంటిదైనా తళ్ళులు వాళ్ళను వెనుకేసుకు రావడం కనిపిస్తుంది. కానీ భూదేవి అట్లాంటి తల్లికాదు. కనుకనే

బుద్ధులెరుగదు మంకు బుద్ధులే గాని
బుద్ధి వచ్చిన దాక దిద్దుకో వదినా

అని చెప్పి “దాని పంపి నేను తాళలేనని” బాధపడింది. ఇంకా సీతమ్మతో

పొద్దోయి పొరుగిళ్ళ బోకమ్మ
సందలడి చాకింటి కెళ్ళబోకమ్మ
వీధిలో తలకురులు విప్పబోకమ్మ
పదుగురిలో పన్నెత్తి నవ్వబోకమ్మ
మందిలో కన్నెత్తి చూడబోకమ్మ

అని ఎన్నో సాంఘిక కట్టుబాట్లను చెప్పింది. అటువంటి కట్టుబాట్లు ఏ రకంగానైనా, ఏ సాహిత్యంలోనైనా పురుషునికి చెప్పినట్లు కనిపించదు.

ఇటువంటిదే అప్పగింతలకు సంబంధించిన పాట నాటు కలుపుల్లో పాడుకుంటారు.

అత్తామామలతోని అందంగా తిరుగమ్మా
వారానే మాటలకు ఎదురాన బోకమ్మా
అమ్మారో సీతమ్మ పోయిరావే తల్లి
పోయాత్తగారింట్లో బుద్ధిగల్గి వుండమ్మ
కొమ్మా మాంచి కీర్తి తేవే పుట్నింటీకి

అని బుద్ధులు చెప్పుతూ “బావ మరుదలు ఉంటే బంతాడవద్దని”, “వారనే మాటలకు తిరిగి అనవద్దని”, “తోటి యారాండ్లతో తోడుగా ఉండుమని”, “అన్నమెరుగాదమ్మ నా సిన్న కూతురూ, అన్ని పనులూ చెప్పు అత్తరో కౌసల్య” అంటుంది.

“పొద్దున్నే లేచేవు సద్దన్న మడిగేవు
సద్దన్న మడిగితే ఎవ్వరు పెడుతరు బిడ్డ
పెరుగు వన్నం బెట్టి పెంచూకున్నానమ్మ
సద్దివన్నం బెట్టి సాదుకో కౌసల్య” అని ఆ తల్లి అప్పగింతలు పెట్టి కూతురుతో

“సక్కన్నీ కండ్లాకు సొక్కు నీద్రలొస్తే
కొంగుల్లు వేసుకా మలుసుకా పండక్క”

అని బుజ్జగించింది. చిన్ననాటి నుండే కుటుంబంలో స్త్రీ ఆకలి దప్పులను అణచుకొని ఏ విధంగా ఒదిగి ఉండాలో ఈ పాటలు వ్యక్తం చేస్తున్నాయి. ఆనాటి సమాజ నిర్మాణ లక్షణాలను స్పష్టంగా తెలుపుతున్నాయి.

జానపదుల సీతమ్మ విభిన్న భావాలకు ప్రతీక. అసలు సిసలైన జానపద స్త్రీ. ఒక రోజు సీతారాములిద్దరూ కలిసి దారిలో వెళుతుంటే సీతమ్మ కాలికి ముల్లు గుచ్చుకున్నది. రామునితో “ముల్లు తీరామన్న ముల్లు తీవయ్య” అన్నది. రాముడు “ముల్లెట్లు తీదును యీ మూకలోను” “కాళ్ళెట్లు పట్టుదు కన్నవారిలోను” “చెయ్యెట్లు పట్టుదు చెల్లెళ్ళలోను” అని తప్పించుకుంటాడు. భార్యతో అన్యోన్యంగా ఉంటే లోకం భార్య కొంగు వదలడంటుంది. ఇంకా పదిమందిలో భార్య కాలికి ముల్లు తీస్తే ఇంకేమనుకుంటారోనని భయపడతాడు. ఇంకా కొద్ది దూరం పోగానే పారిజాతపు చెట్టు కనిపించింది. సీతమ్మ పారిజాతాలు కోరనే కోరింది. రాముడు (ఎవరూ లేకుండా చూసి కాబోలు) కోసి తెస్తాడు. పువ్వులు ఆడవారికి సంబంధించినవి అంటారే కానీ “మగవారితో పువ్వులు మోయించగలము” అని సీతమ్మ తన ఆభిజాత్యాన్ని తెలిపింది.

ఒక సందర్భంలో సీతమ్మ ఆరునెలలుగా రామునిపై అలక వహించి కోపగృహంలోనే ఉంటున్నది. ఆమె అలక తీర్చడానికి రాముడు పెంపుడు చిలకను రాయబారానికి పంపుతూ

చిలకరో ఓ చిలక ఓ రామచిలక
ఎర్రని ముక్కుకు వెండి పొదిగిస్తు
పచ్చని రెక్కలకు పయిడి పూయిస్తు
నువ్వు పోయెడి తోవ సెలగ వేయిస్తు
సెలగ దిని చెయికడగ చెలమ తవ్విస్తు
అలసిపోయి కూర్చుండ అరుగు వేయిస్తు
నువ్వుబోయి రాముని కావమని పలుకు

అని చెప్పి పంపిస్తాడు. చిలుకను చూసి సీతమ్మ పోపొమ్మని తలబద్దలు కొడతానని బెదిరించింది. చిలుక పారిపోయింది. లక్షణుడు చిలుక చెవిలో ఏదో ఉపాయం చెప్పి సీతమ్మ దగ్గరికి చిలుకను పంపిస్తాడు. లక్ష్మణుడు చెప్పినట్టుగానే “ఆరు నెలల నుంచీ సీతమ్మ అలిగి పడుకుంటే రాములవారికి స్వస్థత తప్పింది పాపం” అని చిలుక పలకగానే సీతమ్మ వెంటనే దిగ్గున లేచి రాముని దగ్గరికి పరుగెత్తింది.

సామాన్య సంసారాల్లో నిత్య జీవితంలో ఎదురయ్యే కోపతాపాలకు నెలవైన స్త్రీల మానసిక స్థితి సీతమ్మలో ఏ విధంగా కనిపిస్తుందో పై పాట వ్యక్తం చేసింది.

సీతారాములు పర్ణశాలలో ఒకనాడు జూదమాడుకుంటున్న సమయంలో వారికి మాయలేడి కనిపించింది. “అటు చూడు రాములు, అటు చూడవయ్యా” అని మాయలేడిని చూపించి సీతమ్మ “దాంజంపి దాంతోలు తేకుంటే నయ్య; అందనుక మనము అన్నాచెల్లెళ్ళమయ్య” అని వాదులాడింది. “ముత్యాలు కుట్టిన రైకలుండంగ మురికి తోలుకు సీత ఏల బ్రమిసెదవు, వజ్రాలు తొడిగిన రైకలుండంగా వట్టి తోలుకు సీత ఏల బ్రమిసెదవు” అని ఆ తోలుతో రవికలు కుట్టించుకోవలసిన అవసరం లేదంటాడు. జానపదులు చిత్రించిన సీతమ్మ ఎంతో గడసరి. అందుకే మాయలేడిని తెచ్చి ఇచ్చేంత వరకు తాము అన్నాచెల్లెళ్ళుగానే ఉండాలని బెదిరించడంలో సీతమ్మను వారి మనస్తత్వాలకు అనుగుణంగా మలుచుకున్న తీరు కనిపిస్తుంది.

జానపద సాహిత్యంలో ఉన్న మరికొన్ని కథాగేయాలు సామాజిక సాంస్కృతిక వ్యవస్థకు అద్దం పడతాయి. ముఖ్యంగా సంతానం లేని స్త్రీల దుఃఖం వర్ణనాతీతం. తమకు పిల్లలు లేని బాధ కంటే సమాజం తమను చిన్న చూపు చూస్తుందనే బాధే వారికి ఎక్కువ దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. సంతానం లేక పోవడంలో భార్యాభర్తల్లో లోపం ఎవరిదయినా స్త్రీ యే దానికి బలి అవుతున్నట్లుగా ఎన్నో కథాగేయాలున్నాయి. సమాజం మూలాలు ఎగుడు దిగిడులన్నీ సాహిత్యంలో అనివార్యంగా కనిపిస్తాయి. ముత్యాలమ్మ పాటలో

“సంతు లేనట్టి వారు ఉయ్యాలో
సక్కదనమేమి ఉయ్యాలో
పిల్లలు లేనిల్లు ఉయ్యాలో
పీరీల కొట్టమ్ము ఉయ్యాలో
బాలలు లేనిల్లు ఉయ్యాలో
పాలంచే గుల్లు (పాల్వంచ గుళ్ళు) ఉయ్యాలో
సిరిబాల లేనిల్లు ఉయ్యాలో
సీకటి కోనమ్ము ఉయ్యాలో
మరి బాలలేనిల్లు ఉయ్యాలో
మల్లన్న గుల్లు ఉయ్యాలో”

అని పార్వతీ దేవి బాధపడింది. ఆమె ఒకరింట్లో పాపని చూడడానికి వెళ్ళినప్పుడు ” గొడ్డు గోతురాలు వస్త ఉన్నాదమ్మ” అని అమ్మలక్కలు పాపని తన చేతికివ్వలేదని దుఃఖిస్తూ

లోకమ్ము మీదను ఉయ్యాలో
గొడ్డు పేరూనాది ఉయ్యాలో
గొడ్డు పేరూ నాకు ఉయ్యాలో
వద్దురా దేవుడా ఉయ్యాలో
నాకూనూ సంతుల్లు ఉయ్యాలో
కావాలె దేవుడా ఉయ్యాలో

అని కోరుకున్నది. సంతుకోరుకోవడం మాట అటుంచి కేవలం తమకు మగబిడ్డలు కావాలని కాంక్షించే తల్లులెంతో మంది కథాగేయాల్లో కనిపిస్తారు. సమాజంలో కొడుకుల తల్లికే గౌరవం ఎక్కువ. అందుకే “తింటేను తీయదోసపండు తినాలి, కంటేను కొడుకుల కాన్పు కనాలి” అనుకుంటారు. అంతే కాదు ” పొడిసేటి సూరీడు వంటి కొడుకు గర్భంల పడితే ఏడు కొబ్బరికాయలు కొడుదు ననుకునే” తల్లులు కనిపిస్తారు. ఇటువంటి పాటలే స్త్రీల సుఖదుఃఖాలను పట్టి చూపుతాయి.

ఆడపిల్లలను అత్తవారింటికి పంపేటప్పుడు సారెచీరెలు పెట్టడమనే ఆచారం మన సమాజంలో ఉంది. ఈ ఇచ్చి పుచ్చుకోవడాలు ముచ్చటగా సాగితే బాగానే ఉంటుంది కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేడు కన్నవారికి ఇవి ప్రాణాంతకంగా పరిణమించాయి. అడిగినవి ఇవ్వలేదని కట్టుకున్న వారిని చంపే ప్రబుద్ధులను చూస్తూనే ఉన్నాం. గౌరమ్మ సారె పాటలో పుట్టింటి నుంచి వచ్చిన గౌరితో శంకరుడు ” పుట్టినింటికి గౌరి పోయి వస్తివి గానీ – నాకు ఏమి తెస్తివే గౌరీ” అని అడుగుతాడు. గౌరమ్మ ” మా వారు పేదవారు, మీకేమి తేగలరు” అంటుంది. అయినా శివుడేమీ ఊరుకోలేదు. కట్న కానుకల కోసం ఆమెను మళ్ళీ పుట్టింటికి పంపిస్తాడు. పర్వత దంపతులు పార్వతికి “ముంజేల దండలు జడ సంపెంగలు ముక్కుకు ముక్కెర పిల్లేళ్ళు, సింగి పాపట బొట్టు, కుంచంబు దారలు, చెక్క పైసలు ఇచ్చి అల్లుని కోసం తీరపు నిన్యాలు (పులితోలు చర్మం) బంగారు పిడి గంట, నాలుగు మూలల చెంబులు, బంగారు బాసన్లు, బటువు ముంజేతి దండలు, బంగారు ఒత్తులు, పట్టె మంచం, దానిమీదికి దూది పరుపులు, జపమాల” ఇచ్చి అత్తవారింటికి పంపుతారు. అప్పుడు కాని తృప్తిపడడు శివుడు. సిరియాలుని కథకు సంబంధించిన ఇంకో పాటలో పార్వతి భర్తను నిందించినందుకు సిరియాలుని తల్లి “కుంటివాడైనా, గుడ్డివాడైనా, సుంకరీడైనా, చోరుడైనా, కల్లలాడే వాడయినా, భర్తను ఈశ్వరునిగా చూడాలని హితబోధ చేస్తుంది. పితృస్వామ్య స్వభావం, స్త్రీల జీవితానుభవాలు పై పాటలలో కనిపిస్తాయి.

భర్త తనను ప్రేమించే వాడైతే “అందాన మెక్కిన అన్నల కన్నా కట్టెల్లు మోసిన్న కాపురం మేలు, పుల్లలు ఏరిన్నా పురుషుడే మేలు” అనుకునే స్త్రీలు కూడా లేకపోలేదు.

బీరన్న ఒగ్గు కథలో రేణుక వీరభద్రునితో అతడు ఎటువంటి అమ్మాయిని పెళ్ళిచేసుకోవాలో ఆ అమ్మాయికి ఉండవలసినవి, ఉండకూడని లక్షణాలేమిటో తెలుపుతుంది.

కట్టే బండికి ముప్పయి రెండు వలశక్రాలు
పట్టే తల్వారుకు ముప్పయి రెండు వలశక్రాలు
ఎక్కే గుర్రానికి ముప్పయి రెండు వలశక్రాలు
ఏలే ఆడపిల్లకు ముప్పయి రెండు వలశక్రాలు

ఉంటాయని అమ్మాయిని జాగ్రత్తగా చూసి ఎంచుకోవాలని క్రింది లక్షణాలను వివరించింది.

తుప్పురెంటుకలు లేకుంట జూడూ లేకుంట జూడు
తమ్ముడ! నెత్తిన మాడా లేకుంట జూడూ లేకుంట జూడు
తమ్ముడ! పాపిట్ల సుడి లేకుంట జూడూ లేకుంట జూడు
మిట్టానొసలు లేకుంట జూడూ లేకుంట జూడు
కంట్లే మెల్ల లేకుంట జూడూ లేకుంట జూడు
బుర్రా ముక్కు లేకుంట జూడూ లేకుంట జూడు

అని ఎత్తు పండ్లు, నాలుకపై మచ్చ, చెంపకు సుడి, కొయ్య మెడ, ఎత్తు భుజాలు, చేతులు పొడుగు, బొడ్డున సుడి, తాకుడు కాళ్ళు, గుడ్డేలుగు పాదం, అరికాలుకు సుడి మొదలైన ముప్ఫై రెండు చెడు లక్షణాలు లేకుండా చూడమని చెబుతుంది. వీరభద్రుడు “అయితే మంచి లక్షణాలు ఎట్లుంటయో చెప్పు” అంటాడు.

కుడి డొక్కలా మచ్చా గుణవంతురాలు
ఎడమ డొక్కలా మచ్చా ఎల్ల లోకములు మెచ్చా
కుడికాలూకు మచ్చా మిద్దెలు మేడలు కలుగూ
అరికాలూకు మచ్చా ఆవుల మందలూ కలుగూ

అని పొట్టిగా, పలుచగా, ఎర్రగా, ముద్దుగా, చక్కగా, పదహారు వన్నెల బంగారు ఛాయతో ఉండాలని చెపుతుంది. ఏ సాహిత్య ప్రక్రియలో కూడా వధువు వరుడిని నిర్ణయించుకునే సందర్భంలో స్త్రీలని వర్ణించినట్టుగా పురుషుల సాముద్రిక పుట్టుమచ్చల వివరాలు ఇంత విశదంగా వర్ణింపబడలేదు. వాడు మగవాడు కావడమే గొప్ప లక్షణం. జానపద కవులైనా ఏ కవులైనా సామాజిక పరిస్థితుల మధ్యే జీవిస్తారు. కనుక సమాజంలోని వాస్తవికతలు అసమానతలు వారి కవిత్వాలలో అనివార్యంగా చోటు చేసుకుంటాయి. స్త్రీల వ్యక్తిత్వానికి కాక శరీర గత సౌందర్యానికి ప్రాధాన్యాన్నిచ్చే అంశాలు ఏ ప్రక్రియలోనైనా కనిపిస్తాయి.

సంబంధ బాందవ్యాలకు సంబంధించిన పాటలలో సంసార జీవితంలోని కష్టసుఖాలు, స్త్రీల మనోభావాలు, అక్కా చెల్లెండ్ల, అన్నా చెల్లెండ్ల అనురాగాలు ఎక్కువగా కనపడుతాయి.

అత్తవారింట్లో ఎన్ని సిరి సంపదలున్నా స్త్రీలకు పుట్టింటిపై ఆశలు ఉంటాయి. స్థిర చరాస్తులలో భాగం ఇచ్చే అవకాశాలుండవు కనుక ఆ మాత్రం ఆశించడం సహజమే. అత్తవారింటికి పయనమైన ఒక చెల్లెలు అన్నతో “దంచా కుండేనా లేదు ఏ వాడా నేపోదు” అని అంటే అన్న కుందెన తెచ్చి బండిలో వేసి “ఇకనైనా కలనియ్యే సిల్లెల నీదు రథము” అంటాడు. అయినా ” దంచా రోకాలి లేదు ఏ వాడ నే పోదు” అని వరుసగా ఆమె సంసారానికి సరిపోయే సామాగ్రినంతా కోరింది. అన్న ఆమె అడిగినవన్నీ ప్రేమతో సమకూరుస్తాడు. కొన్నాళ్ళకు అన్న చెల్లెలును చూడ వస్తాడు. పుట్టింటినుండి కుక్కవస్తే కూడా తవ్వెడు బియ్యం వండిపెడుతారట స్త్రీలు. అన్నే స్వయంగా వస్తే ఇంకా చెప్పక్కర లేదు. రాగానే వేసే కుశల ప్రశ్నలకు అంతే ఉండదు.

చిన్నింటా చిన్నమల్లె పూసినాదన్నా?
చిన్న వదినే కోమాండ్ల కన్నదాయన్నా?
పొద్దింటీ పెదమల్లె పూసినాదన్నా?
పెద్ద వదినే కోమాండ్ల కన్నదాయన్నా?

ఇంకా

పాటెనుక పత్తి చేను పండీనాదన్నా?
పదిపుట్ల మన గరిసె నిండీనాదన్నా?
నూతెనుక నువు చేను పండినాదన్నా?
నూరు పుట్ల మన గరిసె నిండీనాదన్నా?

అని ఆదరంగా అడిగిన చెల్లెలుతో “పాటెనుక పత్తిచేను పండితే పసుపు కొమ్ముల సారె పెడతా” నని ” నూతెనుక నువ్వు చేను పండితే నూటొక్క సకినాలు పెడతా” నని చెప్పి సంతోషపెడతాడు. స్త్రీల జీవితాల్లోని అనుభవాలు ఇటువంటి పాటల్లో ఎంతో సహజంగా వ్యక్తమౌతాయి.

సమిష్టి కుటుంబాల్లో వదినా మరుదులు

“మన్నింప నేర్పితే మరిదియే కొడుకు
వడ్డింప నేర్పితే వదినెయే తల్లి” అన్నట్లుంటారు. అంతే కాదు “తప్పు పట్టిన వారికి తమ్ముడే మరది, భావించుకున్న వారికి బావ కూడా అన్న” అవుతాడని అంటారు. గిరిగిరి బాయి పాటలో వదిన మరిదితో బిందె ఎత్తుమంటే బిందె ఎత్తి కొంగు పట్టినాడట. “పాపాలు, పాపాలు ఓ మర్ది మల్లేశ!” అంటే “పాపాలకు మా ఇంట్లో పత్తి గుమ్ములుండు, దోసాలకు మా ఇంట్లో దోస గుమ్ములుండూ” అంటాడు. అప్పుడు వదినె బిందె దించి “మావోళ్ళింటికి నేను పోతానని” అత్త మామలకు, బావలకు, తోటి ఏరాండ్లకు, మరుదులకు, చివరికి భర్తకు చెప్పింది. ఎవరేమన్నారని అడిగితే ఎవరేమనలేదని అబద్ధం చెప్పింది. మరిది అహంకారాన్ని భరించలేక, ప్రతిఘటించలేక మళ్ళెప్పుడొస్తావని భర్త అడిగితే

మర్ది సచ్చిండని
మతలబూ వస్తే
తడిబట్ట తానానికి
నేనంద వస్తా

అని తన నిరసన తెలిపింది. మధ్య తరగతి కుటుంబాల స్త్రీల స్థితికి పరోక్ష ప్రతిఘటనలకు ఈ పాటలు అద్దం పడతాయి.

మరి కొన్ని పాటలలో మేనమామతో వైరం, మేనమామను చంపడం వంటి కథాంశాలు కనిపిస్తాయి. కారణాలేవైనా ఇవి భాగవతంలో కంసవధకు ఛాయలుగా రూపుదిద్దుకున్నాయి.

ఒక నాటు కలుపు పాటలో అక్క ఇంటికి వచ్చిన ఒకడు ఆమె కూతురును చూసి “ముసిముసి నవ్వు నవ్వి ముని కొంగు పట్టబోయాడు”. మేనమామ చేష్టలకు నివ్వెరబోయి

అవ్వతోడుర మామ! రామోజిరామా!!
మల్లవత్తర మామ! రామోజిరామా!!
అయ్య తోడుర మామ! రామోజిరామా!
మల్లవత్తర మామ రామోజిరామా!
అన్న రాముని తోడు! మల్లవత్తర మామ!!

అని తప్పించుకొని అన్నకు వచ్చి చెప్పింది. అన్న స్త్రీ వేషం వేసుకొని వాడి గదిలోకి వెళ్ళి “ఎగేసి మామను ఏటుగా నరికిండు”. ఇటువంటి కౌటుంబిక దాడులకు సంబంధించిన పాటలు, కథలు వందల సంఖ్యలో ఉన్నాయి. అదే విధంగా అన్నా చెల్లెండ్ల వైరానికి సంబంధించినవి కూడా ఎక్కువగా కనిపిస్తాయి. మాతృస్వామ్య, పితృస్వామ్య వ్యవస్థల సంఘర్షణలో ఇవి పుట్టి ఉండవచ్చు. శక్తికి సంబంధించిన మాతా పురాణం, ఈదెమ్మ కథలే కాక సామాన్యమైన కథల్లో కూడా ఇటువంటి స్త్రీ పురుషుల వైరానికి సంబంధించిన అంశాలుంటాయి.

“ప్రాచీన కాలం నుండి మన సమాజంలో స్త్రీ పైన విరుద్ధ దృక్పథాలున్నాయి. స్త్రీని శక్తి స్వరూపిణిగా దేవతగా తలపైన పెట్టుకొని పూజించే సమాజమే ఆడది అబల అని కాళ్ళతో అణచివేస్తుంది. మనువు స్త్రీ స్వాతంత్ర్యానికి అనర్హురాలు అంటూనే ఎచ్చట స్త్రీలు పూజింపబడరో అచ్చట దేవతలు నిలువలేరని విరుద్ధ ప్రకటనలు చేసినాడు. అదే విధంగా జానపదులు కూడా నీటికి, పంటలకు అధిదేవతగా కొలచిన స్త్రీని మళ్ళీ నీటిని నియంత్రించడానికి, పంటలను వృద్ధి చెయ్యడానికి ఆమెను బలి చేశారు. ఈ బలి ఆచారంలో పురుషుని స్వార్థం, సుఖాభిలాషయే స్పష్టమవుతుంది. ప్రకృతిలోని సహజసిద్ధమైన నీటికి, పంటలకు స్త్రీని బలిగా ఇవ్వటమే కాకుండా పురుషుడు తాను తయారు చేసిన వృత్తి పరికరాలకు, యంత్రాలకు కూడా స్త్రీని బలిగా ఇచ్చాడు” [వ్యాస లతిక – రావి ప్రేమలత]

(ఇంకా ఉంది)

ఆచార్య పి. జ్యోతి

రచయిత ఆచార్య పి. జ్యోతి గురించి: తెలుగు ప్రొఫెసర్ గా చాలా కాలంగా పని చేస్తున్న ఈ రచయిత ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు డిపార్ట్మెంట్ కు అధిపతిగా ఉన్నారు.
వీరి కొన్ని ప్రముఖ రచనలు:

  1. వందేమాతరం
  2. వ్యాసమందారం
  3. జానపద విజ్ఞాన వ్యాసమంజరి
  4. నాటక సాహిత్య విమర్శ - other literary criticism articles.
 ...