ఇండియా అనేది అగ్రదేశమైన అమెరికాకి మురికివాడగా మారిపోతోంది అని ఇటీవల సామాజిక శాస్త్రవేత్త ఆశిష్ నంది ఆవేదన వ్యక్తం చేశారు. నగరాలు, పరిశ్రమలపై ఆధారపడిన అభివృద్ధి మోడల్‌నే మనం కలగంటున్నాం. ప్రపంచమంతా ముఖ్యంగా పాశ్చాత్య అమెరికా దేశాలు అనుసరించిన యూనివర్సల్ మోడల్ ఇది. ఇది ఆధిపత్యం, అణిచివేత, అసమానతలపై ఆధారపడిన విశ్వజనీన ప్రణాళిక. ఇదంతా చెప్తూ ఆశిష్ నంది గాంధీ చెప్పిన గ్రామం, వికేంద్రీకరణలపై ఆధారపడిన ప్రాపంచిక దృక్పథానికి మనం దూరం జరిగామనే విషయాన్ని గుర్తు చేస్తారు.
అయితే ఈ పెద్ద పరిశ్రమలు, మహానగరాలపై ఆధారపడిన మోడల్‌ని మనదేశంలో గాంధీ వ్యతిరేకిoచిన రీతిలోనే థామస్ జఫర్సన్ (1743-1826 అమెరికాకి మూడవ ప్రెసిడెంట్) లాంటివారు బలంగా వ్యతిరేకించారు. పెద్ద పరిశ్రమలు, పెద్ద నగరాలు, శ్రమ విభజన వంటివి మనుషుల్ని అస్వతంత్రులని, ఆధునిక బానిసల్ని చేస్తాయి అని భయం వ్యక్తం చేశారు. అయితే ఇటువంటి వైఖరుల్ని పక్కన పెడుతూ అమెరికా ప్రపంచాన్నే శాసించే అగ్రరాజ్యంగా ఎదిగింది. అగ్రరాజ్యాన్ని అనుసరిస్తూ అమెరికన్ డ్రీమ్‌లో జీవిస్తూ మన నాగరికతని మనం దానికి నకలుగా మార్చాం. అందుకే ఆశిష్ నంది ఇండియాని పేదల అమెరికా అన్నారు. సుదీర్ఘ కాలం ఇంగ్లీషు వలస పాలనలో ఉన్న ఇండియా స్వతంత్ర దేశంగా ఏర్పడ్డాక కూడా పరానుకరణలో మిగిలిపోయింది. పాశ్చాత్య దేశాలను, అమెరికాను అనుకరిస్తూ స్వావలంబన కోల్పోయింది. ఆ అనుకరణ వల్ల, ఆ దేశాల స్థాయిని అందుకోవడం మాట దేవుడెరుగు, మరింత సమస్యల లోకి కూరుకుపోయింది. ఆధునికత, పెట్టుబడిదారీ వ్యవస్థ, పారిశ్రామిక నాగరికతల వల్ల వచ్చిన సమస్యలతో పాటు, ఆ అగ్రదేశాల అనుకరణ, ఆ దేశాల ఆధిపత్యం వల్ల వచ్చిన అదనపు సమస్యలతో అగ్రదేశాల మురికివాడలా మారింది. ఆధునికతను అందుకోలేక, మరోవైపు పాత విధానాలు నాశనమై కునారిల్లుతోంది. పల్లె కన్నీరు పెట్టిందో లాంటి పాటలు ఈ పరిణామాలనుంచి పుట్టిన ఆవేదనలే.
కొండ అద్దమందు కొంచమై ఉండదా అన్నట్లు ఎన్నోవేల సంవత్సరాల భారత నాగరికత గమనాన్ని మనం కొన్ని వందల సంవత్సరాల అమెరికా చరిత్ర గమనంలో చూడొచ్చు. అక్కడ అమెరికాలో దేశం, నాగరికతల గురించి జరిగిన చర్చలలో మేధోమథనంలో భారతీయుల అడుగుజాడల్ని పసికట్టవచ్చు. వలసవాదానంతర పరిణామాల వల్ల భారత్ స్వతంత్ర అస్తిత్వాన్ని పోగొట్టుకుంది. అగ్ర నాగరికతల ప్రతిబింబంగా మారింది. నేను అమెరికన్ మేధావుల రాజకీయ నాయకుల భావ సంఘర్షణలోంచి ఇండియాలోని పరిణామాల్ని అంచనా వేయడానికి ఈ వ్యాసం ద్వారా ప్రయత్నిస్తాను. ఈ తులనాత్మక అధ్యయనం నేటి హిందూత్వ వరకు భారతీయ ఆలోచన స్రవంతిలో వచ్చిన మార్పుల్ని పసికట్టడానికి పనికివస్తుందని నా నమ్మకం.
గ్రామం -నగరం
గ్రామాలలో, చిన్నపాటి సమూహాలలో (కమ్యూనిటీలు) జీవించడంలో స్వతంత్రత ఉంది అని జఫర్సన్ భావించారు. అందువల్ల జాతీయత కంటే ప్రాంతీయత ప్రధానంగా ప్రజలు తమ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూ చిన్న గుంపులుగా కమ్యూనిటీలుగా జీవించటం స్వేచ్ఛ స్వతంత్రాలకు చిహ్నం అని జఫర్సన్ అభిప్రాయపడ్డాడు. అయితే దక్షిణాదికి చెందిన జఫర్సన్‌కి పొలంలో పనిచేసే సొంత బానిసలు ఉండేవారు. వేతన బానిసత్వం కంటే ప్రత్యక్ష బానిసత్వమే మేలు. బానిసత్వంలో యజమానికి బానిస పట్ల కొంత బాధ్యత ఉంటుంది. జీవితాంతం బానిసని చూసుకోవలసి ఉంటుంది. వేతన బానిసత్వంలో ఫ్యాక్టరీ వర్కర్లకి అటువంటి భద్రత ఉండదు. ఎప్పుడైనా పొమ్మనచ్చు. కనుక కొత్తగా వచ్చిపడిన మెగా ఫ్యాక్టరీలని సందేహించాలి అని జఫర్సన్ లాంటివారి వాదన. అయితే వేతన శ్రమలో ఆధునిక బానిసత్వం చూసేవారు కొందరైతే, వేతన శ్రమలో ఇచ్చాపూర్వకంగా పనిని ఎంచుకొనే స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నాయి అని మరి కొందరు భావించారు. ఫ్యాక్టరీలలో కార్మికుడు యజమానితో కాంట్రాక్ట్ పద్ధతిలో పనికి కుదురుతాడు. ఇది ఐచ్ఛికంగా జరుగుతుంది. దీనిలో బలవంతం లేదు. బానిసత్వం విస్తరిస్తే ఈ స్వేచ్ఛావాతావరణం క్షీణిస్తుందని ప్రధానంగా అమెరికాలోని ఉత్తరాదివారు భావించారు.
వేతన శ్రమలో ఉన్న పరాయీకరణ గురించి అమెరికాలో చర్చలు జరిగాయి. మార్క్స్ కూడా దీని గురించి మాట్లాడాడు. వృత్తి పనివారికి తాము చేస్తున్న పని, అది తీసుకునే రూపం స్పష్టంగా తెలుసు. కనుక వారి భాగస్వామ్యం స్పష్టం. సృజనాత్మకతకి అవకాశం ఉంది. కానీ ఫ్యాక్టరీ పనిలో అది శూన్యం. అంటే ఫ్యాక్టరీలలోని వేతన శ్రమలో పరాయీకరణ ఉంటుంది. మానసికంగా భౌతికంగా చేసే పనితో ఎటువంటి అనుబంధమూ ఉండదు. అది చివరికి దాల్చే రూపం కూడా వారికి తెలీదు. అతని పని అతనికే పూర్తి పరాయిదిగా శత్రువుగా మారుతుంది. యజమానులకు కార్మికులు ఉత్పత్తిలో ఉపయోగపడే యంత్రాలవంటివారే తప్ప మనుషులుగా కనపడరు. (ఈ పరాయీకరణనే చార్లీ చాప్లిన్ తన మోడర్న్ టైమ్స్ సినిమాలో అద్భుతంగా విమర్శిస్తాడు. ఆ సినిమాలో నట్లు బిగించడమే పనిగా ఉన్న కార్మికుడు మూసపోసిన యాంత్రిక శ్రమలో ఎలా ఆలోచనని వ్యక్తిత్వాన్ని కోల్పోతాడో చూస్తాం. చివరికి నట్లులా కనిపించిన ప్రతీ వస్తువునూ బిగించబోతాడు.)
భారతదేశంలో గ్రామీణ వ్యవస్థ
భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన కాలంలోనే గ్రామం-నగరం గురించి చర్చ జరిగింది. గ్రామాల స్వయంప్రతిపత్తిని గాంధీ సమర్థిస్తే, గ్రామాలను పూర్తి సంకుచితమైనవిగా అణచివేతగా అంబేద్కర్ భావించాడు. అంబేద్కర్ గ్రామాన్ని అణచివేతగా భావిస్తే జవహర్లాల్ నెహ్రూ వెనుకబాటుతనంగా భావించాడు. గాంధీ అగ్రవర్ణుడు కావడం వల్ల కులవ్యవస్థకి నిలయమైన గ్రామాన్ని సమర్ధించాడు అని, మరోవైపు అంబేద్కర్ కులవివక్ష అనుభవించిన దళితుడు కనుక గ్రామీణ వ్యవస్థని పూర్తిగా తిరస్కరించాడు అని సాధారణంగా వినబడే వాదన. కానీ బ్రాహ్మణుడైన నెహ్రూ గాంధీకి గ్రామీణ స్వరాజ్య భావనని, హిందూ స్వరాజ్ గ్రంథాన్ని తీవ్రంగా విమర్శిస్తూ లేఖ రాశాడు. దీన్ని ఎలా చూడాలి? నిజానికి వలసవాద నాగరికతని మొదటిగా తాత్వికంగా విమర్శించిన గొప్ప తాత్వికుడు గాంధీ. అంబేద్కర్, నెహ్రూలు వలసవాదం తెచ్చిన నాగరికతలో విముక్తిదాయకతని చూశారు. భారతీయుల వెనుకబాటు, సంకుచితత్వం, మూఢవిశ్వాసాలు తొలగాలంటే పాశ్చాత్య నాగరికతని అనుకరించక తప్పదు అనే ఈ ఇద్దరూ నిర్ధారణకు వచ్చారు.
మొట్టమొదటి ప్రధానిగా నెహ్రూ ఉన్న సమయంలో అంబేద్కర్ సారథ్యంలో రాజ్యాంగరచన పూర్తిగా పాశ్చాత్య అమెరికా రాజ్యాంగాల అనుకరణగా సాగింది. గాంధీకి గత్యంతరం లేక మౌనం వహించి పరోక్ష మద్దతు పలికాడు. పార్లమెంటరీ విధానం పట్ల తన విమర్శలు అలాగే ఉన్నాయని, అయినా తాను ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా పార్లమెంటరీ విధానానికి సమర్థకుడిగా ఉన్నానని హిందూ స్వరాజ్ పునర్ముద్రణకి ముందుమాటలో రాశాడు. అమెరికాలో కూడా స్థానికతల ప్రత్యేకత పట్ల పట్టుదల పరిణామ క్రమంలో సడలిపోక తప్పలేదు. పాశ్చాత్య దేశాల నాగరికత పట్ల మనకి ఉన్నంత భక్తి అక్కడి మేధావులలో కనపడదు. పైగా ఆ నాగరికత పరిమితులు కూడా వారికి తెలుసు. అంబేద్కర్ గురువు అమెరికన్ తత్వవేత్త జాన్ డూవీ (John Dewey) ఆధునిక నాగరికత పరిమితుల్ని సరిగా గుర్తించాడు. మెగా పరిశ్రమల మీద ఆధారపడిన నాగరికత, గ్రామాలు కమ్యూనిటీల పరిమితుల నుంచి వ్యక్తులను విముక్తి చేసింది కానీ నిజమైన స్వతంత్రతని స్వేచ్ఛని ఇవ్వలేదు అంటాడు. అంటే గ్రామాల నుంచి బయటికి అడుగుపెట్టడం దానికదే స్వేచ్ఛ కాదు. అది మరొక కొత్త బంధనం కావచ్చు. తెలుగు రచయిత చలం అంటాడు- స్త్రీలు కుటుంబ బంధనాల నుంచి విముక్తి చెందారు కానీ బంగారు సంకెళ్ళలో ఇరుక్కున్నారు. వాళ్ళని అందరూ శాసించేవారే, అని. అదే పద్ధతిలో జాన్ డూవీ పాత నుంచి గ్రామం నుంచి విముక్తి దానికి అదే స్వేచ్ఛ కాలేదు అని స్పష్టం చేస్తాడు.
సూక్ష్మo – స్థూలం
మహానగరాలు, పెద్ద ఫ్యాక్టరీలు, పెద్ద ఎత్తున ఉత్పత్తి, సూపర్ మార్కెట్లు – ఇవన్నీ ఆధునిక నాగరికతకు; చిన్న గ్రామం, కమ్యూనిటీ ఇవన్నీ సంకుచితత్వానికి చిహ్నాలుగా మారాయి. గ్రామీణ వృత్తులు వెనుకబాటుగా అణచివేతగా భావించబడ్డాయి. అయితే పెద్ద యంత్రాలు పెద్ద ఫ్యాక్టరీలు వాటిపై ఆధారపడిన నగరాలు వ్యక్తిత్వం స్వేచ్ఛగా కొందరు ప్రగతిశీలురు భావించారు, కానీ ఇవి వ్యక్తి స్వతంత్రాన్ని హరిస్తాయి అనే భయం కూడా పక్కనే ఉంది. శ్రీశ్రీ యంత్ర భూతముల కోరలు తోమేవాళ్ళుగా శ్రామికులను వర్ణించాడు. మార్క్స్ పెట్టుబడిదారీ వ్యవస్థని తీవ్రంగా విమర్శించడం మనకు తెలుసు. అయితే మార్క్స్ పెట్టుబడిదారీ వ్యవస్థను ఎంతగా విమర్శించాడో అంతగా దాన్ని విముక్తిదాయకంగా కూడా భావించాడు. బ్రిటిష్ వలసవాదం అది తెచ్చిన రైల్వే వ్యవస్థ భారతీయ గ్రామీణ సంకుచితత్వాన్ని బద్దలుచేస్తాయి అని, ఈ క్రమంలో ఎంత హింస జరిగినా విముక్తికి ఇంతకన్నా వేరే మార్గం లేదు అని మార్క్స్ భావించాడు. చైనాలో జరిగిన నల్లమందు యుద్ధాన్ని కూడా వెనుకబాటు నుంచి విముక్తిగా తలిచాడు.
రైలుని నడిపే ఇంజన్ స్థానంలో పాశ్చాత్య, అమెరికా దేశాలు వుంటే, దాని బోగీలు వెనకబడిన దేశాలు అన్నమాట. మొదట్లో రైల్వే వ్యవస్థని అమెరికాలోని మేధావులు కొందరు విమర్శించారు. గాంధీ హిందూ స్వరాజ్‌లో రైల్వే వ్యవస్థను చెడుగా భావించాడు. బ్రిటిష్ కాలపు బెంగాల్ రచయిత శరత్ చంద్ర చటర్జీ శ్రీకాంత్ నవలలో రైళ్ళ వలన తిండిగింజలు తరలిపోయి గ్రామాలలో కొరత ఏర్పడుతోందని రాశాడు. యుద్ధావసరాల కోసం బ్రిటిష్‌వారు తిండిగింజలని రైళ్ళ ద్వారా తరలించడం వల్లనే కరవు ఏర్పడింది. అమెరికన్ మేధావులు మొదట్లో గ్రామాలలోని కమ్యూనిటీ వ్యవస్థ రైల్వే ద్వారా దెబ్బతింటుంది అని భయపడ్డారు. అయితే తరువాతికాలంలో కార్ల పరిశ్రమల యజమానులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థగా ఉన్న రైళ్ళని బలహీనపరిచారు అని అమెరికన్ మేధావి నోమ్ చామ్స్‌కీ బాధపడ్డాడు. ఈ విధంగా పెద్ద వ్యవస్థలు నిర్మాణాల పట్ల మన మక్కువ చివరికి డిజిటల్ టెక్నాలజీ, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో బృహత్‍రూపం ధరించింది. ఈ పెద్ద ప్రపంచ వ్యవస్థలో మనిషి ఒక నట్టు బోల్టు కూడా కాదు, అతనికి ఉనికి కూడా లేదు. కార్పొరేషన్లు ఎప్పుడైతే ఏర్పడ్డాయో అప్పుడే వ్యక్తి నశించాడు అంటాడు నోమ్ చామ్స్‌కీ. బిగ్ కార్పొరేషన్‌కి ఏ ఒక్కరూ యజమాని కాదు. దాని గమనం ఎటో ఎవరికీ తెలీదు. కానీ ఇటువంటి వాదనల నుంచి మనం చాలా దూరం వచ్చేశాం. నిజానికి ఈ మోజు మన జాతీయత, రాజ్యాంగం పైన కూడా పడింది. గ్రామాల కన్నా నగరాలకి, నగరాల కన్నా రాష్ట్రానికి, రాష్ట్రాల కన్నా కేంద్రానికి బలం, ఆధిపత్యం కట్టబెట్టబడింది. పౌరుల హక్కుల్ని పూర్తిగా రద్దు చేసే అవకాశం కూడా రాజ్యానికి కల్పించబడింది. భారతదేశo అనేదే బిగ్ మిషన్‌గా మారింది. ఇదే సమయంలో గాంధీ మహాత్ముని వంటివారు యంత్ర వ్యతిరేకులైన సంకుచితులుగా భావించబడ్డారు.
ఒకసారి ఒక మేధావి గాంధీని ప్రశ్నించాడు: ‘మీరు మెచ్చుకునే చరఖా కూడా యంత్రమే కదా’ అని. దానికి గాంధీ తాత్విక సమాధానం: ‘అవును యంత్రమే. నాగలి యంత్రం కాదా? నిజానికి దేహం కూడా యంత్రమే, కానీ ఆత్మ పైన అంతరాత్మ పైన దేహయంత్రం ఆధిపత్యం చలాయిస్తే ప్రమాదం. యంత్రానికి మనమే దాసులం కాకూడదు.’
భారతీయ తత్వశాస్త్రంలో సూక్ష్మం స్థూలానికి మూలం. ఇప్పుడు స్థూలం సూక్ష్మానికి ఆధారంగా మారింది. బిందువులో సింధువు నానుడి తిరస్కరించబడింది, ఈ బిగ్ కార్పొరేషన్ యుగంలో. స్థానిక కమ్యూనిటీల నుంచి జాతీయత దేశం అనే భావాలు ఏర్పడడం అనేది పెద్ద పరిణామం. మెగా ఐడెంటిటీల నిర్మాణం ప్రారంభమైంది. భారీ ఉత్పత్తి కేంద్రాలు జాతీయతకి మూలం. అమెరికాలో బానిసత్వం రద్దు, ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల ఏకీకరణ, కొన్ని ప్రాంతాలని కొని విస్తరించటం దీన్ని సాధ్యం చేసింది. భారత జాతీయతతో దీనికి పోలిక వుంది. అలెగ్జాండర్ హామిల్టన్ (1755-1804 అమెరికా మొదటి ట్రెజరీ సెక్రటరీ, ఆర్థికవేత్త) కృషితో జాతీయ బ్యాంకు ఏర్పాటు చేయడం, దేశీయ పరిశ్రమలు అభివృద్ధి చేయడం, పేపర్ మనీ ప్రాధాన్యం పెరగడం ఇవన్నీ అమెరికా స్వరూప స్వభావాలను మార్చేశాయి. ఆధునిక పారిశ్రామిక అభివృద్ధి, ధనస్వామ్యం, పెట్టుబడిదారీ విధానాలు ప్రభుత్వ జోక్యం వల్లనే సాధ్యమయ్యాయి.
మొదట్లో పెట్టుబడిదారీ వ్యవస్థని పారిశ్రామిక నాగరికతను వ్యతిరేకించేవారు, ప్రజాజీవనంలో ప్రభుత్వ ప్రమేయాన్ని నిరసించారు. మితిమీరి ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ప్రజల స్వతంత్రాన్ని హరిస్తుంది అని వాదించారు. కానీ పెద్ద పరిశ్రమలకి గవర్నమెంట్ అండ అవసరం. అమెరికాలోనైనా స్వతంత్ర భారతంలోనైనా మొదట్లో ఇదే పరిస్థితి. క్రమేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో అన్ని రంగాలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాథమిక సౌకర్యాలు బలపడ్డ తర్వాత ప్రైవేటు పెట్టుబడిదారులు మేము ఉన్నాం అంటూ అన్నీ రంగాలలోకి చొచ్చుకుపోయారు. ఇప్పుడు ప్రభుత్వ ప్రమేయం మొత్తంగా తొలగిపోవాలి అంటున్నారు. కేవలం ప్రభుత్వం శాంతి భద్రతలు చూస్తే చాలు అన్నారు. అయితే అమెరికాలో జైళ్ళ నిర్వహణ, ఆయుధ ఉత్పత్తుల వ్యాపారంలో కూడా ప్రైవేటు రంగ ప్రమేయం పెరుగుతోంది కనుక కనీసం అక్కడ కూడా ప్రభుత్వం ఆధిపత్యం పరిమితం. అయితే ఇప్పుడు ప్రజల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలనే పరిస్థితి దాపురించింది. అప్పుడైనా ఇప్పుడైనా జాతీయ ప్రభుత్వాలు అంతిమంగా పెట్టుబడిదారులకి పారిశ్రామికవేత్తలకి మాత్రమే ప్రాధాన్యం ఇస్తాయి.
నాకు ఈ సందర్భంలో ‘పెదనాన్న- సర్కస్ పులి’ అనే శ్రీశ్రీ అనువాద కథ గుర్తుకు వస్తోంది. చైనాలో ఒకాయనకు ఒక ఫ్రెంచ్ సర్కస్‍లో పనిచేస్తున్న అరబ్బీ బఫున్‍తో పరిచయం అయింది. ‘నువ్వు మానవుడివి. మృగాలని ప్రేమిస్తావా’ అని అడిగితే, ఆయన ‘భగవంతుడు సృష్టించిన సమస్త జంతుకోటిని ప్రేమిస్తున్నాను’ అంటాడు. అరబ్బీ బఫూన్ అడుగుతాడు, ‘దుర్మార్గమైన అరణ్య జంతువులని, అందులోనూ ఒక పెద్దపులిని ప్రేమించగలవా?’ ఇలా మాటలు కొనసాగిస్తూ ఒక పెద్దపులి నోట్లో తల దూర్చగలవా అని అడుగుతాడు. చివరికి ఆ పెద్దమనిషి సర్కస్‍లో పెద్దపులి నోట్లో తల దూర్చే వృత్తికి కుదురుకొని, చివరికి పెద్దపులి కొరికేయడంతోనే చనిపోతాడు.
ఆ పెద్దపులు మెగా కార్పొరేషన్లు, వారికి అండగా నిలిచే మెగా జాతీయ ప్రభుత్వం. ప్రభుత్వ ప్రమేయం తమకు అసలు వద్దు అనే స్థితి నుంచి, దాని దయా దాాక్షిణ్యాలు, చిల్లర సాయం కోసం ప్రాధేయపడే పరిస్థితికి ప్రజలు చేరుకున్నారు. ఇది అమెరికా చరిత్ర మాత్రమే కాదు. ప్రపంచం అంతా ఇదే దారిలో ప్రయాణిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అన్ని బాధ్యతల నుంచి తప్పుకుంటాను అంటుంటే, ఆపడానికి ఉద్యమాలు చేయవలసి వస్తోంది. ఇండియాలో రైతు చట్టాలకి వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటం అటువంటిదే. 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలని రైతులు వ్యతిరేకించారు. కారణం, ఆ చట్టాలు స్వేచ్ఛగా పైన చెప్పిన పెద్దపులి నోట్లో స్వేచ్ఛగా తలపెట్టడం లాంటివి అని రైతులు భావించారు. రైతులు పెట్టుబడిదారులతో మెగా ప్రైవేటు కంపెనీలతో పూర్తి స్వేచ్ఛగా ఒప్పందాలు చేసుకోవచ్చు. దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన మండీలలోనే అక్కర్లేదు. కొంతమంది మేధావులు ఇది రైతులకు పూర్తిగా స్వేచ్ఛని ఇస్తుంది కదా అని మాట్లాడారు. స్వేచ్ఛ అంటే ఏమిటి?
స్వేచ్ఛ అంటే ఏమిటి?
ఈ స్వేచ్ఛ గురించి కూడా అమెరికాలో చాలా చర్చ జరిగింది. వేతన శ్రమ పెట్టుబడిదారులతో స్వేచ్ఛతో కూడిన ఒప్పందంతో ముడిపడి ఉంది కనుక కార్మికుడు పెట్టుబడిదారుడు కలిసి స్వయంగా అన్ని విషయాలు తేల్చుకోవాలి. ఇష్టం లేకపోతే కార్మికుడు పని మానుకోవచ్చు. ఇదే వాదంతో వేతన కార్మికుల విషయంలో ప్రభుత్వ జోక్యం కార్మికులకి ప్రత్యేక హక్కులు భద్రత అక్కర్లేదు అని కొందరు వాదించారు. అలా ప్రభుత్వ జోక్యం చేసుకోవడం కాంట్రాక్టు పద్ధతిలోని స్వేచ్ఛ ఎన్నుకునే స్వేచ్ఛకు విరుద్ధమని వాదించారు. ఈ వాద వివాదాలు న్యాయస్థానాలలో కూడా సాగాయి, కానీ అసమానుల మధ్య స్వేచ్ఛ ఒప్పందం అసాధ్యం అనే వాదం ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే కార్మికులు పరిమిత పని సమయాన్ని సాధించుకున్నారు. తమ హక్కుల సంరక్షణ కోసం సంఘాలు పెట్టారు, పోరాటాలు చేశారు.
నిజానికి స్వేచ్ఛ అనే పదానికి అర్థం క్రమేపి మారుతూ వచ్చింది. ఒకప్పుడు ఎవరి ఊళ్ళో వారు ఏదో స్వతంత్రంగా స్వంత భూమి పైన బతకడం స్వేచ్ఛ. తరువాత నగరాలకు వెళ్ళి వేతన జీవిగా మారడం స్వేచ్ఛ. ఇది పెద్ద ఎత్తున ఉత్పత్తిని పెంచడం అనే భావంపై ఆధారపడి ఉంది. ఇప్పుడు రుణం తీసుకుని సరుకులు కొనడం కన్స్యూమరిజం స్వేచ్ఛకు సంకేతం. సరుకుల చలనం కాదు. డబ్బు చలనాన్ని స్వేచ్ఛని తెస్తుంది అనే ఆలోచన వైపు ప్రపంచం మళ్ళింది. సరుకులు అవసరాలకోసం కాక, మార్కెట్ ప్రచారం చేసే బ్రాండ్లుగా మారి చాలా కాలమైంది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అనే వ్యాపార ప్రకటన సారం అదే. వస్తువు భావంగా మారినపుడే సరుకు అవుతుంది. అంటే అది మార్కెట్ చేత మన నెత్తి మీద రుద్దబడే భావన. అందుకే భారతీయ తత్వవేత్త యూజీ కృష్ణమూర్తి అంటారు – మనుషులు ఇప్పుడు ఆహారం తినడంలేదు, ఐడియాల్ని తింటున్నారు. ఇప్పుడు సరుకులు కూడా కాదు, సరుకులు అన్నిటికీ సాధారణ సంకేతమైన డబ్బు యొక్క చలనం ప్రపంచాన్ని ఏలుతోంది. అందుకే షేర్ మార్కెట్ జూదంగా కాక, వాస్తవంగా భ్రమించబడుతోంది.
అమెరికాలో అగ్రదేశాలలో రుణ చరిత్ర, క్రెడిట్ హిస్టరీ వ్యక్తికి ఇల్లు దొరకడం దగ్గర నుంచి అన్ని విషయాలలోనూ ప్రాధాన్యం వహిస్తుంది. రుణం జీవన వాస్తవం. రుణం చేస్తుండడం, రుణాల ఆధారంగా కొత్త సరుకులు కొనటం అనేదే స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే ఎన్నుకునే స్వేచ్ఛ. సరుకులను ఎన్నుకునే స్వేచ్ఛ. దేన్ని ఎన్నుకోవడం అనే ప్రశ్నకి ఒకప్పుడు వృత్తి అనే సమాధానం. ఇప్పుడు ఏ సరుకులు కొనాలి, ఏ బ్రాండ్ మంచిది అని ఎన్నుకోవడం. ఇక్కడ అవసరం కాదు ఏది కొనాలి అనేదానికి కూడా మార్కెట్ చెబుతుంది. ఈ విధంగా స్వేచ్ఛ అనేది కూడా స్వేచ్ఛని పొందింది, వస్తుగతత్వం నుంచి. ఇప్పుడు హక్కుల ఉద్యమం కార్మిక హక్కుల నుంచి వినియోగదారుల హక్కుల వైపు ప్రయాణించింది. మనుషుల కోసం సరుకులు కాక సరుకులు కొనడం కోసం మనుషులు అనే భావం వచ్చింది. మనుషుల అవసరాల కోసం ఉత్పత్తి కాక అవసరాలని సరుకులని కూడా ప్రజలకి ఎరగా వేయటం మార్కెట్ పని అయింది. మరోవైపు కార్మిక హక్కులు పని గంటల పరిమితితో సహా రద్దుచేసే చట్టాలు వస్తున్నాయి. ధనస్వామ్యం ప్రబలిన తర్వాత రూపాయి డాలర్ యొక్క బానిసగా మారింది. బానిస పూర్తి పౌరుడు కాదు. ఒకప్పుడు అమెరికాలో అతడు పౌరుడిలో మూడోవంతు కింద లెక్క. అలాగే రూపాయి డాలర్‌తో పోలిస్తే శక్తిహీనమైన ధనం. బానిసత్వం రద్దు అయింది కానీ దేశాలకు దేశాలనే బానిసలుగా మార్చుకునే కొత్త వ్యవస్థ ఆవిర్భవించింది. అయితే అది బానిసత్వం అని కాక అభివృద్ధి అనే పేరుతో కొనసాగుతుంది.
వేతన శ్రమలో కార్మికుడు పొందే స్వేచ్ఛ మిథ్య. అలాగే ప్రపంచీకరణ తెచ్చిన స్వేచ్ఛా వాణిజ్యంలో స్వేచ్ఛ మిథ్య మాత్రమే. వివిధదేశాలు వివిధ ఉత్పత్తులు చేస్తాయి. వాటిని పరస్పరం స్వేచ్చగా అమ్ముకొని లాభపడతాయి అనే వాదం ముందుకు తెచ్చారు. కానీ ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ వాణిజ్య సంస్థ పేరుతో వెనకబడిన దేశాల ఆర్థిక వ్యవస్థలపై తద్వారా ఆంతరంగిక ప్రజాస్వామ్యంపై అగ్ర దేశాలు ఆధిపత్యం మొదలుపెట్టాయి. స్వేచ్ఛా వాణిజ్యం అన్నారు కానీ తమ దేశాలలో వ్యవసాయ ఉత్పత్తులు వాణిజ్యాలకి జాతీయ రక్షణలు కల్పించుకొన్నారు. విదేశీ ఉత్పత్తులపై పన్నులు విధించారు. తృతీయ ప్రపంచదేశాలను మాత్రం వాణిజ్యానికి తలుపులు బార్లా తెరవాలి అన్నారు. ప్రధానంగా అమెరికా ఆధిపత్యం ఎక్కువ.
ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ వ్యవస్థ కులనిర్మూలనకు దారితీస్తుంది అని దళిత మేధావి చంద్రభాను ప్రసాద్ ఆశపడ్డారు. దళిత పెట్టుబడిదారులను అభివృద్ధి చేయడం కోసం 2002లో ప్రణాళిక రచించారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి భోపాల్ డాక్యుమెంట్ తెచ్చారు. దళితులను మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడం, దళిత పెట్టుబడిదారులను సృష్టించడం లక్ష్యంగా పనిచేశారు. కానీ సంపదను కొద్దిమంది చేతులలోకి కేంద్రీకరించే ప్రపంచీకరణ కేపిటలిజం ఇలాంటి ప్రణాళికలను ముందుకు వెళ్ళనీయదు. పైగా ఉపాధి కల్పన, విద్య, వైద్యంతో సహా అన్ని సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రభుత్వం శ్రద్ధ తగ్గించడం దళిత మధ్యతరగతి పెరగడానికి అడ్డంకిగా నిలిచింది.
జాతి వివక్ష-కుల వివక్ష
పెట్టుబడిదారీ వ్యవస్థ, పారిశ్రామిక వ్యవస్థ దేశాల మధ్యనే కాదు, ప్రజల మధ్య కూడా అంతరాన్ని పెంచిందే కానీ తగ్గించలేదు. అందువల్ల ఒకవైపు కార్మిక హక్కుల కోసం పోరాటాలు జరుగుతుంటే మరోవైపు కులం జాతి వివక్షలపై పోరాటం చేసే వర్గం పుట్టుకు వచ్చింది. దళిత నాయకుడు అంబేద్కర్ అంటాడు – కులం అనేది శ్రమ విభజన కాదు, శ్రామికుల మధ్య విభజన అని. మితిమీరిన శ్రమ విభజన వల్ల ఆధునిక కార్మిక వర్గం పుట్టుకు వచ్చారు, కానీ కుల వివక్ష కార్మికుల మధ్య కూడా కొనసాగింది అని అంబేద్కర్ గుర్తించాడు. అందుకే కార్మిక సంఘాలను, వాటి పోరాటాలను కూడా సందేహించాడు. అలాగే జాతి వివక్ష, బానిసత్వం నల్లవారిని ఒక జాతిగా వెనకబడిపోయేలా చేశాయి అని మార్టిన్ లూథర్, మాల్కమ్ ఎక్స్ గుర్తించి పోరాడారు. గాంధీ ప్రభావంతో మార్టిన్ లూథర్ శాంతియుతంగా జాతుల మధ్య అంతరాన్ని తగ్గించే సామరస్య ధోరణిని బోధించాడు. మాల్కమ్ ఎక్స్ తెల్లజాతివారిని పూర్తి శత్రువులుగా భావించాడు. ముస్లిమ్ మతంలోకి మారాడు. సొంతంగా వ్యాపారాలు స్థాపించి నల్లవారు ఎదగడాన్ని ప్రోత్సహించాడు. అయితే క్రమేపి తెల్లవారితో సామరస్య ధోరణికి మళ్ళారు. జాతి వివక్ష నిర్మూలనకు జాతి సామరస్యం అవసరం అనే మార్టిన్ లూథర్ కింగ్ అనుసరించిన గాంధేయ ప్రాపంచిక దృక్పథంలోకి చివరిలో కానీ వెళ్ళలేదు మాల్కమ్ ఎక్స్. ఈ మార్పు మనకి అంబేద్కర్ లోను కనబడుతుంది. ప్రత్యేక దళిత నియోజకవర్గాలు మాత్రమే కాదు, ప్రత్యేక దళితస్థాన్ కోరుకున్న అంబేద్కర్ భారతీయ రాజ్యాంగ రచనకి సారథ్యం వహించారు. మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశారు. ఆ విధంగా సామరస్య ధోరణి అవలంబించారు.
అయితే అమెరికా నల్లజాతి మేధావులలో కానరానిది మన దళిత బహుజన మేధావులలో కనబడేది పాశ్చాత్య అమెరికా దేశాల వైఖరి పట్ల సానుకూలత. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఆఫ్రికా మేధావులలో ఉన్న పాశ్చాత్య సానుకూలతని కెన్యా రచయిత గుగి వా థియాంగో ఎండగట్టాడు. దళిత బహుజన మేధావులు కంచ ఐలయ్య, చంద్రభాను ప్రసాదులలో ఈ పాశ్చాత్య భక్తి తీవ్రంగా కనబడుతుంది. చంద్రభాను ప్రసాద్ ఆఫ్గనిస్తాన్‌పై అమెరికా దాడుల్ని స్త్రీల విముక్తి ఉద్యమంగా ఫెమినిస్ట్ వార్‌గా వర్ణించాడు. అక్కడ పాశ్చాత్య తరహా ప్రజాస్వామ్యం వచ్చి స్త్రీలకు విద్య ఉద్యోగాలు లభిస్తాయి, స్త్రీ స్వేచ్చ వస్తుంది అన్నారు. ఈ పాశ్చాత్య సానుకూలత అంబేద్కర్ కాలం నుంచి ఉన్నదే. అమెరికా, పాశ్చాత్య దేశాల అండతో పాలస్తీనాని యూదులు ఆక్రమించుకోవడాన్ని అభివృద్ధిగా, సివిలైజేషన్ మిషన్‌గా అంబేద్కర్ వర్ణించారు. ఇటీవల కంచ ఐలయ్య పాలస్తీనా ముస్లిములు మొత్తం ముస్లిమ్ దేశాలు నియంతృత్వంలో మగ్గిపోతుంటే, ఇజ్రాయలీయులు ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్నట్లు కనబడుతున్నారు అన్నారు. అలా అనడంలో పాశ్చాత్య దృక్పథమే కనపడుతుంది. క్రూరమైన సామ్రాజ్యవాద దురాక్రమణ గల్ఫ్‌లో, పాలస్తీనాలో సృష్టిస్తున్న అరాచకం, హింస, అనిశ్చితి అంతా ఇంతా కాదు. అదంతా చూడనిరాకరిస్తున్నారు ఈ మెకాలే శిశువులు.
అందుకే ఆశిష్ నంది ఆధునిక ఇండియాని అమెరికా పాశ్చాత్య దేశాల నకలుగా భావించారు. మొదట్లో అమెరికా ఒక ఒకే ఒక దేశంగా ఎదుగుతున్న క్రమంలో సివిక్ మిషన్ – ఒక పౌరుడు ఒక జాతీయ కమ్యూనిటీ ఏర్పాటు చేయడం – ప్రధానంగా భావించబడింది. ఉత్పత్తి పెంచడం, రవాణా విస్తరించటం వాటికవే లక్ష్యాలు కాదు. ఒక జాతి భావనను కూడా అధిగమించి, పౌరుడు అనే ఉమ్మడి కమ్యూనిటీ వైపు ప్రయాణం ప్రధానంగా భావించబడింది. వ్యాపారంతో సహా అన్నిటిలోనూ ప్రభుత్వ జోక్యం ఎక్కువగా ఉన్న దశలో విద్య, వినోదం అన్ని కమ్యూనిటీగా కలిసి పంచుకునేవిగా ప్రణాళిక చేయబడింది. పబ్లిక్ పార్కులు, పబ్లిక్ స్కూల్ వగైరా పౌర భావనకు ఉపయోగించాయి. ఈ దశ నుంచి ఇప్పుడు అమెరికా పూర్తిగా ప్రైవేటీకరణ వైపు మళ్ళుతోంది. భారత్ కూడా అదే పద్ధతిని అనుసరిస్తోంది. ప్రైవేట్ స్పేస్ విస్తరిస్తున్న కొద్దీ మనం వ్యక్తులుగా విస్తరిస్తున్న భ్రాంతి పెరుగుతోంది. పౌరభావన నుంచి మనం వ్యక్తిత్వ వికాసం వైపు ప్రయాణిస్తున్నాము, మనిషి స్వేచ్ఛాశాపగ్రస్తుడు అంటాడు తత్వవేత్త జాఁ పాల్ సార్త్ర్. ఎన్నిక (ఛాయిస్) అనేది ఎంత బాధాకరమైనదో ఎంత బాధ్యతాయుతమైనదో చెప్తాడు.
యోగ్యతావాదం
మనిషి ప్రతిభావంతుడు, అతని హేతుబుద్ధి తిరుగులేనిది అనే విశ్వాసం ఆధునిక యుగ లక్షణం. ఈ హేతుబుద్ధికి మరో పేరు ఎన్నిక (ఛాయిస్). మనిషి సరైన వృత్తిని సరైన మార్గాన్ని సరైన సరుకుల్ని విచక్షణాబుద్ధితో ఎంచుకోగలడు. ఒక మనిషి సాఫల్యం చెందితే అది పూర్తిగా అతని వ్యక్తిగతమైన విజయం. అతడు పరాజయం చెందితే, అది పూర్తిగా అతని వ్యక్తిగతమైన లోపం. ఈ భావన యోగ్యతావాదానికి (మెరిటోక్రసీ) దారితీసింది అంటారు అమెరికన్ తత్వవేత్త మైకేల్ జె సాండల్. ఈ సందర్భంగా హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీల లాంటి అనేక యూనివర్సిటీలలో ప్రవేశం కోసం 2019లో జరిగిన ఒక కుంభకోణాన్ని ప్రస్తావిస్తారు. ఈ కుంభకోణంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారింది. ఇటువంటి విద్యాపరమైన అక్రమాలు భారతదేశంలో, ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేకసార్లు జరిగాయి. అయితే ఈ అక్రమాలు వ్యాధికి బాహ్య లక్షణాలు. అసలు క్యాన్సర్ మెరిట్ అనే భావన అంటారు సాండల్. ఈ వ్యాధి గ్లోబలైజేషన్ తర్వాత మరీ ముదిరింది. మెరిట్ అనే వ్యాధికి రెండు లక్షణాలు ఉన్నాయి. తాను పూర్తిగా తన స్వయంకృషి వల్లనే స్వశక్తి వల్లనే అభివృద్ధిలోకి వచ్చానని అహంకారం. రెండు ఫెయిల్ అయినవారు, వెనకబడినవారు పూర్తిగా వారి స్వయంకృతం వల్లనే ఫెయిల్ అయ్యారు అన్న వివక్ష. ఇది మరోవైపు పరాజితులలో ఆత్మన్యూనతని పెంచుతుంది. అహంభావం ఆత్మ న్యూనత మధ్య ప్రపంచం నడుస్తుంది.
మెరిట్ (ప్రతిభ) అనే పదం ఇండియాలో అగ్రవర్ణాలలో మొదలై, దళిత బహుజనులలో కూడా పాకింది. ఎస్సీ వర్గీకరణ చర్చల్లో కూడా ఈ పదం విచ్చలవిడిగా వాడబడింది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భావ వికాసాల వెనుక ప్రొటెస్టెంట్ క్రైస్తవ ప్రభావం ఉందని సామాజిక శాస్త్రవేత్త మాక్స్ వెబర్ స్పష్టం చేశారు. మెరిట్‌కి ప్రాధాన్యం రావడంలో కూడా ఈ తత్వం పనిచేసింది అంటారు తత్వవేత్త సాండల్. క్రైస్తవ థియాలజీలో – విముక్తి చెందడానికి దేవుడి కృప ముఖ్యమా, లేక కొందరు ప్రభువుచే ఎన్నుకోబడినవారు ప్రత్యేకంగా విముక్తికి అర్హత కలిగి ఉంటారా అనే చర్చ ఉంది. ఈ ఎన్నుకోబడిన ప్రజ, ఎన్నిక అనే భావాలు లౌకికంగా అన్వయించినప్పుడు ప్రతిభ కలిగినవారు అనే భావానికి బలం వచ్చింది. కొందరు సహజంగానే పుట్టుకతో ప్రతిభగలిగి ఉంటారు, వారు విజయానికి అర్హులు. ఇది అపజయం చెందినవారు, వెనుకబడినవారు సహజ సిద్ధంగానే ప్రతిభ లేనివారు, అనర్హులు, ఎంచుకోబడనివారుగా మిగిలిపోయేలా చేస్తుంది. కర్తృత్వం (ఏజెన్సీ), ఎన్నిక (ఛాయిస్) అనే క్రైస్తవ భావాలకి లౌకిక ప్రపంచంలో వచ్చిన విజయం అది. ఈ భావాలు అన్ని రoగాలలోకి విస్తరించాయి. నిజానికి ఆధునిక పారిశ్రామిక ఉత్పత్తిలో శ్రామికుడు స్వేచ్ఛగా ఐచ్ఛికంగా ఒక ఒప్పందంలో భాగంగా వేతన శ్రమలో పాల్గొంటాడు అనే భావన దీని నుంచి వచ్చింది. అలాగే సామాజిక శాస్త్రాలలో ప్రజలు తమకి ఉన్న హక్కులని స్వేచ్ఛని పరిమితం చేసుకొని వాలంటరీ – ఐచ్ఛికంగా రాజ్యానికి అవకాశం ఇస్తారు అనే సిద్ధాంతం కూడా అలా వచ్చింది. హిందూ సంస్కర్త దయానంద సరస్వతి భారతదేశం ఆర్యులకు దైవదత్త భూమి అనడం అనేది యూదులు ఎన్నుకోబడిన ప్రజ అనే పాత నిబంధన భావాలకు అనుకరణ. హిందువులదే భారతదేశం అనడం కూడా ఇటువంటిదే.
భారతదేశంలో కర్మ సిద్ధాంతం – జన్మజన్మల నుంచి వచ్చిన కర్మ ఫలితం జీవితంలో కష్ట సుఖాలని జయాపజయాలను నిర్ణయిస్తుందనే తత్వం – రాజ్యం చేసింది. ఈ సిద్ధాంతం కొన్ని అగ్రకులాలే ప్రతిభ కలిగి ఉన్నాయి అనే మూర్ఖ విశ్వాసానికి కారణం అయింది. కాని, కర్మ సిద్ధాంతం అగ్రవర్ణాలలో అందరూ ప్రతిభావంతులు ఎందుకు కాలేదు అనే ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు. అందుకే ప్రతిభ అనే పదం కుల పరిధులను దాటి క్రైస్తవ థియాలజీ ప్రభావంతో అందరిలోకి విస్తరించింది. ఒక సెక్యులర్ రూపాన్ని సంతరించుకుంది. ప్రతిభ గురించి చర్చ చివరికి అవకాశాలు ఉన్నవారు, లేనివారు అనే రెండు వర్గాలని సృష్టించింది. అమెరికాలోనూ ఇండియాలోనూ కూడా శిష్ట వర్గాల పట్ల సహజసిద్ధంగా ఉన్న వ్యతిరేకతని రైటిస్టులు ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళని తమ ప్రైవేటు సైన్యంగా ఓటర్లుగా మార్చుకుంటున్నారు. ఒకప్పుడు పేదవాళ్ళు నిరక్షరాస్యులు, లెఫ్టిస్టులు ఉదారవాదుల వెంట ఉండేవారు. ఇప్పుడు లెఫ్టిస్టులు విద్యావంతులు మాత్రమే. అంటే ప్రతిభావంతుల కేటగిరీలోనివారు. వీరికి వ్యతిరేకంగా నిరక్షరాస్య ప్రజానీకాన్ని దగ్గర చేసుకోవడం రైటిస్టుల రిపబ్లికన్లు విజయం అంటారు.
ఇండియాలో జరుగుతున్నది కూడా ఇదే. ఇండియాలో దళిత బహుజనులు హిందుత్వవాదులకు దగ్గరయ్యారు. ఇండియాలో అర్బన్ నక్సలైట్లు అనే ముద్ర వేసి ఉన్నత విద్యావంతులైన మేధావులని జైలుపాలు చేయడంలో హిందుత్వవాదులకు ఈ తర్కమే పనికొచ్చింది. నిజానికి ఇలా జైలుకు పంపబడినవారిలో అందరూ మార్క్సిస్టులు కూడా కారు. ఈ అసమాన పరిస్థితులలో హేతువాదం కూడా సాధారణ ప్రజలకి అవమానకరంగా కనిపిస్తుంది. అనేక విభాగాల్లో నిపుణులు ఉండవచ్చు. వారు పరిశోధనల ఆధారంగా పరిష్కారాలు సూచించవచ్చు, కానీ బుర్రను ఉపయోగించడానికి కొద్దిమందికే అవకాశం సమయం ఉన్నప్పుడు వీరు చెప్పే హేతుబద్ధత ప్రజావ్యతిరేకంగా, ప్రజలను అవహేళన చేయడంగా కనిపిస్తుంది. పైగా ఈ నిపుణులు పాశ్చాత్య ప్రభావం వల్ల స్థానిక ప్రజల మనస్తత్వాన్ని, వైఖరులను అర్థం చేసుకోవడంలో విఫలం అవుతున్నారు. ఈ పరిస్థితిని రైటిస్టులు సులభంగా ఉపయోగించుకుంటారు. ప్రజల్లోని విశ్వాసాలు ఏవీ ప్రశ్నించదగిన కావు అని వీరు నూరిపోస్తారు… ప్రశ్ననే విదేశీయమంటారు. సాంకేతిక విద్యా నిపుణులైన మధ్యతరగతి ప్రజలు కూడా ప్రశ్నించే స్వభావాన్ని మొత్తం నిరాకరించే వైఖరిని ఇష్టపడుతున్నారు. నిజానికి వీరు మాత్రం తమ జీవితంలో ఆధునికతను అనుసరిస్తారు. సాంకేతిక మార్పుతో పాటు పయనిస్తారు. కానీ నియంతృత్వాన్ని కుహనా సాంప్రదాయికతని ఇష్టపడతారు. మెరిటోక్రసీ అనేది అందరిలో శూన్యాన్ని నింపింది. మొత్తం భారాన్ని వ్యక్తిపై మోపింది. అభివృద్ధికి కానీ వెనకబాటుకు కానీ వ్యక్తిదే బాధ్యత అనే భావన కమ్యూనిటీని బలహీనపరిచింది. ఈ శూన్యాన్ని పూరించడం సాధ్యం కాలేదు. ప్రొఫెషనల్ సంబంధాలు కమ్యూనిటీ భావనను పెంచలేకపోయాయి. ఈ శూన్యాన్ని పూరించడానికి కృత్రిమంగా కులమతాలని నమ్మకాలని ఆశ్రయించవలసి వచ్చింది. వీటిని కూడా మార్కెట్ శాసించటం మొదలుపెట్టింది. రెలిజియస్ టూరిజం, అన్యమత విద్వేష ప్రచారం, అన్నీ వేదాలలో ఉన్నాయి, ప్రాచీర గ్రంథాలలోనే సైన్సు ఉంది అనే విచిత్రమైన ప్రచారం పేరుతో కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం, ఈ ఖాళీని సొమ్ము చేసుకుంది. ఇది ప్రశ్నించే తర్కించే స్వభావాన్ని తగ్గించి సృజనాత్మకతని బలహీనపరిచింది. ఇదంతా అమెరికాలోని మతతత్వానికి ఫక్తు అనుకరణ.
ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీ భావన లోపించడం వల్ల వచ్చిన శూన్యాన్ని రైటిస్టులు కుహనా జాతీయవాదంతో పూరిస్తున్నారు. దీనిలో వ్యక్తివాదం తెచ్చిన పోటీ, ద్వేషం ప్రధానం. భారత్ స్వతంత్ర ఉద్యమ కాలపు సామరస్య భావన, హిందుత్వ జాతీయవాదంలో మచ్చుకు కూడా కనబడదు. అంటే వీళ్ళు తెస్తున్నది కమ్యూనిటీ భావాన్ని కాదు, కమ్యూనిటీలా భ్రమింపజేసే కమ్యూనిటీ ముసుగు వేసుకున్న ఫక్తు వ్యక్తి వాదాన్ని. నిజానికి ఏజెన్సీ, కర్తృత్వం, మనిషికి మితిమీరిన ఛాయిస్ అనేవి ఆధునిక వ్యవస్థ సృష్టించిన మూఢనమ్మకాలు. అయితే అవి హేతువుగా భ్రమింపజేసే మూఢనమ్మకాలు. వాటి పునాది పైనే ఇతర మూఢనమ్మకాలు బహిర్గతం అవుతున్నాయి. విశాల విశ్వం, పర్యావరణం, నిరంతరం మారుతూ విశ్లేషణకు సులభంగా లొంగని సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరిణామాలు… వీటి మధ్య ఒక వ్యక్తి స్వయంసంపూర్ణుడు కాదు. అతని ఎన్నిక తప్పు కావడానికి, వైఫల్యానికి పూర్తిగా అతనే బాధ్యుడు కాదు. కానీ పాశ్చాత్య క్రైస్తవ తత్వం ఆధారంగా ప్రబలిన మానవ కేంద్ర వాదం, వ్యక్తివాదం వ్యక్తి పైన ఎనలేని బాధ్యతని పెడుతున్నాయి. ఇది ఆధిక్యత, న్యూనతా భావాల మధ్య వ్యక్తి నలిగిపోవడానికి కారణం అవుతుంది. స్వేచ్చగా కనపడే వ్యక్తివాదం మనిషిని ఒంటరిగా నిలబెడుతుంది. కనీసం కర్మ సిద్ధాంతం కానీ కాల్వినిస్టుల ప్రీడిటర్మనిజం కానీ మనిషిని ఇలా పూర్తిగా ఒత్తిడి చేయలేదు, సరి కదా ఒత్తిడి నుంచి కొంత ఉపశమనానికి పనిచేశాయి. జీవించే లక్షణాన్ని పెంపొందించాయి, కానీ అది పూర్తిగా గతం.
వ్యక్తి కర్తృత్వం, ఎన్నికల పైన ఆధారపడిన ఆధునిక విశ్వాసం సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్‌ని బలపరిచింది. యంత్రాన్ని ఎలా రిపేరు చేయవచ్చో అలాగే సమాజాన్ని సులభంగా ప్రణాళిక బద్ధంగా మార్పు చేయవచ్చు అనే వాదన రాజ్యం చేసింది. దానితోపాటు రిపేరు చేయడానికి వీలుకాని సమాజ యంత్రాలని ధ్వంసం చేసి కొత్త యంత్రంతో రీప్లేస్ చేయాలి, అలాగే ఆసియా ఆఫ్రికా దేశాలవారిని ఇంగ్లీషు వలసవాదులు ఆధునికీకరించాలి అనే తర్కం మార్క్స్‌ను కూడా వెంటాడింది. అయితే అరాచకవాది బకూనిన్ మార్క్స్‌తో చేసిన వాదన చారిత్రాత్మకమైనది. పెట్టుబడిదారీ వ్యవస్థ కార్మికులతో సహా అందరిని కలుషితం చేస్తుంది కనుక, ఈ పెట్టుబడి వ్యాధి సోకని తృతీయ ప్రపంచ దేశాలలోనే విప్లవాత్మక మార్పులు సోషలిజం సాధ్యమని బకూనిన్ వాదించాడు. రష్యన్ మేధావులతో చర్చల తర్వాత లేట్ మార్క్స్ అభిప్రాయాలలో మౌలిక మార్పు వచ్చింది. కమ్యూనిటీపై ఆధారపడిన ప్రాచ్య దేశాలలోనే సోషలిజం సులభసాధ్యం అని భావించాడు. వ్యక్తివాదం ప్రబలకుండా కమ్యూనిటీ భావన బలంగా ఉండే సమాజాలను లోపాలు సవరించడం ద్వారా కమ్యూనిజంలోకి నడపడం సహజ ప్రక్రియగా భావించాడు. ఈ విధంగా సోషల్ ఇంజనీరింగ్ అనే భావన నుంచి నేచురల్ సోషలిజం వైపు ప్రయాణించాడు కార్ల్ మార్క్స్.
భారతీయ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ఛాయిస్‍లెస్ అవేర్‍నెస్ అనే ఆలోచన ముందుకు తెచ్చారు. కర్తృత్వానికి ప్రాధాన్యo మితిమీరి వ్యక్తివాదం బలం పుంజుకున్న కాలంలో ఎంపిక లేని చైతన్యం మనిషికి స్వేచ్ఛని ఇస్తుంది అనే ప్రతిపాదన గుర్తించదగినది. నిజానికి ఎన్నుకునే స్వేచ్ఛ అనేది పూర్తిగా మానసిక కాలుష్యం. ఒకదాన్ని ఎన్నుకోవడంలో అనేకమైన వాటిని తిరస్కరించడం ఉంది. చిన్నచూపు చూడడం ఉంది. యూరోసెంట్రిజం ఆంత్రపోసెంట్రిజం మొదలైన రుగ్మతలకి మెరిటోక్రసీ కారణమవుతుంది. ఇది హైరార్కికల్ ఆలోచన విధానానికి దారితీస్తుంది. అసలు ఛాయిస్, స్వేచ్ఛ అనే పదాలకు ఆధునిక అర్థంలో కోరిక అని మాత్రమే అర్థం. కొత్త కొత్త సరుకుల పట్ల ఆకర్షణ. ఇది వినియోగ సంస్కృతికి ఆజ్యం. ఇది కొనుగోలు చేయగలిగినవాళ్ళు, లేనివాళ్ళు అనే అంతరాల్ని పెంచి పోషిస్తున్నది. కొత్త సరుకులు అవసరంతో సంబంధం ఏమీ లేకుండా కొంటూ ఉండాలనే ఒత్తిడి పెరిగింది. బుద్ధుడు కోరిక దుఃఖ హేతువు అన్న మాట ఇప్పుడు ఇంకా సార్థకం. అందుకే ఛాయిస్‍లెస్ అవేర్‍నెస్ వైపు ప్రయాణించాలి అనేది ఈ తత్వసారంగా భాసిస్తుంది.
ఇన్ని లోపాలతో కూడిన అమెరికా, పాశ్చాత్య దేశాల ప్రజాస్వామ్యాన్ని నిజమైన ప్రజాస్వామ్యంగా భ్రమపడి, భారత్ దానినే అనుకరించాలనే మేధావులకి కొదవలేదు. అమెరికా తత్వవేత్త నోమ్ చామ్‌స్కీ ఇలా అంటారు: “మన పాశ్చాత్య అమెరికా దేశాల్లోని ప్రజాస్వామ్య ఆర్థిక నమూనాల గురించి మనకే కొన్ని సందేహాలు అనుమానాలు ఉన్నాయి. అటువంటప్పుడు పేద దేశాలు మనల్ని ఆదర్శంగా తీసుకోవాలని ఒత్తిడి చేయడం అభ్యంతరకరమే అవుతుంది.”
మూలాలు
- Democracy’s Discontent-Michael J. Sandel Belknap press, London 2022.
- The Tyranny of Merit: What’s Become of the Common Good? Michael J. Sandel New York: Farrar, Straus & Giroux, 2020.
- Ashis Nandy on future of India: ‘A poor man’s America, with shrinkage of liberties’. Interview — www.firstpost.com 07th November 2016.
- Marx at the Margins: On Nationalism, Ethnicity, and Non-Western Societies by Kevin B. Anderson. Publisher: University Of Chicago Press 2016.
- Letter From Jawaharlal Nehru to Gandhi.9-10-1945 (info@mkgandhi.org).
- Ambedkar, Gandhians and the Indian Village Paramjit S Judge Economic and Political Weekly March 2021.
- Hind Swaraj, Or Indian rule by Gandhi, Navajivan publishing house Ahmedabad.
- Colonial Constitution Arghya Sen Gupta. Juggernaut Publication 2023.
- B. R. Ambedkar by W.N. Kuber. Peoples Publishing House, 1973.
- First feminist war of the new century. Chandrabhanu prasad. The Pioneer, 25th November 2001.
- ఆలోచనే ఆయుధంగా, నోమ్ చామ్‌స్కీ – ముక్తవరం పార్థసారథి, ప్రజాశక్తి బుక్ హౌస్ 2005.
- అసుర సంధ్య, మాల్కమ్ ఎక్స్ ఆత్మకథ. అలెక్స్ హేలీ, హెచ్‌బిటి, హైదారాబాద్ 2006.