(కన్యాశుల్కం నాటకం పై గత 50 సంవత్సరాలుగా వచ్చిన పొగడ్తలు, విమర్శలు, ప్రతివిమర్శలు నుండి పాఠకులకు పనికివచ్చే కొటేషన్లు పొందుపరచడం కోసం ఈ అనుబంధంలో నేను సాధ్యమైనంతవరకు మూల వ్యాసాలను చూడటానికి ప్రయత్నించాను. ఇందుకు కారణం లేకపోలేదు. ఫలానా ఆయన ఫలానా మాటలు అన్నారు అని ఒక విమర్శకుడు ఉదహరించినప్పుడు, ఆయన పాక్షికత పైకి కనిపించక పోవచ్చు. ఆ సందేహం నివృత్తి చేసుకోడానికి, మూల వ్యాసం చూడడం అవసరం కదా! అయితే, అన్ని సందర్భాలలోనూ ఆపని సాధ్యం కాలేదు.
కొన్ని కొటేషన్లు చాలామంది విమర్శకులు పదేపదే వాడారు. కత్తిరించి తమ భావ ప్రకటనకోసం మాత్రవే చెప్పినవి నేను వదిలేశాను. ఇక్కడ నా పాక్షికత కనబడుతుంది. అంతకన్నా నిర్మొహమాటంగ చెప్పడం నాకు చేత కాదు. కొటేషన్ల మీద నా కామెంట్లు ఇచ్చిన చోట నేను స్పష్టంగా ఈ మాటలు నావి అని రాసాను. — వే.వే.రా)
కేతవరపు రామకోటి శాస్త్రి గారి విమర్శనా వ్యాసాలు — మళ్ళీ కన్యాశుల్కం గురించి అన్న పేరుతో 1992 లో ప్రచురింపబడ్డాయి. ఇందులో ఆయన 1955 లో రాసిన వ్యాసం కూడా అనుబంధంగా ఇచ్చారు. ఆయన అప్పటికి మార్క్సి స్టు భావాలతో ప్రభావితం కాలేదు. 36 యేళ్ళ తరువాత రాసిన వ్యాసాల్లో ఆ ప్రభావం కనుపిస్తుంది. ఈ క్రింది కొటేషన్లు ఆయన వ్యాస సంపుటినుంచి ఇస్తున్నాను.
–“(అప్పారావుగారు) కన్యాశుల్కానికి అంకితం వ్రాస్తూ “మనస్త్రీజాతిలోని నిస్సహాయమయిన విభాగాన్ని సమాజ అవినీతి క్రిములతో నిండివున్న బాధాకరమైన దాస్యం నుండి రక్షించే సమస్య ఘనతవహించిన మీ దృష్టిని పదేళ్ళ క్రితం (1887-88) ఆకర్షించినప్పుడు ఈ చెడుగును ఒక జనరంజకమైన నాటకంలో వెల్లడి చేసి ఈ విషయంపై ప్రజాభిప్రాయాన్ని వుద్దీప్తం చేసేందుకు మీ భృత్యుడొకడు ఒక దుర్బల ప్రయత్నం చేశాడు.” పేజీ – 7
……. దేశభాషాసాహిత్య ప్రయోజనం గురించి తన అంతరంగాన్ని కన్యాశుల్కం మొదటి కూర్పు (1897) పీఠికలో (అప్పారావు గారు) వివరించాడు. “సమాజానికి సిగ్గుచేటు (అయిన) ఇటువంటి (కన్యాశుల్కవివాహ) దురాచారాన్ని ఎండగట్టి ఉన్నతమైన నైతిక ప్రమాణాలను వ్యాపింపజేయడానికి మించిన కర్తవ్యం సాహిత్యానికి మరొకటి లేదు. ప్రజాబాహుళ్యానికి పుస్తక పఠనం అలవాటయ్యేదాకా అలాంటి ఆరోగ్యకర ప్రభావ వ్యాప్తికై నాటకరంగాన్ని ఆశ్రయించవలసి వుంటుంది. కన్యాశుల్క నాటకరచనకు నన్ను ప్రేరేపించినది ఇదే.” పేజీ – 9 — మూడేళ్ళలో జరిగిన బ్రాహ్మణ కన్యాశుల్క వివాహ పట్టీ (1887) గురజాడ వ్రాసిన పీఠిక (మొదటి కూర్పు) ను బట్టి ఆయన పర్యవేక్షణలోనే జరిగి వుండవచ్చు.
……ఈ అతిబాల్యవివాహపు జబ్బు ఒక్క బ్రాహ్మల్లోనే కాదు, హిందూ కులాలన్నిటిలోనూ, సిక్కుల్లోనూ, జైనుల్లోనూ, బౌద్ధుల్లోనూ కూడా వున్నట్లు సమాచారం వున్నది. –పేజీ 11
— కన్యాశుల్కం మొదటి కూర్పు విషయంలో ఎలా వున్నా గురజాడ దాన్ని పూర్తిగా మర్చి కొత్త నాటకం వ్రాసి 1909 రెండవ కూర్పుగా ప్రచురించింది మాత్రం (వీరేశలింగం) పంతులు గారి బ్రాహ్మ వివాహం, వ్యవహార ధర్మబోధిని, వేశ్యాప్రియ ప్రహసనం, కౌతుక వర్ధని మొదలయిన రచనల పునాది మీద సమున్నతంగా నిర్మింపబడిన సాంఘికవ్యంగ్య నాటక కళాసౌధం అని చెప్ప వచ్చు. –పేజీ 17
— కన్యాశుల్కంలో వస్తువు సంఘసంస్కరణ. అంటే సంఘసంస్కరణోద్యమం నడుస్తున్న నడకను వస్తువుగా చేసుకొని , దానిబాహ్యేతర ప్రవృత్తుల వాస్తవాలను విమర్శనాత్మకంగా సామాజికుల ముందు పెట్టడానికి గురజాడ కన్యాశుల్క నాటకాన్ని వ్రాశాడు. ఆయన ఏ సాంఘిక సమస్యనూ ఏ దురాచారాన్నీ పరిష్కరించడానికి గానీ నిర్మూలించడానికి గానీ నాటకం వ్రాయ లేదు. కే.రా.కో — పేజీ –21 (my emphasis -వే.వే.రా)
— మధురవాణిని భవభూతి మాలతీమాధవంలోని కామందకితోకూడా పోల్చిచూడవలసిన అవసరం ఉంది. నిజానికి కన్యాశుల్కంలో మదురవాణి చేసిన గొప్పపని సుబ్బితో లుబ్ధావధాన్లు పెళ్ళి తప్పించడమే. వసంతసేన అసలిటువంటి పని ఏమీ చెయ్యలేదు. మాలతీమాధవంలో కామందకి చేసింది. కన్యాశుల్కం ఇతివృత్తం విషయంలో మాలతీమాధవానికి చాలా దగ్గరగా వస్తుంది . –పేజీ 38
— ఏ సాంఘిక రంగానికి సంబంధించిన సంస్కరణ అయినా అది బ్రాహ్మణవర్గ విమర్శ స్పర్శ లేకండా వుండటం సాధ్యం కాదు. వీరేశలింగంగారు బాల్య వివాహాల విషయంలోను, వృద్ధవివాహాల విషయం లోనూ స్త్రీ పునర్వివాహ విషయంలోనూ నిందించిందెవర్ని? బ్రాహ్మణ వర్గాన్నే కదా! సమాజ సంస్కరణోద్యమానికి తోడ్పడేందుకుద్దేశించిన నాటకంలో బ్రాహ్మణవర్గ విమర్శ. అదే అసలు వస్తువు. అందుకే కన్యాశుల్కం నిండా బ్రాహ్మలు. సంఘసంస్కరణోద్యమాన్ని నడిపిస్తున్నదీ బ్రాహ్మలు అయినప్పుడు వాళను వ్యతిరేకించే బ్రాహ్మలు ఉంటారు కదా! వాళ్ళు ఎప్పుడూ లోపాలు వెతుకుతూంటారు – పేజీ 48
(ఇక్కడ ఆయన 1955 లో మార్క్సిస్ట్ ప్రభావంలో పడక ముందు రాసిన వాటితో, ఈ పై వాక్యాలను పోల్చి చూడాలి. — ఆ వాక్యాలు ఇవి: “కన్యాశుల్కంనందలి ఇతివృత్తము ఉత్పాద్యము మరియు సాంఘికము. ఈ రూపకమున ప్రవేశ పెట్టబడిన పాత్రములు నాటికాలములోనున్న కొందర నుద్దేశించి యున్నవని విశాఖ జిల్లా వారు చెప్పుదురు.” ఇటువంటి వ్యాఖ్యలు విజయనగరం వారినుండి నేను కూడా విన్నాను. ముఖ్యంగా, ఈ నాటకంలో తాతా సుబ్బరాయ శాస్త్రి గారిని, ఆదిభట్ల నారాయణ దాసు గారినీ ‘వేళాకోళం ‘ పట్టించడంకోసం అప్పారావుగారు అవధానుల పాత్రలు సృష్టించాడని! వీరందరూ సమకాలికులు. శాస్త్రి గారు, దాసు గారు, వైదీకులలో ద్రావిడ శాఖకు చెందిన వారు. సంప్రదాయ సాహిత్యంలో, ధర్మశాస్త్ర అధ్యయనంలో, సంస్కృత వ్యాకరణంలో ఉద్దండులు అని చెప్పుతారు. ఈ ద్రావిడులలోనే, ఆరోజులలో బాల్యవివాహాలు జరిగేవని, మిగిలిన శాఖల వారిలో ఇది సమస్య కాదని అనే వారు. ఏదిఏమయినా నిర్థారించి చెప్పటం కష్టం. — వే.వే.రా)
(గురజాడ గురించి రాసేటప్పుడు, శ్రీశ్రీ గారి అభిప్రాయాలు చెప్పకుండా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. ఈ క్రింది కొటేషన్లు మనగురజాడ–శ్రీశ్రీ, సాహిత్య సర్వస్వం-9 నుంచి పొందు పరిచాను. 1932 నుంచి 1976 వరకూ శ్రీశ్రీ గురజాడ పై చెప్పిన మాటలు ఈ పుస్తకంలో ఉన్నాయి. దీన్ని 1988 లో విరసం ప్రచురించింది. కూర్పు : చలసాని ప్రసాద్. — వే.వే.రా)
— జీవితంలో ఏ సందర్భానికైనా సరిపోయే మాటలు ఎక్కడో ఒకచోట గురజాడ మహాకవి (కన్యాశుల్కంలో) దొరుకుతాయి . ……..మహాకావ్యాల ప్రధాన లక్షణాలలో ఇదొకటి — ఈ విశ్వతోముఖత్వం. పేజీ – 35
— కన్యాశుల్కం గొప్పది. జీవితమంత గొప్పది. సాహిత్యంలో వాస్తవికతను ఇంతసమగ్రంగా ప్రదర్శించిన నాటకం ఈ నాటి మనదేశంలో లేనే లేదు. …. భారతదేశంలో మృచ్చకటికంతోపాటు ఒక్క కన్యాశుల్కాన్నే నేను ఎన్నిక చేస్తాను. వసంతసేనకంటే మధురవాణి గొప్ప సృష్టి. — పేజీ 36
— విక్రమోర్వశీయంలో ఊర్వశి, మృచ్చకటికంలో వసంతసేన కవితాకన్యకలుగానే కనిపిస్తారు. రక్త మాంసాలతో పుష్టిగా భూమి మీద తిరిగే పాత్రలు కావవి. వసంతసేన మానవ వేశ్య అయినా మధురవాణి ప్రౌఢత్వం ముందు ఆమె వట్టి గోల. షేక్స్పియర్ క్లియొపాత్రా గాని, సోఫోక్లిస్ నాయికలు గాని వేశ్యలు కారు. ముద్దుపళని తన రాధికకు తంజావూరు నాగరికతనాటి వేశ్యల లక్షణాలను ప్రసాదించింది. చింతామణి కంటే, దేవదేవి నాలుగాకులెక్కువ చదువుకుంది. అంతే. Anatole France సృష్టించిన థాఇస్ తో దేవదేవిని పోల్చవచ్చును. వీరంతా శృంగారంలో కొన్ని సున్నితమైన ఒడుపులు చూపిస్తారు. కానీ, జీవితాన్ని వడబోసి చూపించరు.
Carmen, Manon Lescaut వీళ్ళు వసంతసేనకీ మధురవాణికీ మధ్య ఊగిసలాడతారు. వసంతసేన ప్రేమపాత్రిక అనీ, మధురవాణి జీవిత పాత్రిక అనీ నే నంటాను. ఎమిలీ జోలా సృస్టించిన నానా అనే పంథొమ్మిదవ శతాబ్దపు పరాసు వేశ్య వసంతసేనగా ప్రారంభించి మధురవాణిగా మారుతుంది. ….. చీకటి పడితే గానీ నానా కి ధైర్యం రాదు. ……. పగటివేళ కాకీరుపులను ఎదుర్కునే శక్తి ప్రదర్శించగలది మధురవాణి మాత్రమే! …… ఎంత గొప్ప పాత్రని సృష్టించాడు, గురజాడ! పేజీ – 42, 43.
— కన్యాశుల్కం గ్రంథాన్ని భీభత్సరసప్రధానమైన విషాదాంతనాటకంగా ఇప్పటికీ అభివర్ణించడం మానలేను — పేజీ 70 (మరెవరో చెప్పిన ఈ అంశాన్ని శ్రీశ్రీ సొంతంచేసుకున్నారని ఒక పుకారు వ్యాప్తిలో ఉంది — కోవెల సంపత్కుమారాచార్య, కన్యాశుల్కం -మరోవైపు , పేజీ -27)
(సర్దేశాయి తిరుమలరావు గారు ప్రచురించిన కన్యాశుల్క నాటకకళనుండి — తిరుమలరావుగారు దీనిని మొట్టమొదట సరళగ్రాంధికంలో రాసి, తానే ప్రచురించుకున్నారట. తదుపరి, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి వాడుకభాషలోకి పరివర్తనం చేశారు. విశాలాంధ్ర వారు, 1994 లో దీనిని ప్రచురించారు. — ఈ పుస్తకంలో కన్యాశుల్కం యొక్క అపూర్వ అద్వితీయ స్థానాన్ని నిరూపిస్తూ దాన్ని “కళాజయ స్థంభం” అని రుజువు చేసేందుకు గ్రీకు, రోమను, ఫ్రెంచ్, ఇంగ్లీషు మొదలైన భాషలనుండి, సంస్కృత, ఆంధ్ర, తమిళ, కన్నడ భాషల్లో ప్రాచీన కావ్యాలనుండి రుజువులు పొందుపరచారు. ఈ పుస్తకంలో ఎన్నో అధో జ్ఞాపికలున్నాయి. — వే.వే.రా)
— మనిషిని స్వాలంబునిగా చేయగల, లోకశ్రేయక్రియాపరునిగా ప్రేరేపించగల ఉదాత్త భావమే కవిత్వం. అలాంటి కవిత్వం కన్యాశుల్కనాటకం. పేజీ -21
— కన్యాశుల్కం ప్రహసనంకాదు. ఇందులో ఉదాత్త పాత్రలు వస్తాయి. హాస్యరస ప్రధానంకాదు. రసపరిభాషలోనే కావాలంటే ఇది కరుణరసవీరరసప్రధానం. దయావీరం కరటకశాస్త్రి, మధురవాణి పాత్రాశయంగా వుంది. దానవీరం మధురవాణిది. వాత్సల్యం సౌజన్యారావు చూపించిన రసం. కరుణరసం సుబ్బి పాత్ర నిష్టం. అనిష్టవస్తు (లుబ్ధావధాని) ప్రాప్తి (పెండ్లి) సుబ్బికి కలిగేయోగముండటంవల్ల కరుణరసం. పేజీ -31
— కన్యాశుల్కనాటకారంభం గిరీశం అవతరణతోనే జరుగుతుంది. ముగింపు ఇతని ‘మహాభినిష్క్రమణ’ తోనే జరుగుతుంది. ఈ విషయంలో నాటకంలో ఆద్యంతసమత (symmetry) వుంది. రామాయణ భారత భాగవతాలలో కూడా ఇలాంటి సంవిధానమే వుంది. పేజీ – 54
— కన్యాశుల్కవరదక్షిణలు భారతదేసంలోనేకాక ప్రాచీనకాలంనుండి వస్తున్న ప్రపంచవ్యాప్తమైన ఆచారాలే. గ్రీకులు, రోమన్లు, బాబిలోనియన్లు, టూటన్లు, ఈ ఆచారాలను అనుసరించారు. యూదులలో అరబ్బులలో వరుడు కన్యకు డబ్బుచెల్లించే ఆచారం వుంది. ముస్లిములలో పెండ్లి సమయములో వరుడు సమాదరంగా వధువుకిచ్చే ధనాన్ని, మహర్ అంటారు. ఇది విధిగా ఇవ్వాల్సిన ధనం. స్మృతి సమ్మతం. పేజీ – 120
— ఈ చెడ్డ ఆచారం (బాలికల్ని శుల్కంతీసికొని ముసలి వాళ్ళకిచ్చి పెళ్ళి చేయడం) బ్రాహ్మల్లోనే ఉందనుకుందాం. ఆనాటి జనసంఖ్యలో బ్రాహ్మణులు నాలుగు శాతం. ఇందులో కొద్దిమందే ఈ చెడు ఆచారం పాటించేవాళ్ళు అయి ఉండాలి. ……. ఎవరికో కొద్దిమందికి జరిగే అన్యాయాన్ని పెద్ద సంస్కరణీయాంశంగా, పెద్ద సంఘటన అయినట్లు నాటకంలో ప్రతిపాదించడం సంఘస్థితిని యదార్థంగా చిత్రించడం అనిపించు కుంటుందా? …. (అయితే) జరుగుతున్న అన్యాయం కొద్దిమందికే అయినా దానిని పరిహరించ వలసిందే అనే సంకల్పంతో కన్యాశుల్కం రాయబడిందని వాదించాల్సి వస్తుంది. పేజీ – 132
— ఆ రోజుల్లో బాల్య వివాహాలు బ్రాహ్మణులు మాత్రవే చేసేవారా? విజయనగరం మహారాజువారి ఆదేశం మేరకు కూర్చబడ్డ బ్రాహ్మణశుల్కవివాహాలపట్టి అపాతినిధ్యదోషభూయిష్టం. ఇప్పటికీ బాల్యవివాహాలు జరుగుతున్నట్లు ఉద్ధరించిన వార్తలు బ్రాహ్మణులవి కావు. సంఘంలో అన్ని చోట్లా ఉండే దురాచారానికి కండబలంలేని ఒక బాపడు బాధ్యుడైనట్లు చిత్రించడం అన్యాయం. పేజీ -135, 136.
(రెడ్డివారిలో పాకంటి భాగంవారు బాల్యవివాహాలు చేసే ఆచారం పాటించేవారట! –సెప్టెంబర్ 7, 1972 The Hindu , అధోజ్ఞాపిక పేజీ 23)
(కోవెల సంపత్కుమారాచార్య గారి కన్యాశుల్కం – మరోవైపు, జూన్ 2000 లో ప్రచురించారు. ఇందులో 11 వ్యాసాలున్నాయి. రెండు అనుబంధాలకింద తన వ్యాసాలపై వచ్చిన విమర్శలూ-ప్రతివిమర్శలూ కూడా ఇచ్చారు. ఈ వ్యాసాలన్నీ 1993-94 ప్రాంతంలో, ఆంధ్రప్రభ సాహితీగవాక్షంలో మొట్టమొదటిసారిగా ప్రచురించ బడ్డాయి. విపరీతమైన ఉత్ప్రేక్షలు లేకుండా, ఆయన వ్యాసాలు చదవడానికి చాలా హాయిగా వుంటాయి. ఆయన వ్యాఖ్యలు, విమర్శపై పరామర్శలూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తప్పక చదవాల్సిన పుస్తకం. కన్యాశుల్కాన్ని ఉంచవలసిన స్థాయిలోనే వుంచి, నాటకాన్ని కించపరచకుండా తప్పులు, ఒప్పులూ చూపిస్తూ రాసిన వ్యాసాలు, ఇవి. మొత్తం పుస్తకం అనుబంధంలోపెట్టచ్చు! కానీ అది సాధ్యం కాదు. -వే.వే.రా)
— … కన్యాశుల్కాన్ని ఇన్నిన్ని వందలసార్లు ప్రదర్శించామని ఎందరెందరెన్నిలెక్కలు చెప్పినా, అవన్నీ పాక్షికప్రదర్శనలేననేది సుప్రసిద్ధమే –పేజీ 20
— నిజానికి ‘ కన్యాశుల్కం ‘ గురించి లోతుగానూ, నిష్ఠ గానూ అధ్యయనం చేసిన దాదాపు ప్రతివిమర్శకుడూ రెండో కన్యాశుల్కం నాటకంగా విఫలమైనట్లు గుర్తిస్తూనే ఉన్నారు. కాని, ఆ విషయం చెప్పటానికి, ఒప్పుకోటానికీ మాత్రం ఇబ్బంది పడుతున్నారు. పేజీ – 21
— అప్పారావుగారు తననాటి అనేకనాటకాలూ, నాటకప్రదర్శనలూ, వాటి పరిమితులను, నాటకాల ప్రదర్శనయోగ్యతలనూ, గాఢంగానూ, నిశితంగానూ అధ్యయనం చేశారనటానికి ఆయన డైరీలు, లేఖలూ సాక్ష్యమిస్తున్నాయి. కాబట్టి ఉద్దేశపూర్వకంగానే ప్రదర్శనయోగ్యతారహితంగా, పఠనయోగ్యతాసహితంగా రెండు కన్యాశుల్కాలని రచించి ఉంటారనిపిస్తుంది. ఆయనకు ప్రదర్శనయోగ్యతనుగురించి తెలివిడి లేదనుకోవడంలో అర్థం లేదు. కాగా, ఆయన మొదటి కన్యాశుల్కాన్ని ప్రదర్శనకూ, రెండోకన్యాశుల్కాన్ని పఠనకూ ఉద్దేశించారనవచ్చు. పేజీ-22
— నిజానికి, కన్యాశుల్కం చాలాగొప్పరచన అని నిరూపించటానికే అప్పారావు గారు చెప్పినదాన్నికాదంటూ విమర్శకులు ఆయనతో ఘర్షణ పడుతున్నారు. ఆయన 1909 మే 7 వతేదీన ఆదిభట్ల నారాయణదాసుగారిని తమ నాటకంపై సమీక్ష రాయమని అభ్యర్థిస్తూ — ఆ సమీక్షకు భూమికను సూచిస్తున్నట్లుగా — ‘ ఇతివృత్త స్వీకరణలో, నిర్వహణలో, హాస్యరసపోషణములో, పాత్రోన్మీలనములో తెలుగు సాహిత్యములో ఇది అత్యుత్తమ నాటకమనే విషయాన్ని మరవకండి. ‘ అంటూ ఒక ఉత్తరం రాసారు.
పేజీ- 28
(ఆదిభట్ల వారు సమీక్ష రాసారో లేదో తెలియదు. ఆయన ఆత్మకథ ‘ నా యెఱుక ‘ లో యెక్కడా కన్యాశుల్క నాటక ప్రసక్తి లేదు. ఉత్తరం ప్రసక్తి ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే, దాసుగారి స్వీయచరిత్ర ఆయనకు 30 సంవత్సరాల వయసు వరకే చెప్పారు. ఈ ఉత్తరం 1909 లో రాయబడ్డది. అప్పటికి దాసుగారి వయస్సు 45. –వే.వే.రా)
(దాసుగారి స్వీయచరిత్రనుంచి ఈ క్రింది భాగం గమనార్హం. ఖరనామ సంవత్సరంలో కరువు వచ్చింది. అంటే 1891 లోనన్న మాట. అప్పుడు దాసుగారికి 27 సంవత్సరాలు. ఆయన విజయనగరం ఆస్థానం గురించి ఇల్లా రాశారు:
— దివాన్‌జీ సాహెబుగారి కాలమువరకు రాజ్యాభివృద్ధి కలిగెను. పిదప నిద్దరు మేనేజర్లు రాజ్యవ్యవహారము చూచుచుండిరి. అందులో పెద్ద మేనేజరు చాలాభాషలలో పండితుడు. పరదారధనవిముఖుడు. మాధ్వుడు. ……… రెండవ మేనేజరు (వెలనాటి) నియోగి బ్రాహ్మణుడు. మిక్కిలి తెలివితేటలుగల మంచి వ్యవహర్త. దాసుగారి స్వీయచరిత్రలో పేజీ – 157 (ఈ మేనేజర్లెవరో మనకి తెలిసే అవకాశం తక్కువే! — వే.వే.రా)
— కే.రా.కో పేజీ 21 లో ప్రస్తావించిన సమస్యా పరిష్కారం ఉటంకిస్తూ, సంపత్కుమారాచార్య గారు రాచమల్లు రామచంద్రారెడ్డిని కూడా ఉదహరించారు. ఆవాక్యాలు : గురజాడ మనస్తత్వంలో విపరీతధోరణి అన్నవ్యాసంలో రాచమల్లు రామచంద్రారెడ్డికూడా ఇంతకుముందే అభివ్యక్తి భేదంతో ఈ ప్రతిపాదన ( కే.రా.కో. చేసిన ప్రతిపాదన పైన ఇవ్వబడింది) వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన ఒక విధంగా వస్తునిర్వహణలోని లోపాలను కప్పిపుచ్చటానికి కొంత ఉపకరించవచ్చుకానీ, దీనివల్ల పీఠికలో అప్పారావుగారు చెప్పిన అంశాలు ఎందుకూ కొరగానివయ్యే ప్రమాదం వుంది. సమస్యను వెల్లడి చేసి ఆ విధమైన దురాచారాన్ని ఎండగట్టడం తమ రచనా లక్ష్యం అని అప్పారావు గారు అంటుంటే, అది కాదండీ మీలక్ష్యం. మేం చెప్పేదే మీ లక్ష్యం అని విమర్శకులు అప్పారావుగారిమీద వత్తిడి తీసుకొరావడం ఎంతవరకు ఉచితం? — పేజీ -44.
(రాచమల్లు రామచంద్రారెడ్డి గారి సారస్వత వివేచనలో, ఆయన సంవేదనలో జులై 1969 లో అప్పారావుగారిమీద రాసిన వ్యాసం పునర్ముద్రించబడినది. ఆ వ్యాసభాగమే, కో.సం. గారు పైన ఉదహరించారు– ఈ క్రింద రా.రా. నుంచి కోట్ చేస్తున్నాను. — వే.వే.రా.)
గురజాడ మనస్తత్వంలో ఏదో వింతధోరణి ఉన్నట్లుంది. యేమిటది? వితంతు వివాహాలకు తాను అనుకూలుడై వుండి కూడా, ఆ సమస్యను అల్లరి పాలు చేసినాడు. వేశ్యా సంస్కరణకు (వేశ్యావృత్తి నిర్మూలనకు) తాను అనుకూలుడై వుండికూడా ఆ సమస్యను నవ్వులపాలు చేసినాడు యెందుకు? నాకు కనిపించే కారణం ఒక్కటే. తన సమకాలిక సమాజంలో సాగుతూ వుండిన ఆ సంస్కరణోద్యమాలపట్ల గురజాడకు తృప్తి లేదు, సానుభూతి లేదు. ….. ఆస్తి కలిసి వస్తుందనో, వితంతువివాహ సంఘం వాళ్ళు ఇచ్చే డబ్బుమీద ఆశ చేతనో, లేదా కొన్ని సందర్భాలలో విపరీతమైన కీర్తిదాహంవల్లనో వితంతువులను పెండ్లి చేసుకోడానికి ముందుకు వచ్చే వాళ్ళే యెక్కువమంది వుండివుంటారు. కన్యాశుల్కం మూడవ అంకం మూడవరంగంలోని గిరీశం స్వగతంలో ఈ మూడు కారణాలూ ప్రముఖంగా కనపడతాయి. — పేజీ 125, 126
(కమ్యూనిస్ట్ ప్రభావంలో పెరిగిన విమర్శకులంతా, కన్యాశుల్కంమీద ఎవరు కాస్త వ్యతిరేక విమర్శ రాసినా … వారి ప్రత్యేక పద సముదాయంతో ఊదర కొడతారు. ఈ పదాలు ….. భూస్వామ్య, బూర్జువా, శ్రామికవర్గ దృక్పధం, ప్రాపంచిక దృక్పధం, పితృస్వామ్య సంస్కృతి, శిథిల పితృస్వామ్య సంస్కృతి, పురుషాధిక్య వ్యవస్థ, ప్రజాస్వామిక వ్యవస్థ, పితృస్వామిక సంస్కృతీ చట్రం, చారిత్రక గమనం, సామాజిక నిబద్ధత, …. ఇల్లాంటివే మరికొన్ని వాడి సందర్భాసందర్భ వివేచన లేకండా విసురులు విసిరి తూలనాడడం పరిపాటి. ఈ ‘చట్రం’ లో కొంతమంది స్త్రీవాద విమర్శకులనికూడా కలపచ్చు — వే.వే.రా)
( నాటక ప్రదర్శన విషయంలో అబ్బూరి రామకృష్ణారావుగారి మాటలు భావాలు చెప్పకపోతే, ఈ నాటకానికి సార్థకతలేదనవచ్చు. అబ్బూరి సంస్మరణ నుంచి ఈ క్రింది మాటలు — వే.వే.రా)
… ఈ నాటకాన్ని వందసార్లకు పైగా తెలుగుదేశం నానాప్రాంతాల్లోనూ, భిన్నభిన్నాభిరుచులుగల సామాజికుల సమక్షంలోనూ నేను ప్రయోగించాను. కన్యాశుల్కం నాటక ప్రయోగయోగ్యత అన్నిచోట్లా ప్రశంసాపాత్రం కావటంతో ప్రస్ఫుటమయ్యింది. ….. స్థూలంగా చూస్తే ఈ నాటకంలో విడివిడిగా చూపించదగిన రెండు కథా భాగాలు మనకు గోచరిస్తాయి. ఈ రెండు భాగాలూ అన్యోన్యాశ్రయంతో వుండటం వల్ల దీర్ఘంగావున్న కొన్ని రంగాలను తగ్గించడమూ, వేర్వేరుగావున్న కొన్ని సన్నివేశాలను కలిపివేయడమూ చేస్తే గాని పరిణతమైన ప్రయోగ పద్ధతి సాధ్యం కాదు. ద్వితీయాంకంలో అగ్నిహోత్రవధానుల ఇల్లు, అక్కడ ” వొద్దు వొద్దంటూంటే ఈ ఇంగ్లీషు చదువులో పెట్టావ్” అనే భావంతో మొదలుపెట్టి, ఆరో అంకంలో “ఈ గాడిదకొడుకు ఇంగ్లీషు చదువు కొంపముంచింది” అనే మాటలతో నాటకం ముగించటం వొక పద్ధతి. నా ప్రయోగాలన్నిటిలో దీనినే అవలంబించాను. …… ఇలా కాకండా ప్రథమాంకం తోనే నాటకాన్ని ఆరంభించడం ఇంకో పద్ధతి. దీనిలో గిరీశం కపట నాటకం ప్రధాన వస్తువవుతుంది. యేదో మిషతో మధురవాణిని విడిచి పెట్టడం, ఇంకోమిషతో అగ్నిహోత్రావధాన్ల ఇంట్లో ప్రవేశిం చటమూ, బుచ్చమ్మను వంచించి లేవదీసుకొపోవడమూ, లుబ్ధావధాన్ల ఆస్తి అపహరింటానికి ప్రయత్నించటమూ, చిట్టచివరకి సౌజన్యారావు ఇంట్లో మధురవాణి సమక్షం లో పరాభూతుడైనా పశ్చాత్తాపం పొందక ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అనడం తో ఈ కథ ముగుస్తుంది. పేజీ- 213, 214 (ఈ వ్యాసం వీశ్వవీణ లో డిసెంబర్ 1959 లోప్రచురించబడింది — వే.వే.రా)