కోవెల సంపత్కుమార, కన్యాశుల్కం – మరో కోణం: విమర్శలు – పరామర్శ

కన్యాశుల్కం శతజయంతి సందర్భంగా 1994లో ఆంధ్రప్రభ ‘సాహితీ గవాక్షం’లో తొమ్మిది వ్యాసాలు కోవెల సంపత్కుమార ప్రచురించారు. అంతకు ముందు కన్యాశుల్కపరంగా మరో రెండు వ్యాసాలు గూడా రాశారు. వెరసి పదకొండు. అన్ని వ్యాసాల ప్రచురణ పూర్తికాకముందే విమర్శలు, స్పందనలు, అనుస్పందనలూ వచ్చాయి. ఆ విమర్శలతో పాటు వాటికి సంపత్కుమార ఇచ్చిన సమాధానాల అనుబంధంగా వెలువడిన పుస్తకం, కన్యాశుల్కం – మరోవైపు (ప్రచురణ: 2000, 122పే. విశాలాంధ్ర, నవోదయ పుస్తకాల దుకాణాలలో లభ్యం.)

కన్యాశుల్కం పై ప్రముఖులనుండి వచ్చిన చర్చల్లో చాలాభాగం ‘అతిశయోక్తుల తోటీ, అత్యుక్తుల తోటీ’ ఉన్నదనడం అతిశయోక్తి కాదేమో! ఉదాహరణకి, ‘కన్యాశుల్కంలో లేనిదేదీ ప్రపంచంలో లే’దనీ, కన్యాశుల్కం ‘జీవితమంత గొప్పది’ అనీ, ‘వాస్తవికతతో పాటు అధివాస్తవికత కూడా కన్యాశుల్కంలో ఉన్న’దనీ, కన్యాశుల్కం ఒక గొప్ప ‘కావ్యం’ అనీ, రకరకాలుగా పొగడ్తలు మనలో చాలా మంది వినే వుంటారు. ఇటువంటి ప్రశంసలకి రమణారెడ్డి, రారా కాస్త చికాకు పడ్డారు కూడాను!

సంపత్కుమార రాసిన వ్యాసాల్లో ఇటువంటి బీభత్సం లేదు. కన్యాశుల్కం నాటకాన్ని రకరకాల కోణాలనుంచి పరిశీలించి వాటిలో తన అభిప్రాయాలని సూటిగా చెప్పారు. నేను ఈ వ్యాసాలన్నింటి గురించీ వివరంగా రాయదలచు కోలేదు. స్థూలంగా కొన్ని వ్యాసాల పరిధిని ప్రస్తావించి, సంపత్కుమార తన వ్యాసాలపై వచ్చిన విమర్శలకిచ్చిన సమాధానం గురించి ముచ్చటిస్తాను. స్థూలంగా మిగిలిన వ్యాసాల సారాంశం ఇది:

గురజాడ రెండు కన్యాశుల్కాలు రాశారు. మొదటి కన్యాశుల్కంలో మధురవాణి పాత్రకు ప్రాధాన్యం తక్కువ. అయినా కథ బాగానే నడిచింది. రెండవ కన్యాశుల్కంలో మధురవాణి పాత్ర పెరిగింది. అందువలన నాటకానికి ప్రయోజనం లేకపోగా గిరీశం వంటి పాత్రలు దెబ్బతిన్నాయి. మధురవాణి పాత్రకు బలి అయిన గిరీశం పాత్రని సరైన కోణం నుంచి పరిశీలించాలి. గిరీశం తెలివిగలవాడు. విస్తృత పరిజ్ఞానం ఉన్నది. అతను ఆడిన అబద్ధాలు తనని రక్షించుకోవడానికేగాని ఎవరినీ మోసగించడానికి కాదు. ఆడపిల్లలని అమ్ముకోవడం, పరమ వృద్ధులకి బాలికలని కట్టబెట్టడం, వంటివి దురాచారాలని నమ్మిన వ్యక్తి గిరీశం. అంతేకాదు విధవావివాహం న్యాయమని అతని విశ్వాసం. తాను ఎక్కడా సంఘ సంస్కర్తని అని చెప్పుకోలేదు. బుచ్చమ్మని మాయోపాయంగానైనా పెళ్ళి చేసుకుందామనుకున్నాడే కాని మోసగించదలచుకోలేదు. ‘తానుచేయని తప్పుకు బలయిన’ పాత్ర (అప్పరాయోపహతుడు) గిరీశం.

కన్యాశుల్కం అనే దురాచారాన్ని యెండగట్టి కన్యాశుల్కం నాటకం ద్వారా ఉన్నతమైన నైతికప్రమాణాలు దేశం మొత్తంగా వ్యాపింపచేయడం గురజాడగారి లక్ష్యం. అలా అని ఆయనే చెప్పుకున్నారు. అయితే సంపత్కుమార అనేది ఏమిటంటే, ఆ లక్ష్య సిద్ధికి అనుగుణంగా ‘వస్తు నిర్వహణ’ కన్యాశుల్కంలో జరగలేదని. కన్యాశుల్క రచనలో కన్యాశుల్కంకన్నా వృద్ధులకు చిన్నపిల్లలనిచ్చి వివాహం చేయడం అనర్థదాయకం అనే విషయానికే ప్రాధాన్యత. పోని వితంతు వివాహసమస్య పరిష్కరింపబడిందా అని చూస్తే, అదీ లేదు. గిరీశం బుచ్చమ్మల వివాహం జరగలేదు. అప్పారావుగారికి అది ప్రధాన సమస్య కాదనిపిస్తుంది.

అయితే, మరికొందరు విమర్శకులు ఒక విచిత్రమైన ప్రతిపాదన చేశారు. అప్పారావుగారు కన్యాశుల్కంలో ఏ సమస్యకో పరిష్కారాన్ని చూపించడానికి కాక ఆనాటి సంస్కర్తలు, ఆ ఉద్యమాలూ ప్రవర్తించిన తీరు పట్ల అసంతృప్తితో దాన్ని విమర్శించటాన్ని తన రచనలో ప్రధానీకరించారన్నది ఆ ప్రతిపాదన. అలాగే కన్యాశుల్కం నాటకం సమస్యలు ప్రదర్శించదు. సమస్యలాధారంగా ఉద్యమం నడుస్తున్న నడకను ప్రదర్శిస్తుంది, అని మరో ప్రతిపాదన. అయితే ఈ ప్రతిపాదనలు ‘సమస్యను వెల్లడి చేసి ఆ విధమయిన దురాచారాన్ని ఎండగట్టడం తమ లక్ష్యం అని అప్పారావుగారంటూ ఉంటే, అదికాదండీ మీ లక్ష్యం. మేం చెప్పేదే మీ లక్ష్యం’ అనడం ఎంత వరకూ సబబు అని సంపత్కుమార ప్రశ్నించారు.

రెండవ కన్యాశుల్కం ‘ప్రదర్శన యోగ్యత’ కొరవడి, పఠన యోగ్యతవల్ల ‘నాటకం’ గా విఫల మయ్యింది. రూపపరంగా ‘నవల’ కాలేకపోయింది అని సంపత్కుమార ఆరోపణ. ఈ విషయం ఇదివరలో కొందరు విమర్శకులు ఒప్పుకున్నదే; సంపత్కుమార ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు.

‘మలిరచన ఘనత ఏమో?’ అన్న వ్యాసంలో సంపత్కుమార కొన్ని విషయాలు – ఇతర విమర్శకులు వదిలిపెట్టినవి, వివరంగా ప్రస్తావించారు.

‘నిజానికి కథావస్తువు నిర్వహణలో మొదటిదానిలో ఉన్న విశిష్టత రెండవదానిలో లేదు. రెండవది శిథిలబంధమని దాదాపుగా అందరూ అంగీకరించినదే. అది నిజంగా కలగూరగంప అయింది,’ అని చెప్పుతూ రెండవదానిలో మార్పుల అప్రయోజకత్వానికి ఉదాహరణగా ఒక విషయం గుర్తు చేశారు. ‘రామప్ప పంతులు మొదటి కన్యాశుల్కంలో వైదీకి. రెండవదానిలో నియోగి అయ్యాడు. ఎందుకు? దీనివల్ల వచ్చిన విశేషమేమిటో అర్థం కాలేదు. పోగా, కన్యాశుల్కంలో ఒక్క సౌజన్యారావు పంతులు తప్ప మిగిలిన పాత్రలన్నీ వైదీకులే. నియోగులని ఉత్తమంగా చిత్రించి వైదీకులనందరినీ అధమంగా చిత్రించడం వలన పలువురి నిరసనకు అప్పారావుగారు గురై ఉండవచ్చు. ఆ నిరసనలనుంచి తప్పించుకునేందుకు ఈ మార్పు జరిగి ఉంటుంది.‘

‘మొదటిదానిలో లేని, రెండవదానిలో ఉన్న మరో ఆకర్షణ – గిరీశం లుభ్ధావధానులుకు రాసిన ఉత్తరం. ఇందులో గ్రాంథిక భాష అపహాస్యం చెయ్యబడింది. అంతకు మించి ఈ ఉత్తరం వల్ల కథలో గాని, నిర్వహణలో గాని కలిగిన లాభం ఏమీ లేదు. మొదటి కన్యాశుల్కంలో కంటే రెండవకన్యాశుల్కంలో అదనంగా వచ్చిన వ్యక్తులు పదకొండుగురు. పూటకూళ్ళమ్మ, కొండుభొట్లు, అసిరిగాడు, పోలిసెట్టి, భుక్త, మునసబు, సాతాని, జంగం, యోగిని, పోలీసు జవాను. వీళ్ళల్లో ఏ ఒక్కరూ నాటకానికి ప్రయోజన కరం కారు.‘

అప్పారావుగారు ‘కన్యాశుల్కము – హాస్యరస ప్రధానమగు నాటకము’ అని మలికూర్పు ముఖపత్రం మీద అచ్చువేయించారు. రసవిమర్శకులందరికీ ఇది చిక్కు తెచ్చిపెట్టింది. ఒకరు ఈ నాటకము ‘ఖేద మోదాంతమ’ని, కాదు ‘ఫార్సు’ అని మరొకరు, వాదించారు. మరికొందరు ప్రకరణము అన్నారు. ‘కన్యా శుల్కం: కాదా ఒక విరస రచన?’ అన్న వ్యాసంలో సంపత్కుమార కన్యాశుల్క రసవిషయం చర్చించారు. ఈ చర్చ కొంత ఘర్షణకి దారితీసింది. సంపత్కుమార భారతీయ అలంకారశాస్త్ర పరిధిలో రస చర్చ చేశారు. హాస్యరస ప్రధానమయితే, అది నాటకం కాదు; మరి అది నాటకమే అయితే హాస్యం ప్రధాన రసంగా ఉండటానికి వీలు లేదు. హాస్యరస ప్రధానమయినది ప్రహసనమవుతుంది కాని నాటకం కాదు అని ఆయన వాదన.

ఇది ఇలావుండగా, శ్రీశ్రీ ‘కన్యాశుల్కం బీభత్సరస ప్రధానమయిన విషాదాంత నాటకము’ అని అన్నారు. నాటకంలో బీభత్సం ప్రధాన రసంగా ఉండదు అని సంపత్కుమార వాదం. నిజానికి కన్యాశుల్కాన్ని ‘హాస్యరస ప్రధానమగు నాటకము’ అని అప్పారావు గారు శాస్త్రీయ పద్ధతిలో కాక సాధారణపద్ధతిలో – వ్యావహారిక ధోరణిలో అన్నారు. ఇక్కడి ‘నాటకం’ దశరూపభేదాల్లోని ‘నాటకం’ కాదు అని సంపత్కుమార నిరూపణ. భారతీయ రూపకపద్ధతిని బట్టి శాస్త్రీయంగా చెప్పవలసి వస్తే కన్యాశుల్కం కేవలం ఒక విరస దృశ్యరచన మాత్రమేనని సంపత్కుమార వాదం. ఈ వ్యాసంపై శాస్త్రీయ పద్ధతిలో రస చర్చ చేయగల సమర్థులైనప్పటికీ, ఈ వాదన కటువుగా కనిపించి బేతవోలు రామబ్రహ్మం, ముఖ్యంగా ఆర్. యస్. సుదర్శనంగారలు సంపత్కుమార వ్యాసాన్ని పేలవంగా ఖండించారు.

ఈ విమర్శ లన్నింటికన్నా ముఖ్యమైనది కాకరాల గారి విమర్శ. రెండు వ్యాసాలు మాత్రమే చదివి, మొత్తం తొమ్మిది వ్యాసాలూ అచ్చుకాకముందే, సంపత్కుమార మిగిలిన వ్యాసాల్లో చెప్పబోయేది ఊహించి రంగంలోకి దూకి, తనదైన మార్క్సిస్ట్ ధోరణిలో సంపత్కుమారని ‘అంతా… పండిత బుద్ధి’ అని విమర్శించారు.

ఈ విమర్శలకి సమాధానంగా సంపత్కుమార రాసిన వ్యాసం ‘మరోకోణం: విమర్శలు – పరామర్శ.‘

ఈ వ్యాసానికి, నిజంగా తగిన గుర్తింపు రాలేదు. అంతే కాదు. వ్యాసాలన్నీ జాగ్రత్తగా చదివితే, సంపత్కుమార గురజాడ అభిమాని కాదని అనడం గురజాడ భక్తులకికూడా చాలా కష్టమైన పనే! గురజాడ పంతొమ్మిదవ శతాబ్ద చివరి దశకాలలో మేధావి అని, ఆలోచనాపరుడు అనీ, పరిశీలనా తత్పరుడు అని సంపత్కుమార ఒక వ్యాసంలో చెప్పనే చెప్పారు.

మరోకోణం: విమర్శలు – పరామర్శ వ్యాసాన్ని యదాతథంగా ఈమాట పాఠకులకి ఈ కోవెల సంపత్కుమార స్మారక సంచికలో అందిస్తున్నాం.