[ఈ వ్యాసం ఈమాట మే 2007 సంచిక లో వేలూరి వేంకటేశ్వర రావుగారు రాసిన సంపాదకీయం “మళ్ళీ మరోసారి మా తెలుగు మేష్టారి గురించి…” కి అనుబంధం.]
అమరు అనే కవి ఉండేవాడో లేదో అనుమానమే. ఆ పేరిట సంస్కృతంలో ఒక వంద పైచిలుకు శృంగార రసప్రధానమైన శ్లోకాలు ప్రసిద్ధికెక్కాయి. అలంకారశాస్త్ర గ్రంధకర్తలు అమరు శతకం లోని శ్లోకాలు ఉదాహరణలుగా ఇచ్చారు కూడాను. అంతేకాకుండా రకరకాల సంకలనాలలో చోటు చేసుకున్నాయి.ముఖ్యంగా, విద్యాకరుని సుభాషితరత్నకోశం లో వేర్వేరు కవుల పేర్లతో ప్రచురించబడ్డాయి. [1]
అమరు (అమరక,అమరుక, అమరూక,అమర)శతకం పై వేమభూపాలుని విశ్లేషణ గ్రంధం ప్రామాణికంగా చెపుతారు. చెదులవాడ సీతారామ శాస్త్రి గారు తెలుగు లిపిలో ఈ శ్లోకాలని వ్రాసి, తెలుగులో వ్యాఖ్యానించారట. 1865 లో ఈ పుస్తకం మద్రాసులో అచ్చు అయింది. ప్రస్తుతం ఈ పుస్తకం అందుబాటులో లేదు.
అమరు శతకం పుట్టుపూర్వోత్తరాల గురించి కథలు చాలా ఉన్నాయి. వాటి లో చాలా ప్రసిద్ధికెక్కి ప్రచారంలో ఉన్న కథ శంకర భగవత్పాదుల కథ [2,3]. శంకరాచార్యులవారు మండనమిశ్రునితో వేదాంత వివాదం చేసి, గెలుస్తున్నారు. అప్పుడు మండనమిశ్రుని సతీమణి వివాదంలోకి దిగినదట. శంకరాచార్యులవారు అన్ని విషయాలూ తెలిసిన జ్ఞాని. అయితే, ఆయనని ఓడించడానికి శృంగార శాస్త్ర మొక్కటే దిక్కు అని తలచి, ఆవిడ శృంగారశాస్త్ర విషయాలలో ప్రశ్నించడం మొదలుపెట్టినదట. ఆవిడ సాక్షాత్తు సరస్వతీదేవి అని కథ.
శంకరాచార్యులవారు సందిగ్ధంలో పడ్డారట. సరియైన సమాధానం చెపితే యోగిగా హేళనకి పాలవచ్చు; చెప్పలేక పోతే అపజయం. అప్పుడు ఆయన వివాదానికి నూరురోజుల వాయిదా తీసుకొని,తన యోగవిద్యాప్రభావముతో అప్పుడే మరణించిన కాశ్మీరరాజు అమరు అనే అతని భౌతికకాయంలో ప్రవేశించి, క్షుణ్ణంగా, ప్రత్యక్షంగా నూరురాత్రులు అమరు రాజు గారి కొలువులో స్త్రీలనుండి శృంగారకళని అభ్యసించి, తిరిగి వచ్చి మండనమిశ్రుని భార్యతో వివాదంచేసి విజయం సాధించారట. ఆ నూరు రాత్రులలో తన అనుభవాలను నూరు కవితలుగా పొందుపరిచారట. ఆ కవితల సంకలనమే అమరుశతకం అని అంటారు. ఏది ఏమయితేనేం. అద్భుతమైన తొమ్మిదవ శతాబ్దపు శృంగార శతకం (నూరుకు పై చిలుకే) మనకు మిగిలింది.
మా తెలుగు మేష్టారు గరికపాటి మల్లావధాని గారు అమరుశతకంలో శ్లోకాలు చదివి, తెలుగు అనువాద పద్యాలు మా క్లాసులో చదివి ఉండకపోతే బహుశా ఇటువంటి పుస్తకం ఉన్నదని నాకు తెలిసేది కాదేమో. ఆయన అమరుశతకం పూర్తిగా తెలుగులో పద్యరూపంగా అనువదించారు. 1981 లో “వైజయంతి” [5] అనే ఆయన స్వీయ కవితా సంకలనంలో దీనిని పొందుపరిచారు. ఆ పుస్తకమూ ఇప్పుడు ఎక్కడా లభ్యం కాదు.
మచ్చుకి, నాకు అర్థమయి అందుబాటులోఉన్న రెండు శ్లోకాలు,వాటి తెలుగు,ఇంగ్లీష్ అనువాదాలు ముచ్చటిస్తాను.
నిశ్శేషచ్యుత చందనం స్తనతటం నిర్మృష్ట రాగోధరో
నేత్రే దూరమనఞ్ఝనే పులకితా తన్వీ తవేయం తనుః
మిధ్యావాదిని దూతి బాంధవజన స్యాజ్ఞాతపీడాగమే
వాపీం స్నాతుమితో గతాసి న పుంస్త స్యాథమస్యానికమ్. -61
నాయకుని దగ్గరకి నాయకి తన దూతికని పంపింది. ఆ దూతి నాయకునితో శృంగార కలాపాలాడి తిరిగి వచ్చింది. ఆ విషయం కనిపెట్టి, నాయిక దూతిని వక్రోక్తి తో నిందిస్తూన్నది.
తొఱగెను మోవికెంపు, చనుదోయిని గందముడిందె నక్షులన్
గఱగెను గజ్జలంబు పులకల్ పొదలెన్ మెయి నీకు నక్కటా
యెఱగవు బంధుపీడ వచియించెది బొంకులు క్రుంక బావికీ
వరిగితి వంతె యయ్యధమునంతిక మేగగలేదు దూతికా.
ఇది మా మేష్టారి అనువాదం. వెంపరాల సూర్యనారాయణశాస్త్రి గారు కొన్ని శ్లోకాలు తెనిగించారు. ఆయన అనువాదం:
చనులం చందనమెల్ల జాఱె, నథరోష్టంబందు గెంజాయ మా-
సెను, కన్నుల్ విడెనంజనంబు, పులకించెన్ మవ్వపుందేహ, మో
యనృత లాపిని! దూతి! బంధుజనపీడాజ్ఞాత్రి! స్నానార్థమై
చనితా బావికి గాని యయ్యధము పజ్జన్ జేరలేదీ వి సీ.
ఇప్పుడు ఆంగ్లానువాదం [3]:
The sandal paste
is rubbed from your lifted
breasts,
your lip rouge is smeared,
the kohl’s gone from your eyes.
Deceitful messenger,
your soft skin’s aroused
and you can’t see your own
sister’s despair!
Tell me you went to the
bathing tank
not back
to that scoundrel.
మరొక ఇంగ్లీషు అనువాదం [4]
The slope of your breast has wholly lost
its sandal paste,
your lower lip has lost its rouge;
your eyes are quiet without collyrium
while your body runs with drops of moisture.
Destroyer of my hopes!
Messenger, oblivious of the pain you bring a friend!
You went in bathing at the tank
and never saw the wretch.
రెండో శ్లోకం:
స్విన్నం కేనముఖం? దివాకకరైస్తే రాగిణీలోచనే?
రోషాత్త్వద్వచనోదితాద్ విలులితా నీలాలకా? వాయునా
భ్రష్టం కుంకుమ? ముత్తరీయ కషణా త్క్లాంతాసి? గత్యాగతై-
ర్యుక్తం తత్సకలం కి మత్ర వద హే దూతి! క్షతాస్యాధరే. –93
వరుసగా మా మేష్టారు,వెంపరాలవారూ చేసిన అనువాదాలు:
ఏటికి మోము చెమ్మగిలె? నెండకు, కన్నుల రాగమేల? నీ
మాటల, కేల ముంగురులు మార్పడె? గాలికి,బోయె కుంకుమం
బేటికి? బైట రాపిడి, నిదేమలవోతివి? రాకపోకలన్,
బోటి యివన్నియున్ సరియె మోవిపయిన్ క్షతమేల? చెప్పుమా?
ఏల ముఖంబుచెమ్మగిలెనే? బిరుసెండకు, కన్నులెఱ్ఱనౌ
టేల? త్వదుక్తికిన్ గినియ, నేల కురుల్ చెదరెన్ సమీరుచే,
నేల తారంగె గుంకుమ? మిదే కనుపయ్యెద రాయిడిన్, శ్రమం
బేలె? గతాగతంబుల, సరె చెపుమీ? క్షతమేల మోవిపై.
వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు రాసారు: –… మా ఇద్దరి పద్యముల పరిశీలింప కవిశేఖరుల (మా మేష్టారికి ఆ బిరుదుంది!) ధారాళమగు శయ్య నా పద్యములలో నీరస పడినదని యొప్పుకొనక తప్పదు. ఎందరో అమరు కావ్యము తెనిగించి యుండిరి. అన్నిటిలోను మల్లావధానిగారిది మిన్న యనిన చాలును. —
రెండు ఇంగ్లీషు అనువాదాలు, వరుసగా. [3, 4].:
Sweat on your face?
—the piercing sunshine.
Your eyes look red and excited-
—his tone made me furious.
Your black hair scattered-
—the wind.
What about the saffron designs on your breasts?
—My blouse rubbed them off.
And so winded-
—from running back and forth.
Of course.
But what’s this curious
wound to your lip?
“Why such breathing?” From running fast.
“The bristling cheek?” From joy at having won him over.
“Your braid loose.” From falling at his feet.
“And why so wan?” From so much talking.
“Your face is wet with sweat.” Because the sun is hot.
“The knot has fallen loose upon your dress.” From coming and from going.
“Oh messenger, what will you say about your lip, the color of faded lotus?”
సంస్కృతంలో ఈ పై శ్లోకం పాఠాంతరంగా, కొద్ది మార్పులతో ఉండబట్టి కాబోలు, దీనిని శీలాభట్టారిక కవితగా సందేహిస్తూనే సంకలనాలలో చేర్చారు [1,4].
బహుశా ఇటువంటి శ్లోకాలు,- నాయికకు దూతికపై ఈర్ష్యను వెలికి తెచ్చే శ్లోకాలు – చాలా ఉండి ఉండాలి. రకరకాల సంకలనాలలో ఇటువంటివి కనిపిస్తాయి.అట్లాగే మొదటి శ్లోకం సువిభోక అనే కవి రాసినదని అనుమానంగానే చెప్పారు [1,4].
అమరు చెప్పిన శ్లోకాలు కొన్ని ఆనందవర్ధనుడు, రాజశేఖరుడు, మొదలైన ప్రసిద్ధ ఆలంకారికులు వారి వారి గ్రంధాలలో అలంకారాలకి ఉదాహరణలుగా ఇచ్చారు.ఈ విషయం ముందే చెప్పాను. వాటిగురించి మరోసారి.
ఆఖరిగా, తెలుగులో మల్లావధానిగారి అనువాదాలు, ఇంగ్లీషులో షెల్లింగ్ [3] చేసిన అనువాదాలు బాగున్నాయి కదూ!
- Subhaashita RatnakOSa, Edited by D. D. Kosambi and V.V. Gokhale, Harvard Oriental Series, 42 (1957) with a brilliant introduction by D.D.Kosambi.
- AmaruShatakam, Edited by C.R.Devadhar, Motilal Banarsi Dass,(1959, reprinted 1984), with vemabhupala’s commentary in Sanskrit and the poems were paraphrased into a sort of archaic English.
- Erotic Love Poems from India, A Translation of The Amaru Shataka by Andrew Schelling, Shambhala Library (2004). This is claimed to be the first complete translation of Amaru Shataka into English.
- An Anthology of Sanskrit Court Poetry, Vidyakara’s Subhaashita RatnakOSa, translated by Daniel H.H.Ingalls, Harvard Oriental Series, 45, (1965). A mammoth collection of over 1700 pieces with copious notes.
- వైజయంతి, కావ్య కుసుమ సంపుటి, కవిశేఖర గరికపాటి మల్లావధాని, (1981)