గీతులు – అనుబంధం 5

16 ఆటవెలఁది భేదములు

1) ఆ-వె-ఆ-వె-
చందమామ రావె – జాబిల్లి రా రావె
చిన్ని పాపఁ జూడ – శీఘ్రముగను
చింద రావె వంద – యందచందాలను
వెన్నెలలను దెచ్చి – విందు నిడవె

2) ఆ-వె-వె-ఆ-
పాప బుగ్గఁ దాకు – బంగారు కిరణాల
చల్ల గాలి వీచి – మెల్ల పాడ
వేయి విరులు విరియు – వింతయైన
చందనమ్ము బోలు – సద్గంధములతోడ

3) వె-ఆ-వె-ఆ-
బోసి నవ్వు నవ్వె – బుజ్జి పాప
వాసి వేఱు లేక – వన్నెలకు సరిగ
పైడి గిన్నెలోని – వేడి వేడి
పాలు త్రాగె బాగ – బంగారు పసి పాప

4) వె-ఆ-ఆ-వె-
మఱువకుండ తేవె – మహికి నీవు
దూర తీరమందుఁ – దుల లేని వెల్గు యా
తార పంపు కిరణ – ధారల నీతోడ
పాప మురియుఁ గాంతి – చాపమందు

5) ఆ-ఆ-వె-వె-
స్వప్న జగతిలోనఁ – జల్లగా నిదురించు
రాత్రి వేళ పాప – రత్నాల పాన్పులో
భయము పెట్ట బోకు – పాప నిందు
యేడిపించ బోకు – నీడ జూపి

6) వె-వె-ఆ-ఆ-
లాలి లాలి యంచు – మేలుగాను
నేను బాడుచుందు – నిన్ను జూపి
భూమి చుట్టు తిరిగి – పులకల గలిగించు
వెన్నెలలకు ఱేఁడ – వన్నెల యుడురాయ

7) ఆ-ఆ-ఆ-వె-
ఆకసాన నుండు – యందాల తారకా
భూమిపైన నుండె – ముద్దుల మాపాప
రంగురంగులైన – శృంగార రశ్మితో
లీల నూఁగ జేయు – డోలలోన

8) ఆ-ఆ-వె-ఆ-
ముద్దులిచ్చు పాప – మురిపాల మూటగా
క్రొత్త యాటలాడుఁ – జిత్తమ్ము మఱపించి
నిత్య మిచ్చు సుఖ మ-గత్యముగను
వెలుగు గృహమునందు – వేయి దీపమ్ములై

9) ఆ-వె-ఆ-ఆ-
పసిడి రంగుతోడఁ – బల్లవించిన దీగ
ముక్కు పచ్చలైన – ముద్దు బిడ్డ
కన్నతల్లి మదిని – గరగించు పలుకుతోఁ
దండ్రి మీసములను – దాను లాగును మెల్ల

10) వె-ఆ-ఆ-ఆ-
మురళి నూదు వాని – ముద్దు చెల్లి
గజవదనుని దల్లి – కడగంటి చూపులో
పెరుగు చిట్టి పాప – చిరకాల మీ భూమి
మమ్ముల మురిపించు – చెమ్మలౌ మా కళ్ళు

11) వె-వె-వె-ఆ-
కృష్ణ మోహనా యొ-కించుకైన
దయను జూప రార – రయముగాను
వచ్చి చిన్ని పాప – ఫాలమందు
ముద్దు పెట్టు మేము – నిద్రలో నుండఁగా

12) వె-వె-ఆ-వె-
తెల్లనగు యుడుపుల – దివ్య మూర్తి
విద్యలకు నిరవగు – వేదవల్లి
యక్షరాల వ్రాయు – మమ్మ సరస్వతీ
పాప నాల్కపైన – బలు విధాల

13) వె-ఆ-వె-వె-
శశి సహోదరి యతి-శయముగాను
పాలకడలియందుఁ – బరిఢవిల్లిన తల్లి
సిరుల నిమ్ము రత్న – సరుల నిమ్ము
వరము లిమ్ము పాప – కరములందు

14) ఆ-వె-వె-వె-
నిదురబోయె జగతి – నిదురించె గగనమ్ము
గిరులు నిదురబోయెఁ – దరులతోడఁ
గనుల మూసి పాప – కలలఁ గనుచు
సంతసించి యీఁదు – స్వప్న సరసి

15) వె-వె-వె-వె-
ఏడువకుమ పాప – యేడువకుము
నిద్ర పొమ్ము భయము – నీవు మాని
ప్రక్కనుండుఁ దల్లి – పాలు నీయ
ప్రక్కనుండుఁ దండ్రి – పాట పాడ

16) ఆ-ఆ-ఆ-ఆ-
చిట్టి పాప కెపుడు – శ్రీరామ రక్ష నా
కంటి పాప కెపుడు – కన్నయ్య రక్ష యీ
చంటి పాప కెపుడు – జంట దైవము రక్ష
జడుసుకొనకు పాప – జగ మెల్ల నీ రక్ష

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...