Girls for Sale, kanyasulkam
A Play from Colonial India,
Gurajada Apparao
Indiana University Press (July 2007)
Paperback: 280 pages
List Price: $21.95
Translated from Telugu
By Velcheru Narayana Rao
గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకాన్ని ఇంగ్లీషు లోకి ‘ అనువదిస్తున్నా’ నని వెల్చేరు నారాయణ రావు గారి నుండి విన్న వాళ్ళల్లో నేను కూడా ఒకణ్ణి. అమ్మ బాబోయ్ అని గుండె బాదుకున్న వాళ్ళల్లో నేను కూడా ఒకణ్ణే! అందుకు ముఖ్య కారణం, కన్యాశుల్కం నాటకంలో వాడిన భాష. అప్పారావు గారు కన్యాశుల్కం లో 19 వ శతాబ్దం ఉత్తర భాగంలో విజయనగరం శివార్లలో వాడే మాండలికం వాడారు. దానికి తోడు నాటకంలో ప్రతి పాత్ర తను మాట్లాడే మాటల్లో తన కులం, ఆర్థిక స్థితి, చదువు సంధ్యలు, లింగబేధం స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. అటువంటి నాటకాన్ని ఇంగ్లీషులోకి తేవడం సాహసమయిన పనే అనిపించింది. నిజానికి ఈ పని చాలా అవసరమైనదని కూడా అనిపించింది. ఈ పనికి తగిన వాడు నారాయణరావు గారే అనే నిబ్బరం కూడా కలిగింది. ఎందుకంటే, ఇదివరలో ఆయన చాలా తెలుగు పుస్తకాలు ఇంగ్లీషులోకి అనువదించిన విషయం అందరికీ తెలుసు.
అనువాదాలమీద, అనువాద సమస్యల మీద యిప్పటికే చాలా వ్యాసాలు విమర్శలూ మన పత్రికలలో వచ్చాయి. వాటి గురించి ముచ్చటించటం ప్రస్తుతం అనవసరం. ప్రాచ్య భాషలనుంచి పాశ్చాత్య భాషల్లోకి వచ్చే అనువాదాలు ముఖ్యంగా ఎవరిని ఉద్దేశించి చేసినవో బోధపడితే అనవసర వాదప్రతివాదాలకి తావులేదని నా నమ్మకం.
నాకు తెలుసు కుందామన్న అభిలాషతో, (క్యూరియాసిటీ అనండి) నాకు తెలిసిన తెలుగు మాండలికాలకి, వ్యావహారిక భాషలో ఉన్న జాతీయాలకీ నారాయణరావుగారు చేసిన ‘అనువాదాలు’ ఇంగ్లీషు వాడుక భాషకి, ఎంత దగ్గిరగా ఉన్నాయో చూశాను. అయితే, నాటకం మొత్తం అంతా ఈ సమసామ్యత కోసం వెదక లేదు. స్థాలీపులాకన్యాయంగా మూల నాటకంలో గిరీశం చేసిన స్వగతాలు, మధురవాణి దెప్పి పొడుపులు, అగ్నిహోత్రావధాన్లు కోపంగా అన్న మాటలూ, లుభ్ధావధాన్లు పెట్టిన తిట్టు, వాళ్ళభాష, వాడుకలో ఉన్న ఇంగ్లీషులోకి చక్కగా సమాంతరంగా అనువదించ బడ్డాయి. అల్లాగే, ‘ఖగపతి అమృతము తేగా…’ అన్న పద్యం ఇంగ్లీషులోకి భేషుగ్గా అనువదించ బడింది. అల్లాగే, 5 వ అంకం, 6 వ రంగం ఆఖర్న శిష్యుడి పాట కూడా చక్కగా వచ్చింది. అయితే, ఇటువంటి అనువాద పరీక్షలు పెట్టడానికి నేను సరైనవాడిని కానని నాకు తెలుసు. కారణం : మూలంలో తెలుగు నుడికారానికి, తెలుగుమాట్లాడేచోటుకీ, నేను దగ్గిరగా ఉండబట్టి; — ఎంత వద్దనుకున్నా భాషాగత పక్షపాతం (bias) పోదు కాబట్టి. కాగా, వాడుక భాషగా ఇంగ్లీషులో నాకు ప్రవేశం లేదు. పైగా, అనువాదాలని విమర్శించగల ప్రత్యేక నేర్పరితనం లేకపోవడం మరొక ముఖ్య కారణం.
ఇక్కడ పుట్టిపెరుగుతూ తెలుగు గురించి వినడమేకాని తెలుగులో ప్రత్యేక ప్రవేశం లేని ‘ తెలుగు -అమెరికన్ ‘ యువతీయువకులు — (వాళ్ళ మాతృభాష ఇంగ్లీషు కాబట్టి!) చదివి, ఈ ‘ఇంగ్లీషు’ నాటకం ఇంగ్లీషు నాటకంలా ఉన్నదో లేదో చెప్పవలసిన అవసరం ఉంది. అందుకని, ఈ పుస్తకం కొని మీపిల్లలచేత చదివించండి. ఒక విషయం మాత్రం నిజం. నాకు మాత్రం ఎక్కడా నట్టు పడకండా ఇంగ్లీషు కన్యాశుల్కం చదవడానికి సాఫీగా నడిచిందని ధీమాగా చెప్పగలను.
కన్యాశుల్కం గురించి మళ్ళీ ఇప్పుడు రాయవలసిన అవసరం ఏమిటి అన్నది అసలు ప్రశ్న. ఏడు దశాబ్దాలుగా, ముఖ్యంగా గత ఐదు దశాబ్దాలలో కన్యాశుల్కం నాటకం పై కొన్ని వందల వ్యాసాలు, విమర్శలు, ప్రతివిమర్శలూ, వివాదాలూ, ఉత్తరాలూ వచ్చాయి. ఈ వ్యాసాలు నాటక కర్తృత్వంతో మొదలుపెట్టి, నాటకంలో ప్రతిపాత్రపైన, అప్పారావుగారి అంకిత వాక్యాలపైన, పీఠికలపైన, పాత్రల ఔచిత్యంపైన, వాటి ఆవశ్యకతపైన, నాటక లక్షణాలపైన, లక్ష్యాలపైన, వస్తువు పైన, వస్త్త్వైక్యత పైన, నిర్వహణపైన, సాంఘిక సంస్కరణలపైనా …. అటూ ఇటూ … ఎన్నో ఎన్నెన్నో…. . కన్యాశుల్కం నాటకం కొందరికి బ్రహ్మపదార్థం; మరి కొందరికి ప్లేడౌ (play dough!) ఒక్కొక్క విమర్శకుడికి ఒక్కొక్క రకంగా కనిపించింది, వినిపించింది. మరి కొందరు విమర్శకులకి వాళ్ళకి నచ్చిన పాక్షిక పద్ధతిలో మలచుకో బడ్డది! పైగా ఈ నాటకం కొన్ని వందలసార్లు తెలుగుదేశంలో ప్రదర్శించ బడింది. అయితే, మూలంలో నాటకాన్ని కుదించి కత్తిరించి అప్పుడప్పుడు భాషని ‘సంస్కరించి’ ఈప్రదర్శనలన్నీ చేశారని గుర్తుంచుకోవాలి. మూలంలో నాటకం ఏడు అంకాలు, ముప్ఫైరెండు రంగాల నిడివి గలది. అందుకనే కాబోలు, ప్రదర్శనా సౌలభ్యం పేరుతో కుదించారు, కత్తిరించారు, సవరించారు, ప్రయోక్తలందరూ!
నారాయణరావు గారి అనువాదం కన్యాశుల్కం నాటకాన్ని మళ్ళీ చదివించింది. అనువాదమే కాదు; ఆయన రాసిన వెనుక మాట (The Play in Context) నూతన ప్రేరణనిచ్చి, తిరిగి ఆలోచించవలసిన అవసరం కల్పించింది. వెనుక మాటలో నారాయణరావుగారు ఒక సరికొత్త ప్రతిపాదన చేసారు. ఒక రకంగా ఇది విప్లవాత్మకమైన ప్రతిపాదన. తన ప్రతిపాదనని సోపపత్తికంగా సమర్థించారు.
నారాయణరావు గారి ప్రతిపాదనకిం పూర్వ రంగం ఇది :
కన్యాశుల్కం నాటకం పై ఇంతకు పూర్వం విమర్శకులందరూ అప్పారావు గారు ఈ నాటకం రాయడానికి ప్రేరణ, కారణం, సంఘసంస్కరణే అని ప్రతిపాదించారు. నాటి సమాజంలో ముఖ్యంగా మూడు దురాచారాలని ఎత్తిచూపి వాటి నివృత్తి కి ఈ నాటకం మార్గదర్శి అని విమర్శకులందరూ పదే పదే నొక్కి వక్కాణించారు. ఈ మూడు దురాచారాలూ వరుసగా, — కన్యాశుల్కం, అంటే ఆడపిల్లలని అమ్మడం కొను క్కోవడం; వితంతు వివాహం; వేశ్యా సమస్య. గత 50 సంవత్సరాలుగా వచ్చిన వ్యాస పరంపర, ఈ మూడింటినీ పూర్తిగానో, అర్థోక్తిలోనో, సమర్థించినవే. (చాలా కొద్ది విమర్శలు ఇందుకు వ్యతిరేకత చూపించాయి కానీ వాటిని ఎవరూ ఖాతరు చేసినట్టు లేదు!)
నారాయణరావుగారు చేసిన ప్రతిపాదన సారాంశం ఇది : ఈ విమర్శకులలో ఏ ఒక్కరూ కన్యాశుల్కం నాటకాన్ని, రచనా వ్యూహాన్ని, సరిగా అర్థం చేసుకోలేదని, బ్రిటీషు వలసరాజ్యం అప్పటి సంఘంమీద తెచ్చిన వత్తిడి వారికి పూర్తిగా బోధ పడలేదనీ ఉదహరిస్తూ అప్పారావుగారిలోని నవ్యతనీ, ఆయనదయిన ‘ఆధునికతనీ ‘ సోదాహరణంగా వివరించారు.
ఈ వ్యాసంలో నేను గత ఐదు దశాబ్దాలుగా కన్యాశుల్కం నాటకం పై విమర్శకుల అవగాహన సారాంశంగా వారి మాటల్లోనే ఉదహరిస్తూ, ఈ వ్యాస ధోరణికి అడ్డు పడకండా అనుబంధంలో ఇస్తాను. నా వ్యాసంలో నారాయణరావుగారు చేసిన ప్రతిపాదనపై కేంద్రీకరిస్తాను. ఈ నాటకాన్ని కొన్ని వందలసార్లు కత్తిరించి ‘ప్రదర్శించడం’ వలన తెలుగు ప్రజలలో పాతుకొపోయిన కొన్ని అపోహలు, అపార్థాలూ ఉటంకిస్తాను.