(పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీవారు 2001లో పునర్ముద్రించిన 1928 సంవత్సరపు వ్యాఖ్యాయుత చంద్రికాపరిణయమునకు డా. శ్రీరంగాచార్యులు వ్రాసిన పీఠిక)
‘శ్రీవాసజ్జటప్రోలీ
భావుకపత్తనవిహార◊పటుశీలునకున్
గోవర్ధనగోవర్ధన
గోవర్ధనవృష్టిహృతికి ◊గోపాలునకున్’ 1
భారతదేశ స్వాతంత్ర్యలబ్ధికి పూర్వమున ఏర్పాటై, క్రీ.శ.1949 వరకు అనగా భారతదేశపారతంత్ర్యవిముక్తివరకు వర్ధిల్లిన సంస్థా నములయందు ఆంధ్రప్రాంతమునకు చెందినవి పాశ్చాత్యుల పరిపాలనకు లోబడి, తెలంగాణములోనివి నిజాం పరిపాలనకు లోబడి యున్నవి. ఈవిధమైన సంస్థానములలో కొన్ని పెద్దవి – మరికొన్ని చిన్నవి గలవు. ఐనను ఆయా సంస్థానాధిపతులు యథాశక్తి సాహిత్యపోషణము నొనర్చి, దేవాలయప్రతిష్ఠాదులు గావించి, సప్తసంతానప్రతిష్ఠానులైనవారు కలరు. వీరియందు రాజకవు లున్నారు. వారు ప్రౌఢప్రబంధకర్తలుగా ప్రసిద్ధులు. ప్రజోపయోగార్థమై ఆనాడు వీరొనర్చిన పనులు – సాహితీక్షేత్రము నకు జరిపిన ‘అక్షరపూజ’ ఎప్పటికిని మరువరానివి.
ఆనాడు తెలంగాణమున ఏర్పడిన సంస్థానములు నేటి మహబూబ్‌నగరం జిల్లాయందే అధికముగా నుండి, ఈజిల్లాకు సంస్థానముల జిల్లా యను ఖ్యాతిని కల్గించినవి. అట్టి సంస్థానములలో – గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, గోపాలపేట, జటప్రోలు, అలంపురం అనునవి ప్రసిద్ధములు. వీని పరిపాలకులు సహృదయులు, వదాన్యులు, రసికతాచక్రవర్తు లైనందున భారత, భాగ వత, రామాయణానువాదములే గాక వానికి వ్యాఖ్యలు, కావ్యనాటకములు, ఛందోలంకారశాస్త్రములు, సంస్కృతాంధ్రసాహితీ సంబంధ వివిధరీతుల రచనలు ప్రకాశమానము లైనవి. నాడు ఈసంస్థానములయందు జరిగిన కవిపండితసన్మానములు, ప్రౌఢ పండితవర్యుల శాస్త్రచర్చలు, జగదాశ్చర్యావధానకవితాసంపత్తు లైన తిరుపతి వేంకటేశ్వరుల అష్టశతావధానములు, నానా దేశాగత కవిపండితమండలి కొసంగిన ఆదరణ, జరిపిన సత్కారములు – ఈ సంస్థానాధిపతుల చిరయశస్సునకు ప్రతీకలు.
తమ రాజభవనసభాస్థలికి కవులు పండితులు విచ్చేయు మార్గమున తెల్లనివస్త్రమును పరచి, వారందరు లోపలికి వెళ్ళిన తరువాత ఆ వస్త్రమును తీసి అందలి పాదధూళిని ఒకదగ్గరగా చేర్చి, అనునిత్యము రాజులు, రాణులు ధరించు కుంకుమ బర ణిలో ఆపాదధూళిని మిశ్రిత మొనర్చి తిలకధారణము చేసికొనుచు తమ జన్మ ధన్యమైనదని భావించిన సంస్థానాధిపతుల వినయవిధేయతలేగాక, కవిపండితులయందు వారెంత బద్ధాదరులై గౌరవించినారో తెలిసికొనుటకు ఈ సన్నివేశమే ప్రబలోదా హరణము.
జటప్రోలు పద్మనాయకులు
జటప్రోలు ఇట్టి సంస్థానములలో నొకటిగా నున్నది. దీని పరిపాలకులు సురభిగృహనామధేయులైన పద్మనాయకులు. సంస్థానము వర్ధిల్లిన కాలము 20-9-1949 వరకు. మహబూబునగరం జిల్లాలోని సంస్థానములయందు కాలానుపూర్విగా మొట్టమొదటిది గద్వాలసంస్థానము, రెండవది ఆత్మకూరు, మూడవది జటప్రోలు. వీని తర్వాతనే వనపర్తి, అలంపురం, గోపాలుపేట సంస్థానము లేర్పడినవి. ఒక్క జటప్రోలు మాత్రమే పద్మనాయకుల ఏలుబడిలోనిది. మిగిలిన వన్నియు రెడ్లు అధిపతులుగా నున్నట్టివి.
జటప్రోలు సంస్థానము మధ్యయుగమునుండి సంస్థానముల విలినీకరణ జరుగువరకు (20-9-1949) పద్మనాయకులు పరిపాలకులుగా వర్ధిల్లినది. వీరు కాకతీయులకు, తరువాత గోలకొండ సుల్తానులకు సామంతులైన చిన్న రాజులు. జటప్రోలు వారిలో పదితరములు వంశానుగతప్రభువులు, ఐదుతరములు దత్తప్రభువులున్నారు.
ఆనాడు జటప్రోలు సంస్థానము 357 చదరపుమైళ్ళ విస్తీర్ణము కలది. దీనియందు ఒకవంద ఆరు గ్రామము లున్నవి. సంస్థాన ఆదాయం సాలీనా రెండులక్షలు. కృష్ణానదీతీరభూమియందు జటప్రోలు కోట – దాని సమీపముననే వీరి ఆరాధ్యదైవ మైన మదనగోపాలస్వామి ఆలయము వీరిచే నిర్మింపబడినది. సురభి లక్ష్మారావు పరిపాలనాకాలమున, అనగా 1840 క్రీ.శ.లో రాజ ధాని జటప్రోలునుండి కొల్లాపురమునకు మారినది. అప్పటినుండి వీరు కొల్లాపురప్రభువు లైనారు. రాష్ట్రరాజధాని యైన హైద రాబాదు నగరమునకు 160 కి.మీ. దూరమున కొల్లాపురము కలదు.
పద్మనాయకవంశజు లైన జటప్రోలు సంస్థానమువారు దేవరకొండ, రాచకొండ రాజ్యములు పరిపాలించిన రాజవంశము నకు చెందినవారు. వీరియందరికీ మూలమైన గ్రామము నేటి కర్నూలుజిల్లాలోని ‘వెలుగోడు’. వెలుగోటి సర్వజ్ఞసింగభూపా లుడు ప్రసిద్ధుడు. ఇతనిని గూర్చి చంద్రికాపరిణయకృత్యాదియందు వివరముగా నున్నది.
పద్మనాయకు లందరును రేచర్లగోత్రులు (‘రేచడు’ అనువానికి సంబంధించిన కథవలన వీర కీగోత్రనామ మేర్పడినట్లు గలదు). వీరి మూలపురుషుడు బేతాళనాయకునిగా ప్రసిద్ధుడైన చెవ్విరెడ్డి. ఇతడు కాకతి గణపతిదేవుని సేనానిగా ప్రచండభుజ బలవిక్రమాదులచే కాకతిసామ్రాజ్యమునకు ఎనలేని సేవలు చేసినవాడు. ఈయన పౌరుషగాథల గూర్చి కొన్ని కథలు గలవు.
పద్మనాయకుల గోత్రములవారు (76 గోత్రములు) ఇతనిని మూలపురుషునిగా భావింతురు. వేంకటగొరి, బొబ్బిలి, పిఠా పురం, జటప్రోలు, మైలవరము మొదలగు సంస్థానముల వెలమలు బేతాళనాయకుని పేర శరన్నవరాత్రముల సందర్భమందు బలిపూజాదికములు నిర్వర్తింతురు. వీరి గోత్రనామమైన ‘రేచర్ల’ నల్లగొండ జిల్లాలోని ఒక గ్రామము. ఇది బేతాళనాయని జన్మ గ్రామమని ప్రసిద్ధి గాంచినది. రేచర్ల బ్రహ్మనాయడు బేతాళనాయని మనుమడు. రాచకొండ, దేవరకొండ గ్రామములు బేతాళ నాయని రాజధానులు. ఇతని వంశములోనే పదవతరమువాడు ‘సర్వజ్ఞ’బిరుదాభిరాముడైన సింగభూపాలుడు. పద్మనాయ కుల బిరుదములయందు, శాసనములయందు పేర్కొనబడిన ఆమనగల్లు, పిల్లలమఱ్ఱి అను గ్రామములు నల్లగొండ జిల్లాలోనివి. బేతాళనాయనికి – ఈ రెండుగ్రామములకు విడదీయరాని సంబంధము గలదు.
కాకతి గణపతిదేవుడు, రుద్రమదేవి – వీరి పరిపాలనాకాలమున ప్రసిద్ధిలోనికి వచ్చిన పద్మనాయకులలో ప్రసాదిత్యనా యడు, సింగమనీడు, అనపోతానాయకుడు, మాదానేడు, పెదవేదగిరి, సర్వజ్ఞ సింగభూపాలుడు, లింగమనేడు అనువారు కలరు. అనపోతానీడు పద్మనాయకరాజ్యవిస్తృతికి ముఖ్యమైన వ్యక్తి. సురభివంశ పద్మనాయకులకు మూలపురుషుడైన సింగభూపాలుని పరంపరలో జన్మించిన పెద్దమహీపతికి ఐదవతరమున వచ్చిన రాజు- చంద్రికాపరిణయకర్త యైన మాధవ రాయలు. ఈయన అళియ రామరాయలనుండి జటప్రోలు సంస్థానమును కానుకగా పొందినాడు. తరువాత ఇతని కుమారులు క్రీ.శ. 1650 లో అబ్దుల్లా కుతుబ్షానుండి ‘సనదు’రూపముగా నీ సంస్థానమును పొందిరి.
మాధవరాయల తండ్రియైన మాదానాయకుడు (మల్లభూపాలునిగా ప్రసిద్ధుడు) జటప్రోలు మదనగోపాలదేవాలయ నిర్మాత. మాధవరాయల ప్రోత్సాహమున ‘బాలసరస్వతి’ యనుకవి భర్తృహరి సుభాషితముల నాంధ్రీకరించి సురభిమల్లభూ పాలస్మృత్యర్థము అంకిత మొసంగెను. అందలి ప్రతిపద్యమునకు అంత్యమకుటము ‘సురభిమల్లా’ యని కలదు.
మొదట నల్లగొండ, దేవరకొండ ప్రాంతములు పాలించిన మాదానాయడు అనంతరము జటప్రోలును రాజధానిగా చేసికొని బెక్కం, పెంట్లవల్లి, చిన్నమరూరు, వెలటూరు అను గ్రామములయందు కోటలను, ఆలయములను నిర్మాణము చేయించెను. వ్యవసాయనిమిత్తము తటాకములు త్రవ్వి ఖ్యాతుడాయెను.
మహాపరాక్రమవంతుడు, అశ్వరేవంతుడైన పెద్దనృపతిని మాధవరాయలు గొప్పగా వర్ణించినాడు (చంద్రికా…1-25-28). నేటి గోదల్ పట్టీలో గల పెద్దాపురమను గ్రామ మితని పేరనే వెలసినదని ప్రతీతి. 17వ తరమున ‘బింకోలుగండ’ బిరుదఖ్యాతుడైన రెండవమల్లభూపతి లేదా పెదమల్లానాయడు ఇమ్మడి మల్లునిగా ప్రసిద్ధుడు. 18వ తరములోని ముమ్మడి మల్లానాయనికి గలిగిన పుత్రత్రయమునందు తృతీయపుత్రుడు చంద్రికాపరిణయకర్త యైన మాధవరాయలు. ఈవంశమువారు మొదట శైవభక్తులుగా నుండి కాలక్రమమున వేదాంతదేశికులవారి ప్రభావముచే రాచకొండవారితోబాటు వీరును శ్రీవైష్ణవసంప్రదాయమును స్వీకరించి నారు. మల్లనృపతి, లింగభూపాలనామములు శైవపద్ధతికి జెందినవి. మాధవరాయలు మొదలైన పేర్లు శ్రీవైష్ణవసంబంధమైనవి. వీరు ఈరెండుమతములను సమానముగా ఆదరించి, ఆయా దేవతల ప్రతిష్ఠించి, దేవాలయములను కట్టించిన హరిహరభక్తులు.
మాధవరాయల యనంతరము ఈసంస్థానము హైదరాబాదు సంస్థాన ఆధిపత్యమునకు లోనైనది. ఐనను తరువాత వచ్చిన వారు పూర్వులవలెనే సంస్థానమును అనుభవింపవచ్చునని అబుల్‌హసన్ కుతుబ్షా ఒక ఫర్మానా జారీ చేసినాడు. ఈపద్ధతి తర్వాత వచ్చిన సంస్థానపాలకులకును వర్తించినది. వీరియందు 24వ తరమునకు చెందిన జగన్నాథరావునకు సంతానము లేనందున వరంగల్లు జిల్లాలోని గురిజాల గ్రామమున తమ సమీపబంధువులైన ‘రావు’వంశమువారినుండి పిల్లవానిని దత్తుగా పరిగ్రహించి ‘వెంకటలక్ష్మారావు’ అని ఆబాలునకు నామధేయ మిడినారు. లక్ష్మారావు కాలములోనే జటప్రోలుసంస్థానము పేష్కస్ ఏర్పాటుతో బిల్‌మఖ్తాగా (శాశ్వతకౌలు) సంపాదితమైనది. ఈయనకూడా నిస్సంతు కావున తన అభిజనస్థలమునుండి ఒకబాలుని తెచ్చుకొని ఆయనకు వెంకట జగన్నాథరాయనామధేయ మిడినారు. ఈయన గుఱ్ఱపుపందెములయందు ప్రఖ్యా తుడు. బెంగుళూరు, మదరాసునగరములయందు జరుగు అశ్వధావనక్రీడలలో నీయన పలుసార్లు విజయమందినాడు. కాంచీ నగర వరదరాజస్వామికి శాశ్వతముగా బిందెసేవ కైంకర్యమును ఏర్పాటు చేయించిన భక్తశిఖామణి. సింగపట్టణంలో తన పూర్వులు నిర్మాణ మొనర్చిన నృసింహాలయమును అభివృద్ధి పరచి, ఆస్వామిపేర ‘లక్ష్మీనృసింహవిలాస’మను చంపూ గ్రంథమును, జటప్రోలు ‘మదనగోపాలమాహాత్మ్యము’ను రచియింపజేసిన సహృదయుడు. ఈయనకు సైతము సంతానము లేనందున వెంకటగిరి ప్రభువులైన సర్వజ్ఞకుమారయాచమనాయని చతుర్థపుత్రులగు నవనీతకృష్ణయాచేంద్రుని దత్తపుత్రునిగా పరిగ్రహించి, తమతండ్రిగారి నామధేయముగా వెంకటలక్ష్మారావని పేరు పెట్టి 7-3-1879 తేదీనాడు తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధానమున దత్తస్వీకారోత్సవమును జరిపినారు (ఇది ఈశ్వర సం. ఫాల్గుణశుద్ధ తదియ గురువారమునాడు). ఈ స్వీకారమునాటికి వెంకటలక్ష్మారావుగారి వయస్సు 14 సంవత్సరములు. వీరు 6-3-1884 సం. నైజాంప్రభువు ఫర్మానాతో కొల్లాపురం (జటప్రోలు) ప్రభువులై ప్రజాపాలనము జరుపుచు, ధర్మకార్యనిర్వహణబద్ధులై కవిపండితపరిపోషకులై సుమారు 32 సంవత్సరములు పరిపాలించి ఎన్నియో సద్గ్రంథముల ప్రచురణ చేయించిరి. అన్నిటిని మించి వీరి చిరయశస్సునకు మూల కారణము – మాధవరాయభూపాలప్రణీతచంద్రికాపరిణయమును ‘శరదాగమ’వ్యాఖ్యతో ముద్రణము చేయించి తమ పితౄ ణమును తీర్చుకొని 15-4-1928 తేదీన యశఃకాయు లైనారు.
వీరికిద్దరు కూతుర్లుమాత్రమే యుండిరి. వంశోద్ధరణకై బొబ్బిలిసంస్థానాధీశులు – తమ యగ్రజులైన రాజా శ్వేతాచలపతి వెంకటరంగారావుగారి పౌత్రులైన రాజా రాజగోపాలరావుగారిని దత్తపుత్రునిగా పరిగ్రహించి, తండ్రిగారిపేరైన రాజా వెంకట జగ న్నాథరావు అని పేరు పెట్టిరి. కాని వీరి పట్టాభిషేకమును పరిణయమును కావింపక పూర్వమే వీరు పరలోకగతు లైనందున ఈ శుభకార్యము లన్నియు వీరి ధర్మపత్ని వెంకటరత్నమాంబగారి ద్వారా నిర్వహింపబడినవి. వెంకటలక్ష్మారావుగారి ద్వితీయ పుత్రికయైన సరస్వతీదేవిగారి కూతురు ఇందిరాదేవిని వెంకటజగన్నాథరాయ బహదూర్‌నకిచ్చి వివాహము జరిపించినారు. జగన్నాథరావుగారు మాతృశ్రీ అదుపాజ్ఞలకు లోబడి రాజ్యాధికార మొనర్చుచు సంస్థానములు భారతదేశ మున విలీనమగు వరకు (1949) పరిపాలించినారు. రాజ్యభారవిముక్తులైన యనంతరము కూడా వీరు వంశానుగతధర్మమైన ధర్మకార్యనిర్వహ ణము, కవి-పండిత-విద్వద్గాయకపోషణ మొనర్చుచు క్రీ.శ.1980 సం.న స్వర్గలోకవాసు లైనారు. రాజావారికి గల ఏకైకపుత్రులు వెంకటకుమారకృష్ణబాలాదిత్యలక్ష్మారావుగారు. కుమార్తె వెంకటరత్నసుధాబాల యనువారు గలరు. వీరిది 29వ తరము. వెంకట ఆదిత్యలక్ష్మారావుగారి కుమారుడు వెంకట అనిరుద్ధ జగన్నాథరావు. వీరు ప్రస్తుతము సికిందరాబాదులో నివాసముగా నున్నారు. మధ్యమధ్య కొల్లాపురమునకు విచ్చేయుచుందురు (చూ. వంశవృక్షము).
జటప్రోలు రాజపరంపరలో నున్న వెంకటలక్ష్మారావు బహద్దరు ఆఖేటఖేలనమున అమితాసక్తి కలవాడు. తన జీవితకాల మున 31 పులులను వేటాడినాడు. ఒకేవేటలో అయిదుపులులను వేటాడి వేటలో బందీయైన జంతువులను తన రాజప్రాసాదమున బంధించిన ధీరుడు. ఈయన వేటను వంశపారంపర్యము గావించి తన 14సంవత్సరముల కూతురునకు కూడా వేటాడుట నేర్పించిన ఆఖేటవిద్యావైభవుడు. ఇతనికి వేటపై గల అభిలాషకు ప్రతీక వీరి ‘రాజముద్రిక’( Emblem ). దీనియందు రెండు తుపాకుల మధ్యన పులిముఖము చిత్రితమైనది. ‘సత్యమేవ జయతే’ అను అర్థ మొసగు ( Truth Is Victory ) అను వాక్యము ఈముద్రికలో పొందుపరచిరి. ఐదుపులులను పట్టుకొని దిగిన వీరి ఫోటో కొల్లాపురం కోటలో గలదు.
సంస్థానమునకు చెందిన చివరి నాల్గుతరములవారు లండన్ వంటి పాశ్చాత్యనగరములలో విద్యాభ్యాస మొనర్చుటవలన వీరిపై పాశ్చాత్యసంస్కృతీప్రభావ మధికమైనది. అందుకే వీరి పూర్వులకు లేని రాజముద్రికను వీరు సిద్ధము చేయించినారు. సంస్థానమున వీరి హయాములో నిర్మితమైన భవనములుకూడా బ్రిటిష్ వారి భవననిర్మాణములను పోలియున్నవి. ఇవన్నియు ఈనాటికీ దర్శనీయములు.
కొల్లాపురసంస్థానము రద్దయిన తరువాత – సంస్థానకాలమున వివిధకార్యాలయముల కుపయోగించిన భవనములను, వీరి విమానాశ్రయము – దాని భవనములను ఆంధ్రరాష్ట్రప్రభుత్వమువారికి విరాళముగా నొసంగిన ఏతద్వంశీయుల ఔదార్యము కొనియాడదగినది. నేడు కొల్లాపురమునగల ప్రభుత్వ జూనియర్ కళాశాలభవనములు వీరివే. రాణి ఇందిరాదేవిగారి నామధే యము ఆకళాశాల కుంచినారు. కొల్లాపురమున గల ముఖ్యరాజభవనము మాత్రము వీరి అనుభవములో గలదు.
వీరి పూర్వరాజధానియైన జటప్రోలులోని కోట శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగినది. వీరు నిర్మాణ మొనరించిన తమ యిష్టదైవ సన్నిధి యగు మదనగోపాలస్వామి దేవాలయమును తీసి యథాపూర్వముగా ఎత్తైన ప్రదేశమున నిర్మాణ మొనర్చిన రాష్ట్ర పురావస్తుశాఖవారి నైపుణ్యము ప్రతిశిలయందు ప్రతిబింబించుచున్నది. దేవాలయముతోబాటు జటప్రోలుగ్రామముకూడా దీని పరిసరములలోనే నిర్మితమైనది. ఇవియేగాక తరలించి తెచ్చి కొల్లాపురమునందు పునర్నిర్మాణ మొనర్చిన కుంతీమాధవ స్వామివారి దేవళము కూడా దర్శింపతగినది.
కొల్లాపురప్రభువులు కట్టించిన అనేకదేవాలయములు, వేయించిన తటాకములు నేటికీ భక్తిభుక్తులకు ఆకరములుగా నున్నవి. పూర్వమునుండి రాణీరత్నమాంబవరకు కొనసాగిన అనేకప్రజోపయోగకార్యములు శాశ్వతమై ఈనాటికిని కొల్లా పురప్రజల అనుభవములో నుండుట విశేషము.
రాజులు కాలగర్భమున లీనమైనారు. వారొనర్చిన ధర్మకార్యములతోబాటు అక్షరస్వరూపిణియైన సాహితీదేవి వీరి చిర యశస్సును ‘అక్షర’ మొనర్చినది. ఆపరంపరలోనిదే చంద్రికాపరిణయము. ఈగ్రంథవిశేషములు ముందు వివరింపబడును.
గృహనామము
వెలుగోడు, రాచకొండ, దేవరకొండ పరిపాలకులైన పద్మనాయకులు తమ గృహనామ మిదియని ప్రత్యేకముగా తెల్పు కొనలేదు. వీరిని ఆయా గ్రామనామములతో మాత్రమే వ్యవహరించుచున్నాము. కాని వీరినుండి వెలువడి జటప్రోలు రాజ్యము నకు పాలకులైనవారి గృహనామము మాత్రము ‘సురభి’ యని గ్రంథస్థమై వ్యాప్తి చెందినది. చంద్రికాపరిణయమునందు
‘అర్థి సాత్కృత సురభి, పరాళి సురభి,
సుగుణవల్లీ ప్రకాండైక సురభి, కీర్తి
జిత సురభి, శౌర్యసురభి నా సింగనృపతి
పరగఁ దద్వంశమును గాంచె సురభిసంజ్ఞ’ (1-23)
ఇది సర్వజ్ఞ సింగభూపతివర్ణనలోని పద్యము. దీనికి పూర్వాపరములందు ఎచ్చటను ‘సురభి’ప్రసక్తి లేదు. సింగభూపాల కృతులలోను, ఇతరత్ర గల ఈప్రభుప్రసక్తిలోను ‘సురభి’ లేదు. వ్యాఖ్యాపండితులు ‘సురభి’శబ్దమునకు సువర్ణము, సంపెంగ, వసంతుడు, కామధేనువు, పరిమళము అను నర్థముల తెల్పినారు. పైపద్యమునందలి ‘సురభి’పదములకు వరుసగా నీయర్థము లీయబడినవి. ఈపదమును ‘సురభీ’ యని దీర్ఘాంతముగా చేసి ‘దేవతలకు భీతి గొల్పువాడు’ అని, ఇదియే హ్రస్వాంతమున ‘సురభి’ యైనదని వెల్లాలవారు తెల్పిరి.
ఇంతకు ‘సురభి’ అను గృహనామము వీరి కెట్లు గల్గెనో తెల్పినవారు భిన్నరీతులుగా వివరించినారు. నాగరకర్నూలు తాలూకాలో కారువంగ, తాళ్ళపల్లి అను గ్రామముల నడుమ గల ‘గోదలు’గ్రామమే ఒకప్పటి సురభిగ్రామ మనియు, కాలాంతర మున నాగ్రామము హరించుకపోగా అచట నేర్పడినవీ కారువంగ, పులిజాల, తాళ్ళపల్లి, రఘుపతిపేట యను గ్రామములు – ఈప్రాంతమునకు గోదలుపరగణా యని ప్రసిద్ధి. జటప్రోలువారు మొదట సురభిలో నివసించుటవలన అదియే వారి గృహనామ మైనదని ప్రచారము గలదు. గ్రామనామములు గృహనామములుగా నుండుట సాధారణవిషయమే యైనను, జటప్రోలువారు గాని వారి పూర్వులుగాని సురభిగ్రామవాసు లైనట్లు ఎచ్చటను తెల్పుకొనలేదు. అటు వెలుగోడు, ఇటు దేవరకొండరాచకొండలతోనే వీరి యనుబంధబాంధవ్యము లున్నవి. సింగభూపాలుడు భేతాళనాయకుని వరుసలో దగ్గరివాడు. విద్యాబలపరాక్రమ ములచేత ప్రఖ్యాతుడు. ఇట్టివానిచే తమవంశము ప్రఖ్యాతమై యున్న కారణమున అతనిని యాచకవిషయమున సురభిగా తెల్పి, ఇదే పదమును వివిధార్థములలో ఆయనకు సమన్వయపరచిన చంద్రికాపరిణయకారుని శబ్దచమత్కృతి ప్రశంసింప దగినదే కాని, ‘సురభి’గ్రామము వీరి పూర్వనివాస మని ‘భావన’ మాత్రమే! దీనికి ఆధారము లేదు. సింగభూపాలవిషయకమైన ‘సురభి’ వీరికి సంతృప్తి కలిగించినది. యుద్ధమున జటప్రోలువారు ‘సురభీ’కర పరాక్రములుగా సింగభూపతిని పోలినవారు కావున ఎవ్వరును గ్రహింపని గృహనామమును వీరు ‘సురభి’గా నిర్ధారించుకొన్నట్లు భావింప వీలుగలదు. మొదటినుండి ఇదియే వీరి గృహనామ మైనచో పద్మనాయకరాజప్రశంసలోను, వారి గ్రంథములయందును, సమకాలీనకృతులయందును ‘సురభి’ప్రసక్తి వచ్చెడిది.
దగ్ధగ్రామమైన (?) ‘సురభి’ని వీరి కంటగట్టి అదియే వీరి పూర్వనివాసగ్రామమని, దానివలన వీరు సురభివారైనారని నిర్ధారిం చుట సంశయమున కాస్కారమే. అందువలన సింగభూపాలుని గూర్చిన వర్ణనలోని ఈపదము (నానార్థములుగా) వీరికి రుచించి దీనిని గృహనామముగా స్థిరపరచుకొనినా రనుకొనుటయే సమంజసముగా నుండును.
సురభిగృహనామముగల వైదికులు, నియోగులు కూడా తెలంగాణమున గలరు. వీరు ‘సురభీ’కరులు కాదు గదా! సురభివారి నాటకసమాజము గలదు. అందువలన ‘సురభి’గృహనామమును గూర్చి మఱింత పరిశోధన అవసరము.
మాధవరాయల కాలము
జటప్రోలు పద్మనాయకరాజపరంపరలో 18వ తరమునకు చెందిన ముమ్మడి మల్లభూపతికి చెన్నాంబ, తిరుమలాంబ, మల్లాంబ, అనంతాంబిక యను నల్వురు భార్యలు. వీరియందు చెన్నాంబకు వరుసగా రామరాజు, మల్లనృపతి, మాధవ రాయలు జన్మించినారు. మల్లాంబ యను నామెకు కృష్ణభూపాలుడు, మేదినీరావు అను నిరువురు పుత్రులు గలిగిరి. వయ స్సులో తన కగ్రజులైన కృష్ణభూపాల మేదినీరావులు రాజ్యపాలన మొనర్చుచుండగా నీయన ఎలకూచి బాలసరస్వతివంటి మహోపాధ్యాయుల సాహచర్యమున సాహిత్యాధ్యయన, కవితారచనల నొనర్చినవాడు.
సురభివారి వంశక్రమమును పరిశీలించి, మాధవరాయలకాలమును చరిత్రపరిశోధకులు, సాహిత్యచరిత్రకారులు కొద్ది భేద ముగా నిర్ణయ మొనర్చినారు. ‘చంద్రికాపరిణయము – సమగ్రపరిశీలనము’ అను సిద్ధాంతవ్యాసమున తత్కర్త మాధవరాయల కాలనిర్ణయవిషయమున పెద్దలు తెల్పిన వానిని గ్రహించి పరిశీలించి, పూర్వాపరపరిశోధన మొనర్చి చంద్రికాపరిణయకర్త కాలము క్రీ.శ. 1620-1700, ప్రబంధరచనాకాలము క్రీ.శ. 1625-1656 మధ్యకాలము అనగా చంద్రికాపరిణయము క్రీ.శ. 1646లో రచితమైనట్లు నిర్ధారించెను. ఇది చర్చాపటువుగా యుక్తియుక్తముగా నొనర్చిన కాల-కావ్యరచనల కాలము. దీనికన్న మఱింత మంచి యుపపత్తులు లభించువరకు ఈనిర్ణయమే సమంజసమైనది.
సంస్థానసాహితి
మహబూబునగరం జిల్లాలోని సంస్థానాధిపతు లొనర్చిన సాహిత్యసేవ అమూల్యమైనది. వీరు కేవలము రాజకీయకార్య కలాపములకే పరిమితులు గాక సాహితీగోష్ఠులయందు పాల్గొనినారు, దీనికి తోడు వీరిలోను కవులు,పండితులు గలరు. జట ప్రోలు ప్రభువులు ఈజిల్లాలోని ఇతరసంస్థానములవలెనే గాక ఆంధ్రప్రాంతమందలి పద్మనాయకసంస్థానములగు వెలుగోడు, రాచకొండ సంస్థానములను ఆదర్శముగా గ్రహించి సాహితీసమారాధన మొనర్చినవారు. వేదవేదాంగవేత్తలు, షట్‌శాస్త్రవాదనా నిపుణులు, ద్వ్యర్థి, చిత్రకవితారచనాధురీణులు – మఱి యింకెందరో కవులు,పండితులు వీరి సంస్థానమున తమ ప్రతిభను వ్యక్త పరచగలరు. ఈరాజన్యుల సమకాలమందు పరిసరాలలో వెల్వడిన సాహిత్యము వీరి సాహితీపోషణకు గ్రంథరచనకు ప్రోత్సా హకారిగా నుండినది. జటప్రోలువారు ధర్మకార్యములను, సాహితీసమారాధనమును చేసిన చిరయశస్కులు.
వెంకటలక్ష్మారాయప్రభువు వనపర్తివాసులైన హొసదుర్గం కృష్ణమాచార్యులవారిచే సింగపట్టణంస్వామివారినిగూర్చి ‘లక్ష్మీ నృసింహవిలాస’ చంపూకావ్యమును, జటప్రోలుస్వామివారి విషయమై ‘మదనగోపాలమాహాత్మ్యము’ను రచింపజేసిరి. ఇవి సంస్కృతకృతులు.
సురభివారి పూర్వుడైన మల్లభూపాల నామాంకితముగా మహామహోపాధ్యాయ ఎలకూచి బాలసరస్వతి చెప్పిన భర్తృహరి అనువాదకృతి మల్లభూపాలీయమును, మాధవరాయకృత చంద్రికాపరిణయమును, సురభివంశచరిత్రమును లక్ష్మారాయల పౌత్రులైన వెంకటలక్ష్మారాయ మహోదయులు ముద్రణ మొనరింపజేసి పరివ్యాప్త మొనర్చిరి. వీరి సమాదరణముననే తదాస్థాన పండితులైన వెల్లాల సదాశివశాస్త్రిగారు, అవధానం శేషశాస్త్రిగారు కలిసి చంద్రికాపరిణయమునకు శరదాగమనామవిపులవ్యాఖ్య రచింపగా దీనిని క్రీ.శ. 1904 సంవత్సరంలోను, 1928లోను రెండు పర్యాయములు ముద్రణ మొనరించి ఎందరో కవిపండితుల కుచితముగా సమర్పణ చేసిన వ్యక్తి ద్వితీయలక్ష్మణరాయలు. వ్యాఖ్యాకారులైన యీపండితద్వయమే వెలుగోటి కృష్ణ యాచేం ద్రుల అభీష్టము మేరకు భట్టుమూర్తి కావ్యాలంకారసంగ్రహ ద్వితీయాశ్వాసమునకు వ్యాఖ్య వ్రాసినారు. ‘వెలుగోటి
వారి వంశచరిత్ర’ యను విశేషగ్రంథమును వెల్లాలవారు రచించిరి.
కొల్లాపురమునకు సమీపగ్రామమైన ‘అయ్యవారి పల్లె’లో నున్న మహాపండితులు అక్షింతల సుబ్బాశాస్త్రి, సింగరశాస్త్రి, వెల్లాల రాఘవజ్యోస్యులు, శంకరశాస్త్రి, వెంకటరామశాస్త్రి వ్యాకరణాది శాస్త్రములయందు నిష్ణాతులు. వీరందరును జటప్రోలు రాజకుటుంబమువారి గౌరవాదరముల పొంది ఆనాడు ఈప్రాంతమున ఎందరికో సంస్కృతాంధ్రవిద్యల నేర్పినవారు.
జటప్రోలు సంస్థానాధిపతులు తీర్థయాత్రలు చేసి తిరిగి వచ్చునప్పుడు ఆప్రాంతమునుండి కొందరు శ్రీవైష్ణవులను తీసికొని వచ్చి, వారికి అగ్రహారాదుల నొసంగి తమ ఏలుబడిగ్రామములో నుంచినారు. ఆవిధముగా వచ్చినవారిలో కొందరు ‘మంచాల కట్ట’ యను గ్రామమున గల వడగల వైష్ణవులు. శ్రీవైష్ణవసిద్ధాంతానుసరణులైన సురభివారికి వీరు ఆచార్యులుగానే గాక కవులు-పండితులుగను ఖ్యాతి గాంచినారు. సురభివారికి గురువులు కంచినుండి వచ్చిన కోయిల్ కందాడైవారు – కవితార్కికసింహ గోవిందాచార్యులవారు. ఆనాడు నెల్లూరు సంస్కృతకళాశాలాధ్యక్షులుగా రాణించినవారు. దాదాపు 68 గ్రంథములను వ్రాసి విఖ్యాతి నందిన కవితార్కికసింహ శ్రీనివాసాచార్యులు వీరి ఆస్థానకవిపండితులుగా నుండిరి. కృష్ణకుమారకవిద్వయములో నొకరైన కోయిల్ కందాడై అణ్ణన్ సంపత్కుమారాచార్యులవారు ప్రతిభాగరీయసులు. వైయాకరణగజకంఠీరవులైన యణయ వల్లి కృష్ణమాచార్యకవి సంస్థానకవిగా నుండి ‘శ్రీకృష్ణచంపువు’, ‘అష్టప్రాసరామశతకము’, ‘నిరోష్ఠ్యకృష్ణశతకము’, ‘రసజ్ఞా నందము’ అను కృతుల నిర్మాతయే గాక జాతకచంద్రికావ్యాఖ్యాకారుడు. శాకల్యమల్లన తరువాత సంస్కృతమున నిరోష్ఠ్య రామాయణమును వ్రాసిన ఘనత కృష్ణమాచార్యులవారిదే! చినమాధవరాయ ఆస్థానమున విశేషగౌరవము లందిన శేషభట్టర్ సింగరాచార్యులు శూద్రధర్మోత్పలద్యోతిని, స్మృతికౌముదిని రచించినారు.
సుప్రసిద్ధ అధ్యాపకులుగా పేరొందిన పండితులు వనం సీతారామశాస్త్రిగారు ‘ఆమావాస్యాసోమవారవ్రతనిర్ణయము’, ‘దోషా భాసనిరాస’మను గ్రంథములు రచించి తమ వాదనాశక్తిని నిరూపించుకున్నారు. బారిగడుపుల గ్రామనివాసి యైన ధర్మయా మాత్యుడు నృసింహపురాణకర్త. ఎల్లూరు నివాసి నరసింగకవి ‘రాచకన్యకాపరిణయ’మనే ప్రబంధమును, భర్తృహరి సుభాషి తముల అనువాదమును ఒనర్చెను. ఈయన కొల్లాపురం ప్రభువులకేగాక వెల్లాలవారికిని సన్నిహితుడు. మామిళ్ళ పల్లి నృసింహ స్వామి భక్తితో వ్రాసినది ఈయన ‘చూతపురీవిలాస’ యక్షగానప్రబంధము (ముద్రితము).
ఆదిశంకరుల బ్రహ్మసూత్రభాష్యమునకు ‘భాష్యార్థరత్నమాల’ యను బృహద్వ్యాఖ్యను రచించిన అక్షింతల సుబ్బశాస్త్రి గారు ఆనాడు ఈప్రాంతములో ఎదురులేని పండితులు గావున వీరి ప్రాపుతో మఱికొందరు కవులు, పండితులకు ఈసంస్థానప్రవే శము, ఆదరణలు లభించినవి. సిరివెల్లి వాసుదేవశాస్త్రి, భైరవశాస్త్రి మొదలైన వారొనర్చిన చర్చలు చిన్నగ్రంథములుగా ఆనాడే వెలువడినవి. వనం సీతారామశాస్త్రి, ఓరుగంటి లక్ష్మీనారాయణశాస్త్రి, పల్లా చంద్రశేఖరశాస్త్రి, శ్రీధర కృష్ణశాస్త్రి, అల్లాడి రామశాస్త్రి మొదలైనవారు ఈసంస్థానసమాశ్రితపండితులు. సాహితీలోకసుప్రసిద్ధులైన మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారిని ఈసంస్థా నము ఘనముగా సత్కరించి వార్షికసంభావనను ఏర్పాటు గావించినది. వెంకటలక్ష్మారావు బహద్దరు ఆనాడే కొల్లాపురము నందు ఒక ‘ఆంగ్లోవర్నాక్యులర్’స్కూలును స్థాపించి ఆంగ్లముతోబాటు సంస్కృత,ఉర్దూ,పారశీకవిద్యల బోధన చేయించిరి. దీనికొరకు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరువాసులైన వాజపేయయాజుల రామసుబ్బారాయుడు (రా.సు.రాట్కవి)గారిని రప్పించి, ప్రధానాచార్యులుగా నియమించిరి. రా.సు.రాట్కవి అధ్యాపకుడుగనేగాక ‘ప్రసన్నభారతము’, ‘శ్రీరామకోటీశ్వర తారావళి’ మొదలైన గ్రంథములను రచించిన కవివర్యుడు. కొల్లాపురంలో స్నేహలతాకవితాసంఘమును స్థాపించి, దీనిద్వారా 130 గ్రంథములను ప్రచురించిన సాహిత్యకృషీవలుడు. వీరు ప్రచురించిన పుస్తకములలో ‘చేబ్రోలు సరస్వతీదేవి’, ‘సరస్వతీ రామాయణము’, కృష్ణకుమారకవుల ‘సత్యనారాయణస్తవరాజము’, పత్రి విశ్వేశ్వరశాస్త్రి ‘రామాయణసంగ్రహము’, గంథం వెంకటనరసింహాచార్యుల ‘మణిహారము’, తోటపల్లి కృష్ణమూర్తి ‘తిరుమలదేవశతకము’, చౌడూరి గోపాలరావు ‘మధుశాల’ మొదలైనవి గలవు. కవిగారు సురభివంశసౌరభము, జటప్రోలు రాజవంశావళి, పాళీకథలు అనే గ్రంథములను రచించి ఈసంస్థ ద్వారానే వ్యాప్త మొనర్చినారు. వీరిపైన రాజాగారికి గల గౌరవాదరములు కవితాసంఘము విషయమున కూడా వర్ధిల్లి దాని అభివృద్ధికి దోహద మొనర్చినవి.
సంస్థానమునందు స్థానికులు (ఈప్రాంతమువారు) మాత్రమేగాక ఇతరప్రాంతములనుండి వచ్చిన కవిపండితులు సైతము ప్రభుసత్కార మంది సంతుష్టులైనారు. అట్టివారిలో కవిసార్వభౌమ శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రి, సహస్రావధాని జంధ్యాల సుబ్ర హ్మణ్యశాస్త్రి, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, హరికథాచక్రవర్తి దీక్షితదాసు, ముదిగొండ వెంకటరామశాస్త్రివంటి పెద్దలు గలరు. శ్రీపాదవారు 1116 రూ. సన్మానభాజనులై, చంద్రికాపరిణయనాటకమును రచించినారు. రాజావారు ప్రకాశ మొనర్చిన చంద్రికా పరిణయము శరదాగమవ్యాఖ్యతో రాజమండ్రియందుగల వీరి ముద్రణాలయముననే 1904 సంవత్సరంలో ముద్రణ మొనరింప జేసినారు. వేదం వేంకటరాయశాస్త్రిగారి వ్యాఖ్యానముల ముద్రణకు కొల్లాపురప్రభువులు ఆర్థికముగా తోడ్పడి వారియందలి భక్తిప్రపత్తుల వెల్లడించినారు.
ప్రారంభమునుండి 1980వరకు ఈసంస్థానము సాహితీసేవ చేసి కవులను, పండితులను గౌరవించుటయేగాక ఎందరి గ్రంథ ముల ప్రకాశనమునకో ఆర్థికముగా తోడ్పడినది.వైదుషీభూషణులు, నీతివాచస్పతులైన ఈపద్మనాయకుల సాహితీసేవ శాశ్వతకీర్తిదాయకము.
సురభి మాధవరాయల సమకాలమున ప్రసిద్ధుడై, రాజుగారికి కవిమిత్రమైన ఎలకూచి బాలసరస్వతి (మొదటిపేరు వెంకట కృష్ణయ్య) బహుగ్రంథనిర్మాత. మహామహోపాధ్యాయుడు. ఈయన నల్లగొండ జిల్లాలోని ఎడవల్లి గ్రామవాసి. రాచకొండ ప్రభువుల ప్రాపకము కవితాసంపత్తితో జటప్రోలు సంస్థానమున ప్రవేశించినాడు. బహుభాషాకోవిదుడైన ఈయన షడ్భాషా వివరణము, మల్లభూపాలీయము, ఆంధ్రశబ్దచింతామణీవ్యాఖ్య, చంద్రికాపరిణయము, రంగకౌముదీనాటకము, రాఘవ యాదవపాండవీయము, కార్తికేయాభ్యుదయము, వామనపురాణము, బాహాటము, భ్రమరగీతలు అను గ్రంథముల రచించెను. వీనిలో చంద్రికాపరిణయమును పరిటాల సంస్థానప్రభువు జూపల్లి వెంకటాద్రి అభీష్టముమేరకు వ్రాసి సరస్వతీసమర్పణము చేసెను.
మాధవరాయల ఆదేశానుసారము భర్తృహరి సుభాషితముల నాంధ్రీకరించి మల్లభూపతి కంకిత మొనర్చినాడు. దీనియందు విద్వత్పద్ధతి యనువాదపద్యములను ‘వైదుషీభూషణా’ యని, నీతిశతకమున ‘నీతివాచస్పతీ’ యని, శృంగారశతకమున ‘మానినీమన్మథా’ యని మల్లభూపాలుని విశేషించుట ఈపద్యములయందలి ప్రత్యేకత. ఈయన ఆంధ్రశబ్దచింతామణివ్యాఖ్య గూర్చి అప్పకవీయమున వివరముగా గలదు.
మాధవరాయలకు కవిమిత్రుడు, వయస్సులోను కవితాపాండిత్యములందును అగ్రేసరుడైన ఎలకూచి బాలసరస్వతి సహాయ సహకారములు చంద్రికాపరిణయకృతిరచనాసమయమునందు మాధవరాయలకు లభించియుండును. శ్రీమద్రామాయణబాల కాండలో
విశాలస్య సుతో రామ! హేమచంద్రో మహాబలః
సుచంద్ర ఇతి విఖ్యాతో హేమచంద్రా దనంతరః
సుచంద్రతనయో నామ ధూమ్రాశ్వ ఇతి విశ్రుతః
అని తెల్పబడిన శ్లోకములయందలి విషయమును గ్రహించి, మాధవరాయలు సుచంద్రుని నాయకునిగా జేసి చంద్రికయను నామెను సృజించి, వీరితో చంద్రికాపరిణయ మను ప్రబంధమును రచించెను.
చంద్రికాపరిణయకృతినిర్మాణము వసుచరిత్రప్రభావమువల్లనే జరిగినది. ఇవి రెండు సమకాలీనరచనలని కొందరు, చంద్రికా పరిణయమే మొదటిదని కొందరు ఇంతవరకే సాహిత్యప్రపంచమునకు తెల్పినారు.
వసుచరిత్రకథకు మూలము మహాభారతాంతర్గతకథ. దీనియందలి నాయకుడు సూర్యశబ్దవాచకుడైన వసురాజు చంద్రవంశ జుడు. వీనికితోడు వసువులయందు ప్రఖ్యాతుడు. మాధవరాయల ప్రబంధనాయకుడు సూర్యవంశజుడు. చంద్రశబ్దస్ఫూర్తిగల సుచంద్రుడు. దీనికి మూలము శ్రీమద్రామాయణము. ఈయిర్వురి కథానాయకులు భిన్నవంశములవారు. చంద్రవంశ్యులకథ మహాభారతమున ముఖ్యమైన విధముగనే శ్రీమద్రామాయణము సూర్యవంశక్షత్రియప్రాధాన్య మైనది. వసుచరిత్రకారునకు ఆధారమైన మూలకథ కొంత విస్తృతముగా నున్నది. దానిని ఆయన ఎన్నిరకముల పెంచుటకైన అవకాశము కలదు. చంద్రికా పరిణయమున కీ యవకాశము లేదు. లభించిన ఒక్క శ్లోకమున తెల్పబడిన సూర్యవంశప్రభువును ఈయన కథానాయకునిగా చేసినాడు. ఎచ్చటకూడా సుచంద్రవృత్తాంతము లేదు. దీనిని రమణీయముగా పెంచి పెద్దచేసి ఒక విచిత్రకథను సాహితీలోకమున కందించి తనకృతిని విశేషశ్లేషాది కవితావిశేషములతో రాణింపజేయవలయునన్నది మాధవరాయల పట్టుదల. అందుకే దీనిని ఫలవంత మొనర్పగలిగినాడు.
వసుచరిత్ర, చంద్రికాపరిణయప్రబంధములు సూర్య-చంద్రకథా విశేషములు. ఇరువురు కవులు భిన్నప్రాంతములవారు. తూర్పు పడమర (సూర్య-చంద్రుల)యందుండు జగత్ప్రాణదేవతలను వీరు గ్రహించిరి. వసుచరిత్రకారుని మించి మాధవ రాయలు ఒక నూతనపద్ధతిని ఈకథాస్వీకరణలోనే వెల్లడిచేయ గలిగినాడు. వసుచరిత్రము నరాంకితము. మాధవరాయకృతి దైవాంకితము అనగా తమ యిష్టదైవమైన జటప్రోలు మదనగోపాలస్వామికి అంకితము. దీనివలన యీయన నరాంకితవిముఖ త్వము వ్యక్తమైనది. వసుచరిత్రకారుడు ‘కేవలకల్పనాకథలు…’ అను పద్యమునందు ప్రఖ్యాత-ఉత్పాద్య-మిశ్రకథల ప్రాము ఖ్యమును తెల్పి, మిశ్రకథకు ‘నేర్పు పెంపు’ కావలె ననెను. వసుచరిత్రమున ‘నేర్పు’ ప్రశంసావహముగా నున్నది. దానికి కార ణము అతడు గ్రహించిన మూలకథ. చంద్రికాపరిణయకర్తకు ఇట్టి అవకాశము స్వల్పము. అందువలననే సుచంద్రునిచుట్టు కథ తిరిగినది. స్వల్పప్రసక్తి కలవానిని గ్రహించి తన కల్పనలచే అతనిని గొప్పవానిగా చిత్రించుట మాధవరాయల యుద్దేశ్యము.
వసుచరిత్రలోని పర్వతమైన కోలాహలుడు నదియైన శుక్తిమతి వీరి కలయిక సహజదూరమైనదని ఈతని భావన. అందు వలననే తాను రామాయణమున తెల్పబడిన ఒక పాత్రను గ్రహించి, శాపవిమోచన మందిన ‘స్త్రీ’ చంద్రికను నాయికగా కూర్చి నాడు. ఒక మానవమాత్రునకు గంధర్వలక్షణయైన దానిని పత్నిగా నొనర్చుట మాధవరాయల ప్రత్యేకత. ఇట్టిభావము కల వాడు కావుననే వసుచరిత్రను గూర్చి వ్యంగ్యముగా,
‘చిరపూరుషుని వసుస్ఫురితాంగి యగు లక్ష్మితో నెనయించు నతుల్యసర్గ’ (6-108)
యని చంద్రికాసుచంద్రదంపతీవర్ణనమున వసుచరిత్రయందలి పాత్రల అతుల్యసర్గను తెల్పినట్లున్నాడు. ఇట్టి వ్యంగ్యమునే మఱి యొకచోట క్రింది విధముగా వ్యక్తీకరించినాడు.
‘తానెంతరాజైన దనవసుస్పర్శనాడంబరం బెంచ జడంబు గాదె’
రామరాజభూషణుడు, మాధవరాయలు ఈయిరువురు అళియ రామరాయల సమకాలమువారు. అప్పటికే వసుచరిత్ర ఖ్యాతి నందుచుండ, దానికి ప్రతిగా తానొక ప్రబంధమును వ్రాయవలెనను వాంఛ చంద్రికాపరిణయకారునకు గలిగినది. అందు వలననే ఈరెండు గ్రంథముల కనేకవిషయములలో సారూప్యతయే గాక బింబప్రతిబింబభావము లున్నవి. ఐనా ఎవరి రచన నెవ రనుకరించిరో! ఉభయులుకూడా సాహితీమర్మ మెరిగిన యుద్దండకవులు. వసుచరిత్రకారుడు లోకప్రసిద్ధరూఢిపదప్రయోగ కవితానైపుణి కలవాడు. మాధవరాయలు పదప్రయోగకుశలుడు – శాస్త్రనిఘంటువులలోని పదములకు అద్భుతరీతిగా యౌగి కార్థముల నిరూపించినాడు. ఈవిధముగా నుభయులు సమ ఉజ్జీలైనను వసుచరిత్ర ప్రఖ్యాతి, ప్రచారములు చంద్రికాపరిణయ మునకు రాలేదు. భూషణుని రచన సంగీతసాహితీవేత్తల నాకర్షించినది. ఆయన పద్యగమకమే ఒకరకమైనది. ఎవ్వరెన్ని చెప్పినను వసుచరిత్రను మించునట్టికవిత అసాధ్యమే! వెల్లాలవారు తమ ‘సురభివంశచరిత్ర’లో కర్తృత్వము తెలియని ఈచాటు వును తెల్పినారు. దీనియందు ‘చంద్రికాపరిణయఘనత’తో పాటు వసుచరిత్ర తక్కువదనము కలదు- ఆపద్యము:
సురభికులామలాబ్ధిఁ బొడచూపిన మాధవరాయచంద్రుఁడా
సరసపదార్థరంజనము సత్కవిహృద్యము గాగ ‘చంద్రికా
పరిణయమున్’ రచించె, నది భావ్యము; నీవసుచర్య చూడఁగాఁ
బరగె నిగూఢవృత్తి నటు నీకును వర్తిలె ‘మూర్తి’నామమున్.
మాధవరాయల ఆశ్రితుడు, భట్టుమూర్తిపై అనాదరము గల కవి ఈపద్యమును చెప్పినాడు. మాధవరాయలకవితను ప్రశం సించి, వసుచరిత్ర నిగూఢార్థములవలన సరసమైనది కాదని ఇతని యభిప్రాయము. వసుచరిత్రకర్తృత్వమున ‘మూర్తి’ నామ మన్వర్థ మనినాడు. ‘మూర్తిః కాఠిన్యకాయయోః’- అను అమరకోశపదమువలన ‘మూర్తి’శబ్దము కఠినుడు, బండ యని తెలియును. దీనివలన భూషణుడు బండయైనవాడు, కాని నిగూఢవృత్తిగా నున్న నది, కోలాహలపర్వతము (బండ) వసుచరిత్రలో ముఖ్యము గదా! అందువలన ‘మూర్తి’ప్రయోగము చేసెనేమో? ఈపద్యమున చెప్పినట్లు వసుచరిత్ర తక్కువదిగాదు. అభి మానోత్సాహమతిని ఈపద్యము వ్రాయించినట్లున్నది. ఎవరి కవిత వారిది, ఎవరి పద్ధతి వారిది.
మాధవరాయల సమకాలముననే గాక అతనికి ముందు, సమకాలములోను వచ్చిన శ్లేష,ద్వ్యర్థి, త్ర్యర్థి రచనలను ఈప్రాంత మున వెలసి ప్రసిద్ధినందుచున్న అనర్ఘరాఘవ భాస్కరరామాయణ చిత్రకవితారామాయణాదులను చంద్రికాపరిణయకర్త బాగుగా నధ్యయనము చేసినాడు. సమకాలసాహిత్యప్రభావము తప్పించుకొనజాలనిది. సంస్కారవిశేషమువలన పూర్వభావ ములు మనస్సులో నెలకొని సందర్భానుసారము కవితారూపముగా నవి దొర్లుట సహజము. మాధవరాయలు భాషా-భావ-దారిద్ర్యములు లేనివాడు. శ్లేషకావ్యరచనకు కావలసిన శక్తి గలవాడు. ‘కావ్యజ్ఞ శిక్షయాభ్యాసః’ అనునది ఈయన యందు పూర్తిగా గలదు. కావుననే తదాస్థానకవిపండితమండలి కృతినిర్మాణవిషయమున మాధవరాయరాజన్యుని గూర్చి యిట్లు పలికినారు:
విబుధశిక్షితుఁడవు, శాస్త్రవిదుఁడ, వఖిల
కావ్యవేదివి, ఘనతార్కికవ్యవహృతి
నెఱుఁగుదువు, నీ కసాధ్యమే యింపుమీఱఁ
గృతి వినిర్మింపు మాధవక్షితిప యనిరి. (1-75)
దీనియందు తెల్పిన లక్షణము లీకవిచంద్రునకు గలవు. తన కవితారూపతపస్సును మాధవరాయమనీషి దీనిలో వ్యక్తీకరించి నాడు. ఇది అందాల ‘చంద్ర’మహల్. అందరము ఈచంద్రికాపరిణయమును సమాలోకింతము.
కథాసంగ్రహము
ఆరు ఆశ్వాసములతో నొప్పారి, వివిధరీతులైన 905 గద్యపద్యములు గల యీచంద్రికాపరిణయమునందు ముఖ్యకథా పాత్రల సంఖ్య పది. వారు – సుచంద్రుడు (నాయకుడు), చంద్రిక (నాయిక), కుముదుడు, చిత్రరేఖ, వసంతుడు, మన్మథుడు, క్షణదోదయుడు, పార్వతీదేవి, బ్రహ్మ కలరు. వీరి యందరితో మాధవరాయలు ఈప్రబంధకథానిర్వహణ మొనర్చెను. దీనియందలి కథ (సంక్షేపముగా): నైమిశపుణ్యారణ్యమున వసించు సూతమహర్షివద్దకు శౌనకాదిమహర్షులు విచ్చేసి, మర్త్యలోకమున గల రాజులలో పుణ్య శ్లోకుడైన ఒకని చరిత్రను తెల్పవలసినదని ప్రార్థన చేయగా సూతుడీ కథను చెప్పెను.
మనుష్యలోకమున సర్వసంపదలతో తులతూగుచు సుఖజనావాసమైన మహాపట్టణము విశాలానగరము. దీనిని సౌందర్య రాశి, మహపరాక్రమవంతు డగు సుచంద్రుడు పరిపాలించుచుండెను. ఆప్రభు వొకనాడు సకలసామంతదండనాయకాది జన యుక్తుడై సభదీరి యుండగా, సుగుణవారాశి యైన శాండిల్యముని విచ్చేసి, సుచంద్రుని సత్పరిపాలనను ప్రశంసించి, ఇట్టి మీ రాజ్యమున అస్మాదృశుల జపతపోనుష్ఠానయజనయాజనాది క్రియ లిప్పటివరకు నిరాటంకముగా జరిగినవి. కాని ఈమధ్య మాయావి – మహాబలుడైన తమిస్రనామకరాక్షసునిచే సత్కర్మలకు విఘ్నము కల్గుటయేగాక మునిజనమునకు ముప్పు ఏర్పడి నది. సకలశస్త్రాస్త్రవిద్యావిశారదుడవైన నీవు ఆదానవుని నిర్మూలించి బలపరాక్రమాదుల సార్థక మొనర్చి, వైదికక్రియలు నిర్వి ఘ్నముగా జరుగునట్లు చేయవలసినదని విన్నవించిరి.
శాండిల్యుని సుచంద్రు డోదార్చి, అభయ మొసంగి, వెంటనే సేనాయుతుడై వలయు పరివారముతో తమిస్రాసురనిర్మూలన క్రియాచణుడై బయలుదేరెను. ఆయన జైత్రయాత్ర చేయుచు నదీనదకాంతారముల దాటి హేమకూటపర్వతమును గాంచెను. అది సిద్ధవిద్యాధరకిన్నరీమణివీణానినాదమనోహరమై, సంగీతప్రతిధ్వానమై యున్నది. ఆప్రాంతమున సైన్యము నుంచి, వయ స్యునితో గూడుకొని హేమకూటనగదర్శనోత్సుకుడై బయలువెడలి హేమకుధరవైభవమును గాంచి అచటి సౌందర్యమును (విపులముగా) వర్ణించి, అందలి చంద్రకాంతశిలామణిఖచితపార్శ్వభాగశోభితమైన లతాగృహయుక్త గుహామార్గమున పయ నించును. అది గంధర్వసతీనివాసస్థానము. వయస్యాసంయుతుడైన సుచంద్రు డచట విశ్రామార్థము కూర్చొని యుండెను. ఇంతలో నొక మణిపుత్రిక యొయారముగా విచ్చేసి రాజునకు అతిథిమర్యాద లొనర్చి, వ్యజనసేవ చేయుచుండును.
ఇంతలోనే సుదూరప్రాంతమునుండి యొక మృగేంద్రము గర్జించుచు పొదరింటినుండి వెడలి సుచంద్రాదుల పైకి దూక యత్నించును. దానిని గమనించి యా రాజన్యడు తన చంద్రహాసముచే సింహశిరఃఖండన మొనర్ప వెంటనే కంఠీరవ మొక భానుప్రభాభాసమాన కాంతియుక్త పురుషరూపము దాల్చును. దానికి సుచంద్రు డాశ్చర్య మందుచుండ నా మనుష్యుడొక కిన్నరుడై వచ్చి ప్రభువునకు నమస్కరింపగా, నారా జతనిని చేరదీసి తనచెంత నుంచుకొని సింహత్వము, అనంతరము కిన్నర త్వము నీకెట్లు సంప్రాప్తించినవని యడుగును. దాని కాకిన్నరుడు ఒకనాడు బ్రహ్మవద్దకు మహామనువర్ణదేవతలు విచ్చేసి, వసం తుడను విప్రుడు బ్రహ్మత్వముకొరకై జపముచేయుచు మాయక్షరసంఖ్య నసంఖ్యాకముగా జపించుటవలన మాకు తాపము కల్గి భరింపలేకున్నా మని తెల్పిరి. వసంతుని తపోభంగమునకై దేవేంద్రుని సలహా ననుసరించి చిత్రరేఖ యను దేవవేశ్యను అచటికి పంపుటకు పరమేష్ఠి నిశ్చయించి మన్మథపరివారము తోడుగా చిత్రరేఖను వసంతుని తపోభూప్రాంతమున కంపెను. ఆమె యాస్థలమునకు వచ్చేసి తన ప్రయత్నముల నారంభించినది. వానికి ఆముని వశుడు గానందున ఈమె ఆయన పాదముల పై బడి తన విద్యావైదుష్యములు తెల్పి తనను పరిగ్రహింప వేడికొనును గాని మునివర్యుడు నేత్రసంజ్ఞతోనే ఆమె వాంఛను తిర స్కరించును. దాని కంగీకరింపని చిత్రరేఖ బలవంతముగా నామునిహస్తమును బట్టి తన వాంఛాపరిపూర్తికి పరితపించుచుండ నాతపస్వి క్రోధాక్షుడై యామెను నీవు దేవాంగనాభావమును వదలి మానవస్త్రీగా జన్మించి సుచంద్రనామకప్రభువును పరిణయ మాడుదువని శపించెను.(కవి యిచ్చట సుచంద్రశబ్దమునకు ‘సుదోషాకరు’డని, భూపాలయనుటకు ‘ఇరాపు’డు అనెను. అధికదోషనిలయుడు, మద్యపాయి యని వీని యర్థము లున్నవి). ఆమె శాపవశమున క్షణదోదయరాజునకు శ్యామయను పత్నియందు జనించి చంద్రికాభిధ యాయెను. బ్రహ్మ కీవిషయము తెలిసి బాధపడి నన్ను కుముదాహ్వయునిగా భూలోకము నకు వెళ్ళి ఆమెకు వీణావాద్యము నేర్పుమనెను. ఒకనాడు నేను నభోమార్గమునుండి భూలోకమునకు అరుదెంచుచు సౌందర్య నిధియైన యొక మునికాంతను గని ఆమెను పొందు వాంఛతో నాకు గల శాంబరీవిద్యామహిమవలన మునివేషధారినై యచటి మునిజనవర్గమును చేరితిని. కాని నామాయావేషమును ఆ యువతిభర్త తెలిసికొని, నన్ను సింహరూపుడవు కమ్మని శపించెను. అనంతరము నేను వేడుకొనగా పంచవర్షానంతర మీశాపము తీరగలదని చెప్పినాడు. అందువలన నేను మృగేంద్రుడనై యుండి నీచంద్రహాసప్రహారమున పూర్వరూపము గనినాను అని తెల్పి సౌందర్యరాశియైన చంద్రికను వర్ణించి రాజున కామెపై మోహ మును పుట్టించెను. రాజును తీసికొని వెళ్ళుటకు తనశాంబరీవిద్యచే విమానమును రప్పించి చంద్రికానివాసప్రాంగణమునకు చేర్చి, గానవిద్యాపరతంత్రయగు నామెను కన్పింపజేయును. చంద్రికాదృక్చకోరసుచంద్రుడు ఆమెపైనుండి మనస్సును మరల్చుకొన జాలడాయెను. గంధర్వు డతనిని చాటుగా నుంచి చంద్రికవద్దకు వెళ్ళి పూజాదికము లంది యామెను పెండ్లికూతు రగునట్లు ఆశీ ర్వదించి, ఇంతకాలము తాను కన్పడకపోవుటకు గల కారణమును తెల్పి సుచంద్రునిగూర్చి చెప్పి వర్ణించును. అనంతరము చంద్రికాసుచంద్రులకు పరస్పరదర్శనభాగ్యమును కలిగించి మీరుభయులు దంపతు లగుదురుగాక యని పల్కెను. సుచం ద్రుడు తెప్పరిల్లి సైన్యయుతుడై తమిస్రాసురవధార్థము బయలుదేరును. యుద్ధమున నెందరో యోధులు పంచత్వమందగా, తన పరాక్రమమును గణింపక పోరాడు తమిస్రుని సుచంద్రుడు నారాయణాస్త్రప్రయోగముచే శిరఃఖండన మొనర్చి మునిదేవతాగణ ములకు ముదము చేకూర్చగా , సుచంద్రుని నష్టసైన్యమును అమృతవృష్టిచే దేవతలు పునర్జీవుల నొనరింపగా, విజయుడై సుచం ద్రుడు స్వపురమునకు విచ్చేయును. తరువాత చంద్రికాస్వయంవరము ప్రకటింపబడును. ఆ స్వయంవరమునందు క్షణదోద యుని ప్రార్థనచే పార్వతీదేవి ప్రత్యక్షమై స్వయంవరమునకు వచ్చిన రాజులనందఱిని చంద్రికకు పరిచయము చేయును. స్వయంవరాగత వివిధదేశరాజన్యుల నెల్లరిని వర్ణించి చెప్పినను వారి నెవ్వరి నంగీకరింపక చంద్రిక సుచంద్రునే వరించును. అనంతరము వీరి పరిణయమును, గృహప్రవేశాదులను వర్ణించి ఆసుచంద్రుని పాలనమున దేశము సుభిక్షమైనదని సూతుడు శౌనకాదుల కీకథను తెల్పెను.
కృత్యాది
మాధవరాయలు తనకృత్యాదిని విపులముగా సిద్ధము చేసినాడు. దీనియందు సురభివారి వంశపరంపర (తనవరకు) కలదు. సంప్రదాయానుసార మీగ్రంథము ‘శ్రీ’కారముతో ‘మదనగోపాలాహ్వయోజ్జృంభితాంభోవాహ’వర్ణనప్రధానము.
అనంతరము లక్ష్మి, బ్రహ్మ, సరస్వతి, శివుడు, కల్పవృక్షము, వైకుంఠము, గణపతి, హనుమంతులను స్తుతించెను. కవిస్తుతి యందు వ్యాస, భారవి, మయూర, కాళిదాసులు, ఆంధ్రమహాభారత కవిత్రయము గలరు. కృత్యాదిలో పరంపరగా అనుసరింప బడు కుకవినింద, కవికి స్వప్నమున తమ యిష్టదైవమైన జటప్రోలు మదనగోపాలస్వామి దర్శన మొసంగి కృతినిర్మాణము నొనర్పు మనుట అనంతర మీయనను కవిపండితమిత్రవర్గము గ్రంథరచనకు ప్రోత్సాహపరచుట, శ్రీవైకుంఠవర్ణన – ఇవి ప్రారం భమున గలవు. వీనిలో 1-18 నుండి 1-75 వరకు విపులముగా వంశవర్ణన చేయబడినది.1-77 నుండి 1-82 వరకు షష్ఠ్యంతములు గలవు.
ప్రబంధకవి సంప్రదాయము ననుసరించి ఈవిషయములను తెల్పిన మాధవరాయలు ఏకారణముచేతనో కొన్నిటి ప్రసక్తి చేయలేదు.
రాచకొండ వెలమల పరంపరకు చెందిన వీరు మొదట శైవులు. అందువలననే రాచకొండవారు భైరవప్రతిష్ఠల నొనర్చుట యేగాక శివాలయముల కట్టించినారు. వైష్ణవమతస్వీకారానంతరం రామాలయాదుల నిర్మాణ మొనరింపజేసిన వీరు తమ నామధేయములనుకూడా విష్ణుసంప్రదాయముగా నుంచుకున్నారు.
జటప్రోలువారుకూడా వీరివలెనే మార్పు చెందినారు. ఈవంశమునందు మల్లభూపాల మల్లనాయకపదములు శైవచిహ్నిత ములు. అనుపమమల్లికార్జునయశోంచిత – అని తెల్పబడిన వ్యక్తు లున్నారు. ఇట్లే లింగభూపాల, లింగాంబికలు గలరు. వీరి పూర్వుడు అనపోతమహారాజు శ్రీపర్వతసోపానస్థాపకుడను విషయము రసార్ణవసుధాకరమున తెల్పబడినది. ఈవిధముగా శివభక్తులైన జటప్రోలువారు రాచకొండప్రభావమున శ్రీవైష్ణవభక్తిగలవారైనా ఉభయమతములను సమానముగా చూచి తత్తద్దేవతా ప్రతిష్ఠల నొనర్చి అగ్రహార-భూదానముల నొనర్చిరి. ఈకావ్యమున శివగణపతిస్తుతులుండుట కవి అవిస్మృతశైవమే యనిపిం చును. మాధవరాయలు శ్రీవైష్ణవాభినివేశముగలవాడు. ఇతనికాలమువరకే ఈప్రాంతమునకు దాక్షిణాత్యవైష్ణవసంప్రదాయులు వచ్చియున్నందున వారి ప్రభావము ప్రభువులపై పడినట్లున్నది. అందుకే మంచాలకట్టయందు కుంతీమాధవాలయనిర్మాణము. దీనికి పూర్వము సింగపట్టణ నృసింహదేవాలయనిర్మాణాదులు జరిగినవి. కుంతీమాధవాలయము పిఠాపురప్రాంతమున గలదు. దీని ప్రసక్తి శ్రీనాథుని భీమేశ్వరపురాణమున కన్పడును. జటప్రోలువారికి పిఠాపురంవారి బంధుత్వకారణమున ఈ ప్రాంతమున మాధవాలయము వెలసినది. ఇంత విష్ణుసన్నిధులు గల సంస్థానాధీశుడు మాధవరాయలు. ఐనా తన యీగ్రంథ మున నృసింహప్రసక్తి చేయలేదు. కనీసము దశావతారముల నైనా తెల్పలేదు. శ్రీకృష్ణదేవరాయలు, సంకుసాల నృసింహకవి వంటివారు స్వీకృతవైష్ణవముద్రగలవారైనా దానిలోతు అనగా సంప్రదాయమును తెలిసికొన్నవారు. అందుకే వారిగ్రంథముల యందు ఏతత్సంప్రదాయప్రార్థనాదు లున్నవి.
మాధవరాయలది వైష్ణవమతాభిమానమే. కాని పంచసంస్కారసంపన్నమైన వైష్ణవముమాత్రము కాదనిపించును. అందుకు కారణమేమనగా – ఈయన విష్వక్సేనుని పంచాయుధములను, గరుడాళ్వారును, పన్నిద్దరు సూరులను స్తుతించకపోవుట. రాయల కృత్యాది సంప్రదాయపరిపూర్ణమైనట్లు చంద్రికాపరిణయకర్త ఆపద్ధతిని అవలంబించిన ఇదికూడా పరిపూర్ణసంప్ర దాయ కృత్యాది గలదనుటకు సంశయము లేదు.
తెలుగుకవులలో కల్పవృక్షస్తుతి చేసినవారు అరుదు. మాధవరాయలు మాత్రము ఈస్తుతి నొనర్చెను. కృతిస్వామియైన మదనగోపాలస్వామి వెనుకగల పొన్నవృక్షమును కల్పవృక్షముగను, ఆదేవుని విష్ణువుగను భావించి కల్పతరువును చెప్పి యున్నాడేమో!
చంద్రికాపరిణయకర్తయొక్క మఱియొక విశేషము – తనవరకుగల వంశవృక్షమును తెల్పుట. దీనివలన వెలుగోడు, రాచ కొండ, జటప్రోలువారి పరంపరను తెలిసికొనుటకు పరిశోధనాజిజ్ఞాసువులైన వారికి ఇది మిక్కిలి ఉపయోగపడును.
కవి తనకవిత్వపద్ధతినిగూర్చి ప్రత్యేకముగా తెల్పలేదు. సరస్వతీస్తుతి చేయు పద్యము శ్లేషలో నున్నది. ఇది యొక విధాన మున తన కవితాపద్ధతి యని వ్యక్తీకరణ మొనర్చినాడు. ఆపద్యము –
రమణీయతర పదార్థప్రకాశనిదాన,భాస్వత్ప్రసాదసంపద వహించి,
పటుసారసానందఘటకైకచాతుర్య,ఘనకృతాలంకారకలన మెఱసి,
యనుకూలకాలకంఠాకుంఠకలనాద,వలమానమంజులధ్వనుల నలరి,
యతివేల కవిజాల కామోదనాపాద,కారణ రసభావ గరిమ నెనసి,
పరమయతియోగ సంస్థాన పదమనోజ్ఞ
వైభవోన్నతిఁ దగు సరస్వతి మదీయ
మానసాస్థానమందిర మధ్యవీథి
నిండు కొలువుండు గాత నిష్ఖండలీల (1-4)
ఈపద్యముతోబాటు సత్సంప్రదాయుడైన మాధవరాయని కృతినిర్మాణ మొనర్చుమని తెల్పు సందర్భములో (1-75)
విబుధశిక్షితుఁడవు, శాస్త్రవిదుఁడ, వఖిల
కావ్యవేదివి, ఘనతార్కికవ్యవహృతి
నెఱుఁగుదువు, నీ కసాధ్యమే యింపుమీఱఁ
గృతి వినిర్మింపు మాధవక్షితిప యనిరి. (1-75)
ఈపద్యము ఈయన ప్రతిభను, కవితానిర్మాణశక్తిని వ్యక్తమొనర్చును. అందువలననే చంద్రికాపరిణయ మొనర్చుట మాధవ రాయల కసాధ్యముగా ననిపించలేదు. ఎలకూచి బాలసరస్వతివంటి మహామహోపాధ్యాయుల విబుధసన్నిధి శిక్షణ(విద్య) తోడ్పడినది. శాస్త్రవేదులు, కావ్యజ్ఞులు, తర్కశాస్త్రనిపుణు లున్నారు. వారందరివలన ఆయావిద్యలపద్ధతిని తెలిసికొన్న మనీషావంతుడు మాధవరాయలు. అందువలననే విన్నవిషయమునకు మెఱుగులు పెట్టి ప్రబంధీకరించి తన కవితాసంపత్తి నిరూపించి, పైన తెల్పిన పద్యములలోని లక్షణములను తన గ్రంథమున ప్రతిఫలింపజేసిన ప్రౌఢకవితావతంసుడు.
చంద్రికాపరిణయము వసుచరిత్రకు ప్రతిస్ఫర్థిగా రచితమైనది. కవితావిషయమున పలుచోట్ల బింబప్రతిబింబభావమే కన పడును. ఎందుకోగాని ఈగ్రంథకర్త రామరాజభూషణునిగాని, అతనికృతినిగాని ఎచ్చటను పేర్కొనలేదు. వసువనగా సూర్యా ర్థము గలదు. చంద్రిక – వెన్నెల సూర్యచంద్రసమాగమము ఒకే పర్యాయము సంభవింపనట్లు మాధవరాయలు (చంద్రవంశము) ‘వసు’ప్రసక్తి చేయకున్నను, గ్రంథమునందు 1-32, 6-108 పద్యములలో వ్యంగ్యముగా ‘వసు’ప్రసక్తి చేసినాడని భావింప వీల గును. కవిస్తుతిలో సంస్కృతాంధ్రకవులను కొందరినే పేర్కొనిన ఈ ఉభయభాషాకళత్రుడు కనీసము తన కవిమిత్రుడు ప్రఖ్యా తుడు నైన ఎలకూచి బాలసరస్వతినిగాని, సమకాలీనులైన మఱికొందరు కవులనుగాని పేర్కొనకపోవుట విచిత్ర మనిపించును. దీనికి మఱియొక యూహ కృత్యాదిస్తుతిపద్యములు ముక్తకములు. దీని తరువాత ఈ స్తుతి యను నియమము లేదు. మాధవ రాయకవీశుని కృత్యాదిపద్యములలో మఱికొన్ని ముద్రాకాలమున తప్పిపోయినవేమో? అనికూడా ఒక సంశయము. లేనిచో ఇంత అసమగ్రపద్ధతి ఎట్లుండును?
దీనిలోని షష్ఠ్యంతములు – ఉత్తరార్ధమంతయు అన్నిపద్యములకు ఒకేవిధానము పాటింపబడుటచే విశేషముగా నున్నది.
ప్రబంధపాత్రలు
చంద్రికాపరిణయకథానిర్వహణ దైవమానుషసమ్మిశ్రితము. సుచంద్రుడు, క్షణదోదయుడు, వసంతముని, చంద్రిక – వీరు మానవులు. గంధర్వజాతికి చెందినవాడు కుముదుడు. అప్సరోవంశజ చిత్రరేఖ. జగన్మాతృత్వము గలది పార్వతి. బ్రహ్మ మన్మథులవిషయము తెల్పవలసిన పని లేదు.
కావ్యనాయకుడైన సుచంద్రుడు అదివ్యుడు. నాయిక యైన చంద్రిక దివ్యాదివ్య. అందువలననే కృతికి నాయికానామము నుంచినాడు (‘వసుచరిత్రము’ నాయకనామాంకము గలదిగదా!). సుచంద్రుని ఏవిధమైన లోపములేని నాయకునిగా చిత్రించి ఆయన నిగ్రహశక్తి, ప్రజాపాలనాతత్పరత, అద్భుతశౌర్యము మొదలైన వాటికి ప్రతీక యని ప్రత్యక్షీకరించెను. కావ్యప్రధానరస మైన శృంగారము నాయికానాయకాశ్రయముగా చిత్రించి, ఆనుషంగిక వీరరసమునకు నాయకుని పోషించెను. ధర్మార్థకామ సాధనము లీతనిద్వారా దీనియందు సిద్ధించినవి.
చంద్రిక కావ్యనాయిక యైనను ఆమె సుచంద్రుని ప్రేమించి కావ్యకవిసమయానుసారము విరహాదుల ననుభవించుట, స్వయం వరమున సుచంద్రుని పొందుట – ఇవియే ఈమె ముఖ్యకార్యములు. వసుచరిత్రలోని నాయిక చెలికత్తెలవలె ఈమెను, ఈమె చెలి కత్తెను కవి పరిపూర్ణపాత్రలుగా చిత్రించలేదనిపించును.
సింహరూపశాపవిముక్తి సుచంద్రునివలన సంభవించిన కుముదుడు చంద్రిక పూర్వజన్మ (చిత్రరేఖ) విషయమును తెల్పి తాను ఆమెకు సంగీతోపాధ్యాయుడనని వివరించి సుచంద్రునకు కృతజ్ఞతగా చంద్రికాసుచంద్రుల వివాహము జరుగునట్లు చేయును. వీరి శాపములు, మోక్షములు ఇతనివలననే తెలియును.
ఈవిధముగనే చిత్రరేఖ, వసంతుడు, క్షణదోదయుడు, పార్వతి, మన్మథ, చతురానన పాత్రలను యథోచితముగ పోషించిన కవి నాటకపాత్రలవలెనే వీరిలో కొందరిని స్వల్పకాలము మాత్రమే కథాభాగమునందు నిల్పుటవలన అనుస్యూతపద్ధతి కొరవడి నను సన్నివేశకల్పనములయందు వీరిని ప్రత్యక్షీకరింపజేసినాడు.
పాండితీప్రకర్ష
మాధవరాయకవిచంద్రుడు మహాప్రతిభావంతుడు. కల్పనానైపుణితో బాటు వర్ణనాచమత్కృతి, వివిధవిషయవివేచనాపటు త్వముగల కవితాశక్తి కలవాడు. అందువలననే
‘విబుధశిక్షితుఁడవు, శాస్త్రవిదుఁడ, వఖిల
కావ్యవేదివి, ఘనతార్కికవ్యవహృతి
నెఱుఁగుదువు, నీ కసాధ్యమే యింపుమీఱఁ
గృతి వినిర్మింపు…’ అని సభాస్థానమున ప్రశంసితు డైనాడు. ఈయన విబుధసన్నిధియందు విద్యాభ్యాస మొనర్చి, ‘కావ్యజ్ఞ శిక్షయాభ్యాసః’ అను లాక్షణికోక్తిని సార్థకము చేసికొనెను. శాస్త్రవేదిత్వ మనునది వ్యాకరణచ్ఛందోలంకారజ్యోతిషసంగీతాది శాస్త్రవిద్యల ప్రావీణ్యమును తెల్పుచున్నది. కవియైన మనీషావంతునకు ‘అఖిలకావ్యవేది’ యగుట ఆవశ్యకము. ‘వాణీ తర్క రసోజ్జ్జ్వలా’ యనుదానికి నిదర్శన మీయన ‘తార్కికవ్యవహృతి’. ఇట్లు ఇన్నివిధములైన శక్తులు కలవాడు కావుననే ‘ఇంపు మీఱ’ ఈప్రబంధమును సిద్ధముచేయ సమర్థుడైనాడు.
చంద్రికాపరిణయకర్త ఛందఃపరిజ్ఞానము విశేషవృత్తివిలసితము. దీనియందు మొత్తము 905 గద్యపద్యములలో, 289 చంప కములు, 187 మత్తేభములు, 157 సీసములు కలవు. ఇక విశేషఛందములయందు పృథ్వి, పంచచామర,మాలినీవృత్తములు రెండేసి కలవు. ఉత్సాహ, సుగంధి, కవిరాజవిరాజిత,లయగ్రాహి,మహాస్రగ్ధర, ప్రహరణకలిత,వృషభగతిరగడ, త్వరితగతి, మందాక్రాంత,శిఖరిణీ,భుజంగప్రయాతములు – ఇవి ఒక్కొక్కటి యున్నవి. స్తుతిసమయమున దండకమును చెప్పుట ఒక సంప్రదాయము. దీని నీ గ్రంథ కారుడు ప్రౌఢసంస్కృతమున చెప్పి తన శక్తిని చాటినాడు. స్వయంవరసమయమున శ్రీనాథుడు సరస్వతీస్తోత్రమును దండక ముగా చెప్పి నైషధానువాదమునకు వన్నె తెచ్చిన విధానమును గమనించిన మాధవరాయలు సంస్కృతమున ‘శక్తి’ని స్తుతించి దండకరచనాఫణితిలో శ్రీనాథునకన్న ముందునకు బోవ యత్నించి నట్లున్నాడు.
దీనియందు ప్రయోగించిన ఛందము సందర్భోచితముగా నున్నది. యుద్ధమున మహాస్రగ్ధర, అతివేగశరసంధానమునందు త్వరితగతి, యుద్ధవైచిత్రిలో పృథ్వి, మాలిని, ప్రహరణకలిత, శిఖరిణి, పంచచామర,భుజంగప్రయాతములను చెప్పి, ఛందో రీతిలో వేగముగా నుండు (గణరీతి) వీనిని సమరత్వరసమయమున చెప్పుట రసానుకూల సందర్భోచిత పద్యప్రయోగము. అందరి కవులవలెనే పుష్పాపచయసమయమున వృషభగతిరగడ నీయన చెప్పినాడు.
తనది చంద్రికాపరిణయకృతి. చంద్రిక (వెన్నెల) ఆహ్లాదకరమై సొంపుగా నుండునది. అట్లే కావ్యనాయిక యైన చంద్రికను భావించిన కవి ఈమెనుగూర్చి చెప్పునప్పుడేగాక రసానుకూలమార్దవసన్నివేశములయందు ‘చంపకములు’ (289) చెప్పి కవితారూపమనోహారిత్వమును కల్గించెను. మత్తేభసీసములనుగూడ వర్ణనలు,కల్పనలు, యుద్ధము మొదలైన సమయము లలో రచించినాడు. మధ్యమధ్యనగల వచనములు వివిధరీతులుగా నుండి ప్రబంధకర్త రచనాశైలిని నిరూపించుచున్నవి.
వ్యాకరణశాస్త్రమర్యాదల మిక్కిలి ఆకళింపు చేసికొన్న మాధవరాయలు పదప్రయోగవిధానమున తత్సంప్రదాయమును నిరూపించినాడు. 1-60లో ‘ధర్మనిర్మథనంబు దాఁజేసి జనకజాపాణౌకృతిక్రీడ…’ అనెను. పాణౌకృతిక్రీడ యనగా పాణిగ్రహణము (వివాహము). ఇది యలుక్సమాసము. పాణినీయమున ‘నిత్యం హస్తే పాణౌ వుపయమే’ అను సూత్రము ద్వారా ‘పాణౌకృతి’ రూపమగును. వ్యాకరణవిశేషములను చమత్కారముగా కూర్చి ఒక ప్రౌఢత్వమును నిరూపించుట యందు ఈయనకుగల మక్కువ ఎట్టిదో ఈపద్యముద్వారా తెలియును.
గళదర్కంబుఁ, బనీపతతత్కుజము, రింఖద్గోత్రంబుఁ, జా
చలదుర్వీవలయంబు, ఫక్కదఖిలాశాకంబు, భిద్యన్నభః
స్థలమేఘౌఘము, భ్రశ్యదృక్షము, రణత్పద్మాసనాండంబునై
యలరెన్- దన్మహిపాలజైత్రగమబంభారావ మప్పట్టునన్. (1-151)
ఇందు సంస్కృతధాతువులపై శతృప్రత్యయము (అత్)ను చేర్చి వర్తమానార్థమునందు సమాసగ్రథన మొనర్చుట యొక చమ త్కారము. ఈవిధమైన పద్యములు ఆముక్తమాల్యద, అనర్ఘరాఘవము, భాస్కరరామాయణములయందు గలవు. ప్రక్రియా విశేషజ్ఞత, ధాతుజ్ఞానము కల్గియున్ననే కాని ఇట్టి పాండితీస్ఫోరకప్రయోగములు చేయ సమర్థు లగుదురు. ‘పనీపతత్కుజము’ అని ‘పనీపత’చ్ఛబ్దమును యగంతముగా నున్నదాని నిట్లుప్రయోగించెను. గళ,రింఖ,చల మొదలైనవానికి శతృప్రత్యయము చేర్చి వింతరూపములను భావము కల్గించుట దీనిలోని ఒకవిశేషము. ప్రవేశించు అను నర్థమున ‘నివిశమాన’ అని (2-21) ప్రయో గించినాడు. ఆత్మనేపదిత్వమును పొందిన ‘విశ’ధాతువునకు వర్తమానార్థ ‘శానచ్’ప్రత్యయమును చేర్చినచో ‘నివిశమాన’ యగును. ఇట్టి రూపములు వ్యాకరణాంబుధిలోనికి ప్రవేశించినవారికే లభించగలవు.
యావకరసాన్వాదేశము (5-88) – లత్తుకకు అన్వాదేశము – పునరుక్తము – అని దీని యర్థము. వైయాకరణసంకేతమైన ఈ అన్వాదేశశబ్దము ‘కించిత్కార్యం విధాతుం ఉపాత్తస్య కార్యాంతర విధానాయ పునరుపాదాన మన్వాదేశః’ అని.
అష్టదిక్పతుల పత్నుల నామధేయముల తెల్పునప్పుడు మఘోని, అగ్నాయి, అంతకీ, తమీచరాబల, వరుణా, మారుత వధూ, ఐలబిలీ, గిరికన్యా – అని ప్రయోగించి తన వ్యాకరణపాండితిని నిరూపించుకొనెను.
ఇక యఙ్లుగంతధాతువులపై శానచ్ ప్రత్యయాంతముల గూర్చి అతిశయార్థద్యోతకములుగా వరీవృత్యమాన, జరీజృభ్య మాణ – ఇత్యాదిపదములతో వచనమును రచించి సుచంద్రవివాహసమయమున పాంచాలభూవిభుని మందిరప్రవేశత్వరగతిని తెల్పుట వీని ప్రాముఖ్యము.ఇట్లే తర్కసంగీతవిషయములు, తెలుగు వ్యాకరణపదవిశేషములు ఈగ్రంథమున విశేషముగా గలవు. ఓపికగా పఠించు పాఠ కునకు ఈవిషయము లవగతమగును.
వర్ణనలు
‘వర్ణనానిపుణః కవిః’ యనునది చంద్రికాపరిణయకర్తవిషయమున సార్థకము గాగలదు. ఒకప్రబంధమునందు ఏయే వర్ణన లుండవలెనో తెల్పిన లాక్షణికపద్ధతిని మాధవరాయలు అధికభాగము పాటించినట్లు ఆయన వర్ణనలే సాక్ష్యము. పూర్వకవుల పద్ధతులను సాకల్యముగా ఆకళింపు చేసికొనిన ఈయన ప్రతి చిన్నవిషయమును – చరాచరములను కూడా (జంతు, పర్వతో ద్యానాదుల) వర్ణించెను. మఱికొన్నిటిని అధికముగా చెప్పుటవలన కథాకథనమునకు కొరత ఏర్పడినది. ఉదాహరణము – పురవర్ణన మొత్తము 88 పద్యములలో గలదు. మొదటి ఆశ్వాసమున 171 గద్యపద్యములలో ఆవర్ణనయే అధికమై కథను కుంటు పరచినది. దీని తర్వాత విరహవర్ణన – ఇందులోనే మన్మథచంద్రమలయానిలాదులు – వీనికి 56 గద్యపద్యాలు. పరిణయవర్ణన 80 గద్యపద్యాలలో నున్నది. ఇవియేగాక దీనిలో ఇతరవర్ణనలు – వాని గద్యపద్యసంఖ్య యిట్లు గలదు.
నగర-19, ఋతు – 20, సూర్య – 15, శశి – 8, సరస్సు -2, వన -1, రతి -8, యాత్ర -22, యుద్ధము -45, రాజవర్ణన, పాలన – 28. వీనితో బాటు ఉద్యాన, పుష్పాపచయ, జలక్రీడ, ప్రదోష, నక్షత్ర, దేవవేశ్యా, స్వయంవర,వధూవర, క్రీడావేశ్మ, సురత వర్ణ నలు గలవు. అలంకారశాస్త్ర పారంగతత్వము గల మాధవరాయలు సూక్ష్మపరిశీలనతో ఈవర్ణనలు చేసినాడు.
అకళంకాంబుజపాళికాసుఖితభృంగాళీతనూకాంతిదం
భకళిందప్రభావానుషంగ శిఖిదామాతాండవాపాదనో
దక భంగోత్కర ఘర్షణక్రమ సముద్గచ్ఛత్పయోబిందు శీ
తకరీభూత పతంగ గంగ దనరుం దత్ప్రాంతదేశంబునన్. (1-108)
ఇది గంగానదీవర్ణన. కవి దీనియందు ఒక నూతనవిషయమును చెప్పదలచినాడు. అందుకే అభంగ గంగాతరంగిణి భంగ సం యుతయై ఏకధాటిగా ప్రవహించు విధానమున సుదీర్ఘసమాసమున బిందుపూర్వక ‘గ’కారముతో తెల్పి, ‘పతంగ’ ‘గంగ’ యని ముగించినాడు. దీనిలో తెల్లతామరలయందు సుప్తినందిన భ్రమరములు కళిందజాకాంతిని ఆపాదించుకున్నవి. ప్రాంత సంచారమయూరములను తన అలలచేత ఆడించుచున్న గంగ , అలల తుంపరులు ఉవ్వెత్తుగా నెగసి సూర్యుని కప్పివేయగా వీని తెల్లదనమువలన చంద్రభ్రాంతి భానునియందు కలిగినది.
సహజముగా నుండు తుమ్మెదలను, మయూరములను గంగాసంగమమువలన అవి యెట్లయినవో విశేషముగా తెల్పి, ఉపమభ్రాంత్యలంకారయుత మొనర్చినాడు. జలమునకు గల సహజశీతలత్వము సూర్యపరివ్యాప్తమై చల్లబరచినదని (చంద్రత్వభ్రాంతి) తద్గుణాలంకారమును చెప్పెను. వీనికితోడు పద్యమునగల అంత్యప్రాస – ఇవన్నియు గంగావర్ణనకు శోభా కరము లైనవి. దీనిలో ‘దామన్’ శబ్దమునకు డాప్రత్యయము వచ్చుటవలన ‘దామా’ (శిఖిదామా) అని యగును. ఈపద్ధతి తెలిసియే కవి ఈశబ్దమును ప్రయోగించి యుండును.
మాధవరాయలకు గల బహుగ్రంథపరిచయము వివిధవిషయవేదిత్వము దీనియందు అనేకసందర్భములలో ప్రసక్తమైనది. అట్టిదానికి ఒక ఉదాహరణ:
వెలయింపనేరఁ డుజ్జ్వల ‘చంద్రికా’రూఢి, రవి ‘ప్రభా’సంసక్తి ప్రబలుగాని
కనఁడు కావ్యాశయగౌరవం బగభేది, యురుకల్పతరులబ్ధి నొనరుఁ గాని
దఱియనోపఁడు పక్షధరవరోద్ధతి శేషుఁ, డసమలోచనయుక్తి మసలు గాని
ప్రతిఘటింపఁ గలంగుఁ బ్రాభాకరస్ఫూర్తి, కబ్జారి కౌముది నలరుఁ గాని
యనుచుఁ దత్సదినత్వ గవాధిపత్వ, కుండలిత్వ ద్విజేశత్వ గుంఫనములు
పరిహసింతు రెల్లప్పు డప్పురి నధీత, సకలసుగ్రంథతతు లగ్రజన్మపతులు. (1-91)
ఈపద్యము వింతయైన అర్థములు గలది. విశాలాపురియందలి ద్విజుల వర్ణన ఇందలి విషయము. వారెంత విద్వత్తు గలవారో తెల్పుట కవి యుద్దేశము. సూర్యాదులకన్న వీరియందు అధికగుణముల జెప్పి అతిశయోక్త్యలంకారమునేగాక శ్లేషోత్థాపిత వ్యతిరేకాలంకారము నుంచినాడు. పద్యమున రవి ‘ప్రభ’నే వెలయించును. ‘చంద్రికా’రూఢి యతనికి లేదు. ఇచట ‘చంద్రిక’, ‘ప్రభ’ యనునవి గ్రంథములు. కల్పవృక్షవంతుడైన యింద్రుడు శుక్రుని గమనించలేదు. కావ్యనామము శుక్రునకు గలదు. అర్థ శాస్త్రమే ఆఖండలునికి తెలియునుగాని ‘శుక్రనీతి’ తెలియదు. కావ్యమనగా రఘువంశాదు లనుకొనవచ్చును.
శేషుడు పక్షధరుని (గరుడుని) సమీపించడు. శివునకు (అసమలోచనుడు) శేషుడు ఆభరణము కావున శంభుసాన్నిధ్యమే కలదు. ఇచట ‘పక్షధర’శబ్దము పక్షధరీయమను తర్కగ్రంథమును, అసమలోచనమన ‘లోచన’మను శాస్త్రగ్రంథము (ధ్వన్యా లోకవ్యాఖ్యకు లోచనమని పేరు) తెల్పబడినది. ఇచట ఒక ముఖ్యవిషయమును గమనించవలెను. అభినవకాళిదాసైన వెల్లాల త్ర్యంబకశాస్త్రిగారు భాగవతచంపూరచన మొనర్పగా దానికి వెల్లాల అక్కయశాస్త్రిగారు రత్నావళీవ్యాఖ్యాకారు లైనారు. అక్యయశాస్త్రిగారికి పక్షధరీయశాస్త్రిగారని ప్రసిద్ధి. ఈయన మల్లినాథునివంటి వాడనని తెల్పుకొనెను. ఎల్లాజోస్యులవారికి పక్షధరీయశాస్త్రిగారు శిష్యుడు. ఈయనను గూర్చిన కథలుకూడా కొన్ని గలవు (మహబూబునగరం జిల్లా సర్వస్వమున వివరముగా ఈ విషయము లున్నవి). మాధవరాయలు ఈవిషయముల నిట్లు గ్రంథస్థము చేసెను.
చంద్రుడు ప్రభాకర(సూర్య)కాంతిని ప్రతిఘటింపజాలడు. కేవలము ‘కౌముది(వెన్నెల)’ మాత్రమే కలవాడు. ఇచట ప్రాభాకర మనగా కుమారిలభట్టు శిష్యుడైన ప్రభాకరమిశ్రుడు గురువుగారు జైమినీయ పూర్వమీమాంసకు వ్రాసిన వార్తికవ్యాఖ్యను పెక్కు విషయములలో భేదించి తాను స్థాపించిన మతానికి ప్రాభాకర మను పేరు పెట్టెను. కుమారిలభాట్టమునకు గురుమత మని ప్రసిద్ధి కలిగినట్లే ప్రభాకరుని మతమునకు శిష్యమతమని ప్రఖ్యాతి. ఇక ‘కౌముది’ యనగా సంస్కృతవ్యాకరణగ్రంథము.
ఇంతటి గొప్ప విద్వాంసులైన ఆపురి భూదేవులు ‘సదినత్వము’ను (అనగా సూర్యత్వము , పండితరాజత్వము) గవాధి పత్యము (అనగా స్వర్గాధిపత్యము, వాక్పతిత్వము) కుండలిత్వము (సర్పత్వము, సోమయాజిత్వము) ద్విజేశత్వము (ద్విజ రాజత్వము, బ్రాహ్మణోత్తమత) గలిగి సూర్య – సూర్యలోకము, కుండలత్వ – నాగలోకము, ద్విజేశత్వ – చంద్రలోకము – దేహాంతమున జీవు లధివసించు ఈలోకములను తిరస్కరింతురు. అనగా వారు కేవలము ముక్తిని మాత్రమే కోరుదురు.
ఈపద్యము ఇంకెంతయో విశేషార్థము గలది. ప్రథమపాదమున ‘చంద్రిక’ ఒక వ్యాఖ్య కావచ్చునా? లేక ఇతని ప్రస్తుత చంద్రికాపరిణయమా? ఎందుకనగా ‘రవి’ – సూర్యుడు. వసువన్నను సూర్యుడే. రవిశబ్దముచే అర్థాంతరమున ‘వసుచరిత్ర’ చెప్పబడినదా? యని సంశయము. రవిప్రభ – సూర్య(వసు)కాంతి కావచ్చును.
వ్యాఖ్యానమును పరిశీలించవలసిన ఈపద్యమునందు మాధవరాయలు తననాటి (ఆస్థాన)పండితమండలిని తెల్పినాడేమో!
2-62లోని మన్మథవర్ణన సందర్భమునందు గల పద్యములలో ‘మనురాజజాతజపవైఖరి’ – ఇది అష్టాక్షరీమంత్రసూచనము. దీనికి మంత్రరాజమని పేరు. వ్యాఖ్యాతలు ఎట్లూహించిరో కాని ‘ఇది మనుమంత్రరాజ జప వైఖరి’ అని యుండవలెను. అప్పుడు అర్థము కుదురును. ‘మనురాజజాతజప’ అనునప్పుడు అర్థమును ఊహించి వ్రాయవలసినదే!
మాధవరాయకవిచంద్రుని వర్ణనలు గ్రంథపఠనమువలన ఆనందము కల్గించును. ఎన్ని పద్యములను పేర్కొన్నను తక్కు వయే. ఈగ్రంథము వర్ణనలతో శ్లేషలతో నిండి యున్నందున బహుపండితజనాదరపాత్ర మైనది.
శ్లేషవైభవము
‘శ్లేషః పుష్ణాతి సౌభాగ్యం’ అను దానిని అక్షరశః అనుసరించి చూపిన ఈప్రబంధకర్త శబ్దాధికారము అద్భుతమైన దనుటలో సంశయము లేదు. రాఘవపాండవీయకర్త ‘రెండర్థంబుల పద్య మొక్కటియు నిర్మింపంగ శక్యంబు గాకుండు’ ననెను. ఒక విధముగా ద్వ్యర్థి-శ్లేషలు రెంటికి ఈవాక్యము వర్తించును. ఒకే పదమునకు వివిధార్థములను చెప్పుట (ఒకటిని మించి) శ్లేష. దీనిని లాక్షణికులు ప్రకృత, అప్రకృత, ప్రకృతాప్రకృత, సభంగ, అభంగ శబ్దప్రధాన సందర్భములుగా తెల్పిరి. అందుకే శ్లేషోఽనేకార్థ వాచనమ్. మాధవరాయలు అన్నిరకములైన శ్లేషలను ప్రయోగించి తనది చంద్రికాశ్లేషరచన యనిపించెను. వీనిబలమే ఈగ్రంథ మును వసుచరిత్రతో పోల్చుటకు ఒక ముఖ్యకారణము. అంతేగాక చంద్రికాపరిణయమును నిల్పినది శ్లేష, వర్ణనలు మాత్రమే!
తరుణిమొగంబె తానని సుధానిధి విష్ణుపదమ్ము ముట్టి దు
ష్కరకరజాతపాండిమ విగర్హితుఁడై యశుచిం గృశింపఁ, బం
కరుహము తన్ముఖోపమము గానని తా హరిపాదమంటి యిం
దిర దనుఁజేరఁ గీర్తిఁ గని దీపితజీవన మయ్యె నెంతయున్. (3-27)
ముఖమును చంద్రునితో బోల్చి – చంద్రకాంతిని మించిన ముఖవైభవము కల్గి యున్నట్లు కావ్యనాయికను వర్ణించుట కవి సమయము. ఈపద్యమున చంద్రికాముఖవర్ణన చేయబడినది. చంద్రుడు, కమలము – ఈరెండును ఆమె ముఖవైభవసామ్య మునకు పోటీపడినవి. దీనియందు చంద్రుడు అబద్ధ మాడి ఆమె ముఖతౌల్యమును పొంద యత్నించి హరిపాదము లంటినను ఆయన దుష్కరజాతపాండిమవిగర్హితు డైనాడు (చికిత్సకు సైతము లొంగని చేతియందలి పాండురోగముచే దూషితుడైనాడు – విష్ణుపదము, కర, పాండిమ పదశ్లేష). కమలము మాత్రము సత్యమునే వచించినందున ఇందిర తనను చేర్చుకొనగా దీపితజీవన యైనది.
చంద్రవిషయమున విష్ణుపదము. పద్మవిషయమున అదే పదమునకు ‘హరిపాదము’ అనెను. కమలము లక్ష్మీవాసస్థానము. ఆమెతో ‘హరి’యున్నందున హరిపాదము నంటిన దని కమలమునకు చెప్పి ‘దీపితజీవన’ యైన దనినాడు. ‘దీప్తమైన బ్రతుకు’ అనియే గాక జీవనము=నీరు, దీపితము=వృద్ధి, నీటియందు మాత్రమే కమల మభివృద్ధినందునను సహజార్థము. దీనియందు విష్ణుపద, కరజాత, విగర్హిత, అశుచి, హరిపాద, దీపిత, జీవన – ఈ పదములు శ్లిష్టములైనందున పద్యమున కొక శోభ చేకూరి నది.
సత్యము పలుకువాడు మేలును బొందును. అసత్యమునకై ప్రమాణము చేయువాడు పాపరోగబాధితు డగునని (దుష్కరకర జాతపాండిమవిగర్హితత్వము) వస్తుకృత వస్తుధ్వనియుతముగా నిట్లు తెల్పినాడు. చంద్రికావదనసామ్యమునకు చంద్రకమల ములు సాటిరావని కవి యభిప్రాయము. వసుచరిత్రలో
‘వదనవనజహృతాంశుసర్వస్వుఁ డగుచుఁ,
గుందు నిందుని దరహాసకందళమున
మనుపుమని ….’ (2-34)
అను పద్యమున పాదనఖవర్ణన చేయుచు చంద్రుడు గిరికావదనసామ్య మందక కృశించినాడని తెల్పినాడు. దీనిని మించినది మాధవరాయల శ్లేషచమత్కృతి.
అనిశంబున్ బుధవర్ణకల్పతరు దీవ్యద్వాసనాలబ్ధిఁ జే
కొని యద్వైతరుచిం గరంబు మను నీక్షోణీస్థలాధీశవ
ర్యుని కీర్తిప్రకరంబు మించ సకి! యోహో పూర్వపక్షావలం
బనతన్ రాజిలునట్టి ధ్వాంత పరధామం బెచ్చునే యెచ్చటన్? (5-70)
చంద్రికాస్వయంవరసందర్భసమాగత వివిధదేశరాజవర్ణనాసందర్భమున ప్లక్షద్వీపాధిపతివర్ణన గల దీపద్యము. సామా న్యార్థములో ప్లక్షద్వీపాధిపతి కీర్తిసమూహము కల్పతరుకాంతికి సమానమైన కాంతిగలదై హెచ్చగా, శుక్లపక్షక్షపాకరతేజము ఎట్లు హెచ్చును? అని చంద్రాతీత సితకాంతి రాజున కాపాదితము. విశేషార్థమున అద్వైతమతస్థులైన మాధ్వుల గూర్చి – వీరు వేదాంతకల్పతరువను గ్రంథపఠన మొనర్తురు. ఇవి అద్వైతసిద్ధాంతపరులగు బుధవర్గప్రశంసితము. ఏతద్గ్రంథమననాదులచే నుద్బుద్ధమైన వాసనాశక్తివలన బ్రహ్మాత్మైక్యానుసంధానవిజృంభమాణ విద్వద్వరుడని – మాధ్వసిద్ధాంతము.
శంకర,రామానుజ,మాధ్వసిద్ధాంతములు మూడు గలవు. ఇవియె మతత్రయములు. ఈపద్యమున మాధ్వులు ధ్వాంతపద వాచ్యులు. అనగా ‘ ధ్వః అన్తే యస్య సః ధ్వాన్తః’ – ‘ధ్వ’ యను నక్షరము చివరగల మాధ్వ – అని వీరు ద్వైతులు. పద్యము నందు పూర్వపక్షము అనగా అపసిద్ధాంతము – శుక్లపక్షము, ధ్వాంత=చీకటి. బ్రహ్మాత్మైక్యానుసంధాననిష్ణాతుడైన విద్వాంసు డతిశయించి యుండగా పూర్వపక్షమతావలంబనమైన మాధ్వసిద్ధాంతము హెచ్చజాలదని – ఈ విశేషార్థము. ఈపద్యము నందు కల్పతరు- వాసన -అద్వైత -పూర్వపక్ష -ధ్వాంత శబ్దములు విశిష్టశ్లేషార్థసంయుతములు. దీనియందు కవియొక్క శబ్ద లక్షణవేతృత, సిద్ధాంతత్రయసమాలోకనము తెలియును. సామాన్యపదములచే అసామాన్యార్థప్రతిపాదన ఏతత్పద్యవిశేషము.
చంద్రికాపరిణయమున వివిధశ్లేషలు విశేషముగా గలవు. వ్యాఖ్యాయుతమైన ఈగ్రంథపఠనము తద్విశేషముల వెల్లడి చేసినది. పాఠకులు ఓపికతో వానిని గ్రహించగలరు. పద,పదార్థ అక్షరములను భంగాభంగపద్ధతిని అర్థవంతముగా నిరూపించిన మాధవరాయరాజకవి శేముషీవైభవము ఒహో! యనిపింపకపోదు. అందుకే కాబోలు ‘మధుశ్రీకరవాక్పటిమ గల’ యక్షశేఖరు నితో
ధీరవరేణ్య నీవిపుడు తెల్పిన నిర్మల చంద్రికోదయో
దారసుధారసంబు మది కప్రమితప్రమదంబు నించి యెం
తే రచియించె (3-36)
ననిపించినాడు. ఇంతవరకు చంద్రికాపరిణయప్రబంధరచన యర్థభాగమైనది. శ్రీకరవాక్పటిమతో నిర్మలచంద్రికావృత్తాంతము ఉదారసుధా‘రస’యుక్తమై మనస్సునకు మోదాపాదియైనదని కవి భావన – అని భావింతము.
రాజాస్థానములయందు దాసీజన ముండుట సహజము. వీరికి జన్మతః గల పేరును తొలగించి మరియొక నామ ముంచుట వెలమదొరలు, దేశముఖుల యిండ్లలోను ఒకపద్ధతి. రాచరికవ్యవస్థలో రెడ్లకన్న వెలమవారియందే దాసీజన మధికము (తెలం గాణమున వీరిని ఆడబాప లందురు). మాధవరాయలు 4-75 పద్యమున కొందరి పేర్లను తెల్పెను. ఇవన్నియు శ్లేషార్థముగా నున్నవి. వాసంతి, సారంగి, శశిలేఖ, చక్రాంగి, హరిణి – అని. జలక్రీడావసరమున వీరిని పేర్కొనెను. జలమునకు, ఈనామ ధేయములకు సమీపసంబంధము. ఈపేర్లలో మఱొకవిషయ మేమన రాజు, రాణి తత్పరిజనమే గాక, వీరి బంధువులు, హితులు ఎవ్వరైనను ఆడబాపను పిలిచినప్పుడు ఆపేరు నీచార్థముగానో, చిన్నతనముగానో ఉండరాదు. పూర్తిపేరును ఉచ్చరింపవలసి నదే! ఇప్పటికి ఈపద్ధతి తెలంగాణమున – అందులో కరీంనగర్, వరంగల్లు, నల్లగొండ, మహబూబునగరాలలోని వెలమవారి యిండ్లలో గలదు. వనమాలి, మోహిని, మణి, పద్మ మొదలగున వీ పేర్లలో కొన్ని. వీనిలో అధికబాగము విష్ణుసంబంధనామములే యగుట సామాన్యము. మాధవరాయలు ‘లోకజ్ఞుడు’ – సాంఘికచిత్రణగా దాసీజనవర్గమును పేర్కొనినాడు.
చంద్రికాపరిణయమందు నానావిధములైన శ్లేషలు అర్థ,శబ్దచిత్రములు – వివిధములైన వర్ణనలేగాక బహుశాస్త్రసంబంధవిషయ ములును ప్రవచితము లైనవి. సంస్కృతాంధ్రపదప్రయోగమేగాక అచ్చతెనుగుపదములు, మాండలికములు దీనియందున్నను ఎచ్చటగూడా తన సమకాలమున రాజవ్యవహారభాష యైన ఉర్దూ, ఫారసీపదముల నీయన ప్రయోగింపక పోవుట విచిత్ర మని పించినను – స్వస్థానస్వభాషాభిమానము లీపని చేయించలేదేమో!
ఛందస్సు
ఒక్క మను,వసుచరిత్రముల అనుకరణలేగాక శ్రీనాథ, భాస్కర,సోమనాథుల ప్రతిచ్ఛాయాకవితలు కూడా చంద్రికాపరిణ యమున గలవు. ఇవి మాధవరాయల బహువిధగ్రంథపరిశీలనానైపుణి, అనేక శాస్త్ర కావ్య పురాణ విషయ పరిజ్ఞాతృత్వముల వెల్లడి చేయునే కాని ప్రతిభాశున్యుడై అనుకరించినట్టివి కావు. ఛందస్సువిషయమున నీకవి మిక్కిలి జాగరూకత వహించి సంద ర్భోచితముగా ఆయా ఛందఃప్రయోగ మొనర్చినను కొన్నిస్థలములలో ఛందోభంగము ప్రాప్తించినది. ఇవి కవికృతములో, ముద్రణసమయమున పరిష్కర్తల కనుచూపునుండి తప్పినవో? తెలియదు. వానిలో 2.58 మూడవపాదము: ‘హంసాఖ్యఁ దగు కైరవారిపితృప్రసూవి సంపర్కగతిఁ గూర్చి యొప్పు చలము ఇందులో యతిభంగము. ఇచట ‘ఒప్పు చలము’ అని కవి ప్రయోగించి యుండడు. ‘చలము నొప్పు’ అనిన యతి కుదురును. అర్థభంగము లేదు. అట్లే 3.73 మొదటిపాదము: ‘ఇట్టి సకలానఘగుణోత్కరాబ్ధి యైన’ లోను యతిభంగము. దీనిని ‘అట్టి’ యని ప్రారంభమున సవరించిన యతి కుదురును. ఈగ్రంథమున నొక సంస్కృతదండకము గలదు. దీనికి సంస్కృతములోనే వ్యాఖ్యారచన మొనర్చుట ఒకవిశేషము. ‘అశేషగీర్వాణ నిత్యోత్సవాయై నమో నిత్యపూతామితప్రాభవాయై నమో హస్తసంబద్ధనీరేశయాయై నమో దేవతారూప’ సాహిత్య ఎకాడమీవారి ప్రతిలో క్రీగీతగల భాగము లేదు. 4వ పాదారంభములో ‘సతత మగజే త్వమేవాత్మమాతా’ అని యుండి యగణముతో సాగిన యీపాదమున న,స గణముల తరువాత హగణమునందు ప్రథమాక్షరలోపము జరిగినది. దీనిని ‘సతతమగజాతే త్వమేవాత్మ’ అనిన కుదురునని మందడి వెంకటకృష్ణకవిగారు తమవద్దగల ప్రతిలో నిట్లు దిద్దియుంచుకున్నారని ఆధార పూర్వకముగా చంద్రికాపరిణయ పరిశోధనసిద్ధాంతవ్యాసకర్త తెల్పినది సమంజసముగా గలదు (పే. 271).
చంద్రికాప్రభావము – పరిశోధన
చంద్రికాపరిణయము ముద్రణమైన తరువాత దానిని గూర్చి ఒకటి రెండు వ్యాసములు, విమర్శలు వచ్చినవే కాని విస్తృత ప్రచారము జరుగలేదు. జటప్రోలువారు వ్యాఖ్యాయుతముగా ముద్రణ మొనరింపజేసిన యీప్రతులు కూడా ముద్రణమై తెర చాటున దాగియున్న బిబ్బీలవలె కొల్లాపురం కోటలో పడినవి. కొందరు కవులు, పండితులు పరిచయమున్నవారు రాజాదరణ పురస్సరముగా వీనిని పొందినారు. జటప్రోలువారు ప్రచురించిన యితరగ్రంథముల స్థితికూడా యిట్లే కలదు.
1904, 1928 రెండు పర్యాయములు ముద్రణమైన యీవ్యాఖ్యాగ్రంథము సాహితీలోకమున కందుబాటులో లేనందున కేశవ పంతులవారి పీఠికతో ఆంధ్రప్రదేశ సాహిత్య ఎకాడమీవారు 1982లో మూలమును మాత్రమే ముద్రించి పాఠకుల కందించగల్గి నారు.
వసుచరిత్రవ్యాఖ్యయందు చంద్రికాపరిణయపద్యము లుదాహృతము లైనవి. కాని చంద్రికాపరిణయమువలెనే దీని వ్యాఖ్య యందు ఎచ్చటను ‘వసు’ప్రసక్తి లేదు.
నాగార్జునవిశ్వవిద్యాలయమున శ్రీ శంకరరెడ్డిగారు చంద్రికాపరిణయము-సమగ్రపరిశీలన అను సిద్ధాంతవ్యాసమును సమ ర్పించి పి.హెచ్.డి పట్టా (1990) పొందినారు. ఉస్మానియా విశ్వవిద్యాలయమున వెలుదండ సత్యనారాయణగారు చంద్రికా పరిణయము-సమగ్రపరిశీలన అను సిద్ధాంతవ్యాసమును సమర్పించి 1991లో పి.హెచ్.డి పట్టము నందినారు. తెలుగు విశ్వ విద్యాలయ చరిత్రవిభాగం ద్వారా భట్టరు శ్రీనివాసాచార్యులవారు జటప్రోలు సంస్థానము – పరిశీలన వ్యాసమునకు ఎం.ఫిల్. పట్టాను పొందినారు. దీనిలో చంద్రికాపరిణయప్రసక్తి గలదు.
వెలుదండ సత్యనారాయణగారి పరిశోధన విస్తృతమై చంద్రికాపరిణయ ప్రత్యక్షరపరిశీలన మొనర్చినది. ఏవిషయమును కూడా వీరు విస్మరించ లేదు. ఇది చంద్రికాపరిణయమునకు ‘భాష్యము’వంటిది. మూలగ్రంథవిశేషముల నెరుగదలచినవారు ఈసిద్ధాంతవ్యాసమును చదువుట అవసరము.
కొల్లాపురాస్థానము రోజులలోనే శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రిగారు చంద్రికాపరిణయమును నాటకముగా వ్రాసి 1931లో ముద్రణ మొనరించినారు. దీనికి రాజా వెంకట లక్ష్మారావుగారు ఆర్థికముగా తోడ్పడినను వీరి మరణానంతరమే పుస్తకము వెలువడినది. రాజావారి దత్తపుత్రులైన జగన్నాథరావుగారి పట్టాభిషేకసమయమున రాణీ రత్నమాంబాగారి సమక్షమందు కుమార రాజా వారికి ఈకృతి సమర్పణ మొనర్చినారు. ఇది సప్తాంకపరిమితము.
వెంకటలక్ష్మారావు (1865-1928) సమకాలములో నున్న వెల్లూరి నరసింగకవి ‘శరదాగమ’వ్యాఖ్యను చూచి చంద్రికాపరి ణయ ప్రభావమున ‘రాచకన్యకాపరిణయ’ప్రబంధమును రచించెను. దీనియందు చంద్రికాపరిణయప్రభావము అధికముగా గలదు. రాచకన్యకాపరిణయమును గూర్చి పరిశోధన మొనర్చి ఉస్మానియానుండి తలముడిపి బాలసుబ్బయ్య పి.హెచ్.డి. పొంది, సిద్ధాంతవ్యాసమును 1989లో ముద్రణ చేయించినారు.
సాహిత్యచరిత్రలయందు చంద్రికాపరిణయమును గూర్చి పరిచయము చేసినారు. కాని సుప్రసిద్ధ వైయాకరణులు , పరిశోధ కులు వజ్ఝల చినసీతారామస్వామిశాస్త్రిగారు తమ ‘వసుచరిత్రవిమర్శనము’నందు చంద్రికాపరిణయప్రసక్తియే చేయకపోవుట విచారకరము. వారు ‘పిల్ల వసుచరిత్రల’ పేర్కొని బేరీజు వేసినా దీనిని విస్మరించిరి. వీరి గ్రంథము వావిళ్ళసంస్థ ద్వారా వరుసగా 1915, 1922, 1965 సంవత్సరాలలో ముద్రితమైనది.
సుప్రసిద్ధ ఛందోగ్రంథమైన అప్పకవీయమునందు చంద్రికాపరిణయములోనివని 3 పద్యము లుదాహృతము లైనవి (2-165,3-129,3-183). ఈపద్యములు చంద్రికాపరిణయమందు లేవు. మల్లన ‘చంద్రభానుచరిత్ర’, బాలసరస్వతి ‘చంద్రికాపరి ణయ’గ్రంథములలో ఈపద్యము లుండవచ్చు. కాలక్రమరీత్యా చంద్రికాపరిణయములోని పద్యములను అప్పకవి పేర్కొనుట కుదరదు.
ఈవ్యాఖ్యాగ్రంథమున 1-140 పద్యము ‘ఉత్సాహ’ అని యున్నది. కాని యిది సుగంధివృత్తము. వ్యాఖ్యాకారులు గూడ దీనిని గమనించలేదు. ‘శరదాగమ’వ్యాఖ్య చంద్రికాపరిణయమునకు జీవము పోసి, వికసింపజేసినది. చంద్రిక యనగా వెన్నెల. ఇది శరత్కాలము (శరదాగమము) చే మఱింత ఆహ్లాదకరమైనదని వ్యాఖ్యాకారులు ఈపేరును పెట్టినట్లున్నారు.
చంద్రికాపరిణయకథను నైమిశారణ్యమున సూతుడు శౌనకాదిమహర్షులకు చెప్పినట్లు మాధవరాయకవి తెల్పెను. ఈ కథకు, ఈమహర్షులకు సంబంధము లేకున్నను కవి యిట్లు చెప్పుట కేవలము జానపదకథాపద్ధతి. మహర్షిప్రోక్త మనుటవలన కథకు ప్రాచీనతాప్రాముఖ్యము లేర్పడునని కవుల భావన. దీనినే మాధవరాయలు పాటించెను.
వ్యాఖ్యానము
‘శరదాగమవ్యాఖ్య’తో చంద్రికాపరిణయము 1904,1928లో రెండుపర్యాయములు ముద్రణ మైనది. కేశవపంతులవారు వ్రాసిన ఎకాడమీవారి ప్రచురణ పీఠికలో 1928 సంవత్సర మనియే తెల్పిరి. వారు 1904 ప్రతిని పేర్కొనకపోవుట వింతగా నున్నది. ప్రథమముద్రణ మదరాసు ఆనందప్రెస్‌లోను, రెండవ ముద్రణ లలితాప్రెస్ (రాజమండ్రి)లోను జరిగినది. రాజమండ్రి ముద్రాశాల శ్రీపాదవారిది. కొల్లాపురం రాజా లక్ష్మారావుగారి కోరిక మేరకు శ్రీపాదవారు ఈవ్యాఖ్యాగ్రంథమును ముద్రణ చేయించినారు. రెండు ముద్రణల టైపు ఒకేవిధముగా గలదు. మొదటి ముద్రణప్రతి చివర ‘శుద్ధాశుద్ధపత్రము’ను చేర్చినారు. రెండవదానిలో ఇది లేదు. కాని అప్పటి ముద్రాదోషములు సవరింపబడినవి. మఱికొన్ని క్రొత్తతప్పులు చేరినవి. కందుకూరివారు, వేదంవారు పుస్తక మును గూర్చి తెల్పిన అభిప్రాయములు రెండవముద్రణలో వెనుకముందు పడినవి. పద్యముల క్రమసంఖ్య (అక్కడక్కడ) రెంటి లోను తప్పినది. 1-91 నెం. పద్యము ప్రథమప్రతిలో పూర్తిగా లేదు. ద్వితీయలో సరిగా నున్నది. ఇట్లే రెండు ముద్రణలయందు చిన్న మార్పులు గలవు. రెండు గ్రంథములలోను వ్యాఖ్యాకారుల పరిచయము లేదు. శ్రీపాదవారి చంద్రికాపరిణయనాటకపీఠి కలో (15 పుట) రాజావారి అనుమతివలన నేను చంద్రికాపరిణయమును వ్యాఖ్యాయుతముగా ముద్రణ మొనర్చి (సరిచూచి) శ్రీధరకృష్ణశాస్త్రి (వెల్లాలవారి జామాత)గారిద్వారా పంపినానని వ్రాసిరి. ఇది 1931 సంవత్సరం . నాటికే రెండుపర్యాయములు ముద్రణమైన యీ గ్రంథము తృతీయముద్రణము కూడా అయినట్లున్నది. కాని ఏ గ్రంథములోను ఇది ఎన్నవ ముద్రణయో వారు తెల్పనే లేదు. నావద్ద 1904, 1928 సంవత్సరముల ముద్రణప్రతులు గలవు. ప్రస్తుతము తెలుగువిశ్వవిద్యాలయమువారు వేసినది 1928 ముద్రణప్రతి. ఇక వీని వ్యాఖ్యాతల గూర్చి తెలిసికొందము.
వ్యాఖ్యాతలు
చంద్రికాపరిణయవ్యాఖ్యాత లైన వెల్లాల సదాశివశాస్త్రిగారు, అవధానం శేషశాస్త్రిగారు సంస్కృతాంధ్రపాండితీప్రతిభాపరిణద్ధ మూర్తులు. వీరి శరదాగమవ్యాఖ్య చంద్రికాపరిణయమున కొక భాష్యము.
వెల్లాలవారి మొదటి నివాసము కడప జిల్లాలోని ‘వెల్లాల’ యను గ్రామము. 350 సంవత్సరములనాడు వీరు అలంపురసంస్థాన మునకు విచ్చేసి అగ్రహారాదులు సంపాదించినారు. తరువాత అయ్యవారిపల్లెకు చేరుకొని స్థిరపడిన వీరిది పండితకుటుంబము. శంకరజోస్యులు, వెంకటసుబ్బమ్మల చతుర్థపుత్రుడైన శాస్త్రిగారు అగ్రజులైన రాఘవశాస్త్రిగారివద్ద నాటకాంతసాహిత్యమును, అలంపురం మల్హరిశాస్త్రిగారి సాన్నిధ్యమున వ్యాకరణశాస్త్రమును, మేనమామగారైన అక్షింతల సీతారామశాస్త్రిగారివద్ద తర్క శాస్త్రమును, ప్యాపలి కొండమాచార్యులవారిదగ్గర శబ్దరత్నము నభ్యసించి, అవధానంవారితో కలిసి కాశీ కేగి మహామహోపా ధ్యాయ మానవల్లి గంగాధరశాస్త్రిచరణుల సన్నిధిలో అలంకారధర్మశాస్త్రముల నధ్యయన మొనర్చిరి. దండిభట్ల విశ్వనాథశాస్త్రి గారివద్ద భాష్యాంతవ్యాకరణాధ్యయనమును పూర్తి చేయుటయేగాక వారికి పరిభాషేందుచంద్రికా రచనమున తోడ్పడిన మహా మనీషి. కాశీవిద్యాభ్యాసానంతరము స్వదేశమునకు తిరిగి వచ్చి జటప్రోలు రాజావారి ఆస్థానపండితు లైనారు.
బాల్యముననే వీరు కన్యకాంబాచంపువును రచించి సహవిద్యార్థుల కాశ్చర్యమును కల్గించిరి. శాస్త్రిగారి కృతులలో ‘ఉద్వాహా భాస నిరాసము’, ‘పరివ్రాజ్యచంద్రిక’, ‘స్త్రీపునర్వివాహనిర్ణయము’, ‘కంఠీరవవిజయము’, ‘రామానుజగోపాలవిజయము’, ‘నామిరెడ్డి చరిత్రము’ అనువానినేగాక వెలుగోటి ప్రభువుల కోర్కెపై కావ్యాలంకారసంగ్రహమున నాయకరసప్రకరణములకు వ్యాఖ్య, వెలుగోటివారి వంశచరిత్రములను వ్రాసిరి. ఇచ్చట జటప్రోలువారిని గూర్చి సురభివారి వంశచరిత్రను, మల్లాదివారి దశరూపకానువాదమును గురించి దశరూపకవిమర్శనమును, చిలుకూరివారి చరిత్రపై వీరభద్రీయఖండనములను వ్రాసి, ధర్మ శాస్త్ర నిరూపణముగా ‘త్రిరాత్రదశరాత్రాశౌచనిర్ణయము’, ‘ధర్మశ్రాద్ధనిర్ణయము’ అనునట్టి రచనల నొనర్చిరి.
శాస్త్రిగారు కేవలము జటప్రోలు పండితులుగనే గాక వెంకటగిరి, బొబ్బిలి సంస్థానాధిపతులచే సత్కృతు లందినవారు. జట ప్రోలు రాజావారికి సన్నిహితులై ప్రత్యేకసన్మానములను, పారితోషికములనే గాక కొన్నివందల యెకరముల భూమిని, స్వగ్రా మమున నివాసగృహములను దానముగా పొందినారు.
తమ పూర్వులైన మాధవరాయలు రచించిన చంద్రికాపరిణయమునకు సురభి వెంకటలక్ష్మారావు బహద్దరువారు విపుల వ్యాఖ్య వ్రాయుమని శ్రీశాస్త్రిగారిని కోరినారు. వీరు తమ మేనల్లుడైన అవధానం శేషశాస్త్రితో కలిసి శరదాగమమను పేర నొక విపులమైన వ్యాఖ్యను వ్రాయగా దీనిని రాజావారు క్రీ.శ. 1904లోను, 1928 సంవత్సరములోను రెండు పర్యాయములు అంద ముగా ముద్రణ మొనరించి ఎందరో పండితుల కుచితముగా సమర్పించుకొనినారు.
వెల్లాలవారు చంద్రికాపరిణయమునకు వ్రాసిన వ్యాఖ్య ఎందరో పండితుల ప్రశంసల పొందినది. దీనిని సహింపలేని కొందరు వ్యాఖ్యావిషయమునకు విమర్శల చేసినారు. ఆనాటి శశిలేఖ పత్రికలో సముద్రాల వెంకటాచలపతిగారు ఈవివాదమును ఆరం భించిరి. ప్రాచ్యలిఖితగ్రంథభాండాగారము (మద్రాసు) నందు ‘కౌముది’ అను వ్యాఖ్య యొకటి చంద్రికాపరిణయమునకు గలదని ఆవ్యాఖ్యకు ప్రతిబింబము ‘శరదాగమ’మని శేషాద్రిరమణకవులు గూడ విమర్శించిరట. శాస్త్రిగారి స్నేహితులు – రాచకన్యకా పరిణయకర్త ఎల్లూరి నరసింగకవి కూడా ఈవ్యాఖ్యా విషయమై రాజాగారికి చిత్తక్షోభము కల్గునట్లు చెప్పినారట. వీని యన్ని టికి ప్రత్యుత్తరముగా వెల్లాలవారు మీరో ఎవ్వరైనను దీనికి మఱియొక వ్యాఖ్య వ్రాసి నాకు వినిపించిన చాలునని తెల్పి, ‘చంద్రికా పరిణయవ్యాఖ్యాద్వయవిమర్శనము’ అను పేర 34 పేజీల గ్రంథమును ముద్రణ చేయించి అందరికి పంచి పెట్టినారు. వ్యాఖ్యా విషయమును అధిక్షేపించిన సముద్రాలవారికి శాస్త్రిగారు మద్రాసు న్యాయస్థానముద్వారా నోటీసుకూడా ఇప్పించినారట.
ఈవిధమైన సాహితీరణరంగమున వెల్లాలవారు కాలము గడిపి, క్రోధన పుష్యమి విదియ శుక్రవారము 8-2-1925 తేదీన శివై క్యము చెందినారు. (ఈవిషయము శాస్త్రిగారి పుత్రులు శివరామశాస్త్రిగారు 29-4-1978 తేదీనాడు వ్రాసిన లేఖద్వారా తెల్పినారు.)
శాస్త్రిగారికి మేనల్లుడు, వయస్సులో వీరికన్న 2సం. పెద్దవారైన అవధానం శేషశాస్త్రిగారు బాల్యమునుండి వీరి గృహములోనే యున్నారు. విద్యాభ్యాసము వీరితో పాటే కొనసాగినది. అవధానంవారి వివాహము కూడా వెల్లాలవారే ఏర్పాటు చేయించి నారు. జటప్రోలు సంస్థానప్రవేశమునకు కూడా శాస్త్రిగారి చొరవయే పని చేసినది. ఏకసంథాగ్రాహిత్వము, గొప్ప పాండిత్యము గల అవధానంవారు చంద్రికాపరిణయ వ్యాఖ్యాకారులలో నొకరగుట విశేషము. వెల్లాలవారి ‘స్త్రీధర్మదీపిక’, ‘అచ్యుతస్వామి చరిత్ర’, ‘మూర్తి త్రయాభేదవిచారము’, ‘ఆఖ్యాతచింతామణి’వంటి గ్రంథరచనలో అవధానంవారి తోడ్పాటు గలదు. శేషయ్య లక్ష్మీనరసమ్మల పుత్రులైన అవధానంవారు నలసంవత్సర ఆషాఢ అమావాస్య (1917)నాడు తనువు చాలించిరి.
వెల్లాలవారు, అవధానమువారు బాల్యాత్ క్షీరనీరన్యాయముగా కలిసి యున్నారు. కవితారచనయందే గాక, సంస్థాన విషయములు, కవిపండితులతో జరుగు సాహిత్యచర్చలు మొదలైన వానియందును వీరిది అభేదపద్ధతి.
తెలకపల్లి రామచంద్రశాస్త్రిగారికి, వెల్లాలవారికి ఏదో విషయమున స్పర్థ ఏర్పడినది. తత్ఫలితము వీరు పరస్పరము ఒకరి కొకరు అష్టకములను (నిందాపూర్వకముగా) వ్రాసి ముద్రించిరి. తెల్కపల్లెవారు ‘సదాశివాష్టకమును’ వ్రాయగా, దీనికి జవాబు వెల్లాలవారి ‘రామచంద్రాష్టకము’. ఈవాదములోను కవితాస్పర్థయే ముఖ్యము. వెల్లాలవారి యల్లుడు శ్రీధరకృష్ణశాస్త్రిగారు (1860-1930) సంస్థానమున ప్రసిద్ధులు (మహబూబునగరజిల్లా సర్వస్వమున వీటినిగూర్చి కలదు).
కృతస్మృతి
ఎప్పుడో ముద్రణమై, ఇదానీంతనకాలమున అలభ్యముగా నున్న ప్రాచీనగ్రంథములను లభించినంతవరకు వ్యాఖ్యలతోను, లేని వానికి వ్యాఖ్యల వ్రాయించి ముద్రణ మొనర్చి సాహిత్యలోకమున కందించవలె ననునది తెలుగు విశ్వవిద్యాలయమువారి ప్రణాళిక. ఈపరంపరలోనే వెలుగు చూచుచున్నది చంద్రికాపరిణయము.
వసుచరిత్రకు సాటిరాగల ఈప్రబంధమునకు బహువిధశాస్త్ర-గ్రంథ పరిశీలనాదక్షులైన మహాపండితులు వెల్లాలవారు, అవ ధానం వారు ప్రతిభానికషోపలమైన ‘శరదాగమ’వ్యాఖ్యారచన మొనర్చిరి. ఇది విస్తృతవ్యాఖ్య. ఈశతాబ్ద ప్రారంభదశకమున ప్రథమముద్రణమై శతాబ్దపు చివరివర్షములలో మరల ‘శరదాగమచంద్రిక’ సాహితీలోకమున వ్యాపించుచున్నందులకు నేనే కాదు ఎందరో సాహిత్యాభిమానులు మోదమందుదురు.
ఈ ఉద్గ్రంథమునకు నేను కూర్చిన ‘సమాలోకనము’ శరచ్చంద్రికను చూపుటకై సిద్ధము చేసిన కరదీపిక మాత్రమే. తెల్ప వలసిన విషయములు ఇంకా ఎన్నియో కలవు. విస్తృతి కారణమున మిక్కిలి సంక్షేపముగా కొన్నిటిని తెల్ప యత్నించినాను. నా యీప్రయత్నమునకు సహృదయులే ప్రమాణము. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయమువారు వ్యాఖ్యాయుతము గా ఈ గ్రంథమును మఱల ముద్రణ మొనర్చి సాహితీలోకోపకార మొనర్చినందులకు ధన్యవాదములు.
ఈసందర్భమున వ్యాఖ్యాయుత చంద్రికాపరిణయము (2 ముద్రణలు), కేశవపంతులవారి పీఠికతో వెల్వడిన చంద్రికాపరిణ యము (మూలము), శ్రీ వెలుదండ సత్యనారాయణ, భట్టరు శ్రీనివాసాచార్యలువారి సిద్ధాంతవ్యాసములు – ఉపకరించినవి. ఆ యా రచయితలకు కృతజ్ఞతలు. ఆత్మీయులు, నిరంతరసాహితీపరిశోధకులు – శ్రీ కపిలవాయి లింగమూర్తిగారు అనేక విష యములు తెల్పి తోడ్పడిరి. వారి సహృదయతకు ప్రణామములు.
తడియార లేదు మాధవరాయచంద్రికాపరిణయాక్షరమషీపంకమందు,
చినుగ దింకను సదాశివశాస్త్రి నరసభూపాలీయటీకార్ద్ర పద్యవితతి,
మార్మ్రోత లిడుచుండె మల్లాదివారికి చెవిలోన వెల్లాల సింహగర్జ,
ముడి విప్పలేదింక మొన్న శ్రీపాదవా రందిన వేయిరూప్యముల మూట,
నేటికిని స్నేహలత పూచు నిరుపమాన
సుమము లాంధ్రికి తలలోన సొమ్ము లగుచు,
ప్రాజ్యగుణమైన జటప్రోలు రాజ్యమహిమ
వినక మారాష్ట్రమును కొల్తవేయ దగునె. (కేశవపంతులవారి రచన)
భాషాసేవకుడు
పాలెం. 509215 శ్రీరంగాచార్య
జటప్రోలు సంస్థానాధీశుల వంశవృక్షము
చెవ్విరెడ్డి(బేతాళనాయుడు)
|
|——————|——————–|—————–|—
1. మల్లానాయుడు *2.దామానాయుడు 3.ప్రసాదిత్యనాయుడు 4. రుద్రనాయుడు
-|————–|———–|————-|————–|——|———–|—
*వెన్నమనాయుడు సచ్చినాయుడు పెద్దన్న బ్రహ్మనాయుడు పర్నేసు సర్దేసు మల్లానేడు
—— |———————-| |
*ఎఱ్ఱదాచానేడు నల్లదా|చానేడు
| |——- |——–|
| మాధవనాయుడు దామానాయుడు
|——————-|———————–|
*సింగమనాయుడు వెన్నమనాయుడు యాచమనాయకుడు
|————————————-|
*అనపోతానాయుడు (రాచకొండ) మాదానేడు (దేవరకొండ)
|—————————–|———————–|
*సర్వజ్ఞ(పెద్ద)సింగమనాయుడు * ధర్మానాయుడు పెద్దవేదగిరినాయుడు
|——- |——–|
*తిమ్మనాయుడు
|——- –|———–|
ధర్మానాయుడు చిట్టిదాచానాయుడు
|——- |——–|
*అనపోతానాయుడు
|—————————–|—————–|
కుమారలింగమనాయుడు పెద్దమాదానాయుడు *చిన్నమాదానాయుడు
|——- –|———-|
*ఎఱ్ఱసూరానాయుడు నల్లసూరానాయుడు
|——- —-|———-|
*మాదానాయుడు(జటప్రోలు) యాచమనాయుడు(వెంకటగిరి)
*మాదానాయుడు(జటప్రోలు)
|—————|————–|————-|
*పెద్దినాయుడు మల్లినాయుడు నాగినేడు చిట్టినాగినేడు
|— |—-|
*మల్లభూపతి
|—– |—–|
*పెద్దమల్లభూపతి
|—– |——|
*ముమ్మడిమల్లానాయుడు
|——————–|———————-|
*రామరాయుడు కుమారమల్లానాయుడు *మాధవరాయడు (చంద్రికాపరిణయకర్త)
|—————|————–|
*నారాయణరావు తిరుమలరావు నరసింగరావు
|——- |——–|
*చిన్నమాధవరావు
|——- |——–|
*బారిగడుపులరావు
(ఇతనినుండి నిస్సంతులైనందున ఇక దత్తు వచ్చినవారు)
*1.జగన్నాథరావు, *2.వెంకటలక్ష్మారావు, *3.వెంకటజగన్నాథరావు, *4.వెంకటలక్ష్మారావు,
*5.రాణి వెంకటరత్నమ్మ, *6.రాజా వెంకటజగన్నాథరావు
|—————|————–|
◊ వెంకట ఆదిత్యలక్ష్మారావు ◊ వెంకటరత్న సుధాబాల (కూతురు)
|——- |——–|
◊ వెంకట అనిరుద్ధ జగన్నాథరావు
బారిగడుపులరావుగారి తర్వాత దత్తు వచ్చినవారిలో:
1. జగన్నాథరావు మల్లినేని సంతతిలోని పెద్దరామారాయని పుత్రుడు
2. వెంకటలక్ష్మారావు వరంగల్లు జిల్లా పాకాలప్రాంతం గురిజాలనుండి వచ్చినవారు
3. వెంకటజగన్నాథరావు వరంగల్లు జిల్లా పాకాలప్రాంతం గురిజాలనుండి వచ్చినవారు
4. వెంకటలక్ష్మారావు చంద్రికాపరిణయ ముద్రాపకులు. వీరి జన్మనామము నవనీతకృష్ణయాచేంద్రుడు.
(వెంకటగిరి కుమార యాచమనాయని కుమారులు).వీరి పుత్రిక సరస్వతీదేవి.
ఆమె పుత్రికఇందిరాదేవిని (6వ)రాజా వెంకటజగన్నాథరావుగారికి పరిణయము చేసిరి. కొల్లాపురములోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఇందిరాదేవి స్మారక నామము నుంచినారు.
5. రాణి వెంకటరత్నమ్మ పై వెంకటలక్ష్మారావుగారి సతీమణి
6. రాజా వెంకటజగన్నాథరావు బొబ్బిలినుండి దత్తు. వీరి జన్మనామము రాజగోపాలరావు. రాజా శ్వేతాచలపతి
వెంకట రంగారావుగారి పౌత్రులు. వీరికి ఇందిరాదేవితో పరిణయము.
*గుర్తుగల వారు రాజులు. అనపోతానాయనివఱకు రాచకొండ-దేవరకొండ రాజ్యాధిపతులు. వీరిది వెంకటగిరి
(వెలుగోడు) రాచకొండ-దేవరకొండ పరంపర.
ꣴ ◊గుర్తుగల వారు ప్రస్తుత మున్నవారు.